The administrative system of the Ishwaks | ఇక్ష్వాకుల పరిపాలనా వ్యవస్థ
-ఇక్ష్వాకులు కొంచె అటు ఇటుగా శాతవాహనుల పరిపాలనా విధానాన్నే అనుసరించారు. వీరి పరిపాలనా విధానాన్ని గురించి తెలుసుకోవడానికి మనకు శాసనాలే ప్రధాన ఆధారం.
రాజు: ఇక్ష్వాక రాజు పరిపాలనలో సర్వాధికారి. నిరంకుశుడు. అన్ని అధికారాలు ఇతని చేతుల్లోనే ఉండేవి. ఇతడు ధర్మశాస్ర్తాలు, స్మృతులు వివరించిన విధంగా పరిపాలించేవాడు. రాజులు బ్రాహ్మణుల పట్ల అనుసరించాల్సిన విధులను పేర్కొనడం జరిగింది. దీన్నిబట్టి మనకు రాజు అనేవాడు ధర్మాన్ని రక్షించేవాడే కానీ, రూపొందించేవాడు కాదని తెలుస్తుంది. ఇక్ష్వాక రాజులు తమ విజయసూచకంగా, అశ్వమేథ, వాజపేయ, అగ్నిష్టోమ వంటి యాగాలను నిర్వహించారు. అయితే శాతవాహనుల కాలంలో నామమాత్రంగా ఉన్న దైవదత్త రాజ్యాధికారం ఇక్ష్వాకుల కాలం నాటికి స్పష్టంగా ఏర్పడింది.
ఇతర అధికారాలు: అమాత్యులు, మహాతలవర, మహాసేనాపతి, మహాదండనాయక, కోష్టాగారిక మొదలైన అధికారులు పరిపాలనలో రాజుకు సహకరించే వారని శాసనాలు పేర్కొన్నాయి. వీరి విధులు..
మహాతలవరులు: వీరు సామంత స్థాయి కలిగిన అధికారులు, నియమించిన ప్రాంతాల్లో శాంతిభద్రతలను కాపాడటం వీరి విధి.
మహాసేనాపతి: ఇతడు కేంద్రప్రభుత్వంలో ఉండే అధికారి. సైనిక వ్యవహారాలను చూసేవాడు.
మహాదండనాయకుడు: నేర విచారణ చేసి శిక్షలు విధించేవాడు. న్యాయపరమైన విధులను నిర్వహించేవాడు.
కోష్టాగారిక: కోశాధికారి
అయితే ఇక్ష్వాక రాజ్యాధికారుల ప్రత్యేకత ఏమంటే ఒకే వ్యక్తి రెండు లేదా అంతకంటే ఎక్కువ పదవులను కూడా నిర్వహించేవాడు. ఉదాహరణకు పూగియ వంశానికి చెందిన వాసిష్టిపుత్ర స్కందశ్రీ, హిరణ్య వంశానికి చెందిన వాసిష్టిపుత్ర స్కందచలి మహాసేనాపతి, మహాతలవర, మహాదండనాయక వంటి బిరుదులను ధరించారు.
స్థానిక పాలన: శాతవాహనులు పరిపాలనా సౌలభ్యం కోసం తమ సామ్రాజ్యాన్ని ఆహారాలుగా ఏ విధంగా విభజించారో ఇక్ష్వాకులు కూడా తమ రాజ్యాన్ని రాష్ర్టాలు (రఠలు)గా విభజించారు. ఇక్కడ కొన్ని గ్రామాల సముదాయమే రాష్ట్రం. పూగి రాష్ట్రం, హిరణ్య రాష్ట్రం, ముండ రాష్ట్రం మొదలైన పేర్లు శాసనాల్లో కనిపిస్తున్నాయి. వీరి కాలంలో రాష్ట్రపాలకుడిని రఠికుడుగా వ్యవహరించారు.
గ్రామీణ పరిపాలన: శాసనాల్లో మనకు గ్రామపంచక అనే పదం కనిపిస్తుంది. అంటే ఐదు గ్రామాల సమూహం. వీరి కాలంలో గ్రామ పరిపాలనాధికారం వంశపారంపర్యంగా జరిగేది. వీరి శాసనాలు గ్రామాధికారిని తలవర అని పేర్కొంటున్నాయి. రాజులు గ్రామాలను, భూములను దానం చేసేటప్పుడు ఆ గ్రామాధికారిని, గ్రామ ముఖ్యులను సమావేశపర్చి తెలియపర్చేవారని తెలుస్తుంది.
సైనిక వ్యవస్థ: ఇక్ష్వాకులు శాతవాహనుల సైనిక విధానాన్నే పాటించారు. సైన్యంలో రథ, గజ, తురగ, కాల్బలాలనే చతురంగ బలాలుండేవి. దండయాత్రల సందర్భంలో సైన్యానికి అవసరమైన నిత్యావసరాలను అంటే పాలు, పెరుగు, కూరగాయలను ఆయా గ్రామప్రజలు సమకూర్చాలి. మహాసేనాపతి ఉన్నప్పటికీ సర్వసాధారణంగా రాజే యుద్ధ సమయాల్లో స్వయంగా సైన్యాన్ని నడిపిస్తూ నాయకత్వం చేపట్టేవాడు. అయితే యుద్ధ సమయాల్లో సమీప గ్రామాల పంటలకు, ప్రజలకు విపరీతంగా నష్టం జరిగి భయానక వాతావరణం నెలకొనేది.
ఆర్థిక పరిస్థితులు: రాజ్యానికి భూమిశిస్తే ప్రధాన ఆదాయ వనరు. దీన్ని భాగ అనేవారు. సాధారణంగా పంటలో 1/6వ వంతును భూమిశిస్తుగా వసూలుచేసేవారు. భాగ అనే మరొక రకమైన భూమిశిస్తును స్థానిక పాలకులు వసూలు చేసుకొని అనుభవించేవారు. శిస్తును ధన రూపంలో కాని, ధాన్యరూపంలో కానీ చెల్లించే అవకాశం ప్రజలకుండేది. ధన రూపంలో వసూలు చేసే శిస్తును హిరణ్యం లేదా దేయం అని, ధాన్యరూపంలో శిస్తును మేయం అనేవారు.
పరిశ్రమలు, వృత్తులు, వ్యాపారంపైన వసూలుచేసే పన్నును కర అనేవారు. ఇవేకాకుండా ఉప్పు, పంచదార, రహదారులపై, నీటి తీరువాపై కూడా సుంకాలను వసూలు చేసేవారు. వ్యవసాయదారులు తమ పశువులు ఈనిన మొదటి దూడను ప్రభుత్వానికి సుంకంగా సమర్పించేవారు.
ఇక్ష్వాకులు రాజ్యాదాయాన్ని నాలుగు భాగాలుగా ఖర్చుచేసేవారని తెలుస్తుంది. అందులో ఒక భాగం ప్రభుత్వ నిర్వహణకు, సైన్య పోషణకు, పెద్ద ప్రభుత్వోద్యోగుల జీతభత్యాలకిచ్చేందుకు, రెండో భాగం దేవాలయ నిర్మాణానికి, దైవారాధనకు అందులో ఉత్సవ నిర్వహణకు, 3వ భాగం కవులు, పండితులు, మహామేధావుల పోషణకు, 4వ భాగం వివిధ మతాలకు బహుమతులుగా ఇచ్చేందుకు ఖర్చు చేసేవారని తెలుస్తుంది. అంతేగాక వ్యవసాయాభివృద్ధికి అవసరమైన చెరువులు, కాలువల నిర్మాణం కోసం కొంత ఆదాయాన్ని ఖర్చుపెట్టేవారు.
వ్యవసాయం: నాడు వ్యవసాయం ప్రజల ప్రధానమైన జీవనాధారం. వరి, గోధుమ, చెరకు, జొన్న, సజ్జ, రాగులు, కందులు, నువ్వులు, ఆముదాలు, జనుము, పత్తి ఆనాటి ముఖ్యమైన పంటలు. అయితే రవాణా సౌకర్యాలు, నౌకాయానం అంతగా అభివృద్ధికాని నాడు పంటల ఉత్పత్తులకు స్థానిక మార్కెట్లే వ్యాపార కేంద్రాలుగా ఉన్నాయి.
చేతివృత్తులు: నాగార్జునకొండ వద్ద జరిపిన తవ్వకాల్లో ఇక్ష్వాకుల కాలం నాటి వృత్తిపనివారి ఇండ్లు బయటపడ్డాయి. ఒక ఇంట్లో స్వర్ణకారుల వృత్తి సామగ్రి దొరికింది. అనేక రకాలైన బంగారు, వెండి కళాత్మక వస్తువులు దొరికాయి. ఇక్ష్వాకుల శాసనాల్లో పర్లిక శ్రేణి (తమలపాకుల శ్రేణి), పూసిక శ్రేణి (మిఠాయి తయారీదార్లు), మరొక శాసనంలో కులిక ప్రముఖ (శ్రేణి నాయకుడు) అనే పదాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కొంతమంది వృత్తిపనివారు ఒక దేవాలయాన్ని, మంటపాన్ని కట్టించి, దాని నిర్వహణ కోసం అక్షయ నిధిని ఏర్పాటు చేసినట్లు తెలిపే ఒక శాసనం దొరికింది. గ్రామాల్లో చేతి పరిశ్రమలు కొనసాగుతున్నట్లు మనకు విళపట్టి శాసనం వల్ల తెలుస్తుంది.
వర్తక వ్యాపారాలు: శాతవాహనులకాలంలో మాదిరి వీరి కాలంలో కూడా రోమ్ దేశంతో వాణిజ్యం కొనసాగింది. నాగార్జునకొండలో రోమన్ నాణేలు లభయ్యమవడమేగాక వీరి రాజధాని విజయపురిలో రోమన్ వర్తక కేంద్రముండేదని తెలుస్తుంది. దేశీయ, విదేశీయ వాణిజ్యం వైశ్యుల ఆధీనంలో ఉండేది.
-అయితే క్రీ.శ. 3వ శతాబ్దం నాటికే రోమ్ దేశంతో వాణిజ్యం క్రమంగా క్షీణించడం ప్రారంభమైంది. దేశంలో బలమైన కేంద్రీకృతాధికారం లేనందువల్ల చిన్న చిన్న రాజ్యాలేర్పడి తరచుగా యుద్ధాలు చేయడం వల్ల దేశీయ వాణిజ్యానికి, కుటీర పరిశ్రమలకు నష్టం వాటిల్లి నగరాలు, గ్రామాల పతనం ప్రారంభమైంది. దీనికి నిదర్శనం అత్యధిక సంఖ్యలో దొరికిన శాతవాహనుల నాణేలతో పోలిస్తే శాతవాహనానంతర రాజవంశాల నాణేలు అత్యల్పం. అంతేగాకుండా మొదటి నుంచి రోమ్తో వాణిజ్యం భారతదేశానికి అనుకూలంగా ఉండేది. అందువల్ల రోమన్ సామ్రాజ్యం భారతదేశ వ్యాపారం మీద నిషేధాన్ని విధించడంతో చేతివృత్తులు, పట్టణాలు పతనమయ్యాయి.
సామాజిక పరిస్థితులు
-సమాజంలో బ్రాహ్మణుల స్థాయి మెరుగుపడింది. ఇక్ష్వాక రాజులు వైదిక క్రతువులను నిర్వహించడం, బ్రాహ్మణులను ఉన్నత పదవుల్లో నియమించడం, దేవాలయాలను నిర్మించడంవల్ల బ్రాహ్మణుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. అంతేగాకుండా రాజులు బ్రాహ్మణులకు భూదానాల పేరిట కొన్ని గ్రామాలను ఇచ్చేవారు. వీటిని బ్రహ్మదేయ గ్రామాలుగా పిలిచేవారు. ఇటువంటి గ్రామాలకు 18 రకాల పన్నుల నుంచి మినహాయింపు ఉండేది. అంతేగాక ఈ గ్రామాల్లోకి రాజోద్యోగులు ప్రవేశించరాదు. ఈ భూములను శూద్రులే సాగుచేసేవారు.
-అయితే ఒక బ్రాహ్మణులకేకాక పరిపాలనా యంత్రాంగంలోని ఉన్నతాధికారులకు జీతాలు చెల్లించకుండా, అంతకు సమానమైన ఆదాయాన్నిచ్చే భూములనిచ్చేవారు. ఈవిధంగా రాజులు మత సంస్థలకు, ఉద్యోగులకు, బ్రాహ్మణులకు భూదానాలు చేశారు. వీరు క్రమంగా సమాజంలో బలమైన వ్యక్తులుగా అవతరించి భూస్వాములనే వర్గంగా ఏర్పడింది. సమాజంలో అధిక సంఖ్యాకులు శూద్రులు. వీరిలో వివిధ వృత్తులవారు ఉన్నారు. హాలికులు (వ్యవసాయదారులు), కమ్మరులు, కుమ్మరులు, వడ్రంగులు, సాలెవారు, రజకులు, క్షురకులు, చర్మకారులు మొదలైనవారు. కొన్ని శాసనాల్లో రథకరులకు చేసిన దానాలను పేర్కొన్నారు. వీరు తర్వాతి కాలంలో విశ్వబ్రాహ్మణులమని, విశ్వకర్మ సంతతివారిగా పరిగణించారు.
-ఇక్ష్వాకుల కాలంలో ఉన్నత కుటుంబాలకు చెందిన స్త్రీలు స్వతంత్రంగా దానాలు చేయడాన్ని అమరావతి, నాగార్జునకొండ శాసనాలు పేర్కొంటున్నాయి. నాగార్జునకొండ వద్దగల మహాచైత్యానికి రాజకుటుంబానికి చెందిన స్త్రీలు విరివిగా దానధర్మాలు చేశారు. అయితే రాజులు వైదిక మతాన్ని అనుసరించినప్పటికీ స్త్రీలు మాత్రం బౌద్ధమతాన్ని ఆదరించి అనేక చైత్యాలను నిర్మించి, దానధర్మాలు చేశారు. శాతవాహనుల లాగా ఇక్ష్వాక రాజులు సైతం తమ పేరుకుముందు తల్లి పేరును జోడించుకున్నారు.
సాంస్కృతిక పరిస్థితులు: వీరి పాలనలో మత, సాహిత్య, వాస్తు, కళారంగాలు గణనీయ ప్రగతిని సాధించాయి. వైదిక, బౌద్ధ, జైన మతాలు వర్థిల్లాయి. ప్రాకృతం రాజభాష అయినప్పటికీ సంస్కృతం ఆదరణ, అభివృద్ధి సాధించింది. బౌద్ధ నిర్మాణాలు, హైందవ దేవాలయాలు నాటి వాస్తుశిల్ప కళారీతులను ప్రతిబింబిస్తున్నాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు