1969-ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ( తెలంగాణ హిస్టరీ )
గ్రూప్స్ ప్రత్యేకం
-1969 ఉద్యమాన్ని రాజేసి తెలంగాణ అంతటికీ వ్యాపింపజేసిన ఘనత కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్)లోని తెలంగాణ నాయకులు, వారికి మార్గదర్శకత్వం వహించిన టీఎన్జీవో పాల్వంచ అధ్యక్షుడు వీఎల్ నరసింహారావు, ఇల్లందుకు చెందిన కొంశెట్టి రామదాసు, ఉపాధ్యాయ సంఘం నేత కే రామసుధాకర్ రాజులకు దక్కుతుంది.
– 1969 ఉద్యమాన్ని ప్రారంభించి తెలంగాణ రాష్ట్రం సాధించేదాక ఆపకూడదనే ఆలోచనతో కార్యాచరణ మొదలుపెట్టింది ఖమ్మం జిల్లా ఇల్లందు దగ్గర గేటుకారేపల్లికి చెందిన కొలిశెట్టి రామదాసు. కానీ ఆ ఆలోచనను అమలు చేయడానికి, కష్టాలనెదుర్కోవడానికి సిద్ధమై ఒక్కొక్కరిని చేరదీసి, జిల్లాలన్నీ తిరిగి, నాయకులు, కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులను కలిసి 1969, జనవరిలో ఖమ్మంలో డిగ్రీ విద్యార్థి రవీంద్రనాథ్‌తో రెండు వారాలు ఆమరణ దీక్ష చేయించిన మార్గదర్శి కొలిశెట్టి రామదాసు.
ఉద్యమం ప్రారంభం
– ఖమ్మం జిల్లా పాల్వంచలో దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రధానమైన విద్యుత్ కేంద్రాన్ని ‘కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్’ అనే పేరుతో 1961లో స్థాపించారు. తెలంగాణ నిధుల నుంచి ఈ ప్రాజెక్టుకు డబ్బులు కేటాయించారు. స్థానిక రైతులు సుమారు 1300 ఎకరాల భూమిని కోల్పోయారు. ప్రాజెక్టు పని నిమిత్తం అనేకమంది ఉన్నతాధికారులను కావాలని ఆంధ్ర ప్రాంతీయులను నియమించారు. ఎంతో అనుభవమున్న తెలంగాణ వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం మొదటి నుంచి ఇక్కడ జరుగుతున్న తతంగాల్లో ఒకటి.
-ప్రాంతీయ అభిమానం వల్ల ఆంధ్ర అధికారులు తమ ప్రాంతానికి చెందిన అనేక మందిని ఇక్కడికి పిలిపించి, పూర్తిగా ముల్కీ నిబంధనలు ఉల్లంఘించి ఉద్యోగాలు ఇచ్చారు. స్థానికంగా భూములు కోల్పోయిన వారికి కూడా ఉద్యోగాలివ్వలేదు. దినసరి కూలీ పనులకు కూడా ఆంధ్ర జిల్లాల నుంచి పిలిపించారు. దాదాపు 1200 ఉద్యోగాల్లో తెలంగాణ ప్రాంతంవారు 200లోపు మాత్రమే ఉన్నారు.
తెలంగాణ ప్రాంతీయ సమితి
– 1968 ఎండాకాలంలో ‘తెలంగాణ ప్రాంతీయ సమితి’ని కొలిశెట్టి రామదాసు స్థాపించారు. దీనికి ఈయన అధ్యక్షులుగా, ముత్యం వెంకన్న ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
రవీంద్రనాథ్ ఆమరణ నిరాహార దీక్ష
-కొలిశెట్టి రామదాసు, సుధాకర్రాజుల ప్రోత్సాహంతో బీఏ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి రవీంద్రనాథ్ 1969, జనవరి 8న ఖమ్మం పట్టణంలోని గాంధీక్ వద్ద నిరాహార దీక్ష ప్రారంభించారు. రవీంద్రనాథ్‌తోపాటు నిరాహార దీక్షలో మొదటి రోజు ఖమ్మం మున్సిపాలిటీ ఉపాధ్యక్షుడు ‘కవిరాజ మూర్తి’ పాల్గొన్నారు. రవీంద్ర నాథ్ దీక్షకు మద్దతు తెలిపి వర్ధన్నపేట ఎమ్మెల్యే పురుషోత్తమరావు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. రవీంద్రనాథ్ దీక్షకు మద్దతుగా తెలంగాణ రక్షణలు అమలు జరపాలని కోరుతూ గోగినేని సత్యనారాయణ అనే ఎమ్మెల్యే జనవరి 12 నుంచి మూడు రోజుల నిరసన దీక్షను ఇల్లందులోని తన నివాసంలో ప్రారంభించారు.
-1969, జనవరి 22 సాయంత్రం జలగం వెంగళరావు ఒత్తిడి వల్ల 15 రోజులుగా నిరాహార దీక్ష కొనసాగిస్తున్న రవీంద్రనాథ్ దీక్ష విరమించారు. దీంతో తెలంగాణ రక్షణల అమలు కోసం చేస్తున్న తెలంగాణ విద్యార్థుల ఉద్యమం చల్లారిపోయింది.
ఉస్మానియా విద్యార్థుల ఆందోళన
– జనవరి 12న ఉస్మానియా విద్యార్థి సంఘం సమావేశమై జనవరి 15న తెలంగాణ రక్షణల అమలు కోసం నిజాం కాలేజీకి ఊరేగింపు తీయాలని నిర్ణయించింది. విద్యార్థి సంఘం జనవరి 15న రవీంద్రనాథ్ ఆమరణ నిరసన దీక్షకు సానుభూతిగా రాజధాని నగరాల్లో జరిపిన సమ్మె దిగ్విజయంగా సాగింది. ఇదిలా ఉండగా ఖమ్మం, వరంగల్ నగరాల్లో రవీంద్రనాథ్ దీక్షకు మద్దతుగా విద్యార్థులు హర్తాళ్ నిర్వహించారు. ఆందోళన తీవ్రత చూసి తన సొంత జిల్లా పర్యటనను వాయిదా వేసుకున్నారు నీటి పారుదల మంత్రి శీలం సిద్ధారెడ్డి. రవీంద్రనాథ్ దీక్షా శిబిరంలో కాలేజీ విద్యార్థులు జట్లు జట్లుగా అంచెల వారీ నిరాహార దీక్షలు చేశారు.
విద్యుత్ ఉద్యోగులు
– కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రంలోని నాన్‌ముల్కీ ఉద్యోగులను జనవరి 10లోగా తొలగించాలని ఉద్యమించారు. ఉద్యమం ఉధృతరూపం దాల్చడంతో 1969, జనవరి 18, 19 తేదీల్లో కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం అన్ని రాజకీయ పక్షాల నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
అఖిలపక్ష ఒప్పందం
ఈ ఒప్పందం ప్రకారం తీసుకోవాల్సిన చర్యలు..
-ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా తెలంగాణలో నియమించిన ఉద్యోగులందరినీ వెంటనే తొలగించి వారి స్థానాల్లో స్థానికులను నియమించాలి. ఈ విధంగా ఉద్యోగాలు కోల్పోయిన ఆంధ్ర ప్రాంతం వారికి వారి ప్రాంతంలో ఉద్యోగావకాశాలు కల్పించాలి.
– ఆంధ్ర ప్రాంతానికి తరలించిన తెలంగాణ మిగులు నిధుల లెక్కలు తీసి ఆ నిధులను తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం ఉపయోగించాలి.
– రాజధాని అయిన హైదరాబాద్‌లో విద్యావసతులను విస్తరింపజేయాలి.
-ఈ అఖిలపక్ష నిర్ణయాలను అమలుపర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం 1969, జనవరి 21న ‘36’ నంబర్ గల ఒక జీవోను జారీచేసింది.
-ఉద్యోగ, ఉపాధ్యాయుల పాత్ర
1969, మార్చి 11న టీఎన్జీవోల నాయకుడు కేఆర్ ఆమోస్, ఉపాధ్యాయుల నాయకుడు బాలకృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో ‘ఉద్యోగులు, ఉపాధ్యాయుల కార్యాచరణ సమితి’ ఏర్పడింది. 1969 మేలో ప్రత్యేక తెలంగాణ జూన్ 1లోగా ఏర్పడకపోతే రక్తపాతం తప్పదని ఉద్యోగ సంఘం నాయకుడు కేఆర్ ఆమోస్ ప్రభుత్వాన్ని హెచ్చరించడంతో ప్రభుత్వం ఉద్యోగ సంఘాల గుర్తింపును రద్దు చేసింది. అంతేకాకుండా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఉద్యోగులను రెచ్చగొడుతున్నాడనే కారణంతో ఆమోస్‌ను గవర్నర్ ఉద్యోగం నుంచి 1969, మే 25న డిస్మిస్ చేశారు. 1969, జూన్ 10 నుంచి ఉద్యోగులు నిరవధిక సమ్మె నిర్వహించి 1969 జూలై 16 (37 రోజులు)న విరమించారు. దీంతో తెలంగాణ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వానికి తగిన సలహాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అలహాబాద్ మాజీ ప్రధాన న్యాయమూర్తి నసీరుల్లాబేగ్ అధ్యక్షతన ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేసింది.
– మేధావుల పాత్ర
హైదరాబాద్‌లో మేధావులు 1969, జనవరి 13న ‘కాటం లక్ష్మీనారాయణ’ చైర్మన్‌గా ‘తెలంగాణ పరిరక్షణల కమిటీ’ని ఏర్పాటు చేశారు.
-1969, జనవరి 28న వరంగల్‌లో ‘తెలంగాణ విమోచనోద్యమ సమితి’ కాళోజీ అధ్యక్షతన ఏర్పడింది.
– 1969, జూన్‌లో హైదరాబాద్‌లో కాళోజీ నారాయణ రావు అధ్యక్షతన ‘తెలంగాణ రచయితల సదస్సు’ జరిగింది.
– తెలంగాణ ప్రజాసమితి
1969, మార్చి 25న హైదరాబాద్‌లో యువకులు, మేధావులు, విద్యార్థులు కొనసాగిస్తున్న తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా ‘తెలంగాణ ప్రజాసమితి’ని స్థాపించారు. దీనికి అధ్యక్షుడు మదన్ మోహన్.
ప్రాక్టీస్ బిట్స్
1. 1968లో ‘తెలంగాణ ప్రాంతీయ సమితి’ని ఏర్పాటు చేసినది?
1) కొలిశెట్టి రామదాసు
2) మరి చెన్నారెడ్డి
3) మదన్ మోహన్
4) సుధాకర్ రాజు
2. 1969, జనవరి 8న ఖమ్మం పట్టణంలో నిరాహార దీక్ష చేపట్టిన విద్యార్థి?
1) పురుషోత్తమ రావు
2) అన్నాబత్తుల రవీంద్రనాథ్
3) కృష్ణ 4) కవిరాజమూర్తి
3. జీవో 36ను ఎప్పుడు జారీ చేశారు?
1) 1969, జనవరి 21
2) 1968, జనవరి 21
3) 1970, జూలై 1
4) 1969, జూన్ 1
4. 1969, జూన్ 1 లోగా ప్రత్యేక తెలంగాణ ఏర్పడకపోతే రక్తపాతం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఉద్యోగుల సంఘ నాయకుడు?
1) బాలకృష్ణా రెడ్డి 2) మదన్ మోహన్
3) కేఆర్ ఆమోస్ 4) అందరూ
5. ‘తెలంగాణ పరిరక్షణల కమిటీ’ ఎవరు చైర్మన్‌గా ఏర్పడింది?
1) కాళోజీ నారాయణ రావు
2) కాటం లక్ష్మీనారాయణ రావు
3) బీ కిషన్
4) గోగినేని సత్యనారాయణ
6. నాన్ ముల్కీలకు వ్యతిరేకంగా జనవరి 10న నిరాహార దీక్ష చేసిన రోజువారీ వేతనం గల కార్మిక నాయకుడు?
1) రామసుధాకర్ రాజు 2) బీ నరసయ్య
3) కృష్ణ 4) సత్యనారాయణ
7. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి?
1) జలగం వెంగళరావు
2) కాసు బ్రహ్మానంద రెడ్డి
3) దామోదరం సంజీవయ్య
4) మరి చెన్నారెడ్డి
8. 1969, మార్చి 11న ఎవరి ఆధ్వర్యంలో ‘ఉద్యోగులు, ఉపాధ్యాయుల కార్యాచరణ సమితి’ ఏర్పడింది?
1) కేఆర్ ఆమోస్ 2) బాలకృష్ణారెడ్డి
3) కొలిశెట్టి రామదాసు 4) 1, 2
9. కింది వాటిలో సరైనవి?
1) రవీంద్రనాథ్‌తో పాటు నిరాహార దీక్షలో మొదటి రోజు ఖమ్మం మున్సిపాలిటీ ఉపాధ్యక్షుడు ‘కవిరాజమూర్తి’ పాల్గొన్నారు
2) రవీంద్రనాథ్ దీక్షకు మద్దతు తెలిపి వర్ధన్నపేట ఎమ్మెల్యే పురుషోత్తమ రావు సత్యాగ్రహంలో పాల్గొన్నారు
3) 1 4) 1, 2
10. 1969, ఫిబ్రవరిలో ఏర్పాటైన ‘తెలంగాణ ప్రజా కన్వెన్షన్’ 1969, మార్చి 25న దేనిగా మార్పు చెందింది?
1) తెలంగాణ ప్రజా సమితి
2) తెలంగాణ ప్రాంతీయ సమితి
3) తెలంగాణ పరిరక్షణల కమిటీ
4) తెలంగాణ విద్యావంతుల వేదిక
11. కింది వాటిలో సరైనది?
1) 1969, జనవరి 8న వరంగల్‌లో ‘తెలంగాణ విమోచనోద్యమ సమితి’ సదస్సు కాళోజీ అధ్యక్షతన జరిగింది
2) 1969, జూన్‌లో హైదరాబాద్‌లో కాళోజీ అధ్యక్షతన తెలంగాణ రచయితల సదస్సు జరిగింది
3) 1 4) 1, 2
12. తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షుడిగా మరి చెన్నారెడ్డి బాధ్యతలు స్వీకరించింది?
1) 1969, మే 22
2) 1969, మార్చి 25
3) 1971, మే 22
4) 1970, మార్చి 25
13. 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగులు ఎన్ని రోజుల పాటు సమ్మె చేశారు?
1) 38 రోజులు 2) 37 రోజులు
3) 39 రోజులు 4) 41 రోజులు
14. రవీంద్రనాథ్ దీక్షకు మద్దతుగా ఉస్మానియా విద్యార్థులు సమ్మె చేసిన తేదీ?
1) 1969, జనవరి 15
2) 1969, జనవరి 8
3) 1969, జనవరి 9
4) 1969, జనవరి 21
15. తెలంగాణ రక్షణలు అమలు జరపాలని కోరుతూ రవీంద్రనాథ్ చేపట్టిన దీక్షకు మద్దతుగా మూడు రోజుల పాటు నిరసన దీక్ష చేసిన శాసనసభ్యుడు?
1) కవిరాజ మూర్తి
2) గోగినేని సత్యనారాయణ
3) పురుషోత్తమ రావు
4) కొండా లక్ష్మణ్ బాపూజీ
16. ఉద్యోగులను రెచ్చగొడుతున్నాడనే కారణంతో గవర్నర్ ద్వారా ఉద్యోగం నుంచి డిస్మిస్ అయిన ఉద్యోగ సంఘ
నాయకుడు?
1) బాలకృష్ణారెడ్డి
2) కొలిశెట్టి రామదాసు
3) కేఆర్ ఆమోస్
4) పై అందరూ
సమాధానాలు
1-1, 2-2, 3-1, 4-3,
5-2, 6-3, 7-2, 8-4,
9-4, 10-1, 11-4, 12-1,
13-2 14-1, 15-2, 16-3
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ
కోరుట్ల
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు