Community development experiments | సమాజ వికాస ప్రయోగాలు
-బరోడా ప్రయోగం (1932): బరోడా సంస్థానంలో దివాన్‌గా పనిచేసిన వీటీ కృష్ణమాచారి ఈ ప్రయోగం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువతీయవకులను సమీకరించి రోడ్లు వేయడం, కోళ్ల పెంపకం, పాడిపరిశ్రమల అభివృద్ధి మొదలైన రంగాల్లో వారిని చైతన్యవంతులను చేసి స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రయత్నించారు.
-సేవాగ్రామ్ ప్రయోగం (1933): మహారాష్ట్రలో వార్దాలో ప్రయోగాత్మకంగా దీన్ని స్థాపించారు. సర్వోదయ, నవోదయ సిద్ధాంతాలపై ఈ సంస్థను నిర్వహించారు. వినోబాభావే, జయప్రకాశ్ నారాయణ్ ఈ సిద్ధాంతానికి ఆకర్షితులై అనేక సమాజ వికాస కార్యక్రమాలను చేపట్టారు.
-ఫిర్కా ప్రయోగం (1946): 1946లో అప్పటి మద్రాస్ ముఖ్యమంత్రిగా ఉన్న టంగుటూరి ప్రకాశం తాలూకాలను కొన్ని ఫిర్కాలుగా విభజించి ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం కొన్ని ప్రయోగాలు చేశాడు. దీన్ని ఫిర్కా ప్రయోగం అంటారు. 1952లో సమాజ అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టడంతో ఫిర్కాలను బ్లాకుల్లో విలీనం చేశారు.
-ఇటావా ప్రయోగం (1948): ఇటావా జిల్లాలోని మహేవా ప్రాంతంలో ఆల్బర్ట్ మేయర్ అనే విదేశీ ఇంజినీర్ సహాయంతో 97 గ్రామాలను ఎంచుకొని ప్రయోగాత్మకంగా పౌర సౌకర్యాలను కల్పించడానికి ప్రయత్నం చేశాడు. కళారూపాల ద్వారా సామాజిక చైతన్యం, సమాజ అభివృద్ధికి సంబంధించిన అంశాలు, వ్యవసాయ, పాడిపరిశ్రమ, చేనేత పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కృషిచేసింది.
-నీలోఖేరి ప్రయోగం (1948): హర్యానాలోని కర్నాల్ జిల్లాలోగల నీలోఖేరిలో భారత విభజన సందర్భంగా నిరాశ్రయులైన దాదాపు 7వేల మందికి పునరావాసం కల్పించడం, స్వయంశక్తితో అభివృద్ధిచెందేలా ఎస్కే డే ఆధ్వర్యంలో వ్యవసాయ పనిముట్లను తయారుచేయడం, ఇంజినీరింగ్ వర్క్స్ మొదలైన అంశాలపై శిక్షణ ఇచ్చారు.
స్వాతంత్య్రానంతర సామాజిక వికాస పథకాలు
-స్వాతంత్య్రం వచ్చేనాటికి దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఆహారధాన్యాలను దిగుమతి చేసుకొనే దుస్థితిలో ఉంది. దీంతో సమగ్ర గ్రామీణాభివృద్ధి ద్వారా వ్యవసాయాభివృద్ధిని సాధించాలనుకుని గ్రో మోర్ ఫుడ్ అనే నినాదంతో ఆహారధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి సమాజ అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం సంకల్పించింది. దీనికనుగుణంగా మొదటి పంచవర్ష ప్రణాళికలో గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యమివ్వడానికి తగిన సిఫారసులను సూచించమని వీటీ కృష్ణమాచారి అధ్యక్షతన ఒక కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ సిఫారసుల మేరకు మొదటగా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 55 సమితిల్లో సమాజ అభివృద్ధి కార్యక్రమంను 1952, అక్టోబర్ 2న ప్రారంభించారు.
-సమాజ అభివృద్ధి పథకం (1952): దీన్ని అమెరికాకు చెందిన ఫోర్డ్ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో ప్రారంభించారు. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం అనే భావనను అమెరికా నుంచి గ్రహించాం. ఈ పథకం అమలు కోసం ఫోర్డ్ ఫౌండేషన్ అప్పటి అమెరికా రాయబారి అయిన చెస్టర్ బౌల్స్ ద్వారా 50 మిలియన్ల ఆర్థిక సహాయాన్ని అందించింది. 1971కల్లా దాదాపు 104 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని ఈ ఫౌండేషన్ దేశంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం అందించింది.
-జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం (National Extension Service) (1953): సమాజాభివృద్ధి కార్యక్రమానికి కొనసాగింపుగా 1953, అక్టోబర్ 2న జాతీయ విస్తరణ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు.
-బల్వంత్రాయ్ గోపాల్ మెహతా కమిటీ: సమాజాభివృద్ధి పథకం, జాతీయ విస్తరణ సేవా పథకాల ద్వారా ఆశించిన ఫలితాలు కలగకపోవడంవల్ల గ్రామ స్వపరిపాలనలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించడానికి అవసరమయ్యే సంస్థాగత ఏర్పాటును సూచించాల్సిందిగా ప్రణాళికా సంఘంలోని ప్రణాళికా పథకాల కమిటీ (జాతీయాభివృద్ధి మండలి) 1957, జనవరి 16న బల్వంత్రాయ్ మెహతా అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రజాస్వామ్య వికేంద్రీకరణ-ప్రజల భాగస్వామ్యం అనే అంశాలతో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సిఫారసు చేస్తూ తన నివేదికను 1957, నవంబర్ 24న సమర్పించారు. బల్వంత్రాయ్ మెహతా కమిటీ సిఫారసులను జాతీయాభివృద్ధి మండలి 1958, జనవరిలో ఆమోదించింది. దీంతో వివిధ రాష్ర్టాలు పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటుకు చట్టాలు చేశాయి.
-దేశంలో పంచాయతీరాజ్ సంస్థలను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం రాజస్థాన్ (నాగోర్ జిల్లా సికార్ గ్రామం-1959, అక్టోబర్ 2). రెండో రాష్ట్రం అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ (మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్-1959, అక్టోబర్ 11. 1959 నవంబర్ 1న రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో).
-ఈ కమిటీ దేశంలో మూడంచెల పంచాయతీరాజ్ (జిల్లాస్థాయి, గ్రామస్థాయి, బ్లాక్‌స్థాయి) వ్యవస్థను, ఐదేండ్లకోసారి స్వతంత్ర ప్రాతిపదికన ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని సూచించింది.
-అశోక్ మెహతా కమిటీ: బల్వంత్రాయ్ మెహతా కమిటీ సిఫారసు ప్రకారం ఏర్పాటు చేసిన పంచాయతీరాజ్ సంస్థలు అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోవడంతో వాటి పనితీరును సమీక్షించడానికి, పంచాయతీరాజ్ వ్యవస్థను సమగ్రంగా పరిశీలించడానికి 1977, డిసెంబర్లో అప్పటి ప్రధాని మొరార్జి దేశాయ్ ఆధ్వర్యంలోని జనతా ప్రభుత్వం అశోక్ మెహతా అధ్యక్షతన కమిటీని నియమించింది. ఈ కమిటీ 132 సిఫారసులతో తన నివేదికను 1978, ఆగస్టులో సమర్పించింది.
-మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ స్థానంలో రెండంచెల వ్యవస్థ జిల్లస్థాయిలో జిల్లా పరిషత్, బ్లాక్‌స్థాయిలో మండల పంచాయతీ ఏర్పాటు చేసి, గ్రామపంచాయతీలను రద్దుచేసి గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలి. పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా పోటీచేయాలని, అన్ని పదవులకు నాలుగేండ్ల కాలవ్యవధిని నిర్ణయించాలని ఈ కమిటీ సిఫారసు చేసింది.
-బల్వంత్రాయ్ మెహతా కమిటీ సూచనల ద్వారా ఏర్పాటైన పంచాయతీ వ్యవస్థలను మొదటితరం పంచాయతీలని, అశోక్ మెహతా కమిటీ సిఫారసుల ప్రకారం ఏర్పాటైన పంచాయతీ వ్యవస్థలను రెండోతరం పంచాయతీలని పేర్కొంటారు. అశోక్ మెహతా కమిటీ సిఫారసుల ఆధారంగానే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల్లో మండల వ్యవస్థను ప్రవేశపెట్టారు.
-దంత్వాలా కమిటీ (1978): బ్లాక్ స్థాయిలో ప్రణాళికీకరణపై అధ్యయనం చేయడానికి దంత్వాలా కమిటీని ఏర్పాటు చేశారు. సర్పంచ్‌లను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలని, మధ్యస్థ బ్లాక్ స్థాయి వ్యవస్థకు ప్రాధాన్యమివ్వాలని, జిల్లా ప్రణాళికలో కలెక్టర్ ప్రధానపాత్ర పోషించాలని, బ్లాక్‌ను ఒక యూనిట్‌గా తీసుకొని ప్రణాళికలు రూపొందించాలని ఈ కమిటీ సిఫారసులు చేసింది.
-హనుమంతరావు కమిటీ (1984): ఈ కమిటీ మంత్రి అధ్యక్షతన గాని లేదా కలెక్టర్ అధ్యక్షతన గాని పనిచేసేలా జిల్లా ప్రణాళిక సంఘాలను ఏర్పాటు చేయాలని, బ్లాక్ అభివృద్ధి అధికారి పోస్టును రద్దు చేయాలని సిఫారసు చేసింది.
-జీవీకే రావు కమిటీ (1985): ప్రణాళికా సంఘం 1985లో గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన, పరిపాలనా ఏర్పాట్లు అనే అంశాల్ని పరిశీలించడానికి జీవీకే రావు అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. దేశంలో పరిపాలనా స్ఫూర్తి క్రమంగా బలహీనపడి ఉద్యోగస్వామ్యంగా మారిందని, ఇది పంచాయతీరాజ్ వ్యవస్థను బలహీనపర్చిందని, తద్వారా ప్రజాస్వామ్యం వేళ్లూనుకునే వ్యవస్థగా కాక, వేర్లులేని వ్యవస్థగా మారిందని తీవ్రంగా ఆక్షేపించి పంచాయతీరాజ్ పటిష్టతకు కొన్ని సిఫారసులు చేసింది. అవి.. ప్రణాళికాభివృద్ధికి జిల్లాను యూనిట్‌గా తీసుకోవాలి. బ్లాక్ వ్యవస్థను రద్దు చేయాలి. జిల్లా పరిషత్‌లను పటిష్టపర్చాలి. నైష్పత్తిక ప్రాతినిధ్యంతో కూడిన ఉపకమిటీలను జిల్లాస్థాయిలో ఏర్పాటు చేయాలి. జిల్లాస్థాయి యూనిట్లకు ప్రణాళికా విధులను బదలాయించాలి. జిల్లా పరిషత్‌కు చైర్మన్‌గా కలెక్టర్ వ్యవహరించాలి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?