ఓటమెరుగని ధీరులు–కాకతీయ రాజులు
శాతవాహనుల తర్వాత తెలుగు దేశాన్నంతా ఒక రాజకీయ ఛత్రం క్రిందకు తెచ్చి దేశ సమగ్రత, సమైక్యతను చేకూర్చిన తెలుగుపాలకులు కాకతీయులు. దేశ చరిత్రలో కాకతీయులకు ఒక ప్రత్యేక, విశిష్టమైన స్థానం ఉంది. వీరు విశాల సామ్రాజ్యాన్ని పాలించడమే కాక పటిష్ట పరిపాలనావ్యవస్థను ప్రవేశపెట్టి వ్యవసాయానికి నీటి వనరులు కల్పించి,గ్రామీణ జనజీవితాలలో కళా సాహిత్యాలను సజీవపరిచి, విశిష్టమైన దేవాలయ నిర్మాణాలను కావించి, తెలుగువారి రాజకీయ, సాంస్కృతిక వారసత్వ జీవనానికి తోడ్పడినారు.
రుద్రదేవుడు (1158 – 1195)
ప్రసిద్ధులైన కాకతీయులలో రుద్రదేవుడు మొదటివాడు. పరాక్రమ శాలి. రాజనీతి చతురుడు. ఇతనినే మొదటి ప్రతాపరుద్రుడు అని కూడా అంటారు. ఇతని అనేక శాసనాలలో అనుమకొండ శాసనం (వేయి స్తంభాలగుడి) ప్రసిద్ధమైన చారిత్రికాధారము. రుద్రదేవుడు కాకతీయుల రాజ్యాన్ని విస్తరించి సుస్థిరం చేశాడు. ప్రోలరాజు మొదలుపెట్టిన దిగ్విజయ యాత్రలను ముందుకు తీసుకెళ్ళాడు. పశ్చిమ చాళుక్యుల సార్వభౌమత్వానికి వారసుడుగా బిజ్జలుడు కాకతీయులను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు. మరో ప్రక్క కాకతీయుల విజృంభణపై అసూయాగ్రస్తులైన చాళుక్య సామంతులు కాకతీయులపై కత్తిగట్టారు. అసమానమైన రాజనీతితో వీరందరిని ఎదుర్కొని రుద్రదేవుడు కాకతీయులకు సంపూర్ణ స్వాతంత్ర్యం సాధించాడు.
మహాదేవుడు (క్రీ. శ. 1195 – 1199)
రుద్రదేవుని సోదరుడు మహాదేవుడు దేవగిరి యాదవులపై పగసాధించవలెనని ప్రయత్నించి విఫలుడయ్యాడు. రుద్రునికి సంతానం లేనందున మహాదేవుని కొడుకు గణపతిదేవుని దత్తత తీసికొన్నాడు. బహుశా రుద్రదేవుడు మరణించినపుడే గణపతిదేవుడు దేవగిరి యాదవులకు బందీగా చిక్కి ఉంటాడు. అతనిని విడిపించే ప్రయత్నంలోనే మహాదేవుడు దేవగిరిపై దండెత్తి ఆయుద్ధంలో (ఏనుగు మీద ఉండి యుధ్ధాన్ని నడిపిస్తూ) మరణించాడు. మహాదేవుడు శైవ మతాబిమాని. ధృవేశహవర పండితుడు అతని దీక్షా గురువు. మహాదేవుని మరణానంతరం క్రీ. శ. 1198లో మహాదేవుని కొడుకు (రుద్రదేవుని దత్తపుత్రుడు) గణపతి దేవుడు కాకతీయ సింహాసనాన్ని అధిష్టించాడు.
గణపతిదేవుడు (క్రీ. శ. 1199 – 1262)
గణపతి దేవుడు రాజ్యానికి రావడానికి ముందు 12 సంవత్సరాలు దేవగిరి యాదవులకు బందీగా ఉండి విడుదల చేయబడ్డాడు. ఈలోగా కాకతీయ సామంతులు చేసిన తిరుగుబాట్లను రేచర్ల రుద్రుడు అనే విశ్వాసపాత్రుడైన సేనాని అణచి రాజ్యాన్ని గణపతిదేవునికి అప్పగించాడు. గణపతిదేవుడు మహావీరుడు. దూరదృష్టి ఉన్న రాజనీతిజ్ఞుడు. అప్పటికి దక్షిణాన పాండ్యులు, పశ్చిమాన హొయసల, యాదవ రాజులు, ఉత్తరదేశంలో తురుష్కులు బలవంతులై ఆంధ్రప్రాంతాన్ని చుట్టుముట్టి ఉన్నారు. రాగల ప్రమాదాన్ని గుర్తించిన గణపతిదేవుడు ఆంధ్రదేశాన్ని ఐక్యము చేయడానికి విజయయాత్రలు ప్రారంభించాడు. అయితే ఓడిపోయిన రాజులను తొలగించలేదు. వారితో సంబంధాలు కలుపుకొని వారి సామంత ప్రతిపత్తిని కొనసాగించాడు. ఈ సామంతులు కాకతీయులకు అండగా నిలిచారు.
గణపతిదేవుని కాలంలో ఓరుగల్లు రాజదాని వైభవం పెరిగింది. అనేక చెరువులు, ఆలయాల నిర్మాణం జరిగింది. అనేక గణపవరాలు వెలిశాయి. విదేశీ వాణిజ్యం వర్ధిల్లింది. మోటుపల్లి రేవు ప్రసిద్ధిగాంచింది. శిల్ప వస్తువు ప్రభవించింది. రామప్ప దేవాలయనిర్మాణం ఈ కాలంలో జరిగినదే.
రుద్రమదేవి (1269 – 1289)
గణపతిదేవునికి పుత్రులు లేనందున కూతురు రుద్రమదేవికి పురుషోచిత విద్యలు నేర్పి “రుద్రదేవ మహారాజు”గా సింహాసనాన్ని అప్పగించాడు. ఆంధ్రదేశమంతటినీ ఒక స్త్రీ అసమాన ధైర్య సాహసాలతో సమర్ధవంతంగా పాలించడం వలన ఈ ఘట్టం తెలుగువారి చరిత్రలో ముఖ్యమైనది.
రుద్రమదేవి పాలనాకాలమంతా యుద్ధాలతోనే సరిపోయింది. రుద్రమదేవికి ముందుగా స్త్రీ పరిపాలన సహించని సామంతులనుండి, దాయాదులనుండి ప్రతిఘటన ఎదురయ్యింది. అదే సమయంలో దేవగిరి యాదవరాజు దండెత్తి వచ్చాడు. ఈ రెండు విపత్తులనూ ఆమె సమర్ధవంతంగా ఎదుర్కొంది. ఈ పోరాటాలలో ఆమెకు బాసటగా నిలిచిన సేనానులు చరిత్రలో చిరస్మరణీయులయ్యారు. వారిలో కొందరు – గోన గన్నారెడ్డి, రేచర్ల ప్రసాదాదిత్యుడు, రుద్రనాయకుడు , జన్నిగదేవుడు, త్రిపురాంతకుడు , బెండపూడి అన్నయ్య.
తరువాత తూర్పున గంగ నరసింహదేవుడు వేంగి ప్రాంతాన్ని (క్రీ. శ. 1262లో) ఆక్రమించాడు. కాని పోతినాయక, ప్రోలినాయకులు వారిని ఓడించి క్రీ.శ. 1278లో వేంగిలో తిరిగి కాకతీయుల అధికారం నెలకొల్పారు. ఇంతలో దేవగిరి యాదవ మహాదేవుడు దండెత్తాడు. అతనినోడించి రుద్రమదేవి పరిహారాన్ని గ్రహించింది.
త్రిపురాంతకం వద్ద అంబదేవుడితో జరిగిన యుద్ధంలో రుద్రమదేవి మరణించింది. ఆమెను యుద్ధానికి మల్లికార్జునుడు అనే సేనాని తీసుకువెళ్లాడు. అంబదేవుడి దాడిలో సేనాని కూడా చనిపోయాడు. ఇది 1289లో జరిగింది. ఈ ఘటన జరిగిన తర్వాత 11వ రోజున మల్లికార్జునుడి కుమారుడు చెందుబట్ల శాసనం వేయించాడు. రుద్రమదేవి ఎప్పుడు చనిపోయిందో ఆ శాసనంలో స్పష్టంగా ఉంది.
నిరంతరం యుద్ధాలలో ఉన్నాగాని రుద్రమదేవి చాలా సమర్ధవంతంగా పాలన నిర్వహించింది. ఓరుగల్లు కోటను దుర్భేద్యంగా బలపరచింది. దేశం సుభిక్షంగా ఉంది. ఆమె కాలంలోనే వెనిస్ యాత్రికుడు మోటుపల్లి రేవులో దిగాడు. దేశంలో పాలన కట్టుదిట్టంగా ఉందని, పరిశ్రమలు, వాణిజ్యం వర్ధిల్లుతున్నాయని వర్ణించాడు.
ప్రతాపరుద్రుడు (1289 – 1323)
ప్రతాపరుద్రుడు రుద్రమదేవి మనుమడు (కూతురు కొడుకు). రుద్రమదేవి ఈయన్ను వారసునిగా చేసుకోవటానికి దత్తత తీసుకొంది. క్రీ. శ. 1289లో కాయస్థ సేనాని అంబదేవుని తిరుగుబాటు అణచు ప్రయత్నములో రుద్రమదేవి మరణించింది. ప్రతాపరుద్రుడు సింహాసనమధిష్ఠించాడు. ప్రతాపరుద్రుని పరిపాలనాకాలమంత యుద్ధములతోనే గడచింది. అంబదేవుని, నెల్లూరులో మనుమగండుని, కర్ణాటక రాజులను జయించి రాజ్యము కట్టుదిట్టము చేశాడు. ఇంతలో ఉత్తర దేశమునుండి కొత్త ఉపద్రవము ముంచుకొచ్చింది. క్రీ.శ. 1309, 1318, 1320 లో ఢిల్లీ సుల్తాను అలా ఉద్దీన్ ఖిల్జీ మూడు సార్లు దాడి చేసి విఫలమయ్యాడు. క్రీ. శ. 1323లో జరిగిన నాలుగవ యుద్ధములో ప్రతాపరుద్రునికి అపజయము సంభవించింది.
ప్రతాపరుద్రుడిది ఆత్మహత్య అనటానికి కూడా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. మహ్మదీయ సేనల చేతిలో బందీకావటం ఇష్టం లేక ప్రతాపరుద్రుడు ఆత్మహత్య చేసుకున్నాడని అనితల్లిరెడ్డి వేయించిన శాసనం చెబుతోంది. ఈ శాసనంలో ‘స్వేచ్ఛఐవ’ అని ఉంటుంది. అంటే ఆత్మహుతి చేసుకున్నాడని అర్థం.
కాకతీయ కాలంలో తెలంగాణ సిరిసంపదలతో తులతూగుతున్నట్లు అమీర ఖుస్రూ, అబ్దున్నా వాసఫ్, మార్కోపోలో వంటి విదేశీ యాత్రికుల రచనల వల్ల తెలుస్తుంది. వ్యవసాయమే నాడు తెలుగువారి ప్రధాన వృత్తి. వ్యవసాయం చాలావరకు వర్షాధారమే, అయితే కాకతీయ రాజులు, రాణులు, సామంతులు పెద్ద చెరువులు, కాలువలు తవ్వించి, నీటి పారుదల సౌకర్యాలు కల్పించారు. రామప్పచెరువు, కే సముద్రం, పాకాల చెరువు, కాటసముద్రం, చౌడ సముద్రం, సబ్బి సముద్రం, జగత్కేసరి సముద్రం ఉదాహరణలు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు