విద్యా సంస్కరణలతో వికాసం (groups special)
పోలీస్ సంస్కరణలు
- క్రమబద్ధమైన పోలీస్ పరిపాలన సాలార్‌జంగ్‌కు పూర్వం లేదు. సిబ్బంది, ప్యూన్, నిజామత్, గ్రామ సేవకులు పోలీస్ పనులు నిర్వహించేవారు. పెద్ద నేరాలు జరిగినప్పుడు దళారుల సహాయం తీసుకునేవారు. నేరాలు రుజువు చేయడానికి క్రూరంగా శిక్షించేవారు. తరచుగా అమాయక ప్రజలు క్రూరమైన శిక్షలకు గురయ్యేవారు. నయిబ్కు ప్రజలను శిక్షించే పూర్తి అధికారం ఉండేది. పోలీస్ విధులు ఇతడే నిర్వహించేవాడు. పోలీస్ విధులు నిర్వహించిన సేవకులకు ఉచితంగా భూములు, గ్రామస్తుల నుంచి దిగుబడి వాటా ఉండేది. కొత్వాల్ పోలీస్ పనులను నిర్వహించేవాడు. అతడికి కార్యనిర్వాహక విధులతోపాటు న్యాయశాఖ అధికారాలు ఉండేవి. ఒక లా అధికారి కొత్వాల్ కార్యాలయానికి ఉండేవాడు.
- 1271 ఫసలీ నాటికి పోలీస్ దళాన్ని నియమించాడు. దాని నిర్వహణకు సుమారు రూ.82,346 ఖర్చు చేశారు. రోహిల్లాలు ఎన్నో దోపిడీలు, దొంగతనాలు, అల్లర్లకు పాల్పడ్డారు. వీరిని అణచివేయడానికి జిల్లాదారులను నియమించాడు. జిల్లాదారులు తాలూకాదారుల పర్యవేక్షణలో ఉండేవారు. 1865లో పోలీస్ విధానాన్ని సంస్కరించారు. రాజ్యంలో 17 జిల్లాల్లో జిల్లాకొక సూపరింటెండెంట్‌ను నియమించారు. సాలార్జంగ్ కృషి వల్ల అప్పు కింద ఇంగ్లిష్‌వారు తీసుకున్న రాయ్‌చూర్, ఉస్మానాబాద్ జిల్లాలను నిజాంకు పునరుద్ధరించారు. అక్కడ ఇంగ్లిష్‌వారి ద్వారా పోలీస్ సూపరింటెండెంట్లు నియమితులయ్యారు. ఇతర జిల్లాల్లో అంతకు పూర్వం పోలీస్ పనులు చేస్తున్నవారిలో నుంచి సమర్థులైన వారిని ఎంపిక చేశారు.
- ప్రతి సూపరింటెండెంట్ సహాయార్థం ప్రతి తాలూకాకు ఒక అమీన్, ప్రతి ఠాణాకు జమ్దార్, ప్రతి చౌకీకి ఒక దఫ్తర్, ఎనిమిది మంది ఠాణా బాధ్యతలు, ఆరుగురు చౌకీ బాధ్యతలు నిర్వహించేవారు. వారికి ప్రభుత్వం జీతాలు చెల్లించేది. సాగుచేసే భూమి, జనాభా లెక్కలోకి తీసుకుని పోలీస్ దళాలను జిల్లాలకు పంచారు. నిజాయితీ, మేధస్సు, సమయస్ఫూర్తి, సామర్థ్యం ఉన్నవారినే ముమతమీన్లుగా నియమించారు. ప్రతి జిల్లా పోలీస్ అధికారులు తాలూకాదార్ ఆధీనంలో ఉండేవారు.
ఇతర విధులు
- 1) శాంతి భద్రతలు సంరక్షించడం 2) నేరాలు అడ్డుకోవడం 3) నేరస్థులను పట్టుకోవడం, దోచుకున్న నేరస్థులను గుర్తించడం, క్రిమినల్ కేసుల్లో ఆధారాలు సేకరించడం, అనుమానాస్పద వ్యక్తులను నిర్బంధించడం. ఉద్యమాలు జరగకుండా చూడటం, రోడ్లు, రహదారులు, వీధుల్లో రక్షణ కోసం ఏర్పాట్లు చేయడం. జారీ చేసిన సమన్లు, వారెంట్లు ఇతర చట్టపరమైన ప్రక్రియలు విడుదల చేయడం కారాగారాలను పరిరక్షించడం, ఖజానాలను పరిరక్షించడం దేశ ప్రతి భాగంపై అప్రమత్తంగా ఉండటం. ఒక పోలీస్ కోడ్, రెవెన్యూ బోర్డు పెట్టిన ప్రభుత్వ ఆంక్షలు ప్రకటించడం. వారు కొన్ని నేరాలకు మాత్రం శిక్ష వేయడానికి అధికారం లేదు. అవి వ్యభిచారం, అసభ్యంగా మాట్లాడటం, చిన్న నేరాలు. పోలీసులు మేజిస్ట్రేట్ నుంచి వారెంట్ లేకుండా, కింద పరిస్థితుల్లో వ్యక్తులను పట్టుకోగలరు.
- 1) తిరుగుబాటుదారులను 2) తప్పుడు నాణేలు ముద్రించినవారిని 3) స్టాంప్ పేపర్‌పై దొంగ సంతకాలు చేసినవారిని 4) పవిత్ర స్థలాలు నష్టపరిచినవారిని 5) హత్యలు, హత్యాప్రయత్నం చేసినవారిని 6) ఇతరుల నివాసాన్ని మోసం ద్వారా ఆక్రమించిన వారిని 7) దొంగతనాలు, దోపిడీలు చేసేవారిని మొదలైనవి.
- 1867లో 3 డివిజన్లుగా విభజించారు. అదే సమయంలో పోలీస్ శాఖను రెవెన్యూ శాఖ నుంచి వేరుచేశారు. ఆదాయం, న్యాయ విషయాలకు ఒక సదర్ తాలూకాదార్ను ప్రతి విభాగానికి, నయిబ్ ముహతమీమ్ను పోలీస్ శాఖ కోసం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నలుగురు మంత్రులను పరిపాలన కోసం ఎన్నుకుంది. 18 నుంచి 30 సంవత్సరాల వయోపరిమితి వారినే కానిస్టేబుల్‌గా తీసుకునేవారు. వారికి ప్రతి సంవత్సరం వారి సంబంధిత విధుల పరిజ్ఞానంపై పరీక్షలు ఉండేవి.
న్యాయ సంస్కరణలు
- సాలార్జంగ్ న్యాయశాఖను కూడా సంస్కరించాడు. ఒక ఉన్నత న్యాయస్థానాన్ని (అదాలత్-ఇ-పాదుషాహీ), ఒక అప్పీలు న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశాడు. ఈ విధంగా హైదరాబాద్‌లో నెలకొల్పిన ఈ ఉన్నత న్యాయస్థానంలో ఒక ప్రధాన న్యాయమూర్తి, నలుగురు న్యాయమూర్తులను నియమించాడు.
- కోర్టుల ప్రతిష్ఠలు పెంచి రోహిల్లా, అరబ్ కిరాయి సైనికుల ఆగడాలను తొలగించాడు. 1853-64 మధ్య ఎన్నో కోర్టులు నగరంలో ఏకకాలంలో మొదలుపెట్టాడు. నగర జ్యుడీషియల్ పరిపాలన ముఖ్యమైన లక్షణం. మొదటిసారిగా ప్రతి న్యాయస్థానం అధికార పరిధిని స్పష్టంగా నిర్వచించారు. న్యాయశాఖ అధికారాలు దార్-ఉల్-ఖాజా, కొత్వాల్ పరిధిలో ఉండేవి. అయితే కోర్టు ప్రధానమంత్రి పర్యవేక్షణలో ఉండేది. మరణశిక్షను కోర్టు ప్రధానమంత్రికి అప్పగించేది.
- అసోసియేట్ న్యాయాధిపతులు సొంత తీర్పులు ఇవ్వలేరు. వారి వాదనలను చీఫ్ జస్టిస్‌కు సమర్పించేవాడు. ఇతను వాటిని ఆమోదించేవాడు. ఉత్తర్వులను అమలు చేయడానికి అదాలత్-ఇ-బాద్షాకు అధికారం ఉండేది. కోర్టు సమన్లు తోసిపుచ్చే అధికారం ఎవరికీ లేదు. అదాలత్ అధికారులు 1861 నోటిఫికేషన్ ద్వారా నిర్వహించేవారు.
- దివానీ ఖానా అదాలత్ కొంత కాలానికి అదాలత్-ఇ-చీనీఖానాగా మారింది. చిన్న తగాదాల విచారణ ఇక్కడ జరిగేది. వెయ్యి రూపాయల పైన దావాలు అదాల్-ఇ-దివానీ-ఇ-బుజుర్గ్కు బదిలీ అయ్యాయి. దాని తీర్పులను సవాలుచేసే అప్పీళ్లను అదాల్-ఇ-దివాన్-ఇ-బల్దా తీసుకునేది లేకపోతే ప్రభుత్వం కూడా ఆ అప్పీళ్లను స్వీకరించేది.
- 1855లో సాలార్జంగ్ మరో కొత్త కోర్టు సిక్కులు లేక సిపాయిలకు ఏర్పాటు చేశాడు. నగరంలో మూడు న్యాయస్థానాలు ఏర్పాటయ్యాయి. 1862లో ప్రధానమంత్రి పర్యవేక్షణలో న్యాయశాఖకు సంబంధించిన సెక్రటేరియట్ ఏర్పడింది. 1869లో సదర్ తాలూకాదారుల న్యాయ నిర్వహణకు తోడ్పడటానికి అవసరమైన చర్యలు తీసుకున్నారు. అంగ విచ్ఛేద శిక్ష రద్దయ్యింది.
- ముస్లిం చట్టాల అమలు కోసం ప్రత్యేక న్యాయస్థానం ఏర్పడింది. కఠిన శిక్షలు తొలగి కఠిన కారాగార శిక్షను అమలు చేశాడు. హిందువుల తగాదాలను పరిష్కరించడానికి హిందూ ధర్మ శాస్ర్తాలను ఉపయోగించాడు. అప్పీలు కోసం ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశాడు. మరణదండన బదులు యావజ్జీవ కారాగార శిక్ష విధించేవారు. 1879లో నోటిఫికేషన్ కింద సదర్-ఉల్-మిహమ్ కింద న్యాయశాఖ వచ్చింది.
- 1875 కోర్టు మార్గదర్శకత్వం నియమాలు, నిబంధనల కూర్పునకు నజీమ్‌కు బాధ్యతలు ఇచ్చారు. 1877లో లీగల్ కార్యదర్శిని నియమించారు. సివిల్, క్రిమినల్ కోర్టులు న్యాయశాఖ మంత్రి ఆధీనంలో ఉండేవి. స్టాంప్ పత్రికలు జారీచేయడం వంటి పనులు కూడా ఇతడే నిర్వహించేవాడు. మౌల్వీ మొయినొద్దీన్ నూతన ప్రయోజనకరమైన న్యాయ సంస్కరణలు ప్రవేశపెట్టాడు.
విద్యా సంస్కరణలు
- రాజ్య పాలన సమర్థవంతంగా నిర్వహించాలంటే విద్యావంతులైన, శిక్షణ పొందిన సిబ్బంది అవసరమని గ్రహించిన సాలార్జంగ్ విద్యాసంస్కరణలు ప్రవేశపెట్టాడు. సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామి అతడికి సహాయపడ్డాడు. 1855లో సాలార్జంగ్ దారుల్ ఉల్మ్ అనే ఉన్నత పాఠశాలను నెలకొల్పాడు.
పారశీక, అరబ్బీల్లో కూడా బోధించేవారు. అఫ్జల్ ఉద్దౌలా కాలంలో స్థాపించిన పాఠశాల ఇదొక్కటే. ఉత్తర భారతదేశం నుంచి, ఇరాన్, బొకరా నుంచి ఉపాధ్యాయులు వచ్చి ఇక్కడ బోధించేవారు. - 1853-54లో ఓరియంటల్ కాలేజీని తెరిచారు. ఇక్కడ అరబ్బీ, పారశీక, ఇంగ్లిష్, తెలుగు, మరాఠీ భాషల్లో బోధించేవారు. 1860లో జిల్లా, తాలూకాకు ఒక పాఠశాల చొప్పున ప్రారంభించారు. డబ్ల్యూహెచ్ విల్కిన్సన్‌ను విద్యా కార్యదర్శిగా నియమించారు. విద్యను పూర్తిగా పునర్వ్యవస్థీకరించారు. 1869లో ఇంగ్లిష్ బోధన, పాశ్చాత్య విద్య మొదలుపెట్టారు.
- 1870లో సిటీ హైస్కూల్, 1872లో చాదర్‌ఘాట్ హైస్కూళ్లను స్థాపించారు. చాదర్‌ఘాట్ స్కూల్‌ను ఆంగ్లో వెర్నాక్యులర్ పాఠశాలగా చేశారు. ఇదే తరువాత హైదరాబాద్ కాలేజీగా మారింది. 1873లో రాజకుటుంబీకుల కోసం మదర్సా-ఇ-ఆలియా, 1874లో రాజుల పిల్లల కోసం మరో పాఠశాలను ఏర్పాటు చేశారు. 1881లో గ్లోరియా గర్ల్స్ హైస్కూల్‌ను స్థాపించారు. 1887లో నిజాం కాలేజీ స్థాపన జరిగింది. సాంకేతిక విద్య కోసం ఇంజినీరింగ్ పాఠశాలను 1870లో స్థాపించారు.
- జిల్లాలు, తాలూకాల్లో విద్యాలయాలు ఏర్పడ్డాయి. వైద్య, ఇంజినీరింగ్ కాలేజీ మినహాయించి నజీమ్ తలీమత్ ఆధీనంలో ఉండేది. ప్రతి డివిజన్‌కు ఐదుగురు ఇన్స్ట్రక్టర్లు ఉండేవారు. హైదరాబాద్‌లో ఒక కాలేజీ, పన్నెండు పాఠశాలలు ఉండేవి. అలీగఢ్ యూనివర్సిటీకి సాలార్జంగ్ ఆర్థిక సహాయం చేశాడు. అనేక ఇతర విద్యాసంస్థలకు ధన సహాయం చేశాడు. 1859లో ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ప్రతి తాలూకా, జిల్లాకు రెండు పాఠశాలలను ఏర్పాటు చేశారు. ఒకదానిలో పారశీక భాషలో బోధన జరగగా వేరొకదానిలో ప్రాంతీయ భాషలో బోధించేవారు.
- విద్యాసంస్థల వల్ల హైదరాబాద్‌లో చైతన్యవంతమైన మేధావి వర్గం ఏర్పడింది. అదే జాతీయోద్యమానికి దారితీసింది. 1882-83లో విద్యా వ్యయం రూ.1,50,000గా ఉండేది. 1883-84లో విద్య కోసం బడ్జెట్ రూ.2,29,000 విడుదల చేశారు. మెడికల్ కాలేజీని డా. డబ్ల్యూసీ మెక్లీన్ 1846లో ఏర్పాటు చేశాడు. టెక్ట్స్‌బుక్ కమిటీని 1884లో ఏర్పాటు చేశారు. 1887 నాటికి నిజాం కాలేజీ ఫస్ట్‌గ్రేడ్ కాలేజీగా మారింది. ఇంగ్లిష్‌ను నేర్చుకునేవారికి ఉపకారవేతనాలు ఇచ్చేవారు. 1904-05లో మెడికల్ స్కూల్ ప్రారంభమయ్యింది.
- నిజాం ఇమాద్-ఉల్-ముల్క్ బహదూర్ 1905-06లో విద్య కోసం రూ.1,00,000 విడుదల చేశాడు. అందుకే అతడిని ‘ఫాదర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ స్టేట్’ అని అనేవారు. సివిల్ మెడికల్ శాఖ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పనిచేసింది. దీనిని నడిపించడానికి 40 హకీమ్స్, 30 మంది డ్రస్సెర్స్, 30 వాక్సినేటర్స్, రెసిడెన్సీ సర్జన్‌ను నియమించారు. ఒక మెడికల్ స్కూల్, ఒక మెడికల్ స్టోర్, 27 తెలుగు డిస్పెన్సరీలు, 16 జిల్లా డిస్పెన్సరీలు, ఒక మెంటల్ ఆస్పత్రి, 7 సిటీ డిస్పెన్సరీలు ఏర్పాటు చేశాడు.
రవాణా సౌకర్యాలు, ఇతర కమ్యూనికేషన్స్
- సాలార్జంగ్ హైదరాబాద్ రాజ్యమంతటా రవాణా సౌకర్యాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. ఇంగ్లిష్‌వారి సహాయంతో రోడ్డు, రైలు మార్గాలు నిర్మించాడు. 1868లో ఇంగ్లిష్‌వారు నిజాం రాజ్యం గుండా మద్రాస్ నుంచి బొంబాయికి వేసిన రైలు మార్గానికి పూర్తి సహకారం ఇచ్చాడు. దీనిని హైదరాబాద్‌లోని వాడి, గుల్బర్గాలను కలుపుతూ నిర్మించారు. సాలార్జంగ్ హైదరాబాద్ నుంచి వాడిని కలుపుతూ రైలు మార్గం మొదలుపెట్టి 1878 నాటికి పూర్తిచేశాడు.
- 1862లో పుత్తూరు నుంచి రేణిగుంట వరకు రైల్వేలైన్‌ను నిర్మించారు. హైదరాబాద్ నుంచి షోలాపూర్ వరకు రోడ్డును కూడా నిర్మించాడు. రోడ్లు నిర్మించడానికి పబ్లిక్‌వర్క్స్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేశాడు. జిల్లాలను కలుపుతూ అనేక మార్గాలు నిర్మించాడు. దాంతో హైదరాబాద్ రాజ్యానికి, మిగిలిన భారతదేశానికి రవాణా మార్గాలు ఏర్పడి వర్తక, వ్యాపారాలు అభివృద్ధి చెందాయి.
- హైదరాబాద్, బాంబే, మద్రాస్ మధ్య కమ్యూనికేషన్ మొదలైంది. 1856-87 మధ్యలో హైదరాబాద్, బాంబే, హైదరాబాద్ కర్నూల్ మధ్య టెలిగ్రాఫ్ సౌకర్యం ఏర్పడింది. 1862లో తంతి వ్యవస్థ మొదలైంది. సికింద్రాబాద్ విభాగంలో 200 మైళ్ల లైన్లు అదనంగా వేశారు.
ఇతర సంస్కరణలు
- 1) సతీసహగమనాన్ని, కార్మికుల కట్టుబానిసత్వాన్ని నిషేధించాడు. ఉర్దూను రాజభాషగా చేశాడు. లంచగొండి, అవినీతిపరులైన ఉద్యోగులను దండించాడు. శక్తిసామర్థ్యాలను బట్టి ఉద్యోగాలిచ్చాడు. ఇంగ్లిష్, ఉర్దూ పత్రికలను నిర్వహించాడు. చాదర్‌ఘాట్‌లో పారిశ్రామిక ప్రదర్శనను ఏర్పాటు చేశాడు. ఫలితంగా నిజాం రాజ్యంలో నవచైతన్యం, ఆధునికీకరణ, పరిపాలనా పటిష్టత జరిగాయి. నిజాం రాజ్యంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది.
– అడపా సత్యనారాయణ, విశ్రాంత ఆచార్యులు
Previous article
ఖనిజాల కాణాచి అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? (Groups Special)
Next article
తెలంగాణ చిత్రకళాకారులు – ఘనతలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు