Lokpal – Lokayuktas | లోక్‌పాల్ – లోకాయుక్తలు
ప్రతి ప్రజాస్వామిక దేశంలో ప్రజల ఇబ్బందులను తగ్గించడానికి సంస్థాగతమైన ఏర్పాట్లు చేసుకున్నారు.
అవి: అంబుడ్స్‌మన్ వ్యవస్థ, పాలనా న్యాయస్థానాల వ్యవస్థ , ప్రొక్యూరేటర్ సిస్టమ్.
-పౌరుల ఇబ్బందులను తగ్గించడానికి ప్రపంచంలో పూర్వపు ప్రజాస్వామ్య దేశాలు ఏర్పాటు చేసిన వ్యవస్థ స్కాండినేవియా అంబుడ్స్‌మన్. అంబుడ్స్‌మన్ వ్యవస్థపై అంతర్జాతీయ నిపుణుడైన డొనాల్డ్ రోవత్ అనుచిత పాలనా విధానాలపై సాధారణ పౌరుడు చేసే ఫిర్యాదులను పరిష్కరించడానికి అంబుడ్స్‌మన్ అద్వితీయమైన, సుముచితమైన వ్యవస్థ అని అభివర్ణించాడు.
-అంబుడ్స్‌మన్ వ్యవస్థను మొదటిసారిగా 1809లో స్వీడన్లో నెలకొల్పారు. అంబుడ్ అనే స్వీడిష్ పదానికి ప్రతినిధిగా వ్యవహరించే వ్యక్తి లేదా మరో వ్యక్తి తరఫున మాట్లాడే వ్యక్తి అని అర్థం.
-డొనాల్డ్ రోవత్ ప్రకారం అంబుడ్స్‌మన్ అంటే పాలనా, న్యాయపరమైన చర్యలకు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడానికి చట్టసభ నియమించిన అధికారి.
-స్వీడిష్ అంబుడ్స్‌మన్‌ను పార్లమెంటు నాలుగేండ్ల కాలపరిమితితో నియమించింది. పార్లమెంటు విశ్వాసం కోల్పోయాడన్న కారణంతో మాత్రమే పదవి నుంచి తొలగించవచ్చు. అతడు తన వార్షిక నివేదికను పార్లమెంటుకు సమర్పిస్తాడు. అందుకే దీన్ని పార్లమెంటరీ అంబుడ్స్‌మన్ వ్యవస్థ అని కూడా అంటారు. ఇది సర్వ స్వతంత్ర వ్యవస్థ.
-అంబుడ్స్‌మన్ ఒక రాజ్యాంగపరమైన అధికార సంస్థ. ప్రభుత్వ, న్యాయ, సైనికాధికారులంతా ఈ వ్యవస్థ పరిధిలోకి రావడం వల్ల వారంతా చట్టానికి లోబడి నిష్పక్షపాతంగా, ఎవరివైపు మొగ్గు చూపకుండా న్యాయంగా వ్యవహరిస్తారు. అయితే ఒక నిర్ణయాన్ని వ్యతిరేకించడానికి లేదా రద్దు చేయడానికి ఇతనికి ఏ అధికారం లేదు.
-అంబుడ్స్‌మన్ వ్యవస్థ స్వీడన్ నుంచి ఇతర స్కాండినేవియా దేశాలైన ఫిన్లాండ్ (1919), డెన్మార్క్ (1955), నార్వే (1962)లకు వ్యాపించింది. ఈ వ్యవస్థను మొదట ఏర్పాటు చేసుకున్న కామన్వెల్త్ దేశం న్యూజిలాండ్. 1962లో న్యూజిలాండ్ పార్లమెంటరీ కమిషనర్ ఫర్ ఇన్వెస్టిగేషన్ పేరుతో అంబుడ్స్‌మన్‌ను నియమించింది. యునైటెడ్ కింగ్డమ్ 1967లో పార్లమెంటరీ కమిషనర్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ పేరుతో అంబుడ్స్‌మన్‌ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి దాదాపు 40 దేశాలు వివిధ పేర్లతో అంబుడ్స్‌మన్‌ను ఏర్పాటు చేసుకున్నాయి.
భారత్‌లో ఎలాంటి ఏర్పాట్లు?
-దేశంలో అవినీతిని అదుపు చేయడానికి పౌరుల ఇబ్బందులను, ఫిర్యాదులను పరిష్కరించడానికి చట్టపరంగా, సంస్థాపరంగా కింద పేర్కొన్న విధంగా ఏర్పాట్లు ఉన్నాయి.
1. ప్రభుత్వ ఉద్యోగుల విచారణ చట్టం, 1850
2. భారత శిక్షాస్మృతి, 1860
3. స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్, 1941
4. ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం, 1946
5. అవినీతి నిరోధక చట్టం, 1988
6. కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం, 1952
7. అఖిల భారత సర్వీసుల రూల్స్, 1968
8. కేంద్ర సివిల్స్ సర్వీసెస్ రూల్స్, 1964
9. రైల్వే సర్వీసుల రూల్స్, 1966
10. వివిధ విభాగాల్లోని విజిలెన్స్ సంస్థలు
11. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), 1963
12. కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ), 1964
13. రాష్ట్ర విజిలెన్స్ కమిషన్, 1964
14. రాష్ర్టాల్లో అవినీతి నిరోధక సంస్థలు (ఏసీబీలు)
15. రాష్ర్టాల్లో లోకాయుక్త (అంబుడ్స్‌మన్)
16. డివిజనల్ విజిలెన్స్ బోర్డ్
17. జిల్లా విజిలెన్స్ అధికారి
18. జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్
19. షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్
20. షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్
21. సుప్రీంకోర్టు, రాష్ర్టాల్లో హైకోర్టులు
22. పరిపాలనా ట్రిబ్యునళ్లు
23. క్యాబినెట్ సచివాలయంలో ప్రజా ఫిర్యాదుల సంచాలక కార్యాలయం, 1988.
24. పార్లమెంటు, వాటి కమిటీలు
25. కేరళ వంటి కొన్ని రాష్ర్టాల్లో ఫైల్ టు ఫీల్డ్ కార్యక్రమం ఉంది. ఈ విధానంలో పాలనాధికారి స్వయంగా గ్రామం/ప్రాంతానికి వెళ్లి పౌరుల నుంచి ఫిర్యాదులను తీసుకుని, వీలైతే అక్కడిక్కడే సమస్యను పరిష్కరిస్తాడు.
లోక్‌పాల్
-పౌరుల ఫిర్యాదుల పరిష్కారానికి లోక్‌పాల్, లోకాయుక్త అనే రెండు ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేయాలని భారత పాలనా సంస్కరణల కమిషన్ (ఏఆర్సీ) -(1966-1970) సిఫారసు చేసింది. ఈ సంస్థలను స్కాండినేవియా దేశాల్లో ఉన్న అంబుడ్స్‌మన్ వ్యవస్థ, న్యూజిలాండ్‌లో ఉన్న పార్లమెంటరీ కమిషనర్ ఫర్ ఇన్వెస్టిగేషన్ తరహాలో ఏర్పాటు చేయాలని సూచించింది.
-లోక్‌పాల్ కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో మంత్రులు, కార్యదర్శులపై ఫిర్యాదులను, లోకాయుక్త ఇతర నిర్దిష్ట ఉన్నతాధికారులపై ఫిర్యాదులను స్వీకరించి విచారణ జరుపాలి.
-పాలనా సంస్కరణల కమిషన్ (ఏఆర్సీ) ప్రకారం లోక్‌పాల్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్లను సంప్రదించి రాష్ట్రపతి నియమిస్తారు.
-లోక్‌పాల్, లోకాయుక్తలకు ఎలాంటి లక్షణాలు ఉండాలో సూచిస్తూ ఏఆర్సీ పలు సిఫారసులను చేసింది.
లోకాయుక్తలు
-లోక్‌పాల్ వ్యవస్థ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా చర్చల స్థాయిలోనే ఉంటే, మరోవైపు అనేక రాష్ర్టాలు ఇప్పటికే లోకాయుక్త వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం విశేషం.
-లోకాయుక్త వ్యవస్థను మొదటిసారిగా మహారాష్ట్ర ప్రభుత్వం 1971లో ఏర్పాటు చేసింది. ఒడిశా 1970లోనే లోకాయుక్త చట్టాన్ని తీసుకొచ్చినప్పటికీ అది 1983లో అమల్లోకి వచ్చింది.
-2013 వరకు 18 రాష్ర్టాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం (ఢిల్లీ) లోకాయుక్త వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి. ఒడిశా-1970లో, మహారాష్ట్ర-1971లో, రాజస్థాన్-1973లో, బీహార్- 1974లో, ఉత్తరప్రదేశ్-1975లో,మధ్యప్రదేశ్- 1981లో, ఆంధ్రప్రదేశ్-1983లో, హిమాచల్‌ప్రదేశ్-1983లో,కర్ణాటక-1985లో, అస్సాం-1985లో, గుజరాత్-1986లో, పంజాబ్ -1995లో, ఢిల్లీ-1995లో, కేరళ-1999లో, జార్ఖండ్-2001లో, ఛత్తీస్‌గఢ్- 2002లో, హర్యానా-2002లో, ఉత్తరాఖండ్-2002లో, గోవా-2011లో లోకాయుక్తలను ఏర్పాటు చేసుకున్నాయి.
లోకాయుక్త – వివిధ అంశాలు
-నిర్మాణాత్మక భేదాలు: లోకాయుక్త వ్యవస్థల నిర్మాణం అన్ని రాష్ర్టాల్లో ఒకే విధంగా లేదు. రాజస్థాన్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ర్టాలు లోకాయుక్తతోపాటు ఉపలోకాయుక్త వ్యవస్థను ఏర్పాటు చేసుకోగా.. బీహార్, ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ర్టాలు కేవలం లోకాయుక్తను మాత్రమే ఏర్పాటు చేసుకున్నాయి. పంజాబ్, ఒడిశా వంటి రాష్ర్టాలు లోక్‌పాల్‌గా అధికారులను నియమించాయి. అయితే రాష్ర్టాల్లో ఇటువంటి నిర్మాణాన్ని ఏఆర్సీ సూచించలేదు.
-నియామకం: రాష్ట్రంలో లోకాయుక్త, ఉపలోకాయుక్తలను గవర్నర్ నియమిస్తాడు. ఈ నియామకం చేపట్టేటప్పుడు గవర్నర్.. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, రాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నాయకుడిని సంప్రదిస్తాడు.
-అర్హతలు: లోకాయుక్తగా నియమితులయ్యే వ్యక్తికి న్యాయసంబంధమైన విద్యార్హతలు ఉండాలని ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఒడిశా, కర్ణాటక, అస్సాం నిర్దేశించగా.. బీహార్, మహారాష్ట్ర, రాజస్థాన్‌లు ఎటువంటి నిర్దిష్టమైన అర్హతలను నిర్ణయించలేదు.
-పదవీకాలం: దాదాపు అన్ని రాష్ర్టాల్లో లోకాయుక్త పదవీకాలం 5 ఏండ్లు లేదా సదరు అధికారికి 65 ఏండ్ల వయసు వచ్చే వరకు. ఒకసారి పదవీకాలం పూర్తయితే పునర్నియామకానికి అర్హులుకారు.
-అధికార పరిధి: లోకాయుక్త అధికార పరిధి విషయంలో రాష్ర్టాల మధ్య సారూప్యత లేదు. కొన్ని రాష్ర్టాల్లో ముఖ్యమంత్రి లోకాయుక్త పరిధిలోకి వస్తాడు. మరికొన్ని రాష్ర్టాల్లో ముఖ్యమంత్రిని లోకాయుక్త పరిధి నుంచి మినహాయించారు. దాదాపు అన్ని రాష్ర్టాలు మంత్రులు, ప్రభుత్వ ఉన్నతోద్యోగులను లోకాయుక్త పరిధిలోకి తెచ్చాయి. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం మాజీ మంత్రులు, మాజీ ఉన్నతోద్యోగులను కూడా లోకాయుక్త పరిధిలోకి తెచ్చింది.
ఇతర అంశాలు
1. లోకాయుక్త తన పనితీరుపై ఒక సమగ్రమైన వార్షిక నివేదికను ఏటా గవర్నర్‌కు సమర్పిస్తాడు. గవర్నర్ ఈ నివేదికకు తన వివరణను జతచేసి రాష్ట్ర శాసనసభకు సమర్పిస్తాడు. లోకాయుక్త సంబంధిత రాష్ట్ర శాసనసభలకు జవాబుదారీగా ఉండాలి.
2. లోకాయుక్త తన కేసులకు సంబంధించిన విచారణల్లో రాష్ట్ర దర్యాప్తు సంస్థల సహకారం తీసుకోవచ్చు.
3. ప్రభుత్వ శాఖల నుంచి కేసులకు సంబంధించిన ఫైళ్లు, పత్రాలను ఇవాల్సిందిగా కోరవచ్చు.
4. లోకాయుక్త సిఫారసులు కేవలం సలహాపూర్వకమైనవి మాత్రమే. వాటిని తప్పక పాటించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు.
మెక్‌గ్రాహిల్స్ ఎడ్యుకేషన్ సౌజన్యంతో
ఏఆర్సీ సిఫారసులు
1. లోక్‌పాల్, లోకాయుక్తలు స్వతంత్రతను, నిష్పాక్షికతను ప్రదర్శించాలి.
2. వీరి దర్యాప్తులు, విచారణలు వ్యక్తిగతంగా, లాంఛనరహితంగా జరగాలి.
3. వీరి నియామకాలు రాజకీయాలకు అతీతంగా జరగాలి
4. వీరి హోదా దేశంలోని అత్యున్నత న్యాయాధికారులతో పోల్చదగినదిగా ఉండాలి.
5. విచక్షణకు అవకాశం ఉన్న అన్యాయం, అవినీతి, లేదా పక్షపాతం వంటి అంశాలను విచారించాలి.
6. న్యాయవ్యవస్థ జోక్యానికి అవకాశం లేనివిధంగా దర్యాప్తు జరగాలి.
7. తమ విధులకు సంబంధించిన సమాచారాన్ని పొందేందుకు వీరికి పూర్తి స్వాతంత్య్రం, అధికారం ఉండాలి.
8. అధికారంలో ఉన్న ప్రభుత్వం నుంచి వారు ఎలాంటి ప్రయోజనాలను లేదా ఆర్థికపరమైన లాభాలను ఆశించరాదు.
-పై సిఫారసులను ప్రభుత్వం ఆమోదించింది. ఈ అంశంపై చట్టాన్ని తెచ్చేందుకు అధికారికంగా ఇప్పటివరకు 10 ప్రయత్నాలు జరిగాయి. ఈ మేరకు పార్లమెంటులో 1968 నుంచి 2011 వరకు 10 బిల్లులను ప్రవేశపెట్టారు.
పార్లమెంటులో బిల్లులు – ప్రవేశపెట్టిన ప్రభుత్వాలు
1. 1968, మేలో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.
2. 1971, ఏప్రిల్‌లో మరోసారి ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.
3. 1977, జూలైలో మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా ప్రభుత్వం.
4. 1985, ఆగస్టులో రాజీవ్‌గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.
5. 1989, డిసెంబర్లో వీపీ సింగ్ నాయకత్వంలోని నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం.
6. 1996, సెప్టెంబర్‌లో దేవెగౌడ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం.
7. 1998, ఆగస్టులో బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం
8. 2001, ఆగస్టులో వాజ్‌పేయి నాయకత్వంలోని ఏన్డీఏ ప్రభుత్వం
9. 2011, ఆగస్టులో మన్మోహన్సింగ్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం
10. 2011, డిసెంబర్లో మన్మోహన్సింగ్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం
పైన పేర్కొన్న ఏ ఒక్క బిల్లు కూడా పార్లమెంటు ఆమోదానికి నోచుకోలేదు. ఏదో ఒక కారణంతో ఆ బిల్లులు తిరస్కరణకు గురయ్యాయి. మొదటి నాలుగు బిల్లులు లోక్‌సభ రద్దు వల్ల వీగిపోయాయి. ఐదో బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆరు, ఏడు, ఎనిమిదో బిల్లులు కూడా లోక్‌సభలు రద్దు కావడంతో వీగిపోయాయి. 9వ బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకుంది. 10వ బిల్లు లోక్‌సభ రద్దుతో వీగిపోయింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు