తెలంగాణ తొలి పాలకులు వీరే!
దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన తొలి ప్రధాన రాజవంశం శాతవాహనులు. వీరు దక్షిణ భారతదేశంలో మొదట విశాల సామ్రాజ్యాన్ని స్థాపించారు. వీరి పాలనలో సామాజిక, ఆర్థిక సాంస్కృతిక రంగాల్లో ప్రగతి శీలక మార్పులు చోటు చేసుకున్నాయి. సాహిత్య, వాస్తు శిల్ప కళలను పోషించారు. వీరు మౌర్యుల కాలంలో సామంతులుగా ఉండి కణ్వ వంశ కాలంలో స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నారు.
తెలంగాణలోని కోటిలింగాలలో వీరిపాలన ప్రారంభమై తర్వాత ప్రతిష్టానపురం (పైఠాన్) రాజధానిగా పాలించారు. మలి శాతవాహనుల కాలంలో ధాన్యకటకానికి రాజధానిని మార్పు చేశారు. క్రీ. పూ. 1వ శాతాబ్దం నుంచి క్రీ.శ. 225 కాలం వరకు సుమారు రెండున్నర శతాబ్దాల సుదీర్ఘకాలం శాతవాహనులు పరిపాలించారు. కెం.ఎం. ఫణిక్కర్ అభిప్రాయంలో ద్రవిడ దేశానికి ఆర్యవర్తనానికి మధ్య సాంస్కృతిక సమన్వయాన్ని సాధించి చరిత్రాత్మక పాత్రను శాతవాహనులు నిర్వహించారు. వీరి కాలంలో 18 రకాల వృత్తులు ఉన్నట్లు వారి శాసనాల ప్రకారం తెలుస్తోంది.
శాతవాహనుల శాసనాలు వారి అధికార భాష ప్రాకృతంలో, బ్రహ్మలిపిలో ఉన్నాయి. వారి పాలనాకాలానికి సంబంధించిన 24 శాసనాలు లభించాయి. ఇవన్నీ తొలి, మలి శాతవాహనుల కాలానికి చెందినవి మాత్రమే. వీటిలో ముఖ్యమైనవి
నానాఘాట్ శాసనం:
మొదటి శాతకర్ణి భార్య రాణి నాయనిక(నాగానిక) వేయించింది. ఇది అలంకార శాసనం. దీనిపై తొలి శాతవాహన రాజుల ప్రతిమలు చెక్కి ఉన్నాయి.
నాసిక్ శాసనం:
గౌతమీ బాలశ్రీ వేయించింది. ఇందులో తన పుత్రుడు గౌతమీ పుత్ర శాతకర్ణి విజయాలను ప్రస్తావించింది. దీనిని తన మనుమడు వాసిష్ఠీపుత్ర పులోమావి 19వ పాలనా సంవత్సరంలో వేయించింది.
భట్టిప్రోలు నిగమసభ శాసనం:
దీనిని కుబేరుడు వేయించాడు. నగరపాలిక సభలైన నిగమసభల గురించి, శాతవాహనుల కాలంనాటి పట్టణ ప్రాంతాల గురించి ఈ శాసనం తెలియజేస్తుంది.
కన్హేరి శాసనం:
దీనిని కృష్ణుడు (కన్హా) వేయించాడు. శాతవాహనుల కాలం నాటి పరిపాలనా వ్యవస్థ, మంత్రి మండలి గురించి తెలియజేస్తుంది.
మ్యాకధోని శాసనం:
దీనిని శాతవాహనులలో చివరి రాజైన మూడో పులోమావి వేయించాడు. బళ్ళారిలో లభించిన ఈ శాసనం శాతవాహనుల రాజ్య పతనం గురించి, గ్రామ పాలన గురించి, శాంతిభద్రతల అధికారి అయిన గుల్మిక వివరాలను తెలియజేస్తుంది,
హాతిగుంఫా శాసనం:
మహామేఘవంశానికి చెందిన కలింగరాజు ఖారవేలుడు వేయించాడు. అతని సమకాలీనుడైన శాతకర్ణి గురించి సమాచారాన్ని, చతురంగ బలాలను గురించి తెలియజేస్తుంది.
జునాఘఢ్ శాసనం:
దీనిని రుద్రదాముడు వేయించాడు. సంస్కృతంలో జారీచేసిన మొదటి శాసనం. ఈ శాసనం గౌతమీపుత్ర శాతకర్ణి రుద్రదాముడిని ఓడించినట్లు పేర్కొంది. శాతవాహనులకు- ఉజ్జయినీ క్షాత్రపుల వైవాహిక సంబంధాలను గురించి తెలియజేస్తుంది.
ఎర్రగుడి రాజుల మందగరి శాసనం:
అశోకుడు ప్రాకృతంలో వేయించాడు. శాతవాహనులు మౌర్యుల సామంతులని, ఆంధ్రభృత్యులు అని ఈ శాసనం తెలియజేస్తుంది.
శాతవాహనులు సీసం, రాగి నాణేలను అధిక సంఖ్యలో ముద్రించారు. రాగి తగరం లోహాల మిశ్రమంతో ఫోటీన్ నాణేలను కూడా ముంద్రించారు. మొదటి వెండి నాణేల ముద్రణ కూడా శాతవాహనుల కాలంలోనే జరిగింది. గౌతమీ పుత్ర శాతకర్ణి కాలం నుంచి వెండి నాణేలను ఉపయోగించారు. వీరు నాణేలపై రాజులపేర్లు / బిరుదులు/ జంతువుల బొమ్మలు/ సూర్యుడు, చంద్రుడు, శంఖం, కమలం ముద్రించేవారు. మొదటి శాతకర్ణి శ్రీముఖ శాతవాహన నాణేలు కోటి లింగాల్లో ఎక్కువ దొరికాయి. అందువల్ల తెలంగాణలోనే వీరిపాలన మొదలైందని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. శాతవాహనుల పాలనలో ఉన్నతాధికారులైన మహతలవర, మహాసేనాపతి, మహారథి, మహాగ్రామిక అనే వారికి కూడా నాణేలను ముద్రించే అధికారం ఉండేది. శాతవాహన రాజుల్లో ఎక్కువ సంఖ్యలో నాణేలను ముద్రించినది మాత్రం యజ్ఞశ్రీ శాతకర్ణి.
తెలంగాణ రాష్ట్రంలో ఫణిగిరి, గాజులబండ, కోటిలింగాల, పెద్దబంకూర్, కదంబాపూర్, ధూళికట్ట ఆంధ్రప్రదేశ్లోని అమరావతి, భట్టిప్రోలు, గుడివాడ, జగ్గయ్యపేట, గుంటుపల్లి, రామతీర్థం, శాలిహుండం ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో శాతవాహనులకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
కొండాపూర్ :
ఇది మెదక్జిల్లాలో ఉంది. మూడో శతాబ్దం నాటికే పట్టణంగా ఆవిర్భవించింది. ఆశిక రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఇక్కడ టైబీరియస్ కైసర్ చిహ్నం గల సెప్టెరిస్తో చేసిన కంఠహారం దొరికింది. శాతవాహనులకు చెందిన సుమారు 4000 నాణేలు ఇక్కడ దొరికాయి.
కోటిలింగాల:
కరీంనగర్ జిల్లాలో గోదావరి, పెద్దవాగు సంగమ స్థానంలో ఉంది. 1980-83 వరకు రాష్ట్ర పురావస్తుశాఖ వారు జరిపిన తవ్వకాల్లో శాతవాహనుల కోటగోడలు, ఒక బురుజు, శ్రీముఖుడి నాణేలు, తొలి శాతవాహన రాజుల నాణేలు, శాతవాహనుల పూర్వపు రాజుల నాణేలు, విద్దాంక నాణేలు కూడా దొరికాయి.
పెద్దబంకూరు:
కరీంనగర్ జిల్లాలో హుస్సేమియా వాగు ఒడ్డున ఉంది. ఒక రైతుకు పొలంలో 22 వేలకుపైగా ఉన్న శాతవాహనుల నాణేల కుండ దొరికింది. 1968-74 మధ్యకాలంలో నిర్వహించిన తవ్వకాల్లో శాతవాహనుల కాలంనాటి 3 ఇటుక కోటలు, ఇటుకతో కట్టిన 22 చేద బావులు, మట్టిగాజులతో నిర్మించిన మరోబావి ఇనుప గొడ్డళ్లు, మేకులు, కత్తులు, బరిసెలు, కొడవళ్లు, ఉలులతోపాటు పూసలు, గాజులు, టెర్రకోట ముద్రికలు తవ్వకాల్లో దొరికాయి.
ధూళికట్ట :
బౌద్ధ స్థూపం, కోటలోపల రాజ భవనాలు, బావులు, ధాన్యాగారాలు, ప్రాకారాలు, ఏనుగు దంతం దువ్వెన, మట్టిపాత్రలు బయటపడ్డాయి.
శాతవాహనుల కాలంలో వ్యవసాయం ప్రధాన వృత్తి. వరి, జొన్న, జనుము, నువ్వులు, చెరకు ప్రధాన పంటలు. గోధుమ, కంది, పెసర, ఆముదం, కొబ్బరి, పత్తి వారి ఇతర పంటలు. భూములను దున్నడానికి ఎద్దులతోపాటు, గాడిదలు, దున్నలను కూడా ఉపయోగించేవారు. వీరు ఆవులు, భూములు, గ్రామాలను దానంగా ఇచ్చేవారని వీరి శాసనాల ద్వారా స్పష్టం అవుతుంది.
శాతవాహనుల్లో ముఖ్యరాజులు
శ్రీముఖుడు
మొదటి శాతకర్ణి
కుంతల శాతకర్ణి
గౌతమీపుత్ర శాతకర్ణి
వాశిష్ఠీపుత్ర పులోమావి
యజ్ఞశ్రీ శాతకర్ణి
మూడో పులోమావి
కృష్ణుడు
రెండవ శాతకర్ణి
హాలుడు
పరిపాలనా సిబ్బంది
రాజుకు పరిపాలనలో సహాయపడటానికి
అమాత్యులు
మహామాత్రులు
విశ్వాసమాత్యులు
మహారథులు (రాష్ర్టాన్ని పాలించే అధికారులు)
మహాభోజకులు (రాష్ట్రపాలకుడి హోదా)
మహాసేనాపతి (సైన్యాధిపతి)
భండారిక (వస్తురూపంలో ఆదాయాన్ని భద్రపరిచేవాడు)
హెరణిక/ హిరణ్యక (కోశాధికారి)
దూతకులు (గూఢాచారులు)
లేఖక(చక్రవర్తి కార్యదర్శి)
నిబంధకర (దస్తావేజులను నమోదు చేసే ఉద్యోగి)
మహాతరక (రాజు అంగరక్షకుడు)
మహామాత్రులు (బౌద్ధ బిక్షవుల బాధ్యతలను చూసేవారు)
గ్రామకుడు (గ్రామాధికారి)
ముఖ్య పన్నులు
భాగ – పండిన పంటలో 1/6 వంతు
కారుకర – వృత్తిసంఘాల వారు చెల్లించే పన్ను
కర – కూరగాయలు, తోటలపై విధించే పన్ను
శుల్క – నీటి తీరువా పన్ను
ప్రధాన ఆదాయ వనరులు
భూమిశిస్తు
రేవు సుంకాలు
వృత్తి సుంకాలు
ప్రాక్టీస్ బిట్స్
1. కొండాపూర్ను శాతవాహనుల టంకశాల నగరమని ఎవరు వాఖ్యానించారు?
1) మల్లంపల్లి సోమశేఖర శర్మ
2) వి.వి. కృష్ణశాస్త్రి
3) హెచ్.సి. రాయ్చౌదరీ
4) శ్రీనివాస శాస్త్రి
2. యజ్ఞశ్రీ శాతకర్ణిని త్రి సముద్రాదీశ్వరుడని పేర్కొన్న గ్రంథం?
1) లీలావతి పరిణయం 2) హర్షచరిత్ర
3) మహాభారతం 4) కథాసరిత్సాగరం
3. ఆచార్య నాగర్జునుడు శాతవాహన యువరాజు చేతిలో హత్యకు గురయ్యాడని పేర్కొన్న గ్రంథం?
1) హర్షచరిత్ర 2) కథాసరిత్సాగరం
3) గాథాసప్తశతి 4) బృహత్కథ
4. కింది గ్రంథాలు అవి రాసిన కవులతో జతపరచండి?
1) హర్షచరిత్ర ఎ) కుతూహలుడు
2) గాథాసప్తశతి బి) గుణాడ్యుడు
3) కథాసరిత్సాగరం సి) బాణుడు
4) బృహత్కథ డి) హాలుడు
5) లీలావతి పరిణయం ఇ) సోమదేవసూరి
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
2) 1-బి, 2-ఇ, 3-డి, 4-ఎ, 5-సి
3) 1-సి, 2-డి, 3-ఇ, 4-బి, 5-ఎ
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
5. కింది శాసనాలను వాటిని వేయించిన వారితో జతచేయండి?
1) నానాఘాట్ ఎ) కుబేరుడు
2) నాసిక్ బి) ఖారవేలుడు
3) బట్టిప్రోలు సి) దేవీ నాగానిక
4) మ్యాకధోని డి) గౌతమీ బాలశ్రీ
5) హాతిగుంఫా ఇ) మూడో పులోమావి
1) 1-ఇ, 2-డి, 3-బి, 4-ఎ, 5-సి
2) 1-డి, 2-ఎ, 3-సి, 4-ఇ, 5-బి
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
4) 1-సి, 2-డి, 3-ఎ, 4-ఇ, 5-బి
6. గౌతమీ పుత్ర శాతకర్ణి బిరుదులు ఏవి?
1) ఆగమనిలయ 2) బేనకటక స్వామి
3) శకసంహారి 4) పైవన్నీ
7. శాతవాహనులు రాజ్యాన్ని ఏవిధంగా విభజించి పాలించారు?
1) రాజ్యం-విహారములు- విషయాలు- గ్రామాలు
2) విషయాలు- గ్రామాలు-రాజ్యం-విహారములు
3) గ్రామాలు-రాజ్యం-విహారములు-విషయాలు
4) విహారములు- విషయాలు- గ్రామాలు-రాజ్యం
8) శాతవాహన కాలంలో రాజు ప్రత్యక్ష పాలనలో ఉన్న ప్రాంతాన్ని ఏమనేవారు?
1) సామంతుల ప్రాంతాలు
2) రాజకంఖేట
3) సరిహద్దు ప్రాంతాలు
4) ఏదీకాదు
9) శాతవాహనుల కాలంలో రాజులు భూమిశిస్తుగా ఎన్ని రకాల పన్నులు విధించేవారు?
1) 3 2) 4 3) 2 4) 5
10) శాతవాహనులు ప్రజల నుంచి ఎన్నో వంతు భూమిశిస్తుగా వసూలు చేసేవారు?
1) 1/6 2) 1/4 3) 1/3 4) 1/5
సమాధానాలు
1.1 2.2 3.2 4.3 5.4 6.4 7.1 8.2 9.2 10.1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు