గురి పెడితే గ్రూప్-1 మిస్ కావద్దు

సక్సెస్ స్పీక్ ……ఉదయ్ రెడ్డి, ఏసీపీ, టుప్పల్ (2016 గ్రూప్ -1 ర్యాంకర్ )
తుపాకీ ఎక్కు పెట్టాక గురి ఎలా తప్ప కూడదో.. అలాగే గ్రూప్ -1 సాధించాలన్న లక్ష్యం పెట్టుకున్నాక ఉద్యోగం మిస్ కాకూడదు. ఇందుకు పటిష్ఠ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. కోచింగ్ సెంటర్లకు వెళ్లకుండానే సొంత పరిజ్ఞానంతోనూ చదివి ఉద్యోగం సాధించవచ్చు. ప్రతి అంశంపై ఎప్పటికప్పుడు అప్ డేట్అవుతుండాలి. రైటింగ్ ప్రాక్టీస్ చేస్తుండాలి. గ్రూప్ డిస్కషన్స్ పెట్టుకోవాలి. ఇలా చదివితే జాబ్ కొట్టొచ్చని అంటున్నారు టుప్పల్ ఏసీపీ ఉదయ్ రెడ్డి. ఆయన 2016లో గ్రూప్ -1లో రెండో ర్యాంక్ సాధించారు. ఉద్యోగం సాధించిన తీరు ఆయన మాటల్లో తెలుసుకుందాం..
మాది నల్లగొండ జిల్లా మిర్యాలగూడెం. నాన్న నూకల వెంకట్ రెడ్డి వ్యాపారం చేస్తారు. అమ్మ పద్మ గృహిణి. స్టడీ అంతా హైదరాబాద్ లోనే సాగింది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో ఇంజినీరింగ్ పూర్తిచేశాను. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో నాలుగు ఉద్యోగాలు వచ్చాయి. అందులో ఒక ఉద్యోగంలో చేరాను. స్టడీ అయిన వెంటనే ఉద్యోగం, పైగా మంచి జీతం. ఇక నీకు తిరుగులేదు.. అని చాలామంది అన్నారు. కానీ మా నాన్నకు, అన్నయ్య గౌతమ్ రెడ్డికి నన్ను పోలీస్ ఆఫీసర్ గా చూడాలని కల. అందుకే.. గ్రూప్ -1 నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే దరఖాస్తు చేశాను. 2011 గ్రూప్ -1లో ఇంటర్వ్యూ వరకు వెళ్లినా.. సుప్రీంకోర్టు తీర్పుతో 2016లో మళ్లీ పరీక్ష నిర్వహించారు. ఈసారి సెకండ్ ర్యాంకు వచ్చింది. సబ్ కలెక్టర్ ఉద్యోగం తీసుకోమని అందరూ సలహా ఇచ్చారు. కానీ నేను మాత్రం డీఎస్పీ పోస్టుకే ఓకే చెప్పా. నాన్న, అన్నయ్యల కంటే ఏదీ ఎక్కువ కాదనిపించింది.
తక్కువ సమయంలో విజయం ఎలా?
# సమయం తక్కువ ఉంది. కానీ విజయం సాధించాలి. ఎలా? అని ఆలోచించాను. కోచింగ్ సెంటర్లకు వెళ్లి గుంపులో గోవిందలా చదవడం ఇష్టం లేదు. బట్టీ పట్టడం అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం లేదు. అందుకే సొంతంగా ప్రిపరేషన్ ప్రారంభించాను. ఎక్కడా కోచింగ్ తీసుకోలేదు. మెయిన్స్‌కు మాత్రం దీపికా మేడమ్ మార్గ నిర్దేశం చేశారు. వ్యాసాలు రాసి తనకు చూపించేవాడిని. ఆమె సరిదిద్దేవారు. అవసరమైన సూచనలు చేసేవారు. ఎన్ సీఈఆర్ టీ పుస్తకాలే ప్రామాణికంగా ప్రిపరేషన్ సాగించాను. ఒకే పుస్తకాన్ని ఎక్కువసార్లు చదివేవాడిని. ఇక తెలంగాణ చరిత్ర, ఉద్యమ చరిత్రకు తెలుగు అకాడమీ పుస్తకాలు అధ్యయనం చేశాను. గ్రూప్ -1 అంటే వ్యాసాలు రాయాలి. ఇందుకు కోచింగ్ సెంటర్లకు వెళ్తేనే మంచిదని చాలామంది అనుకుంటారు. కోచింగ్ కు వెళ్లకుండానే ఉద్యోగం సాధించవచ్చు. అభ్యర్థులకు కావాల్సింది కేవలం సరైన గైడెన్స్ మాత్రమే. అందుకే.. ఉద్యోగార్థులు విజేతలుగా నిలిచిన వారి సలహాలు, సూచనలు తీసుకోవాలి. లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలి.
పరిశోధనాత్మక అభ్యసన
పరీక్షల కోసం కాకుండా పరిశోధనాత్మకంగా అభ్యసనం చేయడం ప్రారంభించాను. ఎనిమిది నుంచి ఇంటర్మీడియట్ వరకు పుస్తకాలన్నీ వల్లె వేశాను. వీటిలో ఎంతో లోతైన విషయ పరిజ్ఞానం ఉంది. ప్రతి పాఠం తర్వాత కొనసాగింపు ఉంటుంది. దీనివల్ల సబ్జెక్టుపై పట్టు వస్తుంది. ఫలితంగా గ్రూప్స్‌లో ఏ రూపంలో ప్రశ్న వచ్చినా తేలికగా సమాధానం ఇవ్వగలిగాను. ప్రతిరోజూ తప్పనిసరిగా న్యూస్ పేపర్లు చదివాను. ఎడిటోరియల్ ను క్రమం తప్పకుండా ఫాలో అయ్యాను. రోజువారీ పరిణామాలను పరిశీలిస్తూ, వాటిని సిలబస్‌లోని అంశాలకు అన్వయించుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించాను. చాలామంది న్యూస్ పేపర్ ను కొద్దిసేపు చదివి వదిలేస్తారు. కానీ నేనలా చేయలేదు. ముఖ్యమైన వార్తలను విశ్లేషిస్తూ, సొంతంగా నోట్స్ తయారు చేసుకున్నాను. ఉదాహరణకు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మెజర్ మెంట్స్ వంటివి మారుతూ ఉంటాయి. ఇవన్నీ పుస్తకాల్లో అప్ డేటెడ్ సమాచారం ఉండకపోవచ్చు. ఇటువంటి వాటికి తాజా సమాచారాన్ని జోడించి జవాబులు రాయాలి.
మూడు నెలల్లో సాధ్యమే..
ఏండ్ల తరబడి కుర్చీలకే పరిమితమై చదివినా ఉద్యోగం రాదు. అలాంటిది మూడు నెలల్లో గ్రూప్ -1 కొట్టడం సాధ్యమా? అనే సందే హం అందరికీ ఉంటుంది. కానీ అది సాధ్యమే. దీనికి నేనే నిదర్శనం. రోజూ గంట ఎన్ సీఈఆర్ టీ పాఠ్యపుస్తకాలు చదివేవాడిని. ఆ తర్వాత దినపత్రికల్లో సంపాదకీయాలు చదివేవాడిని. నోట్స్ ప్రిపేర్ చేసుకునేవాడిని. ప్రముఖ రచయితల పుస్తకాలు చదివేవాడిని. పోటీ పరీక్షల్లో విజయానికి గ్రూప్ డిస్కషన్స్ చాలా ముఖ్యం. అందుకే.. కొందరు మిత్రులతో ఒక అంశం గురించి చర్చించేవాడిని. ఈ తరహా చర్చల వల్ల లోతైన పరిజ్ఞానం వస్తుంది. ఇలా మూడు నెలలు సీరియస్‌గా చదివితే కోచింగ్ సెంటర్ కు వెళ్లకుండానే గ్రూప్ -1 సాధించవచ్చు.
చేతిరాత ముఖ్యం
గ్రూప్ -1లో విజయం సాధించాలంటే చేతిరాత చాలా అవసరం. ప్రతిఒక్కరూ దీన్ని తప్పనిసరిగా దృష్టిలో ఉంచుకోవాలి. ప్రతిరోజూ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. వేగంగా రాయడం అలవాటు చేసుకోవాలి. మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ ను అలవర్చుకోవాలి. చాలామంది బాగా చదువుతారు. కానీ రాయడానికి సమయం సరిపోలేదని కొన్ని ప్రశ్నలకు జవాబులు రాయకుండా వదిలేస్తుంటారు. ప్రతి ప్రశ్నకు తప్పనిసరిగా జవాబు రాయాలి. ప్రతి మార్కు ఎంతో విలువైనది. ఒక్క మార్కే ఉద్యోగం రావాలా? వద్దా? అనేది నిర్ణయిస్తుంది. అందుకే ప్రతిఒక్కరూ తప్పనిసరిగా రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఉదాహరణకు.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. దీనిపై ప్రశ్న అడగవచ్చు. సమాజంలోని వివిధ వర్గాలను యుద్ధం ఎలా ప్రభావితం చేసింది? యుద్ధం తర్వాత పరిస్థితులు ఏంటి? జరిగిన పరిణామాలేంటి? వంటి విషయాలను వివరించగలగాలి. ఇటువంటి కొన్నింటిని ఎంపిక చేసుకుని రాయడం ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు ఒక్క సెకను కూడా ఆలోచించకుండా ఎస్సే రాయవచ్చు. ప్రతిఒక్కరూ ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ప్రతి జవాబులో మనదైన అప్ డేటెడ్ జవాబు ఉండాలి.
సలహాల కోసం సంప్రదించండి
ఇంటర్నెట్ లో కావాల్సినంత మెటీరియల్ అందుబాటులో ఉంది. బేసిక్స్ కోసం ఎన్ సీఈఆర్ టీ పుస్తకాలు చదవండి. కరెంట్ అఫైర్స్‌పై పట్టు సాధించండి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ప్రిపరేషన్ కొనసాగించండి. ఇప్పుడు ఇంటర్నెట్ లో వీడియో లెక్చర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సద్వినియోగం చేసుకోండి. రోజుకు 20 గంటలు చదవాలి. టన్నులకొద్దీ బట్టీ పట్టాలనే ఆలోచన నుంచి బయటికి రండి. కంటినిండా నిద్రపోండి. మనసును ఉల్లాసంగా ఉంచుకోండి. గ్రూప్ -1 ఉద్యోగం వచ్చిందని కలలు కనండి. ఆ కలను నిజం చేసుకునేందుకు శ్రమించండి. గ్రూప్ -1 విజేతలను సంప్రదించండి. వాళ్లతో చర్చించండి. ఎప్పుడు ఎవరికి ఎటువంటి సందేహం వచ్చినా, సలహాలు కావాలన్నా నన్ను నేరుగా సంప్రదించవచ్చు.
…సూర్యకిరణ్
RELATED ARTICLES
-
Career Guidence | Career in Python Programming Language
-
NEET Success Stories | నీట్లో మెరిసిన తెలుగు తేజాలు
-
JEE Advanced 2023 – Success Stories | లక్ష్యం పెట్టుకున్నారు.. లక్షణంగా సాధించారు
-
Success Stories | ఆత్మవిశ్వాసం @ ఆరు ఉద్యోగాలు
-
Civil Services Success Stories | వీక్లీ టెస్టులతో లోపాలు సవరించుకున్నా..
-
Civil Services Success Stories | సివిల్స్‌లో మెరిసిన తెలంగాణ తేజాలు
Latest Updates
Groups / DSC Special – Social Studies | స్వయం మట్టి మార్పిడి విధానాన్నిఅనుసరించే నేలలు?
Indian Polity | సభ ఆమోదిస్తేనే అత్యవసరం.. లేదంటే రద్దు
Israel – Hamas war | రావణకాష్టం.. ఇజ్రాయోల్ – పాలస్తీనా వివాదం
Geography | సౌర కుటుంబంలో అత్యంత సాంద్రత గల గ్రహం?
General Studies – Groups Special | ఇనుము తుప్పు పట్టినప్పుడు బరువు పెరగడానికి కారణం?
Biology | First Genetic Material.. Reactive Catalyst
Current Affairs | ఆది మహోత్సవ్ దేనికి సంబంధించింది?
Telangana Movement | ‘తెలంగాణ జాగో హైదరాబాద్‌కో బచావో’ సభ నిర్వహించిన పార్టీ?
Economy- Groups Special | భారతదేశంలో ప్రత్యేక ఆర్థిక మండళ్ల ప్రధాన విధి?
UCEED & CEED 2024 | యూసీడ్ & సీడ్-2024 ఐఐటీలో ప్రవేశాలు !