సార్వత్రిక కనీస ఆదాయం అమలు సాధ్యమేనా?
స్వాతంత్య్రం వచ్చి 70 ఏండ్లు కావోస్తున్నా ఇంకా పేదరికం, ధనిక, పేదల మధ్య అసమానతలు అలాగే ఉన్నాయి. పేదలకు అందాల్సిన కనీస సౌకర్యాలు ఇంకా మధ్యవర్తుల చేతుల్లో, అవినీతి పరుల చేతుల్లోనూ కరిగిపోతున్నాయి. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఇస్తున్న సబ్సిడీలు సంపన్నుల ఖాతాల్లోకి వెళ్లుతున్నాయి. ప్రభుత్వం అందించే అన్ని రకాల ఉద్దీపనలు ఇలా పేదలకు అందకుండా సరైన ఫలితాలు ఇవ్వలేక చతికిలబడుతుంది. ఇలాంటి సందర్భంలో పేదరికాన్ని నిర్మూలించడానికి, పేదల జీవితాల్లో వ్యవస్థాగత మార్పు తేవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలనుకుంటున్న పథకం సార్వత్రిక కనీస ఆదాయం (యూబీఐ) ఆర్థిక సర్వే 2016-17లో సమగ్ర వివరణలతో దీనిపై చర్చ జరిగింది. ఈ యూబీఐ పథకం అంటే ఏమిటి? దీని పర్యావసనాలేంటి, దీని నేపథ్యమేమిటి? దీనిపై వివిధ విశ్లేషకులు ఏమంటున్నారు? యూబీఐ వల్ల ఖజానాపై పడే భారమెంత? అసలు ఈ పథకం భారతదేశంలో అమలయ్యే సూచనలున్నాయి. ఒకవేళ అమలు చేయాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మొదలైన అంశాలను తెలుసుకోవడం పోటీ పరీక్షల అభ్యర్థులకు జనరల్ స్టడీస్ దృష్ట్యా అత్యంత ఆవశ్యకం. నిపుణ పాఠకుల కోసం ప్రత్యేక వ్యాసం.
సార్వత్రిక కనీస ఆదాయం (యూబీఐ)
ప్రభుత్వం తమ దేశ పౌరులందరికి బేషరతుగా కనీస ఆదాయాన్ని సమకూర్చడాన్ని యూబీఐ అని అంటారు.
సామాజిక భద్రత
-ఇది ఒక రకమైన కనీస ఆదాయాన్ని ఇచ్చే పథకం. కానీ ఇది ఇదివరకే యూరోపియన్ దేశాల్లో అమలువుతున్న పథకానికి కొన్ని విషయాల్లో తేడా ఉంది. అవి
1. యూబీఐ వ్యక్తులకు మాత్రమే ఇస్తుంది. కానీ మొత్తం కుటుంబానికి కాదు.
2. ఇతర మార్గాల్లోంచి వచ్చే ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా భేషరతుగా ఇవ్వబడుతుంది.
3. ఇంకా ఇది ఏ పనికి ప్రతిపలంగాకానీ, ఏదైనా ఉపాధిని కల్పిస్తే దాని నిర్ణయాల్లో పరిగణనలోకి తీసుకోకుండానే అందిస్తుంది. అంటే మొత్తం యూబీఐలో కింది మూడు పదాలు అతి ముఖ్యమైనవి.
1. కనీస ఆదాయం
2. భేషరతుగా
3. సార్వత్రికం (అంటే ప్రతి పౌరునికి)
-కానీ దీన్ని 75 శాతం ప్రజలకు పరిమితం చేయవచ్చని అంచనా.
యూబీఐ నేపథ్యం
-ఆర్థిక సర్వే 2016-17 ప్రకారం ప్రస్తుత పేదరిక నిర్మూలనా, పేదల సంక్షేమ పథకాల్లో తీవ్ర అవకతవకలు చేసుకుంటున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం, ఆటోమేషన్ ఉద్యోగాల కల్పనకు విఘాతమని వస్తున్న ఆందోళనకు పరిష్కారం చూసేవిధంగా యూబీఐని తీసకొస్తుంది కేంద్రం.
-పేదలకు భౌతికంగా, మానసికంగా ఆపార ప్రయోజనాలు, భరోసా కల్పించాలని యూబీఐ లక్ష్యం.
-ఇంకా ప్రపంచ మార్కెట్ దృష్ట్యా చూస్తే కెనడాలో 2004-08 మధ్య తయారీ రంగంలో 3.22 లక్షల ఉద్యోగాలు తగ్గిపోయాయి. ఇలా ఉపాధి కోల్పోయిన వారికి కొత్త ఉపాధి దొరకడం కష్టమవుతుంది. ఇక అమెరికాలో 1999 నుంచి 2011 మధ్యకాలంలో తయారీ రంగంలో 58 లక్షల మందికి ఉద్యోగాలు పోయాయి. ఈ రకంగా సమాజంలో పేదరికం, అసమానతలు పెరిగిపోతున్నాయి. దీనికి విరుగుడుగానే యూబీఐని తీసుకువచ్చారు.
-ఇక గతేడాది సర్వే ప్రకారం 4.2 శాతం సబ్సిడీలపై ఖర్చు చేస్తే దాదాపు 90 శాతం సంపన్నులకే చెందుతుందని పేర్కొంది. ఒక ట్రిలియన్ రూపాయలు సంపన్నవర్గమే పొందుతుందని పేర్కొంది.
యూబీఐ ముఖ్య ఉద్దేశం
1. మధ్యవర్తులను తగ్గించడం
2. పేదరికం, ఆసమానతలు తగ్గించడం
3. ఉపాధి కల్పనకు ప్రత్యామ్నాయ మార్గాలను పెంపొందించడం
4. సబ్సిడీలను సంస్కరించి యూబీఐ ద్వారా వాటిని అందించడం
5. యూబీఐ ద్వారా ప్రజలకు కనీస ఆదాయం ఇచ్చి వస్తువులకు గిరాకీ పెంచడం
యూబీఐ చరిత్ర-ఇతర దేశాల పరిస్థితి
1. 1969లో అమెరికాలో ప్రతిపౌరునికి కనీసం 1600 డాలర్లు ఏడాదికి ఇవ్వాలని ఆనాటి అధ్యక్షులు నిక్సన్ ప్రతిపాదించారు. దీన్ని డెమొక్రాట్లు అడ్డుకోవడంతో అది అమల్లోకి రాలేదు.
2. దేశంలో కూడా ఇలా ఉద్దేశించిన బేషరతు సార్వత్రిక కనీస ఆదాయంలో భాగంగా స్విట్జర్లాండ్‌లో ఇవ్వజూపిన 2500 డాలర్లపై రెఫరెండం నిర్వహిస్తే 75 శాతం ప్రజలు దాన్ని తిరస్కరించారు.
3. ఫిన్లాండ్లో ఇటీవలే ప్రవేశపెట్టిన యూబీఐ ప్రకారం 25 నుంచి 58 మధ్య వయస్సు వారికి నెలకు 560 యూరోలు (రూ. 40,880) ఇస్తారు. ఇది ఇతర ఆదాయ మార్గాలతో సంబంధం లేకుండా కొనసాగుతుంది.
4. కెనడాలో 1970ల మధ్యలో మానిటోనా ప్రావిన్స్‌లో ప్రవేశపెట్టారు. ఇది మంచి ఫలితాన్ని ఇవ్వడంతో ప్రస్తుతం ఆ దేశంలో 2.5 కోట్ల కెనడా డాలర్ల విలువ కలిగిన ప్రాజెక్టు సిద్ధమవుతుంది.
5. నెదర్లాండ్‌లోని ఉట్రాక్ట్ నగరంలో నెలకు 1100 డాలర్ల చొప్పున 250 మంది పౌరులకు ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు.
భారతదేశం- యూబీఐ
-యూబీఐని ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం జమ్ముకశ్మీర్. ప్రజల దారిద్య్రరేఖను ఆదారంగా చేసుకుని ఈ పథకాన్ని అమలుచేస్తున్నది.
2016-17 ఆర్థిక సర్వేలో..
-ప్రతి పేదవాడి కన్నీటిని తుడవడమే ప్రభుత్వ లక్ష్యంగా యూబీఐని అమలు చేయాలని పేర్కొంది.
-2016-17లో అయితే ప్రతి వ్యక్తికి రూ. 7620 ఇవ్వాల్సి వస్తుందని పేర్కొంది. (ఇది సురేష్ టెండూల్కర్ ఇచ్చిన లెక్కల ప్రకారం ప్రతివ్యక్తికి నెలకు రూ. 893 చొప్పును పేదవాళ్లందరినీ తగ్గించడానికి ఉపయోగపడుతుంది)
-2011-12 వినియోగ వివరాల ప్రకారం ఏడాదికి యూబీఐకి అయ్యేది ప్రతివ్యక్తికి రూ. 5400. ద్యవ్యోల్బనానికి సరిచేస్తే అది 2016-17కి రూ. 7620 అవుతుందని సర్వే పేర్కొంది.
-ఒకవేళ అందరు లబ్దిదారులను కాకుండా, సెమీ సార్వత్రికం (Quasi-Universal) మందిని మాత్రమే తీసుకుంటే (అంటే 75 శాతం మంది జనాభాను) అది జీడీపీలో 4.9 శాతం ఖర్చవుతుంది.
-కానీ కింది రెండు కారణాల వల్ల నిజంగా ఎంత ఖర్చవుతుందో అంచనా వేయలేదు.
1. ప్రజల వినియోగానికి అనుగుణంగా ప్రజల ఆదాయాలు పెరిగినట్టు సర్వే పేర్కొనలేదు. 2011-12 లెక్కలు అందుబాటులో ఉండటం వల్ల అది 2016-17కి తగ్గి, ప్రతి ఏడాదికి యూబీఐ కేవలం రూ. 6540 గానే ఉండవచ్చు. అంటే జీడీపీలో 4.2 శాతం మాత్రమే సరిపోవచ్చు.
2. వినియోగ వ్యయం మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని కలుపుకొని లెక్కించారు. దీన్ని తీసివేసి ఎంత ఖర్చు అవుతుందో అంచనాకు రాలేదు.
యూబీఐ అమలు సాధ్యాసాధ్యాలు
-ఆర్థిక సర్వే 2016-17 ప్రకారం సబ్సిడీలో ప్రధాన భాగాలైన ఆహారం, ఫెర్టిలైజర్, పెట్రోలియం కలిపి జీడీపీలో 2.07 శాతం (2014-15 వాస్తవ లెక్కలు). రాష్ర్టాలకు అయితే 2011-12 ప్రకారం అది జీడీపీలో 6.9 శాతంగా ఉంది.
-కేంద్ర ప్రభుత్వం సహకారంతో నడిచే దాదాపు 10 ఇతర ప్రధాన పథకాలన్నిటికీ కలిపి జీడీపీ 1.4 శాతం (2014-15 వాస్తవ లెక్కలు).
-ఇతర 940 చిన్న పథకాలకు కేంద్రం జీడీపీలో 2.3 శాతాన్ని ఖర్చు చేస్తుంది.
యునీసెఎఫ్, ఎస్ఈడబ్ల్యూ సర్వే ప్రకారం
-మధ్యప్రదేశ్‌లో యునీసెఫ్, ఎస్డబ్ల్యూ (సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్) జరిపిన పైలట్ ప్రాజెక్టు (2011) ప్రకారం ప్రతినెల పెద్దలకు రూ. 300, చిన్నలకు రూ. 150 ఇవ్వడం వల్ల గణనీయమైన మార్పులు వచ్చి వలసలు తగ్గాయి.
-ద్రవ్యోల్బనంతో సరిచేసి 2015-16 ధరల ప్రకారం పెద్దలకు నెలకు రూ. 450 ఇవ్వగలిగితే జీడీపీలో 5.1 శాతం ఖర్చవుతుంది. కాబట్టి నలుగురు ఉన్న కుటుంబానికి ప్రతినెల రూ. 1800 ఇవ్వగలిగితే యూబీఐని (2015-16 ధరల ప్రకారం) అమలు చేయవచ్చు.
సర్వే ప్రకారం: మధ్యతరగతికి, పేదలు కానివారికి సబ్సిడీలను తొలగించగలిగితే (మొత్తం జీడీపీలో 1 శాతం) దేశంలో ఉన్న అందరు మహిళలకు రూ. 3240 చొప్పున ప్రతి ఏడాది యూబీఐ తరపున ఇవ్వొచ్చు.
యూబీఐ వల్ల లాభ నష్టాలు
1. ఒకే దఫాలో పేదరికాన్ని తొలగిస్తుంది.
2. లబ్దిదారులు తమ ఆదాయాన్ని ఎలా ఖర్చు చేయాలో నిర్ణయించుకోవచ్చు.
3. ఇది సార్వత్రికం కాబట్టి లబ్దిదారులను గుర్తించండం కష్టం కాదు. దాదాపు అందరూ లబ్దిదారులే.
4. కనీస ఆదాయం అనేది పేదలకు అకస్మాత్తుగా వచ్చే పరిణామాలను తట్టుకునేలా చేస్తుంది.
5. పనికోసం వెతకాల్సిన మానసిక వ్యధ తప్పుతుంది.
6. ఎన్నో పథకాలను ఒకే ఒక గొడుగు కిందకి తేవడం వల్ల పాలనా సామర్ధ్యం పెరుగుతుంది.
నష్టాలు
1. వ్యక్తుల చేతుల్లో అదనపు ఆదాయం దుబారా ఖర్చుకు దారితీస్తుంది.
2. సబ్సిడీలు అయితే కచ్చితంగా దేనిపై ఖర్చు చేయాలో చేస్తాయి. కానీ యూబీఐ వల్ల అది పక్కదారి పట్టవచ్చు.
3. ఒకే కుటుంబంలో యూబీఐని ఎంచుకోవడం కష్టం. ఇది సంపన్నులకు కూడా ఇవ్వడం వల్ల ఇతర పరిణామాలు చోటుచేసుకుంటాయి.
4. యూబీఐ విఫలం చెందితే దీన్ని వెనక్కి తీసుకోవడం చాలా కష్టం.
5. ప్రజలు సోమరులయ్యే అవకాశం ఉది.
6. నగదు బదిలీ అనే మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోవాలి. అది కొన్నిసార్లు వస్తు గిరాకీని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు