నహపాణుని వెండినాణేన్ని తనపేర పునర్ముద్రించిన రాజు?
రెండో శాతకర్ణి
-ఇతను శాతవాహన రాజుల్లో 6వ వాడు.
-అత్యధికంగా 56 ఏండ్లు పరిపాలించాడు.
-ఇతడు శకులను, శుంగులను ఓడించి మాళ్వాను ఆక్రమించాడు.
-ఇతని కాలంలోనే శక-శాతవాహన సంఘర్షణ ప్రారంభమైంది.
-తెలంగాణలోనే కాకుండా ఉత్తర మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, మాళ్వా ప్రాంతాల్లో కూడా ఇతని నాణేలు దొరికాయి.
-ఇతని ఆస్థానంలోని వాసిష్టీపుత్ర ఆనందుడు సాంచీ స్థూప దక్షిణ ద్వారంపై ఒక శాసనాన్ని చెక్కించాడు.
-యుగపురాణం ప్రకారం ఈయన మగధ, కళింగ ప్రాంతాలను కూడా పరి పాలించాడని తెలుస్తుంది.
-ఈ విధంగా రెండో శాతకర్ణిని ఉత్తర భారతదేశంలో రాజ్య విస్తరణ చేసిన మొదటి దక్షిణ భారత రాజుగా పేర్కొనవచ్చు.
-రెండో శాతకర్ణి తర్వాత వరుసగా లంబోదరుడు, అపేలకుడు, మేఘస్వాతి, స్వాతి, స్కంద స్వాతి, మృగేంద్ర స్వాతికర్ణి, కుంతల శాతకర్ణి మొదలైన రాజులు పరి పాలించారు. వీరిలో చెప్పుకోదగ్గ రాజు కుంతల శాతకర్ణి మాత్రమే.
కుంతల శాతకర్ణి
-ఇతను శాతవాహన రాజుల్లో 13వ వాడు.
-శకులను ఓడించి తన పూర్వీకులు కోల్పోయిన మాళ్వా, మహారాష్ట్రలను తిరిగి పొందాడు.
-కాతంత్ర వ్యాకరణం (సంస్కృతం) రాసిన శర్వవర్మ, బృహత్కథ (పైశాచీ ప్రాకృతంలో) రాసిన గుణాఢ్యుడు ఈయన ఆస్థానంలోని వారే.
-వాత్సాయనుడి కామసూత్రాలు, రాజశేఖరుడి కావ్య మీమాంసలో ఇతని ప్రశస్తి కనబడుతుంది.
-చివరి కణ్వ వంశస్తుడైన సుశర్మను చంపి, మగధను ఆక్రమించినది కుంతల శాతకర్ణియేనని కొందరు చరిత్రకారుల అభిప్రాయం.
-కానీ మత్స్య పురాణం ప్రకారం 15వ రాజైన మొదటి పులోమావి సుశర్మను చంపి మగధను ఆక్రమించాడని తెలుపుతుంది.
హాలుడు
-శాతవాహన చక్రవర్తుల్లో 17వ రాజు హాలుడు.
-ఇతను సారస్వతాభిమాని, సాహితీవేత్త.
-ఈయన బిరుదు కవి వత్సలుడు.
-ఇతను ప్రాకృతంలో 700 శృంగార పద్యాలను గాథాసప్తశతి అనే గ్రంథరూపంలో సంకలనం చేశాడు. ఈ విషయాన్ని బాణకవి తన హర్ష చరిత్ర గ్రంథంలో తెలిపాడు.
-హాల చక్రవర్తి సింహళ రాకుమార్తె లీలావతిని సప్తగోదావరి తీరంవద్ద భీమేశ్వరుడి సన్నిధిలో వివాహం చేసుకున్నట్లు కుతూహలుడు తను రాసిన లీలావతి పరిణయం అనే కావ్యంలో పేర్కొన్నాడు.
-హాలుని వివాహం జరిగిన ప్రాంతం నేటి జగిత్యాల జిల్లాలోని వేంపల్లి వెంకట్రావుపేట అని డా. నంగనభట్ల నర్సయ్య సాక్ష్యాధారాలతో నిరూపించాడు.
గౌతమీపుత్ర శాతకర్ణి (క్రీ.శ.106-130)
-ఇతను శాతవాహన చక్రవర్తుల్లో గొప్పవాడు. 23వ రాజు.
-ఇతని కాలాన్ని గురించి చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి.
-అయితే నహపాణుని శాసనాలపై ఉన్న తేదీల ప్రకారం ఈయన క్రీ.శ.106-130 సంవత్సరాల మధ్య పరిపాలించినట్లు తెలుస్తుంది.
-ఈయన తల్లి గౌతమీ బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనంవల్ల గౌతమీపుత్ర శాతకర్ణి గుణగణాలు, విజయాలు తెలుస్తున్నాయి.
-ఈ నాసిక్ శాసనం గౌతమీపుత్ర శాతకర్ణి కుమారుడైన వాసిష్టీపుత్ర పులోమావి 19వ పాలనా సంవత్సరంలో వేసినది.
గౌతమీపుత్రుడి దిగ్విజయ యాత్రలు
-ఈయన ఆసిక లేదా రిసిక (అస్మకకు దక్షిణంగా ఉన్న కృష్ణా, గోదావరి నదుల మధ్య ప్రాంతం అంటే హైదరాబాద్, మెదక్ జిల్లాలు), అస్మక (నిజామాబాద్, ఔరంగాబాద్ జిల్లాలు), ములక (ప్రతిష్టానపురం), విదర్భ (బీరార్)లను జయించాడు.
-అంతేగాకుండా ఈయన తన దిగ్విజయ యాత్రలో భాగంగా శక-పహ్లవులను సమూలంగా నిర్మూలించాడు.
-ఇతను 18వ పరిపాలన సంవత్సరంలో తన పశ్చిమ సరిహద్దులను పాలిస్తున్న క్షహరాట వంశీయుడైన నహపాణుని (శక) అంతం చేసి క్షహరాట వంశ నిరవశేషకర అనే బిరుదు పొందాడు.
-ఈ విజయానికి చిహ్నంగా నహపాణుని వెండి నాణేన్ని తనపేర తిరిగి పునర్ముద్రించాడు.
-ఈ నాణేలు జోగల్ తంబిలో లభించాయి. (9,270 నాణేలు)
-ఈ విజయం వల్ల అపరాంత (నాసిక్, కార్లేలతో కూడిన ఉత్తర కొంకణం), అవంతి (పశ్చిమ మాళ్వా ప్రాంతం), అకర (తూర్పు మాళ్వా ప్రాంతం) శాతవాహన సామ్రాజ్య అంతర్భాగాలయ్యాయి.
-కకుర (తూర్పు రాజస్థాన్), సౌరాష్ట్ర (దక్షిణ కథియవాడ)ను కూడా జయించాడు. వీటితోపాటు నేటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈయన ఆధీనంలోనే ఉన్నాయి.
-ఈ విధంగా చాలాకాలం తర్వాత గౌతమీపుత్ర శాతకర్ణి హయాంలో శాతవాహన రాజ్యం సువిశాల రాజ్యంగా మారింది.
నాసిక్ శాసనం ప్రకారం గౌతమీపుత్ర శాతకర్ణి బిరుదులు
-శాతవాహన కుల యశఃప్రతిష్టాపనకరుడు
-క్షత్రియ దర్పమాన మర్దనుడు, క్షహరాట వంశ నిరవశేషకరుడు, ఏక బ్రాహ్మణ, ఏకశూర, ఆగమనిలయ, త్రిసముద్రతోయ పీతవాహన (ఇతని అశ్వాలు అరేబియా సముద్రం, బంగాళాఖాతం, హిందూమహాసముద్రంలో నీళ్లు తాగాయని అర్థం).
-గౌతమీపుత్ర శాతకర్ణి నాసిక్ గుహల్లో 2 శాసనాలు రాయించాడు. ఒకటి తన 18వ పాలనా సంవత్సరానికి, మరొకటి 24వ పాలనా సంవత్సరానికి చెందినవి.
-ఇతని నాణేలు కొండాపూర్, పెద్దబంకూర్లో వందలకొద్ది దొరికాయి.
-గౌతమీపుత్ర శాతకర్ణి, అతని తల్లి గౌతమీ బాలశ్రీ కలిసి లురన్హ కొండపై నివసించే బౌద్ధ భిక్షులకు దానధర్మాలు చేసినట్లు నాసిక్ శాసనాలవల్ల తెలుస్తుంది.
వాసిష్టీపుత్ర పులోమావి/రెండో పులోమావి (క్రీ.శ.130-154)
-ఇతను గౌతమీపుత్ర శాతకర్ణి కుమారుడు.
-ఈయన శాసనాలు నాసిక్, కార్లే, అమరావతి, మ్యాకదోని, బనవాసి మొదలైనచోట్ల ఉన్నాయి.
-ఇతను నవనగరం అనే పట్టణాన్ని నిర్మించాడు.
-శకరాజైన రుద్రదామనుడిచేత పరాజయంపాలై రాజధానిని ప్రతిష్టానపురం నుంచి అమరావతికి/ధాన్యకటకానికి మార్చాడు.
-గౌతమీ బాలశ్రీ నాసిక్ శాసనం పులోమావిని దక్షిణాపథేశ్వరుడని పేర్కొంది.
వాశిష్టీపుత్ర శివశ్రీ శాతకర్ణి (క్రీ.శ.154-165)
-ఇతను కూడా గౌతమీపుత్ర శాతకర్ణి కుమారుడు.
-ద్విభాషా (తమిళ, ప్రాకృత) నాణేలను ముద్రించిన తొలి శాతవాహన రాజు ఈయనే.
-కన్హేరి శాసనం ఆధారంగా ఈయన చస్తనుని మునిమనుమడైన శక రుద్రదాముని కుమార్తె, రుద్రదామనికను వివాహం చేసుకున్నట్లు తెలుస్తుంది.
యజ్ఞశ్రీ శాతకర్ణి (క్రీ.శ.165-194)
-ఇతను శాతవాహనుల్లో చివరి గొప్పరాజు.
-పురాణాల ప్రకారం ఈయన 26వ రాజు.
-ఈయన శాసనాలు కన్హేరి, నాసిక్, చిన గంజాం వద్ద లభించాయి.
-ఇతను రెండు తెరచాపలున్న ఓడ బొమ్మగల నాణేలను ముద్రించాడు.
-ఈ నాణేల ప్రకారం ఇతను గౌతమీపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణిగా తెలుస్తున్నది.
-ఇతను విదేశీయులతో యుద్ధం చేసి తన పూర్వీకులు కోల్పోయిన చాలా రాజ్య భాగాలను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు.
-తూర్పు, పడమర రాష్ర్టాలన్నింటి మీద రాజ్యాధికారం ఉన్న చివరి శాతవాహన చక్రవర్తి ఈయనే.
-అందుకే బాణుడు తన హర్ష చరిత్రలో ఈయనను త్రిసముద్రాధిపతిగా వర్ణించాడు.
-ఇతని కాలంలోనే మత్స్య పురాణం సంకలనం ప్రారంభమైంది.
-యజ్ఞశ్రీ శాతకర్ణి బౌద్ధ మతాభిమాని. ఈయన ఆచార్య నాగార్జునుని పోషించాడు.
-ఇతను నాగార్జునుని కోసం శ్రీ పర్వతం లేదా నాగార్జున కొండపై మహా విహారం లేదా పారావత విహారం నిర్మించాడు.
-ఈ విహారంలో 1500 గదులుండేవని చైనా యాత్రికుడైన ఫాహియాన్ పేర్కొన్నాడు.
-యజ్ఞశ్రీ శాతకర్ణి తర్వాత ముగ్గురు శాతవాహన రాజులు సుమారు 17 ఏండ్లు పాలించారు. వీరు విజయ శాతకర్ణి, చందశ్రీ, మూడో పులోమావి.
-వారిలో చివరి శాతవాహన రాజైన మూడో పులోమావి మ్యాకధోని శాసనం బళ్లారిలో దొరికింది. ఇతని తర్వాత సామ్రాజ్యం పతనమైంది.
-అభేరులు, ఇక్ష్వాకులు, చుటు వంశీయులు, పల్లవులు విజృంభించి స్వతంత్రులై సొంత రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారు. అంతటితో శాతవాహన యుగం అంతరించింది.
శాతవాహనుల పరిపాలన వ్యవస్థ
-నాసిక్, కార్లే గుహ శాసనాల ద్వారా వీరి పరిపాలనా విధానం గురించి మనం తెలుసుకోవచ్చు. శాతవాహనులు చాలావరకు మౌర్యుల పరిపాలనలోని అంశాలను గ్రహించారు.
శాతవాహన చక్రవర్తి అధికారాలు
-ఇతనే రాజ్యానికి అధిపతి, సర్వాధికారి, సర్వసైన్యాధిపతి.
-రాజ్యం తండ్రి నుంచి కుమారునికి వంశపారంపర్యంగా సంక్రమించేది.
-రాచరికాన్ని స్వీకరించడానికి ముందు రాజపుత్రులు రాజ్యపాలనకు అవసరమైన అన్ని విద్యల్లో శిక్షణ పొందేవారు. ఖారవేలుని హాతిగుంఫా శాసనం ఈ విషయాన్ని ధ్రువపరుస్తుంది.
-శాతవాహన రాజులు కొందరు మాతృనామాలు కలిగి ఉన్నా, రాజ్యాధికారం మాత్రం మగవారికే సంక్రమించేది.
-రాజులు రాజ, మహారాజ వంటి బిరుదులను ధరించారు. వీరు అశ్వమేధ, రాజసూయ యాగాలను నిర్వహించారు.
-శాతవాహనుల కాలం నాటికి రాజు దైవాంశ సంభూతుడనే భావన ఏర్పడింది. రాజులు రాముడు, విష్ణువు మొదలైన పురాణ పురుషుల లక్షణాలు కలిగి ఉన్నట్లుగా భావించారు.
-ధర్మశాస్త్ర బద్దంగా పరిపాలించాలనేది ఆనాటి రాజుల ఆదర్శం. రాజు ధర్మశాస్త్ర బద్దంగా, ధర్మ రక్షకుడిగా ఉండాలనే నియమం ఉండేది.
-వీరికి పరిపాలనలో మనుధర్మ శాస్త్రం, కౌటిల్యుని అర్థశాస్త్రం మార్గదర్శకాలుగా ఉండేవి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు