ముగిసిన ముల్కీ కథ!
ముల్కీ .. ఒక దీర్ఘకాలిక సమస్య. బహమని సామ్రాజ్యం మొదలు నేటి కమల్‌నాథ్ కమిటీ వరకు. తెలంగాణ ఉద్యమానికి ప్రధాన కారణం ఉద్యోగాల్లో జరిగిన అన్యాయం. నిజాంకాలంలో ప్రధాన సమస్యగా మారిన ఈ ముల్కీ విషయం సీమాంధ్ర పాలనలో ఉద్యోగ దోపిడీగా మారింది. హైదరాబాద్ రాష్ట్ర ప్రజలు వద్దని ఉద్యమాలు చేసినా.. సీమాంధ్ర రాజకీయ కుట్రల కారణంగా విశాల అంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఫలితం నీళ్లు, నిధులు, నియామకాల్లో జరిగిన అన్యాయం. ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా సీమాంధ్రులు కుట్రలు చేశారు. జై ఆంధ్ర ఉద్యమానికి తెరతీశారు. ఫలితంగా ఎప్పటి నుంచో అమల్లో ఉన్న ముల్కీ నిబంధనలకు తెరపడింది. సీమాంధ్రుల ఉద్యోగ దోపిడీకి మరింత ఊతం లభించింది. ఈ అన్యాయాలపై తెలంగాణ సమాజం నిలబడింది.. కల బడింది..పోరాడింది.. చివరకు విజయం సాధించింది.
తెలంగాణ వారి అనుమానాలు
-విద్యలో వెనుకబడి ఉన్న తెలంగాణ ప్రజలు ఎక్కువ అభివృద్ధి చెందిన కోస్తా ప్రాంతంతో కలవడం వల్ల్ల కష్టాల పాలు కావచ్చని, వారి స్వార్థానికి బలికావచ్చని తెలంగాణ వాదుల మనసుల్లో ఉన్న భయమే విశాలాంధ్ర ప్రతికూలతకు గల ముఖ్యకారణం. హైదరాబాద్ నగరం వెలుపల ఉన్న తెలంగాణ జిల్లాలు విద్య విషయంలో చాలా వెనుకబడి ఉన్నాయి. దాని ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించేటప్పుడు ఆంధ్రలోకంటే తక్కువ విద్యార్హత గలవారు తీసుకోబడుతా రు. ఆంధ్రలో చేరితే తాము వారితో సమాన స్థాయిలో ఉండలేము, ఈ భాగస్వామ్యంలో పెద్ద భాగస్తుడే అన్ని లాభాలను తక్షణం పొందగలడని, ఇక తెలంగాణ ప్రాంతం సాహసవంతులైన కోస్తాంధ్రులచే వలస ప్రాంతంగా మార్చబడుతుందని తెలంగాణ ప్రజలు ఆనాడే అనుమానాలు వ్యక్తం చేశారు.
తీర్మానాలతో కుట్రలు మొదలు
-ఎలాంటి భయం, అనుమానాలు తెలంగాణ ప్రజలకు ఉండా ల్సిన అవసరం లేదని నాటి ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి బి. గోపాల్‌రెడ్డి స్వయంగా 1955, నవంబర్ 25న కర్నూల్ శాసనసభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదింపచేశారు. తర్వాత 1956, ఫిబ్రవరి 1న ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి అదే కర్నూలు శాసనసభలో మరో తీర్మానాన్ని ప్రవేశపెడుతూ తెలంగాణలోని ఉద్యోగాలు తెలంగాణ వాళ్లకే చెందుతాయి. ఆంధ్రులు వాటిని కాజేస్తారనే భయాలు అవసరం లేదని విద్యా, ఉద్యోగాల్లో రక్షణ కల్పిస్తామని, తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని పార్టీలకు అతీతంగా ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్లు తెలిపారు.
-తెలంగాణ ప్రజల వ్యతిరేకతను, రాష్ర్టాల పునర్విభజన కమిషన్ సిఫారసులను, చివరకు నెహ్రూ అభిప్రాయాన్ని కూడా పట్టించుకోకుండా ఆంధ్రప్రాంత నాయకుల ఒత్తిడికి లొంగిన కేంద్రం భాషా ప్రాతిపదికన తెలంగాణను కోస్తాంధ్ర ప్రాంతంతో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఇరు ప్రాంతాలకు చెందిన పెద్ద మనుషులతో ఒక ఒప్పందానికి రూపకల్పన చేసింది. 1956, ఫిబ్రవరి 20న ఇరుప్రాంతాల పెద్ద మనుషుల మధ్య కుదిరిన ఈ ఒప్పందాన్నే పెద్దమనుషుల ఒప్పందంగా పేర్కొంటారు. ఈ ఒప్పందం కుదిరే నాటికి తెలంగాణ ఆంధ్ర ప్రాంతం మధ్య విద్యారంగంలో నెలకొన్న వ్యత్యాసాలను పరిశీలిస్తే..
-1955-56లో తెలంగాణలో అక్షరాస్యత 6.71 శాతం, రాయలసీమలో 12.06 శాతం, ఆంధ్రలో 14.02 శాతం.
-1955లో ఆంధ్రలో 19 వేల పాఠశాలలు, రాయలసీమలో 7700, తెలంగాణలో 7071.
-1956లో ఆంధ్రలో 30 కాలేజీలు, తెలంగాణలో 15 ఉన్నాయి (ఇందులో 14 కాలేజీలు హైదరాబాద్‌లోనే ఉన్నాయి).
-చివరకు తెలంగాణ ఆంధ్రప్రాంతం నాయకుల మధ్య కుదిరిన పెద్ద మనుషుల ఒప్పందంతో 1956, నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. పెద్ద మనుషుల ఒప్పందంలో విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన ముఖ్య విషయాలు. (1956, ఫిబ్రవరి 20న కుదిరిన ఒప్పందంలోని నిబంధనల ప్రకారం)
-తెలంగాణలో ఉన్న విద్యా సౌకర్యాలు తెలంగాణ విద్యార్థులకే కల్పించి ఇంకా అభివృద్ధి చేయాలి. తెలంగాణ ప్రాంతంలో ఉన్న సాంకేతిక విద్యా సంస్థలతో సహా అన్ని కళాశాల్లోనూ ప్రవేశాలను తెలంగాణవారికే ఇవ్వాలి. లేదా రాష్ట్రం మొత్తంమీద ఉన్న ప్రవేశాల్లో మూడో వంతు తెలంగాణకు కేటాయించాలి. పై రెండు పద్ధతుల్లో తెలంగాణ వారికి ఏది అనుకూలమో అది అమలుచేయాలి.
-విలీనీకరణవల్ల అదనపు ఉద్యోగుల తొలగింపు తప్పనిసరి అయితే రెండు ప్రాంతాల వారిని నిష్పత్తి ప్రకారమే తొలగించాలి.
-ఇకపై చేపట్టే ఉద్యోగ నియామకాలు ఉభయ ప్రాంతాల జనాభా ప్రాతిపదికపై జరగాలి.
-తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగాలను నిర్ణీత నిష్పత్తి ప్రకారం పొందడానికి నివాస నిబంధన ఉండాలి. తెలంగాణలో 12 ఏండ్లు నివాసం ఉండాలి.
-తెలంగాణ ప్రాంత అవసరాల దృష్ట్యా సర్వతోముఖాభివృద్ధి సాధించుకునేందుకు ఒక ప్రాంతీయ మండలి ఉండాలి. తెలంగాణ ప్రణాళికలు, నీటిపారుదల వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగ వ్యవహారాలు ఈ ప్రాంతీయ మండలి ఆధీనంలో ఉండాలి.
విశాల అంధ్రప్రదేశ్‌తో విశాలమైన కష్టాలు
-చివరకు 1956, నవంబర్ 1న కుదిరిన పెద్దమనుషుల ఒప్పందంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. నాటి నుంచి తెలంగాణ ఉద్యోగులకు, నిరుద్యోగులకు కష్టాలు పెరిగాయే కాని తగ్గలేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 309 ప్రకారం ముల్కీ నిబంధనలు నూతనంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో కొనసాగించేందుకు ప్రభుత్వం 813 జీవోను జారీచేసింది. దీని ప్రకారం తెలంగాణలోని ఉద్యోగాలన్నీ ఈ ప్రాంతంవారికే చెందుతాయి.
జీవో 813 ముల్కీ నిబంధనల్లో సడలింపు
-813 జీవోతో గతంలో అమల్లో ఉన్న ముల్కీ నిబంధనలను కొన్నింటిని సడలించారు. గతంలో ముల్కీ నిబంధనలతో స్థానికుడంటే తెలంగాణలో కనీసం 15 ఏండ్లు నివాసం ఉండాలి. కానీ అదికాదంటూ 12 ఏండ్లకు కుందించారు. దాంతోపాటు ఉద్యోగ విరమణ తర్వాత కూడా తెలంగాణలోనే నివాసముండాలనే వాగ్దానం చేస్తూ మెజిస్ట్రేటు వద్ద సమర్పించే ప్రమాణ పత్రం అవసరం లేదన్నారు.
విలీనంతో తెలంగాణ ఉద్యోగుల జీతాల తగ్గింపు
-ఆ రోజుల్లో హైదరాబాద్ రాష్ట్రంలోని ఉద్యోగుల జీతాలు ఆంధ్రరాష్ట్రంలోని ఉద్యోగుల కంటే ఎక్కువగా ఉండేవి. ఆంధ్రప్రదేశ్ అవతరణతో ఇరు ప్రాంతాల ఉద్యోగుల వేతనాల మధ్య వ్యత్యా సం ఉండకూడదని తెలంగాణ వారి జీతాలను తగ్గించి వారితో సమానంగా చేశారు. చరిత్రలో ఎక్కడైనా ఉద్యోగుల జీతాలు పెరుగుతాయేతప్ప తగ్గవు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటుతో తెలంగాణ ఉద్యోగుల జీతాలు తగ్గాయే తప్ప పెరగలేదు. ఉదా॥ 1956కు పూర్వం తెలంగాణలో తహసీల్దార్ల పే స్కేలు రూ. 250-450గా ఉండేది. అదే కోస్తాంధ్రలోని తహసీల్దార్ల పే స్కేలు రూ. 200 – 300గా ఉండేది. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తహసీల్దార్లకు వర్తించే సవరించిన పే స్కేలు రూ. 200 – 350గా నిర్ణయించారు. ఈ విధంగా అన్ని కేటగిరీలకు సంబంధించిన ఉద్యోగుల పే స్కేళ్లను సవరించడంతో తెలంగాణ ఉద్యోగుల జీతాలు తగ్గిపోయాయి. దీంతోపాటు ఈ ప్రాంత ఉద్యోగులకు తెలుగు, ఇంగ్లీషు భాషలు రావనే కారణంతో భాషా పరీక్షలు నిర్వహించి వారి పదోన్నతులకు అవరోధాలు కల్పించారు. దీంతో తమకు జరిగిన అన్యాయాలను భరించలేక చాలా మంది ఉద్యోగులు కోర్టులను ఆశ్రయించారు. అదేవిధంగా విలీనంవల్ల ఇక్కడి ఉద్యోగుల్లో అత్యధికుల సీనియారిటీ తారుమారైంది. అంతేకాకుండా విలీనంతో అదనపు ఉద్యోగుల తొలగింపు తప్పనిసరైందని ఎక్కువ తెలంగాణ ఉద్యోగులను తమ ఉద్యోగాల నుంచి తీసివేశారు. ఈ విధంగా జీతాలు, ప్రమోషన్ల విషయంలో అన్యాయం చేయడమేగాక తెలంగాణ ఉద్యోగాలను ఈ ప్రాంతంవారికే ఇవ్వాలనే మౌలిక సూత్రాన్ని కూడా నీరుగార్చారు. తెలంగాణ ఉద్యోగులకు పదోన్నతుల్లో జరిగిన అన్యాయాలను సరిదిద్ది న్యాయాన్ని చేకూర్చాలని కోర్టులను ఆశ్రయించగా వారికి అనుకూలంగా తీర్పులు వచ్చాయి.
అయితే ప్రభుత్వాలు వాటిని అమలు చేయకుండా సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లాయి. తీర్పు ఏదైనా తెలంగాణ ఉద్యోగులకు వ్యతిరేకంగా వచ్చినట్లయితే దానిని తక్షణమే అమలు చేసేవారు. అనంతరెడ్డి అనే ఇంజినీర్ కేసు ఈ విషయాన్ని స్పష్టం జేస్తుంది. అనంతరెడ్డి పదోన్నతిలో తనకు జరిగిన అన్యాయాన్ని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొస్తే, అతనికి పదోన్నతి కల్పించడంలో అన్యాయం జరిగినట్లు న్యాయస్థానం పరిగణించి ప్రమోషన్ ఇవ్వాలని సూచించిం ది. ప్రభుత్వం న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు కూడా కిందికోర్టు తీర్పునే ధ్రువీకరించి అతనికి పదోన్నతి కల్పించాలని ఆదేశించింది. కానీ అప్పటికే అనంతరెడ్డి పదవీ విరమణ చేశారు. కొన్ని కేసుల్లో అయితే కోర్టును ఆశ్రయించిన ఉద్యోగులకు సానుకూలమైన తీర్పులు వాళ్లు మరణించిన తర్వాత వచ్చిన సందర్భాలున్నాయి. సీనియారిటీ విషయంలో తమ కు న్యాయం చేయాల్సిందిగా ఎక్కువమంది తెలంగాణ ఉద్యోగులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో దొంగ ముల్కీల బెడద తీవ్రమైంది. దీంతో స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకకుండపోయాయి. తెలంగాణ గ్రామీణ ప్రాంతం నుంచి అప్పుడప్పుడే మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన తొలితరం విద్యావంతులకు దొంగ ముల్కీల వల్ల ఉద్యోగాలు దొరక్క తీవ్ర నిరాశకు గురయ్యారు.
1968 నాటికి నాన్‌ముల్కీలు 22 వేల మంది
-అనధికారిక లెక్కల ప్రకారం 1968 నాటికి దాదాపు 22 వేల మంది స్థానికేతరులు తెలంగాణ నిరుద్యోగులకు చట్టబద్ధంగా రావాల్సిన ఉద్యోగాలను ముల్కీలతో కాజేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద మనుషుల ఒప్పందం పేరిట తమకు ఉద్యోగాల విషయంలో చట్టబద్ధంగా లభించిన హామీల అమలు జరగలేదని, వాటి అమలు గురించి విద్యార్థులు నిరుద్యోగులు గళం విప్పారు. వీరికి దన్నుగా పదోన్నతుల్లో సీనియారిటీ విషయాల్లో వివక్షకు గురవుతున్నట్టు ఉద్యోగులు గొంతుకలిపి తమ న్యాయబద్ధమైన హక్కులు కాపాడుకొనే నిమిత్తం తెలంగాణ ఎన్జీవోల సంఘంగా 1967లో ఆమోస్ నేతృత్వంలో ఏర్పడింది. అంతకుముందు హైదరాబాద్ సర్కార్ ములాం యూనియన్‌గా ఉన్న ఉద్యోగ సంఘమే టీఎన్జీవోల సంఘంగా మారింది. విద్యార్థులు, నిరుద్యోగుల రక్షణ, హామీల అమలుకు 1968లో ప్రారంభమైన ఉద్యమం క్రమంగా విస్తరించి దినదినం బలపడింది.
-రాజ్యాంగంలోని ఆర్టికల్ 309 ప్రకారం ముల్కీ నిబంధనలను అమల్లో పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 813 ప్రకారం తెలంగాణలోని ఉద్యోగాలన్నీ తెలంగాణవారికే చెందాలి. ఈ నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణలో 22 వేల మంది నాన్ ముల్కీలను ఎలా నియమించారని విద్యార్థులు, నిరుద్యోగులు తెలంగాణ ఎన్జీవోల సంఘం ఉద్యమిస్తే.. అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి సమస్య తీవ్రతను అర్థం చేసుకొని సమస్య పరిష్కారానికి అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. అఖిలపక్ష సమావేశంలో దొంగ ముల్కీలతో తెలంగాణలో 1956 నవంబర్ 1 తర్వాత తెలంగాణ వారికి రిజర్వ్ చేసిన ఉద్యోగాలు సంపాదించిన స్థానికేతర ఉద్యోగులను గుర్తించి వారిని తొలగించాలని నిర్ణయించారు. అఖిలపక్ష సమమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం 1956 నవంబర్ 1 తర్వాత తెలంగాణలో నియమించిన స్థానికేతరులను గుర్తించి వారిని 1969 పిబ్రవరి 28 నాటికి ఎవరి ప్రాంతాలకు వాళ్లను పంపించాలి. ఒకవేళ అక్కడ ఖాళీలు లేకుంటే సూపర్ న్యూమరీ పోస్టులను క్రియేట్ చేయాలి.
తీవ్రతరమైన టీఎన్జీవోల ఉద్యమం
-తెలంగాణలో ఉద్యోగాలు సంపాదించేందుకు జీవో 36 ముల్కీ నిబంధనలు ఆటంకంగా ఉన్నాయని భావించి కొంతమంది ఆం ధ్ర ఉద్యోగులు జీ.వో.36 ముల్కీ నిబంధనల చట్టబద్ధతను సవాలు చేస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆంధ్ర ఉద్యోగ్తులు దాఖలు చేసిన రిట్ పిటిషన్ నెం. 221/1969ను విచారించిన ఉన్నత న్యాయస్థానం ముల్కీ నిబంధనలు చెల్లవని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఈ ఐదుగురు న్యాయమూర్తుల్లో నలుగురు ముల్కీ నిబంధనలు చట్టబద్ధం కావని అభిప్రాయపడగా, ఒకరు మాత్రం అవి చట్టబద్ధమే అని పేర్కొన్నారు. ముల్కీ నిబంధనలు చట్టబద్ధమైనవని అభిప్రాయపడ్డ న్యాయమూర్తి కొండా మాధవరెడ్డి. వీరు తెలంగాణ వారు. ముల్కీ నిబంధనలు చట్టబద్ధం కావని అభిప్రాయపడ్డ నలుగురు న్యాయమూర్తులు స్థానికేతరులు కావడం గమనార్హం. ఈ తీర్పు తర్వాత అప్పటివరకు తెలంగాణకు రక్షణ, హామీల అమలు గురించి ఉద్యమించిన వాళ్లంతా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే తమ సమస్యన్నింటికీ పరిష్కారమని భావించి ఉద్యమకారులతో కలిసి ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. ఉద్యమ కారులకు దన్నుగా టీఎన్జీవోలు 38 రోజులు పాటు ఆమోస్ నేతృత్వంలో సమ్మె చేసి ఉద్యమాన్ని వేడెక్కించారు. టీఎన్జీవోలు ఉద్యమంలో పాల్గొనడాన్ని జీర్ణించుకోలేని ప్రభుత్వం టీఎన్జీవో గుర్తింపును రద్దుచేసి సంఘాన్ని నిషేధించింది. ఆమోస్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది.
-కోర్టు తీర్పు తర్వాత సేఫ్‌గార్డ్స్ ఉద్యమం నీరుగారి పోయి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం బలపడి తీవ్రతరం అయింది. ఉద్యమ తీవ్రతను గమనించిన నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఉద్యోగ రంగంలో తెలంగాణ వారికి రిజర్వేషన్ల సౌకర్యం కల్పిస్తూ తెలంగాణ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని 1969 ఏప్రిల్ 11న లోక్‌సభలో ప్రకటించిన అష్టసూత్ర పథకంలోనూ ఆ తర్వాత ప్రకటించిన పంచసూత్ర పథకంలోనూ తెలంగాణ ఉద్యోగాలను తెలంగాణవారికే ఇవ్వాలని నిబంధనలు చేర్చారు.
ముల్కీ నిబంధనలు చట్టబద్ధమే.. సుప్రీంతీర్పు
-రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ముల్కీ నిబంధనలు చట్టబద్ధం కావని ఇచ్చిన తీర్పుపైన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లింది. ఆనాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎం.సిక్రి నేతృత్వంలో న్యాయమూర్తులు ఏఎస్ రే, ఐడీ దువా, డీజీ పలేఖర్, ఎంహెచ్ బేగ్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం చారిత్రక పరిస్థితుల రీత్యా తెలంగాణ అమలులో ఉన్న ముల్కీ నిబంధనలు చట్టబద్ధమేనని అభిప్రాయపడింది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ముల్కీ నిబంధనలు చారిత్రక పరిస్థితుల రీత్యా చట్టబద్ధమేనని అభిప్రాయపడ్డ కొండా మాధవరెడ్డి అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు 1972 అక్టోబర్ 3న తమ తీర్పులో ధ్రువీకరించింది. ఈ తీర్పు వచ్చిన తర్వాత కూడా జీవో 36 అమలుచేయలేదు.
సుప్రీంకోర్టు తీర్పుతో జై ఆంధ్ర ఉద్యమం
-సుప్రీంకోర్టు తీర్పును జీర్ణించుకోలేని కోస్తాంధ్రులు జై ఆంధ్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ తీర్పు తర్వాత వచ్చిన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం నిజానికి ప్రత్యేక రాష్ట్రం కోసం వచ్చిన ఉద్యమం ఎంత మాత్రమూ కాదు. తెలంగాణ ప్రాంతానికి వర్తించే ముల్కీ నిబంధనలు, రీజినల్ కమిటీ, ఆరు సూత్రాల పథకం అమలుతో రద్దవుతాయనగానే ప్రత్యేక జై ఆంధ్ర ఉద్యమాన్ని ఆపివేశారు. తిరిగి ఆనాటి నుంచి ఎప్పు డు కూడా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలనే డిమాండ్‌ను లేవనెత్తలేదు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆంధ్రలో వచ్చిన జై ఆంధ్ర ఉద్యమానికి కోస్తాంధ్ర నాయకుల ఒత్తిడికి లొంగిన కేంద్రం 1972, సెప్టెంబర్ 23 వరకు తెలంగాణ అమలులో ఉన్న ముల్కీ నిబంధనలను రీజినల్ కమిటీని రద్దు చేసి ఆరు సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టింది. దీంతో ముల్కీ కథ ముగిసింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు