తెలంగాణ చారిత్రక నేపథ్యం పాలించిన వంశాలు
టీఎస్పీఎస్సీ గ్రూప్-I పేపర్ VI, గ్రూప్-II పేపర్ IVల్లో సిలబస్‌లోని మొదటి భాగంలోని మొదటి విభాగానికి సంబంధించి చారిత్రక నేపథ్యం, హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ విలక్షణ సంస్కృతి, తెలంగాణ భౌగోళిక, సాంస్కృతిక, సాంఘిక, రాజకీయ, ఆర్థిక లక్షణాలు అనే పాఠ్యాంశాన్ని పేర్కొన్నారు. ఇందులోభాగంగా హైదరాబాద్ చారిత్రక నేపథ్యం, బ్రిటీష్ అధికారి హామిల్టన్ హైదరాబాద్ గురించి అభిప్రాయపడిన విధానం, గోల్కొండ ప్రాధాన్యత, నాటి పండుగలు, కుతుబ్‌షాహీల ముఖ్య నిర్మాణాలు, హైదరాబాద్ ప్రాధాన్యత, హైదరాబాద్ రాజ్యంలోని ప్రాంతాలు, హైదరాబాద్ రాజ్యస్థాపన, హైదరాబాద్ రాజ్యంలో అసఫ్‌జాహీల కాలంలో నిర్మాణాలు, తెలంగాణ విలక్షణ సంస్కృతి, తెలంగాణ భౌగోళికాంశాలు వాటి ప్రాధాన్యత మొదలైన అంశాల్ని తెలుసుకుందాం..
కుతుబ్‌షాహీల పాలకుడైన మహమ్మద్ కులీ కుతుబ్‌షా కాలంలో భాగ్యనగరం నిర్మించిచారు. మహమ్మద్ కులీకుతుబ్‌షా ప్రియురాలే భాగమతి. ఈమె పేరుతో వెలసినదే భాగ్యనగరం. ఈ నగర ఆవిర్భావానికి ప్రేమకథే స్ఫూర్తినిచ్చింది. అందుకే ఇది ప్రేమ నగరంగా ప్రసిద్ధిచెందింది. అదే నేటి హైదరాబాద్ నగరం. హైదరాబాద్ ఆహ్లాదకరమైన వాతావరణానికి, రమణీయమైన ఉద్యానవనాలకు, ప్రస్తుతం ఆకాశహర్మ్యాలకు నిలయం. విదేశీయులచే ‘సుందర ఉద్యానవన నగరం’గా వర్ణించబడింది హైదరాబాద్.
# వాల్టర్ హామిల్టన్ ప్రశంస: క్రీ.శ. 1820లో బ్రిటీషు అధికారి అయిన వాల్టర్ హామిల్టన్ హైదరాబాద్ గురించి ఈ విధంగా అభిప్రాయపడ్డాడు. హైదరాబాద్ (భాగ్యనగర్) రాతిగోడలతో నిర్మితమైంది. శతఘ్నిదళాల నుంచి రక్షణను ఇవ్వలేదు. కానీ అశ్విక దళాల దాడుల నుంచి రక్షణను కల్పిస్తుంది. గోడల లోపలి నగరం 4 మైళ్ల పొడవు, 3 మైళ్ల వెడల్పు కలదు. రాజభవనం, మసీదులు, విశేషమైన భవనాలు, గోల్కొండ కోట ఉంది. సికిందరాబాద్ నగరం జన సమృద్ధి కలది. ప్రధానమంత్రి మీర్ ఆలం చేపట్టిన గొప్ప పనుల్లో ఒకటి ‘మీర్ ఆలం ట్యాంక్’ అని ప్రశంసించాడు.
# థేవ్నెట్: కుతుబ్‌షాహీల కాలంలో హైదరాబాద్‌లో పర్యటించాడు. పండ్ల తోటలు, ఉద్యానవనాలు ఎక్కువగా ఉండటంతో బాగ్(తోట)నగర్ లేదా భాగ్యనగర్ అనే పేరు వచ్చిందని అభిప్రాయపడ్డాడు.
# గోల్కొండ: గొల్లకొండ లేదా గోల్కొండ, మహమ్మదానగరాన్ని రాజధానిగా చేసుకొని కుతుబ్‌షాహీ వంశస్థులు పాలించారు. గోల్కొండ దుర్గం కుతుబ్‌షాహీ సామ్రాజ్యానికి రక్షణదుర్గంగా ఉంది. గోల్కొండ పట్టణంలో రాజభవనాలు, వేసవి విశ్రాంతి భవనాలు, విలాస మందిరాలు ఉండేవి.
# కళ్యాణిచాళుక్యులు, కాకతీయులు ఈ దుర్గాన్ని ఏలారు. కాకతీయ రాజ్యం అంతరించిన తరువాత ముసునూరి కాపయ నాయకుడు ఈ ప్రాంతాన్ని ఆక్రమించి పాలించాడు.
# సుల్తాన్ కులీకుతుబ్ ఉల్‌ముల్క్ గోల్కొండ దుర్గాన్ని పటిష్ఠపర్చి నగరాభివృద్ధికి కృషిచేశాడు. గోల్కొండ నగర నిర్మాణానికి వాస్తుశిల్పి ఆజంఖాన్. గోల్కొండ నగరంలో 3 భాగాలు కలవు.
1) సాధారణ ప్రజలు నివసించే ప్రాంతం, వర్తక కేంద్రాలు
2) రాజసౌధాలు, అధికారులు, అమాత్యుల నివాస గృహాలు, సైనికులుండే ప్రాంతం 3) విస్తరించిన నగర ప్రాంతం.
# మొహల్లాలు: సామాన్య ప్రజల గృహాలున్న వీధుల్ని మొహల్లాలు అని పిలిచేవారు.
# కమాన్లు: నగరంలోని కొన్ని ప్రాంతాలు కమాన్లు అని పిలువబడేవి. ఉదా: చార్ కమాన్, మచ్లీ కమాన్ హబ్లీ కమాన్
# గోల్కొండదుర్గంలో 87 బురుజులు, 8 ద్వారాలు కలవు. ద్వారాల్ని దర్వాజలు అని పిలిచేవారు. బంజారా, ఫతే దర్వాజలు ప్రసిద్ధిచెందినవి.
# నాలుగు ప్రధాన ద్వారాలు: హైదరాబాద్ నగరంలో నాలుగు ప్రధాన ద్వారాలుండేవి. అవి లాల్‌దర్వాజ, ఢిల్లీ దర్వాజ, గౌలిపురా దర్వాజ, ఫతే దర్వాజ.
# గోల్కొండ పట్టణంలో మసీదులు, ధర్మశాలలు, భిక్షా గృహాలు, యాత్రికుల విరామ భవనాలు, వైద్యశాలలు, పాఠశాలలు ఎక్కువగా ఉండేవి.
# నగర రక్షణ బాధ్యత కొత్వాల్ పర్యవేక్షణలో ఉండేది. నేరాల సంఖ్య దాదాపు శూన్యమనే చెప్పాలి. వృద్ధులు సైతం సర్వాభరణాలు ధరించి నిర్భయంగా ప్రయాణం చేసేవారు.
# పండుగలు: పట్టాభిషేక మహోత్సవాల్లో ప్రజలు జాతి, మత, వర్గ, బీద, ధనిక భేదం లేకుండా ఉత్సాహంగా పాల్గొనేవారు. నౌరోజ్ పండుగ, వసంతోత్సవం, మృగశిర ప్రవేశ ఉత్సవం, మొహరం మొదలైన పండుగల్ని అట్టహాసంగా జరుపుకునేవారు. మహమ్మద్ కులీ కుతుబ్‌షా, అబ్దుల్లా కుతుబ్షాల కాలంలో ఈ ఉత్సవాలను గొప్పగా నిర్వహించేందుకు ప్రత్యేక ఆదేశాలుండేవి. ప్రభుత్వ కోశాగారం నుంచి ఉత్సవాల నిర్వహణ నిమిత్తం ద్రవ్యం ఇవ్వబడింది. క్రీ.శ. 16వ శాతాబ్దం ప్రారంభం నుంచి మొదలుకొని క్రీ.శ. 1687 వరకు కుతుబ్‌షాహీల పాలన గోల్కొండ కేంద్రంగా కొనసాగింది. సుల్తాన్ కులీకుతుబ్‌షా మొదలుకొని హసన్ తానీషా వరకు మొత్తం ఏడుగురు పాలకులు పాలించారు.
కుతుబ్‌షాహీ ముఖ్య నిర్మాణాలు
# మహమ్మద్ కులీకుతుబ్‌షా హైదరాబాద్ నగరం, చార్మినార్, చార్ కమాన్, జామా మసీదు, దార్ ఉల్ షిఫా, దాద్‌మహల్, ఇబ్రహీం కుతుబ్‌షా ఇబ్రహీంబాగ్, లంగర్‌హౌస్, ఇబ్రహీంపట్నం చెరువు, మూసీనదిపై వంతెన, ఫూల్‌బాగ్, గోల్కొండ దుర్గానికి ప్రాకారం , హయత్‌నగర్, బుద్వేల్ చెరువు, స్సేన్‌సాగర్, మక్కా మసీదు మొదలైన నిర్మాణాలు
# హైదరాబాద్: ఇది కుతుబ్‌షాహీలు నిర్మించిన నగరం. మహమ్మద్ కులీకుతుబ్‌షా హైదరాబాద్ నగర నిర్మాత. దీనికి కారణం మహమ్మద్ కులీకుతుబ్‌షా సరసహృదయం, రసికత, ప్రేమ కారణం. మహమ్మద్ కులీకుతుబ్‌షా భాగమతి (భాగ్యమతి) ప్రేమలో పడి ఆమెను కలుసుకోడానికి మూసీ నది దాటి వెళ్లేవాడు. ఒకనాడు మూసీనది పొంగిపొర్లుతున్నా మహమ్మద్ కులీకుతుబ్‌షా అశ్వరూఢుడై నదిలోకి దిగాడు. తరువాత గురంపై నుంచి నదిలోకి దూకి ఈదుకుంటూ వెళ్లి భాగమతిని కలుసుకున్నాడు. కుమారుడి నిష్కళంక ప్రేమను, సాహసాన్ని అర్థం చేసుకొన్న ఇబ్రహీం కుతుబ్‌షా పురానాపూల్ (పాత వారధి) నిర్మించాడు. (కుమారుడి కోసమే ఈ వారధి నిర్మించాడనే విషయంలో కొంత వివాదం కలదు. ప్రజా సౌకర్యార్థం నిర్మించాడనే వాదన కూడా ఉంది).
# మహమ్మద్ కులీకుతుబ్‌షా క్రీ.శ. 1580లో సింహాసనాన్ని అధిష్టించిన తరువాత భాగమతిని పెండ్లి చేసుకున్నాడు. ఆమెకు హైదర్‌మహల్ అనే బిరుదునిచ్చాడు. ఆమె రక్షణ కోసం సుమారు 1200ల మంది అశ్వికుల్ని నియమించాడు. ‘భాగ్యనగర్’ అనే పేరు ఈమె పేరుమీదగానే వచ్చింది. మహమ్మద్ కులీకుతుబ్‌షా రచించిన కవితలో హైదర్ మహల్ ప్రస్తావన ఉంది. బర్నీజ్, టెవరిజ్, మనూకి, పెరిస్టా, నిజాముద్దీన్ అహమ్మద్ బక్షి, కాఫీఖాన్, మహమ్మద్ సాది మొదలైన ప్రముఖులు ఈ విషయాన్ని ప్రస్తావించారు.
# అబుల్ ఫజల్ హైదరాబాద్ నగరాన్ని భాగ్యనగర్ అని పేర్కొన్నాడు.
# భాగమతి, మహమ్మద్ కులీకుతుబ్‌షాల ప్రేమకథను కాఫీఖాన్ కూడా పేర్కొన్నాడు.
# అబుల్ఫైజీ (అబుల్ ఫజల్ సోదరుడు) భాగమతి, భాగ్యనగర్లను ప్రస్తావించాడు.
# కుతుబ్‌షాహీ చరిత్రకారుడు హైదరాబాద్ నగర నిర్మాణానికి కారణం వేట అని పేర్కొన్నాడు. కుతుబ్‌షా ‘హాఛలం’ (చంచలం) గ్రామానికి షికారుకెళ్లి ఆ ప్రాంతం నగర నిర్మాణానికి అనుకూలమని భావించి నగర నిర్మాణాన్ని ప్రారంభించాడనే మరో అభిప్రాయం కూడా ఉంది.
# మహమ్మద్ కులీకుతుబ్‌షా క్రీ.శ. 1580లో సంహాసనాన్ని అధిష్టించాడు. పదేండ్ల తరువాత క్రీ.శ. 1590లో హైదరాబాద్ నగర నిర్మాణం ప్రారంభించబడింది. నగరం మధ్యలో చార్మినార్‌ను నిర్మించారు. దానికి నాలుగు వైపులా దారులు ఏర్పాటు చేశారు. ఇక్కడినుంచే నగర నిర్మాణం ప్రారంభమైంది.
# చార్మినార్ కట్టడానికి నాలుగు వైపులా కమాన్లు ఏర్పాటు చేశారు. అవి
# తూర్పున – నక్కార్ఖాన్ కమాన్
# పశ్చిమాన – దౌలత్‌ఖాన్ అలీ కమాన్
# ఉత్తరాన – మచిలీ కమాన్
# దక్షిణాన – చార్మినార్ కమాన్. చార్మినార్ నిర్మాణ వ్యయం 3 లక్షల హొన్నులు.
# హైదరాబాద్ రాజ్యంలోని ప్రాంతాలు: భారతదేశంలోని సంస్థానాల్లో అతిపెద్దది, ముఖ్యమైంది, అత్యంత సమర్థవంతమైంది హైదరాబాద్ సంస్థానం. హైదరాబాద్ రాజ్యంలో కన్నడ, మరఠ్వాడ ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలుండేవి. అయితే కాలక్రమంలో సర్కారు ప్రాంతాలు (ఆంధ్ర), సీడెడ్ (రామలసీమ) జిల్లాలు బ్రిటీషువారికిచ్చాడు నాటి హైదరాబాద్ నిజాం నిజాం అలీఖాన్. నాటి నుంచి హైదరాబాద్ నిజాం ఆధీనంలో తెలంగాణ, కన్నడ, మరఠ్వాడ ప్రాంతాలు మాత్రమే ఉండేవి.
# హైదరాబాద్ రాజ్య స్థాపన: క్రీ.శ. 1724లో ‘షకర్-ఖేడ్ యుద్ధం’లో తన ప్రత్యర్థి ముబారిజ్‌ఖాన్‌ను ఓడించిన మీర్ కమ్రుద్దీన్ చిన్కిలిచ్ఖాన్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ను కేంద్రంగా చేసుకొని హైదరాబాద్ రాజ్యాన్ని స్థాపించాడు.
# హైదరాబాద్ రాజ్యంలోని మూడు ప్రాంతాలు
1) మరఠ్వాడ 2) కన్నడ 3) తెలంగాణ
ప్రాంతంపేరు చదరపు మైళ్లు జనాభా
తెలంగాణ 42,775 44,84,471
కన్నడ 12,632 14,03,335
మరఠ్వాడ 27,291 39,57,151
అసఫ్జాహీలకాలంలోని ముఖ్య నిర్మాణాలు
నిజాం అలాఖాన్ కాలంలో మోతీ మహల్, గుల్షన్ మహల్, రోషన్ మహల్, రెసిడెన్సీ భవనం, గన్‌ఫౌండ్రీ.
అఫ్జల్ ఉద్దౌలా కాలంలో అఫ్జల్‌గంజ్ బ్రిడ్జి, అఫ్జల్‌గంజ్ బజార్, అఫ్జల్‌గంజ్ మసీదు, నయాపూల్ వంతెన.
మీర్ మహబూబ్ అలీఖాన్ కాలంలో నిజాం కళాశాల స్థాపన, సికిందరాబాద్ రైల్వేస్టేషన్, చంచల్‌గూడ జైలు, బాగ్-ఎ-ఆలం (నాంపల్లి పబ్లిక్ గార్డెన్), నాంపల్లి రైల్వేస్టేషన్, ఎరగడ్డ మెంటల్ హాస్పిటల్, ఫలక్‌నుమా ప్యాలెస్
మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం, అసెంబ్లీ భవనం, జూబ్లీ హాల్, హైకోర్టు, ఉస్మానియా ఆస్పత్రి, మొజాంజాహీ మార్కెట్, సిటీ కాలేజీ, సెంట్రల్ లైబ్రెరీ, అఫ్జల్‌గంజ్, లేక్‌వ్యూ గెస్ట్ హౌస్, సాలార్జంగ్ మ్యూజియం.
చెరువులు: ఉస్మాన్ సాగర్ (గండిపేట), హిమాయత్ సాగర్, నిజాం సాగర్ (నిజామాబాద్), అలీ సాగర్ (బోధన్), పోచారం చెరువు (నిజామాబాద్), పాలేరు చెరువు (ఖమ్మం), రాయంపల్లి చెరువు (మెదక్), ఫతేనగర్ చెరువు, వైరా ప్రాజెక్టు, డిండి ప్రాజెక్టు
# గమనిక: నిజాం రాజ్యంలో చీఫ్ ఇంజినీర్ అలీ నవాబ్ జంగ్ బహదూర్. ఇతడి జన్మదినమైన జూలై 11ను ప్రభుత్వం ‘ఇంజినీర్స్ డే’గా ప్రకటించింది.
శాతవాహనులు, ఇక్ష్వాకులు, వాకాటకులు, బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు, ముదిగొండ చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, కందూరు చోడులు, పొలవాస పాలకులు, కాకతీయులు, ముసునూరి నాయకులు, పద్మనాయకులు, బహమనీలు, కుతుబ్‌షాహీలు, మొఘలులు, అసఫ్జాహీలు మొదలైనవారు తెలంగాణను ఏలారు. ఈ విధంగా తెలంగాణకు ప్రాచీనకాలం నుంచి ఆధునికకాలం వరకు గొప్ప చారిత్రక నేపథ్యం ఉంది.
# హైదరాబాద్ రాష్ట్రం: క్రీ.శ. 1948 సెప్టెంబర్‌లో భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ పోలో’ ద్వారా హైదరాబాద్ రాజ్యం భారత యూనియన్‌లో చేరింది. నాటి నుంచి క్రీ.శ. 1956 అక్టోబర్ 31 తేదీ వరకు హైదారాబాద్ రాష్ట్రంగా కొనసాగింది. మరుసటి రోజు 1 నవంబర్ 1956న ఆంధ్రప్రదేశ్ (హైదరాబాద్, ఆంధ్ర రాష్ట్రాల కలయిక) రాష్ట్రం ఏర్పడింది.
# తెలంగాణ శబ్ద ఆవిర్భావం: తెలంగాణలోని ప్రజల గురించి మార్కండేయ, వాయు పురాణాల్లో ప్రస్తావన ఉంది. ఇది తెలుగు ప్రాంతాల గురించి త్రిలింగ, తిలింగ అని పేర్కొన్నారు.
# స్కంధపురాణం: శ్రీశైల భీమ కాళేశ మహేంద్రగిరి సంయుతం ప్రాకారాతుమహత్ కృత్వా త్రీణిద్వారా మ పాకరోత్ అని స్కంధపురాణం శ్రీశైల, ద్రాక్షారామం, కాళేశ్వరం (కరీంనగర్ జిల్లా) మహేంద్రగిరి ప్రాకారంగా ఉన్న ప్రాంతమే త్రిలింగదేశం అని వర్ణించబడి ఉంది.
# టాలమీ-జాగ్రఫీ: ఈగ్రంథంలో తెలుగు ప్రాంతాన్ని ట్రిలింగాన్, ట్రిలిప్తాన్ అనే పదాలు కన్పిస్తాయి.
# అగత్తియమ్: ఇది తమిళ గ్రంథం. ఈ గ్రంథంలో కొంగణం, కన్నడం, కొలం, తెలుంగు అని భాషాపరంగా కన్పిస్తుంది.
# రాజశేఖరుడు: ‘త్రిలింగాధిపతి’ అనే పదం వాడాడు.
# హేమాద్రి-వ్రతఖండం: హేమాద్రి యాదవ రాజుల మంత్రి, హేమాద్రి తన ‘వ్రతఖడం’లో తిలింగాధిపతి, తైలింగ క్షితిపాల అనే పదాన్ని ప్రస్తావించాడు.
గమనిక: అమీర్‌ఖుస్రూ, అబుల్ ఫజల్ అనే పండితులు ఈ తిలింగ, తైలింగ పదాలనే తెలంగాణ అని పేర్కొన్నారు.
# బృహత్కథ: బృహత్కథను రాసింది గుణాఢ్యుడు. బృహత్కథ పైశాచిక ప్రాకృత భాషలో రాయబడింది. శాతవాహనుల కాలంలో తెలుగు భాష వ్యవహారంలో ఉన్నట్లు బృహత్కథ పేర్కొంది. తెలంగాణలో మొట్టమొదటి కవి గుణాఢ్యుడు. ఇతడు మెదక్‌లోని కొండాపురం గ్రామానికి చెందినవాడు. పఠాన్‌చెరువు ప్రాంతంలో నివసించేవాడు.
# ముస్లిం చరిత్రకారులు: కాకతీయుల పతనానంతరం తమ రచనల్లో ఆంధ్ర ప్రాంతాన్ని తిలింగ, తెలింగ, తెలంగాణ అని ప్రస్తావించారు. ఒక నిర్దిష్టమైన భౌగోళిక ప్రాంతంగా తెలంగాణను ప్రస్తావించారు ముస్లిం చరిత్రకారులు.
# విలాస శాసనం: ప్రోలయ నాయకుడు ఈ శాసనాన్ని వేయించాడు. ఈ శాసనంలో తెలంగాణ పదం కన్పిస్తుంది.
# తెల్లాపూర్ శాసనం: క్రీ.శ. 1417 నాటి తెల్లాపూర్ శాసనం మెదక్ జిల్లా సంగారెడ్డి తాలూకాలోని తెల్లాపూర్‌లో లభించింది. ఈ శాసనంలో తెలంగాణ పదం ప్రస్తావించబడింది.
# వెలిచర్ల శాసనం: ప్రతాపరుద్ర గజపతి వేయించిన శాసనమే వెలిచర్ల శాసనం. ఇందులో ‘అనన్య సాధారణ సాహస శ్రీర్జగ్రహ పశ్చా తెలంగాణ దుర్గాన్’ అని పేర్కొన్నారు. ఈ విధంగా తెలంగాణ పదం ఈ శాసనంలో వాడారు.
# శ్రీకృష్ణదేవరాయలు: శ్రీకృష్ణదేవరాయల శాసనాలైన తిరుమల, చిన్నకంచి శాసనాల్లో తెలంగాణ శబ్దం కన్పిస్తుంది.
# శాసనాలు: శాతవాహనులు, ఇక్ష్వాకుల కాలంనాటి శాసనాలు, తుమ్మలగూడెం శాసనం, హైదరాబాద్ ప్రాకృత శాసనం, ఇంద్రపాల నగర తామ్ర శాసనం మొదలైన విష్ణుకుండినుల శాసనాలు, ఏలేశ్వరం శాసనం, గద్వాల సంస్కృత శాసనం మొదలైన బాదామి చాళుక్యుల శాసనాలు, కురవగట్టు శాసనం, పర్బణి శాసనం, వేములవాడ శాసనం, కరీంనగర్ శాసనం, ఖాజీపేట శాసనం మొదలైన వేములవాడ చాళుక్యుల శాసనాలు, కందూరు చోడుల కొలనుపాక శాసనం, వల్లాల శాసనం, నేలకొండపల్లి శాసనం, అనుముల శాసనం, పద్మనాయకుల పాలంపేట, పిల్లలమరి, ఎలకుర్తి, మాచాపూర్, సోమవరం శాసనాలు, గోవిందాపురం, మేడపల్లి, నగునూరు, వెంకటాపురం, బాణాజీపేట మొదలైనచోట్ల లభించిన పొలవాస పాలకుల శాసనాలు, కాకతీయుల శాసనాలైన బయ్యారం చెరువు శాసనం, మల్కాపురం శాసనం, చందుపట్ల శాసనం, పాలంపేట శాసనం, పద్మాక్షి శాసనం, శనిగరం శాసనం, కొలనుపాక శాసనం, పానగల్లు శాసనం, హనుమకొండ శాసనం మొదలైనవి, విలాసతామ్ర శాసనం, గణపేశ్వరం శాసనం, పిల్లలమరి శాసనం, పోలవరం శాసనం, కలువచెరు శాసనం మొదలైన ముసునూరి నాయకుల శాసనాలు, మల్యాల వంశస్తులకు చెందిన బూదాపురం శాసనం మొదలైనవి తెలంగాణ చరిత్ర గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి.
# ఏపీలో కలిపిన మండలాలు: ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల్లోని 275 రెవెన్యూ గ్రామాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపారు. ఆ మండలాలే బూర్గంపాడు, భద్రాచలం, కూనవరం, కుక్కునూరు, చింతూరు, వీఆర్ పురం, వేలేరుపాడు.
# ఇండియాలో 29 రాష్ట్రాల్లో 16 రాష్ట్రాలు విస్తీర్ణపరంగా తెలంగాణ కంటే చిన్నవిగా ఉన్నాయి. అదేవిధంగా 29 రాష్ట్రాల్లో 16 రాష్ట్రాలు జనాభాపరంగా కూడా తెలంగాణ కంటే చిన్నవి.
తెలంగాణ ఖనిజసంపద:
# ఖమ్మం- క్వార్ట్, స్టోనిండ్శాండ్, గ్రానైట్, చలువరాయి, బైరైట్స్, బొగ్గు, డోలమైట్, ముడి ఇనుము, మాగ్నటైట్, సున్నపురాయి
# మహబూబ్‌నగర్- అమెథీస్ట్, క్వార్ట్, సున్నపురాయి పలకలు
# కరీంనగర్- బొగ్గు, ముడి ఇనుము, సున్నపురాయి, గ్రానైట్
# వరంగల్- అమెథీస్ట్, బొగ్గు, ముడి ఇనుము, గ్రానైట్
# ఆదిలాబాద్- బొగ్గు, ముడి ఇనుము
# నల్లగొండ- సున్నపురాయి, గ్రానైట్
# నిజామాబాద్- క్వార్ట్, గ్రానైట్
# మెదక్- గ్రానైట్
# రంగారెడ్డి- అమెథీస్ట్, సున్నపురాయి, క్వార్ట్, సున్నపురాయి పలకలు, గ్రానైట్
నదులు:
# గోదావరి: ఈ నది మహారాష్ట్రలోని నాసికాత్రయంబకం వద్ద పుట్టి బాసర (ఆదిలాబాద్) వద్ద తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది.
# నిజామాబాద్ జిల్లాలోని మంజీరా నదిని కలుపుకొని కొంతదూరం నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దుగా అదేవిధంగా ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల సరిహద్దుల్లోనూ ప్రవహిస్తుంది.
# కడెం నది, పెన్‌గంగ, వరద (వార్దా), వైన్‌గంగల సమ్మిళితమైన ప్రాణహిత నదిని కలుపుకొని కరీంనగర్ తూర్పు సరిహద్దు గుండా ప్రవహించి ఇంద్రావతిని కలుపుకొని వరంగల్, ఖమ్మం జిల్లాల ద్వారా ప్రయాణించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. గోదావరికి మంజీర, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, వార్ద, వైన్‌గంగా ఉపనదులు.
# కృష్ణానది: మహారాష్ట్రలోని సహ్యాద్రి కొండల్లోని మహాబలేశ్వరం వద్ద పుట్టి మక్తల్ (మహబూబ్‌నగర్)లో ప్రవేశిస్తుంది. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో ఈ నది ప్రవహిస్తుంది. ఈ నదికి తుంగభద్ర, మూసీ, డిండి, పాలేరు, మున్నేరు, ఘటప్రభ, మలప్రభ, భీమా ఉపనదులు.
# తుంగభద్రానది: ఈ నది కర్ణాటక రాష్ట్రంలోని పశ్చమ కనుమల్లో పుట్టి మహబూబ్‌నగర్ జిల్లా దక్షిణ హద్దు వెంట ప్రవహించి సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది.
# భీమా: కృష్ణానది ఉపనదుల్లో ఇది పెద్దది. పశ్చిమ కనుమల్లో పుట్టి ఆగ్నేయ దిశగా ప్రవహించి మహబూబ్‌నగర్‌లో నైరుతి దిశగా రాయచూర్‌కు 16 మైళ్ల ఉత్తరంగా కృష్ణానదిలో కలుస్తుంది.
# మంజీర: మహారాష్ట్రలోని బాలాఘాట్ పర్వతాల్లో పుట్టిన ఈ నది మెదక్ జిల్లాలో ప్రవేశించి ఆగ్నేయ దిశగా ప్రయాణించి నిజామాబాద్ జిల్లాలో ప్రవహించి గోదావరి నదిలో కలుస్తుంది.
# ప్రాణహిత: ఇది సాత్పూరా పర్వతాల్లో పుట్టి వైన్‌గంగ, పెన్‌గంగ, వార్దా నదలు కలయికతో ఏర్పడుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో ప్రవహించి చెన్నూరు వద్ద గోదావరిలో కలుస్తుంది.
# మూసీ: ఇది అనంతగిరి కొండల (శివారెడ్డిపేట)వద్ద పుట్టింది.
# పాలేరు: వరంగల్ జిల్లా బాణపురం వద్ద పుట్టి నల్లగొండ, ఖమ్మం సరిహద్దులో ప్రవహిస్తుంది. తరువాత కృష్ణానదిలో కలుస్తుంది.
# మున్నేరు: వరంగల్ పాకాల చెరువునుంచి బయలుదేరి వరంగల్, ఖమ్మం జిల్లాలో దక్షిణ దిశగా సాగి కృష్ణానదిలో కలుస్తుంది.
రాష్ట్రంలోని పెద్ద చెరువులు
# నిజాంసాగర్ (మంజీరా నదిపై)
# హిమాయత్‌సాగర్ (ఈసా నదిపై)
# ఉస్మాన్‌సాగర్ (మూసీ నదిపై)
తెలంగాణ- భౌగోళికాంశాలు- ప్రాధాన్యతలు
# దేశంలో – 29వ రాష్ట్రం
# విస్తీర్ణం – 1,14,480 చ.కి.మీ.
# ఉనికి – 150 551 నుంచి 190 551 ఉత్తర అక్షాంశాల మధ్య 770 22.35 నుంచి 810 2.231 తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది.
# అధికార భాష – తెలుగు
# జిల్లాల సంఖ్య – 33
# రాజధాని, హైకోర్టు- హైదరాబాద్
# లోక్‌సభ స్థానాలు – 17, రాజ్యసభ స్థానాలు – 7
# అసెంబ్లీ స్థానాలు – 119
# రాష్ట్ర జంతువు – జింక (శాస్త్రీయనామం- ఏక్సిస్ ఏక్సిస్)
# పుష్పం – తంగేడు (శాస్త్రీయనామం- ట్రేనార్స్ కాషిమా)
# పక్షి – పాలపిట్ట (శాస్త్రీయనామం- కొరాసియస్ బెంగాలెన్సిస్)
# వృక్షం – జమ్మిచెట్టు (శాస్త్రీయనామం- ప్రొసోపిస్ సినరియా)
మధుసూదన్. బి
నారాయణ ఐఏఎస్ అకాడమీ
హైదరాబాద్
94400 82663
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు