అతి వినయం ధూర్త లక్షణం అనే సామెతలో రక్షక తంత్రం ఏది? (tet special)
రక్షక తంత్రాలు (Defence Mechanisms)
వ్యక్తులు తమ అవసరాలను సంతృప్తిపర్చుకునే క్రమంలో మానసిక సంఘర్షణలకు గురవుతారు. ఈ సంఘర్షణను పరిష్కరించుకోలేకపోతే అది కుంఠనానికి దారితీస్తుంది. కుంఠనానికి లోనయ్యే వ్యక్తి కనబర్చే మొదటి లక్షణం వ్యాకులత (Anxiety). ఈ వ్యాకులతవల్ల మానసిక రుగ్మతలు ఏర్పడుతాయి. మానసిక రుగ్మతలవల్ల ఏర్పడే ప్రమాదాల నుంచి తన అహాన్ని కాపాడుకోవడానికి ఉపయోగించే పద్ధతులే రక్షక తంత్రాలు. రక్షక తంత్రాలనే భావనను మొదటగా ప్రవేశపెట్టినది సిగ్మండ్ ఫ్రాయిడ్.
రక్షక తంత్రమంటే ఒక ప్రవర్తన నమూనా. ఈ రక్షక తంత్రాలవల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. వీటి ముఖ్య ఉద్దేశం సర్దుబాటు ద్వారా బాధలను అణచివేయడం.
రక్షక తంత్రం
1. దమనం (Repression)
బాధాకరమైన విషయాలను, అపజయాలను, అవమానకరమైన అనుభవాలను అచేతనా మనస్సుకు పంపి, మర్చిపోయి ఉపశమనం పొంది తనను తాను రక్షించుకోవడం – దమనం.
ఇది ప్రాథమిక రక్షక తంత్రం.
దీన్ని ప్రేరేపిత విస్మృతి అంటారు.
ఉదాహరణలు
1. బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోతుందని అప్పులను మర్చిపోవడం
2. ప్రమాదాల్లో మరణాలను, ఆప్తుల మరణాలను మర్చిపోవడం
3. ఉపాధ్యాయుడి దండనకు గురైన విద్యార్థి ఆ బాధను మర్చిపోవడం
గమనిక: మానసిక నాడీ రుగ్మతలు కలిగిన వ్యక్తులు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు.
2. ప్రతిగమనం (Regression)
పూర్వపు స్థితిని పొందడాన్ని ప్రతిగమనం అంటారు.
పెద్దలవలె ఆలోచించి సమస్య పరిష్కారం కానప్పుడు పిల్లలవలె ప్రవర్తించడం.
ఉదాహరణలు
1. ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి పిల్లలను పట్టుకుని ఏడ్వడం
2. పదేపదే పుట్టింటికి వెళ్లే నూతన వధువు
3. రాత్రిపూట పక్కతడిపే యువకుడు
3. పరిహారం (Compensation)
ఒక వ్యక్తి ఒక రంగంలో రాణించనప్పుడు మరో రంగంలో రాణించడం
ఉదాహరణలు
1. చదువుపట్ల ఆసక్తిలేని రమణ మహర్షి గొప్ప తాత్వికుడిగా మారడం
2. చదువులో వెనుకబడిన విద్యార్థి ఆటల్లో ప్రతిభ చూపడం
3. పిల్లలులేని మహిళ కాన్వెంట్ టీచర్‌గా చేరడం
4. హేతుకీకరణ (Rationalisation)
లక్ష్యసాధనలో విఫలమైన వ్యక్తి తన చర్యను సహేతుకంగా సమర్థించుకోవడం.
ఉదాహరణలు
1. పరీక్ష తప్పిన విద్యార్థి పాస్ కావడంవల్ల లాభం లేదనడం
2. అందని ద్రాక్ష పుల్లన, తీయటి నిమ్మపండు
3. పరీక్షలో కాపీ ఎందుకు కొట్టావంటే అందరూ అలాగే చేస్తారని చెప్పడం
5. ప్రక్షేపణం (Projection)
వ్యక్తి తన లోపాలను, తీరని కోరికలను,అసంతృప్తి భావాలను, ఇతర వ్యక్తులకుగానీ,వస్తువులకుగానీ ఆపాదించడం.
తన తప్పులకు ఇతరులు బాధ్యులనడం.
దమనం తర్వాత ఎక్కువగా ఉపయోగించే రక్షకతంత్రం.
ఉదాహరణలు
1. పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థి.. అధ్యాపకులే కారణమని చెప్పడం
2. అవినీతిపరుడికి ప్రపంచమంతా అవినీతిమయంగా కనిపించడం
3. పరీక్ష పత్రం తప్పుల తడకగా ఉంది అనడం
4. ఆకర్షణలేని యువతి పురుషుడు తన వెంట పడుతున్నాడని అనడం
6. తదాత్మీకరణం (Identification)
ఒక వ్యక్తి తను సాధించలేనివి ఇతరులు సాధించినప్పుడు తానే సాధించినట్లు అనుభూతి పొందడం.
ఇతరులతో తమను తాము పోల్చుకోవడం
ఉదాహరణలు
1. తాను ఓడినా తన మిత్రుడు గెలిచాడని అనుభూతి పొందడం
2. ఒక సంస్థలో పనిచేసే వ్యక్తి ఆ సంస్థ పేరు చెప్పి గౌరవాన్ని పొందడం
3. కండక్టర్ కొడుకు కలెక్టర్ అయినప్పుడు కండక్టర్ అనుభూతి తదాత్మీకరణం
7. విస్థాపనం (Displacement)
ఒక వ్యక్తి తన కోపాన్ని కుంఠనాన్ని తక్కువస్థాయి వ్యక్తులపై, వస్తువులపై చూపడం
ఉదాహరణలు
1. అత్తమీది కోపం దుత్తమీద చూపించడం
2. నాయకుడి మీది కోపాన్ని ప్రతినాయకుడు పక్కవారిపై చూపించడం
3. పరీక్ష సరిగా రాయని విద్యార్థి పెన్నును పగులగొట్టడం
8. స్వైర కల్పనం (Fantacy)
వ్యక్తి తన నిజజీవితంలో సాధించలేనివి పగటి కలలు కంటూ, ఊహాలోకాల్లో విహరిస్తూ ఉపశమనం పొందడం.
ఉదాహరణలు
1. పరీక్షలో తప్పిన విద్యార్థి రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించినట్లు పగటికలలు కనడం
2. నల్లని పిల్లగా పిలువబడే అమ్మాయి మిస్ ఇండియా అయినట్లుగా కలగనడం
3. IAS సాధించలేని వ్యక్తి IAS అయినట్లు ఊహించుకుని ఊహాలోకాల్లో విహరించడం
9. ఉపసంహరణ/ఏకాంతత్వం (Withdrawl)
వ్యాకులత కలిగించే సంఘటనల నుంచి తప్పించుకోవడం.
ఉదాహరణలు
1. ఆటల్లో రాణించలేని వ్యక్తి ఆసక్తి లేదని ఆడకుండా తప్పించుకోవడం
2. పరీక్షకు సరిగా సన్నద్ధం కాని వ్యక్తి పరీక్ష రాయకపోవడం
3. పేరంటాలకు వెళ్లే మహిళలు అక్కడ అవమానం జరుగుతుందని వెళ్లకపోవడం
10. సానుభూతి (Sympathy)
ఒత్తిడివల్ల కలిగే బాధకు ఇతరుల నుంచి సానుభూతి పొంది, స్వాంతనం ఏర్పర్చుకుని ఉపశమనం పొందడం.
ఇతరుల ఓదార్పును ఆశించడం
1. పరీక్షలో తప్పిన విద్యార్థి తన ఆరోగ్యం సరిగా లేక పరీక్షలో తప్పానని తల్లిదండ్రులకు చెప్పి సానుభూతి పొందడం.
2. హోమ్‌వర్క్ చేయని విద్యార్థి తనకు ఆరోగ్యం బాగాలేక చేయలేదని ఉపాధ్యాయుడి సానుభూతి పొందడం.
11 ప్రతిచర్యా నిర్మితి (Reaction formation)
వ్యక్తి తన అసలైన వాంఛలకు, కోరికలకు భిన్నంగా ఉండే అంశాలను వ్యక్తం చేయడం
ఉదాహరణలు
1. ఒక వ్యక్తి గురించి దురభిప్రాయం ఉన్నా అతడు మంచివాడని చెప్పడం
2. దానం చేయడం ఇష్టంలేని వ్యక్తి తాను చేస్తే రూ.కోటికి పైగానే దానం చేస్తానని చెప్పడం
12. నిరాకరణం
అంగీకరించడానికి ఇష్టంలేని అంశాలను తిరస్కరించడం.
సహించలేని వాస్తవాన్ని నిజం కాదని తోసివేసి తాత్కాలిక ఉపశమనం పొందడం.
ఉదాహరణలు
1. భార్య మరణవార్త విన్న భర్త నిజం కాదని తోసివేయడం
2. ఇష్టంలేని దృశ్యాలను చూడకపోవడం
3. అహంకారి అయిన వ్యక్తిని నీవు అహంకారివి అన్నప్పుడు నేను కాదని నిరాకరించడం
13. బౌద్ధీకరణం (Intellectualization)
వ్యక్తి బాధ, భయం కలిగించే పరిస్థితుల నుంచి బౌద్ధిక నిర్వచనాలతో ఉపశమనం పొందడం.
ఉదాహరణలు
1. పరీక్షలో తప్పిన విద్యార్థి తన తలరాత బాగాలేదనే బౌద్ధిక నిర్వచనంతో ఉపశమనం పొందడం
2. కావాల్సిన వ్యక్తి మరణిస్తే ఆయాసం లేకుండా సుఖంగా మరణించాడని పేర్కొనడం
14. ప్రాయశ్చిత్తం (Undoing)
వ్యక్తి తన మనసు అంగీకరించని ఆలోచనలకు బహిరంగంగా క్షమాపణ అడగడం
ఉదాహరణలు
1. తప్పులు చేసిన వ్యక్తి ఉదారంగా దానాలు చేయడం
2. వృత్తిమీద ఆసక్తిలేని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ వృత్తి గురించి ఉపన్యాసాలివ్వడం
15. వ్యక్తీకరణ (Actingout)
వ్యక్తి ఒత్తిడి కలిగించే విషయాలను బయటకు వ్యక్తపర్చి ఉపశమనం పొందడం.
ఉదాహరణలు
1. తల్లిదండ్రుల ఆంక్షలు ఎక్కువ అయినప్పుడు ఎదురు తిరగడం
2. పరీక్ష తప్పిన విద్యార్థి తన బాధను తల్లిదండ్రులకు వ్యక్తంచేసి, తప్పక పాసవుతానని చెప్పి ఉపశమనం పొందడం.
16. అంతర్లీనం (Internalization)
సంఘర్షణకు లోనుచేసిన విషయంలో గెలువలేక రాజీపడి దానిలోకి మారిపోయే ధోరణివల్ల కలిగే సర్దుబాటు
ఉదాహరణలు
1. అత్తగారింట్లో మాంసాహారాన్ని విధిలేక అలవాటు చేసుకునే శాకాహారి కోడలు
2. శత్రువును ఓడించలేనప్పుడు శత్రువుతో కలిసిపోవడం
17. ఉదాత్తీకరణ (Sublimation)
వివరణ
సంఘంలో సమ్మతంకాని తమ ఉత్సుకతలను, కోరికలను సమాజం ఆమోదించే రీతిలో తీర్చుకోవడం.
ఇందులో ఉద్వేగపూరిత ఆలోచనలను, నిర్మాణాత్మక కార్యక్రమాల్లో ప్రవేశపెడుతారు.
ఉదాహరణలు
1. లైంగిక వాంఛలను తీర్చుకోలేని వ్యక్తి ప్రణయగీతాలు రాయడం, నగ్న చిత్రాలు వేయడం, ప్రణయ కథలు రాయడం చేస్తాడు
2. చిన్నప్పుడు అందరితో పోట్లాడే పిల్లవాడు, పెద్దయ్యాక బాక్సర్ కావడం.
రక్షక తంత్రాలు – సామెతలు
ఆడలేక మద్దెల ఓటిది – ప్రక్షేపణం
అందని ద్రాక్షపండు పుల్లన – హేతుకీకరణం
అత్తమీద కోపం దుత్తమీద చూపడం – విస్థాపనం
పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనబడుతుంది – ప్రక్షేపణం
అతి వినయం ధూర్త లక్షణం – ప్రతిచర్యా నిర్మితి
పుట్టినవాడు గిట్టక తప్పదు – బౌద్ధీకరణం
తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనడం – హేతుకీకరణం
గమనిక: సాంఘికంగా ఆమోదయయోగ్యంకాని రక్షకతంత్రాలు – విస్థాపనం, ప్రక్షేపణం, హేతుకీకరణం.
సాంఘికంగా ఆమోదయోగ్యమైన రక్షకతంత్రాలు – దమనం, పరిహారం, తదాత్మీకరణం, ఉదాత్తీకరణం.
ప్రాక్టీస్ బిట్స్
1. మెడిసిన్ ఎంట్రన్స్‌కు ప్రిపేర్ అవుతున్న అమ్మాయి తను డాక్టర్ అయిపోయినట్లుగా, మంచి ప్రాక్టీస్ జరుగుతున్నట్లుగా, దండిగా డబ్బు సంపాదిస్తున్నట్లుగా ఊహించుకోవడం?
1) స్వైర కల్పన 2) తదాత్మీకరణం
3) పరిహారం 4) హేతుకీకరణం
2. ఉన్నట్టుండి ఉద్యోగాన్ని కోల్పోయిన వ్యక్తి చిన్నపిల్లవాడిలా ఏడవడంలోని రక్షకతంత్రం?
1) ప్రక్షేపణం 2) ప్రతిగమనం
3) పరిహారం 4) దమనం
3. వక్తృత్వ పోటీలో సరిగా మాట్లాడలేకపోయి స్నేహితుల ఎగతాళికి గురైన అమ్మాయి కొన్ని రోజులు బాధపడింది. తర్వాత ఆ సంఘటన జరిగిన విషయమే మరిచిపోయింది. ఇక్కడ రక్షకతంత్రం?
1) ప్రతిగమనం 2) దమనం
3) విస్థాపనం 4) ఉపసంహరణ
4. ఇంజినీరింగ్ సీటురాని అమ్మాయి.. ఇంజినీరింగ్ చేసిన వారికి ఉద్యోగాలు రావడంలేదు, దానికంటే తాను చేరిన ఉపాధ్యాయ శిక్షణా కోర్సే మంచిదని సమర్థించుకోవడం?
1) పరిహారం 2) ప్రక్షేపణం
3) హేతుకీకరణం 4) విస్థాపనం
5. భోజనం సమయానికి బంధువుల ఇంటికి వెళ్లిన రవి తనకు ఆకలి అవుతున్నా ఇప్పుడే భోజనం చేసి వచ్చానని చెప్పడంలోని రక్షకతంత్రం?
1) ప్రక్షేపణం
2) ఉపసంహరణ
3) ప్రేరకం తారుమారు
4) పరిహారం
6. క్రికెట్ మ్యాచ్‌లో మొదటి బంతికే ఔటైన సాకేత్ కోపంగా తన బ్యాటుని గట్టిగా పిచ్‌కేసి కొట్టడంలోని రక్షకతంత్రం?
1) విస్థాపనం 2) ప్రక్షేపణం
3) ఉపసంహరణ 4) ప్రతిగమనం
7. కళ్యాణ్ ప్రేమలో వైఫల్యం పొందాడు. తర్వాత కవిత్వం రాయడంపై తన ఆలోచనలను లగ్నంచేసి గొప్ప కవి అయ్యాడు. ఇక్కడ రక్షక తంత్రం?
1) ప్రక్షేపణం 2) హేతుకీకరణ
3) ఉదాత్తీకరణ 4) దమనం
8. కిరణ్‌కు కాలేజీకి స్కూటర్‌పై వెళ్లాలని ఉంది. కానీ అతని తండ్రి స్కూటర్ కొనివ్వడానికి నిరాకరించాడు. దాంతో అతను స్కూటర్ ఉన్న సహవిద్యార్థితో స్నేహం చేసి కాలేజీకి స్కూటర్‌పై వెళ్లాడు. ఇది దేనికి ఉదాహరణ?
1) పరిహారం 2) ప్రక్షేపణం
3) విస్థాపనం 4) హేతుకీకరణ
9. వ్యక్తి అహాన్ని వ్యాకులత, అగౌరవం, అపరాధ భావన నుంచి రక్షించే ప్రవర్తనా నమూనా?
1) అనుగుణ్యత 2) సర్దుబాటు
3) సంఘర్షణ 4) రక్షకతంత్రం
10. చాలా తక్కువ ఉద్యోగాలున్నా వేలమంది ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఇక నాకేం వస్తుందిలే అని ఇంటర్వ్యూకు హాజరుకాకపోవడంలో అనుసరించిన రక్షక తంత్రం?
1) ఉపసంహరణ 2) ప్రతిగమనం
3) ప్రేరకం తారుమారు 4) ఉదాత్తీకరణం
11. ఇతరులపట్ల తనకున్న ద్వేషభావాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో వారిపట్ల ప్రేమ ఉన్నట్లు నటించడం?
1) ప్రతిగమనం
2) హేతువాద వితరణ
3) ప్రతిచర్యా ఉద్భవం
4) తదాత్మీకరణం
12. ఆడలేక మద్దెల ఓటిది, పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనబడుతుంది అనే సామెతలను సూచించేది?
1) హేతుకీకరణం 2) ప్రక్షేపణం
3) ప్రతిగమనం 4) ఉపసంహరణ
13. అందని ద్రాక్ష పుల్లన, తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనే సామెతలను సూచించేది?
1) ప్రక్షేపణం 2) బౌద్ధీకరణం
3) హేతుకీకరణం 4) ఉదాత్తీకరణం
జవాబులు
1-1, 2-2, 3-2, 4-3, 5-3, 6-1, 7-3. 8-1, 9-4, 10-1, 11-3, 12-2, 13-3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు