భారత, తెలంగాణ చరిత్ర, సంస్కృతి
గ్రూప్:I పేపర్-2
# చరిత్రకు సంబంధించి పేపర్-2లో భారతదేశ, తెలంగాణ సామాజిక సాంస్కృతిక ఉద్యమ చరిత్రలకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారు. అభ్యర్థులు చరిత్రను సామాజిక, సాంస్కృతిక కోణంలో చదివి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రిలిమినరీ పరీక్ష
# ఇందులో ఉత్తీర్ణులైతేనే మెయిన్స్ పరీక్షలు రాయడానికి అర్హత లభిస్తుంది. ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి సిలబస్లో ప్రకటించిన 13 విభాగాల్లోని 2 భాగాలు చరిత్రకు సంబంధించినవి ఉన్నాయి. అవి:
1. భారతదేశ చరిత్ర, సంస్కృతి-వారసత్వం
2. తెలంగాణ సామాజిక, సాంస్కృతిక వారసత్వం, కళలు, సాహిత్యం.
# ఈ విభాగానికి సంబంధించి ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పేపర్-II, పేపర్-IVలో పొందుపర్చిన సిలబస్ ప్రకారం లోతుగా అధ్యయనం చేయాలి. ప్రిలిమినరీ పరీక్షలో చరిత్ర నుంచి 20-25 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
పేపర్-I జనరల్ ఎస్సే
#ఇందులో 3 సెక్షన్లు ఉన్నాయి. రెండో సెక్షన్లోని రెండు ఉపవిభాగాల్లో ఒకటి చరిత్రకు సంబంధించింది. అదే.. భారతీయ చారిత్రక, సాంస్కృతిక వారసత్వం.
పేపర్-II: భారతదేశ, తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్రపై అభ్యర్థులు అవగాహన పెంపొందించుకోవాలి. పేపర్-IIలో 150 మార్కులకు గానూ 100 మార్కులు చరిత్ర నుంచి వస్తాయి.
# సింధూ సంస్కృతి లక్షణాలు లేదా సింధూ నాగరికతకు, ఆర్యుల నాగరితకు పోలికలు-తేడాలు మొదలైన ప్రశ్న ల్ని అడిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి సింధూ సంస్కృతి, ఆర్య సంస్కృతి లక్షణాలపై అవగాహన పెంచుకోవాలి. తొలి, మలి వేదకాల సంస్కృతులకు సంబంధించిన సామాజిక, ఆర్థిక, మత పరిస్థితుల్ని అధ్యయనం చేయాలి.
# జైన, బౌద్ధ మతాల సిద్ధాంతాలు, సమాజంపై వాటిప్రభావం అనే ప్రశ్నవస్తే మత సిద్ధాంతాలు, అవి సమాజంపై, వైదిక మతంపై రాజకీయ వ్యవస్థపై ఎలాంటి ప్రభావాన్ని కలిగించాయో రాయాలి. దీంతోపాటు క్రీ. పూ.6వ శతాబ్ది భారతదేశంలో మతోద్యమాలు రావడానికి గల కారణాలు ఏమిటి అనే ప్రశ్నకు నాటి సమాజంలో నెలకొన్న హింసాయుత, అశాంతి పరిస్థితులు, ఆడంభరత్వంతో కూడిన యజ్ఞయాగాదులు, కర్మకాండలు మొదలైన ఇతర అంశాలు రాయాల్సి ఉంటుంది.
# మౌర్యులు, శాతవాహనుల, కుషాణుల, గుప్తుల కాలా ల నాటి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, సాహిత్య, వాస్తుశిల్ప కళలను గురించి అధ్యయనం చేయాలి. ఉదాహరణకు గుప్తుల గురించి చదువుతున్నప్పుడు చిత్రలేఖనం, వాస్తు శిల్పకళలు, లోహకార కళ, సాహి త్యం, నవరత్నాలు, వారి రచనలు క్షణ్ణంగా అధ్యయనం చేయాలి. అశోక దమ్మ గురించి కూడా చదవాలి. గాంధారశిల్పకళపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి.
#ఇస్లాం మతం పుట్టుక, సిద్ధాంతాలు, భారతీయ సమాజం పై ప్రభావం (అంటే సమాజంపై, వాస్తు శిల్పకళలపై) అం శాలను అవలోకనం చేసుకోవాలి.
#భక్తి, సూఫీ ఉద్యమాలు, సమాజంపై వాటి ప్రభావం గురించి చదివేటప్పుడు దక్షిణ భారతదేశంలో క్రీ.శ. 6-9 శతాబ్దాల మధ్య తమిళనాడులో ఆళ్వారులు, నయనార్లు, తిరుమంగై ఆళ్వారు, నమ్మళ్వారు, తిరుప్పన్ ఆళ్వారు, ఆండాళ్ అనే స్త్రీ ఆళ్వారు మొదలైన 12 మంది ఆళ్వారులు, మణిక్కవసగర్, తిరునవక్కరసు (అప్పర్), జ్ఞానసంబంధార్ మొదలైన నయనార్ల గురించి తెలుసుకోవాలి. అదేవిధంగా ఆదిశంకరాచార్య, రామానుజాచార్యుడు, జ్ఞానేశ్వర్ వల్లభాచార్యుడు, మీరాబాయి, తులసీదాసు, చైతన్యుడు, సమర్ధరామదాసు, నిర్గుణభక్తి, సుగుణ భక్తి, కబీర్, గురునానక్ల గురించి చదవాలి.
సూఫీ ఉద్యమం
# సూఫీ ఉద్యమం మధ్యయుగంలో మొదట ఉత్తర భారతదేశంలో, అనంతరం దక్షిణ భారతదేశంలో వ్యాపించింది. సూఫీ అర్థం, పదజాలం, నాటి సిల్సిలాలు (చిష్తీ, సుహ్రావర్ధి, ఖాద్రీ, నక్షాబందీ, షత్తారి శాఖల గురించి చదవాలి), సూఫీ సన్యాసులైన షేక్ మొయినుద్దీన్ చిష్తీ, హజ్రత్ నిజాముద్దీన్, బాబా ఫరీదుద్దీన్, కుతుబుద్దీన్ భక్తియార్ కాకిల గురించి చదవాలి.
# ఢిల్లీ సుల్తానుల పరిపాలన, వాస్తుశిల్ప కళలు, సాహిత్యాంశాల్ని అధ్యయనం చేయాలి.
#మొగలుల కాలంలో అక్బరు, ఔరంగజేబు మతవిధానాలు తప్పకుండా చదవాల్సి ఉంటుంది. ఉదా౹౹ అక్బరు రాజపుత్ర విధానం, హిందూ తీర్ధయాత్రికులపై పన్నురద్దు, బలవంతపు మత మార్పిడులు, జిజియాపన్ను రద్దు, ఇబాదత్ ఖానా, దిన్-ఇ-ఇలాహీ స్థాపన, రాజపుత్ర స్త్రీలను అక్బర్ వివాహమాడటం, రాజపుత్రులకు కొలువులో ఉన్నతోద్యోగాలివ్వడం (ఉదా౹౹ రాజా భగవాన్దాస్, రాజా మాన్సింగ్, రాజా బీర్బల్, రాజా తోడర్మల్), మొగలుల కాలంలోని వాస్తుశిల్ప చిత్ర కళలు, సాహిత్యాలను క్షుణ్ణంగా చదవాలి.
#భారతదేశంలో ప్రాచీన మధ్యయుగాల్లో నిర్మించబడిన దేవాలయాలను గురించి చదువుతున్నప్పుడు వాటి శైలిల్ని (నగర శైలి, ద్రావిడశైలి, వేసర శైలి) తెలుసుకోవాలి.
# విజయనగర రాజుల కాలంలో సామాజిక, మత, ఆర్థిక, సాంస్కృతిక, వాస్తు శిల్పకళల్ని ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. నాటి సమాజంలో స్త్రీ స్థానం, తెలుగు భాషా సాహిత్యా లు, అష్టదిగ్గజాలు వారి రచనలు, దేవాలయాలు, చిత్రలేఖనం, సం గీత, నృత్య కళలు మొదలైన అంశాలపై దృష్టిసారించాలి.
#బ్రిటీష్ వారి పాలనా విధానాలు, భారతదేశంపై వాటి ప్రభావం, శాశ్వత శిస్తు పద్ధతి, మహల్వారీ విధానం, సైన్యసహకార పద్ధతి, రాజ్యసంక్రమణ సిద్ధాంతం, విలియం బెంటింగ్, డల్హౌసీ, రిప్పన్, కర్జన్ సంస్కరణలు, విధానాలు చదవాలి.
# 1857 తిరుగుబాటు కారణాలు, ఫలితాలు.
# భారత జాతీయోద్యమానికి/జాతీయవాదానికి గల కారణాలు తెలుసుకోవాలి.
# క్రీ.శ.19, 20వ శతాబ్దాల్లో భారతదేశంలో జరిగిన కుల, మత, సాంఘిక ఉద్యమాల మీద ప్రశ్నలడిగే అవకాశం ఎక్కువగా ఉంది. రాజా రామ్మోహన్రాయ్, దయానంద సరస్వతి-ఆర్యసమాజం, దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవచంద్రసేన్, ఆత్మారాం పాండురంగ-ప్రార్థనా సమాజం, దివ్యజ్ఞానసమాజం, రామకృష్ణ పరమహంస, స్వామీ వివేకానంద, జ్యోతిబాపూలే, రామస్వామి నాయర్, నారాయణగురు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ల గురించి చదవాలి. అదేవిధంగా హరిజనోద్ధరణకు గాంధీజీ, అంబేద్కర్ కృషి, జాతీయోద్యమంలోని మూడుదశలైన మితవాదులు, అతివాదులు, గాంధీల పాత్ర, వందేమాతరం, సహాయనిరాకరణ, హోంరూల్, శాసనోల్లంఘన, క్విట్ ఇండియా ఉద్యమాల గురించి లోతుగా అధ్యయనం చేయాలి. సామ్యవాద, కమ్యూనిస్టు ఉద్యమాలు, సైమన్ కమిషన్, మతతత్వ అభివృద్ధి, భారతదేశ విభజనకు దారితీసిన పరిస్థితులు మొదలైన వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే విజయం మీ సొంతం అవుతుంది.
తెలంగాణ చరిత్ర సంస్కృతి
# ప్రాచీన తెలంగాణ చరిత్ర సంస్కృతి ముఖ్యంగా శాతవాహనుల, ఇక్షాకుల కాలంలోని సామాజిక, మత, సాం స్కృతిక పరిస్థితులు, భాషాసాహిత్యాలు, వాస్తుశిల్పి గురించి ఆమూలాగ్రం చదవాలి.
#ఉదా౹౹ శాతవాహనుల గురించి చదివేటప్పుడు.. సాం ఘిక వ్యవస్థ, వర్ణాశ్రమ విధానం, కుటుంబ జీవనం, సమాజంలో స్త్రీ స్థానం, నాటి వినోదాలు, వైదికమత ఆదరణ, జైన, బౌద్ధ మతాలకు లభించిన ఆదరణ, భాషా సాహిత్యాలకు సంబంధించిన విషయాల్ని అధ్యయనం చేయాలి (శాతవాహనుల కాలంలో రాజభాష , శాసనభాషగా ప్రాకృతం వర్ధ్దిల్లినప్పటికీ, కుం తల శాతకర్ణి కాలంలో సంస్కృతానికి ఆదరణ పెరిగింది) ‘గాథాసప్తశతి’లో సమాజం, స్త్రీలు, కవులు, కవయిత్రుల గురించిన ప్రస్తావనల్ని ఉదహరించాలి. కాతంత్రవ్యాఖ్యానం, గాథాసప్తశతి, కామసూత్రాలు, లీలావతి పరిణయం, బృహత్కథ ఆధారంగా తర్వాతికాలంలో వచ్చిన గ్రంథాలు, దాతుగర్భ, పారిభోజక, ఉద్దేశిక స్థూపాలు, తోరణాలు మొదలైన వాటిపై దృష్టిపెట్టాలి.. శాతవాహనుల కాలం గుహలకు ప్రసిద్ధి (నాసిక్, కార్లే, భేజా, భాడ్సా) చైత్యాలు, విహారాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవాలి.
#తెలంగాణలో జైన, బౌద్ధ మతాల ఆవిర్భావం, అభివృద్ధి సాహిత్యం, వాస్తు శిల్పకళల్ని గురించి చదవాలి. ఉదా౹౹ తెలంగాణలో జైనకేంద్రాలు (వేములవాడ, మునులగుట్ట-కరీంనగర్, కొలనుపాక-నల్లగొండ, పటాన్చెరు-మెదక్, హనుమకొండ-వరంగల్, బోధన్-నిజామాబాద్ మొదలైనవి) ముదిగొండ చాళుక్యులు, కాకతీయుల పాలనలో జైనం ఫరిడవిల్లడం, రుషభనాథుని కుమారుడైన బాబలి పొదన/పౌదన్యపురంను రాజధానిగా చేసుకొని పాలించడం . వీటితోపాటు జైనసాహిత్యం చదవాలి.
#బౌద్ధాన్ని ఆదరించిన ముఖ్యప్రాంతాలైన శ్రీపర్వతం (నాగార్జునకొండ, కోటిలింగాల, నేలకొండపల్లి, ఏలేశ్వరం, శాతవాహనుల, ఇక్షాకులు కాలంలో రాజులు, రాణులు అందించిన ప్రోత్సాహం, బుద్ధుని ముఖ్యశిష్యుల్లో ఒకరైన కొడనాగు (కౌండిన్య) తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి. వీటితోపాటు బౌద్ధసాహిత్యాలను చదవాలి.
#కాకతీయులు: వీరికాలానికి చెందిన సామాజిక, సాం స్కృతిక పరిస్థితులు, భాష, సాహిత్యం, నృత్యం, వాస్తుశిల్పకళలు అధ్యయనం చేయాలి. సమ్మక్క-సారక్క, సర్దార్ సర్వాయి పాపన్న, తెలుగు భాషా సాహిత్య వికాసానికి కుతుబ్షాహీలు చేసిన సేవల్ని అధ్యయనం చేయాలి.
# ఉదా౹౹ కాకతీయులకు సంబంధించి సామాజిక వ్యవ స్థ, కులం-కులాల అభివృద్ధి, సమాజంలో స్త్రీ స్థానం, దేశీయ, విదేశీయ వాణిజ్యాలు, పరిశ్రమలు, పన్నుల వ్యవస్థ, కాకతీయుల సమాజంలో పాశుపతశైవం, వైష్ణవం, జైన, బౌద్ధమతాలు సంస్కృత, తెలుగు సాహిత్యాలు, కాకతీయులు వాస్తుశిల్పకళలు, మత, మతేతర నిర్మాణాలు మొదలైన అంశాలను విస్తృతంగా అధ్యయనం చేయాలి.
# కుతుబ్ షాహీలు: కుతుబ్షాహీల కాలంలో రాజభాష- పర్షియన్. అయితే వీరికాలంలో ఉర్దూ అభివృద్ధి చెం దిన విధానం, మహమ్మద్ కులీ స్వయంగా ఉర్దూ కవి, కులీకుతుబ్ షా పర్షియన్ భాషలో గొప్ప పండితుడు మొదలైన అంశాలను ఉదహరిస్తూ సమాధానం రాయాలి. తెలుగు భాషాభివృద్ధికి వారు చేసిన కృషిని వివరించాలి.
#ప్రజోపకరమైన తటాకాల నిర్మాణం, విశాల రహదారులు, సుందర నగరాల నిర్మాణం, భాగ్యనగర్, చార్మినార్, హయత్నగర్, పురానాపూల్ వంతెన, ఇబ్రహీంపట్నం చెరువు, ఇబ్రహీంబాగ్, గోల్కొండ దుర్గ ప్రాకారం మొదలైన నిర్మాణాలు చేశారు.
అసఫ్ జాహీలు
# సాలార్జంగ్ సంస్కరణలకు సంబంధించి, పరిపాలనా, ఆర్థిక, రెవెన్యూ, న్యాయ, రవాణా ఇతర సంస్కరణల్ని తప్పకుండా చదవాలి. మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆర్థిక, పారిశ్రామిక విధానా లు, నిర్మాణాలు, అసఫ్జాహీల కాలంనాటి వివిధ పరిస్థితులు, ముల్కి నిబంధనలు మొదలైన అంశాలను అధ్యయనం చేయాలి.
#హైదరాబాద్ రాష్ట్రంలో 1857 తిరుగుబాటు నాటి పాలకుడు అఫ్జలుద్దౌలా, ప్రధానమంత్రి సాలార్జంగ్లు ఆంగ్లేయులకు మద్దతునివ్వడం, మౌల్వి ఇబ్ర హీం, మౌల్వీ అల్లా ఉద్దీన్, తురేబాజ్ఖాన్ పాత్రలను అవగాహన చేసుకోవాలి.
# తెలంగాణలో సామాజిక సాంస్కృతిక చైతన్యం- చందా రైల్వేపథకం, ఆందోళనలు, తెలంగాణ సామాజిక చైతన్యంలో పత్రికలు పొషించిన పాత్ర, తెలంగాణలో విద్యాపరమైన చైతన్యం, గ్రంథాలయోద్యమం మొదలైన వాటితోపాటు, నిజాం రాష్ట్ర ఆంధ్రజనసం ఘం, ఆంధ్రమహాసభ, బ్రహ్మసమాజం, ఆర్యసమా జం, ఆదిహిందూ, దళితోద్యమాలు-భాగ్యరెడ్డి వర్మ పాత్ర, ఆంధ్ర మహిళాసభ, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతర ఉద్యమం, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ మొదలైన అంశాలపై అవగాహన తప్పనిసరి.
#నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన ప్రజాఉద్యమం-ఆదివాసీల తిరుగుబాటు-రాంజీగోండు, కొ మురంభీం, సాయుధపోరాటం-ఆంధ్ర మహాసభ పాత్ర, కమ్యూనిస్టుల పాత్ర. పాల్గొన్న నాయకులు.
#ఎంఐఎం కార్యాకలాపాలు, రజాకార్లు, కాశీంరజ్వీ పాత్ర, పోలీసు చర్య-నిజాం పాలన అంతం. ‘ఆపరేషన్ పోలో’, హైదరాబాద్ ఇండియన్ యూనియన్లో కలవడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర మొదలైన అంశాలను ఆకళింపు చేసుకోవాలి.
మధుసూధన్ బోయిన
సీనియర్ ఫ్యాకల్టీ,హిస్టరీ
నారాయణ ఐఏఎస్ అకాడమీ
9440082663
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు