తిరకాసులతో ఉద్యోగాలు తన్నుకుపోయారు (తెలంగాణ ఉద్యమచరిత్ర )
తెలంగాణ ఉపాధ్యాయుల వేతనాల సవరణలో అక్రమాలు
# 1956-57లో రాష్ట్ర ఏర్పాటుకు పూర్వం తెలంగాణ ఉపాధ్యాయులకు, బీఎడ్ శిక్షణ తీసుకుంటున్న ( ఫ్రెష్ బ్యాచ్) అభ్యర్థులకు వేతనాలు రూ. 154-275గా ఉంటుందని అప్పటి హైదరాబాద్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ స్కేలు బీఎడ్ శిక్షణ పొందినవారికే వర్తిస్తుంది. ఈ విద్యార్థులు శిక్షణ పొందుతున్న సమయంలోనే హైదరాబాద్ సంస్థానం విచ్ఛిన్నమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. బీఎడ్ శిక్షణ పూర్తిచేసుకొని ఉపాధ్యాయ పోస్టులలో నియామకమైన( ఫ్రెష్ బ్యాచ్) వారికి వేతనం స్కేలు రూ. 85-175గా నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ ఉపాధ్యాయులకు హైదరాబాద్ ప్రభుత్వం స్కేలు రూ. 154-275గా నిర్ణయించి పత్రికా ప్రకటన ఇచ్చింది. ఈ స్కేలు ప్రకారమే మాకు వేతనాలు చెల్లించాలని ఉపాధ్యాయులు మొరపెట్టుకున్నారు. ఈ బ్యాచ్ ఉపాధ్యాయులలో తెలంగాణ ఉద్యమ మార్గదర్శి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ కూడా ఒకరు. ఈ సమస్యను ఆయన మాటల్లోనే…. బీఎడ్‌లో నేను జేరింది జూన్ 1956. పూర్తయింది 1957మార్చి. మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. రిజల్ట్ వచ్చినాయి. అపాయింట్మెంట్రాలె. డిప్యూటీ డైరెక్టర్ సి.బి. రావును మేమువెళ్లి అడిగినం. నీకు ఎవరిస్తానన్నారు జాబ్ అని అన్నాడు. దక్కన్ క్రానికల్ అడ్వరైటజ్మెంట్ చూపిస్తే…..ఆయన పకపకానవ్వి హైదరాబాద్ గవర్నమెంట్‌ది కదా అది,మీరు ఆ గవర్నమెంట్‌ని వెళ్లి అడగండి, మమ్మల్ని ఎందుకు అడుగుతారని’’ అన్నాడు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కాగానే ఇది తన రియాక్షన్.
# ‘‘కొద్దిరోజుల తర్వాత టెంపరరీ అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. ఆంధ్ర స్కేలు రూ. 85-175 . తెలంగాణ స్కేల్ రూ. 154-275. ఆంధ్రా ఆఫీసర్‌ను ఈ స్కేల్ ఏంటి అని అడిగిన, మళ్లీ అదేమాట, హైదరాబాద్ గవర్నమెంట్‌ని అడగాలే అని వెటకారంతో నవ్విండు ఆ ఆంధ్రా ఆఫీసర్. ఎండాకాలంలో తీసేశారు. మల్లబోయి అడిగిన. ఇది ఎన్నోసారి అని అడిగి, ఆంధ్రరాష్ట్రంలో పదేండ్లు ఇట్ల పర్మినెంట్ చేసినంక అప్పుడు ఆలోచిస్తం. పర్మినెంట్ చేయడం, అంతవరకు కాదు అన్నాడు. ఆ విధంగా నేను టీచర్స్ ఉద్యమంలో పాల్గొన్నాను’’ అన్నారు జయశంకర్ సార్.
#హైదరాబాద్ ప్రభుత్వంలో నియమింపబడిన ప్రమోషన్లకు అర్హత కలిగిన టీచర్లకు డిపార్ట్మెంట్ పరీక్షలు ఎక్కౌంట్స్ టెస్ట్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ టెస్ట్, రీజినల్, స్పెషల్ లాంగ్వేజ్ టెస్ట్‌లు వంటివి పాస్ కాలేదని షరతులు పెడుతూ పదోన్నతులు ఇవ్వలేదు. ఏకీకృత సర్వీసుల పేరుతో ఎక్కవగా ఉన్న తెలంగాణ స్కేలును తక్కువగా ఉన్న ఆంధ్రస్కేలుతో సమానం చేసి తెలంగాణ ప్రాంత ఉద్యోగులకు అన్యాయం చేసింది ప్రభుత్వం. తెలంగాణలో రూ. 154-275 ఉండగా, ఆంధ్ర స్కేలు రూ.165-254తో, రూ. 130-190 ఉన్నది రూ. 85-175తో సమానం చేశారు. ఆంధ్ర ఉపాధ్యాయుల కంటే సంఖ్యలో తెలంగాణ ఉపాధ్యాయులు ఎక్కువగా ఉండేవారు. (ఆంధ్రలో ప్రైవేట్ విద్యాసంస్థలు ఎక్కువ) అయినా 2ః1 నిష్పత్తిలో ప్రమోషన్లు ఇచ్చింది ప్రభుత్వం. 1961లో ప్రభుత్వం కామన్ గ్రేడేషన్ లిస్టును రద్దుచేసి, ప్రాంత ఆధారిత విధానాన్ని అమలుచేసి నవంబర్ 1, 1956 నాటికి ఆంధ్రరాష్ట్రంలో రూ.85-175, రూ. 165-245 పేస్కేలు ఉన్నవారికి ముందుగా ప్రమోషన్లు ఇవ్వడమే కాకుండా వారి పే స్కేలును రూ.325-700, రూ.700-1000 చేసింది.
శాసనసభలో ఉద్యోగుల సమస్యలపై ప్రస్తావన
#1958 మార్చి 1న చర్చను ప్రారంభిస్తూ పిల్లలమర్రి వెంకటేశ్వర్లు ‘‘ ఆంధ్రా-తెలంగాణ ఉద్యోగుల జీతాల్లో వ్యత్యాసాలను తొలగించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఇప్పటి తమ జీతాలు తగ్గింపబడని తెలంగాణ ఉద్యోగులు హామీ పొందినందుకు నేనే వారిని అభినందిస్తున్నాను. ఆ హామీ కనుక లేకుండా ఉన్నట్లయితే, ఇప్పటి ప్రభుత్వం ఈ పాటికే వారి జీతాలను ఖచ్చితంగా తగ్గించి ఉండేదన్నారు. మరో శాసనసభ్యుడు ఎం.ఎస్ రాజలింగం మాట్లాడుతూ ‘‘ప్రభుత్వ సర్వీసుల్లోని తెలంగాణ ఉద్యోగులకు అన్యాయ పరంపరాలు జరగడం శోచనీయం అన్నారు.
జిల్లా విద్యాధికారి కార్యాలయంలో
#1958లో తయారుచేసిన గ్రేడేషన్ లిస్టు ప్రకారం ఆంధ్ర అధికారులకన్నా తెలంగాణ అధికారులే ఉన్నతస్థాయి పోస్టులలో ఉన్నారు. ఆ సమయంలో ప్రాంతాన్ని ఆధారంగా చేసుకునే విధానంతో జీవో తెచ్చి (Dy, D.P.I స్థాయి ఉద్యోగులు కాక) సీనియర్ తెలంగాణ ఆఫీసర్లను అలాగే ఉంచి జూనియర్ ఆంధ్రా ఆఫీసర్లకు ముందుగా ప్రమోషన్లు ఇచ్చింది ప్రభుత్వం. ఉదాహరణకు గ్రేడేషన్ లిస్టులోని క్రమసంఖ్య 54 నుంచి 59వరకు ఉన్న ఆంధ్రా అధికారులకు క్రమసంఖ్య 26, 28,, 30, 31, 32,35,37, 45,48లో ఉన్న తెలంగాణ అధికారుల కన్నా ముందు పదోన్నతులను కల్పించారు.
# ఇదే విధానాన్ని, ఇవే అక్రమాలను ఉద్యోగ నియామకాల్లో, పదోన్నతుల్లో ఇతర ప్రభుత్వ శాఖలలో కూడా కొనసాగించింది ప్రభుత్వం. వీటిలో కొన్ని ప్రభుత్వశాఖలు, ప్రభుత్వ కళాశాలలు, కో ఆపరేటివ్ డిపార్ట్మెంట్, ఎలక్టిసిటీ బోర్డు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మెడికల్ సర్వీసెస్, క్లాస్ IV ఎంప్లాయిస్ ( నాల్గవ తరగతి ఉద్యోగులు, జ్యుడీషియరీ, గెజిటెడ్ ఉద్యోగాలు మొదలగునవి)
తెలంగాణ మిగులు నిధుల తరలింపు
# పెద్దమనుషుల ఒప్పందంలోని మొదటి పేరాలో నిధులకు సంబంధించిన విషయాన్ని ప్రస్తావించారు. ‘‘రాష్ట్రానికి చెందిన కేంద్రీయ సాధారణ పరిపాలనల వ్యయాన్ని ఉభయప్రాంతాలు నిష్పత్తి ప్రకారం భరించాలి. తెలంగాణ నుంచి లభించే ఆదాయంలోని మిగులును తెలంగాణ ప్రాంతాల అభివృద్ధికి ఖర్చుచేసేందుకు కేటాయించాలి. తెలంగాణ పెద్దలు ఒప్పందంలో ఈ అంశాన్ని చేర్చడానికి కారణం 1956 నాటికి ఆంధ్రరాష్ట్రం అభివృద్ధి కార్యక్రమాల అమలులో నిధుల కొరతను ఎదుర్కొంటూ లోటు బడ్జెట్ రాష్ట్రంగా ఉన్నది. సుమారు రూ. 5, 6కోట్ల లోటుతో ఆంధ్రరాష్ట్రం ఉన్నది. తెలంగాణ ప్రాంతంలో 1956-57లో మిగులు నిధులు రూ. 6కోట్ల 16లక్షలు ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది.
# ఫజల్ అలీ రాష్ట్రాల పునర్విభజన కమిషన్ నివేదికలో స్పష్టంగా ఈ విషయంపై తెలంగాణవాదుల భయాలను వెల్లడించారు. ప్రస్తుత ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఏదో ఒక స్థాయిలో ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. తెలంగాణతో పోల్చితే ప్రస్తుతం ఆంధ్రరాష్ట్ర తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉన్నది. మరోవైపు తెలంగాణలో ఆర్థికపరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు చాలా తక్కువ. తెలంగాణలో భూమిపన్ను ద్వారా సమకూరే వార్షిక ఎక్సైజ్ ఆదాయం ఈ వ్యత్యాసానికి కారణమని అర్థం చేసుకోవచ్చు.
n ఏది ఏమైనప్పటికీ ఆంధ్రలో విలీనం కావడం వల్ల ఈ ప్రాంతంలో స్థిరమైన వనరుల ద్వారా ప్రస్తుతం ఆంధ్రలో ఎదుర్కొన్నట్లే అభివృద్ధి కార్యక్రమాలు నిధుల కొరతను ఎదుర్కొంటాయని కొందరు తెలంగాణ ప్రజలు భయపడుతున్నారు. వీరి పాలన కోణం నుంచి చూస్తే ఆంధ్రతో ఐక్యం కావడం వల్ల తెలంగాణ ప్రాంతానికి ఒనగూరే అదనపు ప్రయోజనాలేమి లేవు.’’
# ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఎస్సార్సీ నివేదిక వెల్లడించిన తెలంగాణ ప్రజల భయాలు‘ మిగులు నిధుల’ విషయంలో కూడా నిజమయ్యాయి. 1956, నవంబర్ 1 నుంచి సెప్టెంబర్ 1959 వరకే రీజినల్ కమిటీ నియమించిన ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ సబ్‌కమిటీ తెలంగాణలో చేయాల్సిన దానికన్నా తక్కువ వ్యయం చేసిందని తమ నివేదికలో పేర్కొంది.
శాసనసభలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల ప్రస్తావన
# ఆర్థికపరమైన అంశాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై 1958 మార్చి 1న శాసనసభలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో పాల్గొంటూ డాక్టర్ మరి చెన్నారెడ్డి బడ్జెట్లోని అంకెలను బట్టి చూస్తే తెలంగాణలో రెండున్నర కోట్ల మిగులు ఉన్నట్లు, ఆంధ్రలో ఒకకోటీ లోటు ఉన్నట్లు స్పష్టం కాగలదు. తెలంగాణ పట్ల ప్రభుత్వం శ్రద్దగా వ్యవహరించడం లేదనడానికి ఇదే నిదర్శనం.
తెలంగాణ ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో అవకతవకలపై అడ్‌హక్ కమిటీని నియమించిన తెలంగాణ రీజనల్ కమిటీ
# ఉద్యోగాలకు సంబంధించిన అంశం పెద్దమనుషుల ఒప్పందంలో ప్రాంతీయ కమిటీ పరిధిలో ఉండడాన్ని ఆనాడు ఆంధ్ర నాయకులు అంగీకరించారు. కానీ రక్షణల నోట్లో ఈ అంశాన్ని రీజినల్ కమిటీ పరిధి నుంచి తొలగించారు. కాబట్టి రీజినల్ కమిటీ ఆర్డర్లో ఉద్యోగాల అంశం చేర్చలేదు. ఎప్పుడైతే తెలంగాణ ప్రాంత ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత అన్యాయం జరగడం మొదలైందో వీటిపై రీజినల్ కమిటీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఉద్యోగాలకు సంబంధించి విచారించే అధికారం రీజినల్ కమిటీకి లేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఇది తీవ్రమైన వాదోపవాదాలకు, చర్చలకు దారితీసింది. రీజినల్ కమిటీ చైర్మన్ అచ్యుతరెడ్డి ‘‘ఉద్యోగులకు సంబంధించి చర్చించే బాధ్యత రీజినల్ కమిటీకి ఉన్నదని’’ బలంగా వాదించారు. తెలంగాణ అభివృద్ధి, వివిధ శాఖల కార్యక్రమాల గురించి చర్చించే అధికారాన్ని రీజినల్ కమిటీకి కట్టబెట్టినప్పుడు ఉద్యోగుల అంశాన్ని ఎలా మినహాయిస్తారని అచ్యుతరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తన వాదనలకు అనుకూలంగా అడ్వకేట్ జనరల్ చెప్పిన అభిప్రాయాన్ని చైర్మన్ ఉదహరించారు.
# ఈ వివాదంలో అడ్వకేట్ జనరల్ అభిప్రాయాన్ని మాత్రమే తీసుకోవాలని అంతిమంగా ఈ వివాదంలో నిర్ణయాన్ని ప్రకటించాల్సింది గవర్నర్ మాత్రమేనని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఆ తర్వాత ఈ వివాదాన్ని గవర్నర్‌కు నివేదించారు. ‘ సర్వీసెస్ రీజినల్ కమిటీ పరిధిలో లేవు కాబట్టి వీటిపై విచారించే అధికారం రీజినల్ కమిటీకి లేదని గవర్నర్ ప్రకటించారు. గవర్నర్, ప్రభుత్వం ఉద్యోగాల విషయం రీజినల్ కమిటీ పరిధిలోకి రాదని తేల్చినప్పటికీ రీజినల్ కమిటీ మాత్రం ఈ విషయాలపై దృష్టిసారిస్తూ తెలంగాణ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాలపై తరుచుగా ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చింది.1962 అక్టోబర్‌లో హయగ్రీవాచారి ఛైర్మన్‌గా సర్వీసుల ( ఉద్యోగులు) అంశంపై విచారణకు అడ్‌హక్‌కమిటీని ఏర్పాటు చేసింది. ఈ అహక్ కమిటీ వివిధ ప్రభుత్వ శాఖలలో తెలంగాణ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించేది. పరిష్కారాలను సూచించేది. రీజినల్ కమిటీకి సర్వీసులపై విచారించే అధికారం లేదని తేల్చిన ప్రభుత్వం అడహక్ కమిటీ సూచనలను పట్టించుకున్నట్లు కన్పించినా అన్యాయాల పరంపర మాత్రం కొనసాగుతూనే వచ్చింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు