ఖనిజాల కాణాచి అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? (Groups Special)
మాల్వా పీఠభూమి (Malva Plateau)
- మధ్య ఉన్నత భూముల్లో పెద్దది, ప్రధానంగా మధ్యప్రదేశ్‌లో విస్తరించి ఉంది. దీని వైశాల్యం 1.50 లక్షల చ.కి.మీ.
- దీనికి పశ్చిమాన ఆరావళి పర్వతాలు, తూర్పున బుందేల్‌ఖండ్ ఉన్నతి, దక్షిణాన వింధ్య పర్వతాల మధ్య విస్తరించిన పీఠభూమి మాల్వా పీఠభూమి. ఇది పర్వత పాద పీఠభూమి (Piedmont Plateau)కి ఉదాహరణ.
- ఇది ఇసుకరాయి, సున్నపురాయి, క్వార్ట్, మార్బుల్ శిలలతో ఏర్పడి ఉంది.
- చంబల్, సింధూ, బెట్వా, కెన్, మహి నదుల పరీవాహక ప్రాంతాలు ఉన్నాయి. ఒక్క మహి నది మాత్రం పశ్చిమంగా ప్రవహిస్తూ అరేబియా సముద్రంలో కలుస్తుండగా, మిగిలిన నదులు ఉత్తరంగా ప్రవహిస్తూ యమునకు ఉపనదులుగా ఉన్నాయి.
- చంబల్ నది పరీవాహక ప్రాంతంలో అత్యంత తీవ్ర అవనాళిక క్రమక్షయం (Gully Erosion) జరిగి కందర భూములు (Ravine Lands) ఏర్పడ్డాయి. ఈ క్రమక్షయ ప్రాంతాన్ని ఉత్కాట భూమి (Bad Lands Topography) అంటారు. గ్వాలియర్, బిండ్, మెరీనా కందర భూములు దీనికి ఉదాహరణ.
- మాల్వా పీఠభూమి పశ్చిమ, నైరుతి భాగాల్లో మేవాడ్ పీఠభూమి, కోట పీఠభూమి, రణథంబోర్ పీఠభూమి, బుండి కొండలు ఉన్నాయి. ఇవి రాజస్థాన్ రాష్ట్రంలో ఆరావళి పర్వతాలకు తూర్పున ఉన్నాయి.
రణథంబోర్ నేషనల్ పార్క్, శివపురి వన్యమృగ సంరక్షణ కేంద్రం ఈ మాల్వా పీఠభూమిలోనే ఉన్నాయి. - ఇది బుందేల్‌ఖండ్, వింధ్య పర్వతాలతో కూడిన భాగం.
దక్షిణ మధ్య ఉన్నత భూములు (South Central High Lands)
ఎ) బుందేల్‌ఖండ్:
- యమునా నది దక్షిణాన, మాల్వా పీఠభూమికి తూర్పువైపునగల మెట్ట ప్రాంతం. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో విస్తరించి ఉన్న సాంస్కృతిక, భౌగోళిక ప్రాంతం, దీని విస్తీర్ణం 55 వేల చ.కి.మీ. కలిగి ఉంది.
- ఈ పీఠభూమి అగ్నిశిలలైన గ్రానైట్, రూపాంతర శిలలైన నీస్ శిలలతో కూడుకొని ఉంది.
చరిత్ర ప్రసిద్ధి చెందిన ఖజురహో, ఝాన్సీ ఈ ప్రాంతాల్లోనే ఉన్నాయి. సిద్ధ బాబా కొండలు ఇక్కడ ఎత్తయినవి.
బి) వింధ్య పర్వతాలు (The Vindhya Range)
- వింధ్య అంటే వేటగాడు (Hunter or Obstructor).
- గుజరాత్ నుంచి వారణాసి వరకు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్ వరకు 1100 కి.మీ. పొడవున ఏర్పడిన విచ్ఛిన్న శ్రేణులు, ఖండ పర్వతాలు. ఇవి గుజరాత్‌లోని జోబత్ నుంచి బీహార్‌లోని ససారం వరకు ఉన్నాయి.
- సముద్ర మట్టం నుంచి వీటి సగటు ఎత్తు 300 నుంచి 600 మీ.
- మాల్వా పీఠభూమి దక్షిణ అంచు వెంట నర్మద, సోన్ నదుల పగులు లోయ వెంబడి విస్తరించి ఉన్నాయి.
- చరిత్ర ప్రసిద్ధి చెందిన ‘భీంబెట్కా గుహలు’ వింధ్యలోనే ఉన్నాయి. ఎక్కువ భాగం మధ్యప్రదేశ్‌లో ఉన్నాయి.
- వింధ్య పర్వతాల్లో ఎత్తయిన శిఖరం పావ్‌గఢ్ శిఖరం (829 మీ.). ఇది గుజరాత్లో ఉంది. రెండో ఎత్తయిన శిఖరం సద్భావన లేదా కలుమూరు లేదా కాలుంబే (Good will Peak 752 మీ.). పన్నా కొండల్లో మధ్యప్రదేశ్‌లో ఇది ఉంది.
- పశ్చిమ భాగాన వీటిని సాత్మల కొండలని, మధ్యభాగంలో సాంచి కొండలని, పన్నా కొండలని, తూర్పు చివర సోన్ నది లోయ వెంట విస్తరించిన వాటిని కైమూర్ శ్రేణులని పిలుస్తారు.
- మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్, బీహార్ వరకు ఈ కైమూర్ శ్రేణులు ఉన్నాయి. వీటి తూర్పు అంచును బీహార్‌లో కైమూర్ పీఠభూమి అంటారు.
- ఉత్తర, దక్షిణ భారతదేశానికి జల విభాజకం (Water Divide)గా వింధ్య పర్వతాలు ఉన్నాయి. అంతేగాక వింధ్య పర్వతాలు ఉత్తర, దక్షిణ భారతదేశాలుగా విభజిస్తున్నాయి.
- వజ్రాలు లభించే పన్నా కొండలు, బాంధవ్‌ఘర్ నేషనల్ పార్క్, పన్నా నేషనల్ పార్క్ కూడా ఇక్కడ ఉంది.
- వింధ్య పర్వతాల దిక్షణాన నర్మదా నది ప్రవహిస్తుంది.
- సోన్ నది వెంట పశ్చిమంగా ఉన్న పర్వతాలను కైమూరు పర్వతాలు, తూర్పు అంచు గుండా ఉన్న పర్వతాలను సోన్‌పర్ కొండలు అంటారు.
- చంబల్, చంబల్ ఉపనదులైన కాళిసింధ్, పర్బతి నదులు, యమున ఉపనదులు అయిన బెట్వా, కెన్, సింధ్ వింధ్య శ్రేణుల్లో జన్మిస్తున్నాయి.
- దీనినే చోటా నాగ్‌పూర్ పీఠభూమి అని కూడా అంటారు. ఇది అత్యధికంగా జార్ఖండ్ రాష్ట్రంలో విస్తరించగా.. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ర్టాల్లోనూ కొంత విస్తరించింది.
తూర్పు పీఠభూమి
- బఘేల్ఖండ్ పీఠభూమికి తూర్పు దిశలో విస్తరించి ఉంది. దీనిని అవశిష్ట పీఠభూమిగా పిలుస్తారు. దీని విస్తీర్ణం 87,000 కి.మీ2., దీని సగటు ఎత్తు సముద్ర మట్టం నుంచి 700 మీ.
- ఈ పీఠభూమిలో గోండ్వానా శిలలతో, ఆర్కియన్ యుగపు గ్రానైట్ శిలలతోపాటు దక్కన్ లావా శిలలతో నిర్మితమై ఉండటంవల్ల సమృద్ధిగా బొగ్గు నిక్షేపాలను కలిగి ఉంది.
- దీనిలో బొగ్గుతోపాటు అనేక రకాల ఖనిజాలను విరివిగా కలిగి ఉండటంవల్ల దీనిని ‘భారతదేశపు రూర్ ప్రాంతం (Ruhr of India)’ లేదా ఖనిజాల కాణాచి లేదా ఖనిజాల నెలవంక అని పిలుస్తారు.
- ఈ పీఠభూమి ఈశాన్య భాగంగా రాజ్‌మహల్ కొండలు ఉన్నాయి. దీనిలో ఎత్తయిన పరాస్నాథ్ శిఖరం (1366 మీ.) ఉంది.
- చోటా నాగ్‌పూర్ పీఠభూమిలో పలమావు నేషనల్ పార్క్ ఉంది.
- ఈ పీఠభూమి చిన్న పర్వత శ్రేణులను, పీఠభూములను కలిగి ఉంది.
- చోట నాగ్‌పూర్ పీఠభూమిని దామోదర్ లోయ రెండు భాగాలుగా విభజిస్తుంది. ఉత్తరాన గల భాగాన్ని హజారీబాగ్ పీఠభూమి అని, దక్షిణ భాగాన్ని రాంచీ పీఠభూమి అని అంటారు.
- హజారీబాగ్ పీఠభూమిలో కోనార్, బారకర్ నదులు ప్రవహిస్తున్నాయి. రాంచీ పీఠభూమిలో దక్షిణ కోయిల్, సుబర్నరేఖ నదులు ప్రవహిస్తున్నాయి.
- హజారీబాగ్ పీఠభూమి తూర్పు భాగాన్ని కొడెర్మ పీఠభూమి అని, రాంచీ పీఠభూమి పశ్చిమ భాగాన్ని పలమావు పీఠభూమి అని అంటారు.
- ఈ పలమావు ప్రాంతం తీవ్రమైన కరువు పరిస్థితులను కలిగి ఉంటుంది.
- దీనిని షిల్లాంగ్ లేదా కర్బి అంగ్లాంగ్ పీఠభూమి అని కూడా పిలుస్తారు.
- రాజ్‌మహల్ కొండలకు, షిల్లాంగ్ పీఠభూమికి మధ్య పీఠభూమి ఉపరితలం లేదు. ఇక్కడ దిగువ గంగా మైదానం ఉంది.
మేఘాలయ పీఠభూమి
- రాజ్‌మహల్ కొండలకు, గారో కొండలకు మధ్యగల ఈ భ్రంశాన్ని రాజ్‌మహల్-గారో భ్రంశం లేదా మాల్డా భ్రంశం అంటారు.
- ఈ పీఠభూమిలో గారో, ఖాసి, జయంతియా కొండలు, తూర్పున మికిర్ కొండలు ఉన్నాయి.
- ఎ) గారో కొండలు: ఈ కొండల్లో నివసించే గారో తెగ ప్రజల పేరుమీదుగా గారోకొండలు అని పేరువచ్చింది.
- దీనిలో ఎత్తయిన శిఖరం నోక్రెక్ (1421 మీ.), బల్పక్రం నేషనల్ పార్క్ ఈ కొండల్లో ఉంది. నోక్రెక్
- బయోస్పియర్ రిజర్వ్ గారో కొండల్లో ఉంది.
- బి) ఖాసి కొండలు: దీనిలో ఎత్తయిన శిఖరం షిల్లాంగ్ (1961 మీ.).
- దీనిలో ఖాసి తెగ ప్రజలు ఉన్నారు.
- ప్రపంచంలో అత్యధిక సగటు వార్షిక వర్షపాతం నమోదయ్యే మొదటి రెండు ప్రాంతాలైన మాసిన్రాం,
- చిరపుంజి (సోహ్ర) ఈ కొండల్లో ఉన్నాయి.
- మేఘాలయ రాజధాని షిల్లాంగ్ ఈ కొండల్లో ఉంది.
- దీనిని తూర్పు ప్రాంతపు స్కాట్లాండ్ (Scotland of the East) అని పిలుస్తారు.
- సి) జయంతియా కొండలు: ఖాసి కొండల కొనసాగింపుగా గల కొండలు. జయంతి తెగ ప్రజల నివాస స్థలం.
మికిర్ కొండలు
- మికిర్ కొండలు అసోం రాష్ట్రంలో ఉంది.
- దీని దక్షిణ భాగాన్ని రెంగ్మ కొండలు అంటారు.
దక్కన్ పీఠభూమి (Deccan Plateau)
- పశ్చిమ కనుమలకు, తూర్పు కనుమలకు, సాత్పూర పర్వతాలకు మధ్య త్రిభుజాకారంలో విస్తరించిన పీఠభూమిని ‘దక్కన్ పీఠభూమి’ అంటారు.
- ఇది భారత్‌లో అతిపెద్ద, అతి పురాతన పీఠభూమి. సుమారు 5 లక్షల చ.కి.మీ. వైశాల్యంతో 8 రాష్ర్టాల్లో విస్తరించి ఉంది.
- ఈ పీఠభూమి ఉత్తరాన సముద్ర మట్టం నుంచి సగటు ఎత్తు 500 మీటర్లు కాగా, దక్షిణం వైపు సుమారు 100 మీటర్ల ఎత్తులో ఉంది.
- దీనిని రెండు సమభాగాలు విభజించారు.
- 1) ఉత్తర దక్కన్ 2) దక్షిణ దక్కన్
- ఉత్తర దక్కన్ పీఠభూమి: సాత్పూర శ్రేణులు, మహారాష్ట్ర పీఠభూమి, మహానది బేసిన్, ఛత్తీస్‌గఢ్ మైదానాలు, గర్జాట్ కొండలు, దండకారణ్యం దీనిలో భాగంగా ఉన్నాయి.
ఎ) సాత్పూర శ్రేణులు (The Satpura Range): సాత్పూర అంటే ఏడు పర్వతాలు అని అర్థం. ఇవి నర్మద,
- తపతి నదుల మధ్యలో విస్తరించిన పర్వతాలు.
- ఈ పర్వతాలు పై రెండు నదుల భ్రంశోత్తిత శిలా విన్యాసం (Horst) వల్ల ఏర్పడినట్లు భావిస్తున్నారు.
- ఇవి గుజరాత్ నుంచి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల వరకు 900 కి.మీ.ల పొడవునా విస్తరించాయి.
- వీటిని ప్రాంతీయంగా ఇలా పిలుస్తారు
- పశ్చిమాన- రాజ్‌పిప్లా కొండలు (గుజరాత్)
- తూర్పున- మైకాల్ శ్రేణి (మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్)
- ఉత్తరాన- అసిర్‌ఘర్ కొండలు (మహారాష్ట్ర)
- దక్షిణాన- గవిల్ఘర్ కొండలు
- గవిల్ఘర్ కొండలకు, మహదేవ్ కొండలకు మధ్యలో ‘బేతుల్ పీఠభూమి’ ఉంది. తపతి నది బేతుల్ పీఠభూమిలోనే ప్రారంభమవుతుంది.
- సాత్పూర పర్వతాల్లో ఎత్తయిన శిఖరం ధూప్‌గర్ (1350 మీ.). ఇది మహదేవ్ శ్రేణుల్లో ఉంది. ఇక్కడే ‘పాంచ్మరి’ వేసవి విడిది ఉంది. దీనిని సాత్పూర రాణి (Queen of Satpura) అని పిలుస్తారు.
- మైకాల్ శ్రేణుల్లో బహ్మన్గర్ (1105 మీ.), అమర్కంటక్ (1057 మీ.) శిఖరాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న అమర్కంటక్ పీఠభూమి నుంచి నర్మద, సోన్ నదులు ప్రారంభమవుతాయి.
- అచనక్మర్ అమర్కంటక్ బయోస్పియర్ రిజర్వ్, పాంచ్మరి బయోస్పియర్, పెంచ్ నేషనల్ పార్క్, సాత్పూర నేషనల్ పార్క్, గుగమల్ నేషనల్ పార్క్‌లు ఇక్కడే ఉన్నాయి.
- దక్కన్ తలుపులు (Doorway of Deccan)గా పిలిచే ‘అసిర్‌ఘర్ కనుమ’ సాత్పూర పర్వతాల్లో ఉంది.
ఈ కనుమ నర్మద, తపతి నదీలోయలను కలుపుతుంది. ఇది మధ్యప్రదేశ్‌లో ఉంది. దీనిని ‘Key of the Deccan’ అని పిలుస్తారు.
మాదిరి ప్రశ్నలు
1. మాల్వా పీఠభూమిలో ఉన్న ప్రధాన నేషనల్ పార్క్ ఏది?
1) పెంచ్ నేషనల్ పార్క్
2) పాంచ్మరి నేషనల్ పార్క్
3) సాత్పూర నేషనల్ పార్క్
4) రణథంబోర్ నేషనల్ పార్క్
2. సాత్పూర శ్రేణులను గుజరాత్లో కింది ఏ పేరుతో పిలుస్తారు?
1) రాజ్‌పిప్లా కొండలు 2) గవిల్ఘర్ కొండలు
3) మైకాల్ శ్రేణులు 4) మహదేవ్ కొండలు
3. తూర్పు పీఠభూమిని కింది మరోపేరుతో కూడా పిలుస్తారు?
1) దక్కన్ పీఠభూమి 2) బఘేల్ పీఠభూమి
3) చోటా నాగ్‌పూర్ పీఠభూమి
4) షిల్లాంగ్ పీఠభూమి
జవాబులు
1-4, 2-1, 3-3
– జీ గిరిధర్
సీనియర్ ఫ్యాకల్టీ, ఫైవ్ మంత్రి ఇనిస్టిట్యూట్
అశోక్‌నగర్, 9966330068
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు