Annual Budget | వార్షిక బడ్జెట్-పూర్వరంగం
బడ్జెట్ అనే మాట మనం తరుచూ వింటుంటాం. ప్రతి ఏడాది పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడుతుంటారు. రాబోవు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ఎలా ఉండబోతున్నది..! ఏయే వస్తువుల ధరలు పెరుగుతాయి..! లేదా తగ్గుతాయి అనే చర్చే సర్వత్రా వినిపిస్తుంది. దేశంలోని ప్రతి పౌరుడిపైనా ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో ప్రభావం చూపగల ఈ బడ్జెట్‌ను ఎవరు రూపొందిస్తారు? ఎలా రూపొందిస్తారు? అన్న విషయాలపై నిపుణ పాఠకుల కోసం ప్రత్యేకం..
బడ్జెట్‌ను అర్థం చేసుకోవడం బహు సులభం
-ఇటీవలికాలంలో ఐదు రాష్ర్టాల ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాలన్నీ బడ్జెట్‌ను వాయిదావేయాలనీ, ఎట్టిపరిస్థితుల్లో ఫిబ్రవరిలో ప్రవేశపెట్టొద్దనీ, దానివల్ల ప్రభుత్వానికి లాభం చేకూరుతుందని ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశాయి. అంతేకాకుండా కొంతకాలంగా ఏప్రిల్ వరకు సాగే బడ్జెట్ ప్రక్రియ ఇక నుంచి మార్చి 31లోపే ముగించేయాలని ప్రభుత్వం భావిస్తుంది. బడ్జెట్ భారత ఆర్థిక వ్యవస్థలో అతిముఖ్యభాగంగా మనకు అనిపించినా దీని ప్రక్రియను ప్రతి సామాన్యుడు తెలుసుకోవాలి. అలాగే పోటీ పరీక్షల అభ్యర్థులు బడ్జెట్ మౌలిక భావనలు ఆర్థిక అంశాలపరంగా కాకుండా సాధారణ అంశంగా ఒక జనరల్ స్టడీస్ సబ్జెక్టుగా అర్థం చేసుకున్నప్పుడు బడ్జెట్‌ను విశ్లేషించడం, దానిపై వ్యాఖ్యలు రాయడం సులభమవుతుంది. అందులోభాగంగా బడ్జెట్‌ను అతి సులభంగా అర్థం చేసుకోవడానికి ఈ ప్రత్యేక వ్యాసం..
బడ్జెట్ అంటే ఏమిటి?
-రాబోయే ఆర్థిక ఏడాదిలో ఒక దేశ ఆదాయ, ఖర్చు వివరాల ప్రకటన సారాంశాన్ని బడ్జెట్ అంటారు.
-అంటే వచ్చే ఏడాదిలో ఒక దేశానికి ఎంత ఆదాయం వస్తుంది, ఆ దేశం ఆ ఆదాయ వనరులతో ఎలా ఖర్చులు చేయబోతుంది అని తెలిపే ప్రమాణపత్రాన్ని బడ్జెట్ అంటారు.
ఆర్థిక ఏడాది అంటే ఏమిటి?
-ఒక దేశం మొత్తం ఆదాయం, మొత్తం ఖర్చు ఈ సంవత్సరకాలంలోనే లెక్కిస్తారు.
-భారతదేశ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు. (భారత రుతుపవనాలు, పంటకాలాలను దృష్టిలోపెట్టుకొని రూపొందించారు)
-ఇది ఒక్కో దేశానికి ఒక్కోవిధంగా ఉండవచ్చు.
-ఈ ఆర్థిక సంవత్సర ప్రామాణికంగానే అన్ని ఆర్థిక సంబంధ గణాంకాలను, రిపోర్టులను, ప్రభుత్వ విధానాలను రూపొందిస్తారు.
-రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదం ఎక్కడా కూడా పేర్కొనలేదు. బడ్జెట్ అంటే తోలుసంచి. బడ్జెట్ పత్రాలను ఒక తోలు సంచిలో తెచ్చేవారు కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది.
-కానీ ఆర్టికల్ 112 ప్రకారం సంవత్సర ఆర్థిక ప్రకటనను ప్రతి ఏడాది ప్రకటించాలి. ఆ ప్రకటననే బడ్జెట్ అని అంటారు.
ఎన్నిరకాల బడ్జెట్లు ఉంటాయి?
-భారతదేశం రాష్ర్టాల సమాఖ్య కాబట్టి కేంద్రానికి, రాష్ర్టానికి మధ్య ఆర్థిక సంబంధాలు దాదాపు వేరుగా ఉన్నాయి. కాబట్టి రాజ్యాంగం 7వ షెడ్యూల్ ప్రకారం కేంద్రానికి, రాష్ర్టానికి వేర్వేరు బడ్జెట్లు ఉంటాయి.
-అలాగే కేంద్రస్థాయి బడ్జెట్లో 1921 నుంచి రెండురకాల బడ్జెట్లు ప్రవేశపెడతారు.
1. సాధారణ బడ్జెట్
2. రైల్వే బడ్జెట్ (1921 నుంచి అక్వర్త్ కమిటీ సూచనల మేరకు వేర్వేరుగా ప్రవేశపెడుతున్నారు)
-కానీ 2017 నుంచి ఈ రెండింటిని కలిపి ఒకే బడ్జెట్‌గా ప్రవేశపెడతామని ప్రభుత్వం పేర్కొంది.
-ఇక రాష్ట్రస్థాయిలో ఇలాంటి రైల్వేబడ్జెట్లాంటిది ఉండదు.
బడ్జెట్ ప్రక్రియ ఎలా సాగుతుంది?
బడ్జెట్ ప్రక్రియలో మొత్తం 4 దశలుంటాయి.
1) బడ్జెట్ రూపకల్పన: వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఖర్చును, ఆదాయాన్ని అంచనావేయడం.
2) బడ్జెట్‌కు చట్టరూపత ఇవ్వడం: ఆర్థిక బిల్లును, అప్రొప్రియన్ బిల్లును శాసన ప్రక్రియ ద్వారా ఆమోదించి చట్టరూపం ఇవ్వడం.
3) బడ్జెట్‌ను అమలుపర్చడం: బడ్జెట్లో ప్రతిపాదించిన వివిధ అంశాలను అమలుపర్చడం అంటే ప్రతిపాదించిన పన్నులను వసూలు చేయడం, ప్రతిపాదిత ఖర్చును అమలుపర్చడం.
4) బడ్జెట్ అమలుప్రక్రియను శాసన వ్యవస్థ ద్వారా పర్యవేక్షించడం: ప్రభుత్వం తరఫున CAG కానీ ఇతర సంస్థలుకానీ బడ్జెట్ అమలు మొత్తాన్ని ఆడిట్రూపంలో ఇతరరూపంలో పార్లమెంటు తరఫున పర్యవేక్షిస్తారు.
-పై ప్రక్రియలన్నిటి కంటే ముందే వచ్చే సంవత్సర బడ్జెట్ ప్రక్రియను ప్రస్తుత సంవత్సరం ఆగస్టు-సెప్టెంబర్ నెలలోనే మొదలుపెట్టి వివిధ శాఖల నుంచి ప్రతిపాదనలు తీసుకొని దేశ ఆర్థికశాఖ బడ్జెట్‌ను రూపొందిస్తుంది.
బడ్జెట్‌ను ఎందుకు పార్లమెంటుకు సమర్పించాలి? ఎందుకు బడ్జెట్ చట్టరూపం దాల్చాలి?
-ఆర్టికల్ 112 ప్రకారం రాబోయే ఆర్థిక లావాదేవీలను పార్లమెంటుకు సమర్పించాలి. ఇవేకాకుండా ఈ బడ్జెట్‌ను కేవలం లోక్‌సభలో రాష్ట్రపతి ఆమోదంతో మాత్రమే ప్రవేశపెట్టాలి. అంతేకాకుండా పార్లమెంటు అనుమతి లేకుండా ఒక్కరూపాయి కూడా ఖర్చు చేయడానికి వీల్లేదు. ఎవరి వద్ద నుంచి పన్నులు వసూలు చేయడానికి అధికారం లేదు.
-అందువల్ల డబ్బులను ఖర్చు చేయడానికి, ఆదాయ మార్గాలను సమకూర్చుకోవడానికి పార్లమెంటు అనుమతి కచ్చితంగా తీసుకోవాలి. కాబట్టి బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టి దానికి చట్టరూపత కల్పించాలి.
బడ్జెట్‌ను చట్టరూపం చేయడంలోని దశలు
బడ్జెట్‌ను చట్టంగా తీసుకురావడానికి మొత్తం ఆరు దశలు ఉంటాయి. అవి..
1. బడ్జెట్ సమర్పన (లోక్‌సభలో)- బడ్జెట్ ప్రసంగం (ఒక రోజు)
2. బడ్జెట్‌పై సాధారణ చర్చ (3 నుంచి 4 రోజులు)
3. బడ్జెట్ సమగ్ర పరిశీలన కోసం వివిధ డిపార్ట్మెంటల్ కమిటీలకు పంపించడం
4. ఓటింగ్ ఆన్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ (26 రోజులు)
5. అప్రొప్రియన్ బిల్లు (Expenditure Bill) ను ఆమోదించడం
6. ఫైనాన్స్ బిల్లు (పన్నుల ప్రతిపాదనలు లేదా ఆదాయ బిల్లు)ను ఆమోదించడం
బడ్జెట్‌ను ఆమోదించకపోతే..
-ఒకవేళ లోక్‌సభలో అధికార పక్షానికి మెజారిటీ లేకుండా, బడ్జెట్ లోక్‌సభ ఆమోదం పొందకపోతే, ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీనామా చేయాల్సిందే. ఎందుకంటే అది ప్రభుత్వ విశ్వసనీయతను తెలుపుతుంది.
డిమాండ్ ఫర్ గ్రాంట్ అంటే?
-డిమాండ్ అంటే ప్రపోజల్ (ప్రతిపాదన). అంటే ఉదాహరణకు వ్యవసాయానికి 35 వేల కోట్లను ప్రతిపాదిస్తున్నాం, సంక్షేమ రంగానికి 40 వేల కోట్లు, ఆదాయ పన్ను 12 శాతంగా ప్రతిపాదిస్తున్నాం అని బడ్జెట్ ప్రసంగంలో వింటాం. దీన్నే డిమాండ్ ఫర్ గ్రాంట్ అని అంటారు.
-ఇలా మొత్తం సాధారణ బడ్జెట్లో ప్రతి డిమాండ్‌ను పార్లమెంటు ఆమోదించాలి.
-రైల్వే బడ్జెట్లో 32 డిమాండ్లు, సాధారణ బడ్జెట్లో 109 డిమాండ్లు ఉంటాయి.
-ఈ 109 డిమాండ్లపై లోక్‌సభ చర్చించి, ప్రతి డిమాండ్‌పై విడివిడిగా ఓటు వేయాల్సి ఉంటుంది.
-ఇలా ప్రతి డిమాండ్‌పై ఓటువేసి, మళ్లీ మొత్తంగా ఒక బిల్లు రూపంలో బడ్జెట్‌ను ఆమోదించి రాజ్యసభకు పంపిస్తారు.
-బడ్జెట్‌ను ఆమోదించడానికి గానీ, తిరస్కరించడానికి గానీ రాజ్యసభకు అధికారం లేదు. కేవలం బడ్జెట్‌ను చర్చించి 11 రోజుల్లోపు తిరిగి పంపించాలి. ఇలా పంపిన బడ్జెట్‌ను రాష్ట్రపతి కచ్చితంగా ఆమోదించాలి. కాబట్టి బిల్లును మళ్లీ తిరిగి పంపే అధికారం రాష్ట్రపతికి లేదు.
బడ్జెట్లో మూడు రకాల అంచనాలు
1) బడ్జెట్ అంచనాలు
2) సవరించిన అంచనాలు
3) వాస్తవ అంచనాలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు