దిగంబర, విప్లవ సాహిత్యం
1965-68 మధ్య దిగంబర కవులు కవిత్వం రాశారు. నగ్నముని, నిఖిలేశ్వర్, చెరబండరాజు, జ్వాలాముఖి, భైరవయ్య, మహాస్వప్న అనే ఆరుగురు దిగంబర కవులుగా ఏర్పడి మూడు కవితా సంపుటాలను ప్రచురించారు. మొదటి సంపుటిని 1965 మే 6వ తేదీ అర్ధరాత్రి హైదరాబాద్‌లో నాంపల్లి పాండు అనే రిక్షా కార్మికునితో ఆవిష్కరింపచేశారు. రెండో సంపుటిని 1966 డిసెంబర్ 8న విజయవాడలో జంగాల చిట్టి అనే హోటల్ కార్మికునితో ఆవిష్కరింపచేశారు. మూడో సంపుటిని 1968 సెప్టెంబర్ 14న అర్ధరాత్రి 12 గంటలకు విశాఖపట్టణంలో ఎడమనూరి యశోద అనే బిచ్చగత్తెతో ఆవిష్కరింపచేశారు.
దిగంబర కవులు-వారి పేర్లు:
నిఖిలేశ్వర్- యాదవరెడ్డి, నగ్నముని- మానేపల్లి హృషికేశవరావు, చెరబండరాజు- బద్దం భాస్కర్‌రెడ్డి, జ్వాలాముఖి- వీర రాఘవాచార్యులు, మహాస్వప్న- కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు, భైరవయ్య- మన్మోహన్ సహాయ్. ఈ ఆరుగురు కవుల్లో తెలంగాణ ప్రాంతానికి చెందినవారు ముగ్గురున్నారు. వారు నిఖిలేశ్వర్, చెరబండరాజు, జ్వాలాముఖి.
దిగంబర కవిత్వం-నేపథ్యం:
మూడు దశాబ్దాలుగా అభ్యుదయ కవిత్వోద్యమం కొనసాగి లేచిపడిన కెరటమైంది. కమ్యూనిస్టు పార్టీలో చీలికలు రావడం, అమెరికాలో బీట్ జనరేషన్ అనే తిరుగుబాటు ధోరణి మొదలైంది. ఇంగ్లాండులో యాంగ్రీ యంగ్‌మెన్ ధోరణి ప్రబలింది. పశ్చిమ బెంగాల్లో కూడా 1960 ప్రాంతంలో హంగ్రీ యంగ్‌మెన్ సాహిత్య ధోరణి తలెత్తింది. ఈ ధోరణుల ప్రభావం దిగంబర కవులపై ఉందని విమర్శకుల అభిప్రాయం. సమాజంలోని అన్యాయాలను, అక్రమాలను చూసి కోపంతో తిట్లకు, పరుషపద ప్రయోగాలకు దిగారు. పుళ్లు పడి కుళ్లిపోయిన వక్షం, పుచ్చిపోయిన పిండం, మెదడు పురుగు తినేసింది, చర్మం కుళ్లిపోయింది, అవయం పుచ్చిపోయింది, కళ్లకు కన్నం పడింది వంటి పదజాలం వీరి కవిత్వంలో ఉంది. ప్రజల అంతరంగంలో వ్యాపించిన ఆరాటానికి, విసుగుకు విషాదానికి స్పందించారు. సమాజంలోని రాజకీయ కుళ్లును దిగంబరం చేసి చూపారు. సమాజంలోని అవినీతిని, దోపిడీని, ఆత్మవంచన, పరవంచనలను అసహ్యించుకున్నారు. మత మౌఢ్యాన్ని, గురువుల మోసాలను ప్రశ్నించారు. ఆధునిక నాగరికతలోని దుర్మార్గాలకు, అక్రమాలకు బాధపడ్డారు. సుమారు మూడేండ్లు తెలుగు సాహిత్యంలో గగ్గోలు పుట్టించిన వీరు 1970లో విరసం ఏర్పడినప్పుడు అందులో చేరారు. విరసంలో చేరినవారు నగ్నముని, నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, చెరబండరాజు.
దిగంబర కవుల కవితాపంక్తులు:
నన్నయ్యను నరేంద్రుడి బొందలోనే నిద్రపోనియ్యి, లేపకు, పీక నులిమి గోతిలోకి లాగుతాడు. నయాగరా జలపాతంలో దూకలేకపోయిన అన్నయ్య, గుడ్‌బై మీకందరికి సలామ్ వాలేకుమ్ అన్న కవి నిఖిలేశ్వర్. దేవుడు దేవుడంటూ నేలవిడిచి సాముచేసే తత్తదిమ్మరులకు, ఆధ్యాత్మిక సోమరులకు కళ్లు పీకి చూపాలనుంది అన్న కవి జ్వాలాముఖి.
-లింగభేదాలు, వాదాలు తప్పితే, మందిర్, మస్జిద్, చర్చి, మతాధికారులు, మతాలెందుకు? అని ప్రశ్నించిన కవి చెరబండరాజు.
చెరబండ రాజు:
అసలు పేరు బద్దం భాస్కర్‌రెడ్డి. పేద రైతు కుటుంబంలో 1944లో జన్మించారు. నన్నెక్కనివ్వండి బోను కవితతో కవితాలోకంలో సూర్యుడిలా ఉదయించారు. దిగంబర కవిత్వంలో గొప్ప కవితగా ఈయన రాసిన వందేమాతరం కవిత పలువురి ప్రశంసలందుకుంది. హైదరాబాద్‌లో ఉపాధ్యాయునిగా పనిచేశారు. విరసం వ్యవస్థాపక కార్యవర్గ సభ్యుడు. కార్యదర్శిగా 1971-72లో పనిచేశారు. విప్లక కవిగా మారాక విప్లవ సాహిత్యానికి పాట అవసరాన్ని గుర్తించి విరివిగా పాటలు రాశారు. 1975 ఏప్రిల్‌లో ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరించి శ్రీశ్రీతోపాటు అరెస్టయ్యారు. 1971 నుంచి 1977 మధ్యకాలంలో మూడేండ్ల పాటు జైలు జీవితం గడపటంతో ఆరోగ్యం క్షీణించి మెదడు క్యాన్సర్‌తో జూలై 2, 1982న మరణించారు. ప్రపంచ పురోగతి అంతా శ్రమజీవి నెత్తుటిబొట్టులోనే ఇమిడి ఉందని నమ్మిన చెరబండరాజు ఆలోచన, అక్షరం, ఆచరణ ఏకరూపం దాల్చిన విప్లవ కవి. ఈ కలం యోధుడికి శ్రీశ్రీ తాను రాసిన మరోప్రస్థానం కావ్యాన్ని అంకితమిచ్చారు. బాధితున్నే అయితేనేం యోధున్నే, పోరాటం, డైరెక్షన్, పాట నాకు ఆక్సిజన్ అంటూ కలవరిస్తూ, పలవరిస్తూ కన్నుమూసిన కవి. ఈయన రాసిన పాటల్లో ముఖ్యమైనవి కొండలు పగలేసినం, బండలనే పిండినం, ఏ కులమబ్చీ మాదేమతబ్బీ, విప్లవాల యుగం మనది, విప్లవిస్తే జయం మనది. ఈయన రచనలు 1) దిగంబర కవితా సంకలనాలు 2) దిక్సూచి 3) ముట్టడి 4) గమ్యం 5) కాంతియుద్ధం 6) గౌరమ్మ కలలు 7) జన్మహక్కు 8) పల్లవి 9) కత్తిపాట మొదలైన కవితా సంపుటాలు. నవలలు మా పల్లె, ప్రస్థానం, నిప్పులరాళ్లు, గంజీనీళ్లు. కవితా సంపుటికి ఫ్రీవర్సు ఫ్రంట్ అవార్డు లభించింది.
జ్వాలాముఖి (18/04/1938-14/12/2008):
మొదట దిగంబర కవిగా ఉండి తర్వాత విప్లవ కవిగా మారాడు. ఈయన రచనలు 1) దిగంబర కవితా సంకలనాలు, 2) ఓటమి తిరుగుబాటు. చచ్చిన రాజుల పుచ్చిన గాథలు, మెచ్చే చచ్చు చరిత్రకారులను ముక్కూచెవులు కోసి అడగాలని ఉంది, మానవ పరిణామశాస్త్రం నేర్పిందేమని ప్రశ్నించిన కవి జ్వాలాముఖి.
నిఖిలేశ్వర్:
దిగంబర కవుల్లో ఒకడు. ఈయన రచనలు 1) దిగంబర కవితా సంకలనాలు 2) మండుతున్న తరం. భావ కవుల నపుంసక హావభావాలకు సవాల్, అభ్యుదయ కవీ నల్లమందు తిని నిద్రపోయావ్ అంటూ అభ్యుదయ కవులను తూలనాడాడు.
విప్లవ కవులు:
విప్లవ కవుల్లో ముఖ్యులు శ్రీశ్రీ, కేవీ రమణారెడ్డి, వరవరరావు, జ్వాలాముఖి, నిఖిలేశ్వర్, చెరబండరాజు, గద్దర్, నగ్నముని, కొడవటిగంటి కుటుంబరావు, వంగపండు, అలిశెట్టి ప్రభాకర్ మొదలైనవారు.
విప్లవ సాహత్యం – చారిత్రక నేపథ్యం:
పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లా నక్సల్బరీ గ్రామంలో గిరిజనులు భూస్వాములపై 1967లో తిగురుబాటు చేసి వారి భూముల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ గిరిజనుల రైతాంగ పోరాటానికి చారుమజుందార్, కానూ సన్యాల్ లాంటి వాళ్లు సారథ్యం వహించారు. 1969లో మార్క్సిస్టు లెనినిస్టు పార్టీ ఏర్పడింది. శ్రీకాకుళంలో గిరిజన పోరాటం 1967లో ప్రారంభమయ్యింది. భూస్వాములపై గిరిజనులు తిరగబడ్డారు. గిరిజనులకు మద్దతుగా ఎందరో మేధావులు ముందుకొచ్చి వారికి నాయకత్వం వహించారు. వెంపట్రావు సత్యం, ఆదిభట్ల కైలాసం, సుబ్బారావు పాణిగ్రాహి, చాగంటి భాస్కరరావు, పంచాది నిర్మల మొదలైనవారు పాల్గొని మరణించారు. 1970లో విశాఖపట్టణంలో శ్రీశ్రీ షష్టిపూర్తి సభ జరిగింది. విశాఖ విద్యార్థులు రచయితలకు సవాల్ అనే కరపత్రాన్ని ఫిబ్రవరి 1న ఉదయం శ్రీశ్రీ సంస్మరణ సభలో చదివారు. రచయితల్లో పేరుకుపోయిన స్తబ్దతను వాళ్లు ప్రశ్నించారు. అదేవిధంగా 1970 జూలైలో హైదరాబాద్‌లోని సెవన్ స్టార్స్ సిండికేట్ అనే సాంస్కృతిక సంస్థ నిర్వహించతలపెట్టిన అభ్యుదయ సదస్సును వ్యతిరేకిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన వీరతెలంగాణ విప్లవ విద్యార్థులు, రచయితలు ప్రకటనలు చేశారు. విప్లవ సాహిత్య రచనా కార్య రంగంలోకి దూకి ప్రజాపక్షం నిలబడటానికి రమ్మంటున్నం అని ఆ ప్రకటనల సారాంశం. ఈ పరిణామాల నేపథ్యంలో 1970 జూలై 4న విప్లవ రచయితల సంఘం ఏర్పడింది. దీనికి తొలి అధ్యక్షుడు శ్రీశ్రీ. తెలంగాణలో సెప్టెంబర్ 9, 1978 నాటి జగిత్యాల జైత్రయాత్ర విప్లవకర పరిస్థితులు పరిపక్వతకు వచ్చాయన్న నమ్మకాన్ని కలిగించాయి. జగిత్యాల జైత్రయాత్ర ఉత్తర తెలంగాణ విప్లవోద్యమంలో గుర్తుంచుకోదగిన మైలురాయి అయ్యింది. గిరిజన రైతు కూలీ సంఘం మొదటి మహాసభ ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లిలో ఏప్రిల్ 20, 1981న జరపాలని నిర్ణయించగా ఆ సభ జరగకుండా అడ్డుపడి పోలీసులు గిరిజనులపై కాల్పులు జరిపారు. ఇంద్రవెల్లి ఘటన తరువాత విప్లవోద్యమం దండకారణ్య ఆదివాసీ పోరాటంగా గోదావరిలోయ వెంబడి విస్తరించింది. 1969 నాటి తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుకొని మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు జరిగిన అనేక పోరాటాలకు విప్లవ సాహిత్యం జవసత్వాలను అందించింది.
విప్లవ సాహిత్యం – నిర్వచనం:
విప్లవ సాహిత్యం, విప్లవ కవిత్వం అనే మాటలకు నిర్దిష్టమైన నిర్వచనం అంటూలేదు. విప్లవాన్ని సమర్థిస్తూ, విప్లవోద్యమ చరిత్రను ప్రతిఫలిస్తూ విప్లవ భావాలను ప్రచారం చేస్తూ రాసే సాహిత్యం విప్లవ సాహిత్యం, రాసే కవిత్వం విప్లవ కవిత్వం. మరి విప్లవం అంటే ప్రస్తుతం ఉన్న సామాజిక ధర్మాన్ని తోసిరాజని కొత్త ధర్మాన్ని స్థాపించడానికి జరిగే క్రియారూపం. అసమానతావ్యవస్థను నశింపజేసి సమానతా ధర్మస్థాపన చేయడం విప్లవం. తెలంగాణ ప్రాంతానికి చెందిన విప్లవ కవుల్లో ముఖ్యులు నిఖిలేశ్వర్, చెరబండరాజు, గద్దర్, వరవరరావు, కె శివారెడ్డి, అలిశెట్టి ప్రభాకర్, అల్లం నారాయణ, నందిని సిధారెడ్డి, అల్లం వీరయ్య, ఆశరాజు, భూపాల్ మొదలైవారు.
గద్దర్:
ఈయన అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. మెదక్ జిల్లా తూప్రాన్ గ్రామంలో లచ్చుమమ్మ, శేషయ్య దంపతులకు 1949లో జన్మించారు. ఈయన గద్దర్ అనే పేరును స్వాతంత్య్రం రాకముందు బ్రిటీష్ రాజ్యాన్ని వ్యతిరేకించిన గదర్ పార్టీకి గుర్తుగా పెట్టుకున్నారు. విద్యాభ్యాసం నిజామాబాద్ జిల్లా బోధన్‌లో, ఇంజినీరింగ్ విద్య హైదరాబాద్‌లో జరిగింది. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యమ వ్యాప్తికోసం బుర్రకథను ఎంచుకొని ఊరూరా ప్రదర్శనలు ఇచ్చారు. ఈయన ప్రదర్శనను చూసి సినిమా దర్శకుడు నర్సింగరావు భగత్‌సింగ్ జయంతి రోజున ఒక ప్రదర్శనను ఏర్పాటు చేశారు.
1971లో బి. నరసింగరావు ప్రోత్సాహంతో ఆపర రిక్షా అనే పాటను మొదటిసారి రాశారు. మా భూమి సినిమాలో సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో నటించి బండెనక బండి కట్టి అనే పాటను ఆయనే పాడారు. 1984లో బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి జననాట్య మండలిలో చేరారు. 1985లో కారంచేడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడారు. ప్రజాసమస్యల పట్ల ఉద్యమిస్తూ తన ఆట పాటల ద్వారా విరసం సభ్యులుగా ఉంటూ ప్రజలను చైతన్య పరుస్తున్నారు. 1997 ఏప్రిల్ 6న పోలీసులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. ఈయన రాసిన పాటలు వందల సంఖ్యలో క్యాసెట్లుగా, సీడీలుగా వెలువడ్డాయి. ఈయన పాటల్లో అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అనే పాట బహుళ ప్రజాదరణ పొందింది. ఈ పాటను మొదట 1997 మార్చి 8, 9 తేదీల్లో భువనగిరిలో జరిగిన తెలంగాణ సదస్సులో రాసి పాడారు. అంతకుముందు 1997 జనవరిలో హైదరాబాద్ జాంబాగ్‌లోని అశోక టాకీసులో జరిగిన సభలో కొన్ని చరణాలను రాసి పాడారు. ఒరేయ్ రిక్షా సినిమాలో ఈయన రాసిన నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా అనే పాటకు ఉత్తమ గీతంగా నంది అవార్డు వచ్చింది. అయితే దానిని తిరస్కరించారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో తెలంగాణ ప్రజాఫ్రంట్‌ను స్థాపించి తద్వారా ప్రజలను ఉద్యోన్ముఖులను చేయడంలో ప్రధానపాత్ర పోషించారు.
భారత శాస్త్రవేత్తలు – విశేషాలు
చరకుడు
-చరక సంహిత అనే గ్రంథాన్ని రచించారు.
-జీర్ణక్రియ, జీవక్రియ, నిరోధకశక్తి, జన్యుశాస్త్ర భావాలను వివరించారు.
వరాహమిహిరుడు
-క్రీ.శ. 6వ శతాబ్దానికి చెందిన గొప్ప గణిత, ఖగోళ శాస్త్రవేత్త
-పంచసిద్ధాంత అనే గ్రంథాన్ని రచించాడు
-బృహత్ సంహితలో రోదసి నిర్మాణాలను, వాటి కదలికలను వివరించాడు
మాదిరి ప్రశ్నలు
1) తెలంగాణ ప్రాంతానికి చెందిన దిగంబర కవులు?
1) నగ్నముని 2) నిఖిలేశ్వర్, భైరవయ్య
3) నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, చెరబండరాజు 4) చెరబండరాజు, నగ్నముని
2) దిగంబర కవిత్వం మొదటి కవితా సంపుటి ఆవిష్కరించిన రోజు?
1) 1965, మే 6 2) 1966, డిసెంబర్ 8 3) 1968, సెప్టెంబర్ 14
4) 1969, నవబంర్ 12
3) చెరబండరాజు అసలు పేరు?
1) బద్దం ఎల్లారెడ్డి 2) బద్దం భాస్కర్ రెడ్డి 3) బద్దం మల్లారెడ్డి 4) బద్దం నారాయణ రెడ్డి
4) చెరబండ రాజు రచన?
1) కాంతియుద్ధం 2) గౌరమ్మ కలలు
3) ముట్టడి 4) పైవన్నీ
5) విప్లవ రచయితల సంఘం స్థాపించిన సంవత్సరం?
1) 1970 జూలై 4 2) 1970 జూలై 14
3) 1970 నవంబర్ 4
4) 1970 నవంబర్ 14
6) ఆపర రిక్షా అనే పాట రచయిత?
1) శివసాగర్ 2) గద్దర్
3) వంగపండు 4) జాలాది
7) గుమ్మడి విఠల్‌రావు ఏ పేరుతో ప్రసిద్ధిగాంచారు?
1) గద్దర్ 2) గుమ్మడి
3) విఠల్ 4) నారాయణరెడ్డి
8) ఓటమి తిరుగుబాటు రచించిన కవి?
1) నిఖిలేశ్వర్ 2) చెరబండరాజు
3) నగ్నముని 4) జ్వాలాముఖి
జవాబులు: 1-3, 2-1, 3-2, 4-4, 5-1, 6-2, 7-1, 8-4
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు