తెలంగాణలో భూ సంస్కరణలు..
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వ్యవసాయరంగంలో చోటుచేసుకున్న ప్రధాన పరిణామాల్లో భూ సంస్కరణలు చెప్పుకోదగ్గవి. శతాబ్దాలపాటు పెత్తందార్లు, ధనవంతుల వద్ద కేంద్రీకృతమైన భూములను వాస్తవంగా వ్యవసాయం చేస్తున్న రైతులకే సొంతం చేసేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన భూ సంస్కరణలతో వ్యవసాయ రంగంతోపాటు దేశంలోని సామాజిక వ్యవస్థలో కూడా అనేక మార్పులు జరిగాయి.
తెలంగాణ ప్రాంతంలో నిజాం పాలనలో వేళ్లూనుకుపోయిన జాగీర్ధారీ వ్యవస్థ మూలంగా భూమి కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమైంది. ఇది ఒకరకంగా రైతు బానిసత్వానికి దారితీసింది. భూ సంస్కరణలతో ఈ పరిస్థితుల్లో పెనుమార్పులు వచ్చాయి. ఈ నేపథ్యంలో భూసంస్కరణలకు ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించిన టీఎస్పీఎస్సీ కొత్త సిలబస్‌లో ఈ అంశాన్ని కూడా చేర్చింది. తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా భూ సంస్కరణలు, వాటి చరిత్ర, తదనంతర పరిణామాలు తదితర అంశాలు నిపుణ పాఠకులకోసం..
భారతదేశ ఆర్థిక, సాంఘిక, రాజకీయ జీవనంలో నేటికీ వ్యవసాయ రంగం పాత్ర అత్యంత కీలకం. మన దేశంలో వ్యవసాయం జీవనాధారంగా పరిగణించబడుతుంది. దేశ శ్రామిక జనాభాలో 60 శాతం వరకు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయ రంగ సంక్షోభం ఒకరకంగా సామాజిక సంక్షోభంగా పరిగణింపబడుతుంది. వ్యవసాయ రంగం ప్రధానంగా 1. సంస్థాగత (Institutionalized) 2. సాంకేతిక పరమైన (Technical) కారకాలపై ఆధారపడి ఉంటుంది. భూ సంస్కరణలు, భూ యాజమాన్య హక్కు మొదటి రకానికి చెందగా వ్యవసాయ ఉత్పాదకాలు (inputs) (విత్తనాలు, ఎరువులు, నీటి పారుదల వంటివి) రెండో రకానికి చెందినవి.
భూ సంస్కరణలు అంటే?
-భూమి లేని నిరుపేదలకు భూమిహక్కును, భూమి వల్ల కలిగే ప్రయోజనాలను పునఃపంపిణీ చేయడమే భూ సంస్కరణలు. విస్తృతార్థ్థంలో వ్యవసాయ సంస్కరణలే భూ సంస్కరణలు. ఇందులో ఆస్తి సంబంధాలు లేదా భూమికి సంబంధించిన ఉత్పత్తి సంబంధాలు అంతర్భాగంగా ఉంటాయి. భూ వనరులను సమానత్వ ప్రాతిపదికన పేదలకు పంపిణీ అయ్యేలా చూడటమే భూ సంస్కరణల లక్ష్యం.
-ఐక్యరాజ్య సమితి (UNO) నిర్వచనం ప్రకారం భూమి పునఃపంపకమే కాకుండా, కౌలు పరిమాణం, నిర్ణయం, కౌలుదారులకు భద్రత, వ్యవసాయ కూలీల వేతన నిర్ణయం, వ్యవసాయ పరపతి మార్గాల అభివృద్ధి, భూమి పన్నుల విధానాల మెరుగుదల, సహకార సంస్థల అభివృద్ధి, వ్యవసాయ విద్యాబోధన వ్యవసాయంలో సాంకేతిక మార్పులన్నీ భూ సంస్కరణలే. కౌలుదారులు, సన్నకారు రైతుల, వ్యవసాయ కూలీల మేలును దృష్టిలో ఉంచుకొని భూమిని (ఆస్తిహక్కు) పునఃపంపకం చేయడమే భూ సంస్కరణలు. ఇవి కొన్ని సందర్భాల్లో ఉపయోగకరమైన పూరకాలుగానూ, గ్రామీణ సమానత్వానికి అవసరమయ్యే పంపకం లేదా సామూహిక సంస్కరణలకు అరుదుగా ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపుతాయని మైకేల్ లిప్టన్ పేర్కొన్నాడు.
-ప్రపంచబ్యాంక్ నిర్వచనం ప్రకారం కమతాల పరిమాణంలో ఆదాయ పంపిణీలో మార్పులు తద్వారా వ్యవసాయ రంగంలో నిర్మాణాత్మకమైన మార్పులు తెచ్చే సాధనమే భూ సంస్కరణలు
-భూ సంస్కరణలను వ్యవసాయ సంబంధ సంస్కరణలని కూడా పేర్కొంటారు. ఇవి భూమి యాజమాన్య హక్కుల నిబంధనలకు, చట్టాల మార్పులకు సంబంధించినవి.
భారతదేశంలో…
-భారతదేశ చరిత్రలో బ్రిటీష్ వలస పాలన కాలంలో భూ సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలు, పోరాటాలు జరిగాయి. స్వాతంత్య్రోద్యమంలో గ్రామీణ రైతాంగాన్ని భాగస్వామ్యం చేయాలనే గాంధీ ఆలోచన కార్యరూపం దాల్చింది. 1917-18లో బీహార్‌లోని చంపారన్ రైతు పోరాటం, ఖైదా రైతు విముక్తి పోరాటాలు భూ సమస్యల పరిష్కారానికి సైద్ధాంతిక నేపథ్యాన్ని అందించాయి. భూస్వామ్య వ్యవస్థ తొలగించి రైతాంగాన్ని సంస్కరించడం అనివార్యమని 1928లో నెహ్రూ పేర్కొనడం దీని పర్యావసానంగా 1931 కరాచీ కాంగ్రెస్ సమావేశంలో జమిందారీ వ్యవస్థ రద్దుకు తీర్మానం చేశారు.
అంతే కాకుండా 1936 కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో భూ సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేశారు. దీని ఫలితమే 1936 కాంగ్రెస్ లక్నో సమావేశంలో అఖిల భారత కిసాన్ సభను ఏర్పాటైంది. ఎన్నికల అనంతరం బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ల్లో కౌలుదార్ల రక్షణ, పాత బకాయిలపై మారటోరియాన్ని విధించింది. అనంతర కాలంలో 1946 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1947 నవంబర్ 28న జమిందారి రద్దు బిల్లును శాసనసభలో 1948లో వ్యవసాయ సంస్కరణలపై కుమారప్ప కమిటీని వేయడంతో చట్టాలు పురుడుపోసుకున్నాయి.
-మనదేశంలో భూ యాజమాన్యంలో విపరీతమైన వ్యత్యాసాలు కనపడతాయి. మొత్తం రైతాంగంలో కేవలం 20 శాతం లోబడి ఉన్న భూస్వాముల ఆధీనంలో మొత్తం సాగు భూమిలో 80 శాతం ఉండటం, 80 శాతం వరకు ఉన్న చిన్న సన్నకారు మధ్య తరగతి రైతాంగం ఆధీనంలో కేవలం 20 శాతం వరకు మాత్రమే వ్యవసాయ భూమి ఉండటం, అంతేకాకుండా సాగయ్యే భూమిలో సగానికిపైగా కౌలు కిందనే ఉండటం, కౌలుదారుల్లో ఎక్కువ మంది కౌలు భద్రత లేకపోవడం వీరి కంటే మరింత అధ్వానమైన ఆర్థిక, సాంఘిక పరిస్థితుల్లో అసంఖ్యాక వ్యవసాయ కూలీలున్నారు. భారతదేశ వ్యవసాయ రంగంలో మరో విలక్షణత హిందూ కుల వ్యవస్థకు వ్యవసాయ రంగానికి గాఢమైన అంతర్గత సంబంధం ఉండటం (ఆంత్రోపాలజీలోని జాజ్‌మానీ వ్యవస్థ ఈ భావనను వివరిస్తుంది)
రాజ్యాంగ ప్రాతిపదికత
-స్వాతంత్య్రానికి ముందునుంచే వ్యవసాయాభివృద్ధికి సమసమాజ స్థాపనకుగాను ప్రధాన రాజకీయ పక్షాల ఎజెండాలో భూ సంస్కరణలు ముఖ్యమైన అంశంగా ఉంటూ వచ్చాయి. స్వాతంత్య్రానంతరం భూ సంస్కరణల అమలుకు సంబంధించి ప్రభుత్వాలకు ఉండాల్సిన నిబద్ధతను (Commitment) ఒక రకంగా రాజ్యాంగమే నొక్కి చెప్పింది (ప్రవేశికలో సామ్యవాదం అనే పదం) రాజ్యాంగంలోని ఆదేశ సూత్రాల్లో ఆర్టికల్ 38లో సాంఘిక ప్రతిపత్తిలో, అవకాశాల్లో వ్యత్యాసాలను తొలగించి ఆదాయ అసమానతలను తగ్గించే విధంగా సాంఘిక వ్యవస్థను నెలకొల్పడానికి పేర్కొనగా ఆర్టికల్ 39లో భూమిపై భౌతిక వనరులపై యాజమాన్యం, సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా రాజ్య విధానాలుండాలని పేర్కొన్నారు.
భూ సంస్కరణల అమల్లో న్యాయస్థానాల జోక్యాన్ని తగ్గించే ఉద్దేశంతో, మొదటి రాజ్యాంగ సవరణ (బీహార్ భూ సంస్కరణల చట్టం – 1950) ద్వారా రాజ్యాంగంలో నూతనంగా 9వ షెడ్యూల్‌ను ఏర్పాటుచేయడం జరిగింది. ఈ షెడ్యూల్‌ను న్యాయసమీక్ష పరిధిలోకి వెలుపల ఉంచడం, భూ సంస్కరణలకు సంబంధించి చట్టాలన్నింటిలో ఇందులో చేర్చడం ద్వారా ప్రభుత్వాలు భూ సంస్కరణల అమలు పట్ల చిత్తశుద్ధితో ఉన్నట్లు నిరూపితమైంది.
తెలంగాణలో మధ్యవర్తుల వ్యవస్థ
-ప్రభుత్వానికి, సాగుదారులకు మధ్య శిస్తువసూలు, ఇతర విధుల పరంగా నియమించబడిన వారిని మధ్యవర్తులు అంటారు. వీరినే భూస్వాములు (భూస్వామ్య వ్యవస్థ) అని పిలిచేవారు.
-నాటి హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం పరిపాలనలో అనేక రకాలైన భూస్వామ్య విధానాలుండేవి. అందులో జాగీర్దారీ, ఇనాందారీ, ఖల్సా/రైత్వారీ/దివాని వ్యవస్థలు ముఖ్యమైనవి.
-జాగీర్లు : నిజాం నవాబుకు ప్రత్యేకంగా సేవ చేసిన వారికి లేదా ఆ వ్యక్తి గౌరవాన్ని నిలబెట్టడానికి ఉచితంగా నిజాం ఇచ్చిన గ్రామాలను జాగీరు అంటారు. వివిధ రూపాల్లో ఉన్న ఈ జాగీర్లు 6,535 గ్రామాల్లో 40,000 చదరపు మైళ్ల విస్తీర్ణం వరకు వ్యాపించి ఉండేవి.
-ఇనాందార్లు : కొన్ని విధులను నిర్వహించినందుకుగాను పారితోషికంగా ప్రభుత్వం ఇచ్చిన భూములను ఇనాంలు అంటారు. ఈ భూముల నుంచి వచ్చే భూమిశిస్తును పొందేహక్కును పూర్తిగానో, పాక్షికంగానో ఇనాందారులకు ఉంటుంది. దేవాలయాలు, ధర్మాలయాల నిర్వహణకు కూడా ఇనాంలను ఇచ్చేవారు. నాటి హైదరాబాద్ సంస్థానంలో 82000 ఇనాందారులుండేవారు.
-దివానీ : ఇది హైదరాబాద్ సంస్థానంలోని 60 శాతం విస్తీర్ణంలో ప్రభుత్వం ప్రత్యక్ష పాలన కింద ఉండేది. ప్రభుత్వ యంత్రాంగమే శిస్తు వసూలు చేసేది. ఈ ప్రాంతంలో కూడా 1317 ఫసలీ(1875)లో క్రమబద్ధమైన సర్వే సెటిల్మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టడానికి ముందున్న మధ్య దళారీ వ్యవస్థ సర్బస్తా, పాన్‌మక్తా, ఇజారా అనే పేర్లతో పిలువబడేది. శిస్తు వసూలు చేసే అధికారం వేలం వేసి ఈ మధ్యవర్తులకు ఇచ్చేవారు. వీరినే దేశ్‌ముఖ్‌లు, సర్దేశ్ముఖ్లు, దేశాయి, సర్దేశాయి అని పిలిచేవారు. వీరికి శిస్తు వసూలు చేసే అధికారం ఉండటంతో అనేక మార్గాల ద్వారా అనేక వేల ఎకరాలు తమ పేరున రాసుకొని 1875 తర్వాత ఖల్సా ప్రాంతాల్లో పెద్ద భూస్వాములుగా చెలామణి అయ్యారు.
-సంస్థానాలు : హైదరాబాద్ ప్రాంతంలో మొదటి నుంచి అనేక చిన్న చిన్న ప్రాంతాలకు హిందూ రాజులు అధిపతులుగా ఉండేవారు. నిజాం వీరి హక్కులను అంగీకరించడానికిగాను వీరు ప్రతి సంవత్సరం నిజాంకు పేష్కష్ రూపంలో నిర్ణీత మొత్తంలో డబ్బు చెల్లించాల్సి ఉండేది. వీరికి ఆయా ప్రాంతాల్లో విస్త్రృతమైన పరిపాలనా అధికారాలుండేవి. నాటి హైదరాబాద్ రాజ్యంలో మొత్తం 14 సంస్థానాలున్నప్పటికీ అందులో గద్వాల, వనపర్తి, జట్టిప్రోలు, అమరచింత, పాల్వంచ పెద్దవి.
-సర్ఫెఖాస్ : నిజాం సొంత ఖర్చుల కోసం నిర్దేశించిన భూమి/గ్రామాలు, వీటి నుంచి వచ్చే ఆదాయం నిజాం ఖజానాకు చేరేది. ఈ భూమి 1374 గ్రామాల్లో 5.682 చదరపు మైళ్ల విస్తీర్ణంలో విస్తరించి ఉండేది. భూస్వామ్య విధానాలన్నింటిలోనూ జాగీర్దారులు, ఇనాందారులు, సంస్థానాధీశులు చివరకు బాటకాన్ని/ శిస్తు పొందే ఖల్సా ప్రాంతంలోని పెద్ద భూస్వాములు అందరూ బాటకాన్ని పొందే అనుమస్థిత భూస్వాములుగా (Absentee landlords) మారారు. వీరి సంఖ్య 1891లో లక్ష ఉండగా 1921 నాటికి 7.6 లక్షలకు పెరిగింది. ఇదే కాలంలో కౌలుదారుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. నిజాం కాలంలో అత్యధికమైన భూకేంద్రీకరణ అధికారబలం, ఆర్థిక బలం, అంగబలంతో ఫ్యూడల్ దోపిడీ నిరాటంకంగా కొనసాగింది. దీంతో పాటు వడ్డీ వ్యాపారం, నిర్బంధలెవీ పద్ధతి, ఆర్థిక మాంద్యం మొదలైన వాటి వల్ల రైతాంగం పూర్తిగా కుంగిపోయింది.
కౌలు విధానాలు
-హైదరాబాద్ సంస్థానంలో 1354 ఫసలీ (1944)లో అసామీషక్మీ చట్టం అమలులోకి వచ్చేనాటికి రెండు రకాలైన కౌలుదారులు ఉండేవారు. 1. షక్మిదారు (శాశ్వాత కౌలుదారు) 2. అసామి షక్మిదారు (ఏ హక్కులు లేని కౌలుదారు), అసామి పక్మిదారులు కౌలు భూమిని 12 సంవత్సరాలు తమ ఆధీనంలో ఉంచుకోగలిగితే వారికి షక్మిదారులుగా గుర్తింపు లభించేది.
-1347 ఫసలీ (1937)లో రెవెన్యూ శాఖ వారి వినతిని పురస్కరించుకొని ఎం.ఎస్ భరుచా అధ్యక్షతన కౌలుదారీ కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీ కౌలుదారుల స్థితిగతులను పరిశీలించి కౌలుదారుల ఇబ్బందులను తొలగించి వాటిని బాగుపర్చకపోతే వ్యవసాయానికి, దేశానికి అనేక కష్టనష్టాలుంటాయని హెచ్చరిస్తూ, మార్పులను సూచిస్తూ ఒక కౌలుదారీ చట్టం నమూనాను రూపొందించారు. దీనికనుగుణంగా 1354 ఫసలీ (1944) హైదరాబాద్ అసామిషక్మీ చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం ఆరు సంవత్సరాల పాటు కౌలు భూమిని సేద్యం చేసినవారికి కౌలు రక్షణ కల్పిస్తుంది. అంతేకాకుండా చట్ట వ్యతిరేక లెవీ పద్ధతిని, సెస్‌లను పన్నులను వెట్టిచాకిరీని ఈ చట్టం ద్వారా నిషేధించారు.
మధ్యవర్తుల తొలగింపు చట్టం
-భారతదేశంలోని వివిధ రాష్ర్టాల్లో అఖిల భారత కాంగ్రెస్ వ్యవసాయ సంస్కరణల కమిటీ (కుమారప్ప కమిటీ), ప్రణాళిక సంఘం సూచనల మేరకు భూ సంస్కరణలను అమలు చేశారు. కానీ తెలంగాణ ప్రాంతంలో మాత్రం పోలీస్ చర్యతో నిజాంపాలనను అంతం చేసిన తర్వాత జాగీర్దారి వ్యవస్థ రద్దు, కౌలు సంస్కరణల చట్టాలను అమలు చేశారు.
జాగీర్దారీ వ్యవస్థ రద్దు
-హైదరాబాద్ సంస్థానంలో పోలీస్ చర్యల అనంతరం మిలటరీ అధికారి అయిన మేజర్ జనరల్ చౌదరి నాయకత్వాన పాలన కొనసాగింది. వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదలకు, భూస్వామ్య వ్యవస్థల వల్ల, కౌలుదారుల్లో ఉన్న అశాంతిని తొలగించడానికి అవసరమైన సూచనలు చేయడానికిగాను హైదరాబాద్ వ్యవసాయ సంస్కరణల కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీ మధ్యవర్తుల తొలగింపు, అనుమస్థితి భూస్వాముల యాజమాన్యపు రద్దు, కౌలుదార్లకు రక్షణ, భూ కమతాల గరిష్ట పరిమాణ నిర్ణయం, ఆర్థిక కమతపు పరిమాణ నిర్ణయం వంటి అంశాలకు సంబంధించిన సూచనలు చేసింది.
-1949 ఆగస్టు 15న హైదరాబాద్ జాగీర్దార్ల రద్దు, నియంత్రణ 1358 ఫసలీ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం ప్రకారం మొదట జాగీర్ భూములను తర్వాత సర్ఫెఖాస్ భూములను దివాని (రైత్వారీ) భూములుగా ప్రకటించారు. ఈ చట్టాన్ని అమలుచేయడానికిగాను జాగీర్ పరిపాలనాధికారిని 1949 సెప్టెంబర్ 1న నియమించారు. 1950 జనవరి 25న నష్టపరిహారాన్ని నిర్ణయించే నిబంధనతో హైదరాబాద్ జాగీర్ల (కమ్యూటేషన్) రెగ్యులేషన్ చట్టాన్ని రూపొందించారు.
ఇనాంల రద్దు
-1955లో హైదరాబాద్ ఇనాం భూముల రద్దు చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం ప్రకారం కొన్ని సేవల ఇనాంలను, మత సంబంధమైన చారిటబుల్ సంస్థల ఆధీనంలో ఉన్న ఇనాం భూములను మినహాయించి మిగతా ఇనాం భూములను రద్దు చేసి వీటిని సాగు చేస్తున్న రైతులకు యాజమాన్య హక్కును కల్పించారు.
కౌలు సంస్కరణలు
-అనుపస్థిత భూస్వాముల (Absentee landlords) వ్యవసాయం చేయని, చేయలేని భూ యజమానుల (Non-cultivating owners) దోపిడీ నుంచి కౌలుదారులకు రక్షణ కల్పించడానికిగాను తెలంగాణలో కౌలుదారి చట్టాలు రూపొందించారు.
-హైదరాబాద్ (తెలంగాణ ప్రాంతం) కౌలు వ్యవసాయ భూముల చట్టం – 1950
-వివిధ చారిటబుల్ మత సంబంధమైన ఇనాం భూములకు తప్ప ఈ చట్టం అన్ని రకాల భూములకు వర్తిస్తుంది.
-1342 ఫసలీ (1933) నుంచి 1352 ఫసలీ (1943) మధ్యకాలంలో వరుసగా ఆరు సంవత్సరాలు తక్కువ కాకుండా భూములను కౌలుచేస్తున్న వారిని లేదా 1948 నుంచి ఆరు సంవత్సరాలు కౌలుదారులుగా ఉన్నవారిని రక్షిత కౌలుదారులుగా గుర్తిస్తారు.
-కౌలుదారులను కౌలు తీసుకున్న కాలంలో ( లీజు పీరియడ్) బాటకం సక్రమంగా సరైన సమయంలో చెల్లిస్తున్నప్పుడు వారిని తొలగించే వీలు లేదు.
-కౌలుదారుడు కౌలుకు తీసుకున్న భూమిని ఉప విభజన చేయడంకానీ, ఆ భూమిని ఇతరులకు కౌలుకు ఇవ్వడం కాని జరిగినప్పుడు కౌలు ఒప్పందం రద్దవుతుంది.
-కౌలుదారుడు కౌలు భూమిని దుర్వినియోగపర్చినప్పుడు భూస్వామి తన భూమిని స్వాధీనం చేసుకోవచ్చు.
భూకమతాలపై గరిష్ట పరిమితి
-భూకేంద్రీకరణను, ఆర్థిక, సాంఘిక, అసమానతలను తగ్గించడానికి భూ కమతాలపై గరిష్ట పరిమితిని విధించారు. హైదరాబాద్ వ్యవసాయ సంస్కరణల కమిటీ భూ కమతాల గరిష్ట పరిమితికి కొన్ని సూచనలు చేసింది.
1. వ్యవసాయదారులకు నెలకు రూ.150 (సంవత్సరానికి రూ.1800) వచ్చే విధంగా వివిధ ప్రాంతాల్లోని భూములను ఆర్థిక కమతంగా గుర్తించాలి.
2. రెండు ఎకరాల మాగాణి లేదా 15 ఎకరాల మెట్ట భూమిని బేసిక్ ఆధారంగా కమతం గరిష్ట పరిమితిని నిర్ణయించాలి.
3. గరిష్ట పరిమాణం ఆర్థిక కమతానికి 5 రెట్లు ఉండాలని సూచించారు.
-స్వాతంత్య్రానంతర 1948లో కుమారప్ప కమిటీ చేసిన సూచనలు విప్లవాత్మకమైనవి అయినప్పటికీ మధ్యవర్తుల తొలగింపు చట్టం జమీందార్లు, జాగీర్దార్లను తొలగించడం వరకే పరిమితమైంది. అంటే దున్నేవాడిదే భూమి అనే నినాదం ఆచరణలోకి రాలేకపోయింది. దేశ రాజకీయాల్లో అనేక పరిణామాల వల్ల 1952, 1957, 1969 ఎన్నికల ఫలితాలు అనివార్యంగానే కాంగ్రెస్ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలను తీసుకోవాల్సి వచ్చింది. రాజాభరణాల రద్దు, వాణిజ్య బ్యాంకుల జాతీయీకరణ గరీబీ హఠావో నినాదానికి అనుగుణంగా పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, పటిష్టమైన భూ సంస్కరణలు మొదలైన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. 1970లో భూ సంస్కరణలపై జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ మన రాజకీయ వ్యవస్థ సంరక్షించబడాలంటే భూ సంస్కరణలనే కఠినమైన పరీక్షలో నెగ్గాల్సి ఉంటుందని తెలిపారు.
దీనికనుగుణంగా అత్యధికంగా ఉన్న వ్యవసాయ కార్మికుల్లో ప్రాంత కౌలుదార్లలో రోజురోజుకు భూమి ఆకలి (Land Hunger) పెరుగుతున్నందు వల్ల భూ కమతాలపై గరిష్ట పరిమితి చట్టానికి అధిక ప్రాధాన్యం ఉందని, గరిష్ట పరిమితి వ్యక్తులను బట్టి కాకుండా, కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకొని చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చేసిన తీర్మానాన్ని ఆ తర్వాత జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలో ఆమోదించారు. బాబు జగ్జీవన్‌రావు తన ప్రసంగంలో భూసంస్కరణలను వేగంగానూ, స్థానికంగాను తక్షణమే అమలుచేయాలని నొక్కి చెప్పాడు.
చారిత్రక నేపథ్యం
-భూ సంస్కరణలు మానవాళి ఎజెండాలో అతి పురాతన కాలం నుంచి ఉన్నాయనడానికి అనేక ఆధారాలున్నాయి. క్రీ.పూ.6వ శతాబ్దంలో ఏథెన్స్కు చెందిన రాజనీతి శాస్త్రవేత్త సోలోన్ సంపన్నుల ఆధీనంలో భూమి కేంద్రీకృతం కాకుండా నియంత్రించడానికి ప్రయత్నాలు జరిగాయని పేర్కొన్నాడు. క్రీ.పూ 7వ శతాబ్దంలో చైనాలో రాచరిక వ్యవస్థ భూ సంస్కరణలు ప్రవేశపెట్టడానికి అనేక పద్ధతులను అవలంబించింది. ఆ తర్వాత మరో నాలుగు శతాబ్దాలకు రోమ్ రాజనీతివేత్త టిరిబియన్ భూ సంస్కరణలపై చేసిన ప్రయత్నాలను చరిత్రాత్మక సంఘటనలుగా పరిగణించవచ్చు.
-19వ శతాబ్దంలో వలస విధానాన్ని అనుసరించిన ప్రభుత్వాలు తమ అధికారాలను సుస్థిరం చేసుకోవడానికి భూ యాజమాన్య హక్కులను శాసించేవారు. 20వ శతాబ్దంలో కమ్యూనిస్టు, సామ్యవాద వ్యవస్థల రాజకీయ విధానాల నుంచి భూ సంస్కరణల భావనలు వెలుగులోకి వచ్చాయని చెప్పవచ్చు. భూ యాజమాన్య హక్కు జమీందారులు వంటి భూస్వాముల చేతిలో కేంద్రీకృతమై వ్యవసాయదారులు, కౌలుదారులు శిస్తుభారాన్ని మోయలేని పరిస్థితులకు తగిన పరిష్కారంగా భూ సంస్కరణల భావన రూపుదిద్దుకుంది. రెండో ప్రపంచయుద్ధం తర్వాత జపాన్, తైవాన్ లాంటి దేశాల్లోనూ, అదేవిధంగా చైనాలో కమ్యూనిస్టు విప్లవం అనంతరం భూసంస్కరణలు విజయవంతమైన విషయాన్ని ప్రధానంగా గమనించాలి.
-సామ్యవాద ప్రాతిపదికన ఆలోచిస్తే గున్నార్ మిర్దల్, బెహర్డిన్, హెరాల్డ్ మాన్ జుకోబై వంటి ఆర్థికవేత్తల వివరణ ప్రకారం వెనకబడిన దేశాల్లో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉండటానికి ఫ్యూడల్, సెమీఫ్యూడల్ విధానాలే కారణమని, అందువల్ల వీటిలో నిర్మాణాత్మక మార్పులు తేవడానికి భూ సంస్కరణలు అనివార్యం. మరో ఆర్థికవేత్త డోరిన్ వార్నిర్ లాటిన్ అమెరికాను ఉదాహరణగా తీసుకొని వ్యవసాయ రంగంలో అభివృద్ధికి అన్ని అవకాశలున్నప్పటికీ భూస్వామ్య వ్యవస్థ దోపిడీతో అభివృద్ధి సాధ్యం కావడం లేదని జపాన్, తైవాన్ అనుభవం ద్వారా భూ సంస్కరణలతో వ్యవసాయాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపాడు. 1951లో ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన నివేదికలో వెనకబడిన దేశాల్లో ప్రస్తుతం ఉన్న దేశాల్లో ప్రస్తుతం ఉన్న వ్యవసాయ పద్ధతులు, ఆర్థికాభివృద్ధికి, బలమైన నిరోధకాలని, భూ సంస్కరణల ద్వారా ఈ నిరోధకాలను తొలగించవచ్చునని పేర్కొన్నారు.
భూ సంస్కరణలు – జాతీయ మార్గదర్శక సూత్రాలు
1. భూ గరిష్ట పరిమితి నిర్ణయించడానికి ఐదుగురు సభ్యులున్న కుటుంబాన్ని యూనిట్‌గా పరిగణించారు. కుటుంబంలో భార్యాభర్తలు, ముగ్గురు మైనర్ పిల్లలను లెక్కలోకి తీసుకోవాలి. ఇంతకన్నా ఎక్కువ మంది సభ్యులుంటే కొంత భూమిని అదనంగా పొందవచ్చు. అయితే ఇది కుటుంబ కమతానికి రెండు రెట్ల కంటే ఎక్కువ ఉండకూడదు.
2. భార్యాభర్తల పేర్ల మీద వేర్వురుగా భూములున్నప్పటికీ వారిద్దరి భూములను కలిపి పరిమితిని నిర్ణయించాలి.
3. సంవత్సరానికి రెండు పంటలు పండే మాగాణి భూమి (నీటి పారుదల సౌకర్యాలున్న భూమి) గరిష్ట పరిమితి 10 నుంచి 18 ఎకరాలు
4. సంవత్సరానికి ఒక పంట పండే భూమి మెట్ట భూమి గరిష్ట పరిమితిని 27 ఎకరాలు
5. మిగతా రకాలైన భూముల గరిష్ట పరిమితి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప (ఎడారి కొండ ప్రాంతాలు) 54 ఎకరాలకు మించరాదు.
6. నూతన సవరణలతో భూ సంస్కరణల చట్టాలను డిసెంబర్ 31, 1972 వరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించాలి.
7. ఈ నూతన సవరణలతో చట్టాలు ఎప్పుడు రూపొందించినప్పటికీ అమలు మాత్రం జనవరి 24, 1971 నుంచే జరగాలి. (Retrospective)
8. కాఫీ తేయాకు, రబ్బరు, కోకో మొదలైన తోట పంటలను పండించే భూములకు గరిష్ట పరిమితి నుంచి మినహాయించారు.
9. భూదాన ఉద్యమ భూములు రిజిస్టర్ చేసిన సహకార సంస్థలు, సహకార బ్యాంకులు, జాతీయ బ్యాంకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్థానిక సంస్థల భూములకు ఈ గరిష్ట పరిమితి చట్టం వర్తించదు.
10. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు, పరిశోధనా కేంద్రాల భూములకు గరిష్ట పరిమితి నుంచి మినహాయించారు.
11. మతపరమైన, చారిటబుల్ ట్రస్టు విద్యాలయాల భూములపై మినహాయింపు రాష్ట్ర ప్రభుత్వాల అభీష్టానికి వదిలివేశారు.
12. చెరుకు పండించే కమతాలకు మినహయింపు ఉండరాదని, చెరుకు పరిశోధన కోసం ఉపయోగపడే భూములు, పంచదార ఫ్యాక్టరీ కిందపడే భూముల విషయంలో గరిష్ట పరిమితి 100 ఎకరాలు.
13. మిగులు భూమిని పొందే పేదల కొనుగోలు శక్తిని దృష్టిలో ఉంచుకొని నష్టపరిహారాన్ని మార్కెట్ విలువ కంటే తక్కువగా నిర్ణయించాలి. భూమి బాటకాన్ని ఆధారంగా చేసుకొని నష్టపరిహారాన్ని నిర్ణయించాలి. సాధ్యమైనంతవరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై భారం పడకుండా చూడాలి.
14. మిగులు భూమి పంపకంలో భూమి లేని వ్యవసాయ కార్మికులకు ముఖ్యంగా హరిజన, గిరిజనులకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి.
15. భూ సంస్కరణల చట్టాలన్నింటినీ అమలుచేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. దీని కోసం అధికారులతో వివిధ స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేయడంతో పాటు పటిష్టమైన పాలనా వ్యవస్థను ఏర్పాటుచేయాలి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు