జీవుల పునరుత్పాదన.. జాతుల పరిరక్షణ ( బయాలజీ)
ఒక జీవి తన జీవితకాలంలో తన వంటి మరొక తరం జీవులను ఉత్పత్తి చేయడాన్ని ప్రత్యుత్పత్తి అంటారు. ఈ ప్రక్రియ తరతరాలు జాతిని కొనసాగించడానికి, జనాభా సంఖ్యను వృద్ధి చేయడానికి సహాయపడుతుంది. ప్రత్యుత్పత్తికి పట్టే సమయం జీవి నుంచి జీవికి మారుతూ ఉంటుంది. కొన్ని రకాల జీవుల్లో అనుకూల పరిస్థితులున్నప్పు డు ప్రత్యుత్పత్తి వేగంగా జరుగుతుంది.
ప్రత్యుత్పత్తి వ్యవస్థ
– జీవుల్లో ప్రత్యుత్పత్తి అలైంగిక, లైంగిక విధానాల ద్వారా జరుగుతుంది. కేవలం మొక్కల్లోనే జరిగే ప్రత్యుత్పత్తిని శాఖీయ ప్రత్యుత్పత్తి అంటారు.
అలైంగిక ప్రత్యుత్పత్తి
– సంయోగ బీజాల కలయిక లేకుండా కేవలం ఒక జనకజీవి ప్రమేయంతోనే జరిగే ప్రత్యు త్పత్తిని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు.
– అలైంగిక ప్రత్యుత్పత్తి విచ్చిత్తి, కోరకీభవనం, ముక్కలవడం, అనిషేక జననం, అనిషేక ఫలనం, పునరుత్పత్తి విధానాల్లో జరుగు తుంది.
విచ్ఛిత్తి: పారామీషియం, బాక్టీరియా వంటి ఏకకణ జీవులు రెండు లేదా అంతకంటే ఎక్కువ ముక్కలుగా విడిపోవడాన్ని విచ్ఛిత్తి అంటారు. రెండుగా విడిపోతే ద్విదా విచ్ఛిత్తి అని అంతకన్నా ఎక్కువ భాగాలుగా విడిపోతే బదా విచ్ఛిత్తి అంటారు. యూగ్లీనాలో ఆయత ద్విదా విచ్ఛిత్తి జరుగుతుంది.
-కోరకీభవనం (బడ్డింగ్): జనకజీవి శరీరం నుంచి అవే పోలికలతో ఉన్న నిర్మాణం బయటకు పెరుగుతుంది. అది జనక జీవి నుంచి వేరై స్వతంత్రంగా జీవిస్తుంది.
ఉదా: ఈస్ట్
-ముక్కలవడం (ఫ్రాగ్మెంటేషన్): కొన్ని జీవులు జనక జీవి శరీర ఖండాల నుంచి పెరుగుతాయి. శరీరంలో ఏ ఖండమైనా మొత్తం శరీరాన్ని ఏర్పరుస్తుంది.
ఉదా: బద్దె పురుగులు, లైకెన్లు, స్పైరోగైరా
అనిషేక జననం (పార్థినోజెనిసిస్): కొన్ని సందర్భాల్లో జీవుల సంయోగబీజాలు నేరుగా ఫలదీకరణం లేకుండా అభివృద్ధి చెందుతాయి. ఫలదీకరణం చెందని సంయోగబీజాలు నేరుగా ఏకస్థితిక జీవులుగా అభివృద్ధి చెందడాన్ని అనిషేక జననం అంటారు.
ఉదా: స్పైరోగైరా
అనిషేక ఫలనం (పార్థినోకార్పి): ఫలదీకరణం జరగకుండా అండాశయం నేరుగా ఫలంగా అభివృద్ధి చెందుతుంది. ఈవిధానాన్ని అనిషేక ఫలనం అంటారు.
ఉదా: అరటి, ద్రాక్ష, పుచ్చపండు
పునరుత్పత్తి (రీజనరేషన్): పూర్తిగా విభేదనం చెందిన అనేక జీవులకు తమ శరీర ఖండాల నుంచి నూతన జీవిని ఇచ్చే సామర్థ్యం ఉంటుంది. ఏదైనా కారణం వల్ల జీవి తెగిపోవడం లేదా ముక్కలవడం జరిగితే ఈ ఖండాల్లో ప్రతి ముక్క ఒక కొత్తజీవిగా పెరుగుతుంది.
ఉదా: ప్లనేరియా
లైంగిక ప్రత్యుత్పత్తి
– పురుష, స్త్రీ సంయోగబీజాల కలయిక వల్ల కొత్తజీవి ఏర్పడటాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. లైంగిక ప్రత్యుత్పత్తి ప్రధానంగా జంతువుల్లో, మొక్కల్లో జరుగుతుంది. ఫలదీకరణం తల్లి శరీరానికి బయట గానీ, అంతర్గతంగా గానీ జరుగుతుంది.
– సంయోగబీజాల కలయిక జీవి శరీరం బయట జరిగితే దాన్ని బాహ్య ఫలదీకరణం అంటారు.
ఉదా: వానపాము, చేపలు, కప్పలు
– సంయోగబీజాల కలయిక జీవి శరీరం లోపల జరిగితే దాన్ని అంతర ఫలదీకరణం అంటారు.
ఉదా: సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు
– క్షీరదాల్లో ముఖ్యంగా మానవుడిలో ప్రత్యేకమైన స్త్రీ, పురుష ప్రత్యుత్పత్తి అంగాలు అభివృద్ధి చెంది ఉంటాయి.
పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ
-పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆండ్రాలజీ అంటారు.
-మానవుడి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత ముష్కాలు, ఒక జత శుక్ర నాళికలు, ఒక జత ఎపిడిడైమిస్లు, ఒక జత శక్రవాహికలు, ఒక జత శుక్ర గ్రాహికలు, ఒక జత సలన నాళాలు, అనుబంధ గ్రంథులైన పౌరుష గ్రంథి, ఒక జత కౌపర్ గ్రంథులు, ఒక మూత్ర జననేంద్రియ నాళిక (ప్రసేకం) అనే భాగాలుంటాయి.
ముష్కాలు: ఇవి శరీర కుహరం వెలుపల సంచి వంటి ముష్క గోణుల్లో అమరి ఉంటాయి. ముష్కాల్లో టెస్టోస్టిరాన్ అనే పురుష లైంగిక హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. శుక్ర గోణుల్లో ఉండే ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రత కంటే 20 సెంటీగ్రేడ్ల నుంచి 2.50 సెంటీగ్రేడ్లు తక్కువగా ఉంటుంది. ముష్కాల నుంచి శుక్రకణాల ఉత్పత్తికి ఆవశ్యకం.
-శుక్రనాళికలు: శుక్రోత్పాదక నాళికలు శక్రనాళికలోకి తెరుచుకుంటాయి. శుక్రనాళి కలు శుక్రక ణాలను ఎపిడిడైమిస్లోకి తీసుకె ళతాయి.
-ఎపిడిడైమిస్: ఇది సన్నగా పొడవుగా ఉన్న నాళికలు చుట్టలు చుట్టుకుని ఏర్పడిన నిర్మాణం. దీనిలో శుక్రకణాలు నిల్వ ఉంటాయి.
-శుక్రవాహికలు: ప్రతి ఎపిడిడైమిస్ నుంచి శుక్రవాహిక అనే పొడవైన నాళం బయలు దేరుతుంది. ఇది మూత్ర నాళికను చుట్టి వస్తుంది.
-శుక్రగ్రాహికలు: ఒక్కో శుక్రగ్రాహిక శుక్రవాహికలోకి చిన్ననాళం ద్వారా తెరుచుకుంటుంది. దీనిలో శక్రం అనే ద్రవం ఉత్పత్తి అవుతుంది. సెర్టోలి కణాలు శక్రకణాలకు పోషక పదార్థాలను అందజేస్తాయి.
-సలన నాళం: ప్రతి శుక్రగ్రాహిక ద్వారా ఒక నాళం బయలుదేరి శుక్రవాహికతో కలిసి సలన నాళం ఏర్పడుతుంది. రెండు సలన నాళాలు చివరగా ప్రసేకంలోకి తెరుచుకుం టాయి.
– పౌరుష గ్రంథి: శుక్రకోశ పీఠభాగంలో ఉండే గ్రంథి. ఇది సిట్రిక్ ఆమ్లాన్ని స్రవిస్తుంది. ఈ గ్రంథి శుక్రంలో ఉండే పౌరుష స్రావకంను స్రవిస్తుంది. ఈ స్రావకం శుక్రకణాలను ఉత్తేజపరచడంలోనూ, పోషణలో సహాయపడుతుంది.
– కౌపర్ గ్రంథులు: పౌరుష గ్రంథికి పరభాగంలో ఒక జత కౌపర్ గ్రంథులను మరో పేరుతో బల్పోయురెథ్రల్ గ్రంథులు అని కూడా అంటారు. ఈ గ్రంథుల స్రావకం ప్రసేకపు గోడలలోని ఆమ్లత్వాన్ని తటస్థీకరించడానికి, శుక్రకణాలు తేలికగా జారడానికి తోడ్పడుతాయి.
శుక్ర కణాల ప్రయాణ మార్గం
శుక్రోత్పాదక నాళికలు
|
శుక్ర నాళికలు
|
ఎపిడిడైమిస్
|
శుక్రవాహికలు
|
శుక్రగ్రాహికలు
|
సలన నాళం
|
ప్రసేకం
శుక్రకణం నిర్మాణం
-మానవ శుక్రకణం తల, మెడ, తోక అనే భాగాలుగా విభజితమై ఉంటుంది.
-తల భాగంలో కేంద్రకం, చివరన మొనదేలిన నిర్మాణం ఉంటుంది. దీన్ని ఏక్రోసోమ్ అంటారు.
– ఇది శుక్రకణం అండంలోకి చొచ్చు కొని పోవడానికి తోడ్పడు తుంది.
– తల, తోకను కలుపుతూ మెడ ఉంటుంది.
-మెడ భాగంలో ఉండే మైటో కాండ్రియాలు శుక్రకణం కదలడానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. తోక శుక్రకణం ముందుకు కదలడానికి తోడ్పడుతుంది.
– శుక్రగ్రాహికలు ఉత్పత్తి చేసే ద్రవం, పౌరుష, కౌపర్ గ్రంథి స్రావాలు కలిసి సెమినల్ ప్లాస్మాను ఏర్పరుస్తాయి. సెమినల్ ప్లాస్మా, శుక్రకణాలను కలిపి శుక్రం అంటారు.
– పురుష జీవి శరీరం నుంచి శుక్రాన్ని బయటకు పంపడాన్ని సలనం అంటారు.
– సాధారణంగా ఫలదీకరణానికి శుక్రకణాల్లో 60 శాతం సరైన ఆకారం, పరిమాణంలో ఉండాలి. కనీసం 40 శాతం వేగంగా చలించేలా ఉండాలి.
-శుక్రోత్పాదన నాళికలోని లీడిగ్ కణాలు టెస్టోస్టిరాన్ అనే పురుష లైంగిక హార్మోన్ను విడుదల చేస్తాయి.
-ఇది పురుషుల్లో ద్వితీయ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందడానికి తోడ్పడుతుంది.
– పురుషుల్లో 13-14 సంవత్సరాల వయస్సు లో శుక్రోత్పత్తి ప్రారంభమై వృద్ధాప్యం వరకు కొనసాగుతుంది.
– వయస్సు మళ్లే కొద్దీ శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోతుంది.
– శుక్రకణాలు 24-72 గంటలు సజీవంగా ఉంటాయి.
ప్రాక్టీస్ బిట్స్
1. శుక్రకణాలు ప్రయాణించే మార్గం
1)శుక్రనాళికలు-శుక్రవాహికలు- శుక్రగ్రాహికలు- ఎపిడిడైమిస్-
2) శుక్రోత్పాదక నాళికలు-శుక్రనాళికలు-ఎపిడిడైమిస్-శుక్రవాహికలు
3) శుక్రవాహికలు-శుక్రోత్పాదక నాళికలు – ఎపడిడైమిస్-శుక్రనాళికలు
4) శుక్రోత్పాదక నాళికలు- శుక్రగ్రాహి కలు- సలననాళం- ప్రసేకం
2. కింది వాటిలో అసత్య వాక్యాలను గుర్తించండి.
ఎ. శుక్రకణాల మెడ భాగంలో మైటో కాండ్రియాలు ఉంటాయి
బి. తల చివరి భాగంలో ఏక్రోసోమ్ ఉంటుంది
సి. హయలురోనిడేజ్ అనే హార్మోన్ను విడుదల చేస్తుంది
డి. శుక్రకణాలు 24-72 గంటలు సజీవంగా ఉంటాయి
1) బి, సి వాక్యాలు అసత్యం
2) సి మాత్రమే అసత్యం
3) ఎ, డి వాక్యాలు అసత్యం
4) డి మాత్రమే అసత్యం
3. కింది వాటిని జతపరచండి.
ఎ బి
1. ఈస్ట్రోజన్ ఎ. స్త్రీలలో ద్వితీయ లైంగిక లక్షణాలు
2. ప్రొజెస్టిరాన్ బి. క్షీర గ్రంథుల నుంచి పాల ఉత్పత్తి
3. రిలాక్సిన్ సి. శిశు జననానికి తోడ్పడుతుంది
1) 1-సి, 2-బి, 3-ఎ 2) 1-బి, 2-ఎ, 3-సి
3) 1-ఎ, 2-బి, 3-సి 4) 1-బి, 2-సి, 3-ఎ
4. పిండాన్ని ఆవరించి ఉండే పొరలు వరుసగా…..
1) ఉల్బం-ఆలిందం-పరాయువు-సొనసంచి
2) పరాయువు-ఆలిందం-ఉల్బం- సొనసంచి
3) ఉల్బం-పరాయువు-సొనసంచి-ఆలిందం
4) పరాయువు-ఉల్బం-ఆలిందం-సొనసంచి
5. కోరకీభవనం అనే ప్రక్రియ ఏ జీవిలో జరుగుతుంది?
1) స్పైరోగైరా 2) ప్లనేరియా
3) ఈస్ట్ 4) లైకెన్
6. ఏటా ఏ రోజున ‘మెనుస్ట్రువల్ హైజీన్ డే’ను జరుపుకొంటారు?
1) సెప్టెంబర్ 10 2) మే 28
3) జూలై 1 4) నవంబర్ 19
7. సెమినల్ ప్లాస్మా, శుక్రకణాలు కలిసి ఏర్పరిచే ద్రవం ఏది?
1) ఉమ్మనీరు 2) శుక్రం
3) టెస్టోస్టిరాన్ 4) మురుపాలు
8. క్షీరదాల్లో ఫలదీకరణ ప్రక్రియ ఎక్కడ జరుగుతుంది?
1) స్త్రీబీజ కోశాలు 2) గర్భాశయం
3) ఫాలోపియన్ నాళం 4) ఎపిడిడైమిస్
9. కింది వాటిలో బాహ్య ఫలదీకరణం జరిపే జీవులు?
1) సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు
2) వానపాము, బొద్దింక, కప్ప
3) బొద్దింక, చేప, కప్ప
4) వానపాము, చేప, కప్ప
10. ఏనుగులో గర్భావధి కాలం ఎంత?
1) 270-280 రోజులు
2) 105-115 రోజులు
3) 30-40 రోజులు
4) 600 రోజులు
సమాధానాలు
1. 2 2. 2 3. 3 4. 4 5. 3 6. 2 7. 2 8. 3 9. 4 10. 4
ఏవీ సుధాకర్
స్కూల్ అసిస్టెంట్
జడ్పీహెచ్ఎస్
లింగంపల్లి
రంగారెడ్డి జిల్లా
9000674747
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు