తెలంగాణలో జీవ వైవిధ్యం ఇలా..!
జీవ వైవిధ్యానికి తెలంగాణ రాష్ట్రం కాణాచి. అనేక రకాల జంతు, పక్షి జాతులకు నెలవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కలువటానికి ముందు తెలంగాణ దట్టమైన అడవులతో అలరారింది. ఇప్పటికీ దేశంలో ఎక్కువ విస్తీర్ణంలో అడవులు ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటి. అటవీ సంపదపై ఆధారపడి జీవిస్తున్న ప్రజలు కూడా రాష్ట్రంలో ఎక్కువగానే ఉన్నారు. రాష్ట్రంలో దాదాపు ప్రతి గ్రామానికి అనుబంధంగా చెరువులు ఉండటంతో మత్స్య పరిశ్రమ కూడా చాలా మందికి జీవనాధారంగా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన చెరువులను మిషన్ కాకతీయ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరిస్తుండటంతో పరోక్షంగా మత్స్య పరిశ్రమకు కూడా మేలు జరుగుతున్నది. రాష్ట్రంలోని అడవులు, అటవీ సంపద, మత్స్య, పట్టు తదితర వ్యవసాయ అనుబంధరంగాలపై టీఎస్పీఎస్సీ గ్రూప్స్‌లో తప్పకుండా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నిపుణ పాఠకుల కోసం ఈ వ్యాసం..
2014-15లో వర్తమాన ధరల వద్ద, రాష్ట్ర జీఎస్డీపీలో మత్స్య సంపద రంగం 0.6 శాతం అందిస్తున్నది. వ్యవసాయరంగం నుంచి సమకూరే స్థూల రాష్ర్టోత్పత్తిలో 3.47 శాతం మత్స్యరంగం నుంచే అందుతున్నది.
మత్స్య ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచాలని, వాటికి అవసరమైన పునాదిని నిర్మించాలని, అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకోవాలని మత్స్యశాఖ లక్ష్యంగా పెట్టుకున్నది. ఆహార భద్రతకు, పోషణకు, ఆరోగ్యానికి, గ్రామీణ ప్రజల జీవనోపాధి భద్రతకు, చేపలు పట్టేవారి సంక్షేమానికి ఈ రంగం గణనీయంగా తోడ్పడుతున్నది.
రాష్ట్రంలో 78 జలాశయాలున్నాయి. ఇందులో 53 జలాశయాల్లో నీరు వ్యాపించిన విస్తీర్ణం 1,000 హెక్టార్లలోపు 17 జలాశయాల్లో నీరు వ్యాపించిన విస్తీర్ణం 1000-5000 హెక్టార్లు, 8 జలాశయాల్లో నీటి విస్తీర్ణం 5000 హెక్టారు ్లపైబడి ఉంది.
రాష్ట్రంలోని మొత్తం చెరువుల్లో వరంగల్, మెదక్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 600కి పైగా ఉన్నాయి. దీనిప్రకారం చెరువులు, జలాశయాల ద్వారా మత్స్యాభివృద్ధి అవకాశాలు అత్యున్నతంగా వరంగల్, మహబూబ్‌నగర్, కరీంనగర్, మెదక్ జిల్లాలు ఉన్నాయి.
-2014-15లో రాష్ట్రంలో 2.92 లక్షల టన్నుల చేపలను, రొయ్యలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, 2014 డిసెంబర్ నాటికి 1.69 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది. చేపలను, రొయ్యలను 2015-16లో 3.21 లక్షల టన్నులు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
-రాష్ట్రంలో 19.04 లక్షల మంది చేపలు పట్టే వృత్తిలో ఉన్నారు. వీరిలో ఎక్కువగా వరంగల్, మహబూబ్‌నగర్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో ఉన్నారు. కేంద్రం సహకారంతో సమాచార పునాదిని, అనుసంధానాన్ని పటిష్టం చేసుకోవడం, మంచినీటి చేపల పెంపకాన్ని నమోదు చేయడం, మత్స్యకారులకు సామూహిక ప్రమాదబీమా, చిరుచేపలు, మంచుపెట్ట్టెల సరఫరా వంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రణాళిక కింద జరుగుతున్నాయి.
-ఎస్టీలకు చెందిన మత్స్యకారులకు ముడి వనరుల సరఫరా, పడవల సరఫరా, ఎస్టీల చేత చేపలు/రొయ్యల చెరువులు నెలకొల్పడం, ఎస్టీల చేత చేప విత్తనాల ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయించడం, మోపెడ్లు, సామాను ఆటోలతో విక్రయ విభాగాలను పెట్టించడం వంటివి ఈ కార్యక్రమంలోని భాగాలు. ఆక్వా కల్చర్ కిందకు వచ్చే చేపల చెరువుల్లో ఎక్కువ భాగం ఖమ్మం జిల్లాలో ఉన్నాయి. మహబూబ్‌నగర్, నల్లగొండ, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలు రొయ్యల సాగును చేపట్టాయి.
మత్య్స సంపద అభివృద్ధి
-మత్స్య పరిశ్రమ అభివృద్ధి కోసం రూ. 3,856.72 లక్షల వ్యయంతో ప్రభుత్వం ఒక సమగ్ర ప్రాజెక్టుని ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు ఉద్దేశం, ఉత్పాదకతను పెంచడం, పంట అనంతర నష్టాలను తగ్గించడం, జీవనోపాధి బలాన్ని పెంచడం, సహజ వనరులు, నిర్మిత వనరులు రెండింటికి చెందిన మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేయడం. ఎస్సీ, ఎస్టీ మత్స్యకారులతో సహా మత్స్య కారులందరికి సమష్టి ఆస్తులను నిర్మించడం ఈ ప్రాజెక్టులోని ప్రతిపాదనలు.
స్వయం సహాయ బృందాలు
-మత్స్య మిత్ర బృందాలు (ఎంఎంజీ)గా వ్యవహరించే మత్స్యకారిణుల స్వయం సహాయ బృందాలను రాష్ట్రంలో నెలకొల్పారు. 1, 068 మంది సభ్యులతో 383 మత్స్యకారిణుల సహకార సంఘాలను ఏర్పాటు చేశారు. ఈ సంఘాల పరిధిలోనే ఎంఎంజీలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికి 8,700 మంది మత్స్యకారిణులతో 868 ఎంఎంజీలను ఏర్పాటు చేశారు. ఈ ఎంఎంజీలు తమ సూక్ష్మ వ్యాపార ప్రణాళికను సిద్ధం చేసుకొని, తమ ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చే ఆదాయోత్పత్తి పథకాలను చేపడుతాయి. ముఖ్యమంత్రి ప్యాకేజీ కింద, ఆర్కేవీవై కింద ఈ బృందాలకు రివాల్వింగ్ ఫండ్‌ను అందిస్తారు. 10 నుంచి 15 మంది మహిళలతో ఏర్పడే బృందానికి రూ. 25,000 చొప్పున అందిస్తాయి. రాష్ట్రంలో ఇప్పటికి 550 ఎంఎంజీలకు రూ. 138.65 లక్షల ఆర్థిక సహాయం చేశారు.
అటవీసంపద- కలప రంగం
-వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఒకటైన అటవీ సంపద, కలప రంగం 2014-15లో రాష్ట్ర స్థూలోత్పత్తి (జీఎస్డీపీ)లో వర్తమాన ధరల్లో 0.9 శాతం, మొత్తం వ్యవసాయ రంగ జీఎస్డీపీలో 5.02 శాతం ఉంటాయి.
-అడవుల ప్రాముఖ్యత, మానవుడి జీవనాధారాలు పీల్చేగాలి, తాగేనీరు నాణ్యతను, పర్యావరణాన్ని కాపాడుతున్నది.
-గ్రామీణ పేదల జీవనోపాధికి కార్యకలాపాలకు మద్దతుగా నిలుస్తాయి.
-రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలను ఇస్తాయి.
-భూతాపం ప్రమాదాన్ని తగ్గించడానికి అడవులు పెన్నిది.
-ఇంకా భూసార పరిరక్షణకు, ప్రమాదంలో ఉన్న వన్యప్రాణి జాతులను కాపాడటానికి అడవులే శరణ్యం.
-1,14,865 చ.కి.మీ భౌగోళిక విస్తీర్ణం కలిగిన తెలంగాణ రాష్ట్రం, సామాజిక వనాలతో కలిపి 21, 024 చ.కి.మీ విస్తీర్ణం గల అడవితో అంటే 25.46 శాతం హరిత విస్తీర్ణంతో భారత్ 12వ స్థానంలో ఉంది.
-29, 242 చ.కి. మీ హరిత విస్తీర్ణంలో..
1. రిజర్వుడు అటవీ ప్రాంతం- 21,024 చ.కి.మీ
2. రక్షిత అడవులు – 7,468 చ.కి.మీ
3. అవర్గీకృత భూభాగం – 750 చ.కి.మీ గా విభజించారు.
-2014 డిసెంబర్ వరకు అటవీ ఉత్పత్తుల నుంచి రాష్ట్రానికి లభించిన మొత్తం రాబడి రూ.54.16 కోట్లు.
-పై గణాంకాల్లో అటవీ విస్తీర్ణం ఖమ్మం జిల్లా 52.64 శాతంతో అగ్రస్థానంలో, తర్వాత ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలు ఉన్నాయి. అదే విధంగా అటవీ విస్తీర్ణం మహబూబ్‌నగర్ 18,432 చ.కి.మీలతో మొదటిస్థానంలో ఉంది. తర్వాతి స్థానంలో ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలు నిలిచాయి.
2 2,939 రకాల వృక్షజాతులు, 365 రకాల పక్షిజాతులతో, 103 రకాల క్షీరదాల జాతులు, 28 రకాల సరీసృపాలు, 21 రకాల ఉభయచర జాతులతో పెద్ద సంఖ్యలో ఉన్న అకశేరుక (వెన్నుముకలేని) జంతుజాలలతో ఎంతో వైవిధ్యభరితంగా తెలంగాణ ఉంది.
-తెలంగాణలో అంతరించిపోతున్న ముఖ్యమైన జంతుజాతులు పెద్దపులులు, చిరుతపులులు, అడవిదున్నలు, నాలుగు కొమ్ముల జింకలు, కృష్ణజింకలు, మంచినీటి మొసళ్లున్నాయి.
-నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల మీదుగా ఖమ్మం జిల్లా వరకు గోదావరి నదీతీరం వెంబడి ఉన్న దట్టమైన టేకు తోటలు తెలంగాణ అడవులకు వరంగా ఉన్నాయి.
-టేకుకి తోడు ఏటా ఆకురాల్చే జాతులకు చెందిన నల్లమద్ది, రోజ్‌వుడ్, నరేపా, వెదురు మొదలైన అనేక రకాల వృక్షాలకు తెలంగాణ అడవులు నిలయంగా ఉన్నాయి.
-సవరించిన 2002 రాష్ట్ర అటవీ విధానం, విజన్-2020 అనుసరించి అడవులను పరిరక్షించడానికి మరింత అడవిని వృద్ధి చేయడం, ఉత్పాదికతను మెరుగుపర్చడం, ఆర్థిక పరమైన విలువను పెంచడానికి రాష్ట్ర అటవీశాఖకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నది.
ఈ కార్యక్రమాల ప్రధాన ఆశయాలు
-ప్రజలతో కలిసి అటవీ నిర్వహణ
-కేంద్ర ఆర్థిక సహాయంతో జాతీయ పశుపోషణ కార్యక్రమం
-ఆర్ఐడీఎఫ్ ప్రాజెక్టులు, భూసారం- తేమ పరిరక్షణ
-సామాజిక వనపోషణ, వన్యప్రాణి నిర్వహణ
-మానవ వనరుల అభివృద్ధి
-పల్చగా ఉన్న అడవులను దట్టంగా అభివృద్ధి చేయడం
-గ్రామీణ పేదరికాన్ని తగ్గించడం
-అటవీ ప్రాంతాల్లో కొండవాలు కందకాలు, రాతి ఆనకట్టలు, ఇంకుడు చెరువులు మొదలైన వాటిని ఏర్పాటు చేయడం.
-అటవీశాఖ వన పరిశోధనతో గల కార్యకలాపాలు, తోటలను వేసే సులభోపాయాల నర్సరీలను మెరుగుపర్చడం, హరితవ్యాప్తికి, విత్తనాల ఉత్పత్తికి, ఇంకా వనాభివృద్ధికి, సంస్కృతికి ప్రాధాన్యమిస్తున్నది.
-వన సంరక్షణ సమితి (వీఎస్ఎస్)లు, పర్యావరణ అభివృద్ధి కమిటీల (ఈడీసీ) సేవలను రక్షిత ప్రాంతాల అభివృద్ధిలోనూ, జలకూడలి (వాటర్‌షెడ్) అభివృద్ది కమిటీలు మొదలైన వాటి సేవలను రివర్‌వ్యాలీ ప్రాజెక్టులో స్వీకరిస్తున్నది.
సామాజిక వనాలు
-పర్యావరణాన్ని కాపాడటానికి, మెరుగుపర్చడానికి, లాభదాయకమైన ఉపాధిని కల్పించడానికి రిజర్వ్ అడవుల వెలుపల వృక్షసంపదను పెంచడానికి ప్రజలతో, రైతులతో ప్రజా ఉద్యమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ సామాజిక వన పోషణలోని ప్రధాన భాగాలు మొలకల పంపిణీ, ఊరెమ్మడి భూముల్లో, సంస్థల్లో, రోడ్డు పక్కన ఉన్న ఖాళీస్థలాల్లో తోటలు వేయడం, బహిరంగ స్థలాల్లో పెంచే నిమిత్తం సిద్ధం చేసిన మొక్క జాతులు వేప, పొంగామియా, మేడి, మర్రి, రావి, గంగరావి, ఉసిరి, సీతాఫలం, బాదం, మామిడి, టేకు, సరుగుడు, నీలగిరి మొదలైనవి.
తెలంగాణకు హరిత హారం
-రాష్ట్రం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో ప్రస్తుతం 25.64 శాతం నుంచి హరిత కవచాన్ని 33 శాతానికి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం తెలంగాణకు హరిత హారం.
పథకం లక్ష్యం
-అక్రమ రవాణా, దురాక్రమణలు, అగ్ని ప్రమాదాల వంటి వాటి నుంచి అడవులను మరింత సమర్థంగా రక్షించడంతో అడవుల లోపల, బయట వాటర్ షెడ్ల విధానాల్లో భూసారం, తేమల పరిరక్షణ చర్యలు చేపట్టారు.
-అటవీ ప్రాంతాల వెలుపల కూడా భారీ స్థాయిలో చెట్లను పెంచడంతో సామాజిక వనపోషణకు బలాన్ని ఇవ్వాలని ఈ పథకాన్ని తలపెట్టారు.
-పెద్ద రోడ్ల పక్కన, నది- కాలువల ఒడ్డున, బీడుపడిన కొండలమీద, చెరువు కట్టలమీద, నదీ తీరాల్లో, సంస్థల ఆవరణల్లో, ధార్మిక ప్రదేశాల్లో , గృహ వాడల్లో వనపోషణ చేపట్టాలని ఈ పథకాన్ని తలపెట్టారు.
-హరితహారంలో భాగంగా వచ్చే మూడేండ్లలో 230 కోట్ల మొక్కలను రాష్ట్ర వ్యాప్తంగా నాటాలని తలపెట్టారు. వీటిలో 130 కోట్ల మొక్కలను నోటిఫై అయిన అటవీ ప్రాంతాల్లో వెలుపల నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. హెచ్ఎండీఏ పరిధిలో 10 కోట్ల మొక్కలను, మిగిలి న 120 కోట్ల మొక్కలను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నాటాలని సంకల్పించారు.
-ప్రభుత్వం చేపట్టిన కొత్త ప్రయత్నం మన ఊరు- మన ప్రణాళిక నుంచి లభించిన పరిశీలనల ఆధారంగా నర్సరీలు, తోట చెట్ల మొక్కలకు అనువైన తావులను గుర్తించడానికి తెలంగాణ హరిత హారం కార్యక్రమం కింద కసరత్తు జరిగింది.
-అటవీశాఖ, డీడబ్ల్యూఎంఏ, వ్యవసాయ, ఉద్యానవనాలు, గిరిజన సంక్షేమం సంస్థలను నిమగ్నం చేసి గ్రామాల వారీగా 3, 888 నర్సరీలను గర్తించారు.
-బాగా ఎత్తుగా ఎదిగే వృక్షాలకు చెందిన 40 కోట్ల మొక్కలను 2016 వనపోషణ కోసం లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణ హరిత హారాన్ని 2015 జూలై 3న సీఎం కేసీఆర్ రంగారెడ్డిలోని చిలుకూర్ బాలాజీ దేవాలయం ప్రాంగణం వద్ద ప్రారంభించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 40 లక్షల మొక్కలను పెంచాలని నిర్ణయించారు. తెలంగాణ హరితహారానికి 2015-16 బడ్జెట్లో రూ.325 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
-కాంపెన్సేటరీ అఫోర్స్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ (సీఏఎంపీఏ)ని భారత ప్రభుత్వ పర్యావరణ, అడవుల మంత్రిత్వశాఖ నెలకొల్పింది. అటవీ భూభాగాలను అటవీయేతర ప్రయోజనాలకు మళ్లించినప్పుడు, ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి వనపోషణ, వన పునర్జీవన కార్యకలాపాలను అభివృద్ధి చేయడానికి ఈ సీఏఎంపీఏను ఏర్పాటు చేశారు.
తెలంగాణ వన్యప్రాణి – జీవవైవిధ్య పరిరక్షణ
-భారత రాజ్యాంగం వన్యప్రాణుల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఆదేశిక సూత్రాల్లో 48వ ప్రకరణలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వన్యప్రాణులను విధిగా సంరక్షించాలని పేర్కొంది. ఆర్టికల్ 51(ఏ) ప్రకారం వన్యప్రాణుల సంరక్షణ పౌరుల ప్రాథమిక విధి. 42వ సవరణ ప్రకారం వన్యప్రాణుల సంరక్షణను రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాలోకి మార్చారు.
-పులిని జాతీయ జంతువుగా భారత ప్రభుత్వం 1972లో గుర్తించింది. అంతకు ముందు సింహం జాతీయ జంతువుగా ఉండేది.
-వన్యప్రాణులను సంరక్షించడం కోసం భారత ప్రభుత్వం-1952లో ఇండియన్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అనే సంస్థను ఏర్పాటు చేసింది. దీనికి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. 1972లో వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని జమ్ముకశ్మీర్‌లో మినహా అన్ని రాష్ర్టాల్లో అమలు చేశారు. వన్యప్రాణుల గురించి అవగాహనను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృష్ణజింకను రాష్ట్ర జంతువుగా, పాలపిట్లను రాష్ట్ర పక్షిగా, జమ్మి చెట్టును రాష్ట్ర వృక్షంగా ప్రకటించింది.
-తెలంగాణ ప్రభుత్వ జీవవైవిద్యాన్ని పరిరక్షించే లక్ష్యంతో 12 ప్రాంతాలను ఆరక్షిత ప్రాంతాలుగా ప్రకటించింది. వీటిలో 9 వన్యప్రాణి ఆశ్రమాలు, 3 జాతీయ వన్యప్రాణి నిలయాలు 5,692.48 చ.కి.మీ విస్తీర్ణంలో ఉన్నాయి. ఇది తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం అడవి ప్రాంతంలో 19.73 శాతం ఉంది. ఆ రక్షిత ప్రాంతాల అనుసంధాన గుచ్ఛంలో అంతరించిపోతున్న మంచినీటి మొసళ్లకు( మార్స్) నిలయమైన మంజీర వన్యప్రాణి ఆశ్రమం, శివరామ్ వన్యప్రాణి ఆశ్రమాలకు చెందిన జల ప్రదేశాలున్నాయి.
పట్టు పరిశ్రమ
-పట్టు వస్ర్తాల నేతకు ప్రసిద్ధి చెందిన పోచంపల్లి, కొత్తకోట, నారాయణపేట్, గద్వాల్ మొదలైన ప్రాంతాలు రాష్ట్రంలో ఉన్నాయి. ఇక్కడ మల్బరీ పట్టు ఉత్పత్తినే కాకుండా, టస్సార్ సిల్కు ఉత్పత్తిని మరింత పెంచే అవకాశం ఉంది.
-రాష్ట్రంలో ఈ పరిశ్రమ వృద్ధి కోసం ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. అంతర్జాతీయ గ్రేడ్‌కి చెందిన బివోల్టిన్ పట్టు ఉత్పత్తిని మెరుగుపర్చడం, పట్టు వస్ర్తాల గిరాకీ-సరఫరాల మధ్య అంతరాన్ని భర్తీ చేయ డం, సాంకేతిక సహాయ కేంద్రాల ద్వారా సాంకేతిక నైపుణ్యాన్ని రైతులకు అందించడం, మల్బరీలో అధికోత్పత్తి రకాలను సిద్ధం చేయడం, పట్టు పురుగుల పెంపకం కేంద్రాలను ప్రైవేట్ రంగంలో ప్రోత్సహించడం, పట్టు పురుగుల పెంపకం కోసం విడిగా షెడ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించి, పట్టు గూళ్ల మార్కెట్ల ద్వారా రైతులకు విక్రయావకాశాలను కల్పించడం ఈ కేంద్రాల ధ్యేయం.
ఉత్ప్రేరకాభివృద్ధి కార్యక్రమం
-అంతర్జాతీయస్థాయి 2-ఏ, అంతకు మించిన గ్రేడ్ల బివోల్టిన్ పట్టును రాష్ట్రంలో ఉత్పత్తి చేయడానికి భారత ప్రభుత్వ నిర్వహణలో బెంగళూరులో నడిచే కేంద్ర సిల్క్ బోర్డ్‌తో సమన్వయంగా ఉత్ప్రేరకాభివృద్ధి కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నది. 2014-15లో సీడీఐ పథకాలను అమలు చేసే నిమిత్తం కేంద్రవాటా సబ్సిడీ రూ.543.63 కోట్లు, రాష్ట్రం జతచేసే వాటా రూ.383.15 లక్షలను విడుదల చేసింది.
టస్సార్ కల్చర్
-దేశంలో తెలంగాణ రాష్ట్రం టస్సార్ పట్టుగూళ్ల ఉత్పత్తిలో నాల్గో స్థానంలో ఉంది. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలో గిరిజనులు టస్సార్ పట్టుని ఉత్పతి చేసే టి. టొమెంటోసా, టి.అర్జున పూలచెట్ల అరణ్యం 8,200 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. లోతట్టు అటవీ ప్రాంతాల గిరిజనులకు టస్సార్ పట్టు పరిశ్రమ ప్రధానమైన జీవనోపాధి. ఈ అటవీ ప్రాంతాల్లో ఆహార పంటల తోటలు పుష్కలం. పట్టుపురుగు(యాంథిరియా మైలిటాడూరీ)ని పెంచడానికి సంబంధించిన అన్ని కార్యకలాపాలు, టస్సార్ పట్టు గూళ్లను పండించడం, పట్టుగూళ్ల నుంచి టస్పారు పట్టు నూలు ఉత్పత్తి, నూలుతో వస్ర్తాన్ని నేయడం అన్ని టస్సార్ కల్చర్ల్లో భాగాలు.
వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు
1. కవ్వాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
-ఆదిలాబాద్‌లోని జన్నారం- ఉట్నూరు ప్రాంతంలో 2, 015, 44 చ.కి.మీ పరిధిలో విస్తరించి ఉంది.
2. ప్రాణహిత వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
-ఇది ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాలకు దగ్గరగా 136 చ.కి.మీ విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇక్కడ టేకు చెట్లతో కూడిన ఆకురాల్చే అడవులు ఉన్నాయి.
3. శివరాం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
-ఇది ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో 29.81 చ.కి.మీ విస్తరించి ఉంది. ఇది గోదావరి నదికి ఇరువైపులా విస్తరించి ఉంది. ఇక్కడ గోదావరి సజీవధార వల్ల బురదనేల మొసళ్లు అధికంగా ఉన్నాయి.
4. ఏటూరు నాగారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
-ఇది వరంగల్ జిల్లాలోని గోదావరి నదీ తీరాన దక్కన్ పీఠభూమిలో సుమారు 806.05 చ.కి.మీ పరిధిలో విస్తరించి ఉంది.
5. పాకాల వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
-ఇది వరంగల్‌లోని పాకాల చెరువు పరిసరాల్లో 860.02 చ.కి.మీ మేర విస్తరించింది. దీన్ని మొదట బురదనేల మొసళ్లు, పులుల రక్షిత ప్రాంతాలుగా నోటిఫై చేశారు. తర్వాత 1999లో వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా గుర్తించారు.
6. కిన్నెరసాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
-ఇది ఖమ్మంలో పాల్వంచకు 21 కి.మీ దూరంలో కిన్నెరసాని రిజర్వాయర్ సమీపంలో ఉంది. సుమారు 635 చ.కి.మీ పరిధిలో విస్తరించి ఉంది.
7. మంజీరా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
-ఇది మెదక్ జిల్లాలోని మంజీరా నది పరిసర ప్రాంతంలో విస్తరించి ఉంది.
8. పోచారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
-దీన్ని మెదక్, నిజామాబాద్ జిల్లాల మధ్య ఏర్పాటు చేశారు.
9. అమ్రాబాద్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
-ఇది మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో 2611.39 చ.కి.మీ మేర విస్తరించి ఉంది.
జాతీయ పార్కులు
1. కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్- జూబ్లీహిల్స్
2. మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్- వనస్థలిపురం
3. మృగావని నేషనల్ పార్క్ – చిలుకూరు (రంగారెడ్డి జిల్లా)
జింకల పార్క్‌లు
1. జవహర్డీర్ పార్క్- శామీర్‌పేట (రంగారెడ్డి జిల్లా)
2. పిల్లలమర్రి జింకలపార్క్ – మహబూబ్‌నగర్ జిల్లా
3. కిన్నెరసాని జింకల పార్క్ – పాల్వంచ (ఖమ్మం జిల్లా)
4. లోయర్ మానేరు డ్యాం(LMD) జింకల పార్క్ – కరీంనగర్
జూలాజికల్ పార్కులు
1. నెహ్రూ జూలాజికల్ పార్క్ – హైదరాబాద్
2. వనవిజ్ఞాన కేంద్రం- వరంగల్
టైగర్ ప్రాజెక్టు
-రాష్ర్టానికి రెండు టైగర్ రిజర్వులున్నాయి.
1. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్
-ఇది నల్లమల కొండల్లో మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో 2611.39 చ.కి.మీ వ్యాపించి ఉంది. దీన్ని 1978లో వన్యప్రాణి అభయారణ్యంగా, 1983లో పులుల అభయారణ్యంగా గుర్తించారు. దీనిగుండా కృష్ణానది ప్రవహిస్తున్నది.
2. కవ్వాల్ టైగర్ రిజర్వ్
-ఇది ఆదిలాబాద్ జిల్లాలోని జన్నారం, ఉట్నూరు ప్రాంతంలో 2,015.44 చ.కి.మీ పరిధిలో ఉంది. ఇది మహారాష్ట్రలోని తడోబా అంథేరీ టైగర్ రిజర్వ్ వరకు ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్ వరకు వ్యాపించిన అడవుల్లో కలిసి ఉంది. పులులు కవ్వాల్కు, పై రెండు రిజర్వ్‌లకు మధ్య అటూ ఇటూ వలస వెళుతుంటాయి. అందువల్ల మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ డివిజన్ల మీదుగా మూడు టైగర్ రిజర్వ్‌లను అనుసంధానం చేస్తూ కారిడార్లను అభివృద్ధి చేస్తున్నారు.
తెలంగాణ జీవవైవిద్య బోర్డ్ – (TSBDB)
-జీవ వైవిధ్యాన్ని కాపాడటానికి, మనగలిగేలా జీవవైవిధ్యాన్ని ఉపయోగించడానికి, జీవ వనరులను సంబంధితులందరి మధ్య న్యాయంగా సమానంగా పంపిణీ చేసే లక్ష్యంతో తెలంగాణ బయోడైవర్సిటీ బోర్డ్ (TSBDB) ఏర్పడింది.
-ప్రతి ఏడాది మే 22వ తేదీన బయోడైవర్సిటీ బోర్డ్ అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. 170 జీవ వైవిధ్య నిర్వహణ కమిటీలను తెలంగాణలో ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు తెలంగాణ పది జిల్లాల్లోని 66 మండలాల్లో, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విస్తరించి ఉన్నాయి.
మాదిరి ప్రశ్నలు
1. చెరువులు, జలాశయాల ద్వారా మత్స్యాభివృద్ధికి అవకాశాలు తక్కువగా ఉన్న జిల్లా ఏది ?
1) నల్లగొండ 2) వరంగల్
3) కరీంనగర్ 4) మహబూబ్‌నగర్
2. వ్యవసాయ రంగం నుంచి సమకూరే స్థూల రాష్ర్టోత్పత్తుల్లో మత్స్యరంగం సమకూర్చే వాటా ఎంత ?
1) 2.47 శాతం 2) 3.47 శాతం
3) 2.40 శాతం 4) 3.50 శాతం
3. 2014-15లో తెలంగాణలో 2.92 టన్నుల చేపలను, రొయ్యల ఉత్పత్తి లక్ష్యం కాగా, 2014 డిసెంబర్ నాటికి ఎంత ఉత్పత్తి జరిగింది ?
1) 2.65 లక్షల టన్నులు 2) 2.55 లక్షల టన్నులు
3) 1.69 లక్షల టన్నులు 4) 1.75 లక్షల టన్నులు
4. చేపలు పట్టే వృత్తిలో ఉన్నవారు తెలంగాణలో 19.04 లక్షల మంది ఉన్నారు. ఇందులో ఎక్కువ మంది ఏ జిల్లా నుంచి ఉన్నారు ?
1) ఆదిలాబాద్ 2) రంగారెడ్డి
3) ఖమ్మం 4) వరంగల్
5. ఆక్వాకల్చర్ కిందకు వచ్చే చేపల చెరువుల్లో ఎక్కువ భాగం ఏ జిల్లాలో ఉన్నాయి ?
1) నల్లగొండ 2) ఖమ్మం
3) కరీంనగర్ 4) ఆదిలాబాద్
6. ఎంత మంది మహిళలతో ఏర్పడే మత్స్యమిత్ర బృందాలకు రూ. 25 వేల చొప్పున అందజేస్తారు ?
1) 15 నుంచి 20 మందికి 2) 20 నుంచి 25 మంది
3) 10 నుంచి 15 మంది 4) 5 నుంచి 10 మంది
7. జాతీయ సిల్క్ బోర్డ్‌ను ఎక్కడ ఏర్పాటు చేశారు ?
1) బెంగళూరు 2) హైదరాబాద్
3) చెన్నై 4) అమరావతి
8. దేశంలో టస్సారు పట్టు గూళ్ల ఉత్పత్తిలో తెలంగాణ స్థానం?
1) ఒకటి 2) రెండు 3) మూడు 4) నాలుగో
9. 2014-15లో మొత్తం వ్యవసాయ రంగం జీఎస్డీపీలో అటవీసంపద, కలపరంగం వాటా ఎంత ?
1) 0.9 శాతం 2) 5.02 శాతం
3) 2.9 శాతం 4) 4.05 శాతం
10. విస్తీర్ణంలో దేశంలో తెలంగాణ 12వ స్థానంలో ఉంటే, తెలంగాణ హరిత విస్తీర్ణం ఎంత ?
1) 21.50 శాతం 2) 24.23 శాతం
3) 23.24 శాతం 4) 25.64 శాతం
11. తెలంగాణ హరితహారం పథకాన్ని సీఎం కేసీఆర్ ఏ జిల్లాలో ప్రారంభించారు ?
1) మెదక్ 2) హైదరాబాద్
3) రంగారెడ్డి 4) నల్లగొండ
12. అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు ?
1) మే, 22 2) జూన్, 22
3) జూలై , 22 4) ఏప్రిల్, 22
జవాబులు: 1-1, 2-2, 3-3, 4-4, 5-2, 6-3, 7-1, 8-4, 9-2 ,10-4, 11- 3, 12-1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు