Cancellation of large notes | పెద్దనోట్ల రద్దు-పర్యవసానాలు
గత కొంతకాలం క్రితం అత్యంత ఆవశ్యకంగా ప్రతిఒక్కరిని ఆకర్శించిన అంశం నోట్లరద్దు. వివిధ వ్యక్తులు వివిధ పేర్లతో పిలుస్తున్న ఈ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావాన్ని చూపిందనడంలో ఎలాంటి సందేహం లేదు. సామాన్యుడి నుంచి అసామాన్యుడి దాక, పేదవాడి నుంచి ఐశ్వర్యవంతుడి దాకా, సాధారణ నిరుద్యోగి నుంచి ఆపార వ్యాపార సామ్రాజ్య అధినేతల వరకు ఇది ప్రభావాన్ని చూపనుంది. కాబట్టి ఈ అంశంపై ఎన్నో కోణాల నుంచి, ఎన్నో రకాలైన ప్రశ్నలు పోటీ పరీక్షల్లో వచ్చే అవకాశం ఉంది. దీనిపై సమగ్ర అవగాహన ఏర్పర్చుకొని, సమగ్ర విశ్లేషణతో, విస్తృత సమాచారంతో సిద్ధంగా ఉంటే తప్ప పలు ప్రశ్నలకు సమాధానం గుర్తించడం కష్టం. నోట్లరద్దు అంటే ఏమిటి? దీన్ని ఎవరు చేస్తారు? వివిధ దేశాల్లో ఎలా ఉపయోగించుకున్నారు? ప్రయోజనాలు, నష్టాలు ఏంటి? భారత ఆర్థిక, సామాజిక రంగాల్లో కలిగే స్వల్ప, దీర్ఘకాల మార్పులపై నిపుణ పాఠకులకు ప్రత్యేకం.
నోట్ల రద్దు అంటే?
ఇప్పటివరకు లీగర్ టెండర్‌గా వాడుతున్న కరెన్సీని వెనక్కి రప్పించి, దాని స్థాయిని మార్చడమే నోట్లరద్దు అంటారు.
ఇలా లీగల్ టెండర్‌ను నోట్లరద్దు కానీ, తిరిగి తీసుకోవడం కానీ, తీసేయడం కానీ చేసిన తర్వాత ఆ నోట్లు చెల్లుబాటు కావు. ఆ కరెన్సీ నోట్లను మళ్లీ వాడటానికి వీలు లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ జాతీయబ్యాంకులు/కేంద్రబ్యాంకులు సాధారణంగా పాత కరెన్సీ నోట్లను, పాడైన నోట్లను వెనక్కి తీసుకొని, మరింత భద్రతాపరమైన చర్యలతో మళ్లీ విడుదల చేస్తుంటాయి. అందులో భాగంగానే ఇటీవల ప్రభుత్వం, ఆర్బీఐ వెలువరించిన నోట్లను వెనక్కి తీసుకొని, కొత్త నోట్లను విడుదల చేసే నిర్ణయమే నోట్ల రద్దు.
నోట్ల రద్దు ఎందుకు..
ముఖ్యంగా పెద్ద నోట్లతో జరుగుతున్న నల్లధన లావాదేవీలను, సమాంతర ఆర్థిక వ్యవస్థను ఆపడానికి, చట్టబద్ధ ఆర్థిక లావాదేవీలను ప్రోత్సహించడానికి తీసుకున్నారు. దొంగ నోట్లు, మాఫియాను, ఉగ్రవాద కార్యకలాపాలను, చట్ట వ్యతిరేక లావాదేవీలను నిరోధించడానికి తీసుకున్న నిర్ణయం.
ఏయే చర్యలు ఉంటాయి?
ఉన్న నోట్లను రద్దు చేయడం, కొత్త నోట్లను ప్రవేశపెట్టడం, లావాదేవీల సంఖ్యపై పరిమితులు విధించడం, డిపాజిట్లు, విత్‌డ్రాలపై ఆంక్షలు, పరిమితులు విధించడం మొదలైనవి.
ఏం జరిగింది?
-2016 నవంబర్ 8న భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రూ. 500, 1000 నోట్లు చెల్లకుండాపోయాయి.
-పాత నోట్లను బదిలీ చేసుకోవడానికి 2016 డిసెంబర్ 30 వరకు గడువు ఇచ్చారు.
-కొత్త రూ. 500, 2000 నోట్లను కూడా ఆర్బీఐ విడుదల చేసింది.
నోట్లరద్దు-చరిత్ర
-స్వాతంత్య్రానంతరం జరిగిన రెండో నోట్లరద్దు. స్వాతంత్య్రానికి పూర్వం కూడా నోట్లరద్దు జరిగిందని అర్థం (1946).
-1978 మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో రూ. 500, రూ. 1000, రూ. 10000 నోట్లను రద్దు చేశారు. (నోట్లరద్దుపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం) కేవలం 15 శాతం పెద్ద నోట్లను రద్దు చేసే నిర్ణయం ఇది.
-పెద్ద నోట్ల లావాదేవీల్లో అవకతవకలను నిరోధించడానికి ఉన్న నోట్లరద్దు చట్టం-1978 వల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది.
-నోట్లరద్దు అనేది నల్లధనాన్ని తగ్గించడానికి, సమాంతర ఆర్థిక వ్యవస్థను నిరోధించడానికి అంతిమ పరిష్కారం కాదని పేర్కొంది.
ప్రస్తుతం యూరోపియన్ కేంద్ర బ్యాంక్ కూడా 500 యూరో నోట్లను రద్దు చేయాలని నిర్ణయించింది.
-ద్రవ్యం అంటే: మార్పిడి మాధ్యమంగా, విలువల కొలమానంగా అందరిచేత అంగీకరింపబడి ఉపయోగించబడేదే ద్రవ్యం.
-డబ్బుకి దానంతట దానికి ఎటువంటి ఉపయోగం ఉండకపోవచ్చు. కానీ మార్పిడిలో అది పోషించే పాత్ర వల్ల దానికి విలువ జోడించబడుతుంది.
ద్రవ్య రకాలు
-చెక్కులు: ఖాతాదారు బ్యాంకుకు తాను జమ కట్టిన సొమ్ము నుంచి తను చెప్పిన వ్యక్తికిగానీ, తనకుగానీ కొంత సొమ్మును జారీ చేయమని చెప్పే ఆజ్ఞ.
-డబ్బులను చెల్లించడానికి, తీసుకోవడానికి, భద్రతాపరంగా చెక్కులను వాడుతున్నారు.
-డ్రాఫ్టులు: డీడీలు (Demond Drafts) అని వ్యవహరించే వీటిని బ్యాంకులు జారీ చేస్తాయి.
-వ్యక్తులు, సంస్థలు కోరినట్టుగా వారి నుంచి సొమ్మును, కొంత కమీషన్‌ను తీసుకొని డ్రాఫ్టులు జారీ చేస్తాయి.
-చెక్కుల కంటే డ్రాప్టులు ఆమోదయోగ్యమైనవి. ఎందుకంటే డ్రాఫ్టుల కోసం చెల్లింపులు ముందుగానే బ్యాంకులకు ఇవ్వబడతాయి.
-క్రెడిట్ కార్డులు: ఎంపిక చేసిన ఖాతాదార్లకు బ్యాంకులు ఈ కార్డులను జారీ చేస్తాయి.
-ఈ కార్డును ప్రకటింపబడిన దుకాణాల్లో, వ్యాపార సంస్థల్లో బిల్లులు చెల్లించడానికి ఉపయోగిస్తారు.
-ఇక్కడ వినియోగదారుని సొమ్ముకు బ్యాంకు గ్యారంటీ ఇస్తుంది.
-డెబిట్ కార్డులు: డెబిట్ కార్డులు కూడా దాదాపు క్రెడిట్ కార్డులలాగానే కానీ, డెబిట్ కార్డు నుంచి చెల్లింపులు చేయాలంటే ఆ వ్యక్తి ఖాతాలో ముందే డబ్బును జమ చేయాలి.
మన కరెన్సీ పరిస్థితి
-ప్రపంచంలో అతి ఎక్కువ కరెన్సీ చెలామణిలో ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. మన జీడీపీలో 12 శాతం కరెన్సీ రూపంలోనే ఉంది.
నోట్లరద్దుతో ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు
-2015-16 ఆర్థిక సర్వే ప్రకారం 27 శాతం గ్రామాలు మాత్రమే బ్యాంకింగ్ వ్యవస్థను కలిగి ఉన్నాయి. కాబట్టి పూర్తిస్థాయిలో బ్యాంకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలంటే భారీ మొత్తంలో మౌలిక సదుపాయాలను కల్పించాలి.
-ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద నోట్లను బదిలీ చేయాలంటే ఆర్బీఐకి రూ. 12,000 కోట్లు కావాలి. ప్రస్తుతం ఉన్న పెద్ద నోట్లను మార్చాలంటే సుమారు 2300 కోట్ల నోట్లను రిజర్వ్ బ్యాంక్ విడుదల చేయాలి.
-కొత్తగా ప్రవేశపెట్టిన రూ. 2000 నోటును చిల్లరగా మార్చాలంటే కష్టంతో కూడుకున్న పని. దినసరి లావాదేవీలన్నీ రూ. 500 కంటే తక్కువ మొత్తంలోనే జరుగుతాయి.
-భారీ స్థాయిలో నమోదయ్యే డిజిటల్ లావాదేవీలను నియంత్రించడానికి పటిష్టమైన వ్యవస్థను ఏర్పర్చి హ్యాకర్ల బారిన పడకుండా చేయాలి.
వివిధ రంగాలపై ప్రభారం
-సమాంతర ఆర్థిక వ్యవస్థపై: పెద్ద నోట్లరద్దుతో భారీ స్థాయి లావాదేవీలు తగ్గి, చట్టేతర, హవాలా లావాదేవీలు తగ్గుముఖం పట్టొచ్చు.
-మన సర్క్యులేషన్‌పై: స్పల్పకాలంలో మనీ సైప్లె తగ్గే అవకాశం ఉంది. కొత్తనోట్లు అధిక మొత్తంలో విడుదలైతే అది నియంత్రణలోకి వస్తుంది.
-డిమాండ్‌పై: వినియోగదారుల వస్తువులపై రియల్ ఎస్టేట్, గోల్డ్, విలాస వస్తువులు, ఆటోమొబైల్ మొదలైన రంగాల్లో డిమాండ్ తగ్గి వ్యాపారం మందగించే అవకాశం ఉంది.
-ధరలపై: వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, చిన్న వ్యాపారులు, చిన్న మధ్యతరగతి పరిశ్రమలు, సేవలు, గృహరంగం మొదలైన వాటిలో ధరలు తగ్గి ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం ఉంది.
-జీడీపీపై: వినియోగ వస్తువులపై డిమాండ్ తగ్గి తయారీరంగం వృద్ధి పడిపోతుంది.
-జీడీపీలో రుణాత్మక వృద్ధి నమోదు కావచ్చు.
-ప్రపంచ రేటింగ్ సంస్థలు భారత వృద్ధి రేటును తగ్గించవచ్చు.
-గతేడాది జీడీపీ వృద్ధిరేటు 7.6 నుంచి 2 శాతం వరకు తగ్గి 4 నుంచి 5 మధ్యలో ఉండవచ్చు.
-మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ అభిప్రాయం ప్రకారం 2 శాతం వరకు జీడీపీ తగ్గవచ్చు.
-బ్యాంకింగ్ రంగపై: ఎక్కువ మొత్తంలో డిపాజిట్లు నమోదై బ్యాంక్‌లలో నగదు పెరిగి, ఎక్కువ మొత్తంలో తక్కువ రేటుకు లోన్లు ఇవ్వవచ్చు.
-ఆన్లైన్ లావాదేవీలు పెరుగుతాయి.
-డిజిటల్ లావాదేవీలు, E-వ్యాలెట్లు, క్రెడిట్ కార్డులు మొదలైనవి వృద్ధి చెందుతాయి.
-గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై, వస్తువులకు గిరాకీ తగ్గి మొత్తం ఆర్థిక వ్యవస్థ కూలిపోయే ప్రమాదం ఉంది.
-నోట్లరద్దు కంటే ఇతర వ్యవస్థాగత మార్పులతో నల్లధనాన్ని నిర్మూలించవచ్చు. నల్లధనాన్ని చట్టబద్ధంగా మార్చే ప్రక్రియలో మరింత అవినీతి జరుగుతుంది. దీనివల్ల దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
లీగల్ టెండర్ అంటే?
ఆర్బీఐ ముద్రించి, తాను ప్రామిస్ చేస్తూ, ఆర్బీఐ గవర్నర్ సంతకంతో ఇచ్చిన ప్రతినోటును లీగల్ టెండర్ అంటారు. అంటే ఏసమయంలోనైనా కరెన్సీకి సంబంధించిన మొత్తం విలువను ఆ నోటుదారునికి చెల్లించడానికి ఆర్బీఐ సిద్ధంగా ఉంటుంది. చట్టబద్ధంగా ప్రతిఒక్కరు వస్తుమార్పిడికి వాడుకోవాల్సిన మాధ్యమమే లీగల్ టెండర్.
లీగల్ టెండర్లోకి చెక్కులు, డీడీలు రావు.
నగదు లావాదేవీలే అధికం
ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం దేశంలో 87% లావాదేవీలు నగదు రూపంలోనే జరుగుతాయి. ఎందుకంటే ఏటీఎంలు, బ్యాంకింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్వైపింగ్ మెషీన్లు అత్యధికంగా పట్టణ ప్రాంతాల్లో మాత్రమే నెలకొల్పి ఉండటం, ఆర్థిక నిరక్షరాస్యత పన్ను చెల్లింపుల నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశం, నల్లధన లావాదేవీలు ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల 87శాతంపైగా లావాదేవీలు నగదు రూపంలోనే జరుగుతాయి.
ఫేక్ కరెన్సీ
-రాజ్యసభలో అర్జున్‌రామ్ మేఘవాల్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం దేశంలో మొత్తం రూ. 400 కోట్ల నకిలీ కరెన్సీ ఉంది.
-లోక్‌సభ వెబ్సైట్ ప్రకారం 2011-15 మధ్యలో ఆర్బీఐ రూ. 26 లక్షల నకిలీ నోట్లను సీజ్ చేసింది. వాటి విలువ దాదాపు రూ. 167 కోట్లు
-నకిలీ నోట్లలో రూ. 500, 1000లే అధికం.
లెస్‌క్యాష్ (తక్కువ కరెన్సీ) నుంచి క్యాష్‌లెస్ ఎకానమీ
-ప్రస్తుతం దేశం మొత్తం క్యాష్‌లెస్ ఎకానమీగా మారాలని, లావాదేవీలన్నీ కార్డులు, స్వైపింగ్ మెషీన్లు, చెక్కుల ద్వారా మాత్రమే జరగాలనే వాదన వినిపిస్తుంది. కానీ ఇండియాలో అత్యధిక మంది నిరక్షరాస్యులు ఉన్నందున, అతి తక్కువ మౌలిక సదుపాయాలు ఉన్నందున లెస్‌క్యాష్ నుంచి క్యాష్‌లెస్ ఎకానమీగా రూపాంతరం చెందితే బాగుంటుంది.
ఆర్బీఐ మాజీ గవర్నర్ రాజన్ ప్రకారం
-ఎప్పుడు నగదురద్దు చేసినా, ఏదో ఒక రకంగా నకిలీ నోట్లను సృష్టించడం సులువే.
-ఒకవేళ నల్లధనాన్ని కరెన్సీ రూపంలో కాకుండా ఇతర రూపాలైన గోల్డ్, స్థిరాస్థి, ఇతర వేరేవిధంగా దాచుకుంటే మరింత కష్టతరంగా మారుతుంది.
-కాబట్టి నోట్లరద్దు కాకుండా ఇతర వ్యవస్థాగత మార్పులతో, మేలైన గవర్నెన్స్ పద్ధతుల్లో నల్లధాన్ని నిర్మూలించాలి.
నోట్లరద్దుతో లాభాలు
-నల్లధనం నిర్మూలించబడుతుంది. దీంతో ద్రవ్యోల్బనం నియంత్రణలోకి వస్తుంది.
-ఉగ్రవాద కార్యకలాపాలు, చట్టవ్యతిరేక లావాదేవీలు, ఇతర మాయాజాల లావాదేవీలు నిర్మూలించబడుతాయి.
-నకిలీ నోట్లు నిర్మూలించబడుతాయి.
-ప్రభుత్వానికి పన్నులు చెల్లించడం వల్ల ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది.
-రియల్ఎస్టేట్ రంగం, స్థిరాస్థుల విలువ తగ్గుతుంది. క్యాష్‌లెస్ ఎకానమీ పెరుగుతుంది.
-ద్రవ్యలోటు తగ్గే అవకాశం ఉంటుంది.
-దీంతో మొత్తం లావాదేవీలు చట్టబంద్ధంగా జరిగే భారత ఆర్థిక వ్యవస్థ సక్రమమౌతుంది. తద్వారా ఆర్థిక వ్యవస్థలో వ్యవస్థాపరమైన మార్పులు సంభవిస్తాయి.
నగదురద్దుతో నష్టాలు
-నల్లధనం కేవలం కరెన్సీ రూపంలోనే ఉండదు. కాబట్టి పూర్తిగా నిర్మూలించబడే అవకాశం లేదు.
-సామన్యమానవునికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. దానివల్ల చిల్లర వర్తకం చేసుకునే వ్యాపారాలు తీవ్రంగా నష్టపోవడమే కాకుండా, అవ్యవస్థీకృత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుంది.
-నకిలీ కరెన్సీల వ్యాపారం ఊపందుకుంటుంది.
-కరెన్సీ అతి నియంత్రణలో ఉంటుంది కాబట్టి రూరల్ డిమాండ్ భారిగా తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది.
-డిమాండ్ తగ్గిపోవడంతో వస్తువులకు గిరాకీ తగ్గి, ఉత్పత్తిలో తగ్గుదల సంభవించడంతో ఉద్యోగాల్లో కోతవిధించే అవకాశం ఉంటుంది.
-2008లో అమెరికాలో వచ్చిన సబ్‌ప్రైమ్ క్రైసిస్ లాగా డిమాండ్ తగ్గిపోయి మాని సర్క్యులేషన్ క్షీణించి ప్రతి ద్రవ్యోల్బనం రావొచ్చు. తద్వారా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి నెట్టబడి అస్థవ్యస్థం అవ్వోచ్చు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు