శాశ్వత అనుబంధం.. బంధుత్వం
సమాజంలో బంధాలు.. అనుబంధాలు అనేవి అత్యంత కీలకమైనవి. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, తాతలు, ముత్తవ్వలు. రకరకాలైన బంధుత్వాలు… శాశ్వాత బంధాలుగా.. కష్టసుఖాల్లో తోడునీడగా ఉంటూ వస్తున్నాయి. కాలక్రమేణ వ్యవస్థలో మార్పులు.. ఒక్కో తెగలో ఒక్కో రకమైన సంప్రదాయం ఇలా బంధుత్వాల రకాలపై గ్రూప్స్ సిలబస్లోని అంశాలపై మహాత్మా గాంధీ సోషల్వర్క్ డిపార్ట్మెంట్ హెడ్ శ్రవణ్ శ్రీరామ్ అందిస్తున్న ప్రత్యేక వ్యాసం …
-సాధారణ పరిభాషలో వివాహం, ప్రత్యుత్పత్తి ద్వారా వ్యక్తుల మధ్య ఏర్పడే సంబంధాన్ని బంధుత్వం అంటారు. ఇది కుటుంబంలోని వ్యక్తుల మధ్య, వివాహ బంధం ద్వారా ఏకమయిన రెండు కుటుంబాల వ్యక్తుల మధ్య సంబంధాన్ని వ్యక్తీకరిస్తుంది. ప్రపంచ ఉనికిలో ఉన్న అన్ని సముదాయాల్లో బంధుత్వముంది. కుటుంబం, కులం, గోత్రం, వివాహం, జాతి,మతం లాంటి వ్యవస్థలున్న ప్రతీ సమాజంలోనూ ఆయా సమాజాల ప్రాథమిక నిర్మాణంలో బంధుత్వం కూడా ఒక ప్రధాన భూమికగా పనిచేస్తుంది. మానవుడు పుట్టుక నుంచి చనిపోయే వరకు తన ప్రాథమిక , ద్వితీయ అవసరాలను సమాజంలో ఉన్న ఇతర సభ్యుల అవసరాలను తీరుస్తుంటాడు.
ఇలా సమాజంలో అనేక రకాల సమూహాలు ఉన్నాయి. గృహ సముహాలు, మత, రాజకీయ సమూహాల్లో బంధుత్వాలు అన్నవి వివాహం లేదా ప్రత్యుత్పత్తి, దత్తతతో ఏర్పడుతున్నాయి. బంధుత్వం, వ్యక్తుల మధ్య సంబంధాలను ఏర్పరచి, వాటిని క్రమపద్ధతిలో కూర్చి సమూహ జీవనం ద్వారా అవసరాలను తీరుస్తుంది. మానవుడు తల్లి, తండ్రి, ఇతర కుటుంబ సభ్యుల రక్షణ, పోషణ, సామాజీకరణాల అంశాల ప్రభావంతో తన జీవనాన్ని కొనసాగిస్తుంటాడు. ఈ క్రియలో ఆయా వ్యక్తుల మధ్యగల ప్రవర్తనారీతులు, నడవడికలు, బంధుత్వ ప్రమాణాలు, రీతుల ద్వారా నేర్చుకుంటూ ముందుతరాలకు అందిస్తుంటాడు. పుట్టిన ప్రతివ్యక్తి కుటుంబంలో సభ్యుడు, ఇలా బంధుత్వ సమూహంలో సభ్యత్వం పుట్టుకతోనే ప్రాప్తిస్తుంది. మానవ సమాజంలో ఉన్న నీతినియమాలు, వ్యవస్థీకృత సంబంధాలు, శాశ్వతమైన అనుబంధాలను బంధుత్వం అందిస్తుంది.
-అంతర్గత మానవ ప్రభోదన మీద ఆధారపడి సర్వవ్యాప్తమయిన బంధాలన్నింటిలోనూ మౌలికమై విలసిల్లేదే బంధుత్వమని మజుందార్ మదన్లు తమ సామాజిక మానవశాస్త్రం అనే గ్రంథంలో తెలిపారు.
-రక్త సంబంధం, వైవాహిక సంబంధం వల్ల ఏర్పడిన సాంఘిక బంధాలనే బంధుత్వం అంటారని అబర్క్రెంబై తెలిపారు.
-సర్హెన్నీమేన్, భారతీయ విస్త్రృత కుటుంబంపై అధ్యయనం చేసి పితృస్వామ్య ఆధిపత్యంలో ఉన్న కుటుంబాలను పరిశీలించి ఎన్షియంట్ లా (పురాతన చట్టం) అనే తన గ్రంథంలో KINSHIP (బంధుత్వం) అనే పదాన్ని ఉపయోగించాడు.
-1865లో మేక్లెన్నిన్ తన ఆదిమవివాహం (Primikve Marriage) అనే గ్రంథంలో మాతృవంశీయ సంబంధాలను చర్చించాడు. బంధుత్వ ప్రాముఖ్యతను విశ్లేషించాడు.
-సమాజంలో వ్యక్తుల మధ్య రక్త సంబంధంతో, వివాహం ద్వారా ఏర్పడే సంబంధం బంధుత్వం. ఇది జైవి, వైవాహిక సంబంధాలతో పాటు సామాజికపరమైన ఆమోదంతో దత్తత తీసుకోవడంతో ఏర్పడింది. ఇలా వ్యక్తుల మధ్య సంబంధాలను ఏర్పరచి, సమూహాలుగా కూర్చి, వారి ప్రవర్తనా విధానాలను నిర్వచించి, సంస్థ రూపాన్ని ఇచ్చే వ్యవస్థీకృత సంబంధాలనే బంధుత్వమని అర్థం చేసుకోవచ్చు.
బంధుత్వ విధానాలు
-మానవ శాస్త్రవేత్తలు, బంధుత్వవిధానాలను రెండు విధాలుగా గుర్తించారు. వైవాహిక బంధుత్వం, ఏకరక్త బంధుత్వం
-వివాహంతో ఏర్పడే బంధుత్వాన్ని వైవాహిక బంధుత్వం అంటారు. ఇద్దరు వేర్వేరు కుటుంబాలకు చెందిన వ్యక్తుల వివాహ బంధం ద్వారా ఏకమైతే, ఆ బంధుత్వాన్ని కేవలం ఆ ఇద్దరి మధ్యనే కాకుండా ఆ ఇద్దరి కుటుంబాల మధ్య కూడా ఏర్పడుతుంది. బంధుత్వ పరిధి విస్త్రృతమవుతుంది.
ఉదా॥ భార్య, అత్త, మామ, వదిన, మరదలు
-ఒకే రక్త సంబంధం కలిగిన వ్యక్తుల మధ్య ఉండే బంధుత్వాన్ని ఏకరక్త బంధుత్వమని పిలుస్తారు.
-మేనరిక వివాహాలు, సమాంతర పిత్రీయ సంతతి వివాహాల్లో భార్యభర్తలు వైవాహిక, ఏకరక్త బంధులవుతారు.
-ఒకే దంపతులకు జన్మించిన వారిని సంపూర్ణ రక్తసంబంధీకులు అంటారు.
-తండ్రి ఒక్కడే ఉండి తల్లులు వేరయినప్పుడు వారిని అసంపూర్ణ రక్తసంబంధీకులు అంటారు.
-ఒకే స్త్రీకి విభిన్న భర్తల ద్వారా కలిగిన సంతానాన్ని సహోదరులు లేదా క్షేత్రజులు అంటారు.
బంధుత్వ పరిభాష
-ఒక వ్యక్తికి అతని బంధువర్గంలోని సభ్యులకు మధ్యగల సంబంధాన్ని తెలియపర్చే పదాన్ని బంధుత్వపదం అంటారు. బంధుత్వ పదం వ్యక్తుల మధ్యనున్న సంబంధాల స్వభావాన్ని వ్యక్తం చేస్తుంది. బంధుత్వ పదాలు ఒక్కొక్కటి ఒక్కొక్క అర్థాన్ని ఇవ్వడమే కాకుండా ఒక్కోపదం ఒక్కొక్క విలువలను, ఆచరణలను, సూచనలను కలిగి ఉంటాయి. ముర్డాక్ బంధుత్వ పదాలను లేదా పరిభాషను మూడు రకాలుగా వర్గీకరించాడు.
బంధుత్వస్థానం/బంధుత్వస్థాయి
-బంధుత్వాన్ని పంచుకున్న వ్యక్తులంతా ఒకే సంతతి లేదా ఒకే మూల పురుషుడికి చెందిన వారైతే అది సజాతీయ బంధుత్వమంటారు. ఇందులో తండ్రి తరపు బంధువులను పితృవంశ బంధువులని, తల్లితరపు బంధువులను మాతృవంశ బంధువులని అంటారు.
-వివాహం ద్వారా వేర్వేరు మూలపురుషులకు సంబంధించిన వారి మధ్య బంధుత్వం ఏర్పడుతుంది. కావున వారి విజాతీయ బంధువులని అంటారు.
-వ్యక్తి కుటుంబంలో వ్యక్తుల మధ్య 8 రకాలైన ప్రాథమిక బంధుత్వలుంటాయి.
1.భార్య- భర్త
2.తండ్రి – కొడుకు
3.తండ్రి – కూతురు
4.తల్లి – కొడుకులు
5.తల్లి – కూతురు
6.సోదరుడు – సోదరుడు
7.సోదరి – సోదరి
8.సోదరుడు – సోదరి
-ఒక వ్యక్తికి తన కేంద్రక కుటుంబంలోని వారు దగ్గర బంధువులని, మిగతావారు దూరపు బంధువులని పరిగణిస్తాం. అయితే శాస్త్రీయ దృక్పథంలో బంధువులను
1.ప్రాథమిక బంధువులు
2.ద్వితీయ బంధువులు
3.తృతీయ బంధువులుగా వ్యవహరిస్తారు.
-వివాహం, రక్త సంబంధం ద్వారా ఏర్పడే తొలి బంధువులను ప్రాథమిక బంధువులు అంటారు. వీరినే ప్రాథమిక ఏకరక్తబంధువులు, ప్రాథమిక వైవాహిక బంధువులుగా చెప్పవచ్చు.
ఉదా: తల్లిదండ్రులకు – పిల్లలకు, పిల్లలకు – పిల్లలకు మధ్య ఉండేది ప్రాథమిక ఏకరక్త బంధుత్వం
భార్య, భర్తల మధ్య ఉండేది ప్రాథమిక వైవాహిక బంధుత్వం
-ప్రతి వ్యక్తికి గరిష్ఠంగా 7రకాల ప్రాథమిక బంధుత్వాలుంటాయి. అంతకంటే ఎక్కువ ఉండవు
-వివాహం లేదా రక్త సంబంధాల వల్ల ఏర్పడిన మలి బంధువులే ద్వితీయ బంధువులు. ఇలాంటి ద్వితీయ బంధుత్వాలు ప్రతివ్యక్తికీ 33 రకాలుంటాయి
-ఒక వ్యక్తి ప్రాథమిక బంధువుకు ద్వితీయ బంధువు అతనికి తృతీయ బంధువవుతాడు. ఇలా సుమారుగా ఒక వ్యక్తికి 151 మంది తృతీయ బంధువులుంటారు.
బంధుత్వ ఆచరణలు
బంధు సమూహంలోని వ్యక్తుల మధ్య వివిధ రకాలైన బంధుత్వాలు ఉంటాయి. ఒక్కొక్కరకమైన బంధుత్వం మరొకరిపట్ల ఒక్కొక్క రకమైన ప్రవర్తనను చూపిస్తుంది. ఇలా బంధుత్వ సమూహంలో, వివిధ బంధువుల మధ్య కనిపించే నిర్దిష్టమైన ప్రవర్తనలను బంధుత్వ ఆచరణలు అంటారు. ఈ విధంగా బంధుత్వ సమూహం నందలి వ్యక్తులు ఒకరితో మరొకరు పరస్పరచర్యలు జరిపేటప్పుడు కొన్ని నిర్దిష్టమైన ప్రవర్తనలను చూపిస్తారు. వాటిలో ముఖ్యమైనవి…
పరిహాస సంబంధాలు
కొందరి బంధువుల మధ్య హేళన, విమర్శ – హాస్యాలతో కూడిన పరిహాస సంబంధాలు మనం గమనిస్తుంటాం. ఇవి ఆయా బంధువుల మధ్య చనువు, చొరవను పెంచుతాయి. అయితే గోండుల్లో, సంతాలు తెగల్లో హేళన మితిమీరి ఆస్తుల ధ్వంసం వరకు వెళుతుంది. ఇవి అన్ని రకాల బంధువుల మధ్య ఉండదు. ఇలాంటివి సమాజం కేవలం కొందరి బంధువుల మధ్యనే అనుమతించింది.
ఉదా: తాతా, మనవడు, బావా- బావ మరదులు
-రాడ్క్లిఫ్ బ్రౌన్ వీటిని 1. సౌష్ఠవ పరిహాస సంబంధాలు 2.అసౌష్ఠవ పరిహాస సంబంధాలుగా పేర్కొన్నారు. బంధువులు ఒకరినొకరు సమానస్థాయిలో పరిహాసం చేసుకునే విధానమే సౌష్ఠవ పరిహాస సంబంధాలు. ఇలా కాక ఇద్దరు బంధువుల మధ్య కేవలం ఒక్కరికే పరిహాసం చేసే అవకాశం ఉన్నట్లయితే దానిని అసౌష్ఠవ పరిహాస సంబంధం అంటారు. అసౌష్ఠవ పరిహాస సంబంధాల ద్వారా పెద్దలు, చిన్నవారి ప్రవర్తనను అదుపులో పెడతారు. ఉదా: తాతా – మనవడిని, హాస్యంతో కూడిన మందలింపునకు గురిచేయడం.
ఉదా: బావా – మరదళ్లు, బావా -బావమరిది మధ్య ఉండేది సౌష్ఠవ పరిహాసం.
సంకేత సంబోధన (Tecnonamy):
బంధువులు నేరుగా మాట్లాడుకోకుండా, పిలుచుకోకుండా, మరోవ్యక్తి సహాయంతో వారి మధ్య సమాచార ప్రసారం గావించుకొనే ప్రవర్తనను టెక్నోనమీ అంటారు.
ఉదా: సంతాలులు ఇతరుల ముందు భర్తను నేరుగా పిలువకుండా పెద్ద కొడుకు పేరుతో భార్య పిలుస్తుంది
చెల్లీ.. ఒకసారి మీ బావను రమ్మనిచెప్పు అనడం లాంటివి.
వైదొలుగు నడవడి (Autodance)
బంధు సమూహంలో ప్రత్యేకించి కొందరు నిర్దేషించిన బంధువుల మధ్య ఎదురెదురుగా నిలబడటం,రావడం లాంటివి ఉండవు. ఒకరికొకరు తప్పకొని తిరిగే ప్రవర్తననే వైదొలుగు నడవడి అంటారు. ఇలా కొందరు బంధువుల మధ్య పరస్పరాభిముఖత నిషేధింపబడుతుంది. ఈ విధమైన ప్రవర్తన…
ఉదా 1. గోండుల్లో అత్తా – కోడలు, మామ -కోడలు మధ్య
2: ఒక వ్యక్తికి, అతడి తమ్ముడి భార్యకు మధ్య
3: అత్త – అల్లుడు మధ్య, మామా – కోడళ్ల మధ్య సర్వసాధారణంగా కనిపిస్తుంది.
కుహనా ప్రసూతి
భార్య ప్రసవ వేదనను అనుభవిస్తున్నప్పుడు ప్రసవం జరిగే గది బయట ఉండి భర్త కూడా ఆ వేదనను తదానుభూతితో చూపే ప్రవర్తననే కుహనా ప్రసూతి అంటారు. ఈ విధమైన బంధుత్వ ఆచరణ మలార్, ఖాసీలు, ఆఫ్రికాలోని ఖరించా తెగల్లో ఉంది.
-కుహనా ప్రసూతి భార్య, భర్తల మధ్య పటిష్ఠ సంబంధాన్ని సూచిస్తుంది. భార్య కష్టసమయంలో ఉన్నప్పుడు భర్త కూడా ఆమెతో సమానంగా కష్టపడుతూ తమ దాంపత్య జీవనాన్ని పటిష్ఠం చేసుకోవడానికి ఉద్దేశించినదే కుహనా ప్రసూతి అని మాలినోవ్స్కీ అభిప్రాయపడ్డారు.
-ఈ రకమైన బంధుత్వ ప్రవర్త కేవలం భార్య, భర్తల మధ్య మాత్రమే కన్పిస్తుంది.
-కొన్ని సమాజాల్లో వ్యక్తి జీవిత విశేషాలన్నింటిపైన అతని తల్లి సోదరుడు అధికారయుతమైన ప్రవర్తనను చూపుతాడు. దీనినే మాతులాధికార ఆచరణ అంటారు. అలాగే మేనత్త ఇలాంటి బంధుత్వ ఆచరణను చూపినట్లయితే పితృష్వోధికారం అంటారు.
-బంధువుల్లో ఒక బంధువు పట్ల మరో బంధువు ప్రత్యేకమైన, గౌరవం, అణకువ, విధేయతతో ఉన్నట్లయితే ఆ రకమైన ప్రవర్తనను మన్నన అంటారు. ఈ రకమైన బంధుత్వ ఆచరణ భారత్, చైనాలో కన్పిస్తుంది.
ఉదా: అన్న, తమ్ముడు, మగ పెండ్లివారు, ఆడపెండ్లి వారు, రాగానే లేచి నిలబడటం లాంటివి.
పై అంశాలతోపాటు బంధుత్వం అనే టాపిక్ కింద అభ్యసించాల్సిన ఇతర ముఖ్యమైన అంశాలు
1. నివాస బంధు సమూహం 2. వంశానుక్రమ బంధు సమూహాలు (ఏక వంశాను క్రమం, ఏక వంశను క్రమం కానివి) 3. వంశం 4. గోత్రం 5. గోత్ర కూటమి 6. ద్విశాఖ 7. టెటెమ్ సమూహాలు
2 ఏకవంశానుక్రమాన్ని పాటించే వారిలో 4 బంధు సమూహాలు అంతర్లీనంగా ఉంటాయి. 1. వంశం 2. గోత్రం 3. గోత్ర కూటమి 4. ద్విశాఖ.
-గ్లకోమాన్ అనే మానవ శాస్త్రవేత్త కింది విధంగా ఇంగ్లీష్ అక్షరాలను బంధువులను గుర్తించేందుకు ఉపయోగించాడు.
-F- Father, M – Mother, G – siblings, H – Husband, W – Wife, C-Child, P- Patrent, B – Brother, Z -Sister, E -Spouse, S -Son, t – Elder, tt – Eldest అని -, -> younger
-బంధుత్వంలో సాధారణంగా ఉపయోగించే గుర్తులు
-D – పురుషుడు, O- స్త్రీ, = – వైవాహిక సంబంధం, p- ఏకరక్త బంధుత్వం, I – వంశ క్రమం
-బంధుత్వ సాంకేతిక అక్షరాలు, తండ్రి – తం, తల్లి -త, భర్త – భ, భార్య – భా, సోదరులు – సోడు, సోదరి – సోరి, కొడుకు – కొ, కూతురు – కూ ఉపయోగిస్తారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు