మౌర్య పూర్వయుగం ఎలా ఉండేది?
క్రీ.పూ 600-300 మధ్య ఉన్న మౌర్యుల పూర్వయుగాన్ని బుద్ధుని యుగం లేదా షోడశ మహాజన పదాల యుగమని కూడా అంటారు. ఈ కాలానికి గౌతమ బుద్ధుడు యుగపురుషుడు కాబట్టి బుద్ధుని యుగమని, ఈ కాలంలోనే 16 గొప్ప రాజ్యాలు అవతరించడం వల్ల షోడశ మహాజన పదాల యుగమని చరిత్రకారులు అభివర్ణించారు.
షోడశ మహాజనపదాలు
పాళీభాషలో రాసిన అంగుత్తరనికాయ అనే బౌద్ధ గ్రంథం షోడశ మహాజనపదాలుగా పిలిచే 16 రాజ్యాల గురించి సమాచారమిస్తుంది. వీటిలో పది రాజ్యాలు గంగా మైదానం, రెండు వాయవ్య భారత్ ఒకటి, పశ్చిమ భారత్లో రెండు, మధ్య భారత్లోఒకటి, దక్షిణ భారత్లో ఒకటి వెలిశాయి.
నోట్: మరొక బౌద్ధ గ్రంథమైన మహావస్తు, జైన గ్రంథాలైన భాగవతిసూత్ర ఇచ్చిన షోడశ మహాజనపదాల జాబితా భిన్నంగా ఉంటుంది.
క్రీ.పూ 6వ శతాబ్దంలో గణతంత్ర, రాచరిక వ్యవస్థలు కలిగిన రాజ్యాలు అనేకం వెలిశాయి. గణతంత్ర రాజ్యాల్లో ప్రజాస్వామ్యయుతమైన పాలన కొనసాగి, పాలకుడు ప్రజల ద్వారా ఎన్నికయ్యేవాడు. రాచరిక రాజ్యాల్లో మాత్రమే నిరంకుశ పాలన కొనసాగి పాలకులు వంశపారంపర్యంగా అధికారానికి వచ్చేవారు.
అప్పటి పాళీగ్రంథాల్లో పది గణతంత్ర రాజ్యాల ప్రస్తావన ఉంది. రామగ్రామాన్ని పాలించిన కోలియ, పిల్పలి వాహనాన్ని పాలించిన మొరియ, పావను పాలించిన మల్ల, కుందగ్రామాన్ని పాలించిన జ్ఞాత్రిక లేదా న్యాయ, వైశాలిని పాలించిన వజ్జి, కపిలవస్తును పాలించిన శాక్య రాజ్యాలు అతిముఖ్యమైన గణతంత్ర రాజ్యాలు. ఈ గణతంత్ర రాజ్యాల్లోనే అవైదిక మతాలైన బౌద్ధం, జైనం ఆవిర్భవించాయి. గౌతమ బుద్ధుడు (శాక్య రాజ్యం) 24వ తీర్థంకరుడైన మహావీరుడు (జ్ఞాత్రిక రాజ్యం) గణతంత్ర రాజ్యాలకు చెందినవారు. గణతంత్ర రాజ్యప్రజలు ఈ మతాలను విశేషంగా ఆదరించారు.
వైశాలి రాజధానిగా పాలించిన వజ్జి లేదా లిచ్ఛవి రాజ్యం గణతంత్ర రాజ్యాల్లో అత్యంత ప్రముఖమైనది. గౌతమ బుద్ధునికి సమకాలికుడైన చేతకుడు ఈ రాజ్యానికి సుప్రసిద్ధ పాలకుడు. ఇతను తన సోదరి త్రిశాల మహాదేవిని (మహావీరుని తల్లి) జ్ఞాత్రిక పాలకుడైన సిద్ధార్థుడికి తన కుమార్తె చెల్లెలిని మగధ రాజు బింబిసారుడికిచ్చి వివాహం చేశాడు.
మౌర్యుల పూర్వయుగంలో ముఖ్యమైన రాచరిక రాజ్యాలు
కోసల
క్రీ.పూ 6వ శతాబ్దపు అగ్రరాజ్యాల్లో కోసల రాజ్యం ఒకటి. దీనికి శ్రావస్తి రాజధాని. అయోధ్య, సాకేత ఇతర ముఖ్యనగరాలు. ఈ రాజ్యాన్ని ఇక్ష్వాకు వంశం పాలించింది (భారత్లోని చాల మంది రాజులు తాము శ్రీరాముడి ఇక్ష్వాకు వంశానికి చెందినవారమని ప్రకటించుకున్నారు). కోసల రాజ్య ప్రస్తావనలు బౌద్ధ సాహిత్యంలో ఎక్కువగా ఉంటాయి. గౌతమ బుద్ధుడు కూడా ఎక్కువ బోధనలు శ్రావస్తి నగరంలోనే చేశాడు. పాళీ గ్రంథాలు బుద్ధుడిని ‘కోసలన్’ అని పిలిచాయి. కోసలను పాలించిన రాజుల్లో ప్రసేనజిత్తు అత్యంత ప్రముఖుడు. ఇతడు తన సోదరి కోసల మహాదేవిని మగధ రాజు బింబిసారుడికిచ్చి వివాహం చేశాడు. తాను జయించిన కాశీ రాజ్యాన్ని వరకట్నంగా ఇచ్చాడు. తన కుమార్తె వజ్జికను బింబిసారుడి కుమారుడైన అజాతశత్రువుకు ఇచ్చి వివాహం జరిపించాడు.
వత్స
ఈ రాజ్యాన్ని కురు వంశం పరిపాలించింది. పురాణాల ప్రకారం హస్తినాపురం వరదల్లో అంతమైన తర్వాత కౌశాంబి వీరి రాజధాని అయ్యింది. బుద్ధునికి సమకాలికుడైన ఉదయనుడు ఈ వంశంలో అత్యంత గొప్ప రాజు. బాసుడు రాసిన స్వప్నవాసవ దత్త, హర్షుడు రాసిన నాటకాల్లో ఇతనే కథానాయకుడు.
అవంతి
ఉజ్జయిని, మహిష్మతి రాజధానులుగా ప్రద్యోద వంశం అవంతి రాజ్యాన్ని పాలించింది. మహాసేనుడు ఈ వంశంలో గొప్పరాజు.
రాజ్యం – రాజధాని
- మగధ రాజగృహము లేదా గిరివ్రజం.. తర్వాత పాటలీపుత్రానికి మార్చారు (బీహార్)
- అంగ చంపనగిరి (తూర్పు బీహార్)
- కాశీ వారణాసి (ఉత్తరప్రదేశ్)
- కోసల శ్రావస్తి (ఉత్తరప్రదేశ్)
- వత్స కౌశాంబి (ఉత్తరప్రదేశ్)
- కురు హస్తినాపూర్ (ఉత్తరప్రదేశ్) ఇంద్రప్రస్త (ఢిల్లీ)
- పాంచాల అహిచ్ఛత (ఉత్తరప్రదేశ్)
- శౌరసేన మధుర (ఉత్తరప్రదేశ్)
- మల్ల పావ (బీహార్), కుశి (ఉత్తరప్రదేశ్)
- వజ్జి వైశాలి (బీహార్)
- అవంతి ఉజ్జయిని, మహిష్మతి (మధ్యప్రదేశ్)
- ఛేది సుక్తిమతి (మధ్యప్రదేశ్)
- మత్స్య విరాట నగరం (రాజస్థాన్)
- గాంధార తక్షశిల, పుష్కలా వతి (ప్రస్తుతం పాకిస్థాన్)
- కాంభోజ రాజపురం (ప్రస్తుతం పాకిస్థాన్)
- ఆస్మక / అస్సక పోదన (తెలంగాణలోని బోధన్)
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు