Financial planning structure | ఆర్థిక ప్రణాళిక నిర్మాణం
గ్రూప్-1 ఎకానమీలో భాగంగా ద్రవ్యం, బ్యాంకింగ్, ద్రవ్య సంబంధ విషయాలను తెలుసుకుందాం. కానీ మరింత లోతుగా ఎకానమీని అర్థం చేసుకోవడానికి, ఎకానమీని సులభంగా విపులీకరించడానికి ద్రవ్యం, బ్యాంకింగ్ కంటే ముందు అత్యంత ముఖ్యమైన చాప్టర్ ప్లానింగ్, ప్లానింగ్ కమిషన్ మొదలైన విషయాల గురించి చర్చించడం అత్యంత ఆవశ్యకం. అందులో భాగంగా అసలు ప్రణాళిక అంటే ఏమిటి? వివిధ రకాల ప్రణాళికలు, భారతదేశం అవలంబించే ప్రణాళికల స్వరూపం, ప్రణాళికాసంఘం అంటే ఏమిటి? దాని విధులు, స్వభావం, పనితీరు మొదలైన అంశాలను తెలుసుకుందాం.
ఒక దేశానికి ప్రణాళికలు ఎందుకు అవసరం?
ఏదైనా ఆర్థిక వ్యవస్థలో ఉన్న పరిమితమైన ఆర్థిక, భౌతిక, మానవ వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని, ఆ దేశ పౌరుల అవసరాలను తీర్చడానికి ఒక నిర్దిష్ట సమయంలో కొన్ని లక్ష్యాలు ఏర్పర్చుకోవాలి. ఆ లక్ష్యాల సాధనకోసం ఒక ఆర్థిక వ్యవస్థ రూపొందించే మార్గ సూచీయే ప్రణాళిక. అందుకే ఒక దేశానికి ప్రణాళిక ఎంతో అవసరం.
ప్రణాళిక అంటే ఏమిటి?
-నిర్దిష్ట సమయంలో, నిర్దిష్ట ప్రాంతంలో నిర్వచిత లక్ష్యాలను సమర్థవంతంగా నిర్వహించి, సత్ఫలితాలను సాధించే ప్రక్రియనే ప్రణాళిక అంటారు.
-ప్రభుత్వం ఆలోచనాత్మకంగా, ఉద్దేశ పూర్వకంగా కొన్ని ఆర్థిక ప్రాధాన్యతాక్రమాలను ఎంపిక చేసుకుని సాధించడమే ప్రణాళిక – ఇందిరాగాంధీ
-ఏ వస్తువులను ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలి? ఏవిధంగా ఉత్పత్తి చేసి ఎవరికి ఎలా కేటాయించాలి? అనే ముఖ్యమైన నిర్ణయాలను ఆర్థిక వ్యవస్థ క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశించే పద్ధతి – ఆచార్య డికిన్సన్
-లభ్యమయ్యే వనరులను కొన్ని నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సాలోచనగా కేటాయించి సాధించే ప్రక్రియనే ప్రణాళిక – భారత ప్రణాళికా సంఘం
-మొత్తంగా ఉత్పాదకతకు రాబడిని, ఉపాధిని, ప్రజల సామాజిక సంక్షేమాన్ని పెంపొందించడం కోసం శాస్త్రీయ పద్ధతిలో కృషిచేయడాన్ని ప్రణాళిక అంటారు.
ప్రణాళికాబద్దమైన కృషి ఎందుకు అవసరం
1. ప్రతి ఆర్థిక వ్యవస్థ కూడా తనకున్న వనరులను (ఆర్థిక, మానవ) సక్రమంగా వినియోగించడానికి
2. ఆర్థికపరమైన ఒడిదొడుకులు లేకుండా అత్యధిక ఫలితాలు పొందాలంటే ప్రణాళికాబద్దమైన కృషి ఎంతో అవసరం.
ప్రణాళికాబద్దమైన కృషి అంటే ఏమిటి? అందులో ఏయే అంశాలు ఉంటాయి?
1. ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం ఉన్న వనరులను, అవసరాలను సమగ్రంగా లెక్కించడం
2. సమగ్రంగా లెక్కించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని, ఆర్థిక వ్యవస్థ సమర్థత, అవసరాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో నిర్ణీత కాలంలో సాధించాల్సిన లక్ష్యాలను నిర్ణయించడం
3. నిర్ణయించిన లక్ష్యాలను చేరుకోవడానికి ఆర్థిక వ్యవస్థలోని పరిస్థితులకు అనుగుణంగా సరైన మార్గాన్ని ఏర్పాటు చేయడం.
-పై మూడు అంశాలనే ప్రణాళికాబద్దమైన కృషి అంటారు.
సరైన ప్రణాళికా ప్రక్రియకు ప్రధానమైన ఆరు అంశాలు
-భవిష్యత్ లక్ష్యాలను సాధించడానికి దోహదం చేసే సరైన గణాంక వివరాలు
-విస్తృత ఆర్థిక వ్యవస్థ
-సమర్థవంతమైన పాలక వ్యవస్థ
-అవసరానికి అనుగుణంగా వ్యవస్థాగత మార్పులు
-ప్రజల సహకారం
-ఆయా లక్ష్యాల ప్రాధాన్యం
ప్రణాళికల రకాలు లక్ష్యాల ప్రాతిపదికన..
1. భౌతిక ప్రణాళిక
-వివిధ వస్తువుల భౌతిక ఉత్పత్తి లక్ష్యాలు ప్రాతిపదికగా వనరులను కేటాయిస్తూ రూపొందించిన ప్రణాళిక.
2. ఆర్థిక ప్రణాళిక
-ఆర్థిక లక్ష్యాల ప్రాతిపదికగా వివిధ పెట్టుబడుల మార్గాంతరాలకు, వనరుల కేటాయింపు చేస్తూ రూపొందించిన ప్రణాళిక. (ప్రస్తుతం దేశంలో అనుసరిస్తున్న ప్రణాళిక)
ప్రణాళిక నిడివి/వ్యవధి/కాలాన్ని బట్టి..
1. స్వల్పకాలిక ప్రణాళిక: ప్రణాళికాకాలం ఒక సంవత్సరం వరకు ఉంటుంది.
2. మధ్యకాలిక ప్రణాళిక: ప్రణాళిక కాలం 3 నుంచి 5 సంవత్సరాల వరకు ఉంటుంది.
3. దీర్ఘకాలిక ప్రణాళిక: ప్రణాళిక కాలం 10 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు ఉంటుంది.
నిరంతర ప్రణాళిక
-ప్రణాళికాకాలంలో గతించిన సంవత్సరాన్ని వదిలేసి, రాబోయే సంవత్సరాన్ని ప్రణాళిక వ్యవధికి కలుపుకొంటూ సాధించిన విజయాలను పరిశీలించి, సాధించాల్సిన లక్ష్యాలను నిర్దిష్టంగా నిర్వచించి, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వాటి సాధనకు పునరంకితమయ్యే విధానాన్ని నిరంతర ప్రణాళిక అంటారు.
-భారత్‌లో 1978-80 మధ్య నిరంతర ప్రణాళిక అమలైంది. దీన్ని జనతా ప్రభుత్వం అమలు చేసింది. భారత్‌లో 6వ ప్రణాళిక కాలంలో అమలైన ఒక ఆదర్శవంతమైన భావనే నిరంతర ప్రణాళిక.
-భారత్‌ది పంచవర్ష ప్రణాళిక కాబట్టి.. భారత ప్రణాళికను మధ్యకాలిక ప్రణాళిక అంటారు.
ప్రణాళికారచన స్వభావాన్ని బట్టి..
1. కేంద్రీకృత ప్రణాళిక
-ప్రణాళిక రచనను ఒకే కేంద్ర అధికార యంత్రాంగం రూపొందిస్తుంది.
-ప్రణాళిక రచన పై నుంచి (అంటే కేంద్ర ప్రభుత్వం – రాష్ట్ర ప్రభుత్వం – జిల్లా – గ్రామాలు అనే క్రమంలో) కిందికి దేశానికంతటికీ రూపొందిస్తే దాన్ని కేంద్రీకృత ప్రణాళిక అంటారు.
2. వికేంద్రీకరణ ప్రణాళిక
-దేశంలో వివిధ పరిపాలనా విభాగాలను సంప్రదించి రూపొందించే ప్రణాళిక ప్రక్రియ.
-ప్రణాళిక రచన కింది నుంచి (అంటే గ్రామం – మండలం – జిల్లా – రాష్ట్రం – దేశం) పై స్థాయికి రూపొందిస్తే దాన్ని వికేంద్రీకృత ప్రణాళిక అంటారు.
-దేశంలో మొదట కేంద్రీకృత ప్రణాళిక అమలైంది. క్రమంగా వికేంద్రీకృత ప్రణాళిక వైపు దేశం పరుగులు తీస్తోంది.
ఆర్థిక కార్యకలాపాల స్వభావాన్ని బట్టి..
1. దార్శనిక ప్రణాళిక
-సుదీర్ఘ కాలవ్యవధిని ధృష్టిలో ఉంచుకుని రూపొందించిన ప్రక్రియ. ఇది 10, 15, 20, 25 ఏండ్ల సుదీర్ఘ కాలవ్యవధికి రూపొందించి క్రమంగా 2, 3, 5 లేదా 6 ఏండ్ల స్వల్ప కాలవ్యవధికి కుదించి.. దార్శనిక ప్రణాళికలోని విస్తృత లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తారు. (దేశంలో 3వ, 7వ ప్రణాళికలు)
2. నిర్దేశిత లేదా సమగ్ర ప్రణాళిక
-దేశంలోని అన్ని ఆర్థిక కార్యకలాపాలు, ఆర్థిక సంబంధ వనరులను రాజ్యం ఆధీనంలో ఉంచుకుని రూపొందించే ప్రణాళిక.
-వినియోగదారుడి ఆకాంక్షలకు తావుండదు.
-ఇది ఎక్కువగా సామ్యవాద ఆర్థిక వ్యవస్థల్లో కనిపిస్తుంది.
-ఒకవేళ పరిశ్రమల నిర్వాహకులు రాజ్యం నిర్దేశించే ఉత్పత్తి వ్యూహాన్ని సరిగా అమలు చేయకపోతే ఆ మొత్తం ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం ఉంటుంది.
3. సూచనాత్మక ప్రణాళిక
-ఇది దార్శనిక, నిర్దేశిత ప్రణాళికల మధ్య వారధి లాంటిది.
-స్వేచ్ఛా విపణిలో నిర్బంధ వ్యవస్థలోని అనుకూలాంశాలు ఉంటే దాన్ని సూచనాత్మక ప్రణాళిక అంటారు.
-రాజ్యం ప్రైవేటు రంగానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. కానీ దాన్ని ఆదేశించదు. (8వ పంచవర్ష ప్రణాళిక నుంచి)
ప్రణాళిక చరిత్ర ప్రణాళికా సంఘం
-ఇది రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో ఉన్న అధికరణ 39 ప్రకారం ఏర్పడింది.
-ప్రణాళిక భవనాన్ని యోజనా భవన్ అని పిలుస్తారు. ఇది యోజన అనే ఒక నెలవారీ మాస పత్రికను సైతం విడుదల చేస్తుంది.
ప్రణాళికా సంఘం విధులు
-మానవ ఆర్థిక అభివృద్ధిలో ఒక విధాన రూపకల్పన చేయడంలో ప్రణాళిక సంఘం ఒక నిర్మాణాత్మక పాత్రను పోషిస్తుంది. పరిమిత వనరులను అత్యంత చాకచక్యంగా వాడుకొని సాధ్యమైనంత ఎక్కువ ఉత్పత్తిని పెంచడమే ప్రణాళిక సంఘం ముఖ్య ఉద్దేశం.
-ప్రణాళిక వ్యయం పెరుగుదలపూ కాకుండా, కేటాయింపులను వినియోగించుకునే సామర్థ్యాన్ని పెంచేలా ప్రణాళికా సంఘం వ్యవహరిస్తుంది.
-ప్రణాళికా సంఘం వ్యవస్థాగత మార్పునకు ప్రయత్నిస్తూ మెరుగైన వ్యవస్థను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వానికి సలహాలు అందిస్తుంది.
ఆర్థిక ప్రణాళికల పాత్ర
-స్వేచ్ఛా విపణిగల ఆర్థిక వ్యవస్థలో కూడా ప్రణాళికా ప్రక్రియ అవసరం. సాధారణంగా పెరుగుదలకు, ఉత్పత్తికి.. మార్కెట్ శక్తులు, ధరల యంత్రాంగం బాధ్యత వహించినప్పటికీ అభివృద్ధి కోసం ప్రణాళిక అవసరమవుతుంది. మౌలిక సౌకర్యాల రంగం, సామాజిక రంగాలతోపాటు ప్రైవేటు రంగం చొరవ తీసుకోని రంగాల్లోనూ ప్రణాళిక ప్రక్రియను కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. మార్కెట్ వ్యవస్థను విస్తరించి, స్టాక్ ఎక్సేంజీలను, ఇతర ఆర్థిక సంస్థలను సజావుగా నిర్వహిస్తూ, సరకుల రవాణాలో అడ్డంకులను తొలగించి, వినియోగదారుల హక్కులను రక్షించడంలోనూ ప్రణాళిక వ్యవస్థ కీలకపాత్ర పోషిస్తుంది. పేదరికం, నిరుద్యోగం, పెరిగిపోతున్న జనాభా, నిరక్షరాస్యత, అజ్ఞానం ప్రస్తుతం మన ప్రణాళికా వ్యవస్థ ముందున్న ప్రధానమైన సవాళ్లు. ఆర్థిక సంపన్నత కోసం సాగుతున్న పరుగు పందెంలో రాజ్యం జోక్యం చేసుకుని బడుగు వర్గాలకు ప్రాధాన్యం కల్పించకపోతే, సమాజంలో అధిక భాగం వెనుకబడిపోయే ప్రమాదం ఉంది.
విధులు
-1950 ప్రభుత్వ తీర్మానం ప్రకారం ఏర్పాటు చేసిన ప్రణాళికా సంఘానికి నిర్దేశించిన విధులు..
-మొత్తం దేశంలోని వస్తు, మూలధనం, మానవ వనరులన్నింటిని లెక్కించి నిర్ధారించడం, దేశీయ అవసరాల కోసం కొరత వనరులను సమీకరించేందుకుగల అవకాశాలను పరిశీలించడం.
-అత్యంత సమర్థ, సమతుల్య పద్ధతిలో వనరులను వినియోగించుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేయడం.
-ప్రణాళికను వివిధ దశలుగా విభజించి, వాటికి వనరులను ప్రాధాన్యతాక్రమంలో కేటాయించడం.
-ఆర్థికాభివృద్ధికి విఘాతం కలిగించే కారకాలను కనుగొని, వాటికి నేటి సాంఘిక, రాజకీయ పరిస్థితుల దృష్ట్యా పరిష్కారాలను కనుగొనడం.
-ప్రణాళిక ప్రతి దశను విజయవంతంగా అమలుపర్చడానికి కావాల్సిన యంత్రాంగం స్వభావాన్ని నిర్ణయించడం.
-ఎప్పటికప్పుడు ప్రణాళికలోని ఒక్కోదశ అమలు ప్రగతిని పరిశీలించి, అవసరమైన విధాన, సవరణ చర్యలు సూచించడం.
-అవసరమైనప్పుడు లేదా విధుల నిర్వహణా క్రమంలో మధ్యంతర/తాత్కాలిక సూచనలు చేయడం, లేదా అమల్లో ఉన్న ఆర్థిక పరిస్థితుల, ప్రస్తుత విధానాల దృష్ట్యా కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు కోరినప్పుడు ఆదేశించిన విధంగా తగిన సలహాలు, సూచనలు చేయడం.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు