సామాజిక, సాంస్కృతిక చైతన్యం ( తెలంగాణ హిస్టరీ)
-దాదాపు 200 సంవత్సరాలకు పైగా తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన అసఫ్జాహీలు దేశంలో ప్రముఖ సంస్థానాధీశులుగా పేరుపొందారు. చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పరిపాలనా కాలం నాటికి (1948) హైదరాబాద్ రాజ్యం దాదాపు 82 వేల చదరపు మైళ్ల విస్తీర్ణంతో, 18.2 మిలియన్ల జనాభా కలిగి ఉంది. అందులో తెలంగాణ ప్రాంత విస్తీర్ణం 49 వేల చదరపు మైళ్లు, జనాభా 10 మిలియన్లు.
– పరిపాలనా పరంగా తెలంగాణను రెండు సుబాలుగా, ఎనిమిది జిల్లాలుగా విభజించారు. హైదరాబాద్ రాజ్యంలో తెలుగు మాట్లాడే ప్రజలు దాదాపు 50 శాతం ఉన్నారు. తెలుగుతోపాటు కన్నడం, మరాఠీ, ఉర్దూ, గుజరాతి, తమిళం, పంజాబీ తదితర భాషలు మాట్లాడేవారు కూడా ఉన్నారు. మతపరంగా హైదరాబాద్ రాజ్యంలో హిందువులు, ముస్లింలు, కైస్తవులు, సిక్కులు, జైనులు మొదలైనవారు ఉన్నారు. ఒక రకంగా హైదరాబాద్ రాజ్యాన్ని బ మతాల, జాతుల, భాషాసంస్కృతుల సమ్మేళనమని చెప్పవచ్చు. ఆర్థికపరంగా, వ్యవసాయ, భూసంబంధాల్లో జమీందారీ, జాగీర్దారీ భూస్వామ్య వ్యవస్థలు ఉన్నాయి.
– నిజాం పరిపాలనా కాలంలో ప్రధానంగా మూడు విధాలైన రెవెన్యూ వ్యవస్థలు అమల్లో ఉన్నాయి. అవి.. 1) దివానీ లేదా ఖల్సా 2) జాగీర్దారీ వ్యవస్థ 3) సర్ఫేఖాస్. దివానీ వ్యవస్థ ప్రభుత్వ అజమాయిషీలో ఉండగా సర్ఫేఖాస్ ప్రాంతం నిజాం సొంత ఆస్తిగా ఉండేది. వీటితోపాటు జాగీర్దార్లు, పైగాలు, సంస్థానాధీశులు కూడా భూమిపై ఆధిపత్యాన్ని కలిగి ఉన్నారు. తెలంగాణ గ్రామాల్లోని సామాజిక సంబంధాల్లో భూస్వామ్య వ్యవస్థ కీలకమైన పాత్ర కలిగి ఉంది. అదేవిధంగా వెట్టి చాకిరీ విధానం, ఆధిపత్య కులాల దోపిడీ, తెలంగాణ సామాజిక సంబంధాల్ని ప్రభావితం చేసింది.
– తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో భూస్వాములు వెట్టి చాకిరీ, బగేలా, బేగారి లాంటి నిర్బంధ శ్రమ విధానాన్ని కొనసాగించారు. రైతులు, కౌలుదార్లకు రక్షణ లేదు. భూస్వాముల దోపిడీ, అధిక శిస్తులు, అక్రమ పన్నులు వారి జీవన పరిస్థితుల్ని దుర్భరం చేశాయి. ఆర్థికపరంగా చూస్తే నిజాం రాజ్యంలో వ్యవసాయ రంగం వెనుకబడి ఉంది. అంతేకాకుండా పారిశ్రామికీకరణ, పట్టణీకరణ చెప్పుకోదగ్గ ప్రగతిని సాధించలేదు. విద్యాపరంగా చూసినప్పటికీ హైదరాబాద్ రాజ్యంలో 20వ శతాబ్దం మధ్య భాగం నాటికి అక్షరాస్యత 6 శాతానికి మించలేదు.
– భాషాపరంగా ఉర్దూయేతర జనాభా దాదాపు 80 శాతం ఉన్నప్పటికీ రాజభాష, బోధనా మాధ్యమంగా ఉర్దూను ప్రవేశపెట్టారు. తత్ఫలితంగా విద్య, ఉద్యోగ రంగాల్లో ఉర్దూయేతర సమూహాల ప్రాతినిధ్యం తక్కువగా ఉంది. అందువల్ల 19వ శతాబ్దపు చివరి భాగంలో భాష, సాంస్కృతిక చైతన్యం నూతన ఒరవడిని సంతరించుకుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో తెలుగు మాట్లాడే ప్రజలు తమ భాషాసంస్కృతి, మత సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను పరిరక్షించుకునేందుకు కృషిచేశారు. అంతేకాకుండా బ్రిటిష్ ఇండియాలో చెలరేగిన సాంస్కృతిక, జాతీయ, రాజకీయ ఉద్యమాలు విద్యావంతులైన మేధావి వర్గంపై ప్రభావాన్ని చూపాయి.
– బెంగాల్, ఉత్తర, దక్షిణ భారతదేశంలో ప్రారంభమైన సంఘ సంస్కరణలు, పాశ్చాత్య విద్యావిజ్ఞానాలు కూడా తెలుగు ప్రజలపై ప్రభావాన్ని చూపించాయి. తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్‌తో సహా అనేక జిల్లా కేంద్రాల్లో, పట్టణాల్లో భాష, సాంస్కృతిక చైతన్యం మొదలయ్యింది. ప్రభుత్వ విద్యాలయాల్లో ఉర్దూ బోధనా మాధ్యమంగా ఉండటంవల్ల తెలుగు భాష, సంస్కృతి నిరాదరణకు గురయ్యింది. అంతేకాకుండా తెలుగు భాషా మాధ్యమంగా పాఠశాలల స్థాపన జరగాలన్న ప్రజల అభ్యర్థనలు కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇంగ్లిష్ భాషా మాధ్యమం కలిగిన ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం కొంత ఆర్థిక సాయాన్ని అందించినప్పటికీ తెలుగు మీడియం పాఠశాలలు నిరాదరణకు గురయ్యాయి.
– పట్టణ ప్రాంతాల్లో వృత్తి విద్యాలయాలు, వ్యాయామశాలలపై కూడా నియంత్రణ పెట్టడం జరిగింది. ఉదాహరణకు హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తున్న అఖాడాలపై నిర్బంధం విధించారు. జిల్లా కలెక్టరేట్ లేక పోలీస్ కమిషనర్ అనుమతి లేకుండా వ్యాయామశాలలు నిర్వహించడాన్ని నిషేధించారు. ఈ చర్యను అనేక సంఘాలు, సంస్థలు నిరసించాయి. తెలంగాణ గ్రామాల్లో కొన్ని (ప్రైవేట్) స్కూళ్లలో తెలుగు మాధ్యమంలో బోధన జరిగినప్పటికీ వాటికి గుర్తింపులేదు. అంతేకాకుండా తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రభుత్వ గుర్తింపు గాని, ఉద్యోగావకాశాలు గాని లేవు. అదేవిధంగా ఉద్యోగ రంగాల్లో ఉర్దూ భాషలో ప్రావీణ్యం కలిగిన వారికి ప్రథమ స్థానం కల్పించారు. విద్యా ఉపాధి రంగాల్లో ఉన్నటువంటి విచక్షణ తెలుగు ప్రజల్లో నిరాశను, అసంతృప్తిని కలిగించింది. అందుకోసం మత, సాంస్కృతిక, భాషా హక్కుల పరిరక్షణ కోసం పలు ఉద్యమాలు చెలరేగాయి.
– మెజారిటీ ప్రజలైన హిందువుల సంస్కృతి, ఆచార సంప్రదాయాలను పరిరక్షించుకునేందుకు ఆర్యసమాజ్‌ను ప్రారంభించారు. 1875లో స్వామి దయానంద సరస్వతి బొంబాయిలో స్థాపించిన ఆర్యసమాజ్ దేశం నలుమూలలా వ్యాపించింది. దీని శాఖను 1892లో హైదరాబాద్‌లో స్వామి నిత్యానంద సరస్వతి ప్రారంభించారు. మొదటగా దీనికి కంఠప్రసాద్, లక్ష్మణ్దేశ్జీ అధ్యక్ష, కార్యదర్శులుగా వ్యవహరించారు. ఆ తర్వాత హైదరాబాద్ హైకోర్టు ప్రముఖ న్యాయవాది పండిత్ కేశవరావు కొరాట్కర్ అధ్యక్షుడిగా 1932 వరకు వ్యవహరించారు. ఆయన మరణానంతరం ఆయన కుమారుడు వినాయక్‌రావు విద్యాలంకార్ అధ్యక్షుడయ్యారు. ఆర్యసమాజ్ మత, సాంఘిక, సాంస్కృతిక ఉద్యమాల్ని చేపట్టింది. దీనిలో కేశవ్‌రావు కొరాట్కర్, వామనరావు నాయక్, పండిట్ వినాయక్‌రావు విద్యాలంకార్, పండిట్ నరేందర్‌జీ ముఖ్యపాత్ర పోషించారు.
– ఆర్యసమాజ్ ప్రధానంగా సాంస్కృతిక, భాష, సాహిత్య రంగాల్లో ఎనలేని కృషిచేసింది. ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో మహారాష్ట్రలో బాలగంగాధర్ తిలక్ ప్రారంభించిన గణేష్ ఉత్సవాలను 1895లో హైదరాబాద్‌లో నిర్వహించారు. ఆ తర్వాత అనేక సాంస్కృతిక, మత, ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని ఆర్యసమాజ్ చేపట్టింది. అంతేకాకుండా ఆర్యసమాజ్ హైదరాబాద్‌లో స్వదేశీ ఉద్యమాన్ని కూడా నడిపించింది. మత మార్పిడులను నిలిపివేసి హైందవ మత సంప్రదాయాలను పరిరక్షించడం కోసం శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టింది. పట్టణ, జిల్లా ప్రాంతాల్లో ఆర్యసమాజ్ శాఖలు ఏర్పర్చి క్రమంగా విస్తరించాయి. నిజాం ప్రభుత్వం తరచుగా ఆర్యసమాజ్ కార్యకలాపాలపై ఆంక్షలు విధించింది. శుద్ధి కార్యక్రమం నిర్వహించినందుకు ఆర్యసమాజీయుడైన పండిట్ చంద్రపాత్ కార్యక్రమాల్ని ముస్లిం మత సంస్థలు కూడా వ్యతిరేకించాయి. శ్రద్ధానంద్ అనే ఆర్యసమాజీయుడిని హత్య కూడా చేశారు.
– శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టినందుకు నిజాం ప్రభుత్వం బాలకృష్ణ శర్మ, నిత్యానంద స్వామిలను రాజ్య బహిష్కరణ చేసింది. ఆ తర్వాత నిజాం ప్రభుత్వం ఆర్యసమాజ్ చేపట్టినటువంటి హవన్కుండ్ హోమాల్ని, ఓం కలిగిన ఆర్యసమాజ్ పతాకాల్ని, ఆర్యసమాజ్ స్థాపించిన పాఠశాలల్ని, సాహిత్య కార్యక్రమాల్ని నిషేధించింది. అంతేకాకుండా ఆర్యసమాజ్ పత్రిక సత్యార్థ ప్రకాశికను నిలువరించింది. ఆర్యసమాజ్ కార్యక్రమాలపట్ల ముస్లిం మత సంస్థలు తమ వ్యతిరేకతను అనేక రూపాలుగా ప్రదర్శించి వారిపై భౌతిక దాడులు చేసి, హత్యలు కూడా చేశాయి. హైదరాబాద్‌లో ఆర్య ప్రతినిధి సభ కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.
– హిందూ, ముస్లింల మధ్య మత వైషమ్యాలు క్రమంగా పెరిగి హైదరాబాద్ పాతబస్తీలోని ధూల్‌పేట్‌లో 1938లో మత ఘర్షణలు చెలరేగాయి. ఆ తర్వాత 1930 దశకంలోని రాజకీయ ఉద్యమ కాలంలో ఆర్యసమాజ్ ముఖ్యపాత్రను పోషించింది. ఈ సందర్భంగా ఆర్యసమాజ్ నాయకుడైన పండిట్ నరేంద్రజీని ప్రభుత్వం అరెస్ట్ చేసి మన్ననూర్ జైలులో నిర్బంధించింది. మన్ననూర్ మహబూబ్‌నగర్ జిల్లాలోని నల్లమల అడవుల్లో అమ్రాబాద్ సమీపంలో ఉంది.
-ఇదేకాలంలో ఆర్యసమాజ్ చేపట్టిన సత్యాగ్రహ ఉద్యమంలో పలువురు నాయకులు కీలక పాత్ర పోషించారు. ఈ సత్యాగ్రహ సందర్భంలోనే అనేకమంది ఆర్యసమాజ్ సభ్యుల్ని అరెస్ట్ చేసి కారాగారాల్లో నిర్బంధించారు. ఆర్యసమాజ్ సత్యాగ్రాహి అయిన రామచందర్‌రావు వందేమాతరం నినాదాలిస్తూ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. పోలీసు లాఠీదెబ్బలు లెక్కచేయకుండా వందేమాతర నినాదాన్ని ఇస్తుండటంవల్లనే ఆయన వందేమాతరం రామచందర్రావుగా ప్రసిద్ధికెక్కారు. వందేమాతరం ఉద్యమం తర్వాత ఆర్యసమాజ్ అనేక ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టింది. పండిట్ కేశవరావు కొరాట్కర్ జ్ఞాపకార్థం హైదరాబాద్‌లోని నారాయణగూడలో కేశవ మెమోరియల్ హైస్కూల్‌ను స్థాపించారు.
– 19వ శతాబ్దం చివరి దశకాల్లో హైదరాబాద్ నగరంలో దివ్యజ్ఞాన సమాజం, బ్రహ్మ సమాజం అనేక సాంస్కృతిక సభలు, సమావేశాలను నిర్వహించాయి. ముఖ్యంగా విద్యావంతులైన మేధావులు ఈ ఉద్యమాల్లో పాల్గొని సాంస్కృతిక వికాసానికి తోడ్పడ్డారు. మతపరమైన సాంఘిక దురాచారాలను వ్యతిరేకించి నూతన చైతన్యాన్ని పెంపొందించారు. దివ్యజ్ఞాన సమాజాన్ని 1882లో రామస్వామి అయ్యర్ చాదర్‌ఘాట్‌లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1906లో అనీబిసెంట్ ఈ సమాజం కార్యక్రమాల్ని వ్యాప్తిచేశారు. దివ్యజ్ఞాన సమాజం ఆధ్వర్యంలో 1917లో ఆంధ్రమాత పత్రిక ప్రారంభమయ్యింది. ఆధ్యాత్మిక అంశాలతోపాటు ప్రభుత్వ విధానాలను ఈ పత్రిక విమర్శనాత్మకంగా విశ్లేషించింది.
– 1828లో రాజారామ్మోహన్ రాయ్ స్థాపించిన బ్రహ్మసమాజ్ ప్రభావం కోస్తాంధ్ర ప్రాంతంలో వ్యాపించింది. పిఠాపురం రాజా రఘుపతి వెంకటరత్నం లాంటి వారు బ్రహ్మసమాజం కార్యక్రమాల్ని నిర్వహించారు. ఆ తర్వాత మహబూబియా కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేసిన కాలంలో (1899-1904) రఘుపతి వెంకటరత్నం సంస్కరణ ఉద్యమాల్లో పాలుపంచుకున్నారు. బ్రహ్మసమాజం మొదటి సమావేశం 1914లో రెసిడెన్సీ బజార్లో జరిగింది. బ్రహ్మసమాజ కార్యక్రమాల్ని హైదరాబాద్‌లో వ్యాప్తి చేయడానికి అఘోరనాథ ఛటోపాధ్యాయ కుటుంబం విశేష కృషిచేసింది. ఈ సమాజం మొదటి అధ్యక్షునిగా నారాయణ గోవింద వెల్లంకర్ ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో పలువురు ప్రముఖులు దానిలో సభ్యులయ్యారు. హైదరాబాద్ రాజ్యంలో ప్రముఖ దళిత నాయకుడు భాగ్యరెడ్డి వర్మ బ్రహ్మసమాజం కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించారు. రాయ్ బాలముకుంద్ ఆధ్వర్యంలో 1913లో స్థాపించిన హ్యూమనిటేరియన్ లీగ్, 1915లో వామనరావు నాయక్ కొరాట్కర్ స్థాపించిన సోషల్ సర్వీస్ లీగ్ సంఘ స్కరణ ఉద్యమాల్ని ప్రోత్సహించాయి.
గ్రంథాలయోద్యమం
– 19వ శతాబ్దం మధ్య భాగాల్లో మొదటి సాలార్జంగ్ ప్రవేశపెట్టిన సంస్కరణల ఫలితంగా ఆధునిక విద్యా ఉపాధి రంగాలకు చెందిన మేధావులు జాతీయ చైతన్యాన్ని పెంపొందించడానికి కృషిచేశారు. తత్ఫలితంగా అనేక సాంస్కృతిక, సామాజిక, సాహిత్య రాజకీయ ఉద్యమాలు చెలరేగాయి. హైదరాబాద్ రాజ్యంలోని మొట్టమొదటి గ్రంథాలయాన్ని 1872లో సోమసుందర్ మొదలియార్ సికింద్రాబాద్‌లో స్థాపించారు. అదే ఏడాది ముదిగొండ శంకరరాధ్యులు శంకరానంద గ్రంథాలయాన్ని సికింద్రాబాద్‌లోని కవాడిగూడలో ఏర్పాటుచేశారు. ఆ తర్వాత 1879లో అఘోరనాథ్ ఛటోపాధ్యాయ యంగ్‌మెన్ ఇంప్రూవ్మెంట్ సొసైటీని స్థాపించి అందులో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1896లో బొల్లారం ఆల్బర్ట్ రీడింగ్ రూంను స్థాపించారు.
హైదరాబాద్ రాష్ట్రంలో ప్రారంభమైన గ్రంథాలయ, సాహిత్య ఉద్యమాలకు ఒక విశిష్ట స్థానం ఉంది. అదేమంటే ఈ ఉద్యమాలు తెలుగుజాతి అస్తిత్వాన్ని, గుర్తింపును, ఆత్మగౌరవాన్ని పెంపొందించి విశాల ప్రాతిపదికపై, నిజాం నిరంకుశ, భూస్వామ్య వ్యతిరేక ఉద్యమాలకు పునాదివేశాయి. ముఖ్యంగా గ్రంథాలయ ఉద్యమం ఒక విశిష్ట సామాజిక, సాహిత్య రాజకీయ చైతన్యానికి, ఉద్యమ స్ఫూర్తికి నాంది పలికింది. గ్రంథాలయ ఉద్యమ సాధనలో ఉన్నత వర్గాలు/కులాలకు చెందిన ప్రజాస్వామ్య, జాతీయ భావాలు కలిగిన ఉదారవాదులు కీలకపాత్ర నిర్వహించారు. గ్రంథాలయ ఉద్యమం తెలుగు ప్రజల్లో మాతృ భాషాభిమానం, శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాన్ని పెంపొందించడానికి ఎంతగానో తోడ్పడింది. అనేక ఇబ్బందులను ఎదుర్కొని, ప్రభుత్వ ఆంక్షలు, నిఘా నిర్బంధాల్ని తట్టుకొని గ్రంథాలయ ఉద్యమం కొనసాగింది.
– బ్రిటిష్ ఆంధ్రలో వందేమాతరం ఉద్యమంలో కీలకపాత్ర వహించిన గాడిచర్ల హరిసర్వోత్తమరావు, అయ్యదేవర కాళేశ్వరరావు, కొమరాజు లక్ష్మణరావు లాంటివారు తెలంగాణ ప్రజలతో సాంస్కృతిక సంబంధాల్ని పెంపొందించడానికి కృషిచేశారు. అదేవిధంగా మునగాల జమీందారు నాయిని వెంకట రంగారావు, రావిచెట్టు రంగారావుల ప్రోత్సాహంతో కొమరాజు లక్ష్మణరావు మొట్టమొదటి తెలుగు గ్రంథాలయాన్ని హైదరాబాద్‌లో 1901లో స్థాపించారు. దాని పేరు శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయం. ఆ తర్వాత 1904లో శ్రీరాజరాజ నరేంద్ర ఆంధ్రభాషా నిలయాన్ని హన్మకొండలో, 1905లో ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయం సికింద్రాబాద్‌లో ఏర్పడ్డాయి. అదేవిధంగా శంషాబాద్‌లో బాలభారతి నిలయం ఆంధ్ర భాషాభివృద్ధి సంఘాన్ని స్థాపించారు.
అడపా సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు