వలసబాటలో బతుకుపోరు తెలంగాణ సామాజిక అంశాలు
సామాజిక మార్పు, సామాజిక కొనసాగింపునకు దోహదపడే అంశాల్లో జననాలు, మరణాలు, వలసలు ప్రధానమైనవని. జనన, మరణాలు జైవిక సంబంధమైనవి కాగా వలసలు సామాజిక, ఆర్థిక రాజకీయ, మత సంబంధ కారకాల నేపథ్యంతో ఉంటాయి. ప్రపంచంలోని అన్ని సమాజాల్లో సర్వసాధారణంగా కనిపించే సామాజిక ప్రక్రియ వలసలు. భారతదేశంతోపాటు తెలంగాణలో కూడా వలసలు సర్వసాధారణంగా కనిపిస్తాయి. అయితే తెలంగాణలోని వలసలు మాత్రం పేదరికం, నిరుద్యోగం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ విధ్వంసాల ఫలితంగా జరిగాయి. వలసలు తెలంగాణ గ్రామీణ, అణగారిన వర్గాల దుర్భర జీవితాన్ని ప్రతిబింబిస్తాయి.
వలస భావన
-ఐక్యరాజ్యసమితి నిర్వచనం ప్రకారం వ్యక్తులు ఒక భౌగోళిక ప్రాంతం నుంచి మరో భౌగోళిక ప్రాంతానికి తరలిపోవడాన్ని వలస అంటారు. ఈ వలసల్లో వ్యక్తులు ఒంటరిగా గాని, కుటుంబంతోగాని, బంధువలతోగాని, ఆసక్తిగల మరో సమూహంతోగాని కలిసి వేరే ప్రాంతానికి తరలిపోతారు.
-వలస అనే పదం మైగ్రేషన్ (Migration) అనే ఆంగ్ల పదం నుంచి వచ్చింది. లాటిన్ భాషకు చెందిన మైగ్రేర్ అనే పదం నుంచి మైగ్రేషన్ అనే పదం వచ్చింది.
-వలస అనేది భౌగోళికంగా లేదా రాజకీయంగా నిర్ణయించిన రెండు సముదాయాల మధ్య జరిగే నివాస మార్పును తెలుపుతుంది. మరో విధంగా చెప్పాలంటే వలస అనేది వ్యక్తి లేదా వ్యక్తులు లేదా సమూహాల నివాసాల్లో భౌతిక చలనాన్ని సూచిస్తుంది. వలస అనేది ఒక సాంఘిక ప్రక్రియ అనగా ఇది ప్రతి సమాజంలో ఏదో ఒక రూపంలో నిరంతరం జరుగుతూనే ఉంటుంది.
వలసల రకాలు
-సామాజిక గతిశీలతలో అంతర్భాగమైన వలసలు తాత్కాలిక ప్రాతిపదికన లేదా శాశ్వత ప్రాతిపదికన జరుగుతాయి. మొదటి రకంలో మాతృ స్థలానికి తిరిగి వస్తారు. కానీ రెండో రకంలో తిరిగిరారు.
పరిధి ఆధారంగా
1) అంతర్గత వలసలు (Internel Migration)
2) అంతర్జాతీయ వలసలు (International Migration)
అంతర్గత వలసలు
-దేశం లోపల జరిగే వలసలు
-గ్రామం నుంచి గ్రామానికి (స్థానిక వలసలు)
-గ్రామం నుంచి నగరానికి
-నగరం నుంచి నగరానికి
-నగరం నుంచి గ్రామానికి
-రాష్ర్టాల నుంచి రాష్ర్టాలకు (అంతర్రాష్ట్ర వలసలు)
-వివాహం వల్ల మహిళలు ఇతర ప్రాంతాలకు
-వ్యవసాయ పనుల కోసం ఇతర ప్రాంతాలకు
-ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఇతర ప్రాంతాలకు
-పరిశ్రమలు, ప్రాజెక్టుల నిర్మాణాల వల్ల స్థానభ్రంశానికి గురై వేరే ప్రాంతానికి వలసపోవడం.
అంతర్జాతీయ వలస
-ఒక దేశం నుంచి మరో దేశానికి వలస పోవడాన్ని అంతర్జాతీయ వలస అంటారు. అంతర్జాతీయ వలసకు సంబంధించి ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహాలు తమ మాతృదేశాన్ని వదిలి మరో దేశానికి వలస పోవడాన్ని ఎమ్మిగ్రేషన్ (Emmigration) అని, ఏ దేశానికి వలసపోతారో దాన్ని ఇమ్మిగ్రేషన్ (Immigration) అని అంటారు.
-ఒక దేశ సరిహద్దు దాటి మరో దేశానికి వలసపోవడాన్ని అంతర్జాతీయ వలస అని, ఒక ఖండం దాటి మరో ఖండానికి వలస పోవడాన్ని ఖండాంతర వలస అంటారు.
కారణాలు
-సామాజిక, ఆర్థిక ప్రక్రియలో అత్యంత కీలకమైన వలసలకు అనేక కారకాలు, కారణాలున్నాయి. ప్రముఖ సామాజికవేత్త బోగ్ వలసలకు ప్రధానంగా రెండు రకాల కారణాలను పేర్కొన్నారు.
1) పుష్ కారకాలు (Push Factors)
-గ్రామాల నుంచి పట్టణాలకు, ఇతర రాష్ర్టాలకు, ఇతర దేశాలకు వలసపోవడానికి ప్రధాన కారణం గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన జీవనాధారాలైన వ్యవసాయం, చేతివృత్తులు, కులవృత్తులు, కుటీర పరిశ్రమలు నిర్వీర్యం కావడం. అంతేకాకుండా ఆర్థిక సంస్కరణలు, ప్రపంచీకరణ పారిశ్రామీకరణ, సరళీకరణ విధానాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలహీనపర్చడంతో అనివార్యంగానే గ్రామీణ సామాజిక, ఆర్థిక వ్యవస్థ గ్రామీణ ప్రజలను ఇతర ప్రాంతాలకు నెట్టివేస్తుంది (Push).
-తెలంగాణ గ్రామీణ సమాజంలో భూస్వామ్య, జమీందారీ వ్యవస్థలు, అగ్రకులాల ఆధిపత్యం వంటి కారణాలు కూడా వలసలను ప్రోత్సహించాయి. వీటికి తోడు స్థానికంగా తరుచుగా సంభవించే ప్రకృతి వైపర్యీతాలు బలవంతంగానే వలసలను ప్రేరేపిస్తున్నాయి.
2) పుల్ కారణాలు (Pull Factors)
-మారుతున్న కాలమాన పరిస్థితుల ఆధారంగా నగర, పట్టణ, ఆధునిక జీవన విధానంలో గణనీయ మార్పులు సంభవించాయి. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం నిరుద్యోగం, నిరక్షరాస్యత, వెనుకబాటుతనం వంటి కారకాలు, కారణాలకు పట్టణ ప్రాంతాల్లో లభించే ఉపాధి అవకాశాలు, ఆధునిక జీవనం, విద్య, వైద్యం, రవాణా వంటి మౌలిక సదుపాయాలు పరిష్కార మార్గాలుగా కనిపించి ఎక్కువగా ఆకర్షించడంతో సహజంగానే గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలు, పట్టణాలకు వలసలు పెరిగాయి.
-ఆర్థికాభివృద్ధి, సాంకేతాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి వేగవంతమయ్యేకొద్దీ వలసలు మరింత పెరుగుతున్నాయి. దేశంలో ఆర్థికంగా వెనుకబడిన రాష్ర్టాలైన బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ల్లోని పేదలు ఇతర రాష్ర్టాలకు నిరంతరం వలసపోతూనే ఉన్నారు. ఇక తెలంగాణ నుంచి ఏకంగా గల్ఫ్ దేశాలకు నిరంతరం వలసలు కొనసాగుతూ ఉండటాన్ని కూడా గమనించవచ్చు.
-భారతదేశంలో మేధోవలస (Brain Drain) మరో సమస్య. అంతర్జాతీయంగా ఆకర్షణీయమైన జీతభత్యాలు, ఆధునిక జీవనం, ఆధునిక శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక పరిశోధనలకు అవసరమైన మౌలిక సదుపాయాలు మేధో వలసను ప్రోత్సహిస్తున్నాయి. మరోవిధంగా చెప్పాలంటే భారతీయ మేధావులను ఆకర్షిస్తున్నాయని (లాగుతున్నాయని) చెప్పవచ్చు. భారతదేశం నుంచి విదేశాలకు వలసపోయిన వారిలో అత్యధికమంది శాశ్వతంగా ఆయా దేశాల్లోనే స్థిరపడ్డారు. అంతేకాకుండా అనేక దేశాల్లో ఉద్యోగపరంగా, పారిశ్రామికరంగంలో అదేవిధంగా రాజకీయాల్లో కూడా క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. అయితే కూలీ పనుల కోసం, జీవనోపాధిని వెతుక్కుంటూ వలసపోయినవారు మాత్రం దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. కొన్ని సందర్భాల్లో శవాలను కూడా తెచ్చుకోలేకపోవడం బాధాకర విషయం.
వలసలతో తెలంగాణ విలవిల
-తెలంగాణ గ్రామీణ సమాజంలో అత్యంత ప్రమాదకర సమస్య వలసలు. నిజానికి తెలంగాణలో గ్రామీణ కుటుంబ బంధుత్వ సంబంధాలు బలంగా ఉంటాయి. అయితే వలసలతో ఇవి బలహీనపడ్డాయి. శతాబ్దాలుగా నిరంకుశ పాలన దశాబ్దాలుగా ఆంధ్రవలస పాలకుల వివక్షాపూరిత దోపిడీ పాలనతో తెలంగాణ పల్లెలు వలసలతో విలవిల్లాడుతున్నాయి. బొగ్గుబాయి, బొంబాయి, దుబాయి వరకు కూలీలు తరతరాలుగా వలసపోతున్నారు. ఒకప్పుడు ఘనమైన జీవితాన్ని గడిపిన చేనేత కార్మికులు పారిశ్రామీకరణ దెబ్బకు కోలుకోతేకపోతున్నారు. తెలంగాణ సంస్కృతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన నేత కార్మికులు నేడు బొంబాయి, భీవండీ, సూరత్, షోలాపూర్ అహ్మదాబాద్‌ల్లోని నూలుమిల్లుల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు.
-తెలంగాణ నుంచి వలసలు 1930 నుంచే ప్రారంభమయ్యాయి. అయితే 1970 నుంచి జరిగిన అంతర్జాతీయ పరిణామాలు ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో జరిగిన మార్పులు, చమురు ధరలు పెరగడం అంతర్జాతీయంగా శాస్త్రసాంకేతిక రంగాల్లో వచ్చిన మార్పలు వలసలను మరింత ప్రోత్సహించాయి.
-తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలోని కూలీలు పొట్టచేతపట్టుకొని దేశమంతటా పాలమూరు లేబర్‌గా వలసపోయారు. దేశంలో జరిగే నిర్మాణ కార్యక్రమాల్లో దాదాపు 40 శాతం కూలీలు పాలమూరు వలస కూలీలే ఉండటాన్ని బట్టి వీరి దుర్భర జీవితాలను అర్థం చేసుకోవచ్చు. పాలమూరు గోస రూపంలో వీరి జీవన చిత్రాన్ని వివరించారు. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు వలసవచ్చే కూలీల్లో మొదటిస్థానం మహబూబ్‌నగర్ కూలీలదే కావడం మరో విశేషం. 1934లో నిర్మించిన నిజాంసాగర్ డ్యాం పనుల్లో పాలమూరు కూలీలే ఎక్కువగా ఉండటం, నిజాం నిర్మించిన రహదారులు, రైల్వే లైన్ల ఏర్పాటులో కూడా వీరి పాత్ర ఎక్కువగా ఉంది.
-కరీంనగర్‌తోపాటు ఈ జిల్లాలోని కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల, సిరిసిల్ల, ధర్మపురి, నిజామాబాద్‌తోపాటు ఈ జిల్లాలోని ఆర్మూర్, కామారెడ్డి, కమ్మర్పల్లి వంటి ప్రాంతాల నుంచి ఎక్కువ మంది కూలీలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రెయిన్, ఒమన్ వంటి గల్ఫ్ దేశాలకు వలసపోతున్నారు. దాదాపు పది లక్షల మంది తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు వలసవెళ్లినట్లు అంచనా. ఈ జిల్లాల నుంచే కాకుండా హైదరాబాద్‌లోని పాతబస్తీ నుంచి మైనర్ ముస్లిం బాలికలను గల్ప్ దేశాలకు అమ్మివేయడం లేదా మోసపూరితంగా, బలవంతంగా బాల్యవివాహాలు జరిపి గల్ఫ్ దేశాలకు తరలించడం మరో విషాదకర విషయం.
వలస జీవనం దుర్భరం
-పేదరికం, నిరుద్యోగం సమస్యల కారణంగా వలసపోయిన కార్మికులు చివరకు అదే పేదరికంతో తనువు చాలిస్తున్నారు. వలసపోయిన ప్రాంతాల్లో ఆహారంతోపాటు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. వలస పక్షుల మాదిరి నిరంతరం సంచరిస్తూనే ఉండటంతో వారి పిల్లలకు విద్య నేర్చుకొనే అవకాశం లేకుండాపోయింది. మరికొన్ని సందర్భాల్లో కుటుంబ యజమాని ఎక్కువ కాలం వలసపోవడంతో కుటుంబ జీవనం బలహీనపడి, అభద్రతతో జీవితాలను నెట్టుకొస్తున్నారు. వలసల్లో ఎక్కువగా పురుషులు దూరప్రాంతాలకు వెళ్లడంతో మహిళలు పురుషులు చేయాల్సిన పనులను చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అంతేకాకుండా అనారోగ్యం, ఆపదలు సంభవించినప్పుడు ఆసరా లేక భయం భయంగా బతుకీడుస్తున్నారు. పాలమూరు జిల్లాల్లో గ్రామాలకు గ్రామాలే వలసపోతున్నాయి.
వలసల నివారణకు ప్రభుత్వ చర్యలు
పురా (Providing Urban Amerities in Rural Areas)
-ఈ పథక ప్రధాన లక్ష్యం గ్రామీణాభ్యుదయం.
-స్వర్గీయ అబ్దుల్ కలాం కలల పథకం ఇది.
-గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ వసతులు సమకూర్చడం ద్వారా పేదరికం, వెనుకబాటుతనాన్ని తొలగించే అద్భుత పథకంగా కలాం భావించారు.
-దీని ద్వారా 15 నుంచి 25 గ్రామాలను భౌతికంగా, ఆర్థికం గా, మేధోపరంగా, ఎలక్ట్రానిక్పరంగా అనుసంధానించడం.
-భౌతిక, ఆర్థిక అనుసంధానం, రహదారుల నిర్మాణంతో ఈ గ్రామాలన్నింటిలో మెరుగైన మార్కెట్ వసతులు కల్పించి గ్రామీణ ఉత్పత్తులను ఉపయోగించుకొనేలా చేయడం.
-మేధోపరంగా అంటే ప్రతి 5 నుంచి 7 కిలోమీటర్లకు ఒక పాఠశాల, ఉన్నత విద్యాకేంద్రం, ఒక ఆస్పత్రిని గ్రామాలను కలిపే రహదారులను ఏర్పర్చడం.
-గ్రామాల మధ్య టెలికమ్యూనికేషన్స్ సౌకర్యాలు, ఐటీ సేవలను ఉపయోగించుకునేలా డిజిటలైజేషన్ చేయడం.
-గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య అంతరాలు తొలగించి సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో సమతూకం సాధించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం.
భారత్ నిర్మాణ్
-గ్రామీణ వలసలను అరికట్టడమే లక్ష్యంగా భారత్ నిర్మాణ్‌ను UPA ప్రభుత్వం 2005లో ప్రారంభించింది.
-ఈ పథకంతో వెయ్యిమందికిపైగా జనాభా ఉన్న గ్రామాల్లో సాగు, తాగునీరు, గృహనిర్మాణం, రహదారులు, టెలిఫోన్ సౌకర్యం, విద్యుదీకరణను అభివృద్ధిపర్చడం.
-ఇది ఒకరంగా పురాకు మరోరూపంగా భావించవచ్చు.
-పై ఆరు రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలను నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తిచేయడం భారత్ నిర్మాణ్ లక్ష్యం.
-ఈ పథకం కింద కేంద్రప్రభుత్వం రూ. 1,74,000 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది.
-సత్వర నీటి పారుదల ప్రాయోజిత పథకం కింద సాగునీరును, రాజీవ్‌గాంధీ తాగునీటి మిషన్ కింద తాగునీటి సౌకర్యం, రాజీవగాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన కింద విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నారు.
-భారత్ నిర్మాణ్ గ్రామీణ ప్రాంతాల్లో కనీస మౌలిక సౌకర్యాలు కల్పించి వలసల నిరోధం కోసం కృషిచేసే పథకం.
గ్రామీణ వలసల నివారణ సూచనలు
-గ్రామీణ పారిశ్రామీకరణకు ప్రవేశపెట్టే టెక్నాలజీ, సంప్రదాయ టెక్నాలజీని అభివృద్ధి చేసేదే కాకుండా స్థానిక వృత్తులవారికి ఉపాధిని కల్పించే భారీ పరిశ్రమలకు కూడా ఉపయోగపడేవిధంగా ఉండాలి.
-గ్రామీణ ముడి పదార్థాలపై వారి నైపుణ్యం ఆధారపడి, వాటి గరిష్టమేర వినియోగిచేదిగాను, శ్రామిక ఒత్తిడి తగ్గి ఉత్పాదకత పెంచేలా ఉండాలి.
-గ్రామీణ పారిశ్రామీకరణకు అనువైన టెక్నాలజీకి కావల్సిన పరిశోధనలు జరగాలి. దీంతో గ్రామీణ సామాజిక, ఆర్థిక జీ వనాలకు భంగం కలగకుండా గ్రామీణ సామాజిక లక్ష్యాల ను సాధించేలా గ్రామీణాభివృద్ధిలో కీలకపాత్ర వహించాలి.
-ఈ టెక్నాలజీ గ్రామీణ చేతివృత్తులవారికి అధిక వేతనం లభించేవిధంగా నైపుణ్యాన్ని పెంపొందించేలా, ఉపాధి అవకాశాలను పెంచేలా ఉండాలి.
-ఈ టెక్నాలజీ సమకాలీన, పోటీ పర్యావరణ పరీక్షలకు అనుగుణంగా అన్ని పరిశ్రమల్లో ఉపయోగపడేలా ఉండాలి.
-విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసేలా, ప్రకృతి సమతుల్యానికి, జీవవైవిధ్యానికి అనుకూలంగా ఉండాలి.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం
-కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్ఠాత్మక పథకం ఇది.
-దీని ముఖ్య ఉద్దేశం ఉపాధి కల్పించడం ద్వారా వలసలను నిరోధించడం.
-ఈ పథకం కింద గ్రామాల్లో నిరుపేద కుటుంబాల్లో ఒకరికి ఏడాదికి 100 రోజుల ఉపాధిని ప్రభుత్వం కల్పిస్తుంది.
-డిమాండ్ చేసి ఉపాధిని పొందడం ఈ పథకం ప్రత్యేకత.
-ఈ పథకం అమలుకు సోషల్ ఆడిట్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో అక్రమాలకు తావులేకుండా అమలు పరుస్తారు. ఒకవేళ అక్రమం జరిగితే సొమ్ము రికవరీ చేస్తారు.
-ఈ పథకం అమల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కేరళ రాష్ర్టాలు ముందంజలో ఉన్నాయి.
-ఈ పథకంతో వలసలు అధికంగా ఉండే ప్రాంతాలు, అనావృష్టి, కరువు పీడిత ప్రాంతాల్లో వలసలు తగ్గినట్టు నివేదికలు తెలుపుతున్నాయి.
ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్
-దీన్ని భారత రాయబార కార్యాలయంలో ఏర్పాటు చేశారు.
-ఇంటిపనివారు, నైపుణ్యంలేనివారు ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయడం ఈ పథకం లక్ష్యం.
ప్రవాసీ భారతీయ బీమా యోజన
-ఇది తెలంగాణతోపాటు భారతీయ వలస కార్మికుంలదరికీ సంబంధించిన యోజన.
-ఈ పథకంలో రూ. 275లు (ప్రీమియం) రెండేండ్లు చెల్లిస్తే ప్రమాద బీమా ద్వారా రూ. 10 లక్షలు, వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 75,000, కుటుంబ వైద్య ఖర్చుల కింద రూ. 50,000ల బీమా పొందవచ్చు.
మైగ్రెంట్స్ రిసోర్స్ సెంటర్ (హైదరాబాద్)
-ఈ సెంటర్ వారు వెలసవెళ్లిన వారి రక్షణార్థం, సహాయర్థం పనిచేస్తుంది.
ప్రవాసీ మిత్ర
-ప్రవాస మహిళలపై జరిగే హింస, అన్యాయ జీవన విధానాలు, విదేశాల్లో పడుతున్న కష్టాలను తెలిపే మాసపత్రిక ఇది.
-1944లో బెంగాల్లో తీవ్రమైన కరువు రావడంతో ప్రజలు పెద్ద ఎత్తున పొరుగు రాష్ర్టాలకు వలవెళ్లారు.
-పొడి వాతావరణమే తెలంగాణలో అధిక వలసలకు కారణం.
-భారత్, చైనా, బంగ్లాదేశ్ నుంచి వైద్య నిపుణులు, నర్సులు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు.. అమెరికా, కెనడా, ఇంగ్లండ్, జర్మనీ దేశాలకు వలసపోవడానికి ముఖ్యకారణం ఆయా దేశాల్లో జనాభా పెరుగుదల రేటు తగ్గడం.
-ఒక ప్రాంతంలో వివిధ వృత్తులకు అవసరమయ్యే నిపుణులు స్థానికుల్లో లేనపుడు బయట నుంచి వలసలు ప్రారంభమవుతాయి.
-ఈ విధమైన అంతర్జాతీయ వలసలు దేశ ఆర్థికాభివృద్ధిపై, మానవ వనరులపై ప్రభావం చూపుతాయి.
-సాంఘిక, సాంస్కృతిక కారకాలైన వివాహం, ఉమ్మడి కుటుంబం, విద్య, కులం ప్రధాన అంశాలుగా వలసలు సాగుతాయి.
-వివాహాల కారణంగా స్త్రీలు, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కారణంగా కుటుంబ సభ్యుల వలసలు జరుగుతున్నాయి.
-వేలాది భారతీయులు విద్య, ఉద్యోగ అవకాశాల కోసమై యూరప్, పశ్చిమ దేశాలను ఆశ్రయిస్తున్నారు.
-భారతదేశంలో దేశవిభజన సందర్భంలో జరిగిన హింసాకాండ వల్ల చాలామంది ముస్లింలు భారత్ నుంచి, హిందువులు పాకిస్థాన్ నుంచి వలస వెళ్లారు.
-రాజకీయపరమైన ఘర్షణలు, రాజకీయ పరిస్థితులు తమకు అనుకూలంగా లేనప్పుడు, నియంతృత్వ రాజకీయాల వల్ల ప్రజల వలసలు ఏర్పడుతాయి.
-దేశంలో రాజకీయ సంబంధమైన ప్రాంతీయ దురభిమానం వల్ల కల్లోలపడిన పంజాబ్, కశ్మీర్ ప్రజలు తమ ఆస్తిపాస్తులు వదిలి సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు.
-శ్రీలంక జాతుల మధ్య చెలరేగిన విధ్వంసకర చర్యలు తమిళ భారత సంతతి మన దేశానికి వలస వచ్చారు.
-గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసలు 57 శాతం కాగా, పట్టణాల నుంచి గ్రామాలకు తరలిన వారు 29 శాతం మాత్రమే.
-ఇందులో ఉపాధి కోసం గ్రామీణ ప్రజలు 55 శాతం పట్టణ ప్రాంత ప్రజలు 67 శాతం వలసలు జరిగినట్టు అంచనా.
-గ్రామీణ ప్రాంతాల్లో 82 శాతం స్త్రీలు వివాహరీత్యా వలసలు చెందితే నగరాల్లో 51 శాతంగా ఉంది.
-దూర ప్రాంతాలకు వలస వెళ్లే వారిలో స్త్రీల కంటే పురుషులే ఎక్కువ. దూరం పెరిగేకొద్ది వలసవెళ్లే స్త్రీల సంఖ్య తగ్గుతుంది. అది 7.2 శాతం కాగా, పురుషులు 18.8 శాతంగా నమోదయ్యింది.
-నగరాలకు వలస వెళ్లేవారిలో 25 నుంచి 49 ఏండ్ల వయస్సు గల పురుషుల శాతం అధికంగా, 15 ఏండ్లలోపు ఉన్నవారి వలసలు అల్పంగా ఉన్నాయి.
వలసల నివారణ మార్గాలు
-గ్రామాల్లో తరతరాలుగా బలహీనవర్గాలను పట్టిపీడిస్తున్న పేదరికం, నిరుద్యోగిత, నిరక్షరాస్య వంటి సమస్యలను సత్వరం పరిష్కరించాలి. ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పన, సంక్షేమ పథకాలతోపాటు గ్రామీణ పేదలకు భూమి, ఆస్తి, వనరులు అందుబాటులో ఉండాలి.
-గ్రామీణ ప్రజల్లో సామాజిక ఆర్థిక, అసమానతలు తొలగించి అందరికీ సాంఘిక న్యాయం చేకూర్చాలి. పేదవారికి సామాజిక న్యాయం చేకూర్చే చర్యలో భూసంస్కరణలు ప్రముఖపాత్ర వహిస్తాయి. దీంతో వారి సామాజిక అంతస్తు సమాజంలో పెరుగుతుంది.
-పేదరికం నిర్మూలన కోసం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలకు ఎక్కువ నిధులు కేటాయంచి వాటిని అమలుపర్చాలి.
-హరిత విప్లవం, సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకాల ప్రయోజనాలను బలహీన వర్గ ప్రజలకు అందేలా చూడాలి.
-గ్రామీణ, నగర ప్రాంతాల మధ్య పెరుగుతున్న అసమానతలు తొలగేలా గ్రామాల్లో పరిశ్రమలను స్థాపించాలి. కుటీరపరిశ్రమలు, చేనేత రంగాలను పునరుద్ధరించాలి.
-ప్రాంతీయ అసమానతలు తగ్గించేవిధంగా ప్రత్యేక కార్యక్రమాలు, చర్యలు చేపట్టాలి.
-భావ ప్రసార సాధనాల ద్వారా స్థానికంగా ఉండే ఉద్యోగ సమాచారాలను అందిస్తే వలసలను అరికట్టవచ్చు.
-జనాభా, వనరులు, సామాజిక అభివృద్ధి వీటి మధ్య సమతుల్యం ఉండేటట్టుగా మానవ వనరుల అభివృద్ధి జరగాలి. గ్రామీణ ప్రాంతాల్లోమానవ నివాస యోగ్యాలుగా మార్చే ప్రయత్నాలు జరగాలి.
-గ్రామాల్లో కరువుకాటకాలు, వరదలు వంటి ప్రకృతివైపరీత్యాలను నివారించే శాశ్వత పరిష్కార మార్గాలను చేపట్టాలి.
-విద్యాస్థాయిల్లోనే వృత్తి శిక్షణ, నైపుణ్యం వంటి కార్యక్రమాలతో వారి ప్రమాణాలను పెంచి ఉపాధి కల్పించడం ద్వారా యువకుల వలసలను నిరోధించవచ్చు.
నమూనా ప్రశ్నలు
1) 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో వలస ప్రజల సఖ్య? (2)
1) 20 కోట్లు 2) 30 కోట్లు
3) 40 కోట్లు 4) 50 కోట్లు
2) వలస అనేది? (4)
1) సామాజిక ప్రక్రియ 2) నిరంతర ప్రక్రియ
3) సామాజిక గతిశీల అంశం 4) పైవన్నీ
3) మాతృదేశాన్ని వదిలి మరో దేశానికి వలసవెళ్లడాన్నేమంటారు? (3)
1) అంతర్గల వలస 2) బహిర్గత వలస
3) ఎమ్మిగ్రేషన్ 4) ఇమ్మిగ్రేషన్
4) ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి జరిగే వలస? (2)
1) ఆరంభ వలస 2) స్థానిక వలస
3) స్థిర వలస 4) అస్థిర వలస
5) తెలంగాణ జిల్లాల నుంచి ఏదేశాలకు వలసలు ప్రధానంగా జరుగుతున్నాయి? (3)
1) యూరప్ 2) అరబ్
3) గల్ఫ్ 4) ఆఫ్రికా
6. పాలమూరు కూలీలు ఎక్కువగా కనపడేది? (2)
1) బొగ్గు గనులు 2) నిర్మాణ రంగం
3) వ్యవసాయం 4) పరిశ్రమల్లో కార్మికులు
7. గ్రామాల నుంచి పట్టణాలకు వలసలను నివారించడానికి ప్రవేశపెట్టిన పథకం? (1)
1) పురా 2) భారత్ నిర్మాణ్
3) నిర్మల్ భారత్ 4) ఇందిరాయోజన
8. చేనేత కార్మికుల వలసకు కారణం? (4)
1) పారిశ్రామికీకరణ 2) ప్రపంచీకరణ
3) సరళీకరణ 4) పైవన్నీ
9. తెలంగాణ నుంచి విదేశాలకు వలసపోయేవారికి సహాయం చేయడానికి హైదరాబాద్‌లో నెలకొల్పిన సంస్థ? (1)
1) మైగ్రెంట్ రిసోర్స్ సెంటర్
2) మైగ్రెంట్ హెల్ప్‌లైన్ డెస్క్
3) మైగ్రెంట్ కో ఆపరేటివ్ సొసైటీ
4) పైవేవీ కావు
10. గల్ఫ్ బాధితుల గోస అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? (1)
1) కోటపాటి నరసింహరాయుడు
2) మంద భీంరెడ్డి
3) కొడవగంటి నరసింహారెడ్డి
4) బీంరెడ్డి బలరాములు
నూతనకంటి వెంకట్ సీనియర్ ఫ్యాకల్టీ
విజేత ఐఏఎస్ స్టడీ సర్కిల్ జయశంకర్ సార్ అకాడమీ హైదరాబాద్
9849186827
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు