ఆర్థిక ప్రగతికి రహదారులే జీవనాడులు..
ఒక ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే అక్కడ ఉండే మౌలిక వసతులు ప్రధానమైనవి. అలాంటి మౌలిక వసతుల్లో నీరు, భూమి, మానవ వనరుల లభ్యతతోపాటు ఆ ప్రాంతం లేదా రాష్ట్రంలో రవాణా వ్యవస్థ ముఖ్యమైనది. వనరులు సమృద్ధిగా ఉన్నచోట స్థాపించే పరిశ్రమల్లో ఉత్పత్తి అయిన వస్తువులను లేదా ఉత్పత్తులను ఒకప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరవేయాలంటే మెరుగైన రవాణా వ్యవస్థ తప్పనిసరి. అలాంటి రవాణా వ్యవస్థ ఎక్కడ సమర్థవంతంగా ఉంటుందో అక్కడ ప్రజలకు అత్యుత్తమ ఆర్థిక అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. అందువల్ల నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోని రవాణా సదుపాయాల గురించి చూద్దాం..
రహదారులు
రవాణా వ్యవస్థలోని సాధనాల్లో రహదారులు ఒకటి. మౌలిక సదుపాయాల్లో ముఖ్యమైన, ప్రాధాన్యం కలిగిన రంగం కూడా. అభివృద్ధికోసం, ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగం పుంజుకోవడం కోసం ముందస్తు అవసరాల్లో ప్రధానమైన వాటిలో ఒకటి ప్రణాళికాబద్ధంగా రోడ్లను అభివృద్ధి చేయడం. ఆర్థిక వ్యవస్థ సేవారంగంపై ఆధారపడిన, తన భవిష్యత్తు కోసం ఉత్పాదక రంగాన్ని ఎంచుకున్న, రైళ్ల అనుసంధానం తక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాలకు రైల్వే వ్యవస్థ అందుబాటు ఎక్కువగా లేని తెలంగాణలో రహదారులకు మరింత ప్రాధాన్యం ఉంది.
-దేశీయ రవాణా వ్యవస్థలోని విభిన్నమైన సాధనాల్లో 80 శాతం సరుకులు, ప్రయాణికుల రాకపోకలను రోడ్డు రవాణాయే నెరవేరుస్తున్నది. ప్రత్యేకించి గ్రామాల నుంచి పట్టణ ప్రాంతాలకు అనుసంధానమయ్యే రహదారుల వ్యవస్థ సరుకులు, సేవల రాకపోకలను వేగవంతం చేస్తుంది. అత్యధిక వృద్ధి ధోరణులకు, సామాజిక సమగ్రతకు, సమాజ శ్రేయస్సుకు దోహదపడుతుంది.
-వ్యవసాయ కార్యకలాపాల్లో అత్యున్నత సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుంటే, రహదారుల వ్యవస్థలో భారీ పెరుగుదల ఉంది. రాష్ట్రంలో 26,837 కి.మీ. రహదారి వ్యవస్థ మొత్తాన్ని రహదారులు, భవనాల (ఆర్ & బీ)శాఖ నిర్వహిస్తోంది. రాష్ట్రంలో ఆర్ అండ్ బీ నెట్వర్క్ సాంద్రత చదరపు కిలోమీటర్‌కు 0.23 కి.మీ., 1000 మంది ప్రజలకు 0.86 కి.మీ.
రాష్ట్రంలో రోడ్లు-పొడవు
-మొత్తం రోడ్డు పొడవు 26,837 కి.మీ. అందులో..
-జాతీయ రహదారులు- 2,592 కి.మీ.
-రాష్ట్ర రహదారులు- 3,152 కి.మీ.
-ప్రధాన జిల్లా రహదారులు- 12,079 కి.మీ.
-గ్రామీణ రోడ్లు- 9,014 కి.మీ.
-రాష్ట్ర రోడ్లు (జాతీయ రహదారులను మినహాయించి)- 24,245 కి.మీ.
-కోర్ నెట్ రోడ్లు- 4,020 కి.మీ.
ప్రణాళికా పనులు
-వివిధ మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాలకు మధ్య అనుసంధానాన్ని మెరుగుపర్చడం కోసం ఒక వరుస రోడ్లను రెండు వరుసల రహదారులుగా వెడల్పు చేసే పనులు చేపట్టారు. ఈ పథకం కింద 149 మండలాల్లో 1,996 కి.మీ. పొడవైన 143 పనులను రూ. 2,585 కోట్లతో చేపట్టారు.
-రాష్ట్రంలో మొత్తం అనుసంధానాన్ని పెంచాలనే లక్ష్యంతో ఇతర ముఖ్యమైన ఒక వరుస రహదారుల్ని రెండు వరుసల రోడ్ల కింద వెడల్పు చేయడం. ఈ పథకం కింద 2,721 కి.మీ. పొడవైన 260 పనుల్ని రూ. 3,704 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు.
-శిథిలమైన/ఇరుకుగా ఉన్న వంతెనల స్థానంలో, వంతెనలు లేని క్రాసింగ్‌ల వద్ద, కృష్ణా, గోదావరి నదుల పొడవున వంతెనలను నిర్మించడం వల్ల ట్రాఫిక్ భద్రత మెరుగుపడుతుంది. ఈ పథకం కింద రూ. 1,947 కోట్ల అంచనా వ్యయంతో 389 పనులను చేపట్టారు.
పనుల నిర్వహణ
-ఆస్తులను అభివృద్ధి చేయడంతోపాటు వాటి విలువను కాపాడుకోవడానికి, గరిష్ఠ ప్రయోజనాన్ని పొందడానికి వాటిని సరైన విధంగా నిర్వహించాల్సి ఉంటుంది. గడచిన అనేక ఏండ్లుగా నిర్వహణ పనులను అవసరమైన స్థాయిలో చేపట్టలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా 10,000 కి.మీ. మేర రూ. 2,400 కోట్ల అంచనా వ్యయంతో నిర్వహణ పనులను చేపట్టింది.
ఆర్ఎస్ఈడబ్ల్యూ పథకం
-ప్రస్తుతం ఉన్న రహదారుల భద్రతా ప్రమాణాలను మెరుగుపర్చడానికి ఉద్దేశించినది రహదారి భద్రతా ఇంజినీరింగ్ పనుల (ఆర్ఎస్ఈడబ్ల్యూ) పథకం. దీనికింద 37 పనులను చేపట్టారు.
రైల్వే భద్రతా పనులు
-ప్రస్తుతం ఉన్న లెవల్ క్రాసింగ్‌ల వద్ద చేపట్టేందుకు రైల్వే భద్రతా పనులు మంజూరయ్యాయి. ట్రాఫిక్ ఘర్షణను, ప్రమాదాలను తగ్గించడం, వాహనాల రాకపోకల్లో ఆటంకాలను తగ్గించడం ఈ పనుల లక్ష్యం.
జాతీయ రహదారులు
-రహదారులు, భవనాల శాఖ పరిధిలోని జాతీయ రహదారుల (ఎన్‌హెచ్) విభాగం రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి, నిర్వహణను అమలుచేసే ఏజెన్సీగా వ్యవహరిస్తున్నది. 2015, జనవరి 30 నాటికి రాష్ట్రంలో 16 జాతీయ రహదారులు ఉన్నాయి. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా 2,562 కి.మీ. వ్యాపించి ఉన్నాయి. దీనికి అదనంగా మూడు కొత్త జాతీయ రహదారులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటిపొడవు సుమారు 285 కి.మీ.
జాతీయ రహదారుల సాంద్రతలో జాతీయ సగటు 100 చ.కి.మీ. ప్రాంతానికి 2.82 కి.మీ. కాగా, తెలంగాణలో ఈ సగటు 100 చ.కి.మీ.కు 2.25 కి.మీ. రాష్ట్రంలోని 2,592 కి.మీ. జాతీయ రహదారుల్లో 768 కి.మీ. మొత్తం విస్తీర్ణాన్ని ఎన్‌హెచ్‌డీపీ కింద అభివృద్ధి కోసం ఎన్హెచ్ఏఐకి అప్పగించారు. 2014-15లో రూ. 356 కోట్ల విలువైన రోడ్డు పనులను, రూ. 64.20 కోట్ల విలువైన వంతెనల పనులను రహదారి రవాణా, హైవేల మంత్రిత్వశాఖ (ఎంఓఆర్టీహెచ్) ఆమోదించింది.
ఎన్‌హెచ్‌డీపీ-4
-జాతీయ రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎన్‌హెచ్‌డీపీ) కింద (నాలుగో దశ) 8 పనులను (చదును చేసిన అంచులతో రెండు వరుసల్లో) 473 కి.మీ. పొడవున రూ. 1732 కోట్లతో చేపట్టారు.
ఈపీసీ-కారిడార్ అప్రోచ్
-కారిడార్ అప్రోచ్ కింద నాలుగు పనులను 174.9 కి.మీ. మేర రూ. 373 కోట్ల వ్యయంతో చేపట్టారు.
సీఆర్ఎఫ్ పనులు
-రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ (ఎంఓ ఆర్టీ అండ్ హెచ్) రాష్ట్రంలో కేంద్ర రహదారి నిధుల కింద రెండు దశల్లో రూ. 615.75 కోట్ల విలువైన 58 పనులను మంజూరు చేసింది.
ఎల్‌డబ్ల్యూ ప్రాంత అభివృద్ధి పథకం
వామపక్ష తీవ్రవాద ప్రభావిత (ఎల్‌డబ్ల్యూ) పథకం ఒకటో దశ, రెండో దశల కింద సుమారు 29 పనులను చేపట్టారు. వీటిలో 23 పనులు పూర్తయ్యాయి. వీటి ద్వారా రూ. 683.69 కోట్ల ఖర్చుతో మొత్తం 508.94 కి.మీ. పొడవున రహదారి పనులు జరిగాయి. కాగా, రూ. 396.54 కోట్ల వ్యయంతో 89.13 కి.మీ. మేర చేపట్టిన రోడ్ల పనులు పురోగతిలో ఉన్నాయి.
-రవాణా శాఖ కార్యకలాపాల్లో పారదర్శకతకోసం, వినియోగదారులకు అందుబాటులో ఉండటం కోసం శాఖకు సంబంధించిన కార్యాలయాలతోపాటు ఇంటర్నెట్, మీ-సేవ కేంద్రాల ద్వారా తన సేవలను అనేక మార్గాల్లో అందిస్తున్నది.
-రాష్ట్రంలో మొత్తం 15 చెక్‌పోస్టులు, 11 ఎంవీఐ కార్యాలయాలు మూడంచెల నిర్మాణానికి అనుసంధానమయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని మొత్తం 66 ప్రదేశాలు మూడంచెల సాఫ్ట్‌వేర్‌లోకి మారాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కార్యాలయాల ద్వారా రోజు సగటున 29 వేల లావాదేవీలు జరుగుతున్నాయి.
రాకపోకల్లో ప్రధానాంశాలు
-2014-15 (ఏప్రిల్ 14 – డిసెంబర్ 14)లో దేశీయ ప్రయాణికుల్లో వృద్ధి సంవత్సరం నుంచి సంవత్సరానికి (వైఓవై) 20 శాతం నమోదైంది. అదే సమయంలో అంతర్జాతీయ ప్రయాణికుల్లో వృద్ధి 13 శాతంగా ఉంది. మొత్తం ప్రయాణికుల రాకపోకల్లో 18 శాతం వైఓవై వృద్ధి కనిపించింది. అదే కాల వ్యవధిలో 77 లక్షల 50 వేల మంది ప్రయాణికులకు ఈ విమానాశ్రయం సేవలందించింది.
ఎయిర్ ట్రాఫిక్ మూవ్మెంట్స్ (ఏటీఎం)
-2014-15 (ఏప్రిల్ 14- డిసెంబర్ 14) సంవత్సరంలో దేశీయ ఏటీఎం వృద్ధి సుమారు 9 శాతం వైఓవై కాగా అంతర్జాతీయ ఏటీఎం వృద్ధి 7 శాతంగా ఉంది. మొత్తం ఏటీఎంలో వృద్ధి 9 శాతం కనిపించింది. అదే కాలవ్యవధిలో ఈ విమానాశ్రయం 71,308 ఏటీఎం నిర్వహించింది.
సరకుల రవాణా
-2014-15 (ఏప్రిల్ 14- డిసెంబర్ 14) సంవత్సరంలో దేశీయ కార్గోలో వృద్ధి సుమారు 18 శాతం వైఓవై కాగా అంతర్జాతీయ కార్గో పరిమాణం 13 శాతానికి పెరిగింది. మొత్తం కార్గోలో 15 శాతం వృద్ధి కనిపించింది. అదే కాలవ్యవధిలో ఈ విమానాశ్రయం 77,226 టన్నుల కార్గోను నిర్వహించింది.
విమానాశ్రయాలు
-హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాని (ఆర్జీఐఏ)కి హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ సొంతదారే కాకుండా, నిర్వహణ బాధ్యతలు కూడా వహిస్తోంది. ఇది పీపీపీ ప్రాజెక్టు. విమానాశ్రయ నిర్మాణంలో తొలిదశకు మొత్తం పెట్టుబడి రూ. 2920 కోట్లు. ఆర్జీహెచ్ఐఎల్ ఓ జాయింట్ వెంచర్ కంపెనీ. దీనికి జీఎంఆర్ గ్రూప్ (63 శాతం) ప్రమోటర్ కాగా, మలేసియా ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్ బెర్హద్ (ఎంఏహెచ్‌బీ- 11 శాతం), రాష్ట్ర ప్రభుత్వం (11 శాతం), ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (13 శాతం) ఇతర కన్సార్టియం భాగస్వాములు. 2014, డిసెంబర్ 31 నాటికి, ఆర్జీహెచ్ఐఎల్లో 485 మంది ఉద్యోగులున్నారు.
అనుసంధానం
-విమానాశ్రయాన్ని చేరుకోవడానికి రెండు ప్రధాన మార్గాలున్నాయి. పశ్చిమదిశ నుంచి జాతీయ రహదారి ఎన్‌హెచ్-7, ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్ఆర్) మీదుగా ఉన్న మార్గం ఒకటి కాగా, తూర్పు వైపు నుంచి శ్రీశైలం రాష్ట్ర రహదారి రెండోది. ఓఆర్ఆర్ మొదటి దశ విమానాశ్రయానికి సైబరాబాద్‌ను అనుసంధానిస్తోంది. ఈ తరహాలో ఇదే మొదటిదైన 11.8 కి.మీ. ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే (పీవీఎన్ఆర్) ఎన్‌హెచ్-7 ద్వారా నగరం మధ్య నుంచి విమానాశ్రయానికి కేవలం 30 ని.మి.ల్లో ప్రయాణికులు చేరుకునేందుకు దోహదపడుతోంది. వీటితోపాటుగా మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్ (ఎంఎంటీఎస్), మోనో రైల్ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్ (ఎంఎంఆర్టీఎస్) ఇతర ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో చురుగ్గా అన్వేషించడం జరుగుతోంది.
ఆర్జీఐఏలో నూతన పరిణామాలు
-ఖతార్ ఎయిర్వేస్ కార్గో వారానికి రెండు రోజులు సరకు రవాణా కార్యకలాపాలు ప్రారంభించింది.
-టర్కిష్ కార్గో వారానికోసారి సరకు రవాణా కార్యకలాపాలను ఆరంభించింది.
-ఎయిర్ ఏషియా మలేషియా నేరుగా ప్రయాణికుల విమాన సేవలను కౌలాలంపూర్ నుంచి ప్రారంభించింది.
-గల్ఫ్ ఎయిర్ నేరుగా ప్రయాణికుల విమానాలను బహ్రైన్ నుంచి ప్రారంభించింది.
-ప్రయాణికుల అనుభవాన్ని, రిటైల్ ఎంపికలను పెంచడం కోసం ఇంటర్నేషనల్ సెక్యూరిటీ హోల్డ్ ఏరియాలో రిటైల్ సౌకర్యాలను ఉన్నతీకరించింది.
-రాష్ట్రంలో పర్యాటకరంగ కార్యకలాపాలను ప్రోత్సహించడం కోసం విమానాశ్రయంలో తెలంగాణ టూరిజం కోసం ప్రత్యేకించిన కౌంటర్ ప్రారంభంమైంది.
-సందర్శకులు వచ్చిన తరువాత వీసా తీసుకునే వెసులుబాటు (టూరిస్ట్ వీసా ఆన్ ఎరైవల్ – టీవీఓఏ)ను ఎలక్ట్రాన్ ట్రావెల్ ఆథరైజేషన్ (ఈటీఏ)తో పాటుగా 43 దేశాలవారి కోసం ఆర్జీఐఏలో 2014 డిసెంబర్ 1 నుంచి ఆరంభించి అమలు చేస్తున్నారు.
-ఏరోస్పేస్ పార్క్‌లో ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు కోసం యునైటెడ్ టెక్నాలజీ కార్పొరేషన్ ఇండియా లీజు ఒప్పందం మీద సంతకాలు చేసింది. నిర్మాణ పనుల ప్రారంభానికి సూచికగా శంకుస్థాపన జరిగింది.
-ఆర్జీఐఏ ఏరోస్పేస్ పార్క్ లోపల అత్యాధునిక విమాన విడిభాగాల బ్యాంక్ ఏర్పాటు కోసం గ్లోబల్ ఏరో టెక్ ఇండియాతో లీజు ఒప్పందం మీద సంతకాలు జరిగాయి.
టీఎస్ఆర్టీసీ
-తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పరిధిలో 3 జోన్లు, 10 రీజియన్లు, 94 డిపోలు ఉన్నాయి. మొత్తం వాహన శ్రేణిలో 10,342 బస్సులున్నాయి. 2013-14 చివరి నాటికి 0.58 లక్షల మంది ఉద్యోగులు విధి నిర్వహణలో ఉన్నారు. ఇదేకాలంలో ఇంధన సామర్థ్యం లీటరుకు 5.18గా ఉంది. ఈ సంస్థ 34.17 లక్షల కి.మీ. మేర బస్సులు నడుపుతోంది. రోజూ 83.15 లక్షల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తోంది. సగటు వాహన ఉత్పాదకత రోజుకు 331 కి.మీ.
పంచాయతీ రాజ్ రోడ్లు
-గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం అవసరమైన ప్రణాళిక, రూపకల్పన, అమలు, నిర్వహణ కార్యక్రమాలను పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం చేపడుతుంది. గ్రామీణ రహదారుల నిర్మాణం, నిర్వహణ, గ్రామీణ అంతర్గత రహదారుల అభివృద్ధి, జెడ్పీపీ, ఎంపీపీ, జీపీ, సామాజిక భవనాల వంటి భవనాలను వివిధ పథకాల కింద నిర్మాణం లాంటి పనుల్లో స్థానిక సంస్థలకు సహకారం అందిస్తుంది. రాష్ట్రంలో పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగం పరిధిలో 2014, ఏప్రిల్ 1 నాటికి ఉన్న గ్రామీణ రహదారుల మొత్తం పొడవు 64,046 కి.మీ. ఇందులో..
-సీసీ అండ్ బీటీ రహదారులు: 20,282 కి.మీ.
-డబ్ల్యూబీఎం రహదారులు: 14,146 కి.మీ.
-కంకర రోడ్లు: 14,734 కి.మీ.
-మట్టి రోడ్లు: 14,884 కి.మీ.
రహదారులను సీడీ పనులతో సహా బీటీ ప్రమాణానికి పెంచడం కోసం 2014-15లో 1409 పనులను రూ. 1952.22 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు. దీంతోపాటు బీటీ పునరుద్ధరణలు, సీడీ పనుల మరమ్మతుల కోసం రూ. 1766.92 కోట్లతో 3,426 పనులు చేపట్టారు.
భవనాలు
-రాష్ట్రంలోని ప్రభుత్వ రెసిడెన్షియల్, నాన్-రెసిడెన్షియల్ భవనాల నిర్మాణ వైశాల్యం 38.85 లక్షల చ.అడుగులు, 12.27 ల.చ.అ ఉంది. 2014-15లో 14,384 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన 46 భారీ పనులు పురోగతిలో ఉన్నాయి. దీంతోపాటు 2014-15లో రూ. 8643.45 లక్షల అంచనా వ్యయంతో 29 భారీ పనులను చేపట్టారు.
రవాణా
-రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో రోడ్డు రవాణా ముఖ్యభూమిక పోషిస్తుంది. డ్రైవర్లకు లైసెన్సుల జారీ, మోటారు వాహనాల రిజిస్ట్రేషన్, మోటార్ పర్మిట్ల లెవీని జారీ చేయడం, మోటారు వాహనాల పన్ను వసూలు, వాహన అతిక్రమణలను అదుపుచేయడంలో రవాణా శాఖ ముఖ్యభూమిక పోషిస్తోంది. రహదారి భద్రతకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్నది.
-రాష్ట్రంలో 2015, ఫిబ్రవరి 1 నాటికి 77 లక్షల కంటే అధికంగా వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. రహదారుల మీద ప్రయాణించే వాహనాల్లో 74 శాతం ద్విచక్ర వాహనాలే. ఆ తర్వాతి స్థానం కార్లు ఉన్నాయి.
-రోడ్లపై ప్రయాణించే రిజిస్టర్ అయిన మోటారు వాహనాల వివరాలు (2015, జనవరి 31 నాటికి)
-ఆటో రిక్షాలు- 2,91,354
-కాంట్రాక్ట్ క్యారేజీ వాహనాలు- 6,466
-విద్యాసంస్థల వాహనాలు- 20,243
-సరకు రవాణా వాహనాలు- 3,28,087
-మాక్సి క్యాబ్‌లు- 18,978
-మోపెడ్, మోటార్ సైకిళ్లు- 57,22,894
-మోటార్ కార్లు- 9,24,778
-మోటార్ క్యాబ్‌లు- 62,590
-ప్రైవేట్ సేవల వాహనాలు- 2,482
-స్టేజీ క్యారేజ్ వాహనాలు- 15,572
-ట్రాక్టర్లు, ట్రైలర్లు- 2,85,581
-ఇతర వాహనాలు- 42,090
-మొత్తం వాహనాల సంఖ్య: 77,21,115
-డైవింగ్ లైసెన్సుల జారీ, రిజిస్ట్రేషన్లు, పర్మిట్లు, పన్నుల ద్వారా ఆదాయాలను రవాణా శాఖ వసూలు చేస్తుంది.
ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)
-హెచ్‌కేఆర్ రహదారి: హైదరాబాద్-కరీంనగర్-రామగుండం (హెచ్‌కేఆర్) రహదారి మొత్తం పొడవు 206.85 కి.మీ. ఇందులో 190.19 కి.మీ. పొడవున వాణిజ్య కార్యక్రమాలు 2014, జూన్ 1న ప్రారంభమయ్యాయి.
-ఎన్ఏఎం రహదారి: నార్కట్‌పల్లి-అద్దంకి-మేదరమెట్ల (ఎన్ఏఎం) రహదారి మొత్తం పొడవు 212.50 కి.మీ.లో 2014, మార్చి 11న 190.38 కి.మీ. పొడవున వాణిజ్య కార్యకలాపాలు మొదలయ్యాయి.
పీపీపీ-బీఓటీ విధానంలో ప్రతిపాదించిన రోడ్లు
-సంగారెడ్డి-నాగ్‌పూర్-తూప్రాన్-గజ్వెల్-భువనగిరి-చిట్యాల రోడ్డు – 164 కి.మీ.
-మహబూబ్‌నగర్-నల్లగొండ రోడ్డు – 163.20 కి.మీ.
-హైదరాబాద్-నర్సాపూర్ రోడ్డు – 28 కి.మీ.
-జనగాం-చేర్యాల-దుద్దెడ రోడ్డు – 46.40 కి.మీ.
-జనగాం-సూర్యాపేట రోడ్డు – 84.40 కి.మీ.
-సూర్యాపేట-మోతె-ఖమ్మం రోడ్డు – 58.30 కి.మీ.
-హైదరాబాద్-బీజాపూర్ రోడ్డు (కి.మీ. 23/6 నుంచి 60/0-మన్నెగూడ వరకు) – 36.40 కి.మీ.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు