సమాజం అంటే..?
సామాజిక నిర్మితి
-సమాజ సౌధం అంతర్గత నిర్మితిని పరిశీలించనిదే సమాజం స్వరూపం అవగతం కాదు. ఒక బహుళ అంతస్తుల భవనానికి పటిష్టమైన పునాది ఉన్నట్లుగానే ప్రతి సమాజానికి మౌలికంగా పటిష్టతను సమకూర్చే అంశాలుంటాయి. ఒక సమాజంలోని వివిధ అంశాలు పొందుపర్చబడి ఉన్న విధానాన్నే సామాజిక నిర్మితి అంటారు. సమాజంలోని వివిధ సామాజిక సంస్థలు, విభిన్న పాత్రలు, అంతస్తులు, మానవుల మధ్య పరస్పర సంబంధాలను క్రమబద్ధీకరించే వివిధ రకాల ఏర్పాట్లు సమాజానికి ఆధారంగా నిలుస్తుంటాయి. సమాజంలో ఆయా అంశాలు ఎలా ఏర్పడి ఉన్నాయనే విషయాన్ని సామాజిక నిర్మితి అధ్యయనం చేస్తుంది.
-మొదటగా స్పెన్సర్ అనే శాస్త్రవేత్త సామాజిక నిర్మితి అనే భావనను ప్రవేశపెట్టాడు. అతను సమాజాన్ని జీవితో పోల్చాడు. సమాజంలోని అంశాలను, వాటిలో వస్తున్న పరిణామాలను జీవశాస్త్ర పరిభాషలో తెలిపాడు.
-HM జాన్సన్ తన సోషియాలజీ గ్రంథంలో ఒక సామాజిక వ్యవస్థలో వివిధ అంగాలను తగిన రీతిలో వివిధ స్థాయిల్లో పొందుపర్చే విధానమే సామాజిక నిర్మితి అని పేర్కొన్నాడు. సామాజిక వ్యవస్థలోని వివిధ పాత్రలు, వాటి స్థితిగతులు, వ్యక్తుల సమూహాలు వాటిని పరిరక్షించే సాంఘిక విలువలు ఆ సమాజ వ్యవస్థ వివిధ అంగాలుగా పేర్కొనవచ్చని సామాజిక వ్యవస్థలోని వ్యక్తుల పరస్పర చర్యల్లోని స్థిరత్వం, క్రమం, పునరావృతాలు సాంఘిక ప్రమాణాలపై ఆధారపడి ఉంటాయని అభిప్రాయపడ్డాడు.
-సమాజంలో వివిధ సామాజిక సంస్థలు, రీతులు, వ్యవస్థలు పనిచేస్తుంటాయి. వ్యక్తులు కొన్ని పాత్రలు నిర్వహిస్తూ వాటికి అనుబంధంగా ఉన్న అంతస్తులను చెలాయిస్తూ ఉంటారు. వ్యక్తులు ఆయా పాత్రలు నిర్వహిస్తున్న సమయంలో సమాజంలో అమలులో ఉన్న సంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలను విధిగా పాటించాలి. ఇలా సమాజంలోగల వివిధ అంశాలు అవినాభావ సంబంధాన్ని ఏర్పర్చుకుని సమాజంలో వివిధ స్థానాలను అలంకరించి వ్యవస్థీకృతమవుతాయి. ఇలా ఇవన్నీ ఏర్పడి ఉంటేనే సమాజం మనుగడ సాధిస్తుంది. ఇలాంటి సామాజిక ఏర్పాటునే సామాజిక నిర్మితి అని పార్సన్ అనే శాస్త్రవేత్త తెలిపాడు.
-ఇవాన్స్ ప్రిచర్డ్ అనే శాస్త్రవేత్త వివిధ సమూహాల మధ్యగల సంబంధాలను సామాజిక నిర్మితిగా పేర్కొన్నాడు. ప్రధాన సామాజిక సమూహాల/సంస్థల విడదీయరాని సంబంధాలను సామాజిక నిర్మితిగా పేర్కొన్నాడు. పోర్టెన్ అనే శాస్త్రవేత్త సామాజిక నిర్మితి అంటే సమాజంలోని వివిధ అంశాలు (సంస్థలు, సమూహాలు, ప్రక్రియలు మొదలైనవి) ఒక క్రమ పద్ధతిలో అమరి పరస్పర సంబంధంతో కలిసి పనిచేయడమేనని తెలిపాడు.
-పైన తెలిపిన భావనలను సమాజశాస్త్రం, సంఘసంక్షేమ శాస్త్రం, మానవీయశాస్త్రం అభ్యసించిన విద్యార్థులు సులభంగా అవగాహన చేసుకోగలరు. కానీ నూతనంగా ప్రవేశపెట్టిన గ్రూప్-1, గ్రూప్-2 సిలబస్లో 50 మార్కులకుగాను పొందుపర్చిన అంశాలను సామాజిక కోణంలో అర్థం చేసుకోవాలంటే సామాజిక నిర్మితి అనే ప్రాథమిక భావనపట్ల ఒక అవగాహన అవసరం. అందుకే పైన వివరించిన అంశాలను వివిధ రకాల నేపథ్యంగల విద్యార్థులు సులభంగా గ్రహించడానికి కింది విధంగా సాధారణీకరించవచ్చు.
-మానవుడు సంఘజీవి ఒంటరిగా జీవించలేడు. అతని సామాజిక, మానసిక, భౌతిక అవసరాలను నెరవేర్చుకోవాలంటే అతడు ఇతరులతో పరస్పర సంబంధాలను కలిగి తన అవసరాలను తీర్చుకుంటూ, ఇతరుల అవసరాలను తీర్చడానికి తన జీవన క్రమంలో వివిధ పాత్రలు పోషిస్తుంటాడు. అందుకే మెకైవర్ మానవుల మధ్యగల సామాజిక సంబంధాలనే (నెట్వర్క్ ఆఫ్ సోషల్ రిలేషన్షిప్స్) సమాజం అని తెలిపాడు. ఇలా మానవుడు తన జీవితం మొత్తం వివిధ రకాల వ్యక్తులతో కలిసిమెలిసి కొనసాగిస్తాడు. ఆ క్రమంలో అతని పుట్టుకకు కారణమై, అతని పోషణ, సంరక్షణ, సామాజీకరణ, ప్రేమ, వాత్సల్యం లాంటి ప్రాథమిక అవసరాలను తీర్చే సమూహాలు ప్రాథమిక సమూహాలు/సంస్థలు). ఉదా: కుటుంబం, వివాహం, బంధుత్వం, మతం మొదలైనవి), ఇతర అవసరాలను తీర్చే ద్వితీయ సమూహాలు/సంస్థలతో వివిధ పాత్రలను, అంతస్తులను ఆయా సమాజ కట్టుబాట్లు, ఆచారాలు, సంప్రదాయాలు, జానపదరీతులు, సామాజిక రీతులు, ప్రమాణాల ఆధారంగా తన ప్రవర్తనను రూపొందించుకుంటూ సమాజం ఆమోదించిన రీతిలో జీవనం కొనసాగిస్తాడు. ఇలా సమాజంలోని వివిధ సమూహాలు, సామాజిక సంస్థలు అవి పాటించే వివిధ రీతులను కలిసి అధ్యయనం చేస్తే అదే సామాజిక నిర్మితిగా భావించవచ్చు.
-చారిత్రక పరిశోధనల ప్రకారం ఈ నేలపై సామాజిక నిర్మాణం, నాగరికత భారతీయ మూల జాతి (నేటివ్స్) అయిన ద్రవిడులతో ప్రారంభమైనదిగా భావించవచ్చు. వీరి సామాజిక జీవన విధానాన్నే మూల నాగరికత, ద్రవిడ నాగరికత, హరప్పా సంస్కృతి, సింధూలోయ నాగరికతగా పేర్కొంటాం.
-ప్రస్తుత సమాజంలో కూడా ద్రవిడ నాగరికత వివిధ రూపాల్లో గోచరమవుతుంది. ప్రకృతి దేవతలను ఆరాధించారు. గ్రామీణ దేవతలు (గ్రామ దేవతలు), తూనికలు, కొలతలు, జంతువుల మచ్చిక, వ్యవసాయం, నీటి పారుదల లాంటి అంశాలన్నీ భారతీయ సమాజానికి ప్రారంభవేదికగా పనిచేశాయి. సింధూనాగరికత కాలంనాటి పశుపతి ఆరాధనను నేటి కాలపు శివారాధనతో పోల్చవచ్చు.
-ద్రవిడ నాగరికత తర్వాత భారతీయ సామాజిక నిర్మాణం ఆర్యులతో కొనసాగింపబడింది. ఆర్యులు భారతీయులేనా లేదా ఇతర ప్రాంతాల నుంచి వచ్చారా అనే అంశం ఇప్పటికీ వివాదాస్పదమే అయినప్పటికీ ఆర్యుల నాగరికత లేదా వీరిచే నిర్మింపబడిన లేదా మలివేద నాగరికతలు భారతీయ సామాజిక నిర్మాణానికి మూలస్తంభాలుగా నిలిచాయి. ఇప్పటికీ భారతీయ సమాజంలోని ఎక్కువ భాగం అనుసరిస్తున్నది వీరి రచనలు అయిన వేదాలు, ఉప వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు మొదలైనవి. భారతీయ సామాజిక నిర్మాణానికి అలాగే హిందూ సామాజిక నిర్మాణానికి పునాదులయ్యాయి.
-ఆర్యుల నాగరికత ఫలితంగా హిందూసామాజిక వ్యవస్థ, వర్ణవ్యవస్థ, కులవ్యవస్థ లాంటి సనాతన ధర్మాలు అనుసరించబడ్డాయి. ఈ విధానంలోని లోపాలను ఎత్తిచూపుతూ బౌద్ధం, జైనం లాంటి మతాలు విప్లవాత్మక చింతనా ధోరణులతో సమాజంలో మార్పునకు ఇతోధికంగా దోహదపడ్డాయి. ముఖ్యంగా అనాచారాలు, స్త్రీల దురవస్థలు, కులవ్యవస్థ, సామాజిక అసమానతలు, భాష, సారస్వతం లాంటి సామాజిక అంశాలపై తీవ్రస్థాయిలో ప్రభావాన్ని చూపి సామాజిక మార్పునకు దోహదపడినా హిందూ సామాజిక వ్యవస్థలో భాగంగానే మిగిలిపోయాయి.
-తర్వాత కాలంలో విదేశీయులైన గ్రీకులు, పార్థియన్లు, శక, కుషాణులు మొదలైన వారు దేశంపై దండెత్తి కాలక్రమంలో ఇక్కడి సంస్కృతిలో భాగంగా విలీనమయ్యారు. ఇలాంటి దృగ్విషయాన్నే ప్రాథమికంగా భారతీయీకరణగా పేర్కొనవచ్చు.
-భారతీయ సామాజిక నిర్మాణంలో తీవ్రమైన మార్పులు, పరిణామాలు, సంస్కరణలు, సామాజిక నిర్మితి పునరుద్ధరణ అనేవి ఇస్లాం, యూరోపియన్వారు, వారితోపాటు ఆగమనం చెందిన క్రైస్తవ మతం వారి రాకతో సంభవించాయి.
-ఇలా ఇతర మతాలు, సంస్కృతులు, విదేశీయుల పరిపాలన లాంటి అంశాలు ముస్లిం చక్రవర్తుల పరిపాలనా కాలం నుంచి స్వాతంత్య్రం సిద్ధించేవరకు భారతీయ సామాజిక నిర్మాణంలో నిర్మాణాత్మకమైన, అవసరమైన కొన్ని సందర్భాల్లో విషమ మార్పులు తీసుకురావడంలో దోహదపడ్డాయి.
-అభివృద్ధి చెందిన మధ్యతరగతి మేధావివర్గం, క్రైస్తవమత వ్యాప్తి, బ్రిటిష్ పరిపాలనా సంస్కరణలు, విదేశీ విద్య, అలాగే నూతన సామాజిక చింతనలు అయిన సమానత్వం, స్వేచ్ఛ, హేతువాదం లాంటి ఆధునిక భావనల ఫలితంగా భారత సామాజిక నిర్మాణంలోని లోపాలను సరిదిద్దడానికి వివిధ రూపాల్లో సామాజిక ఉద్యమాలు (సోషల్ మూవ్మెంట్స్) పెరిగి, సమాజాన్ని సంస్కరించడానికి (సోషల్ రిఫార్మ్) దారితీశాయి. ఆ క్రమంలోనే వరకట్నం, సతీ ఆచారం, అస్పృశ్యతా నివారణ, అంటరానితనం నివారణ, మహిళా హక్కులు, విద్య, వితంతు పునర్వివాహం, బాల్యవివాహ నిషేధం లాంటి సంస్థాగతమైన, సంప్రదాయంగా పాటిస్తూవస్తున్న, అభివృద్ధికి ఆటంకంగా ఉన్న సామాజిక లోపాలను సరిదిద్దడానికి ప్రయత్నాలు జరిగాయి. ఆ క్రమంలో కొంతవరకు మార్పు సిద్ధించినా సమకాలీన భారతీయ సమాజంలో ఇంకా వివిధ రూపాల్లో సామాజిక అసమానతలు, రుగ్మతలు ఉన్నాయి. వీటిని అంతమొందించి సంక్షేమరాజ్యాన్ని స్థాపించడానికి రాజ్యం, రాజ్యాంగమనే ప్రాథమిక చట్టం మార్గదర్శకత్వంలో వాటిని రూపుమాపడానికి, సమసమాజాన్ని స్థాపించడానికి సామాజిక శాసనాలు, ప్రాథమిక హక్కులు, రాజ్యవిధాన ఆదేశిక సూత్రాలు, సంక్షేమ పథకాలను సరైన ప్రజావిధానాలను రూపొందించుకుని అమలుపరుస్తున్నది.
ఇలా సింధూనాగరికత నుంచి మొదలు నేటి కాలం వరకు భారతీయ సమాజం ఆయాకాలమాన పరిస్థితులు, విదేశీయుల పాలన, వివిధ మతాల ఆగమనం, ఆధునిక విద్య మొదలైన అంశాల ఫలితంగా ప్రస్తుతం ఉన్న సామాజిక నిర్మాణాన్ని సంతరించుకున్నది. ఇలా సంక్లిష్టంగా వివిధ రూపాల్లో పరిణామం చెందుతూ నిర్మించబడినది కాబట్టి భారతీయ సమాజం నిర్మాణం ప్రత్యేకమైనది.
భారతీయ సమాజం – ప్రత్యేక లక్షణాలు
-భారత సమాజం ప్రధాన లక్షణం భిన్నత్వం. ఈ లక్షణమే ఇతర సమాజాలతో భారతీయ సమాజాన్ని ప్రత్యేక స్థానంలో నిలబెట్టింది. ఈ భిన్నత్వానికి వివిధ రకాల చారిత్రక, భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక కారణాలు దోహదం చేశాయి. సామాజిక ఉద్దేశాలను సాధించడానికి వ్యక్తులు విభిన్న అంతస్తులను కలిగి నిర్ణీత ప్రమాణాలను అనుసరిస్తూ, వివిధ రకాల పాత్రలను నిర్వహిస్తూ విభిన్న సామాజిక సంబంధాలను రూపొందించుకుంటారు. ఈ రకమైన సంబధాలనే సామాజిక నిర్మితి అంటారు. భారతీయ సమాజంలో వివిధ రకాలైన సంస్థలు, సమూహాలు, సంఘాలు, సముదాయాలు ఉన్నాయి. వీటి నిర్మాణం మొత్తాన్ని భారతీయ సామాజిక నిర్మితిగా పేర్కొనవచ్చు.
-భారతీయ సమాజం అతి పురాతనమైన, సంక్లిష్టమైనది. దీనికి సుమారు 500 ఏండ్ల ఘనమైన సాంస్కృతిక నేపథ్యం ఉంది. ప్రస్తుతం భారత్ లేదా ఇండియాగా పిలువబడుతున్న మన దేశానికి పూర్వం భరత వర్షం, జంబూద్వీపం, భరత ఖండంగా వ్యవహరించేవారు. భరతుడు పాలించిన దేశం కావడంవల్ల ఆ పేరు వచ్చిందనే అభిప్రాయం ఉంది. ఇలాంటి భరతవర్షాన్నే బ్రిటిష్ వారు ఇండియాగా, ముస్లిం పాలకులు హిందుస్థాన్గా పిలిచారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు