తెలంగాణలో సాహిత్యం
ఒక ప్రాంత అస్తిత్వానికి సూచిక ఆ ప్రాంతంలో వెలువడిన సాహి త్యం. ఆ ప్రాంత ప్రజల సంస్కృతిని, సమాజాన్ని వివరించేది సాహిత్యం. రాచరికంలో రాజుల గురించి, సమాజపు వర్ణన గురించి, ప్రతీ అం శాన్ని, విశేషాన్ని, కష్టాన్ని, దుఃఖాన్ని, మంచి చెడుల గురించి వివరిస్తుంది సాహిత్యం. ఆ కాలపు సంఘటనల సమాచారాన్ని అందించేది సాహిత్యం. కాలగర్భంలో కలిసిపోయిన చరిత్రకు ప్రతిరూపం సాహిత్యం. శిల్పం, శిల్పంలోని అందాన్ని వర్ణించేది సాహిత్యం. తెలంగాణలో సాహిత్యానికి కొదవ లేదు. కవులు, కళాకారులకు కొదవలేదు. తెలంగాణ సంస్కృతిని కాపాడి, ఉద్యమాన్ని నడిపించి, బతికించినది సాహిత్యం. నాలుగు కోట్ల సమాజానికి ప్రతిరూపం తెలంగాణ సాహిత్యం. మారిన సిలబస్‌లో 15 నుంచి 20 మార్కుల వరకు గ్రూప్-1, 2లో ప్రభావితం చేసే అంశం తెలంగాణ సాహిత్యం. ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం వరకు శాతవాహనులు మొదలు కాకతీయులు, కుతుబ్‌షాహీల వరకు విశాలాంధ్రలో తెలంగాణ సాహిత్యానికి కొదవలేదు. శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం, గుణాఢ్యుడి బృహత్కథ మొదలు నేటి నందిని సిధారెడ్డి, గద్దర్, వరవరరావు వరకు సాహిత్య పోకడలు ఎన్నో మరెన్నో. తెలంగాణ సాహిత్యం.. గ్రూప్స్ విద్యార్థుల కోసం…
తెలంగాణ ప్రాంతంలో తెలుగు సాహిత్య చరిత్రను ముదిగంటి సుజాతారెడ్డి ఏడు యుగాలుగా విభజించారు. అవి..1. ఆరంభం 2. వేములవాడ చాళుక్య యుగం 3. కాకతీయుల యుగం 4. రాచకొండ పద్మనాయకుల యుగం 5. కుతుబ్‌షాహీల యుగం 6. అసఫ్ జాహీల యుగం 7. విశాలాంధ్ర యుగం
తెలంగాణ వ్యుత్పత్తి
విద్యానాథుడు తిలింగ పదాన్ని శైవమత ప్రభావంతో ‘త్రిలింగ’ అనే పదానికి ‘ఆణెము’ అనే పదం చేరి ‘తిలింగాణెమై’ అది క్రమంగా తెలంగాణంగా పరిణామం చెందిందని భాషావేత్తల అభిప్రాయం. ‘ఆణెము, దేశము’ అనేవి పర్యాయపదాలు. క్రీ.శ. 3వ శతాబ్దానికి చెందిన కోటిలింగాల నాణేల మీద ఉన్న పదాలు నారన, సామయ, గోపయ, భద్రయ మొదలైనవి. దీనిని బట్టి తెలుగులో తొలిపదం ‘నారన’ అని, అమరావతి స్థూపంపై ఉన్న నాగబు కాదని నిర్ధారించారు. ‘నారన’లోని ‘అన’ బంధు వాచక పదంగా గుర్తించారు.
ఆరంభ ం
శాతవాహన, శాతవాహన అనంతర యుగాలను తెలంగాణ సాహిత్యంలో ‘ఆరంభం’గా పేర్కొన్నారు. క్రీ.పూ. మొదటి శతాబ్దంలో పాలించిన కుంతల శాతకర్ణి ఆస్థానంలో శర్వవర్మ, గుణాఢ్యుడు అనే సుప్రసిద్ధ రచయితలున్నారు. శర్వవర్మ సంస్కృతంలో కాతంత్ర వ్యాకరణాన్ని రాశాడు. గుణాడ్యుడు ‘పైశాచీ’ భాషలో ‘బృహత్కథ’ అనే కథాకావ్యాన్ని రాశాడు. అప్పటి ప్రజల బాషనే ‘పైశాచీ’ భాషయని భాషా వేత్తల అభిప్రాయం. బృహత్కథలో ఉదయనుడు అతని కుమారుడు నరవాహనదత్తుల….. సాహస అద్భుత కార్యాలు వర్ణింపబడ్డాయి.
హాలుడు
క్రీ.శ. మొదటి శతాబ్దం వాడైన హాల శాతవాహనుడు ‘కవివత్సలుడు’గా ప్రసిద్ధి చెందాడు. హాలుడు ప్రాకృత భాషలో గాథాసప్తశతిని రాశాడు. గాథాసప్తశతిలో అద్దం, పొట్టి, అత్త, పాడి, పిల్ల, కంటె, కరణి, పత్తి మొదలైన తెలుగు పదాలు కనిసిస్తున్నాయి. తెలంగాణా మొదటి లిఖిత కవి ‘గుణాఢ్యుడు’ అని చెప్పవచ్చు. హాలుని పట్టపురాణి మలయవతి సంస్కృత ప్రాకృత, ఆంధ్రభాషలలో ప్రావీణ్యురాలు. సింహళ రాకుమార్తె లీలావతి, హాలుల వివాహాన్ని ఇతివృత్తంగా తీసుకొని కుతూహలుడు మహారాష్ట్రీ ప్రాకృతంలో ‘లీలావతి’ కావ్యాన్ని రాశాడు. కామసూత్రాలను రచించిన వాత్స్యాయనుడు, ‘సుహృల్లేఖ’ అనే బౌద్ధమత గ్రంథాన్ని రచించిన ఆచార్య నాగార్జునుడు శాతవాహనుల కాలం నాటివారే.
వేములవాడ చాళుక్యయుగం (క్రీ.శ. 750-973)
తెలంగాణలో కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాలను మొదట బోధన్‌ను, తర్వాత వేములవాడను రాజధానిగా చేసుకొని వేములవాడ చాళుక్యులు పరిపాలించారు. వేములవాడ చాళుక్యులు జైన, శైవ మతాలను అభిమానించారు. తెలుగులో మొదట శాసనాలను వేయించినవారు రేనాటి చోళులు. తెలుగులో మొదట్టమొదటి శాసనం క్రీ.శ. 575 నాటి ధనంజయుని కలముళ్ల శాసనం, రేనాటి చోళులు తెలుగులో వేయించిన 33 శాసనాలు దాన శాసనాలే. తెలుగులో తొలి పద్య శాసనం తూర్పు చాళుక్యరాజు గుణగ విజయాదిత్యుని సేనాని పండరంగడు వేయించిన అద్దంకి శాసనం. ఇది ఒక తరువోజ ఛందస్సులో నాలుగు పంక్తుల వచనంలో ఉంది. సీస పద్యం గల తొలి శాసనం గుణగ విజయాదిత్యుడు వేయించిన కందుకూరు శాసనం.
#తెలంగాణ ప్రాంతంలో వేయబడిన తొలి గద్యశాసనం కొరవి శాసనం. దీనిని ముదిగొండ చాళుక్యరాజైన నిరవద్యుడు క్రీ.శ. 935లో వేయించాడు.
# తెలంగాణ ప్రాంతంలోని తొలి పద్యశాసనం కుర్క్యల శాసనం. దానిని పంపకవి సోదరుడైన జిన వల్లభుడు క్రీ.శ. 945లో వేయించాడు. ఈ శాసనంలో తెలుగులో మూడు కంద పద్యాలేకాకుండా సంస్కృత, కన్నడ పద్యాలు కూడా ఉన్నాయి.
# విరియాల కామసాని వేయించిన గూడూరు శాసనంలో మూడు చంపకమాలలు, రెండు ఉత్పలమాలలు ఉన్నాయి. ఇది క్రీ.శ. 1000 నాటిది. విరియాల కామసాని శత్రువినాశనం చేసి కాకతి బేతయను కాకతి గద్దెమీద కూర్చోబెట్టినట్లుగా ఈ శాసనం చెప్పబడింది. ఈ యుగానికి చెందిన కవుల్లో వేములవాడ భీమన, మల్లియరేచన, సోమదేవ సూరి, బద్దెన ముఖ్యులు.
#వేములవాడ భీమన వేములవాడకు చెందిన సుప్రసిద్ధ కవి. ఈయన నన్నయ కంటే ముందువాడని, శ్రీనాథుడు చెప్పిన ‘వచియింతు వేములవాడ భీమనభంగి ఉద్దండలీల’ అనే వాక్యం ద్వారా తెలుస్తుంది. శ్రీనాథుడు పూర్వ కవులను స్తుతించే సందర్భంలో నన్నయ కంటే ముందుగా భీమనను స్తుతిస్తాడు. దీనిని బట్టి భీమ కవి నన్నయ కంటే ముందువాడని తెలుస్తుంది. ఈయన చాటు పద్యాలను రాయడంలో దిట్ట. ఈయన రచనలు రాఘవపాండవీయం, నృసింహ పురాణం, హరవిలాసం, శత కంధర రామాయణం. ఇవి ఏవీ లభించడం లేదు.
కాకతీయుల యుగం
క్రీ.శ. 9వ శతాబ్దం నుంచి మొదలుకొని 14వ శతాబ్దం వరకు కాకతీయులు తెలుగు ప్రాంతాన్ని పరిపాలించారు. వీరి కాలంలో సంస్కృత, తెలుగు కవులున్నారు. వారిలో పాల్కురికి సోమనాథుడు, కృష్ణమాచార్యులు, చక్రపాణి రంగన, మారన, విద్యానాథుడు ముఖ్యులు.
పాల్కురికి సోమనాథుడు
# ఇతడు శివ కవుల్లో ప్రసిద్ధుడు. తల్లిదండ్రులు శ్రీయాదేవి, విష్ణురామదేవుడు. గురువు గురులింగార్యుడు.
#ఇతని రచనలు: తెలుగులో అనుభవసారం, వృషాధిప శతకం, చతుర్వేదసారం, చెన్నమల్లు సీసములు, బసహోదాహరణం, పండితారాధ్య చరిత్ర, బసవపురాణం మొదలైనవి.
# సంస్కృత రచనలు: సోమనాథ భాష్యం, రుద్ర భాష్యం, సంస్కృత బసహోదాహరణం, వృషభాష్టకం, త్రివిధ లింగాష్టకం.
# కన్నడ రచనలు: సద్గురు రగడ, చెన్నబసవరగడ, బసవలింగ నామావళి, శివగణ సహస్ర నామాలు మొదలైనవి.
# పాల్కురికి సోమనాథుడు రచించిన వృషాధిపశతకం తెలుగులో సర్వ లక్షణ సంపన్నమైన తొలి శతకం. తెలుగు సాహిత్యంలో పలు ప్రక్రియలకు ఆద్యుడు సోమనాథుడు.
# తెలుగులో వెలసిన మొదటి సాహిత్య ప్రక్రియ ఉదాహరణం. ఇది తెలుగు నుంచి సంస్కృతంలోకి కొనిపోబడింది (తీసుకోబడింది). ఎనిమిది విభక్తాలలో ఎనిమిది వృత్తములు, ఎనిమిది కళికలు, ఎనిమిది ఉత్కళికలు, సార్వ విభక్తిక పద్యం, అంకిత పద్యం రాయబడిన స్తోత్రరూపం. కళిక మాత్రా ఛందస్సుకు సంబంధించిన రగడ భేదం ఎనిమిది పాదాలుంటాయి. ఉత్కళికం అంటే కళికలో సగం.
#తెలుగులో తొలిసారిగా సమకాలీన సమాజమును చిత్రించిన సాంఘిక కావ్యం- బసవ పురాణం. ఇది తెలుగు సాహిత్యంలో శుద్ధమైన దేశీ పద్ధతిలో తొలిసారి వెలువడిన స్వతంత్రమైన వీరశైవ పురాణం. ప్రథమాంధ్రదేశి పురాణం. ప్రప్రథమ వీరశైవ పురాణం, మొదటి స్వతంత్ర పురాణంగా ప్రసిద్ధి చెందిన కావ్యం బసవ పురాణం. మగ్ధ సంగయ్య, బెజ్జమహాదేవి, గోడగూచి, సిరియాళ చరిత్ర, కన్నప్ప కథ, దుగ్గవ్వ కథ, మడివాలు మాచయ్య మొదలైన శివభక్తుల వృత్తాంతం గల కావ్యం బసవపురాణం.
# ‘తెలుగు మాటలవంగ వలదు వేదముల కొలణియగా చూడుడని’ పలికిన కవి పాల్కురికి సోమనాథుడు. ‘తెలుగు’ పదాన్ని మొదట ప్రయోగించిన కవి. ‘కూర్చెద ద్విపదలు కోర్కెదైవార’, ఐహికాముష్మిక ద్విపద హేతువని’ చాటి చెప్పిన కవి ఇతడు.
# శివుని తన కుమారునిగా భావించి బాల్యోపచారాలు చేసిన భక్తురాలు బెజ్జమహాదేవి.
# తెనుగుజాతి తొలి విజ్ఞాన సర్వస్వంగా ప్రసిద్ధిగాంచిన కావ్యం పండితారాధ్య చరిత్ర. ద్యూత, సంగీత, నాట్య, రసవాద, వైద్యాది శాస్త్ర పరిజ్ఞానం గల కావ్యం ఇది.
# ‘జాను తెనుగు విశేషుమ ప్రసన్నతకు’ అని పలికిన కవి పాల్కురికి సోమనాథుడు.
# కృష్ణమాచార్యులు: ఈయన కాలం 13వ శతాబ్దం ఉత్తరార్థం నుంచి 14వ శతాబ్దం పూర్వార్థం. రెండో ప్రతాపరుద్ర చక్రవర్తికి సమకాలికుడు. ఇతని జన్మస్థలం మహబూబ్‌నగర్ జిల్లాలోని సంతూరు. తెలుగులో తొలి వచనములను రచించిన కవి. ఈయన రాసిన కావ్యం సింహగిరి నరహరి వచనములు. ఇది తెలుగులో తొలి వైష్ణవ కావ్యంగా ప్రసిద్ధి గాంచింది.
చక్రపాణి రంగన
# ఈ కవి మొదట వైష్ణవుడిగా ఉండి పాల్కురికి సోమనాథునితో శాస్త్రవాదంలో ఓడిపోయి శైవ దీక్ష పొందాడని ఒక కథ ప్రచారంలో ఉంది. నాయన రగడ, నమశ్శివాయ రగడ, గిరినాథ విక్రయము, శరభ లీల మొదలైన కావ్యాలను రాశాడు. ఇవి అలభ్యం. వైష్ణవుడిగా ఉన్నప్పుడు శ్రీశైల మార్గంలో పోతూ మల్లికార్జునుని సందర్శించకపోవడంతో గుడ్డివాడయ్యాడని తర్వాత సోమనాథుని దయవల్ల దృష్టిని పొంది ‘నయన రగడ’ రాశాడని అంటారు. ఈ రగడలో ప్రతి పాదం చివర ‘కంటి’ అనే పదం ఉంటుంది. ‘నయన రగడ’కు గల మరోపేరు శివభక్తి దీపిక.
గోన బుద్ధారెడ్డి
# ఇతని కాలం 13వ శతాబ్దం. రాయచూరు మండలాన్ని పరిపాలించిన సామంతరాజు. గోన బుద్ధభూపతి తండ్రి గోన గన్నారెడ్డి. ఇతనికి విట్టల భూపతి అని కూడా పేరున్నది. ఇతడు రామాయణమును ద్విపద ఛందస్సులో రాశాడు. ఇది తెలుగులో తొలి రామాయణం. దానికి రంగనాథ రామాయణం అని పేరు. గోన బుద్ధారెడ్డి బాల కాండ నుంచి యుద్ధ కాండ వరకు రాస్తే అతని కుమారులు కాచభూపతి, విఠలనాథుడు ఉత్తర కాండను రాసి సంపూర్ణం చేశారు.
# సంస్కృతంలో రామాయణం రాసిన కవి వాల్మీకి. రామయణంలోని భాగాలకు గల పేరు కాండములు. కాండముల సంఖ్య 7. అవిబాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ధ, ఉత్తర కాండలు.
భాస్కర రామాయణ కవులు
#భాస్కర రామాయణాన్ని రచించిన వారిలో ముఖ్యుడు ళక్కి భాస్కరుడు. ఈయన తన కుమారుడు, శిష్యుడు, మిత్రులతో కలిసి భాస్కర రామాయణమును రాశాడు. భాస్కరుడు అరణ్య కాండం, యుద్ధ కాండ పూర్వభాగమును, కుమారుడు మల్లికార్జునభట్టు బాల, కిష్కింధ, సుందర కాండలను, రుద్రదేవుడు అయోధ్య కాండను, మిత్రుడు అమృతార్యుడు యుద్ధ కాండ ఉత్తర భాగం రాశారు. భాస్కర రామాయణం సాహిణి మారనకు అంకితమీయబడింది.
మారన
# ఈయన తిక్కన శిష్యుడు. ఈయన తెలుగులోకి అనువదించిన మార్కండేయపురాణం తెలుగులో మొదటి పురాణం. తిక్కన సోమయాజి అనుగ్రహం వల్లనే కవిత్వం చెప్పగలిగానని మారన అశ్వాసాంత గద్యంలో చెప్పుకొన్నాడు. ఈ కావ్యమును రెండో ప్రతాపరుద్రుని సేనాని నాగయ గన్ననికి అంకితమిచ్చాడు. ఇతడే గోన గన్నారెడ్డి అని పరిశోధకుల అభిప్రాయం.
#కొలని రుద్రదేవుడు రెండో ప్రతాపరుద్రుడి ఆస్థాన కవి. ‘రాజరుద్రీయం’ పేరుతో పాణిని సూత్రవృత్తికి వ్యాఖ్యానం రాశాడు.
రావిపాటి త్రిపురాంతకుడు
# రెండో ప్రతాపరుద్రడి కాలంవాడు. ఈయన ‘త్రిపురాంతకోదహరణం’ అనే ఉదాహరణ కావ్యం రాశాడు. సంస్కృతంలో రచించిన ప్రేమాభిరామమును తెలుగులో క్రీడాభిరామంగా అనువదింపబడింది.
# కుబ్బాంబిక : ఈమె గోన బుద్ధ్దారెడ్డి కుమార్తె. బూదపురం శాసనం వేయించింది.
జాయపసేనాని
# ఇతడు కాకతీయ గణపతి దేవ చక్రవర్తి బావమరిది. ఇతడు రచించిన గ్రంథం నృత్యరత్నావళి. నాటి తెలంగాణ నృత్యరీతుల్ని తెలిపే గ్రంథం ఇది.
# రుద్రదేవుడు : రుద్రదేవుడిగా ప్రసిద్ధిగాంచింది ప్రతాపరుద్రుడు. ఇతడు రచించిన గ్రంథం నీతిసారం.
నరహరి
# ఈయన భువనగిరి ప్రాంతానికి చెందిన కవి. ముమ్మటుని కావ్యప్రకాశానికి బాలచిత్తానురంజనమనే వ్యాఖ్యానం, స్మృతిదర్పణం, తర్కరత్నాకరమనే గ్రంథాలను రాశాడు.
విశ్వేశ్వరదేశికుడు
# ఈయన కాకతీయ గణపతి దేవుడికి దీక్షా గురువు. ‘శివతత్వరసాయనం’ అనే గ్రంథాన్ని రాశాడు.
విద్యానాథుడు
# సంస్కృతంలో అలంకార గ్రంథాలను రచించి ప్రసిద్ధిగాంచిన తెలుగువారిలో మొదటివాడు విద్యానాథుడు. ఈయన ప్రతాపరుద్రుడి ఆస్థాన కవి. ఇతడు రచించిన అలంకార శాస్త్ర గ్రంథం ప్రతాపరుద్రయశోభూషణం. ఈ గ్రంథంలో కావ్య, నాటక లక్షణాలను తెలుపడంతోపాటు తాను చెప్పిన లక్షణాలకు ఉదాహరణగా ‘ప్రతాపరుద్ర కల్యాణం’ అనే నాటకాన్ని రచించాడు.
అగస్త్యుడు
# ఇతడు ఓరుగల్లు నివాసి. బాలభారతం, నలకీర్తికౌముది, శ్రీకృష్ణ చరిత్ర, అగస్త్య నిఘంటువు మొదలైనవి ఇతడి రచనలు.
రాచకొండ పద్మనాయకుల యుగం
# క్రీ. శ. 1326 నుంచి 1482 వరకు రాచకొండ రాజ్యాన్ని పద్మనాయకులు పరిపాలించారు. ఈ యుగానికి చెందిన కవులు, రచయితలు మల్లినాథ సూరి, సాయణుడు, పోతన, మొల్ల, పిల్లలమరి పినవీరభద్రుడు, గౌరన, మడికి సింగన, కొరవి గోపరాజు.
మల్లినాథ సూరి
# ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యాఖ్యాత మల్లినాథ సూరి. ఇతడి తండ్రి కపర్ధి. స్వస్థలం మెదక్ జిల్లాలోని కొలిచెలమ. ఈయన సంస్కృత పంచ కావ్యాలైన రఘువంశం, కుమార సంభవం, మేఘసందేశం, కిరాతార్జునీయం, శిశుపాలవధలకు అద్భుతమైన వ్యాఖ్యానాలను రాశాడు. ఇతడి సోదరుడు పెద్దిభట్టు.
సాయణుడు
#విజయనగర స్థాపకుడు హరిహరబుక్కరాయలు గురువైన విద్యారణ్య స్వామి సోదరుడు. ఇతడు వేదాలకు వ్యాఖ్యానాలను రాశాడు. ధాతువృద్ధి, పురుషార్థ సుధానిధి, ఆయుర్వేద సుధానిధి, యజ్ఞతంత్ర సుధానిధి, ప్రాయశ్చిత్త సుధానిధి ఇతర రచనలు.
పోతన
# ఈయన కాలం క్రీ.శ. 1420-1480. ఇతడి జన్మస్థలం వరంగల్ సమీపాన గల ‘బమ్మెర’ గ్రామం. తల్లిదండ్రులు లక్కుమాంబ, కేసనమంత్రి. గురువు ఇవటూరి సోమనారాధ్యుడు. ఇతడి రచనలు వీరభ్రద విజయం, భోగినీ దండకం, నారాయణ శతకం. ఆంధ్రభాగవతం. భాగవతాన్ని తన ఇష్ట దైవమైన శ్రీరామునికి అంకితమిచ్చాడు. భాగవతంలోని 5, 6, 11, 12 స్కంధాలు శిథిలం కాగా వాటిని పోతన శిష్యులు రాసి పూర్తి చేశారు. 5వ స్కంధం బొప్పరాజు గంగన, 6వ స్కంధం ఏర్చూరి సింగన, 11, 12 స్కంధాలను వెలిగందల నారన రాశారు. భాగవతంలోని స్కంధాల సంఖ్య 12.
# సర్వజ్ఞ సింగభూపాలుడి ప్రేయసి గురించి పోతన రాసిన దండకం భోగినీ దండకం. ఇది తెలుగులో ప్రత్యేకంగా రాయబడిన తొలి దండకం.
#కొందరికి తెనుగు గణంబుగా కొందరికి సంస్కృతంబుగా నేనందరి మెప్పింతు కృతులనయ్యె యెడలన్ అని చెప్పిన కవి పోతన.
# భాగవతం ప్రకారం భగవంతుని అవతారాలు 21. అవి 1) బ్రహ్మ 2) వరాహం 3) నారదుడు 4) నరనారాయణుడు 5) కపిలుడు 6) దత్తాత్రేయుడు 7) యజ్ఞుడు 8) ఉరుక్రముడు 9) పృథు చక్రవర్తి 10) మత్స్యం 11) కూర్మం 12) ధన్వంతరి 13) మోహినీ 14) నరసిండు 15) వామనుడు 16) భార్గవ రాముడు 17) వ్యాసుడు 18) శ్రీరాముడు 19) బలరాముడు 20) శ్రీకృష్ణుడు 21) బుద్ధ్దుడు
#పోతన భాగవతంలో వర్ణించిన నవ విధ భక్తులు 1) శ్రవణం 2) కీర్తనం 3) విష్ణు స్మరణం 4) అర్చనం 5) పాద సేవనం 6) వందనం 7) దాస్యం
మొల్ల
# ఈమె నెల్లూరు ప్రాంతానికి చెందిన కవయిత్రి కాదని, రెండో ప్రతాపరుద్రుడి ఆస్థానంలో ఉన్నట్లుగా ఏకామ్రనాథుడి ప్రతాపచరిత్ర ద్వారా తెలుస్తుంది. మొల్ల రామాయణం సంక్షిప్తంగా రాసింది. వాల్మీకి రామాయణంలో లేని గుడు రాముడి పాదాలను కడిగిన వృత్తాంతం మొల్ల రామాయణంలో కనబడుతుంది. శ్రీకంఠమల్లేశుడి వరం చేత కవిత్వం చెప్పగలిగానని మొల్ల చెప్పుకుంది.
పిల్లలమరి పినవీరభద్రుడు
# ఇతడి పూర్వీకులు నల్లగొండ జిల్లా సూర్యాపేట సమీపంలో గల పిల్లలమరి గ్రామానికి చెందినవారు. విజయనగరానికి వలసపోయారు. పిల్లలమరి పినవీరభద్రుడు సాళువ నరసింహరాయల ఆస్థాన కవి. ‘వాణి నా రాణి’ అని సగర్వంగా చెప్పుకున్నాడు. ఇతడి రచనలు శృంగార శాకుంతలం, జైమిని భారతం ఇవి లభ్యాలు. అవతార దర్పణం, నారదీయం, మాఘమహత్మ్యం మానసోల్లాసం ఇవి అలభ్యాలు. శృంగార శాకుంతలాన్ని చిల్లర వెన్నయమంత్రికి, జైమిని భారతాన్ని సాళువ నరసింహరాయలకు అంకితమిచ్చాడు.
గౌరన
#ఇతడి కాలం క్రీ.శ. 1380 -1450. ద్విపద ఛందస్సులో నవనాథచరిత్ర, హరిశ్చంద్రోపాఖ్యానం అనే కావ్యాలను సంస్కృతంలో ‘లక్షణదీపిక’ అను ఛందోగ్రంథాన్ని రాశాడు. తాను శ్రీశైలభ్రమరాంబ అనుగ్రహం వల్ల కవిత్వం చెప్పానని అన్నాడు. తాను రాసిన కావ్యాలను శ్రీశైల మల్లికార్జునునికి అంకితమిచ్చాడు. గౌరన పెదతండ్రి పోతనామాత్యుడు రాచకొండ రాజైన ముదా నాయకుడి మంత్రి.
#తొమ్మిదిమంది శైవ సిద్దుల మహిమలను వర్ణించే 5 అశ్వాసాల ద్విపద కావ్యం నవనాథ చరిత్ర. నవనాథ సిద్దుల్లో ముఖ్యుడు మీననాథుడు. ఈయన సారంగధరుడిని రక్షించి ‘చేరంగి’ అను సిద్దునిగా మార్చాడు.
# నవనాథ చరిత్రను గౌరనకు పూర్వమే పద్య ప్రబంధంగా రాసిన కవి శ్రీగిరి కవి.
#హరిశ్చంద్ర కథను కావ్య వస్తువుగా గ్రహించిన తెలుగు కవుల్లో మొదటివాడు గౌరన. హరిశ్చంద్ర కథలో నక్షత్రక పాత్ర సృష్టికర్త గౌరన. కవులందరినీ ‘శిరఃకంపంబు సేయునట్లుగా కనుల పండువగా’ హరిశ్చంద్ర కథను ద్విపదలో రాశాడు.
మడికి సింగన
#ఈయన కాలం క్రీ.శ. 1420. తెలుగులో మొదటి పద్య సంకలనమైన ‘సకలనీతి సమ్మతము’ అనే గ్రంథాన్ని రూపొందించాడు. పంచతంత్రం, నీతిసారం, నీతి తారావళి, భారతం మొదలైన ఎన్నో గ్రంథాల నుంచి రాజనీతి సంబంధమైన పద్యాలను గ్రహించి ఈ సంకలాన్ని రూపొందించాడు. దీనిని కేశవేశ్వరుడికి అంకితమిచ్చాడు. ఇతడి ఇతర రచనలు పద్మపురాణోత్తర ఖండం, భాగవత దశమ స్కంధం, వాశిష్ట రామాయణం, సింగన భాగవత దశమ స్కంధం, పోతన భాగవతానికి పూర్వ రచన ఇది ద్విపదలో రాసి ఉంది. వాశిష్ట రామాయణాన్ని అహోబల నరసింహస్వామికి అంకితమిచ్చాడు. సంస్కృత జ్ఞాన వాశిష్టానికి ఇది సంగ్రహ అనువాదం. పద్మపురాణోత్త ఖండం, దశమ స్కంధాలను వెలిగందుల కందయామాత్యుడికి అంకితమిచ్చాడు.
కొరవి గోపరాజు
# ఇతడు రచించిన కావ్యం సింహాసన ద్వాత్రింశిక. ఇది కథా కావ్యం. దీనిని హరిహరనాథుడికి అంకితమిచ్చాడు. భోజరాజు విక్రమాదిత్యుడి సింహాసనాన్ని అధిరోహించడానికి వచ్చినప్పుడు దాని మెట్లమీద ఉన్న 32 బొమ్మలు చెప్పిన కథలు ఇందులో ఉన్నాయి. ఒక్కోరోజు ఒక్కో బొమ్మ ఒక్కో కథను చెప్పి భోజరాజును సింహాసనమెక్కకుండా ఆపడం ఇందులోని ఇతివృత్తం.
# సమకాలీన సాంఘిక విషయాలను ఎన్నింటినో ఇందులో చెప్పాడు.
భైరవ కవి
# ఇతడు గౌరన కుమారుడు. ఇతడి రచనలు శ్రీరంగమహత్మ్యం, రత్నశాస్త్రం, కవిగజాంకుశం. కవిగజాంకుశం లక్షణ గ్రంథం. రత్నశాస్త్రం నవరత్నాల గుణదోషాలను వివరించే గ్రంథం.
అనంతామాత్యుడు
# ఇతడు క్రీ.శ. 1435 కాలంవాడు. ఇతడి రచనలు భోజరాజీయం, ఛందోదర్పణం, రసాభరణం. ప్రసిద్ధమైన గోవ్యాఘ్రసంవాదంగల కావ్యం భోజరాజీయం. వివిధ కథానూత్నభూషణాభిరామంగా ప్రసిద్ధిగాంచిన కథా కావ్యం భోజరాజీయం. ఛందోదర్పణమునకుగల మరో పేరు అనంతుని ఛందం. రసాభరణమునకు గల మరో పేరు రసార్ణవం.
-డా. తండు కృష్ణ కౌండిన్య
అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలుగు శాఖ
దేవరకొండ, నల్లగొండ జిల్లా
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు