రాజీనామా నాటకాలు – కేంద్రం యూటర్న్
కేసీఆర్ దీక్షతో కేంద్రం దిగొచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు డిసెంబర్ 9 ప్రకటన చేసింది.. దీంతో వెంటనేసీమాంధ్ర నేతలు రాత్రికి రాత్రే రాజీనామాల నాటకానికి తెరలేపి బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడ్డారు.. కేంద్రం సీమాంధ్ర నాయకుల బ్లాక్‌మెయిలింగ్‌కు తలొగ్గి డిసెంబర్ 23న మరో ప్రకటన చేసింది.. తెలంగాణ ఏర్పాటుకు విస్తృత అభిప్రాయం కావాలంటూ మెలిక పెట్టింది. దీంతో యావత్ తెలంగాణ మళ్లీ భగ్గుమన్నది.. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడి ఉద్యమాన్ని ఉధృతం చేసింది.. ఈ పరిణామాలపై నిపుణ పాఠకుల కోసం ప్రత్యేకం..
దీక్ష విరమణ అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చినందుకు మేడం సోనియాగాంధీకి కృతజ్ఞతలు చెబుతున్నాను. ప్రధాని మన్మోహన్ సింగ్‌కు, ప్రతిపక్ష నేతలు అద్వానీ, సుష్మాస్వరాజ్‌లకు, ఈ రోజు లోక్‌సభలో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించిన అందరికి నా ధన్యవాదాలు. ఆరోగ్యం బాగయ్యాక వారందరినీ వ్యక్తిగతంగా కలిసి కృతజ్ఞతలు చెబుతాను. ఈ పోరాటంలో అసువులు బాసిన వారి కుటుంబాలను ఆదుకుంటాం. విద్యార్థులు, న్యాయవాదులు, లెక్చరర్లు, ఉపాధ్యాయులు, కార్యకర్తలు, ప్రజాసంఘాలు, వివిధ కుల సంఘాలు తెలంగాణ పోరాటంలో భాగస్వాములై ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. వారందరికీ జీవితాంతం రుణపడి ఉంటాను. తెలంగాణ ఉద్యమానికి మీడియా అండగా నిలిచి, ఉద్యమం గురించి ఎంతగానో ప్రచారం చేసింది. వారికి నాతోపాటు తెలంగాణ ప్రజానీకం ఎంతో రుణపడి ఉంది.
-కేసీఆర్ దీక్ష, పట్టుదలవల్ల కేంద్రప్రభుత్వం నుంచి తొలిసారి తెలంగాణపై స్పష్టమైన ప్రకటన వచ్చింది. అప్పటివరకు యుద్ధ వాతావరణంతో ఉన్న తెలంగాణలో ఒక్కసారిగా ఆహ్లాదకర పరిస్థితులు నెలకొన్నాయి. చిన్న, పెద్ద అనే తేడాలేకుండా అందరూ రోడ్లపైకి వచ్చి జై తెలంగాణ నినాదాలు చేస్తూ, పటాకులు కాలుస్తూ, ఆటపాటలతో ఆనందించారు. తెలంగాణవ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి.
సీమాంధ్రలో బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలు
-తెలంగాణలో విజయోత్సవాలు, సంబరాలు జరుగుతుండగానే.. సీమాంధ్ర ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను నిరసిస్తూ అందోళనలు మొదలయ్యాయి. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామాల పేరుతో కేంద్రప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేశారు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం సృష్టించే దిశగా ప్రయత్నాలు సాగించారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన సుమారు 140 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు, 30 మంది ఎమ్మెల్సీలు రాజీనామాలు చేసి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు.
-ఇదిలావుంటే అంతకుముందు ఒక్క టీఆర్ఎస్ తప్ప రాష్ట్రంలోని మిగతా పార్టీలన్నీ కేంద్రం తెలంగాణను ఏర్పాటు చేసే అవకాశం లేదని భావించాయి. అందుకే ప్రత్యర్థి పార్టీలను ఇరకాటంలో పెట్టి లబ్ధిపొందే ఉద్దేశంతో పోటీపడి మరీ తెలంగాణకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించాయి. కానీ కేసీఆర్ దీక్ష, పోరాట పటిమ, యావత్ తెలంగాణ ప్రజల ఆందోళనవల్ల కేంద్రప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసింది. దీంతో పలు పార్టీలు, రాజకీయ నాయకుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీలు తెలంగాణ ప్రాంతంలో ప్రాభవం కోల్పోయి సీమాంధ్రకే పరిమితమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. సీమాంధ్ర పెట్టుబడిదారులు, రాజకీయ నాయకుల భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యింది. వారంతా తెలంగాణ ప్రకటనను నిరసిస్తూ రాజీనామాలకు సిద్ధపడటానికి కారణం.. వారికి పదవుల ద్వారా కలిగే ప్రయోజనాలకంటే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ద్వారా జరిగే నష్టం ఎన్నోరెట్లు ఎక్కువ కావడమే. వారికి లేదా వారి మద్దతుదార్లు, బంధుమిత్రులకు సంబంధించిన కోట్లాది రూపాలయ ఆస్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు ఇబ్బందులు కలుగుతాయని భావించారు. అందుకే వాటిని రక్షించుకోవడానికి, ఆస్తులు వ్యాపారాలను మరింత పెంచుకోవడానికి రాజీనామాలు చేశారు.
-తెలంగాణ ప్రకటన వచ్చిన మరుక్షణంలో సీమాంధ్రలో సిద్ధాంతాలు, జెండాలు, పార్టీలు, ఎన్నికల మ్యానిఫెస్టోలకు అతీతంగా.. పాలకపక్షం, ప్రతిపక్షం అన్న తేడా లేకుండా అందరూ ఏకమయ్యారు. బంద్‌లు నిర్వహించారు. దీంతో విశ్వవిద్యాలయాలు, కాలేజీలు, స్కూళ్లు మూతపడ్డాయి.
తెలంగాణ ప్రకటనపై సీమాంధ్ర నేతల స్పందన
-ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతూ.. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం పెడితే సహకరిస్తామన్నాం. అయితే దానికి విధివిధానాలు, అన్ని ప్రాంతాల ప్రజలతో సంప్రదింపులు, ఏకాభిప్రాయ సాధన జరుగాలి. కాంగ్రెస్ పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడి, అర్థరాత్రి ఏకపక్షం నిర్ణయం తీసుకుంది. రాష్ర్టాన్ని అగ్నిగుండం చేసింది అని అక్కసు వెళ్లగక్కారు. ఆ వెంటనే సీమాంధ్ర ప్రజాప్రతినిధుల రాజీనామాల కార్యక్రమానికి తెరలేపారు.
-అదేవిధంగా సామాజిక తెలంగాణ మా నినాదం, విధానం అన్న ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి.. హోంమంత్రి ప్రకటన తర్వాత మాటమార్చారు. సమైక్యాంధ్రకే మద్దతు పలికారు. అంతేగాక సమైక్యాంధ్ర ఉద్యమ బలోపేతం కోసం తిరుపతి నుంచి బస్సుయాత్ర కొనసాగించారు. మోహన్‌బాబు లాంటి సినీరంగ ప్రముఖులు కొందరు సమైక్య ఉద్యమ బలోపేతానికి కృషిచేశారు.
-ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళనలు జరుగుతుండగా.. తెలంగాణవాదులు సంయమనం పాటించారు. అలాంటి సమయంలో ఏమాత్రం పోటీ ఉద్యమాలు చేసినా, రెచ్చగొట్టే కార్యక్రమాలు జరిపినా తెలంగాణ, సీమాంధ్ర ప్రజల మధ్య తీవ్రమైన హింస జరుగుతదని భావించి తెలంగాణ సమాజం శాంతియుతంగా ఉండిపోయింది. తెలంగాణ ఉద్యమం హింసాత్మకంగా మారితే కేంద్ర ప్రభుత్వం దాన్ని సాకుగా చూపి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ఆపే ప్రమాదం ఉందని.. కేసీఆర్ తెలంగాణ సమాజానికి శాంతి సందేశం అందించారు.
-అయితే కేంద్రప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా సీమాంధ్రలో బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలు, ఆందోళనలు తగ్గలేదు. దీంతో కేంద్రం సీమాంధ్ర ప్రజాప్రతినిధుల బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు తలొగ్గి హోంమంత్రి చిదంబరంతో 2009, డిసెంబర్ 23న రెండో ప్రకటన చేయించింది. ఆ ప్రకటన.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తలెత్తిన ప్రశ్న విషయంలో డిసెంబర్ 7న ముఖ్యమంత్రి నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. దీని ప్రకారం డిసెంబర్ 9న ప్రకటన విడుదల చేశాం. అయితే ఆ ప్రకటన తరువాత ఏపీలో పరిస్థితులు మారిపోయాయి. రాష్ట్రంలో అన్ని పార్టీలు, గ్రూపులతో విస్తృతస్థాయి చర్చలు, సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉంది.
-ఈ విధంగా కేంద్రం హోంమంత్రి రెండో ప్రకటనతో సీమాంధ్రవాదులు విజయోత్సవ ర్యాలీలు చేశారు. తెలంగాణ 10 జిల్లాల్లో ఎక్కడచూసినా చిదంబరం ప్రకటనను నిరసిస్తూ ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలతో యావత్ తెలంగాణ అట్టుడికిపోయింది.
-రెండో ప్రకటన వెలువడిన కొన్ని క్షణాల్లోనే తెలంగాణప్రాంతంలో 144, 30 సెక్షన్లు అమలు చేస్తున్నట్లు నాటి ముఖ్యమంత్రి ప్రకటించాడు.
-సీమాంధ్రలో టీడీపీ, కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీలు ఉద్యమాల్లో పాల్గొన్నా అక్కడ ఎవర్నీ అరెస్టు చేయలేదు. కానీ తెలంగాణ ప్రాంతంలో మాత్రం అడుగడుగునా పోలీసు బలగాలను నిలిపి రోశయ్య ప్రభుత్వం తెలంగాణపట్ల పక్షపాత ధోరణి ప్రదర్శించింది.
-ఈ పరిణామాల నేపథ్యంలో రెండో ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్‌ను వెంటబెట్టుకొని అర్ధరాత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జానారెడ్డి ఇంటికెళ్లి తెలంగాణపై మారిన యూపీఏ వైఖరి గురించి చర్చించారు. ఈ చర్చల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అన్ని పార్టీలు, ప్రజాసంఘాలను కలుపుకొని ఉద్యమించాలని నిర్ణయించారు.
-దీనికి సారథ్య బాధ్యతలను స్వీకరించాలని ప్రొ. జయశంకర్‌ను అభ్యర్థించగా ఆయన తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు ప్రొ. కోదండరామ్‌కు ఈ బాధ్యతలను అప్పగించాలని సూచించారు.
-అప్పటికప్పుడు కోదండరామ్‌తో సంప్రదించి జేఏసీ చైర్మన్‌గా ఆయన పేరుని కేసీఆర్ ప్రకటించారు.
తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (TJAC) ఏర్పాటు
-2009, డిసెంబర్ 24న ఉదయం 11 గంటలకు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ (న్యూడెమొక్రసీ), ఎన్జీవోల సంఘాలు, రచయితలు, కళాకారుల, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజాసంఘాల నాయకులు కలిసి బంజారాహిల్స్‌లోని కళింగ ఫంక్షన్ హాలులో సమావేశమై ప్రొ. కోదండరామ్ చైర్మన్‌గా వివిధ ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో టీజేఏసీని ఏర్పాటు చేశారు.
టీజేఏసీలో భాగస్వామ్య సంస్థలు
1. టీఆర్ఎస్ – నాయిని నర్సింహారెడ్డి
2. బీజేపీ – సీహెచ్ విద్యాసాగర్‌రావు
3. సీపీఐ (న్యూ డెమొక్రసీ) – గోవర్ధన్
4. సీపీఐ ఎంఎల్, ఎన్డీ – పీ సూర్యం
5. తెలంగాణ విద్యావంతుల వేదిక – మల్లెపల్లి లక్ష్యయ్య, పిట్టల రవీందర్
6. తెలంగాణ లెక్షరర్స్ ఫోరం – కే వెంకటస్వామి
7. తెలంగాణ టీచర్స్ ఫోరం – మల్లికార్జునరెడ్డి
8. తెలంగాణ ఉద్యోగుల సంఘం – సీ విఠల్, పద్మాచారి
9. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ – అబ్దుల్ సత్తార్
10. ఆర్టీసీ జేఏసీ – డీ ఆనందరం
11. టీఎన్జీవో అసోసియేషన్ – దేవీప్రసాద్
12. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం – డీపీ రెడ్డి
13. మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ – హమీద్ మహ్మద్‌ఖాన్
14. తెలంగాణ సినిమా జేఏసీ – రోషం బాలు
15. ఉస్మానియా యూనివర్సిటీ ఫోరం ఫర్ తెలంగాణ – ప్రొ. లక్ష్మణ్
16. ముస్లిం ఫోరం ఫర్ తెలంగాణ – లతీఫ్ ఖాన్
17. తెలంగాణ రీజినల్ టీచర్స్ యూనియన్ – మణిపాల్‌రెడ్డి
18. సింగరేణి జేఏసీ – ఎండీ మునీర్
19. డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ – నారాయణరెడ్డి
20. డాక్టర్స్ జేఏసీ – బూర నర్సయ్యగౌడ్
21. అడ్వకేట్స్ జేఏసీ – ఎం రాజేందర్‌రెడ్డి/ప్రహ్లాద్
22. పొలిటికల్ అనలిస్ట్ – వీ ప్రకాశ్
23. ఫోరం ఫర్ తెలంగాణ – రమా మెల్కోటె
24. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ – శ్రీనివాస్ గౌడ్
25. తెలంగాణ ధూంధాం కమిటీ – రసమయి బాలకిషన్
26. లంబాడ హక్కుల పోరాట సమితి – శేషురాం నాయక్
27. టీఎన్జీవోల యూనియన్ – కే స్వామిగౌడ్
28. తెలంగాణ రిటైర్డ్ లెక్చరర్స్ అసోసియేషన్ – వెంకటరెడ్డి
29. గురుకుల పాఠశాలల ఉపాధ్యాయ సంఘం – రవిచందర్
30. సామాజిక కార్యకర్తల వేదిక – వెంకటరెడ్డి
31. తెలంగాణ ఇంజినీర్స్ జేఏసీ – బాలనర్సయ్య/వెంకటేశం
32. తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ – విజయేందర్ రెడ్డి
33. గ్రేట్ హైదరాబాద్ జేఏసీ – శ్రీధర్ అయాచితం
34. ఉన్నత విద్యా జేఏసీ – పాపిరెడ్డి
35. ఇంటర్మీడియట్ విద్యాజేఏసీ – మధుసూదన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి
36. సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ – బైరి నరేష్
37. P.O.W – పీ సంధ్య
38. తెలంగాణ ఇండస్ట్రీస్ ఫోరం – పీ సుధీర్‌రెడ్డి
39. తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ – శ్రీధర్‌స్వామి, చందా రాములు
40. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జేఏసీ – రఘు
41. జమాతే-ఇస్లామి-హింద్ – మొహత్తసీన్ ఖాన్
42. తెలంగాణ యూనివర్సిటీస్ అసోసియేషన్ – ప్రొ.రమేష్‌రెడ్డి
43. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ (IFTU) – ప్రదీప్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు