Inflation | ద్రవ్యోల్బణం
-ద్రవ్యోల్బణం అంటే ఏమిటి? దాన్ని ఎలా నిర్వచించవచ్చు. దాని వల్ల కలిగే మంచి పరిణామాలేంటి? దుష్పరిణామాలేంటి? ద్రవ్యోల్బణ రకాలు, ద్రవ్యోల్బణం వివిధ వర్గాలపై చూపే ప్రభావం ఏంటి? ద్రవ్యోల్బణం కొలిచే సాధానాలేంటి? ద్రవ్యోల్బణ రేటును బట్టి దాన్ని ఎన్ని రకాలుగా విభజించవచ్చు? ద్రవ్యోల్బణాన్ని కట్టడిచేసే సాధానాలేంటి? మొదలైనవాటిని తెలుసుకుందాం.
ద్రవ్యోల్బణం వల్ల జరిగే చెడు పరిణామాలు
1) ద్రవ్యోల్బణం ద్రవ్యానికి ఉన్న వాస్తవ విలువను తగ్గిస్తుంది. అంటే వస్తువులనుకొనే సామర్థ్యం తగ్గిపోతుంది.
2) ద్రవ్యోల్బణం భవిష్యత్‌పై గందరగోళాన్ని సృష్టిస్తుంది. తద్వారా పెట్టుబడులపై నమ్మకాన్ని కోల్పోయేటట్టు చేసి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంది.
3) ఎక్కువ ద్రవ్యోల్బణం మెల్లగా వస్తువులకు విపరీత గిరాకీని కలిగించి వస్తువుల కొరతకు దారితీస్తుంది. ఆ సందర్భంలో వస్తువులకు మరింత గిరాకీ వస్తుందనే ఉద్దేశంతో వస్తు సప్లయ్‌ను ఆపివేసి కృత్రిమ కొరతను సృష్టించే అవకాశం ఉంది. అది వస్తువుల ధరను మరింత పెంచి సామాన్యులకు అవసరమైన వస్తువులు అందకుండా అడ్డుకుంటుంది.
4) ద్రవ్యోల్బణం వల్ల పేదవారు, ఇతర మధ్యస్థ కుటుంబీకులు తీవ్ర ఇబ్బందులపాలై నిత్యావస సరుకులు కొనలేని పరిస్థితికి దారితీస్తుంది.
ద్రవ్యోల్బణం వల్ల జరిగే మంచి పరిణామాలు
1) ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు ఆర్బీఐ తన వడ్డీరేట్లను పెంవచ్చు లేదా తగ్గించవచ్చు. అంటే ప్రతి ద్రవ్యోల్బణం సమయంలో వడ్డీరేట్లు జీరో వద్ద ఉంటాయి. కావున పెంచడమే కానీ తగ్గించడం జరగదు. కానీ ద్రవ్యోల్బణ సమయంలో పెంచవచ్చు, తగ్గించవచ్చు.
2) ద్రవ్యోల్బణం సమయంలో ద్రవ్యానికి విలువ పడిపోతుంది. కావున ద్రవ్యేతర ప్రాజెక్టులపై పెట్టుబడులు పెరుగుతాయి. ఉదా: ప్రజలు రియల్ ఎస్టేట్, బంగారం ఇతర విషయాల్లో ఎక్కువ పెట్టుబడులు పెడతారు.
3) వస్తువులకు విపరీతంగా గిరాకీ పెరడగం వల్ల మార్కెట్లో వస్తువులకు డిమాండ్ ఉంటుంది. కాబట్టి వస్తువుల సరఫరాను పెంచే అవకాశం ఉంటుంది. అది పారిశ్రామిక అభివృద్ధికి దారితీసి నిరుద్యోగాన్ని తగ్గిస్తుంది.
వివిధ వర్గాలపై ద్రవ్యోల్బణం చూపే ప్రభావం
-సమాజంలో అన్ని వర్గాలపై ద్రవ్యోల్బణం ఏదో రకంగా ప్రభావం చూపుతుంది. అందులో భాగంగా కొందరికి లాభంగా, కొందరికి నష్టంగా ద్రవ్యోల్బణం ఉంటుంది.
1. సంపదను పునఃపంపిణీ చేస్తుంది
-వివిధ వర్గాల మధ్య ఉన్న వివిధ స్థాయిల ద్రవ్యాన్ని ద్రవ్యోల్బణ సమయంలో మళ్లీ పునఃపంపిణీ చేస్తుంది. ద్రవ్యోల్బణ సమయంలో ద్రవ్యానికి విలువ ఉండదు కాబట్టి సంపద వివిధ వర్గాల చేతులు మారి అది పునఃపంపిణీ అవుతుంది.
2. అప్పు ఇచ్చినవారు వర్సెస్ అప్పు తీసుకున్నవారు
-ద్రవ్యోల్బణ సమయంలో అప్పు తీసుకున్నవారికి లాభం, అప్పులు ఇచ్చినవారికి నష్టం జరుగుతుంది. ఉదాహరణకు ఒక ఏ అనే వ్యక్తి బికి రూ. 1000 అప్పుగా ఇచ్చాడనుకుందాం. అప్పుడు ద్రవ్యోల్బణం తక్కువ కాబట్టి ఆ రూ. 1000తో 20 కేజీల బియ్యాన్ని కొనవచ్చు. కానీ ద్రవ్యోల్బణ సమయంలో అదే రూ. 1000తో కేవలం 10 కేజీల బియ్యాన్ని మాత్రమే కొనగలం. అంటే బి అనే వ్యక్తి అదే డబ్బుతో తిరిగిస్తే అది ఏకి నష్టమే కదా!
3. ఉత్పత్తిదారులు వర్సెస్ వినియోగదారులు
-ఉత్పత్తిదారులు లాభపడతారు. వినియోగదారులు నష్టపోతారు.
ఉదా: ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి కొంత మొత్తం ఖర్చు చేసిన ఉత్పత్తిదారుడు ద్రవ్యోల్బణ సమయంలో ఆ వస్తువు సాధారణ ధర కంటే ఎక్కువ ధరను కలిగి ఉంటుంది. అంటే అతనికి సాధారణంగా ఇచ్చే ద్రవ్యం కంటే ఎక్కువ ద్రవ్యం వస్తుంది. ఇక వినియోగదారుడు ద్రవ్యోల్బణ సమయం ఎక్కువ ద్రవ్యాన్ని పెట్టి వస్తువును కొంటాడు కాబట్టి ఆయన నష్టపోతాడు.
4. స్థిర వేతనదారులు వర్సెస్ అస్థిర వేతనదారులు
-స్థిర వేతనదారులు నష్టపోతారు. అస్థిర వేతనదారులు లాభపడతారు. ఇక్కడ స్థిర వేతనం ఉండే ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర ప్రైవేట్ ఉద్యోగులు ఎందుకు నష్టపోతారంటే… వస్తువుల ధరలు పెరిగినప్పుడే వారి జీతాలు కూడా పెరగక స్థిరంగా ఉంటాయి. అలాంటి సందర్భంలో వారికి వచ్చే జీతంతో ఇంతకుముందు కంటే తక్కువ వస్తువులను మాత్రమే కొంటారు. ఇక అమ్మకందారులు, పెట్టుబడిదారులు, స్వఉద్యోగులు మొదలైనవారు ద్రవ్యోల్బణంతో పాటు వారి ఆదాయాన్ని కూడా పెంచుకుంటారు కాబట్టి వారికి ఎలాంటి నష్టం ఉండదు.
5. బాండ్లు కొనేవారు వర్సెస్ అమ్మినవారు
-అమ్మినవారు లాభపడటం. కొన్నవారు నష్టపోవడం జరుగుతుంది. ఎలాగంటే బాండ్లు కొనేటప్పుడు కొంత ద్రవ్యాన్ని వెచ్చించి కొని, కొంత కాలం తర్వాత పెట్టుబడి ద్రవ్యం కంటే ఎక్కువ ద్రవ్యం వస్తుందని ఆశిస్తారు. కానీ ద్రవ్యోల్బణ సమయంలో ద్రవ్యానికి విలువ ఉండదు. కాబట్టి అదనపు ద్రవ్యం వచ్చినా పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదు. అందువల్ల బాండ్లు ఉంచుకున్నవారు, కొనేవారు నష్టపోతారు. దీనిని అధిగమించడానికి వినియోగదారులను నష్టాల నుంచి కాపాడటానికి భారత ప్రభుత్వం ఇన్ఫ్లెషన్ ఇండెక్స్డ్ బాండ్లను ప్రవేశపెట్టింది.
-ఇన్ఫ్లెషన్ ఇండెక్స్డ్ బాండ్స్ అంటే.. బాండ్లపై వడ్డీరేట్లు ద్రవ్యోల్బణ వడ్డీరేట్లకు అనుగుణంగా మారుతాయి. అంటే ద్రవ్యోల్బణం వల్ల వచ్చే నష్టాలను పూడ్చడానికి ద్రవ్యోల్బణ రేట్లకు అనుగుణంగా వీటిని ప్రవేశపెట్టారు.
6. ఉత్పత్తి వర్సెస్ వినియోగం
-ద్రవ్యోల్బణ సమయంలో వస్తువులకు ఎక్కువ గిరాకీ ఉండి ధరలు పెరగడం వల్ల వస్తువులను కొనేవారి సంఖ్య తగ్గిపోతుంది. తద్వారా ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. ఎక్కువ ధరలు ఉండటం వల్ల వినియోగదారులు వస్తువులను కొనలేరు. అప్పుడు వినియోగం కూడా తగ్గిపోతుంది. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని వస్తువులకు గిరాకీ పెరిగి కొన్ని వస్తువులకు తగ్గడం వల్ల వేరే వస్తువులకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.
ఇతర ప్రభావాలు
1. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్(BOP)పై ప్రభావం
-ఒక దేశం మొత్తం ఆర్థిక లావాదేవీలు ఇతర దేశాలతో జరిపినప్పుడు జరిగిన ఒక క్రమబద్ధమైన నమోదునే BOP అని అంటారు. అంటే ఎగుమతి, దిగుమతుల క్రమబద్ధ నమోదు అని అర్థం.
-ద్రవ్యోల్బణ సమయంలో అది BOPకి నష్టం కలిగిస్తుంది. ఎలాగంటే ద్రవ్యోల్బణ సమయంలో వస్తువులు తక్కువ ఉంటాయి. కావాల్సిన వస్తువులను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర దేశాల నుంచి దిగుమతులను పెంచి, మన దేశం నుంచి ఎగుమతులను తగ్గించాలి. అలాంటప్పుడు BOPలో ఎగుమతులు తగ్గి, దిగుమతులు పెరగడం వల్ల BOPకి నష్టం వస్తుంది. 1990లో వచ్చిన ఆర్థిక మాంద్యం ఇలాంటిదే.
2. మారక విలువపై ప్రభావం
-ద్రవోల్బణ సమయంలో ఎగుమతులు తక్కువగా, దిగుమతులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి విదేశీ కరెన్సీకి ఎక్కువ గిరాకీ ఉండి, స్వదేశీ కరెన్సీ విలువ పడిపోతుంది. అలాంటి సందర్భంలో స్వదేశీ కరెన్సీ విలువ పడిపోయే అవకాశం ఉంది. అంటే అది కరెన్సీ తీవ్ర ఒడిదుడుకులు చెందడానికి కారణం అవుతుంది.
ద్రవ్యోల్బణం అంటే ఏమిటి?
-వస్తువుల సాధారణ ధరల్లో ఒక నిర్ణీత కాలంలో క్రమానుగతంగా పెరిగే ధరలస్థాయినే ద్రవ్యోల్బణం అంటారు.
-సాధారణ ధరలస్థాయి అంటే ఒక ఆర్థిక వ్యవస్థలో ఉండే ముఖ్యమైన వస్తువుల ధరలస్థాయి.
-అదేవిధంగా ఒక నిర్ణీతకాలం అంటే 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం ఇలా ఒక స్పష్టమైన కాలపరిమితితో కొలుస్తారు.
-అంటే అది క్రమానుగతంగా పెరగాలి.
-ఇలా అన్ని విషయాలు కలిస్తే వచ్చేదే ద్రవ్యోల్బణం.
-ద్రవ్యోల్బణాన్ని ఇలా కూడా నిర్వచించవచ్చు. మార్కెట్లో ద్రవ్యసరఫరా స్థాయి పెరిగి వస్తువులకు తీవ్ర గిరాకీ ఏర్పడినప్పుడు ద్రవ్య విలువ పడిపోయి వస్తువులకు ధరలు పెరిగే స్థితినే ద్రవ్యోల్బణం అని అంటారు.
-ద్రవ్యసరఫరా: చలామణిలో ఉండే మొత్తం ద్రవ్యాన్ని ద్రవ్యసరఫరా అని అంటారు.
దీన్ని M1, M2, M3, M4లలో కొలుస్తారు.
-ద్రవ్య విలువ పడిపోవడం అంటే.. ఒక యూనిట్ ద్రవ్యం వస్తువులను కొనే సామర్థ్యాన్ని ద్రవ్య విలువ అని అంటారు.
-అంటే పూర్వం రూ. 100కు 5 కేజీల బియ్యాన్ని కొనుక్కునేవాళ్లం. అదే రూ. 100తో నేడు కేవలం 2 కేజీల బియ్యం మాత్రమే కొనగలుగుతున్నాం. అంటే వస్తువులను కొనే సామర్థ్యం ద్రవ్యానికి తగ్గిపోయిందని అర్థం.
-అయితే ద్రవ్యోల్బణం వల్ల మంచితో పాటు చెడు కూడా జరుగుతుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు