Siddulagutta | కొడవటూరు – సిద్దులగుట్ట
-తెలంగాణలో దాదాపుగా మూడువందల ఏండ్లు ఏకచ్ఛాత్రాధిపత్యంగా రాజ్యమేలిన కాకతీయ రాజుల ఇలాఖాలో చెప్పుకోదగ్గ ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అందులో బచ్చన్నపేట పరిధిలోని సిద్దులగుట్ట చెప్పుకోదగింది. ఒకప్పుడు మెదక్ జిల్లాలో ఉంది. ఇప్పుడు వరంగల్లు జిల్లాలో ఉంది. చరిత్రపరంగా ఎనిమిది, తొమ్మిది శతాబ్దాల్లో సిద్దులు, జైన తీర్థంకరులు ఇక్కడ తపస్సు చేశారు. మత్స్యేంద్రనాథ్, గోరక్నాథ్, కనిక్నాథ్లు తపస్సు చేసి శివలింగం ప్రతిష్ఠించారని తెలుస్తుంది. అయితే ప్రాచీన చరిత్ర ప్రకారం ఇక్కడ సిద్దేశ్వరలింగం స్వయంభువు అని చెపుతుంటారు.
-ఈ కొండపై ఎన్నో దేవాలయాలు ఉన్నప్పటికీ ప్రాచీన సిద్దేశ్వరుడు కొలువై ఉన్నాడు కాబట్టి ఈ దేవాలయం సిద్దులగుట్టగా ప్రసిద్ధిచెందింది. జైనుల్లో తీర్థంకరులు కూడా ఈ సిద్దులగుట్టపై తపస్సు చేశారని చెపుతుంటారు. ప్రాచీన రెండు శిలాశాసనాలను తరుష్కులు ధ్వంసం చేసినట్టుగా చెపుతున్నారు. ఇక్కడ నంది మంటప శిలాతోరణం, సొరంగమార్గం స్పష్టంగా కనిపిస్తాయి.
-ఇక్కడ ఉన్న ఒక్కో శిల్పాన్ని గమనిస్తే ప్రాచీన నల్లగ్రానైట్ శిల్పాలతో ఇక్కడి విగ్రహాలను 11, 13వ శతాబ్దంలోనే చెక్కించి ప్రతిష్ఠించారు. అయితే సిద్దేశ్వరుడు స్వయంభువు అని చారిత్రక పరిశోధకులు చెపుతుంటారు.
-కొడవటూరు గ్రామం మధ్యన ప్రాచీన భద్రకాళి (పెద్దమ్మ) విగ్రహం ఉంది. గ్రామంలో 13వ శతాబ్దంనాటి వినాయక మందిరం, శిథిలావస్థలో ఉన్న ప్రాచీన త్రికూటాలయం (త్రిలింగేశ్వరాలయం) కూడా ఉంది. అక్కడి నుంచి కొంతదూరంలో ఉన్న కొండపై పాండవులు తిరిగారని అక్కడి ప్రజలు చెపుతున్నారు. వారి ఆనవాళ్లు కొన్ని కనిపిస్తున్నాయి.
-ఈ సిద్దులగుట్ట పైభాగాన ఇటీవల దత్తాత్రేయ మందిరం నెలకొల్పారు. బచ్చన్నపేట, సిద్దులగుట్ట, పెద్దపహాడ్, ఓబుల్కేశ్వాపూర్ కలుపుకొని దాదాపుగా పూర్వకాలంలో, 5, 6 ప్రాచీన శిలాశాసనాలు ఉండేవని ప్రాచీన చరిత్ర. అయితే నేటికీ మనకు సిద్దులగుట్టలో, ఓబుల్కేశ్వాపూర్లో మాత్రమే రెండు శిలాశాసనాల ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.
ఓబుల్కేశ్వాపూర్ (కేశవాపురం)
-ప్రాచీన మట్టిదిబ్బలు-కోట 12వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం వరకు ఎంతో వెలుగుకు నోచుకున్న ఓబుల్కేశ్వాపూర్ చరిత్రపుటల్లో చెప్పుకోతగ్గది. కొడవటూరు సిద్దులగుట్ట సమీపంలోని పెద్దపహాడ్ వద్ద శాక్తికేయు (అమ్మవారి ఉపాసకులు)లు, సిద్దులు, శ్రీవైష్ణవ సంప్రదాయేతరులు తిరిగిన పుణ్యభూమి ఇది.
-కేశవనాథుడు (సిద్దుడు) అనే రాజయోగి ఈ ప్రాంతంలో తిరిగాడని, ఆయనకు ఓబన్న అనే ప్రియ శిష్యుడు ఉన్నాడని, వీరి పేరుమీదనే ఓబుల్ కేశ్వాపూర్ వచ్చిందని మరో చరిత్ర కథనం కూడా ఉంది.
-ఈ గ్రామం 990 సంవత్సరం నుంచే ఉందని, ఇక్కడి నుంచే సిద్దులు గుట్టకు వెళ్లి తపస్సు చేశారని చరిత్రకారులు చెపుతున్నారు. ఈ గ్రామంలో ప్రాచీన ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. ఐదడుగుల ఎత్తయిన రాకాసిబండ, ఆరు అడుగుల అరుదైన శిలాశాసనం చెరువుకట్టపై ఉంది.
-శాసనం పైభాగాన తూర్పున విష్ణుమూర్తి, ఉత్తరంలో శివలింగం, పడమర, దక్షిణ దిశలో జైన తీర్థంకుని విగ్రహం ఉన్నాయి. 15, 16వ శతాబ్దంలో గ్రామ పొలిమేరలో కాకుండా ముందు మార్గంలో ఉన్న ప్రాచీన రెడ్డి రాజుల కోట నేడు శిథిలమై ఉన్నది.
-మహా సిద్దులు సంచరించిన ప్రాంతమే ఈ ఓబుల్కేశ్వాపూర్. ఇక్కడ 12వ శతాబ్దం నాటి కళ్యాణి చాళుక్యుల త్రిమత (త్రిమాత) శాసనం కూడా ఉంది. 1. జైన, 2. శైవ, 3. వైష్ణవ మతాలకు సంబంధించినవి ఈ శాసనంలో ఉన్నాయి. శాసన పాఠం కొంచెం అస్పష్టంగా కనిపిస్తుంది.
-స్వస్తి శ్రీ (విజయా) అభ్యుదయ నామసంవత్సరే శక వర్షంబులు అగునేటి అనే పూర్తి శిలా శాసనం ఉన్నది. గ్రామానికి కొంత భాగంలో రామలక్ష్మణ పాదుకలు, చిన్న దేవాలయం కూడా ఉన్నది. దాని పక్కనే ఒక ప్రాచీన మట్టి దిబ్బ కనిపిస్తుంది. పూర్వకాలంలో అక్కడే కేశ్వాపురం అనే గ్రామం ఉండేదని కొందరు పెద్దలు చెపుతున్నారు. ప్రాచీన శిథిలకోట వద్ద రెండు శిఖరాగ్ర ధ్వజస్తంభాలు ఉన్నాయి. ఇవి జైన శైవానికి, వైష్ణవానికి ప్రతీకలు. ఈ రెండు ప్రాచీన మట్టి దిబ్బల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తవ్వకాలు జరిపిస్తే మరింత చరిత్ర లభ్యమవుతుందని చరిత్రకారుల అభిప్రాయం.
-గ్రామ ప్రజలు ఈ గ్రామాన్ని అభివృద్ధిపరుస్తూ వెలుగులోకి తెస్తున్నారు.
-ప్రాచీన, వినూత్న దేవాలయ సముదాయం కలిగిన ఈ ఓబుల్కేశ్వాపురం వరంగల్లు జిల్లా (నేడు జనగామ జిల్లా) చరిత్రలో చెప్పుకోదగినది. చూడదగినది. ఈ గ్రామంలో..
1. శాసనం
2. దిబ్బలు – 2 (రామలక్ష్మణ పాదుకల దేవాలయం వద్ద ఒక దిబ్బ ఉన్నది)
3. ప్రాచీన కోట – ప్రస్తుతం శిథిలమై ఉన్నది. ఇక్కడ మరో దిబ్బ ఉన్నది.
4. పాత హనుమాన్ దేవాలయం ప్రసిద్ధి చెందినది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు