భారతదేశ చరిత్ర….సాంస్కృతిక అంశాలకే ప్రాధాన్యం -1
రాష్ట్రంలోను.. దేశంలోను ప్రతి పోటీ పరీక్షలో తప్పనిసరిగా ఉండే అంశం భారతదేశ చరిత్ర. సింధూ నాగరికత కాలంనుంచి ఆధునిక ప్రజాస్వామిక వ్యవస్థ ఏర్పాటు వరకు పూర్తిగా లేదా కొన్ని భాగాలైనా అన్ని పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ రూపొందించిన నూతన సిలబస్‌లో చరిత్రకు మిగతా అన్ని సబ్జెక్టులకంటే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఇందులో ముఖ్యంగా సాంస్కృతిక చరిత్రను హైలెట్ చేశారు. ఈ నేపథ్యంలో చరిత్రను అర్థవంతంగా ఎలాం చదవాలి? ఏ విభాగాన్ని ఎలా అర్థంచేసుకోవాలి? అత్యధిక మార్కులు సాధించేదెలా అనే అంశాలపై నిపుణ పాఠకుల కోసం ఈ వారం..
# భారతదేశ చరిత్ర-సంస్కృతి: ప్రతి జనరల్ స్టడీస్‌లో తప్పనిసరిగా ఉండే అంశం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మారిన సిలబస్‌లో గ్రూప్-1 పేపర్1, 2లో-75 మార్కులు, గ్రూప్-2 పేపర్-1, 2లో 40 మార్కులకు ఇండియన్ హిస్టరీకి కేటాయించారు. గ్రూప్-3, గ్రూప్-4 ఇలా ప్రతి పోటీ పరీక్షల్లో జనరల్ స్టడీస్‌లో ఇండియన్ హిస్టరీకి ప్రాధాన్యత కల్పించారు.గ్రూప్-2లో 25 నుంచి 30 మార్కులు, గ్రూప్-1 మెయిన్స్‌లో 90 శాతం వరకు కల్చరల్ అంశాలమీదే ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. రాజకీయ అంశాలు పరిగణనలోకి తీసుకుంటూనే సాం స్కృతిక అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. రాజులు, రాజ్యాలు, యుద్ధాలు, సంఘటనలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా సమాజం-మహిళ పరిస్థితి, ఆలయ నిర్మాణం, శిల్పశైలి, భాష, సాహిత్యాల అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.
#చరిత్ర: గతకాలపు సంఘటనల వివరణ, భూత, భవిష్యత్, వర్తమాన అంశాల వారధి. శాసనాలు, నాణేలు, నిర్మాణాలు, గ్రంథాలు చరిత్రకు ప్రధాన ఆధారాలు. ఈ ఆధారాల ఆధారంగా నిర్మించబడినదే చరిత్ర. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. వారి తీపి గుర్తులు మాత్రమే మిగిలాయి. ఆ తీపి గుర్తులే చరిత్రను నిర్మించాయి. భారతదేశ చరిత్ర-సంస్కృతిలో సింధూ నాగరికత మొదలు 1947 వరకు ప్రతీ అంశాన్ని సిలబస్‌లో చేర్చారు.
# సింధూ నాగరికత : 1921-22లో వెలుగులోకి వచ్చిన ఈ నాగరికత భారతదేశ చరిత్రలో తొలి నాగరికత. ఈ నాగరికత అవశేషాలు కొన్ని వందల ప్రాంతాల్లో బయటపడినప్పటికీ 15 ప్రాంతాల్లో దొరికిన అవశేషాలు మాత్రమే ముఖ్యమైనవి. హరప్పా, మొహంజదారో, చాన్హుదారో, కాళిభంగన్, లోథాల్, బన్వాలి, సుర్కటోడా, రంగాపూర్, దోలవీరా వంటి ప్రాంతాల వివరాలు ప్రధానమైనవి. ఇక్కడ చదవాల్సిన అంశాలు లోథాల్లో దొరికిన జంట ఖననం, సతీసహగమనానికి ఆధారం. మొహంజదారోలో దొరికిన నాట్యకత్తె విగ్రహం దేవదాసి వ్యవస్థకు ఒక సూచిక. అమ్మతల్లి, పశుపతి ఆరాధన (చరిత్రలో కన్పించే మొదటి శివారాధన), పాము, పావురం, రావిచెట్టు, యోని, లింగపూజలు వంటి సంస్కృతి అంశాలకు ప్రాధాన్య మివ్వాలి. మృతసంస్కారాలు, సర్పలేఖన లిపి, స్వస్తిక్ గుర్తులు, దొరికిన జంతువులు, పట్టణ నాగరికత ముఖ్యలక్షణాలు అధ్యయనం చేయాలి.
# ఆర్య నాగరికత: భారత దేశ సాహిత్యానికి ప్రధాన ఆధారం వేదసాహిత్యం. ఈ వేద సాహిత్యం నుంచే మిగతా సాహిత్యం పుట్టింది. నాలుగు వేదాలు, వాటి అనుబంధాలు సంహితలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు ఉపవేదాలైన ఆయుర్వేదం, ధను, గాంధార, శిల్పవేదాలు, వేదాంగాలు, షడ్దర్శనాలు, ఇతిహాసాలు చదవాలి. అలాగే రుగ్వేద, మలివేద కాలంలో సాంఘిక వ్యవస్థ ప్రధానమైనది. రుగ్వేదంలోని 10వ మండలం పురుషసూక్తంలో వర్ణవ్యవస్థ గురించి మొదటిసారిగా పేర్కొనబడింది. అధర్వణ వేదంలో గోత్ర వ్యవస్థ గురించి పేర్కొనగా అది తర్వాత కాలంలో కుల వ్యవస్థకు రూపకల్పన అయింది. యజ్ఞయగాది క్రతువుల నిర్వహణ, సంగీతానికి ఆధార గ్రంథాలు కూడా ఈ వేదాలే. ఇక్కడ రాజకీయ వేద నాగరికత కాకుండా సాహిత్యం, వేదకాలంలో మహిళ పరిస్థితి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఉదా: రుగ్వేద కాలంలో మహిళకు పురుషునితోపాటు సమాన హోదా ఇవ్వగా మలివేదకాలంలో స్త్రీ పరిస్థితి దిగజారింది. అపాల, విశ్వవర, గార్గి, మైత్రేయి వంటి స్త్రీల గురించి, మత విధానం గురించి అధ్యయనం చేయాలి.
#షోడశ మహాజనపదాలు : 16 మహాజనపదాల సమాచారం, అవి ఎక్కడ వెలిశాయి, వాటి రాజధానులు, మగధ రాజ్య విజృంభనకు కారణాలు, నగరాల ఆవిర్భావం, క్రీ.పూ. 6వ శతాబ్దంలో వచ్చిన మార్పులు, బింబిసారుడు, అజాతశత్రువు యుద్ధ పరికరాలు, పాటలీపుత్ర నగర నిర్మాణం, శిశునాగవంశం, నందవంశం, విదేశీ దండయాత్రల ప్రభావం, సైరస్, డేరియస్, అలెగ్జాండర్ దండయాత్రలు (జీలం నది యుద్ధం), వాటి మూలాలు చదవాలి.
#బౌద్ధ, జైన మతాలు: సిలబస్‌లో కీలకమైన అంశం బౌద్ధ, జైన మతాల ఆవిర్భావం. సమాజంపై ఆ మతాల ప్రభావం. వర్ణ వ్యవస్థను దూరంచేసిన విధానం. ఈ మతాలకు సంబంధించిన సాహిత్యం, నిర్మాణాలు, అవి చెప్పిన సిద్ధాంతాలు, రుషభనాథుడు, పార్శనాథుడు, వర్ధమాన మహావీరుడి జీవిత చరిత్ర, జైనమత త్రిరత్నాలు, జైన సిద్ధాంతాలైన సత్యం, అహింస, అస్తేయం, అపరిగ్రహం, బ్రహ్మచర్యం, సల్లేఖనవ్రత నియమాలు, సల్లేఖనవ్రతం ఆచరించిన రాజులు, జైన మతశాఖలు శ్వేతాంబరులు (తేరపంథీలు, సమైయాలు), దిగంబరులు వాటి సిద్ధాంతాలు, జైనపరిషత్లు, జైనమత సాహిత్యంలో అంగాలు, ఉపాంగాలు, భద్రబా కల్పసూత్రాలు వంటి అంశాలు చదవాలి. అలాగే బౌద్ధమతంలో గౌతమ బుద్ధుడి జీవిత చరిత్ర- జననం, మహాభినిష్క్రమణం, నిర్యాణం, ధర్మచక్రపరివర్తనం, మహాపరినిర్యాణం, ఆర్యసత్యాలు, త్రిపీఠకాలు, బౌద్ధ సంగీతుల వివరాలు, బౌద్ధమత శాఖలైన హీనయానం, మహాయానం, వజ్రాయానం, అవి ఉపయోగించిన భాషలు ప్రధానమైనవి. బౌద్ధమత సాహిత్యంలో పాళీ, సింహళ గ్రంథాలైన దీపవంశం, మహావంశ, టిబెట్ గ్రంథాలు, సంస్కృత గ్రంథాలైన లలితవిస్తార, సౌందర్యనందన, బుద్ధచరిత వంటి గ్రంథాలు, బౌద్ధమత నిర్మాణాలు అనేవి ముఖ్యమైనవి. విహారాలు, స్తూపాలు, చైత్యాలు వంటి అంశాలు చూడాలి.
# మౌర్య సామ్రాజ్యం: మౌర్యుల చాప్టర్లో మౌర్యుల ఆధారాలు అనేవి ముఖ్యమైనవి. అశోకుడి శిలాశాసనాలు (బ్రాహ్మి, ఖ రోష్టి, అరామిక్ లిపి-ప్రాకృత భాష), మాస్కీ (దేవనాం ప్రియ అశోక), గుజారా, సారనాథ్ (బోర్లించిన కమలంపై పీఠిక, దానిపైన సింహతటాలం- భారతీయ చిహ్నం), రాంపూర్వా (ఎద్దుబొమ్మ), లౌర్యనందన (సింహం) తోసలి, ధౌలి (ఏనుగు), బబ్రూ (అశోకుడు బౌద్ధమత స్వీకరణ) రుమిండై (లుంబినిలో పన్నుల గురించి) వంటి శిలాశాసనాలు జాగ్రత్తగా పరిశీలించాలి. అలాగే సాహిత్య ఆధారాలైన మెగస్తనీస్ ఇండికా, కౌటిల్యుడి అర్థశాస్త్రం, ఎరియన్-ఇండికా, విశాఖదత్తుడి ముద్రరాక్షసం, శ్రీలంక సాహి త్యం దీపవంశ, మహావంశ, టిబెట్ గ్రంథాలు దివ్యావదన, అశోకవదన, జైనమత గ్రంథమైన పరిశిష్ఠపర్యాన్, టాలమీ-జాగ్రఫీ వంటి సాంస్కృతిక అంశాలకు ప్రాధాన్యతనివ్వాలి. అలాగే మౌర్యుల రాజకీయ చరిత్రను అధ్యయనం చేస్తూ పరిపాలన అంశాలను స్టడీ చేయాలి.
# మౌర్యుల అనంతర వంశాలు : మౌర్య సామ్రాజ్యాన్ని కూల్చి అధికారంలోకి వచ్చినది శుంగవంశం. బృహద్రదుని సంహరించి పుష్యమిత్రశుంగుడు అధికారంలోకి వచ్చాడు. శుంగుల గురించి తెలిపే ప్రధాన గ్రంథం పతంజలి మహాభాష్యం. దీనిపై రాసిన వ్యాఖ్యాన గ్రంథం పాణిని రాసిన అష్టాధ్యాయ. అలాగే హాథిగుంఫాశాసనం వేయించిన ఖారవేలుడి ఛేదివంశం, శాతవాహనులు, శకులు, ఇండోగ్రీకులు (మొదటి భారతదేశంలో బంగారు నాణేలు వేయించిన వారు) పార్థియన్లు, కుషాణులు- కనిష్కుడు. ఇతనికాలంలో బౌద్ధమత అభివృద్ధి గురించి అధ్యయనం చేయాలి.
# గుప్తులు: గుప్తులకాలం భారతదేశ చరిత్రలో స్వర్ణయుగం. అటు నిర్మాణాల రంగంలో, ఇటు సాహిత్య, సాంకేతిక రంగంలో, పరిపాలనలో అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించి స్వర్ణయుగంగా పిలువబడింది. గుప్తుల గురించి సాహిత్య ఆధారాలు అనేకం లభిస్తున్నాయి. కాళిదాసు రచనలు అభిజ్ఞాన శాకుంతలం, మాలవికాగ్నిమిత్రం, విక్రమోర్వశీయం, మేఘదూతం, కుమారసంభవం, రుతుసంహారం, రఘువంశం, విశాఖదత్తుడి దేవీచంద్రగుప్తం, శూద్రకుడి మృచ్చకటికం, సుబందుడి వాసవదత్త వంటి గ్రంథాలు. ఆర్యభట్ట- ఆర్యభట్టీయం, ఇతుడు కనుగొన్న సున్నా, పై విలువ, సూర్యచంద్ర గ్రహణాలు, సంవత్సరాన్ని 365 రోజులుగా లెక్కించడం వంటి అంశాలు, వరహామిహిరుడి- బృహత్సంహిత, బృహత్జాతక, పంచసిద్ధాంత, బ్రహ్మగుప్తుడు-భూమి ఆకర్షక సిద్ధాంతం వంటి సైన్స్ అంశాలు. అలాగే గుప్తుల కాలం నాటి అలహాబాద్ ప్రశస్తి (సమద్రగుప్తుడి గురించి) శాసనం, ఎరాన్ శాసనం (సతీసహగమనం గురించి) వంటి అంశాలు, గుప్తులకాలంలో చండాలురు అనే ఐదోవర్ణం గురించి పేర్కొన్న విదేశీ యాత్రికుడు పాహియాన్, వీరికాలంలో అభివృద్ధి చెందిన ఆలయ నిర్మాణం, గర్భగుడి, పంచాయతన విధానం, నిర్మాణాలు- తిగవాలోని విష్ణుదేవాలయం, భూమ్రాలోని శివాలయం, దేవగఢ్‌లోని దశావతర దేవాలయం వంటి అంశాలు చదువుతూనే గుప్తులకాలంలో అభివృద్ధి చెందిన భూస్వామ్య వ్యవస్థ గురించి స్టడీ చేయాలి. గుప్తవంశ స్థాపకుడు శ్రీగుప్తుడు, గుప్తశకం స్థాపకుడు మొదటి చంద్రగుప్తుడు, గొప్పవాడు రెండోచంద్రగుప్తుడు చివరివాడు బుధగుప్తుడు వంటి రాజకీయ అంశాలు చదవాల్సి ఉంటుంది.
# గుప్తుల అనంతర యుగం: గుప్తుల అనంతరం వచ్చిన హర్షవర్ధనుడి పరిపాలన, ఐదేండ్లకోసారి నిర్వహించే మహామోక్ష పరిషత్, కనౌజ్లో నిర్వహించిన సర్వమత సమ్మేళనం వంటి అంశాలు, హర్షుని గ్రంథాలు- ప్రియదర్శిని, నాగానందం, రత్నావళి, బాణుడి హర్షచరిత్ర గంథ్రాలు చదవాలి. అలాగే రాజపుత్రుల కాలంలో వచ్చిన హైందవ సంస్కృతి, నగరశైలిలో నిర్మించిన నిర్మాణాలు- ఖజురోహో, ఆబూశిఖరం, నేమినాథ ఆలయం, కోణార్క్‌లోని సూర్యదేవాలయం, పూరిలోని జగన్నాథ ఆలయం, భువనేశ్వర్‌లోని లింగరాజ, రాజారాణి ఆలయాలు సాంస్కృతిక కోణంలో చదవాలి. అలాగే వీరికాలంలో వచ్చిన సాహిత్యం చాలా ముఖ్యమైంది.
నగర శిల్పరీతి:
నగర శిల్పరీతిలో శిఖరాలు కోపు తక్కువగా ఉండి శిఖరాలపైన అమలకం ఉంటుంది. దేవాలయాలు వృత్తాకారంగా ఉంటాయి. దేవాలయాల వైశాల్యం తక్కువగా ఉంటుంది. నగర శిల్పరీతి ఉత్తర భారతదేశంలో విలసిల్లినది. గుప్తులు, గుజరాత్‌ను పాలించిన సోలంకిలు, రాజపుత్రులు, చందేలులు, కళింగను పరిపాలించిన తూర్పుగాంగులు నగర శిల్పరీతిలో నిర్మాణాలు చేపట్టారు.
ద్రావిడ శిల్పరీతి:
ఈ శిల్పరీతి దక్షిణ భారతదేశంలో విలసిల్లినది. ఈ శిల్పరీతిలో ఆలయ కోపు ఎక్కువగా ఉండి శిఖరంపై కలశం ఉంటుంది. ఈ దేవాలయాలు చతురస్రం లేదా దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. ఈ దేవాలయాల వైశాల్యం ఎక్కువగా ఉంటుంది. పల్లవులు, చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు, మధురను పాలించిన నాయకరాజులు ఈ శిల్పరీతిని అవలంబించారు.
వేసర శిల్పరీతి:
పశ్చిమ మధ్యభారతదేశంలో అభివృద్ధి చెందినది. దీనిలో నగర+ద్రావిడ శిల్పరీతుల సంగమం కన్పిస్తుంది. పశ్చిమచాళుక్యులు, రాష్ట్రకూటులు, హొయసాళులు ఈ శిల్పరీతిలో నిర్మాణాలు చేపట్టారు.
భాష:
వ్యక్తుల భావవ్యక్తీకరణకు తోడ్పడేది భాష. పాచీన కాలం నుంచి మాట్లాడే భాషలు వేల సంఖ్యలో ఉన్నప్పటికీ లిఖిత భాషలు మాత్రం కొన్నే ఉన్నాయి. కొన్ని భాషలకే లిపి ఉంది. భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి లిఖిత భాషలను పరిశీలిస్తే.. సింధూ నాగరికత కాలంలో లిఖిత భాషలేదు. కానీ కొన్ని గుర్తుల రూపంలో కన్పిస్తుంది. దీనినే సర్పలేఖన లిపి లేదా బొమ్మల లిపి, ఫిక్టోగ్రఫీ లిపి అని దీనినే హీలియోగ్రఫి లిపి అని కూడా పిలుస్తారు. ఇది ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు ఉంటుంది.
# ఆర్యనాగరికత కాలంలో సంస్కృత భాష ఉపయోగించినట్లు తెలుస్తుంది. వేదాలు మొత్తం దేవనాగరి లిపిలో సంస్కృత భాషలో ఉన్నాయి. తర్వాత అభివృద్ధి చెందిన భాష ప్రాకృతం. మౌర్యులు, శాతవాహనులు ప్రాకృత భాషను ఉపయోగించారు. అశోకుడు బ్రాహ్మి లిపి, ఖరోష్ఠి, ఆరామిక్ లిపి ప్రాకృత భాషలో శాసనాలు వేయించారు. వీరి కాలంలో చాలా గ్రంథాలు ప్రాకృత భాషలో వెలువడినాయి. ఆ తర్వాత మళ్లీ గుప్తుల కాలంలో సంస్కృత భాష అభివృద్ధి చెంది 12వ శతాబ్దం వరకు దాని సాంస్కృతిక వైభవం కొనసాగింది.
#ప్రాంతీయ భాషలను అభివృద్ధి చేసిన మతం జైనం. సౌరశ్రేణి భాష అనగా మరాఠి, అర్ధమాగది- బిహారీ, కనరస- కన్నడ భాషలను ఆ మతం అభివృద్ధి చేసింది.
# మధ్యయుగంలో ముస్లింల ద్వారా భారతదేశంలో పారశీక (పర్షియా) భాష ప్రవేశించింది.
# పారశీక+హిందీ భాష సంగమం ఉర్దూ. దీనిని శిబిర భాష అని పిలుస్తారు. ఇది ఢిల్లీ సుల్తానుల కాలంలో సైనిక శిబిరాల్లో పుట్టిన భాష.
# దక్షిణ భారతదేశంలో అనేక స్థానిక భాషలు అభివృద్ధి చెందాయి. తెలుగు, కన్నడ, మళయాళం, తమిళం ఈ నాలుగు భాషలకు ప్రాచీన హోదా ఇచ్చారు. ఈ భాషలు ద్రావిడ భాషా కుటుంబానికి చెందినవి.
# బ్రిటీష్ వారి ఆగమనంతో భారతదేశంలో ప్రవేశించిన భాష ఇంగ్లీష్.
గాంధార శిల్పకళ
# క్రీ.పూ. 1వ శతాబ్దం నుంచి క్రీ.శ. 5వ శతాబ్దం వరకు గాంధార ప్రాంతం (తక్షశిల, అఫ్ఘనిస్తాన్)లో విలసిల్లింది.
# పెషావర్ లోయ నుంచి సింధూనది తూర్పు వరకు విస్తరించిన ప్రాంతం ‘గాంధార’ అని యాన్త్సాంగ్ పేర్కొన్నాడు.
# ఈ శిల్పరీతిని ప్రారంభించిన వారు ఇండోగ్రీకులు. గాంధార శిల్పరీతిలో బౌద్ధమత (మహాయాన) విగ్రహాలు ఎక్కువగా చెక్కబడ్డాయి. గౌతమ బుద్ధుని విగ్రహాలను మొట్టమొదట తయారు చేసిన శిల్పరీతి ‘గాంధార శిల్పరీతి’. ఈ శిల్పరీతిలో బుద్ధుని విగ్రహం అపోలో దేవత విగ్రహాన్ని, యక్షబేరుల విగ్రహాలు, జూస్ దేవతా విగ్రహాలను పోలి ఉంటాయి. గాంధార శిల్పరీతిలో ‘తెల్ల చలువరాయిని (White Marble) ఉపయోగించారు.
#గుప్తుల స్థాయిలో ఆలయ వ్యవస్థను అభివృద్ధి చేసిన వారు పశ్చిమ చాళుక్యులు, దక్షిణ భారత దేశంలో పల్లవులు, రాష్ట్రకూటులు, చోళులు.
అమరావతి శిల్పకళ
#ఈ శైలిలో ప్రధానంగా తెల్ల చలువరాయిని, తెల్ల ఆకుపచ్చ రాళ్లను ఉపయోగించారు. క్రీ.పూ. 2వ శతాబ్దంలో ప్రారంభమైన ఈ శిల్పకళ శాతవాహనుల కాలంలో ఉచ్ఛస్థితికి చేరుకొని, క్రీ.శ. 4వ శతాబ్దం నాటికి క్షీణించింది.
#ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి, నాగార్జున కొండ, జగ్గయ్యపేట, భట్టిప్రోలు, ఘంటసాల కేంద్రాలుగా ఈ శిల్పకళ అభివృద్ధి చెందింది. తక్కువ స్థలం లో ఎక్కువ బొమ్మలు చెక్క డం ఈ శిల్పరీతి లక్షణం. అమరావతి శిల్పాలను సింహళం, ఆగ్నేయాసియా దేశాలకు తీసుకొని పోవ డం వల్ల అక్కడ ఈ శిల్పరీతి ప్రభావం కన్పిస్తుంది.
మధుర శిల్పకళ
# ఇది ఉత్తర భారతదేశంలో విలసిల్లింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో ఈ శిల్పకళను ఎక్కువగా ఉపయోగించారు. ఈ శిల్పకళ క్రీ.పూ. 2వ శతాబ్దంలో ప్రారంభంకాగా, ఎరని ఇసుక రాయిని అధికంగా వాడారు. తొలినాళ్లలో ఈ శిల్పకళపై జైనమత ప్రభావం కన్పిస్తుంది. మధుర శిల్పకళా రూపాలు సారనాథ్, శ్రావస్తి, తక్షశిల, మధ్య ఆసియాకు ఎగుమతి అయ్యాయి. జైనమత ప్రభావం వల్ల ఈ శైలిలో కూర్చున్న తీర్థంకరుల విగ్రహాలు ఎక్కువగా కన్పిస్తాయి. మధుర శిల్పరీతికి చెందిన బుద్ధుని బోధిసత్వుల శిల్పాల్లో వారి ముఖాల వెనుక ఆధ్యాత్మిక శక్తిని ప్రదర్శించే వలయాలు కన్పిస్తాయి.
#తలలేని మొండెం కలిగిన కనిష్కుని విగ్రహం, పద్మాసనంపై కూర్చున్న గౌతమ బుద్ధుని విగ్రహం, వర్థమాన మహావీరుని విగ్రహం, విమాఖాడఫిసిసిస్ విగ్రహం మధుర శిల్పరీతిలో అత్యద్భుతంగా నిర్మించబడ్డాయి.
4 హిందూ దేశాలయ శైలి అయిన ‘మధుర శైలి’ శుంగుల కాలంలో ప్రారంభమైంది.గ్రీకు రాజు అంటియాల్కడస్ రాయబారి హిలియోడరస్ శుంగుల రాజధానియైన విదిశలో విష్ణుదేవాలయానికి గరుఢ స్తంభాన్ని కట్టించాడు.
కౌటిల్యుని అర్థశాస్త్రం
#మౌర్యుల గురించి తెలిపే ప్రామాణిక గ్రంథం- కౌటిల్యుడు/చాణక్యుడు/విష్ణుగుప్తుడు రాసిన అర్థశాస్త్రం. దీని పూర్తిప్రతిని 1906లో సంపాదించి ఇంగ్లీష్‌లోకి అనువదించింది శ్యామశాస్త్రి. సంస్కృతంలో రాయబడిన అర్థశాస్త్రంలో 15 భాగాలు, 180 అధికరణలు, 600 శ్లోకాలు ఉన్నాయి. అర్థశాస్త్రంపై రాసిన వ్యాఖ్యాన గ్రంథం ప్రతిపాదిక సంచిక. దీనిలో ప్రధానంగా పాలకుడు-పాలితుల మధ్య సంబంధం, దేశ సంపద, ప్రజాసంక్షేమంలో రాజ్యం పాత్ర, పొరుగు రాజ్యాలతో దౌత్య సంబంధాలు, సంకీర్ణ ప్రభుత్వాలు, విదేశాంగ విధానం చర్చింపబడ్డాయి. దీనిని ప్రభుత్వ కళాశాస్త్రంగా చెప్పవచ్చు. అందుకే ఇటాలియన్ త్వత్తవేత్త మాకియవెల్లి రాసిన ‘ది ప్రిన్స్’ గ్రంథంతో సరిపోల్చి కౌటిల్యుడిని ఇండియన్ మాకియవెల్లి అని అభివర్ణించారు.
తాజ్‌మహల్
# దీని రూప శిల్పి ఉస్తాద్ ఇసా. ఇది ఇండో+పర్షియన్+అరేబియా+టర్కీ శిల్ప కళల సమ్మేళనం. ముంతాజ్ మహల్ స్మృతి పథం. యమునా నది ఒడ్డున ఆగ్రా వద్ద నిర్మించారు. 20 వేల మంది కూలీలు 22 ఏండ్లు పనిచేసి ఈ అద్భుత నిర్మాణాన్ని పూర్తి చేశారు. దాదాపు రూ. 50 లక్షలు ఖర్చు చేశారు. రాజస్థాన్‌లోని మక్రాన్ పర్వతాల నుంచి తెచ్చిన పాలరాయిని ఈ నిర్మాణంలో ఉపయోగించారు. దీనిలో ముంతాజ్, షాజహాన్ సమాధులున్నాయి.
#‘తాజ్‌మహల్ రాతితో రచించిన భావగీతం’ అని రవీంద్రనాథ్ఠాగూర్ అభివర్ణించాడు.
# ‘భౌతిక సౌందర్యంతో మెరిసే సజీవ శిల’ – ఎడ్విన్ ఆర్నాల్డ్.
# షాజహాన్ ఢిల్లీలో నిర్మించిన భారతదేశంలోనే అతిపెద్ద మసీదు- జుమా మసీదు- దీని రూపశిల్పి-మాలిక్ జహాన్.
# షాజహాన్ ఢిల్లీలోని ఎరకోట, నెమలి సింహాసనం, ఆగ్రాలోని మోతీ మసీదులను నిర్మించాడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు