లాబీయింగ్‌తో గెలిచిన విశాలాంధ్ర ( తెలంగాణ ఉద్యమ చరిత్ర )
విశాలాంధ్ర కోసం ప్రయత్నాలు
# కాంగ్రెస్ జాతీయ కార్యవర్గం, ఢిల్లీ: రాష్ట్రాలు సంప్రదించుకొని తగిన మార్పులు చేసుకోవచ్చు (ఆంధ్రపత్రిక, 1955, అక్టోబర్ 15)
విశాలాంధ్ర తీర్మానానికి పీడీఎఫ్ నిర్ణయం
# జాతీయ కాంగ్రెస్ కార్యవర్గ ప్రకటన విశాలాంధ్రవాదులకు ఊపిరిపోసింది. మరుసటి రోజే హైదరాబాద్ రాష్ట్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ విశాలాంధ్ర తీర్మానాన్ని శాసన సభ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. (ఆంధ్రపత్రిక 1955, అక్టోబర్ 17)
విశాలాంధ్ర వాయిదా పడకూడదు- అల్లూరి సత్యనారాయణరాజు ఆంధ్రా కాంగ్రెస్ అధ్యక్షుడు
# ఢిల్లీలో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు నవంబర్ మొదటి వారంలో ఫజల్ అలీ కమిటీ నివేదికను చర్చించక ముందే హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడితో విశాలాంధ్ర నిర్మాణం గురించి చర్చించాలనుకుంటున్నాను. అదేవిధంగా ఆంధ్ర, హైదరాబాద్ ముఖ్యమంత్రులు కూడా ఒక సమావేశాన్ని జరిపి ఈ విషయమై ఏకాభిప్రాయాన్ని సాధిస్తే బాగుంటుంది.
# ‘నాలుగైదేండ్ల అనంతరం విశాలాంధ్ర ఏర్పడవచ్చు. ఈలోగా అనేక ఆటంకాలు కలుగవచ్చు. భాషా రాష్ట్ర విచారణ సంఘం ఇచ్చిన సిఫారసుకు అప్పటికి కాలదోషం పట్టినా పట్టవచ్చు’ అని అల్లూరి సత్యనారాయణ రాజు అన్నారు. (ఆంధ్రపత్రిక 1955, అక్టోబర్ 19)
# విశాలాంధ్ర వాయిదా పడరాదు: తెలంగాణ భవిష్యత్తును ప్రస్తుత శాసనసభలే తేల్చాలి. ఐదేండ్ల వరకు లాగవలసిన పని లేకుండా ఇప్పుడే విశాలాంధ్రను ఏర్పాటు చేయడం ఆంధ్ర, తెలంగాణ ఉభయత్రా శ్రేయస్కరమని ఆంధ్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. తమ అభిప్రాయాలు, విశాలాంధ్ర వాంఛను కేంద్ర ప్రభుత్వానికి విన్నవించాలని నిర్ణయించారు. (ఆంధ్రపత్రిక 1955, అక్టోబర్ 20)
బూర్గులకు కమ్యూనిస్టుల విజ్ఞప్తి
# 1961 వరకు ఆగకుండా వెంటనే విశాలాంధ్రను ఏర్పాటు చేయాలని తెలంగాణ, ఆంధ్ర ప్రజలు దీన్నే అసందిగ్దంగా కోరుతున్నారని, ఈ సంగతిని భారత ప్రభుత్వానికి తెలిపి ఫజల్ అలీ నివేదిక సిఫారసుల్లో మార్పులు చేయాల్సిందిగా ఒత్తిడి తేవాలని బూర్గుల రామకృష్ణారావును విజ్ఞప్తి చేశారు. దీనిపై కమ్యూనిస్టుల పక్షాన ఎంపీలు బద్దం ఎల్లారెడ్డి, ప్రసాదరావు, ఎమ్మెల్యేలు ఆరుట్ల లక్ష్మీనరసింహారెడ్డి, సయ్యద్ అక్తర్ స్సేన్, డీ వెంకటేశ్వరరావు, మఖ్దూం మోహియుద్దీన్ సంతకాలు చేశారు. (ఆంధ్రపత్రిక 1955, అక్టోబర్ 22)
ఆంధ్ర సీఎం బెజవాడ గోపాల రెడ్డి ప్రయత్నాలు
# ఎస్ఆర్సీ నివేదిక వచ్చిన రోజు కమిషన్ సిఫారసులను ఆమోదించాలని బెజవాడ గోపాల రెడ్డి ఆంధ్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం హైదరాబాద్ వచ్చి తెలంగాణను కోరుతున్న చెన్నారెడ్డి ఇంటికి వెళ్లి కలిసి విశాలాంధ్రకు ఒప్పించడానికి ప్రయత్నం చేశారు. హైదరాబాద్‌లోని తెలుగు మంత్రులతో చర్చించి ‘మంత్రుల్లో ఎవరూ విశాలాంధ్ర నిర్మాణ సూత్రాన్ని ప్రతిఘటించడం లేదని, అయితే కొంతమంది అందుకు ఇంకా కొంతకాలం ఆగితే బాగుంటుందని భావిస్తున్నారని ఆంధ్రపత్రిక రాసింది. (1955, అక్టోబర్ 22)
విశాలాంధ్రవాదులను రెచ్చగొట్టే పనిలో ఆంధ్రపత్రిక
# ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో విశాలాంధ్ర ఏర్పాటుపై ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని ఆంధ్ర పత్రిక 1955, అక్టోబర్ 24న బ్యానర్ వార్తగా ప్రచురించింది.
విశాలాంధ్ర కోసం ఆంధ్ర, తెలంగాణ నాయకుల సంప్రదింపులు
# అక్టోబర్ 26న విశాలాంధ్ర విషయమై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నాయకులు హైదరాబాద్‌లో సమావేశమై రెండున్నర గంటలు చర్చించారు. ఉద్యోగాలు, అభివృద్ధి పథకాలు మొదలైన విషయాలన్నింటిలో తెలంగాణ ప్రజల భయాలను తొలగించే హామీలను సిద్ధం చేసుకునే ఆంధ్ర నాయకులు ఈ సమావేశానికి వచ్చినట్లు తెలుస్తుందని 1955, అక్టోబర్ 27న ఆంధ్రపత్రిక ప్రచురించింది.
విశాలాంధ్ర కోసం హైదరాబాద్ నగర కాంగ్రెస్ తీర్మానం
# ఫజల్ అలీ కమిషన్ విశాలాంధ్రకు ఆరేండ్లు గడువు పెట్టడం ఉభయ రాష్ట్రాల ప్రజల్లో అనిశ్చితమైన స్థితి ఏర్పడటమే కాక, ఉభయ ప్రభుత్వాలు కూడా స్థిమితం కోల్పోవడానికి కూడా దోహదమవుతుందని తీర్మానంలో పేర్కొన్నారు.
# ‘ఇప్పటివరకు సంస్థానంలోని కన్నడ, మరాఠా ప్రాంతాలు విడిపోయిన తరువాత చిన్న తెలంగాణ రాష్ట్రానికే ముఖ్యపట్టణంగా ఉండే హైదరాబాద్ నగరం ప్రతిపత్తి ప్రాముఖ్యం తగ్గడం మాత్రమే కాకుండా, పౌరుల ఆర్థిక జీవితం కూడా బాగా దెబ్బతింటుందని తీర్మానంలో పేర్కొన్నారు. (ఆంధ్రపత్రిక 1955, అక్టోబర్ 29)
విశాలాంధ్ర తక్షణం ఏర్పడాలి- బూర్గుల (ఆంధ్రపత్రిక 1955, అక్టోబర్ 30)
# ఫజల్ అలీ సిఫార్సులను ఆమోదించాలని, అమలు చేస్తామని నివేదిక రాగానే ప్రకటించిన బూర్గుల రామకృష్ణారావు ఎస్ఆర్సీ సభ్యుల సంతకాల తడి ఆరకముందే ఆంధ్ర నేతలతో గొంతు కలిపారు.
# 1955, అక్టోబర్ 28న పత్రికా ప్రతినిధులు ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావును కలిసినప్పుడు ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు.
# ‘ఈ సమస్యను ఇప్పుడు తేల్చుకోక ఐదేండ్లు వాయిదా వేస్తే రాష్ట్రం రాజకీయంగా అస్థిమితం కాగల ప్రమాదమున్నది. హైదరాబాద్ నగర ప్రాముఖ్యానికి తగినట్టుగా ఉండాలంటే అది 20 జిల్లాలయినా ఉండే ఒక పెద్ద రాష్ట్రానికి రాజధానిగా ఉండాలి కానీ, ఫజల్ అలీ సంఘం సూచించినట్లు తొమ్మిది జిల్లాలతో కూడిన చిన్న రాష్ట్రానికి కాదని నా అభిప్రాయం’.
# ఫజల్ అలీ సంఘం కనీసం దక్షిణ భారతదేశానికి సంబంధించినవరకైనా పునర్వ్యవస్థీకరణ ఇంచుమించు భాష ఆధారంగానే జరగడానికి అంగీకరించి ఉన్నది. కనుక దేశ హితం చూస్తే విశాలాంధ్ర ఏర్పడటమే చాలా వాంఛనీయమని అభిప్రాయపడింది. విశాలాంధ్ర వెంటనే ఏర్పడాలనే వ్యక్తిగతంగా నా ఉద్దేశం. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల కలయిక విషయంలో ఉండే కొన్ని చిక్కులను ఫజల్ అలీ సంఘం ఎక్కువగా ఊహించిందని కూడా నా అభిప్రాయం’ అని బూర్గుల అన్నారు.
# అక్టోబర్ 29న స్వామి రామానంద తీర్థ కూడా ‘తెలంగాణ ఎప్పటికీ బలిష్టంగా ఉండలేదు. దేశం మధ్యలో ఇలాంటి బలహీన రాష్ట్రం ఉండటం ప్రమాదకరం. విశాలాంధ్ర రాష్ట్రం భారత్ రిపబ్లిక్లో బలిష్టం, శక్తిమంతం అయిన రాష్ట్రంగా ఉండగలదు’ అని విలేకరుల సమావేశంలో వెల్లడించారు. (ఆంధ్రపత్రిక 1955, అక్టోబర్ 30)
ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమాలు
# తెలంగాణ రాష్ట్రం వెంటనే ఏర్పాటు చేయాలని వరంగల్‌లో నవంబర్ 1న హర్తాళ్ జరిగింది. విశాలాంధ్ర వద్దని నినాదాలిస్తూ విద్యార్థులు ఊరేగింపు నిర్వహించారు. (ఆంధ్రపత్రిక 1955, నవంబర్ 2)
తెలంగాణ కాంగ్రెస్ డెలిగేట్ల తీర్మానం
# హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ తెలంగాణ డెలిగేట్లు 105 మందిలో 75 మంది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నిర్మాణాన్ని కోరుతూ ఎస్ఆర్సీ నివేదికను 1955, నవంబర్ 2న ఆమోదించారు. ప్రత్యేక తెలంగాణను కోరుతూ మరి చెన్నారెడ్డి, విశాలాంధ్రను కోరుతూ వీబీ రాజు తీర్మానాలు ప్రవేశపెట్టారు.
మర్రి చెన్నారెడ్డి, హైదరాబాద్ రాష్ట్ర వ్యవసాయ మంత్రి
# ‘హిందీ ప్రజల తరువాత తెలుగు వారిదే దేశంలో ఎక్కువ సంఖ్య. అందువల్ల తెలుగువారికి రెండు రాష్ట్రాలు ఉండాలనే వాదం, మిగతా భాషల వారి విషయాల్లో కంటే ఎక్కువ సమర్థనీయం. రెండు తెలుగు రాష్ట్రాలుండాలనడానికి మర్రి చెన్నారెడ్డి రెండు ముఖ్య కారణాలు చెప్పాడు. మొదటిది ఇది కొందరు రాజకీయవాదులకు కాకపోయినా ప్రజలకు శ్రేయస్కరం. రెండోది రెండు రాష్ట్రాలు ఏర్పరిస్తే పరిపాలన మరింత కట్టుదిట్టంగా ఉండటానికి దోహద పడుతుంది.
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా వరంగల్‌లో నిరసన ప్రదర్శన
# హన్మకొండలో టీబీ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి 1955, నవంబర్11న ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని వరంగల్ విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థుల అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వానికి తెలుపుతామని నిరసనకారులకు బూర్గుల హామీ ఇచ్చారు.
హైదరాబాద్ పీసీసీ అధ్యక్షుడు జేవీ నర్సింగారావు తెలంగాణవాదం
# తెలంగాణ ప్రజల్లో అత్యధిక సంఖ్యాకులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతున్నారు. కాబట్టి రాష్ట్రాల పునర్విభజన సంఘం వారు నిష్పాక్షికంగా కావించిన ప్రబలమైన సిఫార్సులను ఆమోదించవలసిందిగా పీసీసీ అధ్యక్షుడు జేవీ నర్సింగారావు విజ్ఞప్తి చేశారు.
#అన్ని అవసరాలు తీరగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి నికరంగా 1.8 కోట్లు మిగులు ఉండగలదని నర్సింగరావు పేర్కొన్నారు. ఏ భాషగానీ ఒక రాజకీయాధిపత్యంలోనే అభివృద్ధి చెందాలన్న సిద్ధాంతం లేదు. సాంస్కృతికాభివృద్ధికి ఎల్లలు లేవు. రెండు తెలుగు రాష్ట్రాలయినా ఎందుకు సన్నిహిత సాంస్కృతిక సంబంధాలుంచుకోకూడదు. అందువల్ల ఈ విశాలాంధ్రవాదం ప్రజలను మభ్యపెట్ట కూడదు. ‘హైదరాబాద్ ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ప్రజలను పెడతోవన పెట్టేదిగా ఉంది. అందువల్ల ప్రత్యేక తెలంగాణ విషయంలో అధిక సంఖ్యాక వాదుల అభిప్రాయాన్ని తెలపాలనుకుని నా మౌనాన్ని భంగపరచాల్సి వచ్చింది’.
# ఎస్ఆర్సీ నివేదిక ప్రకటిచిన తరువాత ఇప్పటివరకు విశాలాంధ్ర కోరిన ఎమ్మెల్యేలు చాలా మంది నివేదికాంశాలను అంగీకరించే స్థితికి వచ్చారు. చాలా మున్సిపల్ కార్పొరేషన్లు కూడా ఇలానే అభిప్రాయాన్ని మార్చుకున్నాయి. భారత్ సమైక్యత దృష్టితో నిష్పాక్షికంగా శాస్త్రీయంగా ఎస్ఆర్సీ నివేదికాంశాలుండటమే ఇందుకు కారణం. కాంగ్రెస్ కమిటీల్లో 90 శాతం పైబడి పరిశిష్ట హైదరాబాద్ రాష్ట్రాన్ని కోరాయి. అనుబంధ సంస్థలు, కార్మిక ప్రతినిధులు, వెనుకబడిన జాతులవారు అనేకమంది ముస్లింలు కూడా వరిశిష్ట/పరిశిష్ట హైదరాబాద్‌నే కోరుతున్నారు. డీసీసీల కార్యకర్తలు, పీసీసీ డెలిగేట్ల అభిప్రాయాలు సేకరించిన తర్వాతే ఈ మాట అంటున్నాను. అభిప్రాయాలన్నీ ఇలా ఉంటే ప్రజలు పరిశిష్ట హైదరాబాద్‌ను కోరడం లేదని ఒంటెత్తు ప్రచారం జరగడం నవ్వు పుట్టిస్తున్నది.
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కోరుట్ల
9492 575 006
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు