ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఎకానమీ
గ్రూప్-1లో తెలంగాణ ఎకానమీ పాత్ర ఎంత? ఎన్ని చాప్టర్లు ఉన్నాయి? ఏయే చాప్టర్లను ఎలా చదవాలని సిలబస్ మొత్తాన్ని పూర్తిగా విభజించి, విశ్లేషించి, విస్తృతంగా చర్చించాం. ప్రస్తుతం తెలంగాణ ఎకానమీ మొదటి చాప్టర్ నుంచి మొదలుపెడదాం. తెలంగాణ ఎకానమీపైన అవగాహన లేనివారికి ఈ వ్యాసం వల్ల అవగాహన ఏర్పడుతుంది.
పేపర్-4- పార్ట్-2, చాప్టర్-1 సిలబస్‌లో ఏముంది?
-హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం (వ్యవసాయం, పరిశ్రమలు, వాణిజ్యం). దీన్ని భాగాలుగా చేస్తే, ఈ చాప్టర్లో ఏం చదవాలో తెలుస్తుంది. ఈ భాగంలో తెలంగాణ ప్రాంతం ఉనికిని విశదీకరించాలి. అంటే తెలంగాణ రాష్ట్ర సరిహద్దులను, ఈ ప్రాంత పరిధిని తెలుసుకోవాలి.
హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత విశిష్ఠతను, జనాభాను, వనరులను లెక్కించాలి.
-మొత్తం హైదరాబాద్ రాష్ట్రంలో వ్యవసాయం, పరిశ్రమలు, వాణిజ్యం పరిస్థితి, వాటి అభివృద్ధి తీరుతెన్నులు, నిర్మాణశైలి, ఆయా రంగాల్లో తెలంగాణ ఎలా వ్యవహరించినది, తెలంగాణ నుంచి వ్యవసాయం, పరిశ్రమలు, వాణిజ్యరంగాల నుంచి సమకూరిన ఆదాయం, వృద్ధిని తెలియజేయాలి.
-హైదరాబాద్ రాష్ట్రంలో భూ చట్టాలు, భూ రెవెన్యూ విధానాలు, నిజాం కాలంలో సాలార్జంగ్ ప్రవేశపెట్టిన సంస్కరణల వెనక ఉన్న పరిస్థితులను విశదీకరించాలి.
-ఆ తర్వాత సాలార్జంగ్ సంస్కరణలు ఏమిటి? ఆ సంస్కరణల వెనుక ఉన్న ఉద్దేశాలు ఏమిటని పరిశీలించాలి.
-1953 కంటే ముందు స్థాపితమైన వివిధ పరిశ్రమల వివరాలు, వాటి పనితీరును తెలుసుకోవాలి.
-మొత్తంగా ఆంధ్రరాష్ట్ర అవతరణ సమయంలో ఉన్న పరిస్థితులన్నింటిని కూలంకషంగా తెలుసుకోవాలి.
-ఉమ్మడి ఏపీలో తెలంగాణ ఎకానమీలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఉనికి, జనాభా, భౌగోళిక ప్రాంత సరిహద్దులు, వనరుల పరిస్థితి మొదలైనవి తెలుసుకోవాలి.
-ఆ తర్వాత మొత్తం ఈ భాగాన్ని మూడు భాగాలుగా విభజించాలి. అంటే ఈ మూడు దశల్లో తెలంగాణ వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు, వాణిజ్యం వృద్ధి, నిర్మాణం, తీరుతెన్నులు పరిశీలించాలి. ఆ తర్వాత నీటిపారుదలలో జరిగిన అన్యాయాన్ని పరిశీలించాలి. అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్‌కి కేటాయించిన నీటి వనరులు ఏమిటి ( కృష్ణా, గోదావరి) ఇంకా ఈ ప్రాంతంలో ఉన్న వివిధ నీటివనరుల వివరాలు.
-ఈ మొత్తం కేటాయింపుల్లో తెలంగాణలో మాత్రమే లభ్యమయ్యే నీటివనరుల శాతం ఎంత? అందులో తెలంగాణకు కేటాయించినది ఎంత? అనేది పరిశీలించాలి.
-బచావత్, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునళ్ల ముందు తెలంగాణ రాష్ట్ర వాదన ఏమిటి? వాటికి కేటాయింపుల వివరాలు, వాటిని దారి మళ్లించిన పద్ధతులు మొదలైనవి తెలుసుకోవాలి.
-తెలంగాణ నీటిపారుదల వ్యవస్థలో భాగంగా కృష్ణాబేసిన్ (బాచావత్, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునళ్లు), గోదావరి బేసిన్ (బచావత్ ట్రిబ్యునల్) ఇతర వనరుల్లో (బావులు, చెరువులు, కుంటలు మొదలైనవి) పూర్వ ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ వాటా ఎంత? ఆ వాటా నీళ్లను ఎలా దారి మళ్లించారు? ఇదే భాగంలో విధుల్లో జరిగిన వివక్ష తీరుతెన్నులను పరిశీలించాలి. అందులో భాగంగా లలిత్‌కుమార్ కమిటీ, వశిష్ఠభార్గవ కమిటీ, అష్టసూత్ర పథకం, పంచసూత్ర పథకాల నేపథ్యాలను, పరిణామాలను పరిశీలించాలి.
-పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం: తెలంగాణ రెవెన్యూ మిగులు నిధులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్ర ప్రాంత లోటును పూడ్చడానికి మళ్లించరాదు.
-అంటే తెలంగాణలో వచ్చిన మిగులు ఆదాయాన్ని, తెలంగాణ ప్రాంత అభివృద్ధికి మాత్రమే ఖర్చు చేయాలనేది నియమం.
-పై నియమాన్ని ఎలా ఉల్లంఘించారో తెలుసుకోవడమే ఈ భాగం ఉద్దేశం. నిధులకు సంబంధించి అగ్రిమెంట్లో ఏముంది? నిబంధనలను ఎలా ఉల్లంఘించారు? కుమార్ లలిత్ కమిటీ ఏం చెప్పింది? ప్రభుత్వం ఎలా స్పందించింది? (అష్టసూత్ర పథకం, పంచసూత్ర పథకం), జస్టిస్ వశిష్ఠభార్గవ కమిటీ ఏం చెప్పింది? ప్రభుత్వం తీసుకున్న చర్యలు? 2014 వరకు తెలంగాణ నిధులను ఎలా ఖర్చు పెట్టారు?
ఇలా పై విషయాలన్నిటిని కూలంకషంగా చర్చిస్తూ తదనంతరం జరిగిన ఉద్యమాలను చర్చిస్తూ ఉద్యమాన్ని నీరుగార్చడానికి ప్రభుత్వం తీసుకున్న ఉపశమన చర్యలను పరిశీలిస్తే సరిపోతుంది. ఈ భాగం అత్యంత ముఖ్యమైనది.
-ఇందులో మరో ముఖ్యమైన అంశం నియామకాల్లో జరిగిన అన్యాయం. ముల్కీరూల్స్, ముల్కీ, నాన్‌ముల్కీ ఉద్యమాలు, ముల్కీరూల్స్ ఏం చెప్తున్నాయి? ముల్కీరూల్స్ ఉల్లంఘనలు, జై తెలంగాణ ఉద్యమం (1969), వాంఛూ కమిటీ, జై ఆంధ్ర ఉద్యమం, అధికరణం 371(డి) (రాజ్యాంగ సవరణ, ఆరుసూత్రాల పథకం, జోనల్ వ్యవస్థ) తర్వాత ఆఫీసర్స్ కమిటీ, గిర్గ్లానీ కమిషన్,
హైదరాబాద్ ఫ్రీజోన్‌పై కేసీఆర్ ఉద్యమం.
-ఇలా పై అంశాలన్నింటిని ఒక్కొక్కటిగా పరిశీలించి మలిదశ తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని వివరించాలి. పై కమిటీల్లో వచ్చిన వివరణాత్మక ఉల్లంఘనలు, ప్రభుత్వ చర్యలు, ఆ కాలంలోని ఉద్యమ డిమాండ్లు ముఖ్యమైన అంశాలని అభ్యర్థులు గుర్తించాలి. ప్రస్తుత జోనల్ వ్యవస్థ వివరాలు, అధికరణం 371(డి) సమగ్ర సమాచారం తెలుసుకోవాలి.
-ఇదే చాప్టర్లో మరో ముఖ్యమైన అంశం తెలంగాణ ఎకానమీ వృద్ధి, నిర్మాణం. దీంట్లో భాగంగా ప్రస్తుత తెలంగాణ సామాజిక, ఆర్థిక చిత్రణ, స్థూల ఆర్థిక అంశాలను పరిశీలించాలి. తెలంగాణ వృద్ధి, నిర్మాణం గురించి అంటే వ్యవసాయం (వృద్ధిరేటు, జీఎస్డీపీలో పాత్ర, ప్రభుత్వం వివరణ), పరిశ్రమలు (వృద్ధిరేటు, జీఎస్డీపీలో పాత్ర, కొత్త చట్టాలు), సేవలు (వృద్ధిరేటు, జీఎస్డీపీలో పాత్ర, ప్రాధాన్యం) చదవాలి.
-2014 నుంచి 2018 వరకు విడుదలైన అన్ని సామాజిక, ఆర్థిక చిత్రణల్లో మొదటి చాప్టర్ వచ్చిన స్థూల ఆర్థిక తీరుతెన్నులను స్థూలంగా పరిశీలిస్తే.. తెలంగాణ వృద్ధి తీరుతెన్నులు, దాని నిర్మాణం, ఆ దిశగా ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను తెలుసుకోవచ్చు.
-అదేవిధంగా వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు భారతదేశంలోని ఇతర రాష్ర్టాలతో పోల్చుకున్నప్పుడు ఎలా పనిచేస్తున్నాయి? తెలంగాణ ఎకానమీ పరిస్థితి ఎలా ఉంది? ఇంకా భారతదేశ సగటు వృద్ధితో పోల్చినప్పుడు పై రంగాలు ఎలా పనిచేస్తున్నాయో పరిశీలించాలి.
-ఈ వర్తమాన డాటా, స్టాటిస్టిక్స్ను తీసుకుని, దీని ఆధారంగా 1953, 1956, 1970, 1990, 2014ల్లో వ్యవసాయం, పరిశ్రమలు, సేవల వృద్ధి తీరుతెన్నులను, నిర్మాణ దశలను పోల్చాలి. అప్పుడు ఈ భాగంపై ఓ స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది.
-ఇదే భాగంలో చివరగా జీఎస్డీపీలో వివిధ రంగాల తీరుతెన్నులను పరిశీలించాలి. అంటే జీఎస్డీపీలో మొత్తం తెలంగాణ వ్యవస్థ తీరుతెన్నులను పరిశీలిస్తే సరిపోతుంది.
-ఇదే భాగంలో తలసరి ఆదాయం చదవాలి.
-దీంట్లో భాగంగా తెలంగాణ సగటు ఆదాయం, వ్యక్తి ఆదాయం, వివిధ జిల్లాలతో పోల్చుతూ, భారతదేశ తలసరి ఆదాయాన్ని కూడా పోల్చి చదవాలి.
-చివరగా తెలంగాణలో ఉన్న ఆదాయ అసమానతలు, పేదరి వివరాలను పరిశీలించాలి. దీనికోసం ప్రభుత్వ లెక్కలు, హెచ్‌డీఐ నివేదికలు, వివిధ సందర్భాల్లో వచ్చే వివిధ రకాల అంతర్జాతీయ సర్వేలు, రిపోర్టులను పరిశీలిస్తే సరిపోతుంది.
-ఈ మొత్తం చాప్టర్లో ముఖ్యమైంది తెలంగాణ ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులు, ఏర్పర్చుకున్న ఒప్పందాలు? ఒప్పందాల ఉల్లంఘన? ఉల్లంఘనలపై ప్రజలు ఎలా స్పందించారు? ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటి? వివిధ కమిటీలు ఏం చేస్తాయి అని తెలుసుకోవడమే మొత్తం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం చరిత్ర అని అభ్యర్థులు గమనించాలి.
సిలబస్
గ్రూప్-1 మెయిన్స్‌లో మొత్తం ఆరు పేర్లు ఉంటాయి. 1. జనరల్ ఎస్సే 2. చరిత్ర, సంస్కృతి 3. భూగోళశాస్త్రం 4. భారత సమాజం, రాజ్యాంగం, గవర్నెన్స్ 5. ఎకానమీ, అభివృద్ధి 6. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అవతరణ. ఇందులో ఎకానమీ అభివృద్ధిలో భాగంగా పార్ట్-1 ఇండియన్ ఎకానమీ, అభివృద్ధి పార్ట్-2 తెలంగాణ ఎకానమీ 3. అభివృద్ధి, వాతావరణ సమస్యలు. పార్ట్-2 తెలంగాణ ఎకానమీలో చాప్టర్-1లో హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ఎకానమీ, ఉమ్మడి ఏపీలో తెలంగాణ ఎకానమీ, అణచివేత, అల్పాభివృద్ధి, తెలంగాణ ఎకానమీ వృద్ధి, నిర్మాణం చాప్టర్-2లో మానవ వనరులు, చాప్టర్-3లో భూసంస్కరణలు, చాప్టర్-4లో వ్యవసాయం, చాప్టర్-5లో పరిశ్రమలు, సేవలు ఉంటాయి.
-పై ఐదు చాప్టర్లలో అత్యంత ముఖ్యమైంది మొదటి చాప్టర్. ఈ చాప్టర్‌ను అర్థం చేసుకున్నవారికి దాదాపుగా తెలంగాణపైన ఓ అవగాహన వస్తుంది.
తెలంగాణ ఎకానమీ దశలు
-1956-70 వరకు మొదటి దశ
-1971-90 వరకు రెండో దశ
-1990-2014 వరకు మూడో దశ
————————-
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు