ఆంధ్ర తెలంగాణ బలవంతపు కలయిక
పుష్కలమైన వనరులతో ప్రజాస్వామ్య పథంలో బుడిబుడి అడుగులు వేస్తున్న తెలంగాణపై ఆంధ్రా నాయకుల కన్ను పడింది. తెలంగాణను ఎలాగైనా తమతో కలుపుకొంటే కష్టాలన్నీ తీరిపోతాయని తలంచి తెలుగువారంతా ఒక్కటే అనే తేనె పూసిన కపటపు మాటలతో తెలంగాణ నాయకులను అటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నమ్మించారు. తెలంగాణ ప్రజలకు ఇష్టంలేకపోయినా విశాలాంధ్రను ఏర్పాటుచేసి తెలంగాణ నెత్తినెక్కి కూర్చున్నారు. ఈ కలయిక సరికాదని నాటి ప్రధాని నెహ్రూ హెచ్చరించారు. ఆయన మాటలు అక్షరాలా వాస్తవమని ఆ తర్వాత రుజువయింది.
ఎస్సార్సీ ఏర్పాటుపై.. నాటి కేంద్ర హోంశాఖ తీర్మానం- 29/12/1953
-నం. 53/69/53 పబ్లిక్ : రాష్ట్రాల పునర్విభజన సమస్యను భారత ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలిస్తున్నది. ప్రస్తుత రూపంలో ఉన్న రాష్ట్రాలు చరిత్ర గమనంలో ఏర్పడినవి. భారత్‌మీద బ్రిటిష్ అధికారం విస్తరించి, స్థిరపడే క్రమంలో ఇవి రూపు దిద్దుకున్నాయి. దేశ విభజన జరిగి స్వతంత్ర పాకిస్థాన్ ఏర్పడిన తర్వాత భారత రాష్ట్రాల్లో ఏకీకరణలు విలీనాలు జరిగాయి. అతికొద్ది వ్యవధిలో జరిగిన ఈ ప్రక్రియ చరిత్ర ప్రాధాన్యం ఉన్న అంశం. అయితే ఈ ఏకీకరణ స్వాతంత్య్రానికి ముందునాటి మూస పద్ధతిలో జరిగింది.
-భారత్‌లో రాష్ట్రాల అమరిక చారిత్రక అనూహ్య ప్రకటనలు, పరిస్థితుల ఫలితమే. కేవలం వందేళ్లు, అంతకన్నా ఎక్కువ కలిసి ఉండటంవల్ల ఆయా రాష్ట్రాలమధ్య రాజకీయ, పాలనా పరమైన సాంస్కృతిక సాన్నిహిత్యం అభివృద్ధి చెందింది.
-ప్రజల్లో రాజకీయ చైతన్యం బాగా అభివృద్ధి చెందడం, ప్రాంతీయ భాషల ప్రాధాన్యం పెరగడంతో క్రమంగా భాషా ప్రయుక్త రాష్ట్రాల డిమాండ్లకు దారి తద్వారా తలెత్తిన ప్రతి సమస్యా మిగతా సమస్యలతో ముడిపడి ఉన్నదే. ఒక్క కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసినా పలు ఇతర రాష్ట్రాలపై ప్రభావం పడక తప్పదు. ఈ విధంగా ఒక రాష్ట్ర సమస్యను విడిగా పరిశీలించడం కష్టమవుతుంది.
-ఒక ప్రాంతపు భాష, సంస్కృతికి ప్రాధాన్యం ఉందనడంలో సందేహం లేదు. ఆ ప్రాంతంలో బహుళ సుపరిచితమైన జీవన విధానాన్ని అవి ప్రతిబింబిస్తాయి. అయితే రాష్ట్రాల పునర్విభజనను పరిశీలించే సమయంలో దృష్టిలో పెట్టుకోవాల్సిన ఇతర అంశాలు కూడా ఉన్నాయి. తప్పనిసరిగా పరిగణనకు తీసుకోవాల్సిన మొదటి అంశం భారత ఏకతను, భద్రతను కాపాడటం, బలోపేతం చేయడం.
వాణిజ్య, ఆర్థిక, పరిపాలనాపరమైన అంశాలు కూడా దాదాపు అంతే ముఖ్యమైనవి. వాటిని కూడా కేవలం రాష్ట్రకోణం నుంచి కాకుండా దేశం మొత్తం కోణం నుంచి చూడాలి. భారత్ తన ఆర్థిక, సాంస్కృతిక, నైతిక ప్రగతి కోసం గొప్ప జాతీయ ప్రణాళికను రూపొందించుకుంది. ఆ ప్రణాళిక విజయవంతానికి ఆటంకం కలిగించే మార్పులేమైనా దేశ ప్రయోజనాలకు హానికరమే.
-దేశంలోని మొత్తం రాష్ట్రాల పునర్విభజన అంశాన్ని జాగ్రత్తగా, తటస్థంగా నిష్పక్షపాతంగా పరిశీలించాలని ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. ఆ క్రమంలో ప్రతి ప్రాంతంలోని ప్రజల సంక్షేమాన్ని, మొత్తం దేశ సంక్షేమాన్ని పెంపొందించేట్లు చూడాలి. ఈ అంశాలను పరిశీలించేందుకు కమిషన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
-కమిషన్.. సమస్య స్వరూపాన్ని చారిత్రక నేపథ్యాన్ని, ప్రస్తుత పరిస్థితిని, ఈ క్రమంలో వెలుగులోకి వచ్చే అన్ని ముఖ్యమైన, సందర్భోచితమైన అంశాలను పరిశోధిస్తుంది. పునర్విభజనకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదననైనా పరిశీలించే స్వేచ్ఛ కమిషన్‌కు ఉంది. కమిషన్ తన తొలి దఫా సిఫారసుల్లో విషయం లోతుల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ సమస్యకు పరిష్కారాలను నిర్దేశించగలిగే స్థూల సూత్రాలను సిఫారసు చేయాలి. వాటి ఆధారంగా ఏయే రాష్ట్రాలను పునర్విభజించవచ్చు అనే విషయమై మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలి.
-1953, డిసెంబర్ 23న కమిషన్ వేయబోతున్నట్టు ప్రధాని నెహ్రూ పార్లమెంటులో ప్రకటించారు. అప్పట్లో కమిషన్ ముందుకు దాదాపు 1,52,250 వినతిపత్రాలు వచ్చాయి.
-1954, మార్చి 1న ప్రారంభమైన సంప్రదింపుల ప్రక్రియ 1955 జూలై చివరి వరకు సాగింది. స్పష్టమైన జనాభిప్రాయం కోసం కమిషన్ రాజకీయ, ప్రజాసంఘాలు, పాత్రికేయులు, సాంస్కృతిక సంఘాలు, సామాజిక కార్యకర్తలు, ఇతరులందరినీ ఇంటర్వ్యూ చేసింది. ఫజల్ అలీ బృందం 1954, ఏప్రిల్ 8న దేశ పర్యటనకు శ్రీకారం చుట్టింది. 9వేల మందిని దేశం మొత్తంమీద ఇంటర్వ్యూ చేసింది. కమిషన్‌కు మధ్యంతర నివేదిక సమర్పించే వెసులుబాటు ఉన్నా తుది నివేదికను సమర్పించింది.
– ఏవీ పాయ్, కార్యదర్శి, కేంద్ర హోంశాఖ, న్యూఢిల్లీ
ఆంధ్రప్రదేశ్ అవతరణ
-1953, అక్టోబర్ 1న ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఏర్పడి కర్నూలు రాజధానిగా పరిపాలన సాగుతున్నది. హైదరాబాద్ రాష్ట్రంలో కూడా 1952 ఎన్నికల అనంతరం బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ప్రజాప్రభుత్వం ఏర్పడింది.
-ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఏర్పడేనాటికి లోటు బడ్జెట్‌తో ఉండగా హైదరాబాద్ రాష్ట్రంలో మిగులు బడ్జెట్‌తో పాలన సాగుతున్నది. హైదరాబాద్ నగరం కన్నుకుట్టే రీతిలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ఉంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణపై ప్రత్యేకించి హైదరాబాద్ నగరంపై ఆంధ్రుల కన్నుపడింది.
-కమ్యూనిస్టులు ఆంధ్రలో బలహీనంగా ఉండి, కొంతవరకు తెలంగాణ ప్రాంతంలో వారిబలం పెరిగి ఉంది. 1952 ఎన్నికలు దీన్ని నిరూపించాయి. దీంతో సంపన్నులు స్వలాభం కోసం భాషాప్రయుక్త రాష్ట్రాలని (ఒకే భాష, ఒకే రాష్ట్రం), కమ్యూనిస్టులు తమ బలం కోసం విశాలాంధ్ర భావనను ఎత్తుకున్నారు. ఆంధ్రరాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతాలతో ఒక తెలుగురాష్ట్రం ఏర్పాటు చేయాలనే వాదన ప్రారంభించారు. ఒక్క రాష్ట్రంగా మారితే హైదరాబాద్ రాజధాని అవుతుందని తమకు గుడారాల పాలన తప్పుతుందని ఆంధ్రరాష్ట్ర నాయకుల ఆలోచన.
-హైదరాబాద్ వస్తే మన బాధలన్నీ తీరుతాయి. కానీ ఎట్ల వొస్తది? ఎక్కడి నుంచి మనం ప్రయత్నించాలని ఆలోచించుకోవాలి అని టంగుటూరి ప్రకాశం పంతులు వ్యాఖ్యానించినట్టు 1953, జూన్ 2న ఆంధ్ర పత్రిక రాసింది.
-సెక్రటేరియేట్ భవనం ఇంకా కావడం లేదు, ఆంధ్ర బిడ్డలకు ఉద్యోగాలు రావడంలేదు ఈ మాటలు నీలం సంజీవరెడ్డి అన్నట్టు కూడా ఆంధ్ర పత్రికలో వార్తలు వచ్చాయి.
-ఈ రెండు వ్యాఖ్యానాలు చాలు ఆనాడు ఆంధ్ర నాయకుల ఆలోచన అర్థం కావడానికి. అప్పటి నుంచే వారు హైదరాబాద్‌ను కలుపుకొనిపోవాలని కుట్రలు ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ అవతరణ- ఆంధ్రా అసెంబ్లీ తీర్మానాలు
-ఆంధ్రాకాంగ్రెస్ నాయకులు మరో నాటకమాడి తెలంగాణ వారి భయాలు పోగొడుతున్నట్టు తీర్మానాలు చేశారు.
బెజవాడ గోపాలరెడ్డి తీర్మానం
-1955, నవంబర్ 5న అప్పటి ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రా అసెంబ్లీలో కింది తీర్మానం ఆమోదించారు.
-తెలంగాణ ప్రాంత అభివృద్ధిలో ప్రత్యేక శ్రద్ధతో ప్రయత్నిస్తాం. కొన్ని ప్రాధాన్యాలు, రక్షణలు తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం ఇవ్వడానికి అంగీకరిస్తాం. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తాం. తెలంగాణ ప్రజలు ఎలాంటి భయాలు, సంకోచాలు పెట్టుకోనవసరంలేదు. తెలంగాణ జనాభా ప్రాతిపదికన ఆ ప్రాంత ప్రజలు ఉద్యోగాల్లో చేరేందుకు రిజర్వేషన్ సౌకర్యం ఉంటుంది. తెలంగాణ ప్రజలకు చెందవలసిన ఇతర అంశాల్లో కూడా వారికి రిజర్వేషన్ ఉంటుంది. తెలంగాణ ప్రజలను ఔదార్యంతో చూసుకుంటాం. ఇది తెలంగాణ ప్రజలు చేస్తున్న డిమాండుకు స్పందన కాదు. ఈ శాసనసభల ఉన్న అన్ని పక్షాలు కలిసి ఏకాభిప్రాయంలో, ఒకే గొంతుతో ఈ తీర్మానం ద్వారా హామీ ఇస్తున్నాం.
నీలం సంజీవరెడ్డి తీర్మానం
2 ఆ తర్వాత ఆంధ్రరాష్ట్ర ఉపముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి కూడా అసెంబ్లీలో 1956, జనవరి 12న మరో తీర్మానం చేశారు.
-విద్యాపరంగా ముందున్న ఆంధ్ర ప్రాంతీయులు తమ ప్రాంతంలోగల ఉద్యోగ అవకాశాలను పట్టుకుని తమకు అవకాశం లేకుండా చేస్తారేమోనన్న భయాలు తెలంగాణ వారికి ఉన్నట్టు కనిపిస్తున్నది. మేం మీ ఉద్యోగాల్లో ఎలాంటి వాటా కోరం. మేం మీ వాటా అయిన మూడింట ఒక వంతు (1/3) ఉద్యోగాలను ముట్టుకోమని హామీ ఇస్తున్నాం. ఈ హామీ వ్యక్తిగత హోదాలోనేకాదు, ఈ శాసనసభ, ప్రభుత్వాల తరఫున కూడా ఇస్తున్నాం.
నెహ్రూ ప్రకటన
-1956, మార్చి 5న నిజామాబాద్ జిల్లాలో భారత్ సేవక్ సమాజ్ ఏర్పాటు చేసిన ఒక సభలో పాల్గొని తెలంగాణ విషయమై కింది ప్రకటన చేశారు.
-ఆంధ్ర, తెలంగాణల విలీనానికి కేంద్రం ఒప్పుకున్నది. ఒక అమాయకపు పిల్లకు (తెలంగాణ), తుంటరి పిల్లవాని (ఆంధ్ర)తో పెళ్లి చేస్తున్నాం. కలిసి ఉండే పొంతన కుదరకపోతే ఆలు, మగలు విడాకులు తీసుకున్నట్టే కొంతకాలం తర్వాత రెండు ప్రాంతాలు విడిపోవచ్చు.
-విశాలాంధ్ర వాదన వెనుక దురాక్రమణ ఉద్దేశం, ప్రేరిత సామ్రాజ్యవాదతత్వం దాగి ఉంది.
-1953లో నాటి ప్రధాని నెహ్రూ చేసిన ప్రకటన. ఈ వ్యాఖ్య 1956, అక్టోబర్ 17న ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలో ప్రచురితమైంది.
-పై రెండు తీర్మానాలను తీసుకుని ఆంధ్రా నాయకులు ఢిల్లీబాట పట్టారు. ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దగ్గర ఇదే పాట పాడారు. ఇతర జాతీయ నాయకులను కూడా కలిసి తమ నాటకాన్ని రక్తి కట్టించారు. తెలంగాణను జాగ్రత్తగా చూసుకుంటామని కేంద్ర నాయకులను మాయమాటలతో నమ్మించి కేంద్రాన్ని ఒప్పించారు. ఆ తర్వాత 1956, నవంబర్ 25న ఆంధ్రరాష్ట్ర అసెంబ్లీ తెలంగాణ విలీన తీర్మానం చేసింది. బలవంతపు సమైక్యతకు పునాదులు వేసింది.
-నెహ్రూ నిజామాబాద్‌లో చేసిన ప్రకటనతో ఆంధ్ర, తెలంగాణల విలీనానికి రంగం సిద్ధమైంది. హైదరాబాద్ మీద కన్నేసి ఉంచిన ఆంధ్ర కాంగ్రెస్, కమ్యూనిస్టు నాయకులు విలీనానికి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఆంధ్ర అసెంబ్లీ కూడా సంపూర్ణ మద్దతు తెలిపింది. గుడారాల రాజధాని నడవడం వారికి ఇబ్బందిగా మారింది.
హైదరాబాద్‌లో పరిస్థితి
-హైదరాబాద్ అసెంబ్లీలో 1955, నవంబర్ 25న విశాలాంధ్రపై ఈ విషయమై చర్చ జరిగింది. అప్పుడు హైదరాబాద్ శాసనసభ్యుల సంఖ్య 175. 147 మంది మాట్లాడారు. వీరిలో ఎక్కువ మరఠ్వాడా, కన్నడ ప్రాంతాలవారు విలీనాన్ని సమర్థించారు. నిజానికి వీరి అభిప్రాయం అవసరమే లేదు. మొత్తం మాట్లాడిన వారిలో 67 మంది తెలంగాణవారుండగా వీరిలో పీడీఎఫ్ వారు 40 మంది. అంటే వీరు కమ్యూనిస్టులు.
-అప్పటికే ఆంధ్ర కమ్యూనిస్టులు తెలంగాణ వారిని మేనేజ్ చేశారు. వారు చెప్పిందే వేదమన్నట్టు తెలంగాణ కమ్యూనిస్టు నాయకులు విశాలాంధ్ర ఏర్పాటును సమర్థించారు.
-చర్చ సందర్భంగా కేవీ రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి మొదలైనవారు ప్రత్యేక తెలంగాణను సమర్థించారు. విలీనం జరిగితే తెలంగాణ నష్టపోతుందన్నారు. కాని ఓటింగ్ జరగలేదు.
-తెలంగాణను సమర్థించిన నాయకులు ఢిల్లీకెళ్లి అప్పటి హోంమంత్రి గోవింద్ వల్లభ్ పంత్‌ను కలిసి ప్రత్యేక తెలంగాణ ఉండాలని కోరారు. ఫజల్ అలీ కమిషన్ చెప్పినదాన్ని తెలంగాణ విషయంలో ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు.
-కాని ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు విలీనానికి పరోక్షంగా అనుకూలంగా ఉండటం, దీంతో రెడ్డి వర్గాన్ని దెబ్బతీయాలని చూడటం ఆంధ్రప్రదేశ్‌కు కలిసి వచ్చిన అంశం. అయితే ఆయన పైకి మాత్రం తెలంగాణ ప్రజలు ప్రత్యేకంగా ఉండటానికి ఇష్టపడుతున్నారని అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు యూఎన్ థేబర్కు లేఖ రాశాడు. లేఖలో తెలంగాణ ప్రత్యేకంగా ఉంటే కలిగే లాభాలకు విశాలాంధ్ర ఏర్పడితే కలిగే లాభాలను స్పష్టంగా వివరించారు. గోడమీద పిల్లివాటంలో ఆయన లేఖసాగింది. లేఖముగింపు ఇలా ఉంది..
-ఏది ఏమైనా ఒక్క విషయం మాత్రం చెప్పగలను. తెలంగాణ ప్రత్యేక యూనిట్‌గా ఉంచిన తర్వాత కూడా ఉమ్మడి అంశాలతో పాలనా యంత్రాంగం ఉమ్మడిగా ఉండటంతో నష్టం ఉండదని అనుకుంటున్నారు. ఉదాహరణకు గవర్నర్, హైకోర్టు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ రెండు ప్రాంతాలకు ఒకటే ఉండవచ్చు. అంతిమంగా పార్టీ హైకమాండ్ నిర్ణయానికి లోబడి ఉంటాను – బూర్గుల రామకృష్ణారావు
-1955లో హైదరాబాద్ అసెంబ్లీలో చర్చించిన సుమారు నెలకు 1955, డిసెంబర్ 23న లోక్‌సభలో కూడా ఈ విషయమై చర్చ జరిగింది. పీడీఎఫ్ సభ్యులు జయసూర్య, రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డిలు విలీనాన్ని సమర్థించారు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు నోరు విప్పలేదు.
-ఒక్క సోషలిస్టు పార్టీకి చెందిన ఆదిలాబాద్ ఎంపీ సీ మాధవరెడ్డి ఆంధ్ర, తెలంగాణల విలీనాన్ని వ్యతిరేకించారు. తెలంగాణ ప్రజలు ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నారని వారి అభిప్రాయాన్ని ఆంధ్ర నాయకులు కూడా గౌరవించాలని కోరారు. బలవంతపు విలీనం వల్ల ఇబ్బందులొస్తాయని, ఆంధ్రోళ్లు హైదరాబాద్‌లో ప్రశాంతంగా ఉండలేరని వ్యాఖ్యానించారు.
-అయినా నెహ్రూ ప్రభుత్వం రెండు ప్రాంతాలను కలపాలని నిశ్చయించుకుని కొన్ని నమ్మకం కలిగించే చర్యలకు పూనుకుంది. ఆ చర్యల్లోనిదే పెద్ద మనుషుల ఒప్పందం.
పెద్దమనుషుల ఒప్పందం- 1956
1. రాష్ట్రంలో కేంద్ర, సాధారణ పరిపాలనపై ఖర్చు ఆంధ్ర, తెలంగాణ దామాషా ప్రకారం జరగాలి. తెలంగాణ ప్రాంతపు మిగులు ఆదాయం తెలంగాణ అభివృద్ధి కోసం రిజర్వు చేయాలి. ఈ ఏర్పాటును ఒకవేళ తెలంగాణ శాసనసభ్యులు కోరితే సమీక్షించాలి.
2.తెలంగాణ ప్రాంత శాసనసభ్యుల కోరిక మేరకే తెలంగాణలో మద్యనిషేధం అమలు కావాలి.
3. తెలంగాణ విద్యావసతుల్ని తెలంగాణ విద్యార్థులకే కేటాయించాలి. అలా కాని పక్షంలో రాష్ట్రం మొత్తం మీద మూడింట ఒక వంతు (1/3) స్థానాలు తెలంగాణ విద్యార్థులకు కేటాయించాలి. ఈ రెండింటిలో ఏది తెలంగాణకు మేలు చేస్తే అది తీసుకోవాలి.
4.కొత్త రాష్ట్రం ఏర్పాటువల్ల ఏవైనా ఉద్యోగాలు తగ్గించవలసివస్తే రెండు ప్రాంతాల జనాభా దామాషా ప్రకారం తగ్గించాలి.
5. ముందు జరుగబోయే నియామకాలను రెండు ప్రాంతాల జనాభా ప్రాతిపదికపై జరపాలి.
6. పాలనా వ్యవహారాల్లో తెలంగాణలో ఉన్న ఉర్దూ భాషను ఐదేండ్ల పాటు అలాగే కొనసాగించాలి. ఎలాంటి మార్పులు చేయరాదు. ఆ తరువాత ప్రాంతీయ మండలి సమీక్షించాలి. ఉద్యోగ నియామకాలకు తెలుగు వచ్చి ఉండాలన్నది నిబంధన కాకూడదు. ఉద్యోగంలో చేరాక (2) రెండేండ్లకు తెలుగు నేర్చుకోవాలి.
7. ఉద్యోగ నియామకాల్లో స్థానికతకు 12 ఏండ్ల నివాసార్హత ఉండాలి.
8. తెలంగాణలో భూముల అమ్మకాలను ప్రాంతీయ మండలి నియంత్రణలో జరపాలి.
9.తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఒక ప్రాంతీయ మండలి ఏర్పాటు చేయాలి. ఈ మండలిలో 26 మంది సభ్యులుంటారు. వీరిని తెలంగాణ శాసన సభ్యులు మాత్రమే ఎన్నుకుంటారు.
10. తెలంగాణ ప్రాంతీయ మండలికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులలో ఎవరు తెలంగాణ వారైతే వారు చైర్మన్‌గా ఉంటారు.
11. ప్రాంతీయమండలికి చట్టబద్దత ఉండాలి. పైన పేర్కొన్న అంశాలపై నిర్ణయాధికారం ఉండాలి. తెలంగాణ అభివృద్ధి, ఉద్యోగ నియామకాల్లో నిర్ణయాధికారం ఉండాలి. వివాదంపై తుది నిర్ణయం కేంద్రానిదే.
12. మంత్రివర్గంలో ఆంధ్ర, తెలంగాణ దామాషా 60:40గా ఉంటుంది. తెలంగాణ మంత్రుల్లో ఒక ముస్లిం ఉండాలి.
13. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులుగా ఆంధ్ర, తెలంగాణ నుంచి చెరొకరు ఉండాలి.
14. హోం, ఆర్థిక, రెవెన్యూ, ప్రణాళికాభివృద్ధి, వ్యాపారం, పరిశ్రమల శాఖల్లో రెండు తెలంగాణకు ఇవ్వాలి.
15. 1962 వరకు తెలంగాణకు ప్రత్యేక కాంగ్రెస్ కమిటీ ఉండవచ్చు.
-పై అంశాల తరువాత రాష్ట్రం పేరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆంధ్ర, తెలంగాణ అని ఉండాలని తెలంగాణవాదులు అనగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని ఆంధ్ర నాయకులు కోరారు. చివరకు వారి కోరిక నెరవేరింది.
-1956, ఫిబ్రవరి 20న పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకాలు జరిగాయి.
-పెద్ద మనుషుల ఒప్పందంపై ఆంధ్ర నాయకులుగా ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి, ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి సత్యనారాయణరాజు, ఉపముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి మరో మంత్రి గౌతు లచ్చన్న సంతకాలు చేశారు. తెలంగాణ తరఫున ఒప్పందంపై ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు, హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జేవీ నర్సింగరావు, మంత్రులు కొండా వెంకట రంగారెడ్డి, చెన్నారెడ్డిలు సంతకాలు చేశారు. అనంతరం పెద్ద మనుషుల ఒప్పందాన్ని పార్లమెంటు ఆమోదించింది. దీంతో ఈ ఒప్పందానికి రాజ్యాంగబద్ధత లభించింది.
-1956, ఆగస్టు 31న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిల్లును భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ ఆమోదించారు. చివరకు తెలంగాణ ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా 1956, నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించింది.
-ఈ బలవంతపు కలయికకు ఒక రోజు ముందు రాజ్‌ప్రముఖ్ పదవికి నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాజీనామా చేశారు.
-అంతకుముందు పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకాలు చేసిన నాయకులు 1956, ఆగస్టు 14న ఒక తెలంగాణ రక్షణల ఒప్పందంపై కూడా సంతకాలు చేశారు. పెద్ద మనుషుల ఒప్పందం అమల్లోని అంశాలు వివరంగా ఈ రక్షణల ఒప్పందంలో పొందుపర్చారు. ప్రాంతీయ స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేసి దాని విధివిధానాలను ఈ ఒప్పందంలో పేర్కొన్నారు.
-పెద్ద మనుషుల ఒప్పందంపై ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు సంతకం చేసి నా మరణ శాసనంపై నేనే సంతకం పెట్టిన అని ఆవేదన చెందినట్టు ఆయన జీవితచరిత్రలో రికార్డు అయింది.
1969 తెలంగాణ ఉద్యమం
-1969 తెలంగాణ ఉద్యమం విద్యార్థులతో మొదలైంది. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఏర్పడినంక జరిగిన తెలంగాణ తొలి ఉద్యమానికి ఖమ్మం జిల్లా పాల్వంచ వేదిక అయింది. అక్కడున్న థర్మల్ పవర్ స్టేషన్లో ఆంధ్రావారినే ఎక్కువగా తీసుకుంటున్నారని, తెలంగాణ వారికి అన్యాయం జరుగుతున్నదని ఇల్లెందుకు చెందిన రామదాసు అనే వ్యక్తి వెలుగులోకి తీసుకువచ్చారు. రామదాసుపై పోలీసులు తప్పుడు కేసులు బనాయించి నానా హింసలకు గురిచేశారు.
-ఆ తర్వాత 1969 జనవరి 9న పాల్వంచలోని గాంధీ చౌక్‌వద్ద నిరవధిక దీక్షను ప్రారంభించారు. ఇందుకు ఖమ్మం జిల్లా ఉద్యోగులు మద్దతు తెలిపారు. ఆంధ్రా నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిజామాబాద్‌లో విద్యార్థులు పాఠశాలలు బంద్ చేసి నిరసన తెలిపారు. దీంతో ఖమ్మం జిల్లా ఉద్యమం తెలంగాణ ఇతర జిల్లాలకు, హైదరాబాద్‌కు పాకింది.
-ఆ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా వీసీ రెడ్డి ఉండగా ఆయన నియంతృత్వ పోకడలతో విసుగెత్తి ఉన్న విద్యార్థులు ఉద్యమబాట పట్టారు. దీనికి ఖమ్మం జిల్లా పోరాటం తోడైంది.
-ఆనాటికి ప్రస్తుత టీఆర్ఎస్ నాయకుడు కేశవరావు, రచయిత ఎంవీ నర్సింహారెడ్డి (జగిత్యాల) ఉస్మానియా విద్యార్థి సంఘం అధ్యక్షులుగా ప్రస్తుత కాంగ్రెస్ నాయకుడు ఎస్. జైపాల్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, మల్లికార్జున్ తదితరులు ఓయూలోను, దాని పరిధిలోని కళాశాలల్లోను చదువుతూ ఉన్నారు. వారి నాయకత్వంలో ఉద్యమం ప్రారంభమైంది.
-విద్యార్థులు మెడికల్ కాలేజీ విద్యార్థి మల్లికార్జున్‌ను ఉద్యమ నేతృత్వానికి ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. హైదరాబాద్‌లో విద్యార్థుల కార్యాచరణ సమితి ఏర్పాటైంది.
-తెలంగాణ అన్ని జిల్లాల్లోని కళాశాల, పాఠశాలల విద్యార్థి సంఘాలు ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులతో అనుసంధానమయ్యాయి. ఉద్యమం దినదినం ఎక్కువైంది. దీంతో కే కేశవరావు, ఎంవీ నర్సింహారెడ్డి, జైపాల్‌రెడ్డిలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ కారణంగా విద్యార్థులు విధ్వంసకాండకు దిగారు. అన్ని జిల్లాల్లో ఆంధ్రులకు వ్యతిరేకంగా ఉద్యమం ఉధృతమైంది.
-ఉద్యమ నాయకులు అబిడ్స్‌లో సభ నిర్వహించారు. సభలో పోలీసులు కాల్పులు జరిపారు. ముగ్గురు యువకులు బలయ్యారు. సమావేశానికి వచ్చి ప్రసంగించవలసిన ప్రొఫెసర్ జయశంకర్ బస్సు తప్పిపోయి బతికి బయటపడ్డారు. ప్రభుత్వం నాయకుల కోసం వేట ప్రారంభించగా వారు అజ్ఞాతంలోకి వెళ్లారు.
-ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం ఉద్యోగాల ప్రకటన చేసింది. అందులో ఉస్మానియా గ్రాడ్యుయేట్స్‌ను అనర్హులుగా ప్రకటించింది. దీంతో 1969 తెలంగాణ ఉద్యమం ఆంధ్రా గో బ్యాక్ ఉద్యమంగా మారిపోయింది. హైదరాబాద్‌లో, తెలంగాణ జిల్లాల్లో ఊరూర సభలు, సమావేశాలు జరిగాయి.
-ఇదే సమయంలో హైదరాబాద్‌లో ప్రముఖుల సమావేశం ఒకటి ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ పరిరక్షణల కమిటీ ఆవిర్భవించింది.
-ఈ కమిటీకి స్వతంత్ర సమరయోధుడు కాటం లక్ష్మీనారాయణ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. సభ్యులుగా మహదేవ్‌సింగ్, సుల్తాన్ సలాఉద్దీన్ ఒవైసీ, పద్మనాభన్, సంతపురి రాఘవరావు, మాధవరావు, జాకీర్ హుస్సేన్‌లు ఎన్నికయ్యారు. తెలంగాణ విద్యార్థుల ఆందోళనకు సమావేశం మద్దతు తెలిపింది.
-ఖమ్మంలో దీక్షకు కూర్చున్న రవీంద్రనాథ్ ఆరోగ్యం క్షీణించడంతో జనవరి 16న హైదరాబాద్‌లో విద్యార్థులు ఊరేగింపు నిర్వహించారు.
-విద్యార్థుల్లో రెండు గ్రూపులు తయారయ్యాయి. ఒక వర్గం తెలంగాణకు రక్షణలు కావాలని, మరోవర్గం ప్రత్యేక తెలంగాణ కావాలని డిమాండ్ చేశాయి.
-ప్రత్యేక తెలంగాణ కావాలని డిమాండ్ చేసినవారిలో మల్లికార్జున్, శ్రీధర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. రక్షణల వర్గంలో మదన్మోహన్ తదితరులు ఉన్నారు.
-ఉద్యోగులు కూడా రంగంలోకి దిగారు. తెలంగాణ మొత్తం అట్టుడికిపోయింది. దీంతో అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి 1969, జనవరి 19న అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఉద్యోగుల రక్షణలు, తెలంగాణ మిగులు నిధుల గూర్చి ఈ సమావేశంలో చర్చించారు.
తీసుకున్న నిర్ణయాలు
-ఉద్యోగాలు: 1959 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ప్రత్యక్ష నియామకాల ద్వారా గానీ, ప్రమోషన్లలోగాని, బదిలీల రూపంలోగాని తెలంగాణ స్థానికులకు రిజర్వు చేసిన పోస్టుల్లో ఉన్న స్థానికేతరులను సర్వీసు నుంచి తొలగించాలి. వారి స్థానాల్లో స్థానికులను భర్తీ చేయాలి.
-నిధులు: రెండు ప్రాంతాలకు కేటాయిస్తున్న నిధులు, రాబడులను లెక్కించాలి. తెలంగాణ నిధులు తెలంగాణకు ఖర్చు చేయాలి.
-విద్య: రాబోయే విద్యా సంవత్సరం నుంచి ప్రాంతాలతో ప్రమేయం లేకుండా రాజధానిలో విద్యా సదుపాయాలు విద్యార్థులందరికి అందించేందుకు చర్యలు తీసుకోవాలి. (ఇక్కడ తెలంగాణ వారితో ఆంధ్రులు సమానమయ్యారు. అంటే ఈ నిబంధనతో తెలంగాణ వారికి అన్యాయం జరిగినట్టు లెక్క).
-ఈ సమావేశానికి కాంగ్రెస్ నాయకులు జే చొక్కారావు, పీవీ నర్సింహారావు, అచ్యుత్‌రెడ్డి, కమ్యూనిస్టు నాయకులు సీహెచ్ రాజేశ్వరరావు, వైవీ కృష్ణారావు, జనసంఫ్‌ు తరఫున జూపూడి యజ్ఞనారాయణ ఇతర నాయకులు జే వెంగళరావు, జేవీ నర్సింగరావు, టీ పురుషోత్తమరావు, రొడామిస్త్రీ, గౌతు లచ్చన్న, కొండా లక్ష్మణ్ బాపూజీ, కాసు బ్రహ్మానందరెడ్డి హాజరయ్యారు.
-ఈ అఖిలపక్ష సమావేశం తర్వాత ప్రభుత్వం 1969 జనవరి 21న ఒక జీవో విడుదల చేసింది. ఫిబ్రవరి 28 లోపు స్థానికేతర ఉద్యోగులను వెనక్కి పంపుతామని పేర్కొంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు