తెలంగాణ ఉద్యమం – ప్రజాసంఘాలు ( తెలంగాణ ఉద్యమ చరిత్ర )
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడీఎఫ్)
# తెలంగాణ రాష్ట్ర సాధనకు తమవంతు తోడ్పాటును అందించే ఉద్దేశంతో 1999లో ఈ సంస్థ ఆవిర్భవించింది. దీన్ని అమెరికాలో మధు కే రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించడం, పుస్తకాలు ప్రచురించడం, తెలంగాణ సంస్కృతిపై వివిధ కార్యక్రమాలను చేపట్టడం, సెమినార్లు నిర్వహించడం, తెలంగాణ పండుగలు, వేడుకలను నిర్వహించడం ద్వారా తెలంగాణ ఉద్యమ భావజాలవ్యాప్తికి ఈ సంస్థ చాలా తోడ్పాటును అందించింది. దీంతోపాటు ప్రజలను చైతన్యం చేసి తెలంగాణను అభివృద్ధిచేయాలనే లక్ష్యంతో ‘తెలంగాణ డాట్ ఆర్గ్’ అనే వెబ్‌సైట్‌ను ఏర్పాటుచేసింది. ‘తెలంగాణ బాంక్వెట్ నైట్’ పేరుతో అమెరికాలో తెలంగాణ విషయాలపై అనేక సమావేశాలు నిర్వహించింది. వీటిలో ప్రసంగించేందుకు ప్రొ. మధుసూదన్ రెడ్డి, ఆర్ విద్యాసాగర్ రావు, ప్రొ. హరినాథ్, వీ ప్రకాశ్ లాంటి వాళ్లను ఆహ్వానించారు.
తెలంగాణ ఎన్నారై అసోసియేషన్
# అమెరికాతోపాటు ప్రపంచమంతటా తెలంగాణ గొంతు వినిపించడానికి, వారికి ఒక వేదిక కల్పించడానికి 2007లో తెలంగాణ ఎన్నారై అసోసియేషన్ (టీఈఎన్ఏ) ఏర్పడింది. ఈ సంస్థకు చైర్మన్ నారాయణ స్వామి వెంకటయోగి, అధ్యక్షుడు వెంకట్ మారోజు, ఉపాధ్యక్షుడు అమర్ కర్మిల్ల. ఈ సంస్థ తెలంగాణకు చెందిన కవులు, కళాకారులు, సాహిత్య, కళాసాంస్కృతిక, సామాజిక పరిశోధన రంగాలకు చెందిన వారిని ప్రోత్సహించేందుకు ప్రతి ఏడాది ఐదు పురస్కారాలను ప్రకటించింది. అవి…
1. తెలంగాణ సాహిత్యరంగంలో- కాళోజీ పురస్కారం
2. తెలంగాణ కళా సాంస్కృతిక రంగాల్లో అత్యుత్తమ రచనకు- చిందు ఎల్లమ్మ పురస్కారం
3. తెలంగాణ పరిశోధనా రంగంలో అత్యుత్తమ ఆవిష్కరణకు- ప్రొ. జయశంకర్ పురస్కారం
4. తెలంగాణ సామాజిక రంగంలో మార్పు కోసం- కుమ్రం భీం పురస్కారం
5. కొత్త రచనల ప్రోత్సాహానికి ప్రచురణ సహాయం కోసం- సురవరం ప్రతాపరెడ్డి పురస్కారం
# తెలంగాణ ఎన్ఆర్ఐలు సకల జనుల సమ్మెకు మద్దతుగా అమెరికా రాజధాని వాషింగ్టన్లో 2011, అక్టోబర్ 15న ‘తెలంగాణ కవాతు’ పేరుతో భారీ ప్రదర్శన నిర్వహించా రు. దీనిద్వారా తెలంగాణ సమస్యను కేంద్ర ప్రభుత్వం, అంతర్జాతీయ మీడియా దృష్టికి తీసుకువచ్చింది.
మెల్బోర్న్ తెలంగాణ ఫోరం (ఎంటీఎఫ్)
#ఇది 2013, ఆగస్టు 18న ఏర్పడింది. దీని వ్యవస్థాపక అధ్యక్షుడు నూకల వెంకటేశ్వర రెడ్డి. ఉపాధ్యక్షుడు అనిల్ దీప్ గౌడ్. ఈ సంస్థ 2013, 14లో తెలంగాణ అస్థిత్వ చిహ్నమైన ‘బతుకమ్మ’ పండుగను చాలా ఘనంగా నిర్వహించింది. 2015లో జరిగిన బతుకమ్మ సంబురాలకు మెల్బోర్న్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆర్థిక సహాయాన్ని అందించింది.
వైద్యుల పాత్ర
# గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు, దవాఖానల ఏర్పాటు, వైద్యుల నియామకం, మెడికల్ కాలేజీల ఏర్పాటు వంటి విషయాల్లో తెలంగాణ ప్రాంతం ఏవిదంగా వివక్షకు గురైందో గ్రహించిన తెలంగాణ వైద్యులు వివిధ సంఘాలను, జేఏసీని ఏర్పాటు చేసుకుని తెలంగాణ ప్రాతంలో ఉన్న వైద్యరంగ సమస్యలపై పోరాటం చేస్తూనే ఉద్యమంలో భాగంగా రాజకీయ జేఏసీ ఇచ్చిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీరితోపాటు పారామెడికల్ సిబ్బంది, ఇతర వైద్య సిబ్బంది తెలంగాణ ఉద్యమంలో భాగమయ్యారు. ఏ గోపాల కిషన్ అధ్యక్షతన తెలంగాణ డాక్టర్స్ ఫోరం, డా. రమేషన్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం, డా. బూర నర్సయ్య గౌడ్ ఆధ్వర్యంలో డాక్టర్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ వంటి సంఘాలు ఏర్పడ్డాయి.
# వైద్యులు తెలంగాణ ఉద్యమంలో భాగంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. తెలంగాణ వైద్య గర్జన పేరుతో తెలంగాణ బిల్లును వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలనే డిమాండ్‌తో 2010, జనవరి 22న ఉస్మానియా మెడికల్ కాలేజీలో బహిరంగ సభను నిర్వహించారు.
# రాజకీయ జేఏసీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా ప్రభుత్వ వైద్యులు విధులను బహిష్కరించారు. ‘పల్లె పల్లె పట్టాలపైకి’ కార్యక్రమంలో భాగంగా వైద్యులు పట్టాలపై పాలిక్లినిక్ పేరుతో ఉద్యమకారులకు వైద్య సేవలు అందించారు. మిలియన్ మార్చ్ కార్యక్రమంలో వైద్యులు తెల్ల దుస్తులతో పాల్గొన్నారు. వంటా వార్పు కార్యక్రమంలో బూర నర్సయ్య గౌడ్ ఆధ్వర్యంలో డాక్టర్స్ జేఏసీ సికింద్రాబాద్ క్లాక్‌టవర్ వద్ద పాల్గొన్నది. 42 రోజులపాటు జరిగిన సకల జనుల సమ్మెలో వైద్యుల పాత్ర ప్రధానమైనది. ఉచిత మెడికల్ క్యాంపులు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని ఉస్మానియా, కాకతీయ, గాంధీ మెడికల్ కాలేజీల్లో విద్యార్థులు, వైద్యులు నిరాహార దీక్షలు చేశారు.
# తెలంగాణ వైద్యుల జేఏసీ 2013, మే 15న వికారాబాద్‌లో ‘వైద్యుల శంఖారావం’ నిర్వహించింది.
కదిలిన కార్మిక లోకం
#మలిదశ తెలంగాణ ఉద్యమంలో కార్మికుల పాత్ర చాలా గొప్పది. రాజకీయ జేఏసీ చేపట్టిన ప్రతి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.
# సంఘటిత రంగాలు.. ఇందులో సింగరేణి, రోడ్డు రవాణా సంస్థ, సిమెంట్ కంపెనీ, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, వివిధ ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న సంఘటిత వర్గాలు ఉద్యమంలో ప్రధానపాత్ర పోషించాయి. ఇందులో సింగరేణి, ఆర్టీసీ కార్మికులు ముఖ్యులు. సహాయ నిరాకరణ ఉద్యమంలో తమ విధులను బహిష్కరించారు. మిలియన్ మార్చ్ కార్యక్రమంలో వీరితోపాటు విద్యుత్, మున్సిపల్ కార్మికులు ప్రదర్శించిన తెగింపు అన్ని వర్గాల ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపింది. సింగరేణి కార్మికులు దాదాపు 35 రోజులపాటు బొగ్గు ఉత్పత్తిని స్తంభింపచేసి మొత్తం దేశానికే తమ ప్రాముఖ్యతను చాటిచెప్పారు. సెప్టెంబర్ 13న సకల జనుల సమ్మెలోకి దిగిన సింగరేణి అక్టోబర్ 17 వరకు 35 రోజులు పాల్గొని అక్టోబర్ 18న సమ్మె విరమించింది.
# ఆర్టీసీ కార్మికులు కూడా 2011, సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 16 వరకు 27 రోజులపాటు సకల జనుల సమ్మెను కొనసాగించి చరిత్ర సృష్టించారు.
# అసంఘటిత రంగాలు.. ఆంధ్ర వలసాధిపత్యం వల్ల జరిగిన దోపిడీని అర్థమయ్యే లా చేసిన కళారూపాలు, పాటల వల్ల అసంఘటిత రంగాల్లో ఉన్న తెలంగాణ బిడ్డలు కూడా రాష్ట్ర సాధన ఉద్యమం లో భాగమయ్యారు. అసంఘటిత రంగాల్లో ప్రధానంగా భవన నిర్మాణ రంగాల్లో పనిచేస్తున్నవారు, హోటల్, ఆటో రిక్షా కార్మికులు, బీడీ కార్మికులు, పేపర్ బాయ్స్ వంటివారే కాకుండా మరెంతో మంది ఉద్యమంలో మమేకమయ్యారు. మిలియన్ మార్చ్, సహా య నిరాకరణ ఉద్య మం, సాగరహారం, సకల జనుల సమ్మెలో వీరి పాత్ర చాలా గొప్పది. హైదరాబాద్ కేంద్రం గా జరిగిన చాలా కార్యక్రమాలను విజయవంతం చేయడంలో వీరు చాలా కృషిచేశారు. 2010, మే 23న ప్రైవేట్ సెక్టార్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన సదస్సు జరిగింది. 2012, జూలై 19న భూమి పుత్రుల పాదయాత్ర పేరుతో తెలంగాణ ప్రైవేట్ సెక్టార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర సాధన కోసం యాత్రను నిర్వహించింది.
# తెలంగాణ ఉద్యమంలో పౌరసంఘాలు లేదా ప్రజా సంఘాలకు విశిష్ట స్థానం ఉంది. రాజకీయ ఉద్యమం స్తబ్ధతకు గురై తెలంగాణ ప్రజానీకం నిరాశ, నిస్పృహలకు లోనైన ప్రతి సందర్భంలోనూ ప్రజా సంఘాలు ప్రధానపాత్ర పోషించాయి. నిరంతరం ప్రజలను చైతన్యం చేస్తూ, తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని ప్రజల్లోకి చొప్పించి పోరాట మార్గాన్ని పట్టించాయి. 1996, నవంబర్ 1న వరంగల్‌లో భూపతి కృష్ణమూర్తి, జయశంకర్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అవతరణను నిరసిస్తూ సభ నిర్వహించారు. ఈ సభలో తెలంగాణ పట్ల జరుగుతున్న అనేక రకాల వివక్షలపై చర్చించారు. 1997, నవంబర్ 1న మొజంజాహీ మార్కెట్, అశోకా టాకీస్‌లో ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఎక్స్ప్రెషన్ పేరుతో సభను నిర్వహించారు. గులాం రసూల్ ఎన్‌కౌంటర్‌ను ఖండిస్తూ కవులు, కళాకారులు జరిపిన ఈ సభలోనే తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి చర్చించారు. ఈ సభలో గద్దర్ రాసిన ‘అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా’ అనే పాటను తొలిసారిగా వినిపించాడు.
#తెలంగాణ ప్రాంతంలోని ప్రజల బాధలు, గాథలను ప్రపంచానికి తెలియజెప్పింది భువనగరి సభ. ఇది 1997, మార్చి 8, 9 తేదీల్లో జరిగింది. ఈ సభలో తెలంగాణ భాషా సాహిత్యాలపై, ఆర్థిక, రాజకీయ అంశాలపై కూడా చర్చించారు. రచయితలు, కవులు, కళాకారులు, అధ్యాపకులు, జర్నలిస్టులు కలిసి ‘సాహితీ మిత్ర మండలి’గా ఏర్పడి ఈ సభను నిర్వహించారు. ‘దగాపడ్డ తెలంగాణ’ పేరుతో జరిగిన ఈ సభ ప్రజలపై విశేష ప్రభావాన్ని చూపింది. 1997, ఏప్రిల్‌లో సూర్యాపేటలో జరిగిన తెలంగాణ మహాసభ తెలంగాణ ఉద్యమంలోకి కొత్త ప్రశ్నను తీసుకువచ్చింది. బహుజన కులాల నుంచి వచ్చిన నాయకత్వమే తెలంగాణ ఉద్యమంలో నిజాయితీగా పోరాడగలదని ‘తెలంగాణ మహాసభ’ విశ్వసించింది. ముఖ్యంగా ఈ సభ నుంచి వెలుగులోకి వచ్చిన వ్యక్తి, ఈ సభను వెనుక ఉండి నడిపిన వ్యక్తి మారోజు వీరన్న.
# తెలంగాణ భావజాల ప్రచారం కోసం జరిగిన సభల్లో ముఖ్యమైనది ‘వరంగల్ డిక్లరేషన్ సభ’. అనేక ప్రజా సంఘాల కలయికతో ‘అఖిల భారత ప్రజా ప్రతిఘటన వేదిక’ ఆధ్వర్యంలో 1997, డిసెంబర్ 28న వరంగల్‌లో ఈ సభ జరిగింది. ఈ సభలోనే కాళోజీ లాంటి కవులు, కళాకారులు అనేక సంస్థలు కలిసి వరంగల్ డిక్లరేషన్‌ను విడుదల చేశారు. 1997, సెప్టెంబర్ 28న ప్రొ. జయశంకర్, ప్రొ. కేశవరావ్ జాదవ్ ఆధ్వర్యంలో విడివిడిగా పనిచేస్తున్న 28 సంఘాలు కలిసి ‘తెలంగాణ ఐక్య వేదిక’గా ఏర్పడ్డాయి. తెలంగాణ భావజాల ప్రచారంలో ఈ సంస్థ తనవంతు పాత్ర పోషించింది. 1998, ఫిబ్రవరి 14, 15లో చైతన్య వేదిక ఆధ్వర్యంలో సిద్దిపేటలో సదస్సు జరిగింది. ఇందులో ప్రజాకళామండలి మొదటిసారిగా తెలంగాణపై పాటల పుస్తకాన్ని విడుదల చేసింది. అదేవిధంగా 2004, మార్చిలో ఏర్పడిన తెలంగాణ విద్యావంతుల వేదిక భావజాల వ్యాప్తిలో విశేష కృషి చేసింది. ఈ సమయంలోనే 50కిపైగా ప్రజా సంఘాలు కలిసి ‘తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ’గా ఏర్పడ్డాయి. 2007-08 మధ్య తెలంగాణ భావజాలం ప్రజల్లో సజీవంగా ఉంచడానికి ఈ సంస్థ విశేషంగా కృషి చేసింది.
# 2010, అక్టోబర్ 9న కొన్ని ప్రజాసంఘాలు కలిసి తెలంగాణ ప్రజా ఫ్రంట్‌గా ఏర్పడ్డాయి. పార్లమెంటరీ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా ఈ సంస్థ పనిచేసింది. వీటితోపాటు 1969లో ఆమోస్ ఆధ్వర్యంలో ఏర్పడిన టీఎన్జీఓ సంఘం, గాదె ఇన్నయ్య ఆధ్వర్యంలోని తెలంగాణ స్టడీ సర్కిల్, బెల్లయ్యనాయక్ నాయకత్వంలోని తెలంగాణ సంఘర్షణ సమితి, కేశవరావ్ జాదవ్, విమలక్క నేతృత్వంలోని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ వంటి చాలా సంస్థలు తమ పంథాలో ఉద్యమంలో పాల్గొన్నాయి.
#ఈ క్రమంలో తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా తెలంగాణ వ్యాప్తంగా 200లకు పైగా ఉద్యమ సంస్థలు ఏర్పాటయ్యాయి. ఈ సంస్థల పోరాటమే 2001లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడానికి ప్రేరణ అని చెప్పవచ్చు.
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కోరుట్ల
9492 575 006
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు