తెలంగాణ జానపద కళారూపాలు

గోండు నృత్యం
-ఇది గోండు జాతి వారు ప్రదర్శించే కళారూపం. ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్‌లోని భీమదేవ్ దేవాలయం గోండుజాతికి సంబంధించినది. ఇక్కడ గోండుజాతివారు గొప్ప జాతర నిర్వహిస్తారు. 15 రోజులపాటు ఈ జాతర జరుగుతుంది. ఈ ఉత్సవంలో పాల్గొనడానికి పెద్ద ఎత్తున వాయిద్యకారులు, గాయకులు, నృత్యకారులు అందరూ హాజరై భక్తిగీతాలను పాడుతూ ఉంటే వివిధ రకాలైన నృత్య ప్రదర్శనలను జరుపుతారు. ఈ ప్రదర్శనకు గోండు ప్రజలేకాక ఇతర కులాలకు చెందినవారు కూడా హాజరై ఆనందిస్తారు. ఈ ఉత్సవాలలో పెండ్లికూతుళ్లు ప్రధానపాత్ర పోషిస్తారు.
పగటివేషాలు
ఒకనాడు మనదేశంలో స్వతంత్ర సామంతరాజుల పరిపాలనలో చిత్రవిచిత్ర వేషాలు వ్యాప్తిలోకి వచ్చాయని తెలుస్తుంది. గూఢచారులుగా మారువేషాలు ధరించి వర్తమానాలు చేరవేసే చారులుగాను, రత్నాలు, పచ్చలు అమ్మేవ్యాపారులుగాను, రాణులు ధరించే ఖరీదైన చీరల వర్తకులుగాను చిత్ర, విచిత్రమైన మారువేషాలతో కోటల్లో చొరబడి ఒక రాజు మరొక రాజును వంచించటం, కోటలోని రహస్యాల్ని, బలహీనతల్ని తెలుసుకొని యుద్ధం ప్రకటించడం జరుగుతుండేది. ప్రజావినోదానికి ఏర్పడిన అనేక కళారూపాలు రాత్రివేళ మాత్రమే ప్రదర్శింపబడేవి. అలాకాకుండా పగటి పూట ప్రదర్శించడంతో వీటికి పగటివేషాలు అని పేరు వచ్చింది. పగటివేషాల్లో ముఖ్యంగా గమనించాల్సిన విషయమేమిటంటే వారు కేవలం తమ వేషధారణతోగాక వారి పాత్రల ద్వారా సంఘంలో ఉండే మూఢనమ్మకాలను, దురాచారాలను వ్యంగ్యంగా, హాస్యధోరణిలో ప్రజలకు వివరిస్తూ వారిని చైతన్యపర్చేవారు. ఈనాటి కంటే ఆనాడు గ్రామాల్లో కరణాలు, మునసబులు, వర్తకులు, ఉద్యోగులు మొదలైనవారంతా ఏ విధంగా మోసం చేస్తుండేవారో ఈ వేషాల ద్వారా తగిన సాహిత్యంలో ఎవరికి బాధ కలుగకుండా వారిగుట్టును బట్టబయలుచేసేవా రు. ఈ పగటివేషాలను ఒకప్పుడు బహురూపాలుగా పిలిచేవారు.
క్రీ. శ 1942లో యథావాక్కుల అన్నమయ్య తాను రచించిన సర్వేశ్వర శతకంలో నాటక ప్రదర్శనను రాస్తూ బహురూపాలను కూడా ప్రస్తావించాడు, పాల్కురికి సోమనాథుడు కూడా ఈ బహురూపాలను బసవపురాణంలో, పండితారాధ్య చరిత్రలో ప్రస్తావించాడు. శ్రీశైలంలో శివరాత్రి ఉత్సవాల్లో బహురూపాలను ప్రదర్శించేవారని పాల్కురికి సోమనాథుని పండితారాధ్యచరిత్రతో తెలుస్తుంది. కాకతీయుల కాలంలో యుగంధర మహామంత్రి పిచ్చియుగంధరుడిగా నటించి ఢిల్లీ సుల్తాన్, పట్టుకపోతాన్ అంటూ యుగంధరను జయించింది పగటివేషంతోనే. పగటివేషాల్లో పంతులు వేషం, పఠానువేషం, రెడ్డివేషం, తాగుబోతువేషం, కోమటివేషం, గారడివేషం, ఫకీరుమొదలైన వేషాలను ప్రదర్శించేవారు. ఫకీరువేషంలో ఫకీరు పాత్రధారి ఖురాన్ చదువుతూ పాడిపంటల్సల్లగుండాలి అల్లాకేనామ్ అంటూ ఆయా పాత్రలకు అనుగుణమైన భాషను ఉపయోగించేవాడు. పగటివేషాల్లో ప్రసిద్ధిపొందినవి భైరాగుల వేషాలు, బుడబుక్కల వేషం, ఫకీరు వేషం, తహశీల్దారు, భోగంవేషం, పాములవాడు, ఎరుకలవేషం, దొమ్మరవేషం, కోయవేషం, పడుచుపెళ్లాం, ముసలిమొగుడు, గయ్యాలిపెళ్ళాం, పిట్టలదొర, గొల్లభామ, రెడ్డివేషం, భట్రాజువేషం, సింగిసింగడు మొదలైనవి.
చోడిగాని కలాపం
తెలుగు ప్రాంతాల్లో ముఖ్యంగా దసరా ఉత్సవాల్లో ప్రదర్శించే విచిత్ర వేషాల్లో సోలిగాడివేషం ఒకటి. సోలిగాడు వంకరదుడ్డుకర్రతో ప్రవేశించి పిల్లలందరిని పరిగెత్తించేవాడు. వేషధారణ అంతా హాస్యంగా ఉండేది. ముఖం నిండా సున్నపుబొట్లు, బొట్ల మధ్య నల్లచుక్కలు, నల్లగుడ్డ కట్టిన తలకు ఒక పక్కన కాకి ఈకలను కుచ్చిపెట్టి, మొలకు గోచీకట్టి ఒకచేతిలో వంకరదుడ్డుకర్ర, మరొకచేతిలో జోలెవేసుకొని ఏదో ఒక మూల నుంచి హఠాత్తుగా లేచి పిల్లలందర్ని హడలెత్తించేవాడు. ఈ సోలిగాన్నే చోడిగాడని, పోడిగాడని, సింగడని వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు పేర్లతో పిలుస్తుంటారు. తోలుబొమ్మలాటల్లో జుట్టుపోలిగాడు, బంగారక్క ఎటువంటి ప్రాముఖ్యత వహిస్తున్నారో ఈ చోడిగాడు కూడా చోడిగాని కలాపంలో అటువంటి ప్రాముఖ్యతను కలిగి ఉన్నాడు. బొమ్మలాటలోని పాత్రలు కేవలం హాస్యపాత్రలు మాత్రమే. కానీ చోడిగాని పాత్ర అలాగాక కథానాయకుడిగాను, హాస్య పాత్రగాను జీవిస్తున్నాడు. సోలిగాని పేరు ప్రజాజీవితంలో ఎంతగా ప్రవేశించిందంటే ఉదాహరణలు చూస్తే మనకే అర్థం అవుతుంది. ఫలానావాడు సోలిగాడిలా ఉన్నాడనీ, గాలిగా తిరిగేవాళ్లను సోలిగాడిలా తిరుగుతున్నాడని కొంచెం వికృతంగా ఉన్న వాళ్లను సోలిగాడిలా ఉన్నాడనీ, భార్యతోడులేకుండా వచ్చినవాడిని సోలిగాడిలా వచ్చాడని, మరికొంత మంది తోటివాడిని ఏరా సోలిగా ? అని రకరకాలుగా పిలుస్తుంటారు.
నృత్య ప్రదర్శన విధానం
ఈ నృత్యాన్ని ప్రదర్శించేటప్పుడు పెద్దపెద్ద ప్రభలుగట్టి ఆ ప్రభలను అనేక అలంకారాలతో ముంచివేస్తారు. ప్రభకు ముందువెనుక స్త్రీ, పురుషులు నడుస్తుంటారు. ప్రభ ముందు సన్నాయి వాయిద్యకారులు రెండు, మూ డు దళాలవారు ఉంటారు. ముఖ్యంగా ఈ నృత్యం లో వీరు వాయించే వాయిద్యం వీరంగం. ఇది ఒక ప్రత్యేకమైన వాయిద్యం కణకణమని డోళ్లు మోగుతాయి. సన్నాయిబూరలు తారాస్థాయిలో గుక్కపట్టి నృత్యకారుని చెవుల్లో ఊదుతారు. సాంబ్రాణిధూపం ముఖానికి ఉక్కిరిబిక్కిరయ్యేలా పట్టిస్తారు. దీంతో ఖడ్గధారి వీరావేశంతో ఒక్క గంతేసి దశ్శరభ దశ్శరభ అంటూ డోలువాయిద్యగాళ్ల పక్కచేరి దక్షయజ్ఞ దండకాన్ని చదవడం ప్రారంభిస్తారు. ఇలా ఖడ్గంపట్టి దండకం చదువుతూ వాయిద్యాల గమకాలను అనుసరించి వీరావేశంతో ఆ పక్కకు, ఈ పక్కకు అడుగులు వేస్తూ కంకణం కట్టిన కత్తిని వేగంగా తిప్పుతూ ఆ ప్రాంతంలో ఏ గ్రామ దేవతను గాని, ఏ దేవుణ్ని గాని పూజిస్తారో ఆ గ్రామం పేరు తలచి జైమంగళగిరి వీరభద్ర అని ముగించి మరల వాయిద్యకారులను అదలించి శరభ శరభ అంటూ నానా హంగామా చేసి ఆ కత్తిని ఎవరైతే ఆ ఉత్సవాన్ని నిర్వహిస్తారో అతని పళ్లెంలో ఉంచుతాడు. ఇంతటితో ఈ ప్రదర్శన ముగుస్తుంది.
రుంజలు
తెలుగు ప్రాంతాల్లో విశ్వబ్రాహ్మణులను ఆశ్రయిస్తూ వారిపై ఆధారపడిన తెగ రుంజలవారు. వీరి ముఖ్య వాయిద్యం రుంజ అవడం వల్ల వీరిన రుంజలు అని వాడుకలోకి వచ్చింది. వీరు గ్రామ గ్రామం తిరుగుతూ విశ్వబ్రాహ్మణులను యాచిస్తారు. విశ్వబ్రాహ్మణులు వీరిని ఎంతో ఆదరిస్తారు. వీరు విశ్వకర్మ పురాణాన్ని గానం చేస్తూ పారితోషికాన్ని పొందుతారు. రుంజ వాయిద్యం చాలా ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఒక్కొక్క జట్లలో దాదాపు పదిమంది వరకు ఉంటారు. అందరూ రుంజ వాయిద్యాన్ని వాయిస్తారు.
బుట్ట బొమ్మలు
తెలుగు ప్రాంతాల్లో బుట్టబొమ్మలు తెలియని వాళ్లుం డరు. పేడతో చేయబడిన ఈ బుట్టబొమ్మలు పెళ్లి ఊరేగింపుల్లోనూ, జాతర సందర్భాల్లో ప్రదర్శిస్తుంటారు. ఈ బొమ్మల్ని పురుషులు ఆడిస్తారు. పై భాగమంతా బొమ్మ ఆకారంగా ఉండి లోపలి భాగం డొల్లగా ఉండి బొమ్మ కాళ్లభాగంలో, నోటి దగ్గర రంధ్రాలుంటాయి. ఆటగాడు ఈ లోపలి భాగంలో దూరి నృత్యం చేస్తే కేవలం బొమ్మే నాట్యం చేసినట్లు ఉంటుంది. ఈ బొమ్మల్లో ఒకటి స్త్రీ బొమ్మగాను, మరొకటి పురుషుడి బొమ్మ ఉంటుంది. కొన్ని బొమ్మలు సింగిసింగడుగా ఉంటాయి. ప్రజలను ఆనందపర్చే కళారూపాల్లో ఇది ఒకటి. ఇది ఇప్పుడు పూర్తిగా కనుమరుగై పోయింది.
వీరముష్టివారు
వీరశైవ వాజ్ఞయానికి సంబంధించిన గేయాలను భక్తుల గాథలను, కన్యకపరామేశ్వరీ కథలను చెబుతుంటారు. వీరు ఎక్కువగా జంగాలను యాచిస్తారు. వీరముష్టులు పాడేపాటల్లో ఎక్కువభాగం కన్యకకు సంబంధించినవి. అందువల్ల వీరిని కోమట్లు ఎక్కువగా ఆదరిస్తారు. అయ్యలరాజు నారాయణామాత్యుడు వీరముష్టులను ఉదాహరించినట్లు బిరుదురాజు రామరాజుగారు జానపదగేయ సాహిత్యంలో తెలిపాడు. వీరభద్రుడు దక్షుడిని ధ్వంసం చేయునప్పుడు అతడి చెమట నుంచి వీరముష్టులు జన్మించారని ఒక కథ ఉంది. వీరు వీరభద్ర ఖడ్గాలను కూడా చెబుతుంటారు. వీరు వీరశైవుల వలె కత్తులను కుచ్చుకుని నాట్యం చేస్తారు.
గారడి విద్యలు
దీనిని ఇంద్రజాలమని గారడివాళ్లను ఇంద్రజాలికులని వ్యవహరిస్తారు. ఈ గారడి విద్య పూర్వకాలం నుంచి ప్రస్తుత కాలం వరకు ప్రచారంలో ఉంది. పూర్వం రాజు ఆస్థానాలలో విరివిగా ఈ విద్యను ప్రదర్శించి సన్మానాలను పొందేవారు. ఈ నాటికీ గ్రామాల్లో ఈ విద్యను ప్రదర్శిస్తున్నారు. వేపాకులను దూసి తేళ్లను తెప్పించడం, అరచేతిలో రూపాయలను సృష్టించడం, అప్పటికప్పుడు మామిడిటెంకను పాతి మొక్కను మొలిపించడం, మనిషిని బుట్టలో పెట్టి మాయం చేయడం, గొంతును కోసి రక్తం చూపించడం మన వద్దనున్న వస్తువును మాయం చేసి మరొకరి జేబులో నుంచి తెప్పించడం మొదలైన అనేక ప్రదర్శనలు చేస్తారు. ఈ విద్య పూర్వం నుంచే ప్రచారంలో ఉందనడానికి అనేక గ్రంథాల నుంచి పలు ఉదాహరణలు కనిపిస్తాయి. పాల్కురికి సోమనాథుడు రచించిన పండితారాధ్య చరిత్ర దొమ్మరసానులు గడలపై ఆడినట్లే, గారడీవారు మోకులపై ఆడినట్లు అని ప్రస్తావించారు. పొడవైన మోకును ఆకాశంలోకి విసరగానే అది వెదురులాగా నిలుస్తుంది.
తరువాత గారడీవాడు తాడుమీద నిచ్చెన ఎక్కినట్లు జరజరాపాకుకుంటూపోయినట్లు పోయి మాయమై తిరిగి కనిపించి అక్కడే చిత్రవిచిత్రమైన విద్యలను ప్రదర్శించేవాడు. ఈ విద్యను ఇంగ్లీష్‌వారు రోప్ ట్రిక్ అన్నారు. ఇలాంటి కథనే కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రింశకలో వివరించాడు. ఒక ఇంద్రజాలికుడు తన భార్యను వెంటబెట్టుకుని రాజ సన్నిధిలో ఆమెను రక్షణార్థం ఉంచి తాను దేవతల సహాయం కోసం యుద్ధం చేయడానికి వెళ్తున్నానని చెప్పి ఒకతాటిని పైకి నిలువుగా విసిరి దానిని నిలబెట్టి పైకి ఎగబాకి మాయమయ్యాడు. తరువాత కొంతసేపటికి వాని కాళ్లు, చేతులు, తల, మొండెం తుంటలు తుంటలుగా కిందపడ్డాయట. రాజు వద్ద రక్షణగా ఉంచిన అతడి భార్య రాజును వేడుకుని భర్తతో సహగమనం చేసిందట. వెంటనే తాడు పట్టుకుని పైకి పోయిన ఇంద్రజాలికుడు పై నుంచి దిగివచ్చి తన భార్యను పంపమన్నాడు. అంతట రాజు విచారంతో ఆమె సహగమనం చేసిందని చెప్పాడట. ఇలాంటి గారడి విద్యను గురించి యథావాక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకంలో కూడా వివరించాడు.
RELATED ARTICLES
-
Indian Polity | సభ ఆమోదిస్తేనే అత్యవసరం.. లేదంటే రద్దు
-
Geography | సౌర కుటుంబంలో అత్యంత సాంద్రత గల గ్రహం?
-
General Studies – Groups Special | ఇనుము తుప్పు పట్టినప్పుడు బరువు పెరగడానికి కారణం?
-
Biology | First Genetic Material.. Reactive Catalyst
-
Telangana Movement | ‘తెలంగాణ జాగో హైదరాబాద్‌కో బచావో’ సభ నిర్వహించిన పార్టీ?
-
Economy- Groups Special | భారతదేశంలో ప్రత్యేక ఆర్థిక మండళ్ల ప్రధాన విధి?
Latest Updates
Groups / DSC Special – Social Studies | స్వయం మట్టి మార్పిడి విధానాన్నిఅనుసరించే నేలలు?
Israel – Hamas war | రావణకాష్టం.. ఇజ్రాయోల్ – పాలస్తీనా వివాదం
Current Affairs | ఆది మహోత్సవ్ దేనికి సంబంధించింది?
UCEED & CEED 2024 | యూసీడ్ & సీడ్-2024 ఐఐటీలో ప్రవేశాలు !
Geography | ప్రపంచంలో తేయాకు ఉత్పత్తిలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది?
Economy | రామగిరి ఖిల్లాను ఏ శతాబ్దంలో నిర్మించారు?
DSC – Groups Special | తరిగిపోతే తిరిగిరావు.. పొదుపుగా వినియోగిద్దాం
SAT Preparation | SAT… Short and Digital
Group 2,3 Special | మహిళలు, బాలలు, ట్రాన్స్జెండర్ల చట్టాలు
General Essay – Groups Speical – AI | వస్తువుకు ప్రాణం.. కృత్రిమ మేధ మాయాజాలం