‘దిమ హసావో’ జిల్లాలో వేటిని కనుగొన్నారు? (కరెంట్ అఫైర్స్)
పోటీ పరీక్షల ప్రత్యేకం
రాష్ట్రాలు-వార్తాంశాలు
వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు పోటీ పరీక్షల రీత్యా చాలా కీలకం. అయితే వారం లేదా నెల ముగిసిన తర్వాత, ఒక రాష్ట్రంలో జరిగిన పరిణామాలన్నింటిని ఒక దగ్గరకు చేర్చి చదువుకోవడం వల్ల తేలికగా నేర్చుకోవచ్చు. ఈ ఏడాది జనవరి నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరిగిన పరిణామాలను పరిశీలిద్దాం..
జమ్ముకశ్మీర్
# కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ ఏక గవాక్ష (సింగిల్ విండో) విధానంలో చేరిన తొలి కేంద్రపాలిత ప్రాంతంగా జమ్ముకశ్మీర్ నిలిచింది. వ్యాపారం నిమిత్తం అనుమతులు కావాల్సిన వాళ్లు, ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసే ప్రక్రియే ఏకగవాక్ష పద్ధతి. సత్వర అనుమతులు, పారదర్శకతను పెంచేందుకు దీనిని కేంద్రం తీసుకొచ్చింది.
# జమ్ముకశ్మీర్‌లో రూ.20,000 కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇందులో బనిహాల్-క్వాజిగుండ్ సొరంగ రహదారి, పల్లిలో 500 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్లాంట్, చీనాబ్ నదిపై రాటిల్, క్వార్ హైడల్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ పనులను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది ఏప్రిల్ 24న ప్రారంభించారు.
హిమాచల్ ప్రదేశ్: కొత్త డ్రోన్ విధానాన్ని హిమాచల్ ప్రదేశ్ ప్రకటించింది. ఈ తరహా విధానాన్ని ప్రకటించిన తొలి రాష్ట్రం ఇదే. వివిధ ప్రభుత్వ సేవలను డ్రోన్లను ఉపయోగించి ఇవ్వనున్నారు.
ఉత్తరాఖండ్
# ఉమ్మడి పౌరస్మృతి అమలుకు సంబంధించిన ముసాయిదాను రూపొందించేందుకు అయిదుగురితో కూడిన ఒక కమిటీని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. దీనికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజన దేశాయ్ నేతృత్వం వహించనున్నారు.
# దేశంలో తొలి ద్రవ కటక టెలిస్కోప్ (లిక్విడ్ మిరర్ టెలిస్కోప్)ను ఉత్తరాఖండ్‌లోని దేవస్థల్లో ఏర్పాటు చేశారు. ఆసియాలోనే ఇది అత్యంత ఎత్తులో ఉన్న టెలిస్కోప్. అంతరిక్ష పరిశోధన, అక్కడ జరుగుతున్న వివిధ భౌతిక పరిణామాలను అధ్యయనం చేసేందుకు ఉద్దేశించింది ఇది.
అస్సాం
# అస్సాంలోని దిమ హసావో జిల్లాలో మెగాలిథిక్ స్టోన్ జార్స్‌ను (పెద్ద రాళ్లతో చేసిన జార్లు) కనుగొన్నారు. ఈ తరహా జార్లు ఆగ్నేయాసియా దేశాల్లోనూ గుర్తించారు. భారత ఈశాన్య ప్రాంతం, ఆగ్నేయాసియా ప్రాంతాల మధ్య సారూప్య చారిత్రక, సాంస్కృతిక, జీవన శైలి సంబంధాలను ఇది తెలియజేస్తుంది. అస్సాంలోని నుచుబంగ్లో అనే ప్రాంతంలో 546 జార్లు బయటపడ్డాయి. ఇంత ఎక్కువ సంఖ్యలో ఇవి కనిపించడం ఇదే తొలిసారి.
నాగాలాండ్
# శాసనసభలను కాగితరహితంగా మార్చే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్లో భాగంగా దేశంలో తొలి కాగిత రహిత రాష్ట్రంగా నాగాలాండ్ నిలిచింది.
మేఘాలయ
# మేఘాలయ రాష్ట్రం అమలు చేస్తున్న ఈ-ప్రపోజల్ వ్యవస్థకు ఐక్యరాజ్య సమితి ప్రకటించే వరల్డ్ సమ్మిట్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ సొసైటీ ఫోరం అవార్డ్ దక్కింది. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరిగిన కార్యక్రమంలో మేఘాలయ రాష్ట్రం ఈ అవార్డును అందుకుంది. దీనికి గాను ఆస్ట్రేలియా, చైనా, అర్జెంటీనా, టాంజానియా దేశాలు పోటీ పడ్డాయి.
తమిళనాడు
# వీధి జంతువుల కోసం ఒక అంబులెన్స్‌ను ప్రవేశపెట్టిన భారత దేశపు తొలి రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది.
# నర్సింగై పట్టణంలో తయారయ్యే నాగస్వరానికి ఈ ఏడాది భౌగోళిక గుర్తింపు లభించింది.
# ఒకటి నుంచి అయిదో తరగతి వరకు ప్రాథమిక తరగతుల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంతో పాటు ఉదయం అల్పాహారం ఇవ్వాలని తమిళనాడు రాష్ట్రం నిర్ణయించింది, ఈ తరహా నిర్ణయం తీసుకున్న తొలి రాష్ట్రం తమిళనాడే.
# భారత రైల్వేల్లో ప్రైవేట్ రైళ్లను భారత్ గౌరవ్ పేరుతో ప్రవేశపెట్టారు. దేశంలో తొలి ప్రైవేట్ రైలు కోయంబత్తూర్, షిర్డీల మధ్య ప్రారంభమయ్యింది.
కేరళ
# రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘ఓవర్ ది టాప్ ప్లాట్‌ఫామ్ (ఓటీటీ)’ ఈ ఏడాది నవంబర్ 1న ప్రారంభం కానుంది. ఈ విధంగా దేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఓటీటీని ప్రారంభించడం ఇదే ప్రథమం. దీనికి cspace అని పేరు పెట్టారు.
# భారత దేశంలో తొలి న్యాప్కిన్ రహిత గ్రామంగా కుంబలంగి నిలిచింది. ఈ గ్రామం కేరళలో ఉంది.
# భారత దేశంలోనే తొలి వాటర్ మెట్రో ప్రాజెక్టును కేరళలోని కొచ్చిలో ప్రారంభించారు. దీనికి ముజిరిస్ అని పేరు పెట్టారు. బ్యాటరీతో నడిచే 23 పడవలను కొచ్చిన్ షిప్‌యార్డ్ అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు చేసిన వ్యయం రూ.747 కోట్లు. దీనిని కొచ్చి వాటర్ మెట్రో లిమిటెడ్ నిర్వహిస్తుంది.
# భారత దేశంలోనే తొలి గ్రాఫీన్ ఇన్నోవేషన్ లిమిటెడ్ సెంటర్‌ను కేరళలో ఏర్పాటు చేశారు. గ్రాఫీన్ కోసం భారతదేశంలో ఏర్పాటైన తొలి పరిశోధనశాల ఇదే. కేరళలోని డిజిటల్ యూనివర్సిటీ, అలాగే సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్టానిక్స్ టెక్నాలజీ, టాటా స్టీల్‌లు సంయుక్తంగా దీనిని ప్రారంభించాయి.
# భారత దేశపు తొలి దేశీయ డ్రెడ్జర్‌ను కేరళలో తయారు చేయనున్నారు. డ్రెడ్జర్ అంటే జలాశయాల్లో పూడికను తీసే యంత్రం. ఇందుకు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. 34 నెలల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు. ఇందుకు కానున్న వ్యయం రూ.920 కోట్లు.
# కార్బన్ తటస్థ వ్యవసాయ విధానాన్ని తీసుకురావాలని కేరళ నిర్ణయించింది. భారత దేశంలో ఈ తరహా నిర్ణయం తీసుకున్న తొలి రాష్ట్రం ఇదే. ఈ తరహా వ్యవసాయం నేలకు మంచిది. 2022-23 బడ్జెట్లో ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.6 కోట్లను వెచ్చించనుంది. రాష్ట్రంలోని 13 గిరిజన ప్రాంతాల్లో దీనిని ప్రయోగాత్మకంగా అమలుచేయనున్నారు. విజయవంతం అయితే రాష్ట్రమంతా విస్తరిస్తారు. రెండో దశలో మొత్తం 140 శాసనసభ నియోజకవర్గాల్లో అమలు చేస్తారు.
కర్ణాటక
# FRUITS అనే పేరుతో కర్ణాటక రాష్ట్రం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. దీని పూర్తి రూపం ‘ది ఫార్మర్ రిజిస్ట్రేషన్ యూనిఫైడ్ బెనిఫిషియరీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్’. ఆధార్‌తో అనుసంధానం అయి ఉంటుంది. పథకాలకు సంబంధించి ఇది ఏక గవాక్ష పద్ధతిలో నిర్వహిస్తుంది.
# కర్ణాటక రాజధాని బెంగళూర్‌లో ఉన్న విశ్వేశ్వరయ్య రైల్వే టెర్మినల్‌ను ‘ఏసీ’గా అందుబాటులోకి తెచ్చారు. ఇందుకు రూ.314 కోట్లు వెచ్చించారు. దీనికి సౌర రూఫ్‌టాప్ ప్యానెళ్లు ఉంటాయి. ఇది భారత దేశంలో మొట్టమొదటి ఏసీ రైల్వే టెర్మినల్.
# పాల ఉత్పత్తిదారుల కోసం దేశంలోనే తొలిసారిగా నందిని క్షీర సమృద్ధి సహకార బ్యాంక్‌ను కర్ణాటకలో ప్రారంభించారు. కేవలం పాల ఉత్పత్తిదారుల కోసం మాత్రమే పనిచేసే దేశంలోని ఏకైక బ్యాంక్ ఇదే.
# భారత దేశంలో మొట్టమొదటి ఏవీజీసీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను కర్ణాటకలో ప్రారంభించారు. ఏవీజీసీ అంటే యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్, గేమింగ్, కామిక్స్. బెంగళూర్‌లో ఇది అందుబాటులోకి వచ్చింది.
# ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సైబర్ దాడులను ఎదుర్కొనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్ (ఐబీఎం) సంస్థ సైబర్ సెక్యూరిటీ హబ్‌ను ప్రారంభించింది. ఇది బెంగళూర్ కేంద్రంగా పనిచేస్తుంది. ఐబీఎం సంస్థకు ఈ తరహా కేంద్రం అమెరికాలో మాత్రమే ఉంది. ఆ తర్వాత కేంద్రం భారత్‌లోని బెంగళూర్లోనే నెలకొంది.
గోవా
# నేషనల్ మ్యూజియం ఆఫ్ కస్టమ్స్ అండ్ జీఎస్టీని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గోవాలో ప్రారంభించారు. దీనికి దరోహర్ అని పేరు పెట్టారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఇది ప్రారంభమైంది.
మహారాష్ట్ర
# కవ్తీ అనే పేరుతో జైలులోని ఖైదీలకు రుణాలను ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో ఈ తరహా నిర్ణయం తీసుకున్న మొట్టమొదటి రాష్ట్రం మహారాష్ట్ర. 7 శాతం వడ్డీతో రూ.50,000 ఖైదీలకు రుణం ఇవ్వనున్నారు. తొలిసారిగా ప్రయోగాత్మకంగా పుణెలోని ఎరవాడ జైలులో అమలు చేయనున్నారు. ఖైదీ కుటుంబానికి న్యాయ ఖర్చులకు ఇది ఉపయోగపడుతుంది.
# భారత దేశంలో తొలిసారిగా మహారాష్ట్రలో మైగ్రేషన్ ట్రాకింగ్ సిస్టమ్ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తేనున్నారు. వలస కార్మికులు ఎక్కడకు వెళ్తున్నారో తెలుసుకొనేందుకు ఇది ఉపయోగపడుతుంది. ప్రతి వలస కార్మికుడికి ఒక ప్రత్యేక సంఖ్యను కేటాయిస్తారు. వాటి ద్వారా పథకాలను కూడా అమలు చేసేందుకు వీలుంటుంది.
# భారత దేశంలోనే తొలిసారిగా జీన్ బ్యాంక్ ప్రాజెక్ట్ మహారాష్ట్రలో రానుంది. దీని ఏర్పాటుకు ఆ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. జన్యు వనరులను ఇందులో పరిరక్షిస్తారు. జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు ఇది ఉపయోగ పడుతుంది. విత్తనాలు, స్థానిక పంటలు, జంతు వైవిధ్యాన్ని కూడా కాపాడవచ్చు. రానున్న అయిదేళ్లలో రూ.172.39 కోట్లను వెచ్చించనున్నారు. మహారాష్ట్ర జీవ వైవిధ్య బోర్డ్ దీనిని అమలు చేయనుంది.
# భారత దేశంలో మొట్టమొదటి వాటర్ ట్యాక్సీని మహారాష్ట్రలో అందుబాటులోకి తెచ్చారు. నవీ ముంబయి, ముంబయి ప్రధాన భూభాగాలను ఇది కలుపుతుంది. అత్యంత వేగంగా, విశ్వసనీయ రవాణా వ్యవస్థగా దీనిని చెబుతున్నారు.
# 2023లో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సమావేశం ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్నారు. గతంలో ఈ సమావేశం భారత్‌లో 1983లో జరిగింది. న్యూఢిల్లీ అప్పట్లో వేదికగా ఉంది. 101 మంది ఓటింగ్ సభ్యులతో పాటు 45 మంది గౌరవ సభ్యులు కూడా ఇందులో పాల్గొంటారు. ఈ కమిటీలో భారత్ తరఫున నీతా అంబాని ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
# భారత దేశంలోనే తొలిసారిగా జీవ సురక్షిత కంటెయిన్మెంట్ మొబైల్ ల్యాబొరేటరీ మహారాష్ట్రలోని నాసిక్‌లో అందుబాటులోకి వచ్చింది. కొత్తగా పుట్టుకొస్తున్న వైరస్ల అధ్యయనంతో పాటు వేగంగా పరీక్షలు నిర్వహించేం దుకు ఇది ఉపయోగపడుతుంది. ఐసీఎంఆర్‌లో ప్రత్యేకంగా శిక్షణ పొందిన వాళ్లు ఇందులో ఉంటారు.
# పుణెలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ ప్రాంగణంలో ఇంటర్నేషనల్ మాన్సూన్ ప్రాజెక్ట్ ఆఫీస్‌ను ఏర్పాటు చేశారు. కేంద్ర భూ శాస్త్ర మంత్రి జితేంద్ర సింగ్ దీనిని ప్రారంభించారు. జాతీయ సైన్స్ దినోత్సవం అయిన ఫిబ్రవరి 28న ఇది ప్రారంభమయ్యింది. రుతు పవన వ్యవస్థ పరిశోధన పెంపు, పరిజ్ఞానాన్ని పంచుకొనేందుకు ఇది ఉపయోగపడుతుంది.
# ఈ ఏడాది మార్చి 6న పుణె మెట్రో రైలు ప్రాజెక్టును భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. రూ.11,420 కోట్ల వ్యయంతో దీనిని అందుబాటులోకి తెచ్చారు. దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన అల్యూమినియం కోచ్‌లు ఉన్న ఏకైక మెట్రో పుణెలోనే ఉంది. ఈ నగరంలో మెట్రో పొడవు 33.2 కిలోమీటర్లు. 30 స్టేషన్లు ఉన్నాయి.
గుజరాత్
# మాధవ్‌పూర్ గేద్ అనే కార్యక్రమాన్ని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఏప్రిల్ 10న ప్రారంభించారు. అయిదు రోజుల పాటు ఇది కొనసాగింది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, గుజరాత్ ప్రభుత్వాలు సంయుక్తంగా దీనిని నిర్వహిస్తున్నాయి. 2018 నుంచి ఈ సాంస్కృతిక ఉత్సవం నిర్వహిస్తున్నారు.
# భూమిని పరిరక్షించేందుకు ఉద్దేశించిన ఒక కార్యక్రమం కోసం గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం, ఈషా ఫౌండేషన్లు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా సద్గురు జగ్గీ వాసుదేవ్ 100 రోజుల పాటు మోటార్ సైకిల్ యాత్ర చేయనున్నారు. 30,000 కిలోమీటర్ల ఈ యాత్ర యూరప్, మధ్య ప్రాచ్య ఆసియాల గుండా వెళుతుంది. ‘సేవ్ సాయిల్’ పేరుతో యాత్ర కొనసాగుతుంది. భూమి పరిరక్షణపై అవగాహన కల్పిస్తారు.
# ఒలింపిక్స్ స్థాయి క్రీడల నిర్వహణకు అనుగుణంగా అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ క్రీడా ప్రాంగణాన్ని మార్చనున్నారు. ఇందుకు మే 29న పనులను ప్రారంభించారు. రూ.632 కోట్లతో ప్రారంభమైన ఈ పనులను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారు.
# ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా సాగర్ పరిక్రమ అనే కార్యక్రమాన్ని గుజరాత్లో కేంద్రం ప్రారంభించింది. మత్స్యకారుల సవాళ్లు, సమస్యలను తెలుసుకొనేందుకు ఇది ఉద్దేశించింది. మొత్తం తొమ్మిది తీర రాష్ట్రాల్లో దీనిని అమలు చేయనున్నారు.
# భారత దేశపు మొట్టమొదటి స్టీల్ రోడ్‌ను గుజరాత్‌లోని సూరత్‌లో నిర్మించారు. ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్, సీఎస్ఐఆర్, సీఆర్ఆర్ఐ, నీతి ఆయోగ్ ఈ రహదారి నిర్మాణంలో పాత్ర వహించాయి. ఇది కిలోమీటర్ పొడవు ఉంటుంది. ఇది ఆరు లేన్ల రహదారి.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ
ఎడ్యు రిపబ్లిక్
9849212411
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?