1857 తిరుగుబాటు నాయకుడు తుర్రెబాజ్‌ఖాన్
సికిందర్ జా (క్రీ.శ. 1803-1829)
-నిజాం అలీ కుమారుడు సికిందర్ జా. ఇతని బిరుదు మూడో అసఫ్ జా. సికిందర్ పేరుతో వెల్సిందే సికింద్రాబాద్. ఇతడి కాలంలో అరిస్తోజు (అలీం ఉల్ ఉమర్), మీర్ ఆలం, చందూలాల్‌లు దివానులుగా పని చేశారు (మీర్ ఆలం క్రీ.శ. 1808లో మరణించాడు), మీర్ ఆలం చెరువు నిర్మించబడింది. చందూలాల్ క్షత్రియ వంశానికి చెందినవాడు.
-నిజాం సైనిక నిర్వహణకుగాను ఆంగ్లేయులకు సంబంధించిన పామర్ సంస్థ నుంచి రూ. 60 లక్షలు అప్పుగా తీసుకున్నది సికిందర్జా. దీన్ని అవకాశంగా తీసుకొని బ్రిటీష్‌వారు నిజాం ఆంతరంగిక వ్యవహారాల్లో ము ఖ్యంగా పరిపాలనలో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టారు. ఇక్కడ రస్సెల్స్ బ్రిగేడ్ లేదా రస్సెల్స్ దళం గురించి ప్రస్తావించాలి. క్రీ.శ. 1811లో హెన్సీ రస్సెల్స్ బ్రిటీష్‌వారి ప్రతినిధిగా హైదరాబాద్‌కు వచ్చాడు. ఇతడే 1816లో రస్సెల్స్ దళాన్ని స్థాపించాడు. రస్సెల్స్ దళం నిర్వహణ ఖర్చు పెరగడం వల్ల పామర్ కంపెనీ నుంచి రూ. 60 లక్షలు అప్పు చేయాల్సి వచ్చింది. ఈ రస్సెల్ బ్రిగేడ్ కాలక్రమేణా హైదరాబాద్ కంటింజెంట్‌గా రూపాంతరం చెందింది. (పామర్ అండ్ కం పెనీ వ్యవస్థాపకుడు విలియం పామర్. ఇతడి తండ్రి జనరల్ పామర్, తల్లి లక్నో నగరానికి చెందిన ముస్లిం మహిళ. పామర్ అండ్ కంపెనీ అనేది ఒక వాణిజ్య సంస్థ). చివరకు రూ. 30 లక్షల ఆదాయం వచ్చే బీరారు జిల్లాను కౌలుకు ఇచ్చాడు.
-క్రీ.శ. 1820లో చార్లెస్ మెట్కాఫ్ బ్రిటీష్ ప్రతినిధిగా వచ్చి నిజాం ఆర్థిక పరిస్థితిని తెలుసుకొని, దానిని సరిదిద్దడానికి అనేక సంస్కరణలను ప్రవేశపెట్టాడు. కానీ ఈ సంస్కరణలు చందూలాల్‌కు ఇష్టంలేదు.
-సికిందర్జా 1829 మే 21న మరణించాడు.
వహబీ ఉద్యమం
-నాసిరుద్దౌలా కాలంలో జరిగిన ముఖ్య సంఘటనల్లో వహబీ ఉద్యమం ఒకటి. ఈ ఉద్యమానికి నాయకుడు సయ్యద్ అహ్మద్ బరేలి. ముఖ్యంగా ఈ ఉద్యమం ఉత్తర భారతదేశంలో ప్రారంభమైంది. 19వ శతాబ్దంలో బ్రిటీషువారికి వ్యతిరేకంగా జరిగింది. ఈ ఉద్యమాన్ని ముస్లింలు చేపట్టారు. హైదరాబాద్, నెల్లూరు, కర్నూలులో ఈ ఉద్యమ సానుభూతిపరులు ఉండేవారు. కర్నూలు నవాబు అయిన గులాం రసూల్ఖాన్తోపాటు నిజాం సోదరుడైన ముబారిజుద్దౌలా ఈ ఉద్యమానికి మద్దతు తెలపడమేగాకుండా నాయకత్వం వహించా రు. ముబారిజుద్దౌలాను పట్టుకొని గోల్కొండకోటలో బంధించారు. గులాం రసూల్‌ను తిరుచినాపల్లిలో ఖైదు చేశారు.
-గమనిక: తెలంగాణలో అసలు జాతీయోద్యమం లేదని మొండిగా వాదిస్తున్నవారికి సమాధానమే ఈ ముబారిజుద్దౌలా పోరాటం. దీనిని విద్యార్థులు గ్రహించాలి.
బీరారు దత్తత
-నాటి బ్రిటీషు గవర్నర్ జనరల్ అయిన లార్డ్ డల్హౌసీ సామ్రాజ్యవాది. బ్రిటీష్ కంపెనీ సామ్రాజ్యాన్ని విస్తరింపజేయాలనే ఆశయంతో ఉన్నవాడు. తమకు రావాల్సిన అప్పుకింద బీరారు ప్రాంతాన్ని దత్తం చేయాల్సిందిగా హైదరాబాద్ నిజాంకు సూచించాడు. ఈ ప్రతిపాదన నచ్చని నిజాం కొంత అప్పును తీర్చాడు. మిగతా అప్పును 21 మే 1853లోగా చెల్లిస్తానని అంగీకరించాడు. అయితే తన ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో అప్పు తీర్చలేకపోయాడు. దీంతో బీరారు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒడంబడిక 1853, మే 21న జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం బీరారుతోపాటు ధారాశివ్, రాయచూర్‌లను కంపెనీకి దత్తం చేశాడు. ఈ ఒప్పందం నచ్చని నాటి దివాన్ సిరాజ్-ఉల్-ముల్క్ అవమానభారంతో చనిపోయాడు.
అఫ్జల్-ఉద్-దౌలా
-మీర్ తహనియత్ అలీఖాన్ అఫ్జల్ ఉద్దౌలా 11 అక్టోబర్ 1821న జన్మించాడు. నాసిరుద్దౌలా అనంతరం అతడి కు మారుడైన అఫ్జల్ ఉద్దౌలా హైదరాబాద్ అధికార బాధ్య తలు చేపట్టాడు. భారతదేశంలో సిపాయిల తిరుగుబాటు జరుగుతున్న సమయంలో రాజ్యాని కి వచ్చాడు. బ్రిటీషువారికి వ్యతిరేకంగా నిజాం రాష్ట్రంలో అలజడి చెలరేగింది. రోహిల్లాలు హైదరాబా ద్ రెసిడెన్సీపై దాడి చేశారు. హైదరాబాద్‌లో జరిగిన బ్రిటీషు వ్యతిరేక ఉద్యమానికి మౌల్వీ అల్లాఉద్దీన్, మౌల్వీ ఇబ్రహీం, తుర్రెబాజ్‌ఖాన్ మొదలైన దేశభక్తులు ప్రజలకు నాయకత్వం వహించి 1857 సిపాయిల తిరుగుబా టును నడిపారు. ఈ క్రమంలోనే కర్నూలు, కడప, విశాఖపట్నం, ఔరంగాబాద్, హైదరాబాద్‌లలో కొన్ని సంఘటనలు జరిగాయి. హైదరాబాద్, సికింద్రాబాద్లు ఈ ఉద్యమానికి కేంద్రాలుగా పనిచేశాయి.
బ్రిటీషువారికి మద్దతు పలికిన సాలార్జంగ్
-1857 సిపాయిల తిరుగుబాటు హైదరాబాద్ నగరం లో ప్రారంభమైందని రాజా నరేందర్ బహదూర్ ద్వా రా తెలుసుకున్న సాలార్జంగ్ ఉద్యమాన్ని అణచి, బ్రిటీషువారికి సహకరించేలా చర్యలు తీసుకున్నాడు. హైదరాబాద్ నగరంలో వ్యాపించిన ఉద్యమానికి మౌల్వీ ఇబ్రహీం, మౌల్వీ అల్లాఉద్దీన్ నాయకత్వం వహించారు. ఉద్యమకారులు ప్రజల మద్దతు తీసుకొని మసీదు గోడలకు ప్రకటనలతో కూడిన కాగితాలను అతికించారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ప్రజలు నిర్వహిం చే ఉద్యమానికి నిజాం ప్రభువు నాయకత్వం వహించాలని ఆ ప్రకటనలో కోరారు. అయితే నిజాం ప్రభువు ప్రజలకు మద్దతు తెలపడానికి సిద్ధంగా లేడు. పైగా ప్రజలతో ఉద్యమాన్ని విరమింపజేసే ప్రయత్నాలు తీవ్రతరం చేశాడు. అంతేగాకుండా ఉద్యమ నాయకుల్ని మందలించి కఠిన శిక్షలు విధిస్తానని హెచ్చరించాడు.
నిజాంకు కలిగిన ప్రయోజనాలు
-1857 తిరుగుబాటు సమయంలో సంపూర్ణ సహకారం అందించిన హైదరాబాద్ నిజాం అఫ్జల్ ఉద్దౌలాకు విక్టోరియా మహరాణి గ్రాండ్ కమాండర్ స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదును ఇచ్చింది. ఈ బిరుదును రెసిడెంట్ డేవిడ్సన్ నిజాంకు ఒక ప్రత్యేక దర్బారులో అందజేశారు. అలాగే తమకు ఇవ్వాల్సిన రూ.50 లక్షల అప్పును రద్దు చేశారు బ్రిటీషువారు. అదేవిధంగా నిజాం రాజ్యంలో రాయచూరు, గుల్బర్గాలు చేర్చబడినాయి. ఈ విధంగా నిజాం ఆంగ్లేయులకు ఆత్మీయుడిగా మారాడు.
-నిజాం బ్రిటీషువారికి విధేయుడిగా ఉండటం ప్రజలకు నచ్చలేదు. గవర్నర్ జనరల్‌లు ఇచ్చే ప్రశంసాపత్రాన్ని రెసిడెంటు నిజాం దగ్గరికి తీసుకుపోతున్నప్పుడు జహంగీర్‌ఖాన్ రెసిడెంట్‌పై హఠాత్తుగా దాడి చేశాడు. కానీ అది గురి తప్పింది. పట్టుబడిన రోహిల్లా వీరుడైన జహంగీర్‌ఖాన్ విప్లవజాడలు తెలుపకుండా ఎన్నో చిత్రహింసలు భరించాడు. బ్రిటీషువారి సలహా మేరకు మొఘల్ చక్రవర్తియైన రెండో బహుదూర్షా నాణేలపై తన పేరు తొలగించి వాటి స్థానంలో నిజాం పేరును ముద్రించాడు. దీని ప్రకారం నాణేలపై నిజాం-ఉల్-ముల్క్ అసఫ్‌జా బహదూర్ అని ఒకవైపు, జులుస్ మైమనత్ జర్బ్ ఫర్కుందా బున్యాద్ హైదరాబాద్ అని మరో వైపు ముద్రించారు. ఆంగ్లేయుల సలహా మేరకు హోలీ సిక్కా పేరుతో నాణేల్ని ముద్రించారు. ఇది బ్రిటీషు ప్రభుత్వం రూపాయి కంటే 15 శాతం విలువ తక్కువ. కొత్త నాణేల్ని ముద్రించేందుకు కేంద్ర ద్రవ్య ముద్రణాలయాన్ని హైదరాబాద్‌లో నెలకొల్పారు.
నాసిర్-ఉద్-దౌలా (నాసిరుద్దౌలా)
-ఇతడు సికిందర్ జా కుమారుడు. సికిందర్జా మరణానంతరం అధికారంలోకి వచ్చాడు. క్రీ.శ. 1829 నుంచి 1857 వరకు పరిపాలించాడు. ఇతడినే నాల్గో అసఫ్‌జా అని పిలుస్తారు. ఈయన బిరుదులు
1) రుస్తుమేదౌరా, 2) ఫతేజంగ్
3) అరస్తుయెజమా, 4) ముజఫర్ ఉల్‌ముల్క్
5) నిజాముద్దౌలా
-నాసిరుద్దౌలా పాలనాకాలంలో హైదరాబాద్ ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారింది. దీనికి కారకుడు చందూలాల్. ఆయన చేసిన అవకతవకల వల్ల హైదరాబాద్ ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. సమర్థులైన అధికారుల్ని నియమించుకొని హైదరాబాద్ రాజ్య ఆర్థిక పరిస్థితుల్ని చక్కదిద్దుకోవాల్సిందిగా నాసిరుద్దౌలాకు ఆంగ్లేయులు సలహాలు ఇచ్చారు. క్రీ.శ. 1836లో హైదరాబాద్‌లో బ్రిటీష్ రెడిడెంట్గా ఫ్రేజర్ నియమితుడయ్యాడు. బ్రిటీష్‌వారు సిరాజ్-ఉల్-ముల్క్‌ను దివానుగా నియమించాల్సిందిగా నాసిరుద్దౌలాను ఒత్తిడి చేశారు. బ్రిటీష్‌వారి ఒత్తిడి మేరకు సిరాజ్-ఉల్-ముల్క్‌ను దివానుగా నియమించినప్పటికీ, అతడు ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడంలో విఫలమయ్యాడు.
-హైదరాబాద్ రాజ్యంలో రోహిల్లాలు, అరబ్బులు అధిక సంఖ్యలో ఉండేవారు. ప్రజలు, ప్రభుత్వంవీరి నుంచి రుణాలు తీసుకుంటుండేవారు. నాసిరుద్దౌలా రూ.4 కోట్లు అప్పుచేసి ప్రభుత్వాన్ని అతికష్టంమీద నడిపేవాడు.
సాలార్జంగ్-1
-సిరాజుల్ముల్క్ అనంతరం సాలార్జంగ్ దివాన్‌గా నియమితులయ్యాడు. ఇతడి అసలు పేరు మీర్ తురబ్ అలీఖాన్. క్రీ.శ. 1853 మే 31న దివాను అయ్యాడు. క్రీ.శ. 1883 వరకు కొనసాగాడు. ఇతడే సాలార్జంగ్గా ప్రసిద్ధిగాంచాడు. ఇతడు గొప్ప సంస్కరణాభిలాషి. హైదరాబాద్ రాజ్య ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. హైదరాబాద్ రాజ్యా న్ని అభివృద్ధిబాటలో నడిపించిన ఘనుడు సాలార్జంగ్.
-హైదరాబాద్ ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతల్ని చేపట్టేనాటికి సాలార్జంగ్ వయస్సు 24 సంవత్సరాలు మాత్రమే. మొదటి సాలార్జంగ్ నాసిరుద్దౌలా, అఫ్జల్ ఉద్దౌలా, మీర్ మహబూబ్ అలీఖాన్‌ల కాలంలో ప్రధానమంత్రిగా ఎనలేని సేవల్ని అందించాడు.
-(టీఎస్పీఎస్సీ గ్రూప్- 1, 2 పరీక్షలకు సంబంధించి సాలార్జంగ్ సంస్కరణలు చాలా ముఖ్యమైనవి. వీటి గురించి వచ్చే సంచికలో చూడగలరు)
విప్లవకారుల్ని బంధించిన సాలార్జంగ్
-ఔరంగాబాద్‌లో కొందరు విప్లవకారులు ప్రాణ భయంతో హైదరాబాద్ చేరుకున్నారు. ముఖ్యంగా ఔరంగాబాద్‌లో సైనికుడు చీదాఖాన్ బ్రిటీషువారికి ఇబ్బందులను సృష్టించాడు. అతడిని బంధించి త మకు అప్పగించినవారికి రూ. 3 వేల బహుమతి ఇస్తానని ప్రకటించాడు. కొందరు విప్లవకారుల్ని, చీదాఖాన్‌ను బంధించిన సాలార్జంగ్ వారిని రెసిడెంట్‌కు కానుకలుగా పంపించాడు. ఈ వార్త దావానంలా వ్యాపించింది. ప్రజలు ఆగ్రహావేశాలకు గురయ్యారు.
రెసిడెన్సీ భవనం ముట్టడి-తుర్రెబాజ్‌ఖాన్ పోరాటం
-1857 హైదరాబాద్ విప్లవకారుల్లో ప్రసిద్ధుడు తుర్రెబాజ్‌ఖాన్. 500 మంది రోహిల్లా వీరులతో కలిసి రెసిడెన్సీపై దాడికి దిగాడు. హైదరాబాద్‌లోని బ్రిటీ షు రెసిడెన్సీకి పశ్చిమ దిశలోగల జయగోపాల్‌దాస్, డబ్బుసింగ్ ఇండ్లను స్వాధీనం చేసుకొని వాటిని స్థావరాలుగా చేసుకొని దాడికి ఉద్యుక్తుడయ్యాడు. ఎక్కువ జన సమ్మర్థమైన కోఠి ప్రాంతంలో నాడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా యి. రెసిడెన్సీ భవనంలోని బ్రిటీషు సైనికులు భయంతో తమ భవనం తలుపులు మూసేసుకున్నారు. ఈ క్రమంలోనే సాలార్జంగ్ పంపించిన అశ్విక దళాలు విప్లవకారులపై మెరుపుదాడి చేశాయి. ఈ దాడిలో కొంతమంది రోహిల్లా వీరులు హతమయ్యారు. తుర్రెబాజ్‌ఖాన్ బంధింపబడ్డాడు. తర్వాత తప్పించుకొని పారిపోతుండగా తూప్రాన్ ప్రాంతంలో కాల్పులకు (క్రీ.శ. 1859లో) మరణించాడు. తుర్రెబాజ్‌ఖాన్ మృతదేహాన్ని హైదరాబాద్ నగరంలో బహిరంగంగా వేలాడదీసి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశారు. రెసిడెన్సీ ప్రాంతంలోని మార్గానికి క్రీ.శ. 1957లో తుర్రెబాజ్‌ఖాన్ పేరు పెట్టారు. అదేవిధంగా మౌల్వీ అల్లాఉద్దీన్‌ను పట్టుకొని అండమాన్‌కు పంపగా అతడు 1884లో అక్కడే మరణించాడు.
అఫ్జల్-ఉద్-దౌలా కాలంలోని ముఖ్య నిర్మాణాలు
1) అఫ్జల్‌గంజ్ బ్రిడ్జి
2) అఫ్జల్‌గంజ్ బజార్
3) అఫ్జల్‌గంజ్ మసీదు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు