Climate structure | వాతావరణ నిర్మాణం
వాతావరణం అనేక పొరలను కలిగి ఉంటుంది. ప్రతి పొరలోని భౌతిక, రసాయనిక ధర్మాల్లో అనేక తేడాలు ఉంటాయి. ఒక పొర నుంచి మరొక పొరకు వెళ్లేకొద్ది క్రమంగా మారుతుంటాయి. పొరల మధ్య కచ్చితమైన సరిహద్దు ఉండక అతిపాతం చెంది ఉంటాయి. భూమిని ఆనుకొని ఉన్న వాతావరణ పొరలు మందంగాను పైకి వెళ్లేకొద్ది ఉండే వాతావరణ పొరలు పల్చగాను ఉంటాయి. ఎత్తుకు వెళ్లేకొద్ది భూమి గురుత్వాకర్షణ శక్తి తగ్గడంతోపాటు బరువైన వాయువుల శాతం తగ్గి తేలికైన వాయువుల శాతం పెరుగడమే ఇందుకు కారణం. కాబట్టి వాతావరణ లక్షణాలు, గుణగణాలు, భౌతిక, రసాయన ధర్మాలు, ఉష్ణోగ్రతా వ్యత్యాసాలను దృష్టిలో ఉంచుకొని వాతావరణాన్ని ఐదు ప్రధాన ఆవరణాలు/ పొరలుగా విభజించారు.
ట్రోపో ఆవరణం
-భూ ఉపరితలం నుంచి దాదాపు 13 కి.మీ. ఎత్తు వరకు వ్యాపించి ఉన్న వాతావరణంలోని మొదటి పొర. భూమధ్యరేఖా ప్రాంతంలో 18 కి.మీ., ధ్రువాల వద్ద కేవలం 8 కి.మీ. ఎత్తు వరకు వ్యాపించి ఉంటుంది. భూమధ్యరేఖా ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంవల్ల వ్యాకోచించి, ధ్రువ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడంవల్ల సంకోచించి ఉంటాయి. ఈ ఆవరణంలో ప్రతి 1000 మీ.ఎత్తుకు 6.4 డిగ్రీల సెంటిగ్రేడ్ చొప్పున లేదా ప్రతి 165 మీ. ఎత్తుకు 1 డిగ్రీ సెంటీగ్రేడ్ చొప్పున ఉష్ణోగ్రతలు తగ్గుతుంటాయి. దీన్నే సాధారణ క్షీణతా క్రమం అని అంటారు. ఈ ఆవరణ పైభాగం కంటే కింది భాగంలో ఉష్ణోగ్రత అధికంగా ఉండి సంవహన క్రియకు దోహదపడుతుంది. భూ ఉపరితలం నుంచి వాతావరణంలో చేరే దుమ్ముధూళి కణాలు నీటి ఆవిరి అంశాలు భూమి గురుత్వాకర్షణ శక్తిని అధిగమించి ఈ ఆవరణం వరకే చేరుతాయి. దీంతోపాటు ద్రవీభవనం, మేఘాలు ఏర్పడటం, ఉరుములు, మెరుపులు, అల్పపీడనాలు, వర్షపాతం వంటి వాతావరణ అలజడులన్నీ ట్రోపో ఆవరణంలోనే జరుగుతాయి. ట్రోపో ఆవరణం పై సరిహద్దుల్లో పశ్చిమం నుంచి తూర్పునకు అత్యంత వేగంతో వంకరలు తిరుగుతూ కదిలే జియోస్ట్రోపిక్ పవనాలనే జెట్స్ట్రీమ్స్ అంటారు.
స్ట్రాటో ఆవరణం
-ట్రోపోపాస్ను ఆనుకొని భూ ఉపరితలం నుంచి దాదాపు 50 కి.మీ. ఎత్తువరకు విస్తరించి ఉన్న వాతావరణంలోని రెండో పొరను స్ట్రాటో ఆవరణమని అంటారు. ఈ ఆవరణలో ఎత్తుకు వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రత దాదాపు స్థిరంగా ఉంటుంది. అయితే, ఈ ఆవరణం 25-35 కి.మీ.ల ప్రాంతంలో ఓజోన్ పొర ఉండి అతినీలలోహిత కిరణాలను హరించడం వల్ల పై సరిహద్దులో కొద్దిగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. అందువల్ల ఇక్కడ ఎలాంటి వాతావరణ అలజడులు ఏర్పడక వాతావరణం ప్రశాంతంగా పారదర్శకంగా ఉండి విమానాలు ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది.
-ట్రోపో ఆవరణంతో పోల్చిచూస్తే ఈ ఆవరణంలో మేఘాలు, దుమ్ము, ధూళి కణాలు, నీటి ఆవిరి చాలా తక్కువగా ఉండి ఉన్నత మేఘాలైన సిర్రస్ మేఘాలు విస్తరించి ఉంటాయి. ఈ ఆవరణాన్ని ఓజోన్ ఆవరణం అని కూడా అంటారు.
మీసో ఆవరణం
-స్ట్రాటోపాస్ తర్వాత భూ ఉపరితలం నుంచి 80 కి.మీ. వరకు విస్తరించి ఉన్న వాతావరణంలోని మూడో పొర. ఈ ఆవరణంలో ఎత్తుకు వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రత చాలా ఎక్కువ స్థాయిలో తగ్గుతుంది. దీంతో ఈ ప్రాంతంలోని వాయువు అణువులు చల్లబడి నిశ్చల స్థితిలో ఉంటాయి. కానీ, ఈ పొరపైన ఉన్న థర్మో ఆవరణంలో వాయువు అణువులు అత్యంత వేగంతో కదలడంవల్ల ఈ ప్రాంతంలో ఘర్షణ బలాలు నిరంతరం జనిస్తూ విశ్వాంతరాళం నుంచి భూ వాతావరణం వైపు కదిలే ఆస్టరాయిడ్స్, తోకచుక్కలు, ఉల్కలు తదితర ఖగోళ పదార్థాలు ఈ ప్రాంతంలోకి రాగానే పూర్తిగా మండించబడి, భూగోళాన్ని పరిరక్షించడంలో ఈ పొర కీలక పాత్ర వహిస్తుంది.
-ఈ ఆవరణంలో కూడా ఉష్ణోగ్రత క్షీణతాక్రమ పరిస్థితులు ఉండటంవల్ల దీన్ని బాహ్య ట్రోపో ఆవరణమని పిలుస్తారు.
థర్మో/ఐనో ఆవరణం
మీసోపాస్ను ఆనుకొని దాదాపు 400 కి.మీ. ఎత్తువరకు విస్తరించి ఉన్న ఆవరణాన్ని థర్మోఆవరణం అంటారు. ఈ ఆవరణంలో ఎత్తుకు వెళ్లే కొద్దీ అనూహ్యంగా ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది. ఈ ఆవరణంలో వాయువులు అయనీకరణం చెందడంతో దీన్ని ఐనో ఆవరణమని కూడా అంటారు. ఈ ప్రాంతంలో వాయు అణువుల మధ్య జరిగే థర్మో న్యూక్లియర్ చర్యలవల్ల విద్యుదయస్కాంత తరంగాలు జనిస్తూ రేడియో, దూరదర్శిని తరంగాలను భూమి వైపు పరావర్తనం చెందిస్తాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు