Education spread | ఆంగ్ల పాలనలో విద్యావ్యాప్తి
భారతదేశ చరిత్ర
-భారతదేశంలో ఆంగ్ల భాషా వ్యాప్తి, పాశ్చాత్య విద్యావిధానం వల్ల తమ పాలనకు మేలు కలుగుతుందని కంపెనీ డైరెక్టర్లు విశ్వసించారు. పరిపాలనలో సహాయపడటానికి విద్యావంతులైన భారతీయులు తయారవుతారని నమ్మకం వారికి కుదిరింది. ఆంగ్ల విద్యను, విజ్ఞానశాస్ర్తాన్ని బోధించే పాఠశాలలను స్థాపించమని బొంబాయి గవర్నర్ ఎల్ఫిన్స్టన్ విజ్ఞప్తి చేశాడు. బొంబాయిలో ఎల్ఫిన్స్టన్ కళాశాలను 1834 లో స్థాపించారు. పౌర పరిపాలనలో ఉన్నత ఉద్యోగాలు పొందాలని అనుకొనే వారికోసం ఈ కళాశాలను స్థాపించారు.
ఆంగ్ల- ప్రాచ్య విద్యాభిమానుల వివాదం
-కంపెనీ పాలనలో క్రమేణా ఆంగ్ల భాషా బోధనా సంస్థలు ప్రారంభమయ్యాయి. దీంతో ఆంగ్ల భాష అభ్యసించడానికి ప్రజల్లో కుతూహలం ఎక్కువైంది. ఆంగ్ల భాషా గ్రంథాలకు గిరాకీ ఏర్పడి విక్రయాలు జోరందుకున్నాయి. ప్రజల కోరిక మేరకు కలకత్తా మదర్సా, సంస్కృత కళాశాలల్లో ఆంగ్ల భాష బోధనను ప్రారంభించారు. 1811 లో ప్రారంభమైన ఆగ్రా కళాశాలలో కూడా ఆంగ్ల తరగతులు నిర్వహించారు. అలాంటి సందర్భాల్లో బోధన ఆంగ్లంలో కొనసాగించాలా? లేక అరబిక్, పారశీక భాషల్లో కొనసాగించాలా? అనే విషయమై వాదోపవాదాలు బయల్దేరాయి. ఈ వివాదాన్ని పరిష్కరించడం కోసం ఒక కమిటీని నియమించారు. అందులో కొంత మంది భారతీయ విద్యలను బోధించాలని, మరికొంత మంది ఆంగ్ల భాషను ప్రవేశపెట్టాలని అభిప్రాయపడ్డారు. కమిటీ సభ్యుడైన లార్డ్ మెకాలే.. 1835లో తన ఉద్దేశాన్ని తెలియజేస్తూ ఒక సుదీర్ఘ పత్రాన్ని తయారుచేసి గవర్నరల్ జనరల్ కౌన్సిల్‌కు నివేదించాడు. తన వ్యాసంలో మెకాలే ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాలని కోరుతూ భారతీయ భాషలు, పుస్తక భాండాగారాలు… చిన్న బీరువాలోని ఆంగ్ల గ్రంథాలకు దీటు రావని పేర్కొన్నాడు. ఆంగ్ల భాష ప్రాముఖ్యాన్ని గురించి తెలుపుతూ ఆంగ్లం పరిపాలకుల భాష. అది ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్యాన్ని పెంపొందించే భాష కూడా కాగలదు అని వివరించాడు. మెకాలే ఉద్దేశంలో ఆంగ్ల భాష కారణంగా భారతదేశంలో ఒక కొత్త తరగతి ఉద్భవించగలదు. ఈ తరగతి వారు రక్తం, రంగులో భారతీయులుగాను భావాలు ఆచార వ్యవహారాల్లో ఆంగ్లేయులుగాను ఉంటారు. మరో మాటలో చెప్పాలంటే భారతదేశంలో నల్లటి ఆంగ్లేయులను తయారు చేయడం మెకాలే ఆశయం.
-మెకాలే ఉద్దేశాలతో గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ ఏకీభవించి 1835, మార్చి 7న ఆంగ్ల భాషను బోధనా భాషగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంగ్ల భాష ద్వారా ఉన్నత వర్గాలకు చెందిన వారిని విద్యావంతులను చేయటమేం మెకాలే ప్రధాన ఉద్దేశం. అంతేగాని సామాన్య ప్రజలకు విద్యనందించటం కాదు. కంపెనీ కేటాయించిన పరిమిత నిధులతో భారతీయులందరికీ విద్యాబోధన చేయటం సాధ్యం కాదని అతడు విశదపర్చాడు. ఆంగ్ల భాషను నేర్చుకున్న ఉన్నత వర్గాలు ఇతర భారతీయ భాషలను ప్రభావితం చేయగలరని, వారు మిగతా వారికి ఆంగ్ల భాషను బోధించటం కోసం కొత్త వర్గాలుగా ఉంటారని మెకాలే భావించాడు. ఆంగ్ల భాషా బోధనకు మాత్రమే ప్రభుత్వ ధనం ఉపయోగించాలనే నియమం రూపొందించగానే కొంత మంది ప్రభుత్వానికి ఒక విజ్ఞాన పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం మత మార్పిడులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆంగ్ల భాషాభివృద్ధికి ప్రాముఖ్యత ఇస్తున్నారని అందులో ఆరోపించారు. దీంతో గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ పాఠశాలలు, కళాశాలల్లో మత ప్రసక్తి ఉండదని, ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని విద్యార్థులకు క్రైస్తవ మత బోధనను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. చివరికి 1884 లో పాశ్చాత్య విద్యనభ్యసించిన వారికి, ఆంగ్ల భాష తెలిసిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఉంటుందని ప్రకటించారు.
చార్లెస్ వుడ్ విద్యా నివేదిక – 1854
-ఇంగ్లండ్‌లో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అధ్యక్షుడైన సర్ చార్లెస్ వుడ్ 1854లో భారతదేశానికి అవసరమైన విద్యావిధానంపై ఒక తులనాత్మక పత్రాన్ని రూపొందించాడు. దీనిని హిందూ దేశంలో ఆంగ్ల విద్యకు మాగ్నాకార్టాగా పిలుస్తారు. ఐరోపాలో అభివృద్ధి చెందిన కళలు, శాస్ర్తాలు, వాజ్ఞయం, వేదాంతం మొదలైన వాటిని భారతీయుల్లో వ్యాప్తి చేయటం ఆంగ్ల విద్యావిధానం ప్రధాన ఆశయమని వుడ్ ప్రకటన తెలియజేసింది. బోధనా భాషకు సంబంధించి వుడ్ ఉన్నత విద్యకు ఆంగ్లం, ప్రాథమిక విద్యకు ప్రాంతీయ భాషలు బోధనా భాషలుగా ఉండాలని ప్రకటించాడు. ప్రభుత్వేతర పాఠశాలలకు ప్రభుత్వం ధన సహాయం అందించింది. వుడ్ ప్రకటనలో కలకత్తా, బొంబాయి, మద్రాస్ నగరాల్లో విశ్వవిద్యాలయాలు స్థాపించాలని సూచించారు. లండన్ విశ్వవిద్యాలయ ప్రాతిపదికపై వృత్తి విద్యలకు, సాంకేతిక పాఠశాలల స్థాపనకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. స్త్రీ విద్యకు కూడా వుడ్ ప్రకటనలో ప్రాముఖ్యం ఇచ్చారు.
-వుడ్ సూచనలన్నింటినీ ప్రభుత్వం అమలుపర్చింది. 1857లో మూడు విశ్వవిద్యాలయాలను ప్రారంభించారు. బెంతూన్ అనే వ్యక్తి కృషితో ఆధునాతన పద్ధతిలో బాలికా పాఠశాలలు స్థాపించగా ప్రభుత్వం ధన సహాయం అందించింది. వుడ్ ఉత్తర్వులోని ఉద్దేశాలు, పద్ధతులు విద్యారంగంలో అర్ధశతాబ్దంపాటు ఆచరణలో ఉన్నాయి. ఈ సమయంలో విద్యావ్యాప్తి చురుకుగా కొనసాగింది. స్వదేశీ విధానం క్రమేణా సన్నగిల్లి, పాశ్చాత్య విధానం వ్యాపించింది. పాఠశాలలన్నీ బ్రిటిష్ ప్రధానోపాధ్యాయుల నిర్వహణలోకి వెళ్లాయి. మిషనరీలు కూడా విద్యాలయాలను స్థాపించి నిర్వహించడంలో ప్రముఖ పాత్రను పోషించాయి. హంటర్ కమిషన్ 1882 లో నివేదిక సమర్పించే వరకు వుడ్ సూచనలు తప్ప మరొకటి అమలులో లేవు.
-పాశ్చాత్య విద్యావిధానం, ఆంగ్ల భాష వ్యాప్తి భారతదేశ ప్రజానీకంపై విపరీత ప్రభావాన్ని చూపింది. ప్రజలు అధునాతన ఉద్దేశాలకు, ప్రజాస్వామ్య, జాతీయత సిద్ధాంతాలకు అలవాటు పడ్డారు. దృక్పథాల్లో ఏకీయత కలుగజేసిన ఆంగ్ల విద్య భారతీయుల్లో ఒక చైతన్యాన్ని కలుగజేసిందని చెప్పవచ్చు. భారత ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలు, చరిత్ర, నాణేలు, పురాతన కట్టడాలు మొదలైన వాటిని దేశంలోని నలుమూలల వారు విదేశీయులతోపాటు అవగాహన చేసుకోవడానికి ఆంగ్లభాష ఉపయోగపడింది. వాటిని గురించి చదవడంవల్ల ప్రాచీన భారత సంస్కృతి, నాగరికతల విలువలు తెలిశాయి.
-మౌర్యులు, గుప్తులు, పల్లవులు, చోళులు, చాళుక్యులు మొదలైన ప్రాచీన రాజవంశాల గురించి, ఆనాటి పరిస్థితుల గురించి విదేశీయులు చదివి వాటిపై ఆసక్తి చూపారు.
-స్వదేశీ ప్రాచీన గొప్పతనం భారతీయులకు ఆత్మైస్థెర్యాన్ని కలిగించి భారత చరిత్ర, వాజ్ఞయాలపై గౌరవాన్ని ఇనుమడింపజేసింది. ఆంగ్లభాష ప్రభావంతో భారతీయ భాషలు వికాసం చెందాయి. దీంతో సామాన్యులు కూడా భావ ఐక్యత సాధించడానికి వీలైంది.
వార్తాపత్రికలు
-పాశ్యాత్య విద్యావ్యాప్తికి పత్రికలు కూడా ప్రధాన పాత్ర వహించాయి. దేశాభిమానాన్ని పెంపొందించి, రాజకీయ చైతన్యాన్ని కలిగించడానికి కూడా పత్రికలు తోడ్పడ్డాయి.
-భారతీయ పత్రికల చరిత్ర ఐరోపావారి రాక తర్వాత మాత్రమే ప్రారంభమైంది. పోర్చుగీసువారు మొదటిసారిగా దేశానికి ముద్రణాలయాన్ని తెచ్చినట్లు తెలుస్తుంది. 1557లో వారు గోవాలో మొదటిసారిగా పుస్తక ప్రచురణ చేశారు.
-1684లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బొంబాయిలో ఒక ముద్రణాలయాన్ని స్థాపించింది. సుమారు ఒక శతాబ్దంపాటు బ్రిటిష్‌వారు ఎటువంటి వార్తాపత్రికను మనదేశంలో స్థాపించలేదు. వార్తాపత్రికలవల్ల బ్రిటిష్ పాలకుల పాలనాలోపాలు తమ మాతృదేశానికి చేరుతాయని వారి భయం.
-18వ శతాబ్ధంలో ఆంగ్లో ఇండియన్లు, ఐరోపావారు పత్రికలు స్థాపించడం ప్రారంభించారు. ఈ తొలి పత్రికలు సమాచారం అందజేయడానికి, పొద్దు పోవడానికి మాత్రమే ఉద్దేశించినవి.
-1780లో బెంగాల్ గెజిట్ అనే వారపత్రికను జేమ్స్ ఆగస్టస్ హికే అనే వ్యక్తి ప్రారంభించారు. ఆ పత్రిక 1782లో గవర్నర్ జనరల్ వారన్హేస్టింగ్స్ను విమర్శించిన కారణంగా మూతపడింది.
-బెంగాల్ గెజిట్ తర్వాత అనేక వార్తాపత్రికలు వచ్చాయి. కలకత్తా గెజిట్ (1784), బెంగాల్ జర్నల్ (1785), కలకత్తా క్రానికల్ (1786), మద్రాస్ కొరియర్ (1788), బాంబే హెరాల్డ్ (1789) మొదలైనవి ప్రధాన పత్రికలు.
-అయితే ఆయా పత్రికల ప్రచురణలు మిక్కిలి పరిమితమై ఉండేవి. పత్రికా చట్టాలు లేని కారణంగా ఆ రోజుల్లో పత్రికలు, వాటి పనితీరు కంపెనీ అధికారులపై ఆధారపడి ఉండేది.
-మొదటిసారిగా 1799లో వెల్లస్లీ పత్రికలపై సెన్సార్ విధించాడు. ఒకవైపు ఫ్రెంచివారితో, మరోవైపు టిప్పుసుల్తాన్ మొదలైన సంస్థానాధీశులతో బ్రిటిష్‌వారు యుద్ధం చేస్తున్న రోజులవి. తన పలుకుబడిని కించపర్చే ఏ విమర్శను వెల్లస్లీ సహించలేదు.
-ప్రతి పత్రికలో ప్రచురణకర్త పేరు, సంపాదకుని పేరు, సొంతదారుని పేరు తప్పనిసరిగా ప్రచురించాలని ఆదేశించాడు. దీన్ని ఉల్లంఘించిన వారికి శిక్షలు విధించేవారు. 1807లో సెన్సార్షిప్ చట్టాన్ని వార్తాపత్రికలకేగాక, కరపత్రాలకు, పుస్తకాలకు కూడా వర్తింపజేశారు.
-లార్డ్ హేస్టింగ్స్ పత్రికా స్వాతంత్య్రాన్ని పూర్తిగా నమ్మి తన ఉదాత్త భావాలను కార్యరూపంలోకి మార్చదలిచాడు. పత్రికలపైగల ఆంక్షలను రద్దుపర్చాడు. కానీ పత్రికలు ఉన్నతాధికారులపై విమర్శలు చేయరాదని సూచించాడు.
-ఆంక్షలు లేని కారణంగా అనేక కొత్త పత్రికలు ప్రచురణకు వచ్చాయి. జేఎస్ బకింగ్‌హామ్ అనే వ్యక్తి 1818లో కలకత్తా జర్నల్ను ప్రారంభించాడు. అతడు నిర్భయంగా తన రచనలు కొనసాగించేవాడు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, మద్రాస్ గవర్నర్‌ను, కలకత్తా బిషప్ మొదలైన వారిని దుయ్యబట్టడానికి అతడు వెనుకాడలేదు.
-ప్రభుత్వం సర్‌థామస్ మన్రోను దేశంలోని పత్రికల సమస్యల గురించి పరిశీలించడానికి నియమించింది. ఆంగ్లపత్రికలకు సంబంధించినంతవరకు ఎలాంటి భయం లేదని, పత్రికా స్వాతంత్య్రంవల్ల భారతీయ పత్రికలు సైన్యంలో అసంతృప్తిని రాజేసి ప్రభుత్వ పతనానికి పనిచేయవచ్చునని అతడు అభిప్రాయపడ్డాడు. పత్రికా స్వాతంత్య్రం, విదేశీపాలన అనేవి ఒకదానికొకటి విరుద్ధమైనవి. అవి ఎప్పుడూ సవ్యంగా సహజీవనం కొనసాగించవు అని పేర్కొన్నాడు.
-థామస్ మన్రో సూచనలమేరకు ప్రభుత్వం 1823లో పత్రికా చట్టాలను రూపొందించింది. ఈ చట్టాల ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వు లేనిదే ఏ పత్రికనుగానీ, గ్రంథాన్నిగానీ ప్రచురించకూడదు. ప్రభుత్వ ఉత్తర్వుతో ప్రచురితమయ్యేవి కూడా ముందుగా ప్రభుత్వ పరిశీలనకు రావాలి.
-రాజా రామ్మోహన్రాయ్, ద్వారకానాథ్ మొదలైనవారు ఆ పత్రికాచట్టాలపై అసమ్మతి తెలిపినా అవి 1823 ఏప్రిల్ 15న అమల్లోకి వచ్చాయి.
-విలియం బెంటింక్ పత్రికలపట్ల కొంత సహకార భావాలు కలిగినవాడు. అతడు పత్రికలపై ఆంక్షలను తొలగించకపోయినా అవి ఏ అంశాన్నయినా క్షుణ్ణంగా చర్చించవచ్చని సూచించాడు.
-చార్లెస్ మెట్కాఫ్ పత్రికల స్వాతంత్య్రాన్ని ప్రకటించి భారతీయ పత్రికలకు స్వాతంత్య్రాన్ని ప్రసాదించాడు.
-మెకాలే కూడా పత్రికలు ఎలాంటి అవరోధాలు కలిగి ఉండకూడదని భావించాడు.
-1857 తిరుగుబాటు తర్వాత ప్రభుత్వం పత్రికలకుగల స్వాతంత్య్రాలను హరించింది. రిజిస్ట్రేషన్ పద్ధతితోపాటు లైసెన్స్ నిర్బంధాన్ని కూడా ప్రవేశపెట్టింది. ముద్రణకు ముందు అనుమతి పొందడం, ముద్రణాలయాలు స్థాపించడానికి అనుమతి పొందడం తప్పనిసరిగా మారింది. ఏ పత్రికనైనా ప్రభుత్వం నిషేధించడానికి వీలు కలిగింది.
-పాశ్చాత్య వాజ్ఞయ పద్ధతులు 19వ శతాబ్దపు భారతీయ భాషా వికాసంపై గొప్ప ప్రభావాన్ని చూపాయి. ఆంగ్ల వాజ్ఞయం ద్వారా ఐరోపావారి భావాలను అవగాహన చేసుకోవడంతో దేశంలో భాషా పునర్వికాసం జరిగింది. ఇది బెంగాల్లో మొదట ప్రారంభమైంది.
-బెంగాలీ భాషలోని వచన రచనా చరిత్ర ఫోర్ట్ విలియం కళాశాల స్థాపనతో ప్రారంభమైంది. అందుకు తోడ్పడిన వారిలో రాజా రామ్మోహన్రాయ్, ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ముఖ్యులు.
-వందేమాతరం గేయ రచయిత బంకించంద్ర ఛటర్జీ బెంగాలీ భాషలో మొదటి నవలాకారుడు. అప్పట్లో దేశంలో పేరుమోసిన నవలాకారుల్లో మైకేల్ మధుసూదన దత్, హేమచంద్ర బెనర్జీ, నవీన్ చంద్రసేన్, రవీంద్రనాథ్ ఠాగూర్ ముఖ్యులు.
-పద్య, గద్య రచనలో కథానికలు, నాటకాలు, నవలారంగంలో బెంగాలీ వాజ్ఞయం మిక్కిలి అభివృద్ధి గాంచింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు