ఆవరణ వ్యవస్థలు – జీవ అనుకూలనాలు..
వివిధ పరిస్థితుల్లో జీవించే జీవులు కొంత కాలం తర్వాత వాటికి అవే లేదా ఆ పరిస్థితులకు తగినట్లుగా అభివృద్ధి చెందుతాయి. వాటినే జీవ అనుకూలనాలు అంటారు.
-అనుకూలనాలు ఒక జనాభాలో కనిపించే సాధారణ లక్షణాలు. ఎందుకంటే ఇవి జీవుల మనుగడకు సహకరిస్తాయి.
-ఆవరణ వ్యవస్థలో జరిగే స్పష్టమైన, వైవిధ్యమైన మార్పులకు అనుగుణంగా జీవులు జీవించడానికి వివిధ రకాల అనుకూలనాలు ప్రదర్శిస్తాయి.
-మాంగ్రూవ్లు/ మడ అడవుల్లోని వృక్షాలు, మొక్కలు (సైప్రస్, రైజోఫోరా, అవిసేనియా మొదలగు) తడి, ఉప్పునీటి సమస్యను ఎదుర్కొవడానికి అనేక మార్గాలను అవలంబిస్తాయి. వీటి వేర్ల నుంచి శ్వాసవేళ్లు/న్యూమటోఫోర్లు అనే ప్రత్యేక నిర్మాణాలు, పార్శపు వేర్ల నుంచి ఏర్పడి నేల నుంచి బయటకు పొడుచుకొని వస్తాయి.
-ఇవి శ్వాసక్రియ విధులు, ఆక్సిజన్ గ్రహించడం, కార్బన్‌డైఆక్సైడ్ విడుదలలో పాల్గొంటున్నట్లు పేర్కొంటారు.
-శ్వాసవేళ్లు దాదాపు 12 అంగుళాల పొడవు పెరుగుతాయి. వీటిని రూపాంతరం చెందిన వేర్లుగా పేర్కొంటారు.
ఎడారి మొక్కలు (Xerophytes)
ఈ మొక్కలు నీరు లోపించిన జలాభావ పరిస్థితుల్లో పెరుగుతాయి. వీటిని మూడు రకాలుగా వర్గీకరించారు. అవి..
1.అల్పకాలిక మొక్కలు/ ఎపిమెరల్స్
2.రసభరితమైన మొక్కలు (Succulents)
3.రసభరితం కాని మొక్కలు (Non-succulents)
-అల్పకాలిక మొక్కలు ఏక వార్షికాలు. ఇవి శుష్క ప్రాంతాల్లో పెరుగుతాయి. అతి తక్కువ కాలంలో తమ జీవిత చరిత్రను ముగించుకొంటాయి. ఉదా:ట్రిబ్యులస్ (పల్లేరు)
-రసభరితమైన మొక్కలు వర్షాకాలంలో చాలా నీటిని శోషించి, ఆ నీటిని వివిధ భాగాల్లో జిగురు (మ్యూసిలేజ్) రూపంలో నిల్వ చేస్తాయి. దీని ఫలితంగా మొక్క భాగాలు – వేరు (ఆస్పరాగస్, పత్రం(ఆగేవ్), కాండం (ఒపన్షియా) రసభరితంగా ఉంటాయి.
-రసభరితం కాని మొక్కలు దీర్ఘకాలిక జలాభావ పరిస్థితుల్ని తట్టుకోగల బహు వార్షికాలు.
ఉదా: కాజురైనా (సరుగుడు)
-కలబంద మొక్కలో పత్రాలు కంటకాలుగా మార్పు చెందడంతో భాష్పోత్సేకం ద్వారా నీరు వృథా కాకుండా చూస్తాయి. కాండంలోని కణజాలాలు నీటిని నిల్వ చేసి రసభరితంగా ఉంటాయి. ఈ మార్పు ద్వారా నీటి కొరత పరిస్థితులు ఏర్పడినప్పుడు మొక్కలు వాటిని తట్టుకొని జీవించగలుగుతాయి.
-మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కిత్తనార అనే ఎడారి మొక్కలను పొలాల గట్ల మీద కంచె మాదిరిగా పెంచుతారు.
-గులక రాళ్ల మొక్కల్లో ఉబ్బిన ఆకులు ఎడారి పరిస్థితులకు అనుకూలంగా నీటి నష్టాన్ని తగ్గించి నీటిని నిల్వ చేస్తాయి. వాస్తవానికి ప్రతీ గులకరాయి పత్రం సూర్యరశ్మి పత్రంలోకి ప్రవేశించడానికి వీలుగా కోసిన కిటికీ లాంటి భాగాన్ని కలిగి ఉంటుంది. అది రాయిలా కనబడటంతో జంతువులు మోసపోయి వాటిని తినకుండా వదిలేస్తాయి.
-ఒంటెలో మూపురం కొవ్వును తర్వాత అవసరాల కోసం నిల్వ చేస్తుంది. పొడవైన కనుబొమ్మలు కంటిని ఇసుక, దుమ్ము నుంచి రక్షిస్తాయి.
-నాసికారంధ్రాలు స్వచ్ఛందంగా మూసుకోవడంతో వీచే ఇసుక నుంచి రక్షణ పొందుతుంది. పొడవైన కాళ్లు వేడెక్కిన ఇసుక నేల నుంచి శరీరాన్ని దూరంగా ఉంచుతుంది.
సైడ్ వైండర్ యాడర్స్నేక్ :
ఈ పాము పక్కకు పాకుతూ కదులుతుంది. దీని వల్ల శరీరంలోని కొంత భాగం మాత్రమే వేడెక్కిన ఇసుక తలాన్ని ఒత్తుతుంది. ఈ రకమైన కదలిక శరీరాన్ని చల్లగా ఉంచడంలో తోడ్పడుతుంది.
-గోల్డెన్మోల్ అనే జంతువు ఎండ వేడిమి నుంచి తప్పించుకోవడానికి ఇసుకలోకి దూకి ఈదుతున్నట్లు కదులుతుంది. ఇది అన్ని అవసరాలు నేల లోపలే తీర్చుకోవడం వల్ల, చాలా అరుదుగా బయటికి వస్తుంది.
-ఉత్తర అమెరికా పడమటి ఎడారిలో నివసించే క్యాంగ్రూ ఎలుక జీవితమంతా నీరు తాగకుండా జీవిస్తుంది. వీటి శరీరం జీర్ణక్రియ క్రమంలో కొంత నీటిని తయారుచేస్తుంది.
-సౌండ్గ్రౌజ్ అనే ఎడారి పక్షి నీటి కోసం చాలా దూరం ప్రయాణించి ఒయాసిస్ను చేరుకుంటుంది. తన కడుపులోని క్రాప్ అనే భాగంలో నీటిని నింపుకొని వచ్చి గూటిలోని పిల్లలకు తాగిస్తుంది.
-ఫెన్నిస్ ఫాక్స్ (బొచ్చుతో కప్పి ఉన్న పాదాలుండే ఎడారి నక్క) వేడెక్కిన ఇసుకపై నడవడానికి వీలుగా అనుకూలనం పొంది ఉంటుంది. ఇది అధిక వేడిని చెవులు ద్వారా కోల్పోతుంది.
సౌండ్ డైవింగ్ లిజార్డ్ :
-ఎడారి ఇసుక బాగా వేడిక్కినప్పుడు తన కాళ్లను గాలిలో పైకెత్తుతూ నడుస్తూ చల్లగా ఉంచుకుంటుంది.
జలావరణ వ్యవస్థలో అనుకూలనాలు
-నీటి ఆవరణ వ్యవస్థను మూడు రకాలుగా వర్గీకరిస్తారు. అవి
1. మంచినీటి ఆవరణ వ్యవస్థ – కొలనులు, సరస్సులు, నదులు
2. ఉప్పు నీరు/సముద్ర నీటి ఆవరణ వ్యవస్థ – సముద్రాలు, మహాసముద్రాలు
3. నీటిలో నివసించే జీవుల్లో సాధారణంగా శరీర నిర్మాణంలో అనేక అనుకూలనాలు ఉంటాయి.
-తాబేలు, చేపలు నీటిలో ఈదడానికి తెడ్లు వంటి వాజాలు అనే ప్రత్యేక నిర్మాణాలు కలిగి ఉంటాయి.
-చేపలు, డాల్ఫిన్స్ మొదలైన జలచరాల శరీరాల్లో ఫ్లోటర్స్ (గాలితిత్తులు – జీర్ణమండలంలోని ప్రత్యేక నిర్మాణం) ఉండటంతో నీటిలో వివిధ స్థాయిల్లో నివసించగలుగుతున్నాయి.
-వృక్ష ప్లవకాలు లాంటి కిరణజన్య సంయోగ క్రియ జరిపే సూక్ష్మ జీవులు వాటి కణాల్లో ఉండే నూనె బిందువుల సహాయంతో నీటిపై తేలుతాయి.
-నీటిలో ఉండే మొక్కలు కొన్ని చిన్నవిగా ఉండి పైకి తేలగలిగితే, పెద్ద మొక్కలు పొడవైన, బలమైన ఆకులు, మృదువైన కాండాలు కలిగి నీటి ప్రవాహానికి అనుకూలనాలు చూపుతాయి.
సముద్ర / ఉప్పునీటి ఆవరణ వ్యవస్థ
-ప్రతి సముద్రపు జీవి ఒక నిర్ణీత స్థలంలో ఉండే లవణీయత, ఉష్ణోగ్రత, వెలుతురు లాంటి మార్పులకు అనుగుణంగా అనుకూలనాలు ఏర్పరుచుకుంటుంది.
-సముద్రంలో ఉండే అధిక లవణశాతం – పెద్ద శరీరాలు ఉన్న రాకాసి స్కిడ్లు, తిమింగళాలకు అనుకూలిస్తాయి.
-సముద్ర జీవుల శరీరంలోని గాలి గదులపై సముద్రపు నీరు అధిక పీడనాన్ని కలిగిస్తుంది. రక్తం వంటి ద్రవాలపై ప్రతి 10 మీ.లకు ఒక అట్మాస్పియర్ చొప్పున వాతావరణ పీడనం పెరుగుతుంది.
-సీల్ లాంటి జంతువులు నీటిలో ఒక మైలు లోపలికి ఈదుతాయి. కొన్ని తిమింగళాలు కొన్ని మైళ్ల దూరం నీటిలో లోతుకు ఈదుకుంటూ వెళ్లగలుగుతాయి.
-సముద్రంలో నివసించే జీవులు సముద్ర పీడనాన్ని తట్టుకోవడానికి వీలుగా ఊపిరితిత్తులను పూర్తిగా కుంచింపచేస్తాయి. కొంత ఆక్సిజన్ ఊపిరితిత్తుల్లోనే ఉండిపోతుంది.
-చాలా వరకు ఆక్సిజన్ కండరాల్లో నిల్వ చేస్తాయి. అవసరాన్ని బట్టి వినియోగించుకుంటాయి.
-మన కండరాల కంటే సముద్ర జీవుల కండర కణజాలంలో ఆక్సిజన్‌ను బంధించి ఉంచే రసాయనాల సాంద్రత ఎక్కువగా ఉంటుంది.
-సముద్ర అడుగు భాగం వైవిధ్యమైన జీవులకు నిలయం. తిమింగళాలు, సీల్ (ఈదే క్షీరదాలు) లాంటి జీవుల్లో శరీర ప్లవనాన్ని సమతాస్థితిలో ఉంచడానికి ఈత తిత్తులు (Swim bladders) ఉంటాయి. శరీరంలో ఉత్పత్తి అయిన వాయువులు తిత్తుల్లో చేరడంతో అవి వ్యాకోచించి నీటిలో పైకి కదలగలుగుతాయి. ఈ వాయువులు మళ్లీ రక్తంలో విసరణ చెందడం వల్ల తిరిగి నీటి లోపలికి వెళ్ల గలుగుతాయి. చేపలు అగాథాల నుంచి బయటికి లేదా పైకి తెచ్చినప్పుడు బాహ్యపీడనం హఠాత్తుగా తగ్గినప్పుడు ఈత తిత్తి అమితంగా వ్యాకోచం చెంది నోటి ద్వారా బయటకు వస్తుంది.
-సముద్ర జీవులు వాటి శరీరంలో జరిగే మంచినీటి, ఉప్పునీటి ప్రతిచర్యలను తప్పక నియంత్రించాలి. వీటి కోసం ప్రత్యక్షంగా అభివృద్ధి చెందిన మూత్రపిండాలు, మొప్పల వంటి అవయవాలు సహాయపడతాయి. ఈ అవయవాల్లో ఉన్న ప్లాస్మా త్వచం ద్వారా జరిగే ద్రవాభిసరణం ఉప్పునీటి సాంద్రతను సమతాస్థితిలో ఉంచగలుగుతుంది.
-సముద్ర చరాలు ఆహారం నుంచి శక్తి విడుదల చేయడం కోసం నీటిలో కరిగిన ఆక్సిజన్ లాంటి వాయువులను గ్రహించగలగాలి.
-సీ ఆనిమోన్లు లాంటి జంతువులు చర్మం ద్వారా వాయువులను గ్రహిస్తాయి.
-నీటిలో చలించే జంతువులు నీటి నుంచి, గాలి నుంచి ఆక్సిజన్ గ్రహించడానికి మొప్పలు లేదా ఊపరితిత్తులను ఉపయోగిస్తాయి.
-సముద్రపు జంతువులన్నీ కార్బన్‌డైఆక్సైడ్‌ను నీటిలోకి విడుదలు చేస్తే, మొక్కలు ఆ co2ని వినియోగించి కార్బోహైడ్రేట్‌ను ఉత్పత్తి చేస్తాయి.
-సముద్ర ఉపరితలం, సముద్ర అడుగున నేలలోని ఉష్ణోగ్రతల మధ్య చాలా తేడాలుంటాయి. సముద్ర జీవులు ఈ ఉష్ణోగ్రతా వ్యత్యాసాలను తట్టుకోవడానికి వీలుగా చాలా అనుకూలనాలు చూపుతాయి.
-ఎన్నో సముద్ర జీవులు బ్లబ్బర్లు అనే కొవ్వు పొరను కలిగి ఉంటాయి. ఇది ఉష్ణబంధకంలా ఉండి చలి తీవ్రత నుంచి రక్షిస్తుంది. కొన్ని చేపలు శరీరంలోని రక్తం గడ్డకట్టకుండా ప్రవహించేలా చేయడానికి యాంటీఫ్రీజ్ వంటి పదార్థాలు కలిగి ఉంటాయి.
-సముద్ర ఉపరితల జీవులకు ఎక్కువ పోషకాలు, ఉష్ణోగ్రత అందడం, తక్కువ ఒత్తిడికి లోనవడం కాంతి ఎక్కువగా లభించడం వల్ల సముద్ర లోతులో నివసించే జీవుల కన్నా వీటికి తక్కువ అనుకూలనాలు ఉంటాయి.
-ఆల్చిప్పలు, బర్నకిల్స్ అభివృద్ధి చెందిన ప్రత్యేక అంగాలు కలిగి ఉంటాయి. వాటి సాయంతో అవి సముద్రంలోని రాళ్లను అంటిపెట్టుకొని ఉండగలుగుతాయి. అందువల్ల బలమైన సముద్ర అలల తాకిడికి కొట్టుకొనిపోకుండా తమను తాము కాపాడుకుంటాయి.
-క్లౌన్‌ఫిష్ సముద్ర ఆనిమోన్లతో సహజీవన సంబంధాలు ఏర్పర్చుకోవడం వల్ల రెండు జీవులు భక్షకాల నుంచి రక్షణ పొందుతాయి.
-సముద్ర ఆవరణ వ్యవస్థలో జీవులు సహజీవనం, రక్షించుకొనే ప్రవర్తన, దాక్కోవడం (కోమోఫ్లాగ్), ప్రత్యుత్పత్తి వ్యూహాలు, సమాచార సంబంధాలు మొదలైన ప్రత్యేక అనుకూలనాలు కలిగి ఉంటాయి. అలాగే పీడనం, ఉష్ణోగ్రత, కాంతి, లవణీయత వంటి పరిస్థితుల్లో జీవించడానికి కూడా అనుకూలనాలు కలిగి ఉంటాయి.
సముద్ర ఆవరణ వ్యవస్థలో వివిధ మండలాలు – వివరణ
-కాంతి ప్రసారం ఆధారంగా సముద్ర జీవుల్లో అనుకూలనాలు
యూఫోటిక్ మండలం
-ఈ మండలంలో నివసించే జీవులు చాలా వరకు తేలేవి, ఈదేవి
-ఈ ప్రాంతంలోని జీవులు మెరిసే శరీరాలు కలిగి ఉంటాయి. ఇవి కాంతిని పరావర్తనం చెందించి ప్రకాశవంతంగా ఉన్న నీటి ఉపరితలంతో కలిసిపోయే విధంగా లేదా పారదర్శకంగా ఉంటాయి. స్పష్టమైన దృష్టి కలిగి ఉంటాయి.
-ఈ మండలంలోని మొక్కలు దాదాపు ఆకుపచ్చగా ఉంటాయి. ఈ మండలంలో కిరణజన్య సంయోగక్రియ గరిష్ఠంగా జరుగుతుంది.
-ట్రాట్స్, హెర్రింగ్స్ చేపలు, డాల్ఫిన్లు, జెల్లీఫిష్, ప్రవాళాలు, వృక్షప్లవకాలు, శైవలాలు, మొదలైనవి ఉంటాయి.
-ఈ మండలంలో దాదాపు 80 శాతం సముద్రంలోని మొక్కలు, జంతువులు ఉంటాయి.
బెథియల్ మండలం
-ఈ మండలంలో ఎరుపు, గోధుమ వర్ణపు సముద్ర గడ్డి జాతి మొక్కలు (సీ-వీడ్స్), సముద్రపు కలుపు మొక్కలు (కెల్ఫ్లు), స్పంజికలు, ప్రవాళభిత్తికలు, స్థూపాకార శరీర నిర్మాణం ఉన్న స్క్యిడ్లు, తిమింగళాలు ఉంటాయి.
-రేఫిష్ : తక్కువ వెలుతురులో చూడటానికి వీలుగా సున్నితంగా ఉండే విశాలమైన పెద్ద కళ్లు ఉంటాయి.
అబైసల్ మండలం
-సూర్యకాంతి పూర్తిగా ఉండదు. కాబట్టి ఈ మండలం సంవత్సరం పొడవునా చీకటిగానే ఉంటుంది. కావున కిరణజన్య సంయోగక్రియ జరగదు.
-సముద్ర అడుగు భాగాల్లో నివసించే జంతువులు చాలా వరకు భక్షకాలు, పారిశుద్ధ్య జీవులు
-భక్షించబోయే జంతువులు తప్పించుకోకుండా ఉండేందుకు పెద్ద జంతువులకు విశాలమైన నోరు, పెద్దగా వంకర తిరిగిన పళ్లు ఉంటాయి.
-ఈ జంతువుల్లో బల్లపరుపు శరీరం, అస్థి పంజరాన్ని కలిగి ఉండదు.
-ఈ జీవులకు పొట్ట కింద, కళ్ల చుట్టూ, శరీర పార్శ భాగాల్లో కాంతిని ఉత్పత్తి చేసే ప్రత్యేక అవయవాలు ఉంటాయి.
-కొన్ని జీవులు చీకటిలో కూడా ప్రకాశవంతంగా (Bioluminiscene) కనిపిస్తాయి.
-ఎలక్ట్రికల్ ఈల్ చేపలు : దాదాపు 600 ఓల్టుల విద్యుత్ ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగి ఉంటాయి. ఈ విద్యుత్‌ను ఉపయోగించి అవి శత్రువుల బారి నుంచి తమను తాము కాపాడుకుంటాయి. ఇది ఒక రకమైన కత్తి చేప
-మంచినీటి ఆవరణ వ్యవస్థ : మంచినీటి ఆవరణ వ్యవస్థలు రెండు రకాలు. అవి నిశ్చలమైనవి, ప్రవహించేవి
-స్థిర జల జీవావరణ/లెంటిక్ జీవావరణ వ్యవస్థ : నిశ్చలమైన నీరు ఉండే చెరువులు, సరస్సులు, జలాశయాలు
ప్రవాహ జల ఆవరణ వ్యవస్థ
-ప్రవహించే నీరు ఉన్న సెలయేర్లు, నదులు, వాటి కాలువలు మొదలైనవి
-హైదరాబాద్‌లోని ఉస్మాన్‌సాగర్, దుర్గం చెరువు, రంగారెడ్డి జిల్లాలోని శామీర్‌పేట చెరువు, వరంగల్‌లోని వడ్డేపల్లి చెరువు, ఖమ్మంలోని పాలేరు చెరువు మొదలైన మంచినీటి జలావరణ వ్యవస్థలు.
-సరస్సులో కాంతి ప్రసారాన్ని బట్టి మూడు మండలాలుగా విభజించారు. అవి
-1. లిట్టోరల్ మండలం 2. లిమ్నోటిక్ మండలం 3. ప్రొఫండల్ మండలం
-ఈ మూడు జోన్లలో కాంతి లభించే పరిమాణాన్ని బట్టి వివిధ రకాల జీవులు ఉంటాయి.
-కాంతి, లవణీయత, ఆహారం, ఆక్సిజన్ వంటి వివిధ కారకాలు జీవులపై రకరకాలుగా ప్రభావితం చేస్తాయి.
లిట్టోరల్ మండలం / వేలాంచల మండలం
-సరస్సు ఒడ్డున తక్కువ లోతు ఉన్న భాగాన్ని లిట్టోరల్ మండలం అంటారు. ఈ మండలం సమీపంలో నీరు మట్టితో కలిసి మడ్డిగా ఉంటుంది. సరస్సు ఒడ్డున వెచ్చగా ఉండే పైభాగంలో నత్తలు, రొయ్యలు, చేపలు, ఉభయచరాలు, తూనీగ గుడ్లు, లార్వాలు ఉంటాయి.
-ఈ మండలంలో కాంతి అడుగు భాగం వరకూ ప్రసరిస్తుంది
-లిట్టోరల్ మండలాన్ని యూఫోటిక్/కాంతివంతమైన ప్రాంతం అని కూడా అంటారు.
-ఈ మండలంలో అనేక జీవులు అభివృద్ధి చెందిన దృష్టిజ్ఞానం కలిగి ఉంటాయి. వేగంగా ఈదగలిగే జీవులు, తక్కువ రంగు ఉన్న, బూడిద వర్ణం శరీరం ఉన్న జీవులు నివసిస్తాయి.
-అనేక రకాల శైవల జాతులు (నాచులు), బురద తామరలు, వాలిస్‌నేరియా, హైడ్రిల్లా వంటి మొక్కలు ఈ ప్రాంతంలో ఉంటాయి.
-ఈ మండలంలో కిరణజన్య సంయోగక్రియ రేటు అధికంగా ఉండి, ఆక్సిజన్ సమృద్ధిగా ఉంటుంది.
-తాబేళ్లు, పాములు, బాతులు ఈ మండలంలో భక్షకాలుగా జీవిస్తాయి.
-లిమ్నోటిక్ మండలం : సరస్సులోని నీటిపై భాగంలో (ఉపరితలం) బయటకు కనిపించే భాగాన్ని లిమ్నోటిక్ మండలం అంటారు. ఇది సరస్సులో తీరానికి దూరంగాఉండే ప్రాంతం
-పాక్షికంగా నీటిలో మునిగి ఉండే మొక్కల కాండాలు, ఆకులు, వేర్లలో గాలితో నిండిన అనేక ఖాళీ స్థలాలు (వాయుగదులు) ఉంటాయి. ఇవి మొక్కల్లో వాయుమార్పిడి, సమతాస్థితికి తోడ్పడుతాయి.
-గుర్రపుడెక్క (water hyacinth) : ఐకార్నియా పత్రం అంచుల్లో గాలితో నిండిన నిర్మాణాలు ఉండడంతో మొక్క నీటిపై తేలుతుంది
-కలువ మొక్కలో ఆకులు బల్లపురుపుగా ఉండి, మైనపు పూత ఉన్న ఉపరితలంతో పత్రరంధ్రాలు ఉంటాయి.
-పూర్తిగా నీటిలో తేలియాడే హైడ్రిల్లా మొక్కల్లో పత్రరంధ్రాలు ఉండవు. పలుచని ఆకులు, సులభంగా వంగే కాండాలు కలిగి ఉంటుంది.
-హైడ్రిల్లా మొక్కలు చూపే అనుకూలనాలు : కాంతి తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ, బాగా పెరగగలవు. నీటి నుంచి co2ను బాగా గ్రహించగలవు. భవిష్యత్తు అవసరాల కోసం పోషకాలను నిలువ చేయగలవు. నీటి ప్రవాహ వేగం, నీటి ఎద్దడి వంటి వివిధ రకాల పరిస్థితులను తట్టుకోగలవు.
-లవణీయత ఎక్కువగా ఉన్న ఉప్పునీటిలో కూడా పెరుగుతాయి. లైంగిక, అలైంగిక విధానాల ద్వారా కూడా ప్రత్యుత్పత్తి జరుపుతాయి.
-లిట్టోరల్, లిమ్నోటిక్ మండలాలు రెండూ కాంతి ప్రసార మండలాలే.
-ఈ మండలంలో ఎన్నో రకాల మంచినీటి చేపలు ఉంటాయి. ఇవి వాటి పరిసరాల్లో కలిసిపోయే విధంగా ప్రకాశవంతంగా ఉండే బూడిదవర్ణం, వెండి-నలుపు రంగు పొలుసులు కలిగి ఉంటాయి.
-తెలుపు శరీరాలు ఉన్న డాప్నియా, సైక్లాప్స్, చిన్న ప్రింప్ చేపలు కూడా ఉంటాయి.
-నీటిపై తేలే మొక్కలు గుర్రపుడెక్క, అంతరతామర, బుడగ తామర, వివిధ రకాల శైవలాలు
-నీటిపై స్వేచ్ఛగా తేలేవి – గుర్రపుడెక్క (ఐకార్నియా- టెర్రర్ ఆఫ్ బెంగాల్)
-నీటిలో తేలియాడేవి – హైడ్రిల్లా (కిరణజన్య సంయోగక్రియలో 02 విడుదల ప్రయోగ మొక్క)
-లగ్నికరణ చెంది, నీటిపై తేలే పత్రాలు ఉన్న మొక్కలు : కలువ (నింఫియా), నీలంబో, విక్టోరియారీజియా
-నీటిలో మునిగి ఉండి, లగ్నీకరణ చెందిన మొక్కలు : వాలిస్‌నేరియా, పొటమోజిటాన్
-కిరణజన్య సంయోగ క్రియరేటు, శ్వాసక్రియ రేటు సమానంగా ఉండే ప్రాంతాన్ని పరిహార మండలం అంటారు. ఇది లిమ్నోటిక్ మండలంలో ఉంటుంది.
నిశాచరులు (Nocturnals):
రాత్రి సమయంలో మాత్రమే బయటకు వచ్చి సంచరించే జంతువులను నిశాచరులు అంటారు. ఈ జంతువుల్లో వినడానికి, వాసన పీల్చడానికి, చూడటానికి జ్ఞానేంద్రియాలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి.
-గబ్బిలాలు : అధిక కీచుదనం శబ్దాలు చేసి వస్తువుల ఉనికి పసిగడుతాయి. ఆహారాన్ని ఎంచుకుంటాయి. శత్రువుల బారి నుంచి తమను తాము రక్షించుకుంటాయి.
-మన చుట్టూ కనిపించే నిశాచరులు – పిల్లులు, ఎలుకలు, గబ్బిలాలు, గుడ్ల గూబలు, మిణుగురు పురుగులు, క్వాటిల్ఫిష్ వంటి జీవులు రాత్రి సమయాల్లో మాత్రమే సంచరిస్తాయి.
ప్రొఫండల్ మండలం :
ఈ మండలంలో చాలా వరకు డెట్రిటివోరస్, సాప్రొఫైట్స్ ఉంటాయి. ఇవి చాలా వరకు సరస్సు అడుగు భాగంలో నివసిస్తాయి. నీటిలో ఉన్న జీవులను తినే భక్షకాలుగా లేదా వ్యర్థాలు, విసర్జిత పదార్థాలను భక్షించే పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తాయి.
-రొయ్యలు, పీతలు, ఈల్ వంటి చేపలు, ఇసుక దొండులు, నత్తలు, తాబేళ్లు మొదలైనవి జీవిస్తాయి.
-వివిధ రకాల బ్యాక్టీరియాలు (పూతికాహార) వ్యాపించి మృత జీవులను కుళ్లింపజేయటంలో తోడ్పడుతాయి.
నదీ ముఖ జీవావరణ వ్యవస్థ :
ఏ ప్రాంతంలో నది సముద్రంతో కలుస్తుందో దానిని నదీ ముఖ ద్వారం అంటారు.
-నదీ ముఖ ద్వారంలో నీటి లవణస్థాయి రుతువులపై ఆధారపడి ఉంటుంది.
-యూరిహ్లైన్ జీవులు : అధిక లవణీయత వ్యత్యాసాలను తట్టుకొనే జీవులను యూరిహ్లైన్ జీవులు అంటారు. ఇవి నదీముఖ జీవావరణ వ్యవస్థలో ఉంటాయి.
-స్టీనోహేలైన్ జీవులు : తక్కువ లవణీయతా వ్యత్యాసాలను మాత్రమే తట్టుకొనే జీవులు ఉదా : మంచినీటి, సముద్ర నీటి జీవులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు