ఆధునిక యుగ కవుల సాహిత్య సేవలు
కాళోజీ నారాయణరావు (9-9-1914 – 13-11-2002):
ఈయన జన్మస్థలం వరంగల్ సమీపంలోని మడికొండ గ్రామం. తల్లిదండ్రులు రమాబాయి, రంగారావు. సోదరుడు రామేశ్వరావు. భార్య రుక్మిణీబాయి. ప్రజాకవిగా ప్రసిద్ధిగాంచారు. ఈయన రచించిన కవితలను నా గొడవ పేరుతో దేశోద్ధారక గ్రంథమాల తరఫున ఆళ్వారుస్వామి ప్రచురించారు. ఖలీల్జిబ్రాన్ భావాలను కాళోజీ జీవనగీతగా తెలుగువారికి అందించారు. ఈయన రచించిన కథల్లో ముఖ్యమైనవి మనమే నయం, తెలియక ప్రేమ తెలిసి ద్వేషం, విభూతి, లంకా పునరుద్ధరణ, ఆగస్టు పదిహేను. ఈయన రచించిన కవితలు నా గొడవ పేరుతో ఏడు సంపుటాలుగా వెలువడ్డాయి. లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ గురించి కాళోజీ పుటుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అన్న కవితా పంక్తులు, అన్యభాషలు నేర్చి ఆంధ్రంబురాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా అనే కవితా పంక్తులు ప్రసిద్ధిగాంచాయి. భారత ప్రభుత్వంచే 1992లో పద్మవిభూషణ్ అవార్డు, అదే ఏడాది కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. ఈయన జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటగా 2015 సంవత్సరానికిగాను కాళోజీ పురస్కారాన్ని అమ్మంగి వేణుగోపాల్‌కు ప్రదానం చేసింది. కాళోజీ జయంతి అయిన సెప్టెంబర్ 9ని ప్రభుత్వం తెలంగాణ భాషాదినోత్సవంగా జరుతుపుంది.
గార్లపాటి రాఘవరెడ్డి:
ఇతడిని పీవీ నర్సింహారావు, కాళోజీలు తమ గురువుగా పేర్కొన్నారు. వరంగల్ నివాసి. ఈయన రచనల్లో ముఖ్యమైనవి సావిత్రి, రతీవిలాపం.
బద్దిరాజు సోదరులు:
బద్దిరాజు సీతారామచంద్రరావు, రాఘవ రంగారావు బద్దిరాజు సోదరులుగా ప్రసిద్ధిచెందారు. వీరి జన్మస్థలం వరంగల్ జిల్లా మానుకోట తాలూకా ఇనుగుర్తి గ్రామం. వీరు ఆంధ్ర, ఆంగ్ల, సంస్కృత, ఉర్దూ, పార్శీ భాషలను నేర్చారు. న్యాయ, వైద్యం, జ్యోతిష్య, సంగీత శాస్ర్తాల్లో పండితులు. సీతారామచంద్రారావు (1887-1956) రుద్రమదేవి చారిత్రక నవలను రాసి విజ్ఞాన చంద్రిక గ్రంథమండలి నవలల పోటీల్లో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. ఈ నవల 1918లో ముద్రింపబడింది. సీతారామచంద్రరావు శౌర్యశక్తి, భ్రమర, బ్రాహ్మణ సాహసం అనే చారిత్రక నవలలను, స్త్రీ సాహసం, ముక్తలవ అనే సాంఘిక నవలలను రాశారు. సౌదామిని పరిణయం అనే పద్య కావ్యాన్ని రచించారు.
బద్దిరాజు రాఘవ రంగారావు(1894-1973)
వీరావేశం, వరాహముద్ర అనే చారిత్రక నవలలను, తపతీసంవరణోపాఖ్యానానికి వ్యాఖ్యానం రాశారు. ఈయన రచించిన లండన్ విద్యార్థి కథ సుజాత పత్రికలో అచ్చయ్యింది. రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన నౌకాభంగాన్ని తెలుగులో అనువదించారు.
వట్టికోట ఆళ్వారుస్వామి (1915-1961):
ఈయన నవంబర్ 1, 1915న నల్లగొండ జిల్లా నకిరేకల్ సమీపంలోని చెరువుమాదారం గ్రామంలో సింహాద్రమ్మ, రామచంద్రాచార్యుల దంపతులకు జన్మించారు. చిన్నప్పుడే ఆయన తండ్రి చనిపోవడంతో సీతామారావు అనే ఉపాధ్యాయుడికి వండిపెడుతూ విద్యాభ్యాసం చేశారు. గ్రంథాలయోద్యమంలో మొదలైన ప్రేరణ ఆళ్వారుస్వామిని నిజాం వ్యతిరేక ఉద్యమం వరకు నడిపించింది. 1942-43, 1946-51 కాలాల్లో కఠినమైన జైలుశిక్ష అనుభవించారు. 1934-40 మధ్యకాలంనాటి తెలంగాణ ప్రాంత స్థితిగతులను తెలుపుతూ ప్రజల మనిషి నవలను, 1940-45 మధ్యకాలంలోని రాజకీయ, సాంఘిక ఉద్యమాల చిత్రణతో గంగు నవలను రాశా రు. జైలులోపల కథల సంపుటిని వెలువరించారు. దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి 35 పుస్తకాలను ప్రచురించారు. తెలంగాణ విశేషాలను కూర్చి తెలంగాణ పేరుతో సంపుటాలను ప్రచురించారు. ఫిబ్రవరి 5, 1961న మరణించాడు. తెలంగాణ వైతాళికుడిగా, ప్రజల మనిషిగా, తెలంగాణ గోర్కీగా ప్రసిద్ధిగాంచారు. ఈయన రచించిన వ్యాసాలు రామప్ప రభస పేరుతో అచ్చయ్యాయి.
కాంచనపల్లి చిన వెంకటరామారావు (1921-92):
ఈయన బహుముఖ ప్రజ్ఞాశాలి. కవి, రచయిత, న్యాయవాదిగా, మానవతావాదిగా ప్రసిద్ధిగాంచారు. 1960 దశకంలో నల్లగొండలో యువ రచయితలకు ఆదర్శంగా నిలిచి దర్పణం పత్రికను నడిపారు. ఈ పత్రికకు సంపాదకుడిగా ఉన్నారు. ఈయన రచించిన కథల సంపుటి మా వూళ్లో కూడానా.
అయోధ్య రామకవి:
ఈయన జన్మస్థలం వరంగల్. 1922లో జన్మించిన ఈయన బుర్రకథలను రచించి ఊరూరా తిరిగి చెబుతూ ప్రజల్లో ఉద్యమోన్ముఖులను గావించేవాడు. 1949-50 మధ్య భాగ్యనగర్ పత్రికను నడిపారు. ఈయన రచనలు తెలంగాణ మంటల్లో (కథల సంపుటి), ఆంధ్రకేసరి, ఘంటారావం, దీపావళి వంటి ఖండకావ్యాలు. విజ్ఞాన గ్రంథమాలను స్థాపించి పది పుస్తకాలను ప్రచురించారు.
ఆవుల పిచ్చయ్య:
ఈయన సామాన్య కుటుంబంలో జన్మించారు. తెలంగాణ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని కథలు రాశారు. మీజాన్ పత్రికలో పనిచేశారు. సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించారు. ఈయన రచించిన కథలను సంగిశెట్టి శ్రీనివాస్ సేకరించి పుస్తకంగా అచ్చువేశారు. పిచ్చయ్య కథల్లో ముఖ్యమైనవి ఈతగింజ ఇచ్చి తాటిగింజలాగిన జమీందార్, దౌరా, ఊరేగింపులు, వెట్టిచాకలి, దినచర్య.
సుద్దాల హనుమంతు:
ఈయన 1908 డిసెంబర్లో నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో జన్మించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో స్వయంగా పాల్గొనడమే కాకుండా తన పాటల ద్వారా ప్రజల్ని చైతన్యపర్చిన ప్రజాకవి, కళాకారుడు. ఈయన రచించిన పాటలు పల్లెటూరి పిల్లగాడ అనే పేరుతో పుస్తకరూపంలో వచ్చాయి. వీర తెలంగాణ యక్షగానం అసంపూర్తిగా రాయగా ఈయన కుమారుడు అశోక్‌తేజ పూర్తిచేశాడు.
బండారు అచ్చమాంబ (1874-1905):
ఈమె జన్మస్థలం కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు. కొమర్రాజు వెంకట లక్ష్మణరావు సోదరి. తండ్రి వెంకటప్పయ్య మునగాల సంస్థానంలో దివాన్‌గా పనిచేశారు. ఈమె బాల్యంలోనే తండ్రి మరణించడంతో తల్లి తన ఇద్దరు పిల్లలను తీసుకొని నల్లగొండ జిల్లా దేవరకొండలో ఉద్యోగియైన సవతి కొడుకు కొమర్రాజు శంకరరావు దగ్గరికి వచ్చింది. ఆ విధంగా అచ్చమాంబ బాల్యం దేవరకొండలో ఆ తర్వాత భువనగిరిలో గడిచింది. పెండ్లి అయిన తరువాత భర్త మాధవరావుతో నాగపూర్‌లో స్థిరపడ్డారు. ఈమె రచించిన మొట్టమొదటి కథ ప్రేమ పరీక్షణం. దీనిని జూలై 1898లో రాశారు. రాయసం వెంకటశివుడు నిర్వహించే తెలుగు జనానాలో అచ్చయ్యింది. కానీ ఈ రెండు కథలు ఇప్పుడు లభించడంలే దు. 1902 నుంచి 1904 మధ్య ఈమె రచించిన కథలు లభిస్తున్నాయి. అందు లో ధన త్రయోదశి కథ 1902లో హిందూ సుందరి పత్రికలో ప్రచురించబడింది. దీనిని తెలుగులో మొట్టమొదటి కథ అని భావించవచ్చు. అచ్చమాంబ రాసిన కథల్లో కొన్ని గుణవతియగు స్త్రీ, లలితాశారద, దంపతుల ప్రథమ కలహం, బీద కుటుంబం. అబలా సచ్చరిత్ర రత్నమాల పేరుతో సాహసవంతమైన స్త్రీల జీవిత చరిత్రలను రాశారు.
భాగ్యరెడ్డి వర్మ (22-5-1888 – 2-7-1960):
తల్లిదండ్రులు మాదరి వెంకటయ్య, రంగమాంబలు. సంఘసంస్కర్తగా హరిజనోద్ధరణకు కృషిచేశారు. 1914లో హైదరాబాద్‌లో బ్రహ్మసమాజం స్థాపించారు. 1915లో సంఘసంస్కార నాటక మండలిని స్థాపించి హరిజనుల చేత నాటకాలు వేయించారు. 1922లో ఆది హిందూ సాంఘిక సేవాసమితిని స్థాపించారు. ఈయన 1932లో రచించిన కథ వెట్టిమాదిగ. ఇది తెలుగు సాహిత్యంలోనే మొదటి దళిత కథ. 1906లో జగన్ మిత్రమండలిని స్థాపించి సామాన్యజనుల్లో చైతన్యం తీసుకురావడానికి కృషిచేశారు.
పొట్లపల్లి రామారావు (1917-2001):
ఈయన జన్మస్థలం వరంగల్ జిల్లా ధర్మసాగరం మండలం తాటికాయల గ్రామం. తెలంగాణ విముక్తి కోసం నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలం పట్టిన సాహితీవేత్తల్లో ఈయన ఒకరు. ఈయన రచనలు చుక్కలు, మెరుపులు, అక్షరదీప్తి అనే కవితాసంపుటాలు, పగ పారధూళి నాటికలు, జైలు (కథల సంపుటి), సైనికుని జాబులు (లేఖారచన), మా ఊరు.
సురవరం ప్రతాపరెడ్డి (1896-1953):
ఈయన మే 28, 1896న రంగమ్మ, నారాయణరెడ్డి దంపతులకు జన్మించారు. స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా ఇటికలపాడు గ్రామం. ఈయన రచనల్లో ముఖ్యమైనవి 1) శుద్ధాంత కాంత (నవల) 2) భక్తతుకారాం (నాటకం) 3) గ్రామజనదర్పణం 4) నిజాం రాష్ట్ర పాలనలు 5) హైందవ ధర్మవీరులు 6) ప్రతాపరెడ్డి కథలు 7) మొగలాయి కథలు 8) హరిశర్మోపాఖ్యానం 9) చంపకీ భ్రమర విషాదం 10) రామాయణ విశేషాలు 11) ఆంధ్రుల సాంఘిక చరిత్ర 12) హిందువుల పండుగలు. 1925లో గోల్కొండ పత్రికను స్థాపించారు. గోల్కొండ కవుల సంచికను వెలువరించారు. ఈయన రచించిన ఆంధ్రుల సాంఘిక చరిత్రకు 1955లో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందిన తొలి తెలుగు రచయిత సురవరం ప్రతాపరెడ్డి. రాజబహద్దూరు వెంకటరామారెడ్డి జీవిత చరిత్రను రాశారు. 1943లో ఆంధ్ర సారస్వత పరిషత్తు స్థాపనకు విశేష కృషిచేశారు.
సోమరాజు ఇందుమతి బాయి:
గోల్కొండ కవుల సంచికలో చోటు పొందిన పదిమంది కవయిత్రుల్లో చెప్పకోదగినవారు. ఈమె రచనలు 1) శకుంతల పరిణయం 2) గౌరి 3) వేణుగోపాలస్వామి శతకం.
దాశరథి కృష్ణమాచార్యులు (1925-1987):
ఈయన వరంగల్ జిల్లా మరిపెడ మండలంలోని చినగూడూరు గ్రామంలో జూలై 22, 1925న జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఆంగ్ల సాహిత్యం ప్రధాన విషయంగా పట్టభద్రుడయ్యారు. నిజాం పాలనను నిరసిస్తూ పోరాటం చేశారు. కళాప్రపూర్ణ బిదురుతోపాటు ఆగ్రా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేటు పొందారు. 1977లో ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవి అయ్యారు. ఈయన ఆంధ్రప్రదేశ్ చివరి ఆస్థాన కవి. దాశరథి రచనలు అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, అమృతాభిషేకం, కవితాపుష్పకం, నవమి, నవమంజరి, తిమిరంతో సమరం, ఆలోచనాలోచనాలు, గాలిబ్ గీతాలు, దాశరథి శతకం. కవితాపుష్పకం ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డును, తిమిరంతో సమరం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును పొందాయి. గాలిబ్ గీతాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ అనువాద బహుమతి లభించింది. అభ్యుదయ కవిత్వ ఉద్యమ నాయకుడైన దాశరథి నవంబర్ 5, 1987న మరణించారు. ముసలి నక్కకు రాచరికంబు దక్కునే అని నిజాం నవాబును ధిక్కరించిన కవి. తెలంగాణను కోటి రతనాల వీణగా అభివర్ణించిన కవి దాశరథి.
పెండ్యాల శ్రీనివాసరావు:
ఈయన వరంగల్ జిల్లాలో సాహితీ సామాజిక చైతన్యానికి మార్గదర్శిగా నిలిచాడు. శ్రావణి అనే కథల పుస్తకం వెలువరించారు. ఇది అలభ్యం. మరికొన్ని కథలను దాంపత్యం పేరుతో 1943లో విజ్ఞాన గ్రంథమాల వారు ప్రచురించారు.
గుంగుల శాయిరెడ్డి:
తెలంగాణ విమోచనోద్యమంలో పాల్గొని జైలుకెళ్లిన కవి. ఈయన రచించిన కావ్యం కాపుబిడ్డ. రైతుల కష్టాలను వాస్తవికంగా చిత్రించారు. రైతుల జీవితాన్ని గూర్చి రాసిన తొలికావ్యం ఇది.
మాదిరి ప్రశ్నలు
1) రుద్రమదేవి నవల రచయిత?
1) బద్దిరాజు సీతారామచంద్రారావు
2) బద్దిరాజు రాఘవ రంగారావు
3) మాడపాటి హనుమంతరావు
4) సురవరం ప్రతాపరెడ్డి
2) కిందివాటిలో మాడపాటి హనుమంతరావు కథ?
1) హృదయశల్యం
2) ముసలిదాని ఉసురు
3) అగ్నిగుండం
4) పైవన్నీ
3) కేంద్రసాహిత్య అకాడమీ బహుమతి పొందిన మొట్టమొదటి తెలుగు గ్రంథం?
1) మంటలు మానవుడు
2) కాలాన్ని నిద్రపోనివ్వను
3) ఆంధ్రుల సాంఘిక చరిత్ర
4) క్రీస్తుచరిత్ర
4) దాశరథి రచించిన కవితాపుష్పకంనకు లభించిన బహుమతి?
1) ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ
2) కేంద్రసాహిత్య అకాడమీ
3) జ్ఞానపీఠ అవార్డు
4) ప్రభుత్వ ఉత్తమ అనువాద బహుమతి
జవాబులు:
1-1, 2-4, 3-3, 4-1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు