ఉనికిలోకి రావడంతోనే ఉల్లంఘనలు ప్రారంభం (తెలంగాణ ఉద్యమ చరిత్ర)
ఉల్లంఘనలకు సంబంధించిన అంశాలు
# పెద్దమనుషుల ఒప్పందంలోని రీజినల్ కౌన్సిల్ ఉండగా దాన్ని రీజినల్ కమిటీగా మార్చారు. కౌన్సిల్ అనే విస్తృత పరిధి నుంచి కేవలం సలహాలిచ్చే కమిటీ స్థాయికి కుదించారు. ఈ కమిటీ పేరుతో తెలంగాణ అనే పదాన్ని రానీయకుండా ఆంధ్రప్రదేశ్ రీజినల్ కమిటీగా మార్చారు.
ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రం పేరుమార్పు
#ఆంధ్రతో విలీనమైన తెలంగాణను ఒక రాష్ట్రంగా ఏ పేరుతో పిలవాలనే చర్చ 1955లో జరిగినప్పుడు ‘ఆంధ్ర-తెలంగాణ’ రాష్ట్రంగా ఉండాలని తెలంగాణ ప్రతినిధులు పట్టుబట్టగా ఏ పేరైనా ఇబ్బంది లేదన్న విశాలాంధ్ర నాయకులు, ఒప్పందం సందర్భంగా జరిగిన చర్చలో తెలంగాణ పదాన్ని వ్యతిరేకించారు. చివరికి ఆంధ్రప్రదేశ్ అని పేరుపెట్టారు.
ప్రాంతీయ కమిటీ చైర్మన్గా ఉపముఖ్యమంత్రి
#పెద్దమనుషుల ఒప్పందంలో ముఖ్యమంత్రి గానీ, ఉపముఖ్యమంత్రి గానీ ఎవరు తెలంగాణ వారైతే వారు ప్రాంతీయ మండలికి అధ్యక్షులుగా ఉంటారని స్పష్టంగా రాసుకున్నారు. కానీ ఈ ఒప్పందం అంశాన్ని పార్లమెంటులో ప్రకటించిన ‘రక్షణ’ల్లోగానీ, రాష్ట్రపతి ఉత్తర్వుల్లో గానీ చేర్చలేదు. ఫలితంగా చైర్మన్ పదవికి ప్రతిసారి ఎన్నికలు జరపాల్సి వచ్చింది. తొలి ప్రభుత్వంలోనే పెద్దమనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఉపముఖ్యమంత్రిగా తెలంగాణ వ్యక్తిని నియమించలేదు.
ప్రాంతీయ కమిటీలో సభ్యత్వం
# పెద్దమనుషుల ఒప్పందంలో భాగంగా ‘తెలంగాణ ప్రాంతీయ మండలి’లో 20 మంది సభ్యులుండాలి. వారు..
ఎ. తెలంగాణ తొమ్మిది జిల్లాలకు ప్రాతినిథ్యం వహించే 9 మంది శాసన సభ్యులు తెలంగాణ జిల్లాల నుంచి విడివిడిగా వీరిని శాసన సభ్యులు ఎన్నుకోవాలి.
బి. శాసనసభ, పార్లమెంటు నుంచి ఆరుగురు సభ్యులు. అసెంబ్లీలోని తెలంగాణ ప్రతినిధులు ఎన్నుకుంటారు.
సి. శాసనసభ్యులు కాని సభ్యులు ఐదుగురు. వీరిని శాసనసభ తెలంగాణ ప్రతినిధులు ఎన్నుకుంటారు. తెలంగాణ ప్రాంత మంత్రులందరూ ప్రాంతీయ మండలి సభ్యులుగా ఉంటారు. ఇతర కేబినెట్ మంత్రులను కూడా సమావేశాలకు ఆహ్వానించవచ్చు.
# పార్లమెంటులో హోం మంత్రి చేసిన ప్రకటనలో రీజినల్ కమిటీకి సంబంధించిన రాష్ట్రపతి ఉత్తర్వుల్లో తెలంగాణ శాసనసభ సభ్యులందరూ (ముఖ్యమంత్రి, స్పీకర్ మినహా) రీజినల్ కమిటీ సభ్యులుగా ఉంటారు. ఈ ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్న అంశాన్ని ఉల్లంఘించారు. తెలంగాణ శాసనసభ్యుల్లోని విశాలాంధ్ర సమర్థకులు, ముఖ్యమంత్రి అనుచరులతో ఒక ముఠాను ఏర్పాటు చేసి సభ్యుల్లో చీలిక తెచ్చి రీజినల్ కమిటీ నిర్వహణకు అడ్డుతగిలేలా చేశారు. తత్ఫలితంగా తెలంగాణ ప్రయోజనాలను అడ్డుకున్నారు.
తెలంగాణ ప్రాంత ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పెద్దమనుషుల ఒప్పందంలోని 11(ఏ) పేరాలో ‘తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఉద్యోగ వ్యవహారాలను కూడా ప్రాంతీయ మండలి పరీశిలించి నిర్ణయాలు తీసుకుంటుంది’ అని అంగీకరించిన ఆంధ్ర నాయకులు ‘రక్షణ’ల్లోగానీ, ప్రాంతీయ కమిటీకి సంబంధించిన రాష్ట్రపతి ఉత్తర్వుల్లో గానీ ఉద్యోగ అంశాన్ని ప్రాంతీయ కమిటీ పరిధిలో తీసుకురాలేదు. ఈ ఉద్యోగ అంశాన్ని ప్రాంతీయ కమిటీ నుంచి మినహాయించడం ఒక దురుద్దేశపూరితమైన కుట్ర మాత్రమే రక్షణల్లో ఉద్యోగ అంశాన్ని విడిగా ప్రస్తావించారు.
ప్రాంతీయ కమిటీకి ఆర్థిక అంశాలు
# పెద్దమనుషుల ఒప్పందంలోని 9వ పేరాలో ‘తెలంగాణ ప్రాంతపు అవసరాలు, ఆవశ్యకతల దృష్ట్యా సర్వతో ముఖాభివృద్ధి సాధించుకునేందుకు ఒక ప్రాంతీయ మండలి (రీజినల్ కౌన్సిల్) ఏర్పాటు కావాలి’ అని అంగీకరించారు.
# అయితే రాష్ట్రపతి జారీచేసిన ‘ది ఆంధ్రప్రదేశ్ రీజినల్ కమిటీ ఆర్డర్-1958’లో ఈ ప్రాంతీయ మండలి కోరలను తీసేశారు. కమిటీకి పెద్దమనుషుల ఒప్పందం ద్వారా సంక్రమించిన ఆర్థికపరమైన అధికారాలను అప్పగించకుండా దాన్ని కేవలం సలహా సంఘంగా దిగజార్చారు.
రాష్ట్రపతి ఉత్తర్వులు-1958లో..
#‘నిర్దిష్ట అంశాలకు సంబంధించిన శాసనపరమైన విషయాలను రీజినల్ కమిటీ పరిశీలనకు ప్రభుత్వం పంపిస్తుంది. ఈ విషయంలో అవసరమైన విధానాలకోసం, శాసనాల కోసం సలహాలను అది ప్రభుత్వానికి ఇవ్వవచ్చు. సాధారణ వ్యయం విషయంలో తప్ప అదనంగా ఎలాంటి ఆర్థికపరమైన వ్యయం లేని విషయాల్లో మాత్రమే ఈ కమిటీ ప్రభుత్వానికి సలహా ఇవ్వాలి. ఈ నిబంధన వల్ల తెలంగాణ అభివృద్ధికి అవసరమైన నిధుల కేటాయింపును కోరే అవకాశం రీజినల్ కమిటీకి లేకుండా ఆంధ్రాపాలకులు చేశారు.
# పార్లమెంటుకు సమర్పించిన రక్షణల నోటులో పేర్కొన్న ఉర్దూ ప్రతిపత్తి, పరిపాలనకు, న్యాయ నిర్వహణకు సంబంధించి ‘ప్రస్తుతం తెలంగాణలో ఉర్దూకు గల ప్రతిపత్తి మరో ఐదేండ్ల వరకు యథాతథంగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సలహానిస్తుంది. ఇదే విషయాన్ని రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదే పేరా (6)లో పెద్దమనుషుల ఒప్పందంలో ఉన్న ‘ఉద్యోగాల్లో చేర్చుకునే విషయంలో మాత్రం, తెలగు భాష తెలిసి ఉండాలని నిబంధన విధించకూడదు, కానీ ఉద్యోగ నియామకం తర్వాత రెండేండ్లలోగా నిర్ణీతమైన తెలుగు పరీక్షలో వారు ఉత్తీర్ణులవ్వాలి’ అనే అంశాన్ని రాష్ట్రపతి ఉత్తర్వులో గానీ, పార్లమెంటుకు సమర్పించిన నోటులోగాని ప్రస్తావించకపోవడంతో నియామకాల్లో తెలంగాణకు చాలా అన్యాయం జరిగింది.
# 1958, ఫిబ్రవరి 1న రాష్ట్రపతి జారీ చేసిన ‘ద ఆంధ్రప్రదేశ్ రీజినల్ కమిటీ ఆర్డర్’ ఉత్తర్వులు తెలంగాణ వాదులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
వ్యవసాయ భూముల కొనుగోలుకు సంబంధించి…
# తెలంగాణలోని వ్యవసాయ భూముల అమ్మకం ప్రాంతీ య మండలి ఆధీనంలో ఉండాలి. ఈ విషయాన్ని పెద్దమనుషుల ఒప్పందంలో, రక్షణల నోట్లో రాష్ట్రపతి ఉత్తర్వుల్లో (రీజినల్ కమిటీ షెడ్యూల్డ్ అంశాలు) చేర్చారు. కానీ అది ఎప్పుడూ అమల్లోకి రాలేదు.
# ఈ ఒప్పందం అంశం లేదా నిబంధనను పెట్టడానికి కారణం తెలంగాణ రైతుల భూములు ఆంధ్రా ప్రాంతం వారి చేతుల్లోకి పోయి ఈ ప్రాంతం ఆంధ్ర వలసగా మారకుండా రీజినల్ కమిటీ నియంత్రించాలనేది నాటి పెద్దల సంకల్పం. కానీ దీన్ని ఉల్లంఘించడానికి ఆంధ్రపెద్దలు ‘ఆంధ్రప్రదేశ్ (తెలంగాణ) టెనెన్సీ చట్టాన్ని (హైదరాబాద్ యాక్ట్ 21 ఆఫ్ 1950)’ ఉపయోగించుకున్నారు. ఈ చట్టంలోని సెక్షన్ 50బీ ప్రకారం తెలంగాణలోని భూముల అమ్మకాలను తహసీల్దార్ అనుమతితో అవసరమైన రిజిస్ట్రేషన్ డబ్బును చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకోవచ్చు.
# ఈ క్లాజును ఉపయోగించుకుని లక్షలాది ఎకరాల తెలంగాణ భూములు రీజినల్ కమిటీ దృష్టికి రాకుండానే ఆంధ్రాప్రాంతం వారి చేతుల్లోకి మారాయి. దీనికోసం ఆంధ్ర సెటిలర్ అయిన వీబీ రాజును రెవెన్యూ మంత్రిగా నీలం సంజీవరెడ్డి నియమించారు. పోలీసు చర్య తర్వాత తెలంగాణ రెవెన్యూ శాఖలో భర్తీ అయిన ఉద్యోగుల్లో అత్యధికులు ఆంధ్ర ప్రాంతీయులే. ఇవన్నీ ఈ భూముల బదలాయింపునకు తోడ్పడ్డాయి.
నీటిపారుదల అంశం
# పెద్ద మనుషుల ఒప్పందంలోని 11ఏ పేరాలో నీరుపారుదల అంశాన్ని పేర్కొన్నారు. కానీ పార్లమెంటులో సమర్పించిన రక్షణల నోట్లో, రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఎక్కడా దీని గురించిన పదమే లేదు. ఒప్పందంలోని ఇంత ముఖ్యమైన అంశాన్ని బాహాటంగా రాష్ట్ర ఏర్పాటుకు ముందే ఉల్లంఘించారు. ఎస్ఆర్సీ ఈ విషయమై చేసిన హెచ్చరికను కూడా పెద్దమనుషులు పట్టించుకోలేదు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు