Srikrishna Committee | శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయం
శ్రీకృష్ణ కమిటీ ప్రధాన నివేదికలో తెలంగాణ ఏర్పాటుచేయమని ఇచ్చిన 5వ సిఫారసును కేంద్రప్రభుత్వం అమలుచేయకుండా నిర్వీర్యం చేసే మార్గాన్ని రహస్య 8వ అధ్యాయం చూపింది. అందుకు మూడు మార్గాలను కమిటీ సూచించింది. అవి..
1. రాష్ట్రంలో పాలక పార్టీ నాయకుల మధ్య ఐక్యత సాధించాలి. రాష్ట్రంలో బలమైన, దృఢమైన రాజకీయ నాయకత్వాన్ని అందించాలి. తెలంగాణ ప్రతినిధులను కీలక స్థానాల్లో (సీఎం, డిప్యూటీ సీఎం) నియమించాలి. వీలైనంతవరకు తెలంగాణ రాష్ట్ర సాధనయే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్న టీఆర్ఎస్ను బలహీనపర్చాలి. కాంగ్రెస్ నాయకులు ఉద్యమానికి ప్రత్యక్షంగాకానీ, పరోక్షంగా కానీ మద్దతు ఇవ్వకుండా జాగ్రత్త వహించాలి. పాలక పక్షం, ప్రధాన ప్రతిపక్షం ఒక్కతాటి పైకి వస్తే ఉద్యమకారులకు విజయం సాధ్యమవుతుంది. కాబట్టి పాలక, ప్రతిపక్షాలు తెలంగాణ విషయంలో ఏకం కాకుండా చూడాలి. అంతేకాక కమిటీ నివేదిక ప్రభుత్వానికి అందగానే విస్తృతమైన సంప్రదింపులకు సిద్ధంగా ఉన్నట్లు ప్రజలకు బలమైన సంకేతాన్ని పంపించాలి. ఈ ప్రక్రియ అత్యంత త్వరితగతిన మొదలవుతుందని ప్రజలకు చెప్పాలి.
2. మీడియాలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన వార్తలు పతాక శీర్షికల్లో రాకుండా చూడాలి. సంపాదకీయ అభిప్రాయాలు, ప్రాంతీయ అనుబంధాలు, జిల్లా సూచికలు అన్నింటిని వాస్తవికంగా ఉండేట్టుగా ప్రత్యేక తెలంగాణ ఆందోళనకు సంబంధించిన వార్తలు అరుదుగా వచ్చేట్లు చూడాలి. అందుకోసం ప్రభుత్వం మీడియాకి ఇచ్చే ప్రకటనలను ఉపయోగించుకోవాలి. అంతిమంగా మీడియాలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన వార్తలు ప్రచారం కాకుండా ప్రభుత్వం చూడాలి.
3. ఉద్యమాలు, ఆందోళనలను ఎలా అణచివేయాలో కూడా కమిటీ సూచించింది. తాము ఇచ్చిన ఏ సూచనను ప్రభుత్వం పాటించినా ఆందోళనలు తప్పదని స్పష్టం చేసింది. కాబట్టి పోలీసులు ఎలా మోహరించాలో, ఏ తుపాకులు, మందుగుండు వాడాలో కూడా కమిటీ ప్రభుత్వానికి సూచించింది. ఉద్యమాలు చేసే వారి కదలికలపై ప్రభుత్వం నిఘా పెంచాలి. ప్రాణహాని చేయని ఆయుధాలను వాడాలి. అదే సమయంలో ఆందోళనకారులను తక్షణమే అదుపు చేయగల శక్తిమంతమైన ఆయుధాలు వాడాలని కూడా కమిటీ ప్రభుత్వానికి సూచించింది.
-ఇలా శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ ఉద్యమాన్ని ఎలా అదుపు చేయాలో తన నివేదికలోని 8వ అధ్యాయంలో వివరించింది. కానీ ఉద్యమ క్రమంలో వందలాది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని కనీసం ప్రస్తావించలేదు. పైగా సీమాంధ్ర నాయకులు, పెట్టుబడిదారులు నిత్యం అబద్ధాలు, అర్ధసత్యాలతో కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కాబట్టి తెలంగాణ ప్రజల ఐక్యత, సంఘటిత పోరాటం ద్వారా మాత్రమే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించగలమని జేఏసీ నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే జేఏసీ తన కార్యాచరణను రూపొందించి సహాయ నిరాకరణ, మిలియన్ మార్చ్, వంటా-వార్పు, సకల జనుల సమ్మె, సాగరహారం లాంటి కార్యక్రమాలను నిర్వహించి ఉద్యమాన్ని మహోద్యమంగా మార్చింది.
సహాయ నిరాకరణ
-మలిదశ తెలంగాణ ఉద్యమంలో జేఏసీ ఏర్పడిన తర్వాత నిర్వహించిన తొలి ఆందోళన కార్యక్రమం సహాయ నిరాకరణ. స్వాతంత్రోద్యమ కాలంలో గాంధీ నిర్వహించిన సహాయ నిరాకరణ ఉద్యమ స్ఫూర్తితో శాంతియుత ఉద్యమాలతో మాత్రమే తెలంగాణను సాధించుకోవచ్చని భావించిన జేఏసీ వెంటనే తెలంగాణ బిల్లును పార్లమెంట్లో పెట్టాలనే డిమాండ్‌తో సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే 2011 ఫిబ్రవరి 12న జేఏసీ సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా షెడ్యూల్‌ను ప్రకటించింది.
-2011 ఫిబ్రవరి 13- గ్రామగ్రామాన చాటింపులు, దీక్షాకంకణం
-ఫిబ్రవరి 14- నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు
-ఫిబ్రవరి 15- జైల్ భరో కార్యక్రమం
-ఫిబ్రవరి 16- తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్, టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేల ఇండ్ల ముందు ధర్నా
-ఫిబ్రవరి 17- సహాయ నిరాకరణ కార్యక్రమం మొదలు దీనిలోభాగంగా ఉద్యోగుల సంఘీభావ ర్యాలీలు
-ఫిబ్రవరి 18- కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు పికెటింగ్
-ఫిబ్రవరి 19- రాస్తారోకోలు, 9వ జాతీయ రహదారి దిగ్బంధం, పట్టణాల్లో వాక్ ఫర్ తెలంగాణ, గ్రామాల్లో ప్రభాత భేరి
-ఫిబ్రవరి 22- సార్వత్రిక సమ్మె బంద్ ప్రారంభం
-సహాయ నిరాకరణ ఉద్యమం: 2011 ఫిబ్రవరి 17న శాంతియుతంగా తెలంగాణ ఉద్యోగులు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. కిందిస్థాయి ఉద్యోగి నుంచి పైస్థాయి ఉద్యోగి వరకు సుమారు మూడు లక్షల మంది ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. జేఏసీ ఈ ఉద్యమాన్ని వివిధ పోరాట పద్ధతుల్లో కొనసాగించింది. అవి..
1. ఉద్యోగులు తమ విధులను బహిష్కరించడం
2. ప్రభుత్వానికి ప్రజలు శిస్తులు చెల్లించకపోవడం
3. రవాణా వ్యవస్థల్లో టికెట్ లేకుండా ప్రయాణించడం
4. ర్యాలీలను నిర్వహించడం
5. జాతీయ రహదారులను దిగ్బంధించడం
-ఫిబ్రవరి 17న ప్రారంభమైన ఉద్యోగుల సహాయ నిరాకరణ ఉద్యమంలో విద్యార్థులు, న్యాయవాదులు, మహిళలతో పాటు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తమ వంతు పాత్రను పోషించాయి.
-ఇదే రోజున ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగాన్ని తెలంగాణ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు.
-2011 ఫిబ్రవరి 21న సహాయ నిరాకరణ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు చలో అసెంబ్లీ, న్యాయవాదులు చలో రాజ్‌భవన్‌కు పిలుపునిచ్చారు.
-ఫిబ్రవరి 22 నుంచి 48 గంటల బంద్‌కు జేఏసీ పిలుపునిచ్చింది. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో తెలంగాణ పది జిల్లాలు ఈ బంద్‌లో పాల్గొన్నాయి.
-ఫిబ్రవరి 23న తెలంగాణ రాష్ట్ర డిమాండ్ నినాదాలతో పార్లమెంట్ దద్దరిల్లింది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, తెలంగాణ తెలుగుదేశం సభ్యులు ముక్తకంఠంతో చేసిన జై తెలంగాణ నినాదాలతో లోక్‌సభ మార్మోగింది. సభ సజావుగా సాగలేని స్థితిలో మూడుసార్లు వాయిదా పడింది.
-2011 మార్చి 1 ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో జేఏసీ ఇచ్చిన పల్లె పల్లె పట్టాలపైకి ఆందోళనలతో తెలంగాణ అట్టుడుకింది.
మిలియన్ మార్చ్
ఈజిప్ట్‌లోని తెహ్రీక్ చౌక్‌ను ఉద్యమకారులు దిగ్బంధం చేయడం ద్వారా తమ డిమాండ్లను సాధించుకున్నారు. ఈ ఉద్యమ స్ఫూర్తితో 2011 మార్చి 10న మిలియన్ మార్చ్ ఉద్యమాన్ని హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో మిలియన్‌మార్చ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఉద్యోగుల సహాయ నిరాకరణ ఉద్యమం కొనసాగుతున్న సందర్భంలోనే పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు పది లక్షల మందితో 2011 మార్చి 10న హైదరాబాద్‌లో మిలియన్ మార్చ్ నిర్వహించి హైదరాబాద్‌ను ముట్టడిస్తామని కేసీఆర్ ఫిబ్రవరి 26న ప్రకటించారు. అయితే జేఏసీలో ప్రధాన రాజకీయ పార్టీ అయిన టీఆర్ఎస్ మిలియన్ మార్చ్ కార్యక్రమాన్ని ప్రకటించినప్పటికీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను సమర్థించే అన్ని సంఘాలు పార్టీలు మిలియన్ మార్చ్‌కు మద్దతు ప్రకటించాయి. కానీ అదే రోజు ఇంటర్ పరీక్షలు జరుగుతున్నందున విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు జేఏసీ మిలియన్ మార్చ్‌ను మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటలకు వరకు కొనసాగుతుందని ప్రకటించింది. ఈ మిలియన్ మార్చ్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది. తెలంగాణ నలుమూలల నుంచి ప్రజలు హైదరాబాద్‌కు రాకుండా ఎక్కడివారిని అక్కడ నిర్బంధించి ముందస్తు బైండోవర్లు, అరెస్టులు చేశారు. అయితే ట్యాంక్‌బండ్ చుట్టూ ఆంక్షలు విధించినప్పటికీ మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉద్యమకారులు ట్యాంక్‌బండ్ చేరుకున్నారు. వేలాదిమంది ఉద్యమకారులు చేరుకోవడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. ఈ సందర్భంలోనే కార్యక్రమానికి వచ్చిన మధుయాష్కిగౌడ్, కేశవరావులు పదవులకు రాజీనామా చేయలేదనే ఆగ్రహంతో ఉద్యమకారులు నిలదీశారు. దీనికితోడు సర్కార్ అరెస్ట్ చేసిన తమ నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఉద్యమకారులకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దీంతో ఉద్యమకారులు ఆంధ్ర వలస వాద సాంస్కృతిక ఆధిపత్యానికి ప్రతీకగా భావిస్తున్న ట్యాంక్‌బండ్‌పై ఉన్న విగ్రహాలను ధ్వంసం చేశారు. దీనిలో 16 విగ్రహాలు ధ్వంసమయ్యాయి. మిలియన్ మార్చ్ నేపథ్యంలో జరిగిన సంఘటనలకు ప్రభుత్వం తీవ్రంగా స్పందించి కేసీఆర్, హరీష్‌రావు, కేటీఆర్ కోదండరాం ఇతర అనేకమందిపై హత్యాయత్నంతో పాటు తీవ్రమైన సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారు. అయితే మిలియన్ మార్చ్ సంఘటన తెలంగాణ ఉద్యమ తీవ్రతను, ప్రజల ఆకాంక్షను వ్యక్తం చేయడంలో విజయవంతమైంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు