తెలంగాణలో జైన మతం – అభివృద్ధి
క్రీ. పూ. 6వ శతాబ్దంలో వర్ధమానుడు (బ్రహ్మచర్యం అనే 5వ సిద్ధాంతం ప్రవేశపెట్టిన తర్వాత మహావీరుడుగా మారాడు. జైనంలోని మిగతా 4 సిద్ధాంతాలను 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు ప్రవేశపెట్టాడు. అవి అహింస, అసత్య, ఆస్తేయం (దొంగతనం చేయరాదు), ఆపరిగ్రహాం (ఆస్తిపాస్తులుండరాదు). వర్ధమానుడు ఉత్తర భారతదేశంలో జైనమతాన్ని స్థాపించాడు. ఇది కుల వ్యవస్థను, యజ్ఞయాగాదులు, బలి, హింసలతో కూడిన వైదిక మతాన్ని ఖండించి శాంతి, అహింస, సర్వసమానత్వాన్ని బోధించింది. జైన, బుద్ధ మతాలు ఏకకాలంలో జన్మించి, భారతదేశ చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించి, భారతీయ సంస్కృతిలో గణనీయమైన మార్పులు రావడానికి కారణమయ్యాయి. భారతీయ ఆధ్యాత్మిక తత్వాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చి, భారతీయ సాహిత్య, శిల్పకళలను అభివృద్ధి చేశాయి.
జైనమతం జన్మించిన కాలంలో తెలంగాణలో బృహత్ శిలాయుగపు నాగరికత వర్థిల్లుతున్నది. (భారతదేశంలో హిందూమతం తర్వాత అతిప్రాచీన మతం జైనమతమే. భారతదేశంలో చివరగా ఏర్పడినది సిక్కు మతం)
ఇటీవల జరగుతున్న పరిశోధనల ప్రకారం అతి ప్రాచీన కాలం నుంచే జైనమతం ఇక్కడ ఉన్నట్లు తెలుస్తోంది. మహావీరుడి తండ్రి కళింగ రాజుకు మిత్రుడని అతని ఆహ్వానంపై మహావీరుడు కళింగ రాజధాని బాదలపురం (భద్రాచలం) సందర్శించాడని ఆ సందర్భంలో జైనమతం తెలంగాణలోకి ప్రవేశించిందని అర్థమవుతున్నది. కానీ ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం జైన తీర్థంకరులు 25 మంది అని (చాలా మంది 24 మంది తీర్థంకరులు అని, చివరివాడే వర్థమానుడు లేదా మహావీరుడు అని తెలుసు.
కానీ 25వ తీర్థంకరుడు ఎవరు అని పరీక్షలో ప్రశ్నిస్తే దానికి సమాధానం ఉందా? దీనికి సమాధానం సివిల్ సర్వీస్‌కు సిద్ధమయ్యే అభ్యర్థులను అడిగితే వెంటనే 25వ తీర్థంకరుడు గోపాల అని చెప్తారు. అంటే మహావీరుని మరణానంతరం క్రి.పూ 468లో జైన పీఠానికి అధ్యక్షుడిగా వచ్చింది గోపాల, కాబట్టి ఇతడే 25 తీర్థంకరుడు అని చెప్పాల్సిన అవసరం లేదు). ఇలాంటి తీర్థంకరుల్లో 10వ వాడు సీతలనాథుడు . ఇతడు భద్రాచలం వాసి. అంటే పక్కా తెలంగాణ వాడు. మహావీరుడి కన్నా కొన్ని వందల సంవత్సరాల ముందే తెలంగాణలో జైనమతం ఉంది అనేది చరిత్రకారుల మేథస్సును తొలుస్తున్న ప్రశ్న. మొత్తానికి మహావీరుడు ఈ విధంగా భద్రాచలం సందర్శించాడని అర్థమవుతుంది. (దీనికి ఆధారాలు ఎర్లీ హిస్టరీ ఆఫ్ డెక్కన్ & ప్రాబ్లమ్స్ గ్రంథంలో ఉన్నాయి) కాకపోతే ఆనాడు ఆ మతాన్ని నిగ్రంథులు అని పిలిచేవారు.
మహావీరుడి కంటే ముందే తెలంగాణలో జైన సిద్ధాంతా లు ప్రవేశించినట్లు మరికొన్ని ముఖ్య ఆధారాలు ఉన్నాయి. మొదటి తీర్థంకరుడు వృషభనాథుడు. ఇతనికి భరతుడు, బాహుబలి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అందులో బాహుబలి పోతన నగరాన్ని అంటే అస్మక రాజ్యపు రాజధాని, నేటి బోధన్ (నిజామాబాద్) పట్టణాన్ని రాజధానిగా చేసుకొని పాలించాడు. అక్కడ 525 ధనస్సుల ఎత్తు కలిగిన బాహుబలి విగ్రహం ఉండేదని, అది ప్రజలు దర్శించడానికి వీలుకాని దట్టమైన అడవుల్లో ఉండేదని, సామాన్యులెవరికీ దాన్ని దర్శించే భాగ్యం లభించేది కాదని, అందువల్ల తాను శ్రావణబెలగోళలోని ఇంద్రగిరి (చంద్రగిరి) పర్వతంపై బాహుబలి విగ్రహాన్ని ప్రతిష్ఠించానని పశ్చిమ చాళుక్యుల మంత్రి చాముండరాయుడు తన శ్రావణబెలగోళ శాసనంలో పేర్కొన్నాడు.
ఈ విగ్రహ ప్రతిష్ఠాపనతో సామాన్యులందరికీ దర్శించే వకాశం కలిగిందని కూడా వివరించాడు. పంపకవి (కన్నడ ఆదికవి) రెండో హరికేసరి ఆస్థానంలో ఉన్నప్పుడు బోధన్‌లోని బాహుబలి విగ్రహాన్ని గురించి ప్రస్తావించాడు. కుమార వ్యాసులు కూడా పై వాస్తవాలను వివరించాడు. దీన్నిబట్టి మొదటి తీర్థంకరుని కాలంలోనే జైనమతం తెలంగాణలో ప్రవేశించిందని చెప్పవచ్చు. ఇవన్నియూ ఎవరూ కాదనని వాస్తవాలు. నేటికీ బోధన్ పరిసర ప్రాంతాల్లో జైన శిథిలాలు ఉన్నాయి. ఈ బహుబలినే గోమఠేశ్వరుడు అనికూడా పిలుస్తారు.
నైనసేనుని ధర్మామృతం అనే కావ్యం, హరిసేనుని బృహత్కథాకోశం గ్రంథాల్లో తెలంగాణలో జైనం, బౌద్ధం రెండూ వ్యాప్తి చెందాయని తెలుపుతున్నాయి. క్రీ.పూ. 4వ శతాబ్దంలో మహాపద్మనందుడు (2వ పరుశురాముడిగా ప్రసిద్ధి) తెలంగాణ ప్రాంతాన్ని మగధ రాజ్యంలో విలీనం చేశాడు.
ఇతడు జైన మతస్థుడు. మెగస్తనీస్ భారతదేశాన్ని సందర్శించిన తొలి గ్రీకురాయబారి, తన రచనల్లో తెలంగాణలోని నగ్న జైన సన్యాసులను ఎంతో మందిని చూశానని పేర్కొన్నట్లు ఈ గ్రంథాన్ని ఆంగ్లంలోకి అనువదించిన మాక్క్రిండాల్ చెప్పాడు. మహాపద్మనందుడు తెలంగాణలోని సీతలనాథుని విగ్రహాన్ని మగధకు తరలించాడు. తర్వాత కళింగరాజు ఖారవేలుడు పాటలీపుత్రంపై దండెత్తి సీతలనాథుని విగ్రహం తిరిగి తెచ్చి ఆయనకు జైన దేవాలయం నిర్మించాడని ది హిస్టరీ అండ్ ఇన్స్క్రిపిన్స్ ఆఫ్ ది శాతవాహనాస్ గ్రంథంలో పేర్కొన్నారు.
తొలి శాతవాహనులు జైనమతాన్ని ఆదరించారు. శ్రీముఖుడు జైనమతం స్వీకరించినట్లు కాలకసూరి జైన గ్రంథం తంత్రలో వివరాలు ఉన్నాయి.
తెలంగాణలో ముఖ్య జైన కేంద్రాలు
1. కొలనుపాక (నల్లగొండ జిల్లా)
2. మునులగుట్ట (కరీంనగర్)
3. బోధన్ (నిజామాబాద్)
చాలాకాలంగా జైనమతం కర్ణాటక నుంచి ఆంధ్రకు, ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చిందని పేర్కొంటున్నారు. కానీ నూతనమైన అంశాలు ఏమిటంటే ? కళింగ నుంచి తెలంగాణకు, తెలంగాణ నుంచి కర్ణాటకకు వ్యాపించింది అని పేర్కొన్నారు. మౌర్యులు జైనమత వ్యాప్తికోసం మిషనరీలను పంపించారు. ఖారవేలుడు కుమారకొండపై తీర్థంకర అవశేషాలతో కాయసిసిదను తన ప్రజలను పూజించడం కోసం నిర్మించాడు. జైన సన్యాసుల కోసం ఈ గుహలోనే హాథిగుంఫా శాసనాన్ని చెక్కించారు. ఈ ప్రాంతాల్లోనే జైనసంఘంలోని శ్వేతాంబర, దిగంబర శాఖలుగా లేదా సంప్రదాయాలుగా చీలిపోయాయి.
తెలంగాణలో వేములవాడ, ముదిగొండ చాళుక్య రాజుల కాలంలో, తొలి కాకతీయుల కాలంలో జైనమతం వర్థిల్లింది.
వేములవాడ చాళుక్యులు జైన పండితులను పోషించారు. రాష్ట్రకూట రాజు మూడో కృష్ణుడి ఆస్థానానికి తెలంగాణ నుంచి కొంతమంది కవులు వలస వెళ్లారు. శాంతిపురాణం అనే గ్రంథాన్ని రచించిన పొన్న ఇతని ఆస్థానంలో నివసించాడు. వేములవాడ రాజైన రెండో హరికేసరి కన్నడంలో ప్రసిద్ధ కవి అయిన పంపడును పోషించాడు. ఇతడు రాష్ట్రకూట రాజు దృవుని ఆస్థానంలోకి వలస వెళ్లాడు. పంపడు కన్నడ ఆదికవి. ఇతడు కన్నడంలో జైన భారతం లేదా విక్రమార్జున విజయం, ఆదిపురాణంలను రచించాడు. వేములవాడ వంశంలో చివరి రాజు బద్దెగుడ, సుభదయ జీనాలయం అనే జైనాలయాన్ని వేములవాడలో నిర్మించి దానికి సోమదేవున్ని ప్రధాన గురువుగా నియమించాడు. తర్వాతి కాలంలో జైనమతం బాగా ప్రజాధరణ పొందింది. పటాన్‌చెరువులో 500 జైన బసదులు (జైనుల విశ్రాంతి మందిరాలు), జైన విగ్రహాలు ఉన్నాయి. ప్రస్తుతం జైన విగ్రహాలను హైదరాబాద్ మ్యూజిం లో భద్రపరిచారు. పశ్చిమ చాళుక్య రాజులు కూడా జైనమతాన్ని పోషించారు. బోధన్, కొనకొండ్ల జైన తీర్థాలుగా వర్ధిల్లాయి.
తొలి కాకతీయ రాజులు జైనమతాన్ని అవలంభించారు. హన్మకొండ జైనమతానికి కేంద్రమైంది. కానీ కాకతీయ రుద్రుని కాలం నుంచి జైనులకు వ్యతిరేకంగా ప్రచారం జరిగింది. చివరి కాకతీయ రాజైన రెండో ప్రతాపరుద్రుడు తన కాలంలో హన్మకొండను జైనులకు కేంద్రంగా మార్చా డు. చివరికి ఇస్లాం మతవ్యాప్తితో తెలంగాణలో జైనం తన ఉనికిని కోల్పోయింది.
జైనమతం పతనం
తెలంగాణలో జైనమతం పతనం కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. జైనులకు ప్రధాన శత్రువులు శైవులు. శైవ మతానికి తీవ్రవాద శాఖ అయిన కాలముఖులు కాళేశ్వరంను కేంద్రంగా చేసుకున్నారు. శైవులు జైనులతో వాదన చేసి వారిని ఓడించారు. తమ మహిమలతో సామాన్య ప్రజలను ఆకర్శించారు. బసవేశ్వరుడు (వీరశైవ స్థాపకుడు) జైనమతాన్ని దెబ్బతీశాడు. జైన, శైవ సంఘర్షణలతో జైనులు నాశనమయ్యారు. (ఈ సంఘర్షణ ఎక్కువగా కాకతీయుల కాలంలో జరిగింది). దేవదాసయ్య అనే శైవ నాయకుడు మహిమ చేసి పొట్ల చెరువు లేదా పటాన్ చెరులో 500 జైన కేంద్రాలను నాశనం చేశాడు. కాకతీయుల్లో గణపతిదేవుడు అనేక జైన పండితులను శిక్షించి వారి గ్రామాలను తగులబెట్టినట్లు గద్వాలలోని పూడూరు శాసనంలో పేర్కొన్నారు.
జైన శిల్పకళ
జైనమతం వాస్తుకళాభివృద్ధిలో ప్రముఖ పాత్ర నిర్వచించింది. తెలంగాణ జీవనంలో వస్తువు, శిల్ప ప్రపంచానికి జైనమతం అమోఘమైన సేవలందించింది.
జైనమత ప్రాధాన్యత
ఆ మధ్యకాలంలో నరేంద్రమోడీ జైనమతానికి మైనా ర్టీ హోదా కల్పించాడు. మైనార్టీ మత గుర్తింపు పొందిన మతాలు భారతదేశంలో 6 ఉన్నాయి. అవి. ఇస్లాం, క్రైస్తవ, పార్శీ, సిక్కు, బౌద్ధం, జైనం. జైనమత రాకతో సామాన్యులందరికీ విద్యావకాశాలు లభించాయి. వీరి ఆరాధ్య విద్యా దేవతనే హిందువులు సరస్వతీదేవిగా పూజిస్తున్నారు. అంటే విద్యాదేవతను గుర్తించినది మొదట జైనులే. ప్రతి సమావేశంలో దీపారాధన లేదా జ్యోతిని ప్రజ్వలింపజేయడం వీరి ఆచారం. దీన్ని ప్రస్తుతం ప్రతి దేశంలో చూడవచ్చు. ఇప్పటికీ ఈ విధానం భారతదేశంలో సజీవంగా ఉంది. విదేశీ వ్యాపారాన్ని ప్రోత్సహించి వైశ్యులను తమవైపు తిప్పుకున్నారు. జంతుబలులను, జీవహింసను నిషేధించి శూద్రులకు యజ్ఞయాగాదులు నిష్ప్రయోజనం అని చెప్పి బ్రాహ్మణులకు వ్యతిరేకంగా మారిపోయారు.
కొలనుపాక
నల్లగొండ జిల్లాలోని ఆలేరు సమీపంలో కొలనుపాక గ్రామంలో ఈ జైన దేవాలయం ఉంది. ఇది భారతదేశంలో 2వ గొప్ప జైన తీర్థంగా వర్ధిల్లింది. భారతదేశంలో అతిపెద్ద జైనాలయం రాజస్థాన్‌లోని మౌంట్ అబు దిల్వా రా దేవాలయం.
ఈ కొలనుపాక దేవాలయంలో పార్శనాథుని విగ్రహం ఉంది. ఈ దేవాలయంలో శిల్పకళను అద్భుతంగా చెక్కారు. శ్వేతాంబర శాఖకు ఈ దేవాలయం ప్రధానమైంది. ఇంకా ఈ దేవాలయంలో ఇతర తీర్థంకరుల విగ్రహాలను సుందరంగా తీర్చిదిద్దారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు