జీవావరణ కేంద్రాలు ఎక్కడున్నాయి.?
జనాభా విస్ఫోటం, పారిశ్రామికీకరణ, నగరీకరణ, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాలవల్ల క్రమంగా అడవుల విస్తీర్ణం తగ్గి పర్యావణ సమతుల్యానికి విఘాతం కలుగుతున్నది. అడవులు తరగిపోతుండటంతో వన్యప్రాణుల జీవనానికి ముప్పు వాటిల్లుతున్నది. అనేక రకాల వృక్ష, జంతు జాతులు అంతరించిపోతున్నాయి. అందుకే భారత ప్రభుత్వం ప్రకృతిసిద్ధమైన జంతు, వృక్ష జాతుల జీవవైవిధ్యాన్ని కాపాడటం కోసం 1986 నుంచి సహజ పర్యావరణ ప్రాంతాలను బయోస్పియర్ రిజర్వ్‌లుగా (జీవావరణ పరిరక్షణ కేంద్రాలు) ప్రకటిస్తూ వస్తున్నది. ఇప్పటివరకు దేశంలో మొత్తం 18 జీవావరణ కేంద్రాలను నెలకొల్పింది. వాటిలో కొన్నింటికి సంబంధించిన వివరాలు నిపుణ పాఠకుల కోసం…
నీలగిరి బయోస్పియర్ రిజర్వ్
-దీన్ని 1986, ఆగస్టు 1న జీవావరణ పరిరక్షణ కేంద్రంగా గుర్తించారు.
-ఇది కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ర్టాల్లోని వాయనాడ్, నాగర్హోల్, బందీపూర్, మడుమలై, నీలంబర్, సైలెంట్ వ్యాలీ, సిరువాణీ హిల్స్ ప్రాంతాల్లో 5,520 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది.
-ఇక్కడ అంతరించిపోయే దశలో ఉన్న నీలగిరి కొండ మేకలు, సింహం తోక కోతులను సంరక్షిస్తున్నారు.
-నీలగిరి కొండ మేకలు: ఇవి ఆకారంలో సాధారణ మేకలవలె ఉండి, వాడియైన వెనుకకు తిరిగిన కొమ్ములతో పరిమాణంలో పెద్దవిగా ఉంటాయి. 80 నుంచి 100 కేజీల వరకు బరువు పెరుగుతాయి.
-సింహం తోక కోతులు: ఇవి తలపై ముదురు గోధుమ వర్ణపు జూలు, ఒంటిపై నల్లని వెంట్రుకలు, సింహం తోకను పోలిన తోకను కలిగి ఉంటాయి.
నందాదేవి జాతీయపార్కు & బయోస్పియర్ రిజర్వ్
-దీన్ని 1988, జనవరి 18న జీవావరణ పరిరక్షణ కేంద్రంగా ప్రకటించారు.
-ఇది ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్, అల్మోరా జిల్లాలతోపాటు చమోలీ జిల్లాలోని కొంతభాగంలో విస్తరించి ఉంది. దీని పరిధి 5,860 చదరపు కిలోమీటర్లు.
-ఇక్కడ మంచు చిరుతలు, హిమాలయన్ నలుపు ఎలుగుబంట్లను అంతరించిపోకుండా సంరక్షిస్తున్నారు.
-మంచు చిరుతలు: వీటి ఒంటిపై జూలు తెలుపురంగులో ఉన్నప్పటికీ అక్కడక్కడా లేత పసుపు రంగు కనిపిస్తుంది. జూలుపై నల్లని మచ్చలుంటాయి.
-హిమాలయన్ ఎలుగుబంట్లు: వీటి దేహంపై దట్టమైన జూలు ఉంటుంది. ఈ జూలు ఒంటి పైభాగంలో నలుపు రంగులో, ఛాతీ భాగం లేత పసుపు లేదా గోధుమ రంగులో ఉంటుంది.
మానస్ బయోస్పియర్ రిజర్వ్
-దీన్ని 1989 మార్చి 14న జీవావరణ పరిరక్షణ కేంద్రంగా ప్రకటించారు.
-ఇది అసోంలోని కాక్రజార్, బొంగాయ్‌గావ్, బర్పెటా, నల్బరి, కంప్రూప్, దరంగ్ జిల్లాల పరిధిలోని ప్రాంతాల్లో 2,837 చదరపు కిలోమీటర్ల భూభాగంలో విస్తరించి ఉంది.
-ఇక్కడి జంతుజాలంలో రెడ్ పాండా, గోల్డెన్ లాంగూర్లను సంరక్షిస్తున్నారు.
-గోల్డెన్ లాంగూర్లు: వీటిని తెలంగాణలో కొండెంగలు అంటారు. గోల్డెన్ లాంగూర్ ఒంటిపై బంగారు వర్ణపు జూలు ఉండి, ముఖం నల్లగా ఉంటుంది. పొడవైన తోకను కలిగి ఉంటాయి.
గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్
-దీన్ని 1989 జనవరి 6న జీవావరణ కేంద్రంగా గుర్తించారు.
-ఇది అండమాన్ నికోబార్ దక్షిణ ప్రాంత దీవుల్లో 885 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది.
-ఈ బయోస్పియర్ రిజర్వ్‌లో ఉప్పునీటి మొసళ్లను (Salt water Crocodiles) సంరక్షిస్తున్నారు.
-ఉప్పునీటి మొసళ్లు: ప్రస్తుతం 14 జాతులకు చెందిన ఉప్పునీటి మొసళ్లు జీవించి ఉన్నాయి. ప్రపంచంలో జీవించి ఉన్న అత్యంత భారీ సరీసృపాలు ఇవే. మగ మొసళ్లు దాదాపు 1000 కేజీల వరకు బరువు పెరుగుతాయి.
సుందర్బన్స్ బయోస్పియర్ రిజర్వ్
-1989 మార్చి 29న బయోస్పియర్ రిజర్వ్‌గా గుర్తించారు.
-ఇది పశ్చిమబెంగాల్లోని గంగ, బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ డెల్టా ప్రాంతాల్లో 9,630 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది.
-ఇక్కడ రాయల్ బెంగాల్ టైగర్లను (పెద్ద పులులు) సంరక్షిస్తున్నారు.
-పెద్ద పులులు: పెద్దపులిని 1972లో జాతీయ జంతువుగా ప్రకటించారు. వీటి దేహం పై భాగం బంగారం రంగులో ఉండి, దానిపై నల్లని అడ్డుచారలుంటాయి. కడుపు కింద తెలుపు రంగు ఉంటుంది. తెల్ల పులుల దేహం పూర్తిగా తెలుపు రంగులో ఉండి, దానిపై నలుపు అడ్డుచారలుంటాయి.
దిహంగ్-దిబంగ్ బయోస్పియర్ రిజర్వ్
-దీన్ని 1998, సెప్టెంబర్ 2న జీవావరణ పరిరక్షణ కేంద్రంగా గుర్తించారు.
-అరుణాచల్‌ప్రదేశ్‌లో ఎగువ సియాంగ్, పశ్చిమ సియాంగ్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలతోపాటు దిబంగ్ లోయలో 5,111 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది.
-ఇక్కడ మస్క్ డీర్లు (కస్తూరి జింకలు), మిష్మిటాకిన్లను సంరక్షిస్తున్నారు.
-కస్తూరి జింకలు: ఇవి కస్తూరి అనే సుగంధ ద్రవ్యాన్ని ఉత్పత్తి చేస్తాయి. మగ జింకల నాభి భాగంలో ఉన్న అరల లాంటి నిర్మాణాల్లో ఈ సుగంధ ద్రవ్యం ఉత్పత్తి అవుతుంది.
-మిష్మిటాకిన్లు: ఇవి కూడా ఒక రకమైన జింక జాతి జంతువులు. ఇవి చూడటానికి కొండ గొర్రెల్లా కనిపిస్తూ, పరిమాణంలో పెద్దవిగా ఉంటాయి.
గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్
-దీన్ని 1989 ఫిబ్రవరి 18న జీవావరణ కేంద్రంగా ప్రకటించారు. ఇది భారత్, శ్రీలంక మధ్య సముద్ర ప్రాంతంలో కన్యాకుమారికి ఉత్తరంగా, రామేశ్వరం సమీపాన, 10,500 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది.
-ఈ జీవావరణ కేంద్రంలో సముద్రపు ఆవులను (Sea Cows) సంరక్షిస్తున్నారు.
-సముద్రపు ఆవులు: ఇవి జలచర క్షీరదాలు. ఆవు తలను పోలిన తల కలిగి ఉండి, దేహమంతా నున్నగా చేపలా ఉంటుంది. ఇవి సముద్రంలో చిన్నచిన్న సమూహాలుగా సంచరిస్తుంటాయి. ప్రస్తుతం వీటిలో మూడు జాతులు మాత్రమే జీవించి ఉన్నాయి.
దిబ్రూ-సైఖోవా బయోస్పియర్ రిజర్వ్
-1997 జూలై 28న బయోస్పియర్ రిజర్వ్‌గా గుర్తించారు.
-ఇది అసోంలోని దిబ్రూగఢ్, టిన్సుకియా జిల్లాల్లో 765 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది.
-బయోస్పియర్‌లో గోల్డెన్ లాంగూర్లను సంరక్షస్తున్నారు.
అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్
-2001 నవంబర్ 12న జీవావరణ కేంద్రంగా గుర్తించారు.
-ఇది తమిళనాడులోని తిరునల్వేలి, కన్యాకుమారి జిల్లాలు, కేరళలోని తిరువనంతపురం, కొల్లామ్, పతనంతిట్ట జిల్లాల పరిధిలో 3,500 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది.
-ఈ జీవావరణ కేంద్రంలో నీలగిరి కొండ మేకలు, ఆసియా ఏనుగులను సంరక్షిస్తున్నారు.
పచ్మర్హి బయోస్పియర్ రిజర్వ్
-దీన్ని 1999 మార్చి 3న బయోస్పియర్ రిజర్వ్‌గా గుర్తించారు. ఇది మధ్యప్రదేశ్‌లోని బేతుల్, హోషంగాబాద్, ఛింద్వారా జిల్లాల్లో 4,981 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది.
-ఇక్కడి జంతుజాలంలో అంతరించిపోయే దశలో ఉన్న పెద్ద ఉడుతలు, ఎగిరే ఉడుతలను సంరక్షిస్తున్నారు.
-పెద్ద ఉడుతలు: ఇవి సాధారణ ఉడుతల కంటే పరిమాణంలో పెద్దగా ఉంటాయి. మూడు నుంచి మూడున్నర అడుగుల పొడవు పెరుగుతాయి. ఇందులో దేహభాగం పొడవు ఒక అడుగు నుంచి అడుగున్నర, తోక పొడవు రెండు అడుగులు. వీటి బరువు సుమారుగా రెండు కేజీలు ఉంటుంది.
-ఎగిరే ఉడుతలు: ఇవి పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి. ఇవి గబ్బిలాలు, పక్షుళ్లా ఎగరలేకపోయినా.. ఒక చెట్టు నుంచి మరో చెట్టుపైకి గరిష్ఠంగా 90 మీటర్ల దూరం వరకు దూకుతాయి. ఎగరడానికి వీలుగా వీటి నాలుగు కాళ్లను కలుపుతూ పొరలాంటి నిర్మాణం ఉంటుంది.
అచానక్మర్ & అమర్కంటక్ బయోస్పియర్ రిజర్వ్
-దీన్ని 2005 మార్చి 30న జీవావరణ పరిరక్షణ కేంద్రంగా ప్రకటించారు.
-ఇది మధ్యప్రదేశ్‌లోని అనుపూర్, దిన్దోరి జిల్లాలతోపాటు ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ జిల్లాలో 3,835 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది.
-ఇక్కడ అంతరించిపోతున్న అడవి దున్నలు/బర్రెలు, చిరుత పులులు, మచ్చల జింకలను సంరక్షిస్తున్నారు.
-చిరుత పులులు: వీటి దేహం బంగారు, తెలుపు వర్ణంలో ఉండి, ఒళ్లంతా నల్లని మచ్చలుంటాయి. వేగంగా పరుగెత్తడం వీటి ప్రత్యేక లక్షణం. ఇవి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలవు. మగ చిరుతలు 32 కేజీల వరకు, ఆడ చిరుతలు 27 కేజీల వరకు బరువు పెరుగుతాయి.
-మచ్చల జింకలు: వీటి దేహం బంగారు వర్ణంలో ఉండి, దానిపై తెల్లని మచ్చలు ఉంటాయి. తలపై శాఖలుగా చీలిన పొడవైన కొమ్ములు ఉంటాయి. అందుకే వీటిని కొమ్ముల జింకలు అని కూడా అంటారు.
సిమ్లిపాల్ బయోస్పియర్ రిజర్వ్
-1994 జూన్ 21న బయోస్పియర్ రిజర్వ్‌గా ప్రకటించారు.
-ఇది ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో 4,374 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది.
-ఇక్కడ రాయల్ బెంగాల్ టైగర్లు, ఆసియా ఏనుగులు, అడవి దున్నలు/బర్రెలను సంరక్షిస్తున్నారు.
-ఆసియా ఏనుగులు: ఆసియా ఏనుగులు ప్రస్తుతం భారత్, శ్రీలంక దేశాలతోపాటు సుమత్రా దీవుల్లో ఉన్నాయి. ఆఫ్రికా ఏనుగులతో పోల్చితే వీటి చెవులు, దేహ పరిమాణం కొంత చిన్నగా ఉంటాయి. ఆడ ఏనుగులు రెండున్నర టన్నుల వరకు, మగ ఏనుగులు ఐదున్నర టన్నుల వరకు బరువు పెరుగుతాయి.
-అడవి దున్నలు, బర్రెలు: వీటిని 1986లో అంతరించిపోతున్న జీవుల జాబితాలో చేర్చారు. వీటి దేహం దృఢంగా ఉంటుంది. బర్రెలు సుమారు 1000 కేజీల వరకు, దున్నలు దాదాపు 1500 కేజీల వరకు బరువు పెరుగుతాయి.
నోక్రెక్ బయోస్పియర్ రిజర్వ్
-1988 సెప్టెంబర్ 1న బయోస్పియర్ రిజర్వ్‌గా ప్రకటించారు.
-ఇది మేఘాలయాలో తూర్పు, పడమర, దక్షిణ ప్రాంతాల్లోని గారో హిల్స్ జిల్లాల్లో 820 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది.
-ఇక్కడి జంతుజాలంలో అంతరించిపోయే దశలో ఉన్న రెడ్ పాండాను సంరక్షిస్తున్నారు.
-రెడ్ పాండాలు: ఇవి పరిమాణంలో పిల్లి కంటే కొంచెం పెద్దవిగా ఉండి శరీరంపైన ఎరుపు రంగు జూలు.. కడుపు కింద, కాళ్లకు నలుపు రంగు జూలు కలిగి ఉంటాయి. పిల్లి తోకను పోలిన తోక ఉండి, తల ఎలుగుబంటి తలలా కనిపిస్తుంది.
పన్నా బయోస్పియర్ రిజర్వ్
-దీన్ని 2011 ఆగస్టు 25న బయోస్పియర్ రిజర్వ్‌గా ప్రకటించారు.
-ఇది మధ్యప్రదేశ్‌లోని పన్నా, ఛత్తర్పూర్ జిల్లాల పరిధిలో 2,998 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది.
-ఈ జీవావరణ కేంద్రంలో పెద్దపులులు, మచ్చల జింకలు, దుప్పిలు, సాంబార్ డీర్లు, స్లాత్ బేర్లను సంరక్షిస్తున్నారు.
-దుప్పిలు: ఇవి కూడా ఒక రకం జింకలు. తలపై పొడవుగా, నిటారుగా రెండు కొమ్ములు ఉంటాయి. వీటి శరీరం పైభాగం ముదురు గోధుమ లేదా ముదురు ఎరుపు లేదా బంగారు వర్ణంలో ఉంటుంది. కడుపు కింద, కాళ్ల లోపలి పక్కల్లో తెలుపు రంగు ఉంటుంది. ఈ రెండు రంగులు కలిసే చోట దేహానికి, తలకు ఇరువైపులా నల్లని చారలు ఉంటాయి.
-సాంబార్ డీర్లు: సాంబార్ డీర్లు కూడా జింక జాతుల్లో ఒక రకం. వీటి దేహం ముదురు గోధుమ లేదా బూడిద వర్ణంలో ఉంటుంది. పరిమాణంలో ఇవి ఇతర జింకల కంటే భారీగా ఉంటాయి. 300 నుంచి 350 కేజీల బరువు పెరుగుతాయి. వీటి చెవులు డొప్పల్లా ఉండి, ఆడ జింకలు కొమ్ములు లేకుండా, మగ జింకలు శాఖలు కలిగిన దృఢమైన కొమ్ములతో ఉంటాయి.
-స్లాత్ బేర్లు: వీటి దేహమంతటా నల్లని దట్టమైన జూలు ఉంటుంది. అడవిలో దొరికే చిన్నచిన్న జీవులను వేటాడి ఆహారంగా తీసుకుంటాయి. అప్పుడప్పుడు ఇవి చెట్ల కొమ్మలపై వెనుక కాళ్ల సాయంతో తలక్రిందులుగా వేళాడుతూ కనిపిస్తాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు