తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం (Groups Special)
తెలంగాణ ప్రజా పార్టీ, తెలంగాణ జనసభ
- ప్రత్యేక రాష్ట్రం కోసం 1997లో గాదె ఇన్నయ్య ‘తెలంగాణ ప్రజాపార్టీ’ని స్థాపించారు. ఈ సమయంలో వచ్చిన లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో తెలంగాణ ప్రజా పార్టీ తెలంగాణ వాదంతో పోటీచేసినా ఓడిపోయింది. ఈ ఓటమితో నిరాశ చెందిన ప్రజాసంఘాల నాయకులు రాజకీయాలకు, ఎన్నికలకు అతీతంగా తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టాలని భావించారు. అలా భావించినవారిలో ఆకుల భూమయ్య ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రాణా ప్రతాప్ ఫంక్షన్ హాలులో 1998, జూలై 5, 6 తేదీల్లో సదస్సును నిర్వహించారు.
- ఈ సమావేశానికి హాజరైన ఇతర రాష్ర్టాల నాయకులు యాసిన్ మాలిక్ (ఆల్ పార్టీ హురియత్ కాన్ఫరెన్స్, కశ్మీర్), ఖగేన్ తాలూక్దార్ (మానవ్ అధికార్ సంగ్రామ్, అస్సాం), అనూప్‌కుమార్ సింగ్ (ఛత్తీస్‌గఢ్). ఉపాధ్యాయులు, లాయర్లు, జర్నలిస్టులు, ఇతర తెలంగాణ ఉద్యమకారులు కలిసి సదస్సు రెండోరోజున తెలంగాణ జనసభను ఏర్పాటు చేశారు.
- తెలంగాణ జనసభ అంబర్‌పేటలో బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభ ఆహ్వాన సంఘానికి అధ్యక్షుడు ఎంటీ ఖాన్. ఈ సభలోనే ‘జన తెలంగాణ’ మాస పత్రిక కాళోజీ నారాయణ రావు ఆవిష్కరించారు. ఈ మాసపత్రిక ఆవిష్కరణ అనంతరం కాళోజీ మాట్లాడుతూ తెలంగాణ వనరులను కొల్లగొడుతున్న కోస్తాంధ్ర పాలక వర్గాలకు ‘క్విట్ తెలంగాణ’ అనే నినాదాన్నిచ్చారు.
- ఈ తెలంగాణ జనసభకు అనుబంధంగా జహంగీర్ కన్వీనర్‌గా ‘తెలంగాణ కళాసమితి’ ఏర్పడింది. ఈ తెలంగాణ కళాసమితి కో కన్వీనర్‌గా ఉన్న బెల్లి లలితను కొంతమంది దుండగులు 1999, మేలో భువనగిరిలో హత్య చేశారు.
తెలంగాణ మహాసభ (1997)
- భువనగిరి సభ తర్వాత గద్దర్‌పై కాల్పులు జరగడంతో తెలంగాణ గురించి ఎవరూ గొంతెత్తలేదు. గజ్జెకట్టి ఆడలేరని భావించిన చంద్రబాబు ప్రభుత్వాన్ని సవాలు చేస్తూ వేలాది గొంతులతో గర్జించింది ‘సూర్యాపేట తెలంగాణ మహాసభ’. మారోజు వీరన్న అజ్ఞాతంలో ఉండటంతో తెలంగాణ మహాసభ బాధ్యతలను వీ ప్రకాశ్, డా. చెరుకు సుధాకర్, భరత్, బెల్లయ్య నాయక్‌లతోపాటు తన పార్టీ సహచరులపై ఉంచారు.
- 1997, ఆగస్టు 11న సూర్యాపేట పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఒక పెద్ద ఫంక్షన్హాల్లో సుమారు మూడువేల మందితో‘దోఖా తిన్న తెలంగాణ’ సదస్సు జరిగింది. ఈ సభలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం గురించి తీర్మానాన్ని వీ ప్రకాశ్ ప్రవేశపెట్టగా సభ చప్పట్లతో ఆమోదించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోపాటు మరో 16 డిమాండ్లతో ‘సూర్యాపేట డిక్లరేషన్ (కీ నోట్)’ను చెరుకు సుధాకర్ ప్రతిపాదించారు.
- సదస్సు అనంతరం సూర్యాపేట పట్టణ వీధుల గుండా వేలాది జనంతో ఊరేగింపు నిర్వహించి, భారీ బహిరంగ సభను నిర్వహించారు. సుమారు 15 వేల మంది హాజరైన బహిరంగ సభకు చెరుకు సుధాకర్ అధ్యక్షత వహించారు. ఈ సభలో ప్రొ. జయశంకర్, డా. బీ జనార్దన్‌రావు, డా. కంచె అయిలయ్య, వీ ప్రకాశ్, దుశ్చర్ల సత్యనారాయణ (జల సాధన సమితి), ప్రొ. కేశవరావు జాదవ్, మల్లేపల్లి లక్ష్మయ్య ప్రసంగించారు. గోరటి వెంకన్న, బెల్లి లలిత పాటలు, డోలు దెబ్బ కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మల్లేపల్లి లక్ష్మయ్య డప్పు దెబ్బ అందరినీ ఆకర్షించింది.
తెలంగాణ మహాసభ మాసపత్రిక
- తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం వీ ప్రకాశ్ ఎడిటర్‌గా తెలంగాణ మహాసభ మాస పత్రికను వెలువరించారు. తెలంగాణ వ్యాప్తంగా వివిధ సంఘాలు నిర్వహిస్తున్న సభలు, సమావేశాలు, ఆందోళన కార్యక్రమాల వార్తలు ఈ పత్రికలో ప్రచురించారు. ప్రొ. జయశంకర్ సార్, కేశవ రావు జాదవ్ వంటి పెద్దల వ్యాసాలను, తెలంగాణకు వివిధ రంగాలకు జరుగుతున్న అన్యాయాలపై నిపుణులతో వ్యాసాలు రాయించి ఈ పత్రికలో ప్రచురించారు.
సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ ఆధ్వర్యంలో ఓయూలో సెమినార్
- 1997, ఆగస్టు 16, 17 తేదీల్లో ఉస్మానియా యూనివర్సిటీలోని లైబ్రరీ భవనంలో ‘ప్రాంతీయ అసమానతలు, అభివృద్ధి ప్రత్యామ్నాయాలు (రీజినల్ ఇన్బ్యాలెన్సెస్ అండ్ డెవలప్మెంట్ ఆల్టర్నేటివ్స్)’ అనే అంశంపై రెండురోజుల సదస్సును ఓయూలోని జర్నలిజం ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, జాగ్రఫీ ప్రొఫెసర్ సింహాద్రి నిర్వహించారు. ఈ సదస్సును ప్లానింగ్ కమిషన్ మాజీ సభ్యులు సీహెచ్ హనుమంతరావు ప్రారంభించారు.
తెలంగాణ ఐక్య వేదిక
- తెలంగాణ కోసం పనిచేసే 28 సంస్థలు 1997, అక్టోబర్ 10న ఉస్మానియా లైబ్రరీ భవనంలో ‘తెలంగాణ ఐక్యవేదిక’ను ఏర్పాటు చేసుకున్నాయి. అక్టోబర్ 16న ప్రొ. జయశంకర్, ప్రొ. కేశవరావు జాదవ్ మీడియాకు తెలంగాణ ఐక్యవేదిక ఏర్పాటు ప్రకటనను విడుదల చేశారు. ఈ ప్రకటనలో ‘సమష్టి నాయకత్వం’ ప్రాధాన్యాన్ని వివరిస్తూ ‘తెలంగాణ రాష్ట్రమే తెలంగాణ సమస్యలకు పరిష్కారం’ అని పేర్కొన్నారు.
- 1997, నవంబర్ 1న తెలంగాణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిజాం కాలేజీ మైదానం నుంచి సికింద్రాబాద్‌లోని క్లాక్ టవర్ పార్క్‌కు సుమారు 3 వేల మందితో 7 కి.మీ. భారీ ర్యాలీ జరిగింది. జై తెలంగాణ నినాదాలతో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వందల మంది రైతు కూలీలు, విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
- 1969 తెలంగాణ ఉద్యమం తరువాత రాష్ట్ర రాజధానిలో జరిగిన అతిపెద్ద తెలంగాణ ఉద్యమ ర్యాలీ ఇదే. ఈ ర్యాలీకి వచ్చి ఎంతో ఉత్తేజాన్ని పొందిన కొండా లక్ష్మణ్ బాపూజీ తన ఇల్లు జలదృశ్యాన్ని తెలంగాణ ఐక్యవేదిక కార్యాలయంగా వినియోగించుకోడానికి ఉచితంగా ఇచ్చారు. ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ నిర్వహణ బాధ్యతను తెలంగాణ మహాసభ పక్షాన వీ ప్రకాశ్ తీసుకున్నారు. ఐక్యవేదిక ఆధ్వర్యంలో ‘తెలంగాణ పత్రిక’ను వీ ప్రకాశ్, సామ జగన్ రెడ్డి నడిపారు. 1997, నవంబర్ 1న కాళోజీ గన్‌పార్క్ స్థూపం వద్ద ఈ పత్రికను ఆవిష్కరించారు.
వరంగల్ డిక్లరేషన్
- ఆలిండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరం (అఖిల భారత ప్రజా ప్రతిఘటన వేదిక) ప్రొ. సాయిబాబా అధ్యక్షతన 1997, డిసెంబర్ 28, 29 తేదీల్లో హన్మకొండలో ‘ప్రజాస్వామిక తెలంగాణ ఆకాంక్ష’ల సదస్సు బహిరంగ సభ జరిగింది. 50 డిమాండ్లతో వరంగల్ డిక్లరేషన్‌ను ప్రొ. సాయిబాబా ప్రతిపాదించగా సదస్సు ఆమోదించింది.
చైతన్య వేదిక
- వరంగల్ డిక్లరేషన్ ఇచ్చిన ఉత్సాహంతో 1998, ఫిబ్రవరి 14, 15 తేదీల్లో చైతన్య వేదిక ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలో సదస్సు జరిగింది. ఈ సదస్సులో తెలంగాణ స్థితిగతులపై, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతమైన చర్చ జరిగింది.
తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు-నేపథ్యం
- 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత తెలంగాణ ప్రాంతంపై వివక్ష మరింత పెరిగింది. ఆర్థిక సరళీకృత విధానాలు, సంస్కరణల పేరుతో తెలంగాణలో అనేక ప్రభుత్వ రంగ పరిశ్రమలను నష్టాల సాకు చూపి మూసివేసింది ప్రభుత్వం. లాభాల్లో ఉన్న నిజాం షుగర్స్ వంటి కొన్ని పరిశ్రమలను ఆంధ్రా ప్రాంత పెట్టుబడిదారులకు నామమాత్రపు ధరకు అమ్మివేసింది.
- చంద్రబాబు అనుసరించిన ఇలాంటి విధానాల వల్ల వేలాదిమంది కార్మికులు రోడ్డునపడ్డారు. నక్సలైట్ల అణచివేత పేరుతో తెలంగాణ ప్రాంతం అంతటా ప్రభుత్వం తీవ్రమైన నిర్బంధాన్ని కొనసాగించింది. ఎన్కౌంటర్ల పేరుతో నిరాయుధులైన వందలాదిమంది యువకులను పోలీసులు కాల్చిచంపారు.
- తెలంగాణలో నూటికి 70 శాతం రైతాంగం వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల పట్ల 1956 నుంచి ఆంధ్రా పాలకులు అనుసరిస్తున్న దారుణమైన వివక్షను, నిర్లక్ష్యాన్ని చంద్రబాబు ప్రభుత్వం కూడా కొనసాగించింది. వ్యవసాయం భారమైందని, బతుకలేని పరిస్థితి ఏర్పడిందని రైతులు బాధపడుతున్న సమయంలో చంద్రబాబు ప్రభుత్వం కరెంట్ చార్జీలు పెంచింది. ప్రపంచ బ్యాంకు ఆదేశాలతో విద్యుత్ రంగ సంస్కరణలను చేపట్టింది. ఈ సంస్కరణలకు, కరెంట్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన తొమ్మిది వామపక్ష సంఘాల ఊరేగింపుపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించారు. ఈ సంఘటన తెలంగాణలో నెలకొన్న పరిస్థితులు, అసెంబ్లీలో ఉపసభాపతిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్)ను కలిచివేసింది.
- ఎంతో ఆవేదన చెందిన కేసీఆర్ చంద్రబాబుకు ఒక లేఖ రాస్తూ అందులో తెలంగాణ రైతుల దయనీయ పరిస్థితిని వివరించారు. ఈ కరెంట్ చార్జీల పెంపు వల్ల తెలంగాణ రైతుల ఉన్న గోచి కూడా ఊడిపోతుందని ఆ లేఖలో ప్రస్తావించారు.
- ఈ లేఖ విషయం పత్రికల్లో చదివిన తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమ సంఘాల నాయకులు కేసీఆర్‌ను కలిసి సీమాంధ్ర పాలనలో తెలంగాణ సమస్యలు పరిష్కారం కావని, ఈ ప్రాంతానికి న్యాయం జరగదని కాబట్టి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి నాయకత్వం వహించాలని ఆహ్వానించారు. దీంతో కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించగలరనే నమ్మకం ప్రొ. జయశంకర్‌కు కలిగింది. ఆ విషయాన్ని స్వయంగా ఆయనే కేసీఆర్‌తో చెప్పారు.
- సుమారు ఏడు నెలలు ప్రతిరోజూ తెలంగాణ వాదులతో చర్చలు జరిపి, తెలంగాణకు జరిగిన అన్యాయాల గురించి వివరంగా తెలుసుకున్న కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.
- 1997, నవంబర్ నుంచి తెలంగాణ ఐక్యవేదికకు కార్యాలయంగా ఉన్న జలదృశ్యాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయానికి ఇవ్వడానికి కొండా లక్ష్మణ్ బాపూజీ అనుమతించారు. పర్యవసానంగా 2001, ఏప్రిల్ 27న టీఆర్ఎస్ ఆవిర్భావం జలదృశ్యం ఆవరణలో జరిగింది.
కరీంనగర్ సింహగర్జన
- తెలంగాణపై ప్రారంభ సభను కరీంనగర్లో 2001, మే 17న నిర్వహించాలని టీఆర్ఎస్ నాయకత్వం నిర్ణయించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా వచ్చిన జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు శిబూసోరెన్ అనూహ్యమైన ప్రజల స్పందనను చూసి ఎంతో ఆశ్చర్యపోయి తెలంగాణ ఉద్యమాన్ని విజయవంతంగా పునరుద్ధరిస్తున్నారని కేసీఆర్‌ను అభినందించారు. రాత్రి 7 గంటలకు ప్రారంభమైన సభ రాత్రి 11 గంటలదాకా కొనసాగింది. ప్రొ. జయశంకర్‌కు పాదాభివందనం చేసి కేసీఆర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణకు జరిగిన అన్యాయాలపై, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరం గురించి కేసీఆర్ సుమారు గంటసేపు పల్లె ప్రజలకు అర్థమయ్యే భాషలో, సామెతలతో ప్రసగించారు.
- జనంలో నుంచి కొందరు యువకులు చేతిలో ప్రముఖ దినపత్రిక కాపీలను చూపుతూ ‘ఈ పత్రిక తెలంగాణకు వ్యతిరేకంగా రాస్తున్నది, ఏం చేయమంటారని’ ప్రశ్నించారు. అప్పుడు కేసీఆర్ ‘ఇష్టం లేకపోతే చదవడం మానేయండి’ అని జవాబిచ్చారు. కేసీఆర్ తొలిరోజు నుంచే ఉద్యమంలో హింసకు, విధ్వంసాలకు, విద్వేషాలకు తావులేని విధంగా ఉద్యమానికి రూపకల్పన చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలు
- 2001, జూలై 12, 15, 17 తేదీల్లో జిల్లా, మండల పరిషత్‌లకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగేనాటికి టీఆర్ఎస్ పార్టీ స్థాపించి మూడు నెలలు కూడా కాలేదు. అయినా అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ తన అభ్యర్థులను జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో పోటీలో నిలిపింది. ఈ ఎన్నికల్లో ప్రచారానికి సమయం తక్కువగా ఉన్నందున కేసీఆర్ హెలికాప్టర్‌ను ఉపయోగించారు. వివిధ జిల్లాల్లో ఒక్కోరోజు ఎనిమిది నుంచి పది సభల్లో ప్రసంగించారు. పార్టీ కార్యాలయమైన జలదృశ్యం ఆవరణ నుంచే హెలికాప్టర్లో కేసీఆర్ బయలుదేరడం చూసి చంద్రబాబు జీర్ణించుకోలేకపోయాడు. ఏడాదిలో జలదృశ్యం భవనాన్ని నేలమట్టం చేశాడు.
- ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ ‘రైతు నాగలి’ గుర్తుపై పోటీ చేసింది. టీఆర్ఎస్ పార్టీ 87 జడ్పీటీసీ స్థానాలు, 100కు పైగా ఎంపీటీసీ స్థానాలు, నిజామాబాద్, కరీంనగర్ జిల్లా పరిషత్‌లను గెలుచుకుంది. మాజీ ఆర్థికమంత్రి సంతోష్ రెడ్డి నిజామాబాద్ జడ్పీ చైర్మన్‌గా, కేవీ రాజేశ్వరరావు కరీంనగర్ జడ్పీ చైర్మన్ బాధ్యతలు చేపట్టారు.
- 2001 ఆగస్ట్‌లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వందలాది గ్రామాల్లో టీఆర్ఎస్ బలపర్చిన వ్యక్తులే సర్పంచ్‌లుగా గెలిచారు. 2001, ఆగస్ట్ 18న టీఆర్ఎస్ రాజకీయ పార్టీగా ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్టర్ అయింది. 2001, సెప్టెంబర్ 22న కేసీఆర్ రాజీనామాతో జరిగిన సిద్దిపేట నియోజకవర్గ ఉపఎన్నికలో టీఆర్ఎస్ తరఫున కేసీఆర్ భారీ మెజారిటీతో ఎన్నికయ్యారు.
- ఈ ఎన్నికల ప్రచారం సందర్భంగా తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ వాదులు, కళాబృందాలు సిద్దిపేట నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు వెళ్లి ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవసరం గురించి వివరించారు. ఎలాగైనా కేసీఆర్‌ను ఓడించాలని టీడీపీ కోట్ల రూపాయలను, మద్యాన్ని విచ్చలవిడిగా ప్రజలను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించింది. అయినా గతం కంటే ఎక్కువ మెజారిటీతో సిద్దిపేట ప్రజలు కేసీఆర్‌ను గెలిపించారు.
– సాసాల మల్లిఖార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల
కోరుట్ల
Previous article
పుస్తక సమీక్ష / Book Review
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు